April 28, 2024

విశ్వపుత్రిక వీక్షణం – “మైండ్ సెట్”

రచన: విజయలక్ష్మీ పండిట్

“మనసును స్థిరం చేసుకోమ్మా గీతా! ఈ కాలప్రభావంవల్ల మనుషుల జీవితాలలో మా తరం ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి.
మనం చేసే మంచి ప్రయత్నం ఫలించనపుడు, పరిస్థితి మన చేయిదాటిపోయినపుడు, మనం జీవితమంతా వగచే బదులు కాలానికనుగుణంగా, పరిస్థితికి రాజీపడి మైండ్ సెట్ చేసుకుని మన జీవితాన్ని నరకం చేసుకోకుండా బతకాల్సి వస్తూంది. జరిగినదానికి నీ జీవితాన్ని బలి ఇవ్వకుండా, ధైర్యంగా ఆలోచించి మనసును సమాధాన పరచుకుని ఒక నిర్ణయం చేసుకో !”
కాలం నిర్ణయిస్తున్న జీవిత మార్పులను ఎంత బాగా పరిశీలించి తనకు జీవిత సత్యాన్ని, ఆ సలహాను నాన్న ఇవ్వకపోతే నా జీవితం ఎలాఉండేదో .” అనుకుంది గీత.
వైవాహిక జీవితంలో ఎదురయిన ఊహించని మార్పుకు తాను లోనయింది. తను కృంగిపోకుండా వాళ్ళ నాన్న అప్పుడన్న మాటలు ఇప్పుడు మరలా తన కూతురు దివ్య తన జీవితం గురించి తీసుకున్న నిర్ణయం వల్ల పదే పదే గుర్తుకు రాసాగాయి గీతకు.
అందుకు కారణం ఈ వేగవంత కాలప్రభంజనంలో చిన్నాభిన్నమవుతున్న సంస్కృతులు, ఆర్థిక స్థితిగతులలో కొట్టుకు పోతూ ప్రేమలు, అనుబంధాలు, జీవితాలను అనూహ్యంగా ప్రభావితం చేయడాన్నిచూస్తూంది.
ఈ తరంలో భార్య భర్తల అనుబంధం ఉద్యోగాలు, హోదాలు,ఆదాయాల కనుకూలంగా మారిపోవడం లేదా తెగతెంపు చేసుకుని జీవిత భాగస్వామిని మార్చుకోవడం సాధారణమయిపోయింది.
పెండ్లి చేసుకోకుండా యువతి యువకులు సహజీవనం చేయడం. కుదిరినంత కాలం కలిసి జీవిస్తూ కుదరని పక్షంలో విడిపోవడం. ఆ సహజీవనంలో మహిళలు తల్లులయిన తర్వాత విడిపోవడం పిల్లల భాద్యతలు ఆడవారి మీదపడి ఎక్కువగా నష్టపోవడం జరుతూంది.
అది మంచి మార్పు అనాలో, విలువలకు తావులేని జీవితానుకూల నిర్ణయాలనుకోవాలో భోధపడలేదు ముందుతరం తల్లి తండ్రులకు. సరిదిద్దే ప్రయత్నం చేసినా విననప్పుడు ఇంకేమి చేయాలి తల్లి తండ్రులు ?! గీత మనసు పరిపరివిదాల ఆలోచనలో పడి అలిసిపోయింది కూతురు దివ్య భవిష్యత్ గురించి.
సాయంత్రం కిటికి ప్రక్కన కూర్చున్న గీతకు కిటికి ఆవలివైపున మల్లెచెట్టులో అప్పుడే విడిగిన మల్లెపూల వాసన రూములోపలికి వచ్చి చేరి ముసురుతున్న ఆలోచనలను తరిమేస్తూ మనసుకు స్వాంతననిస్తూంది .

ఆ సాయంత్రపు ఆ క్షణాల ఓదార్పుకు మనసు తేలిక కాగా , కుర్చి వెనుకకు వాలి కళ్లు మూసుకుంది గీత. పాత జ్ఞాపకాలు మెదడులో మెదలసాగాయి.

***

ఆ రోజు గీత జీవితంలో మరపురాని రోజు. తన జీవిత గమనాన్ని మార్చి వేసింది .

అమెరికాలో ఉన్న భర్త రమేష్ నుండి మెసేజ్. “గీతా ఈ వీకెండ్ కాల్ చేయి ముఖ్యమయిన విషయం మాట్లాడాలి”
తనూ ముఖ్యమయిన ఒకవిషయం రమేష్ కు ఫేస్ టైమ్ చేసి చెప్పాలని వెయిట్ చేస్తూంది.
గీత రమేష్ ఇద్దరు సాఫ్టువేర్ ఇంజనీర్లు. గీత పట్టుపట్టి బి. టెక్. చేసి క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగం తెచ్చుకుంది .
అమెరికాలో సాఫ్టువేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న రమేష్ తో పెండ్లి నిర్ణయించారు. నిర్ణయమైన రెండు నెలల తరువాత పెండ్లి జరిగింది.
గీత ఒకటే సంతానం కావడంతో కూతురు పెండ్లి ఘనంగా చేశారు రామరావు.
గీత రమేష్ లు ఒక నెల హనిమూన్ హాయిగా తిరిగారు . రమేష్ కు లీవు అయిపోవడంతో గీతకు వీసా రాకముందే వెళ్ళాల్సి వచ్చి అమెరికా వెళ్ళిపోతాడు.
కొన్ని ఎంక్యయరీస్ వల్ల గీత కు వీసా రావడం లేటవుతుంది.
రెండవసారి వీసా ఇంటర్వూకు అటెండయి వస్తుంది గీత.
కూతురు భర్తతో కూడా అమెరకాకు వెళ్ళలేక పోయినందుకు ఆందోళన చెందుతారు గీత తల్లి తండ్రులు.
రమేష్ వెళ్ళిన తరువాత మూడు నెలలు గడిచిపోతుంది.
గీత ఆ శనివారం రాత్రి పది గంటలకు రమేష్ కు ఫోన్ చేస్తుంది. రెండుమార్లు కాల్ చేసిన తరువాత రమేష్ ఫోన్ కలుస్తుంది.
రమేష్ పలకరింపులయిన తరువాత గీతతో “ గీతా నీకు ఒక సమస్య వివరిస్తాను. నీవు ఆలోచించి నీ నిర్ణయం చెప్పు” అంటూ చెప్పుకొచ్చాడు.
పెండ్లికి ముందు అమెరికాలో ఒక అమెరికా అమ్మాయితో తన రిలేషన్ షిప్ప్ గురించి వివరిస్తాడు. ఇద్దరు పెండ్లి కూడా చేసుకోవాలనుకుంటారు కాని రమేష్ వాళ్ళ తల్లితండ్రులు ఆ పెండ్లిని తిరస్కరించడంతో ఆగిపోతుంది.
“మా అమ్మ నా పెండ్లి అమెరకన్ తో వద్దని తీవ్రంగా వ్యతిరేకించి చేసుకుంటే ప్రాణాలు తీసుకుంటానని బెదరించి నాకు బంధమేసింది.”
“గీతా వింటున్నావా”అన్నాడు
భర్త మాటలు విని షాక్ నుండి తేరుకుంటూ “ఊ” అనింది గీత.
“నేనొక నిర్లిప్తతతో అమ్మ నాన్న బలవంతంతో నిన్ను వచ్చి చూసి ఒప్పకోవడం పెండ్లి జరిగిపోవడం ఒక కలగా జరిగి పోయింది.”
“నీతో చెప్పాలని నా మనసు చాలా మొరాయించినా నీవు ఏమకుంటావో నీ రియాక్షన్ ఎలా ఉంటుందోనని భయపడి నీతో చెప్పలేదు.
నాది తప్పే గీతా! పెండ్లికి ముందే చెప్పాలనుకున్నాను. మా అమ్మ నీవు ఒప్పుకోవని పెండ్లి జరగదనే భయంతో ఆంక్ష పెట్టింది .” ఆగి ఆగి రమేష్ చెబుతున్నాడు ,
“ఒక గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడేది. నీ మంచితనం నీ అందం నన్ను కట్టి పడేసింది. నీతో గడిపిన ఆ నెల రోజులు నా జీవితంలో మరపురానివి. నేను నా పెండ్లి సంగతి రేచల్ తో చెప్పలేదు.
నేను అమెరికాకు తిరిగొచ్చిన తరువాత రేచల్ నన్ను కలసి నపుడు చెప్పింది. తను ప్రెగ్నెంటని పెండ్లి చేసుకుందామని వాళ్ళ పెరెంట్స కూడా వత్తిడి చేస్తున్నారని.
రేచల్ ఫాదర్ ఇండియన్ మదర్ అమెరికన్. ఆయన వచ్చి నాతో మాట్లాడి మారేజ్ కి ఒత్తిడి తెస్తున్నాడు. ఏం చేయాలో నాకు అగమ్యగోచరంగా ఉంది. మన పెండ్లి కాకముందు రేచెల్ ను అంతే ప్రేమించాను. తను కూడ చాల మంచి అమ్మాయి. ఇక్కడే నా కంపెనీలో నే ఉద్యోగం. అంతే కాకుండ తాను అమెరకన్ సిటిజన్. ఆ విధంగా ఇష్టపడిన అమ్మాయిని పెండ్లి చేసుకుని అమెరకన్ సిటిజన్ గా ఇక్కడే స్థిరపడాలనుకున్నాను.”
“నా ఆలోచనలను ఆశయాలను గుర్తించకుండా మా అమ్మ మొండి పట్టుదలతో అమె చచ్చిపోతుందనే భయంతో నిన్ను చేసుకున్నాను. మా తల్లి తండ్రులు బిడ్డల జీవితాలను ఇంతగా నియంత్రిస్తారని నేను ఊహించలేదు. ఏదయినా ఇలాంటి సంఘటన మన కుటుంబంలో జరిగినపుడే మనుషుల నిజమయిన వ్యక్తిత్వాలు బయటపడుతాయి. ఆ విదంగా నేనూహించని నా తల్లి తండ్రుల నిజ భావజాలాన్ని తెలుసుకున్నాను .” రమేష్ చెప్పుకుంటూ పోతున్నాడు .,
“ఇపుడు రేచల్ మా బిడ్డకు తల్లి కాబోతూంది పెండ్లి చేసుకోమని ఒత్తిడి పెరిగింది. వారికి మన పెండ్లి జరిగినట్టు చెప్పలేదు. ఏం చేయమంటావు గీత. మరోసారి మోసము చేయలేను. నాకు అగమ్యగోచరంగా ఉంది .,”
ఆగి మరలా అన్నాడు రమేష్
“నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా లేదు నాకు. నీ ముందు నా సమస్య పెట్టి ముద్దాయిగా నిలబడి నీ అభిప్రాయం అడుగుతున్నాను చెప్పు . నీవు నా భార్యే కాదు ఒక దగ్గరి స్నేహితురాలివన్న భావనతో నీముందు పెడుతున్నాను నా మనసులోని మాటలను. నీ సలహా నాకు శిరోధార్యం,అదే పాటిస్తాను చెప్పు గీత ప్లీజ్ “అని అన్నాడు.
గీతకు తల తిరిగి పోతూంది. రమేష్ మాటలలో అతని నిస్సహాయత, బాధ, తప్పు చేశాననే నిజాయితి భావన వెల్లడవుతున్నాయి.
“గీతా. చెప్పు, నన్ను క్షమించవా ప్లీజ్ “అని మాటలు వినిపిస్తున్నాయి. గీతా నాకు మీ ఇద్దరు కావాలనిపిస్తుంది. రేచల్ ను, నా బిడ్డతల్లినీ విడువలేను, నీవు కూడా నాకు కావాలి. మన సమస్యకు పరిష్కారం చెప్పు గీతా అన్నాడు. ఇద్దరు కావాలి “అని రమేష్ ధైర్యంగా చెప్పడం నచ్చినా, గీతకు ఇంకో ఆడదానితో జీవితం పంచుకోగలనా? అనే తెలియని అనుమానం భయం చుట్టుముట్టాయి.
“నాకు కొంచెం టైంకావాలి రమేష్ నేను ఫోన్ చేస్తాను మీకు “అని ఫోన్ పెట్టేసింది గీత. తాను గర్భవతినని రమేష్ కు చెప్పాలనుకున్న వార్త గీత మనసులోనే వుండిపోయింది.

***

పదిరోజుల తరువాత గీత తాను తన జీవితంలో తలెత్తిన సమస్యను వాళ్ళ నాన్నముందు పెట్టి
“నాన్న, నేను రమేష్ కు మరలా పెండ్లి చేసుకోడానికి అభ్యంతరం లేదని మొదటి భార్యగా నా అంగీకారాన్ని తెలుపుతు లెటర్ పంపుతున్నాను.” అని చెప్పింది.
రామారావు బాధతో కోపంతో ఊగిపోయాడు ఆ విషయం విని. తల్లి తండ్రులిద్దరు కృంగిపోయారు. రామారావు కూతురి నిర్ణయాన్ని ఖండించలేదు.
రమేష్ దూరతీరాలలో ఉన్నా తనకు పుట్టబోయే బిడ్డకు నాన్న తనకు భర్త రమేష్ అని ఒక నిర్ణయానికొచ్చి రమేష్ కు ఆ ఉత్తరం పంపింది గీత.
రమేష్ రేచల్ ను పెండ్లి చేసుకోవడం, మొదట రేచల్ కు మగబిడ్డ పుట్టడం, తరువాత నాలుగు నెలలకు గీతకు ఆడబిడ్డ పుట్టడం జరిగిపోయాయి.
రేచల్ తో పెండ్లి అయిన మూడునెలలకు రమేష్ కు తాను గర్భవతినన్న విషయం తెలియచేసింది గీత. సంతోషపడిన రమేష్ ఇండియా వచ్చి గీతను చూసి రెండు వారాలు గడిపాడు. గీతను అమెరిక రమ్మన్నా గీత ఇండియాలోనే స్థిరపడ్డాలని నిర్ణయించుకుని తను చేసే జాబును కొనసాగిస్తూ ఇండియాలోనే ఉండిపోయింది. దివ్యను పెంచుకుంటూ.
రమేష్ ద్వారా గీత గురించి తెలుసుకున్న రేచల్ కు గీత పై గౌరవం పెరిగింది. ప్రతి సంవత్సరం రెండు మూడు నెలలు ఇండియాలో గీత దివ్యలతో గడిపేవాడు రమేష్. పిల్లలు పెరిగేకొద్ది అన్న చెల్లెలు అనుబంధాన్ని పెంచారు రేచల్ గీత.
కాని దివ్యకు వయసు పెరిగే కొద్ది అమ్మకు జరిగిన అన్యాయాన్ని మరువలేక పోతోంది. మగవాళ్ళను నమ్మి మోసపోకూడదనే ఆలోచనలు దివ్య మనసులో తిష్ట వేసాయి.
రమేష్ దాదాపు రెండురోజుల కొకసారి గీత దివ్యలతో మాట్లాడినా, అమ్మ ఒంటరితనాన్ని చూసి దివ్యకు మనసు బాధగా ఉండేది .
గీతను దిగాలుగా చూసినపుడు గీత నాన్న గీతకు నీవు తీసుకున్న నిర్ణయానికి మైండ్ సెట్ చేసుకోమని జీవించమని సలహా ఇస్తూ ఉండేవాడు.
గీత తన వైవాహిక జీవితంలో పూర్తిగా పొందాల్సిన ఆనందందాన్ని పొందలేకపోయినా వాళ్ళ నాన్న మారల్ సపోర్ట్ కు ఎల్లప్పుడు మనసులో ధన్యవాదాలు తెలుపుకుంటుంది.
ఇపుడు కూతురు దివ్య తనతో కూడా సాఫ్టువేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న స్నేహితుడు ఆదిత్యతో సహజీవనం చేస్తానని, కుదిరితే ఆ తరువాత పెండ్లి చేసుకుంటానని తీసుకున నిర్ణయాన్ని గీత ముందు పెట్టింది .
దివ్య మనసు, దృఢ నిర్ణయం గీతకు బాగా తెలుసు. తన జీవితంలో మరో సమస్యను ఎలా తీసుకోవాలో, మరోసారి మనసును సమాధాన పరచుకోవాల్సి వచ్చిందని . ఆలోచించసాగింది గీత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *