April 28, 2024

మజిలీ

రచన: డా.కె.మీరాబాయి

మారుతీ కారు గుత్తి బస్ స్టేషన్ లో హోటల్ ముందు ఆగింది. “ఇక్కడ దోసె బావుంటుంది.” కారులోనుండి దిగుతూ అన్నాడు మాధవమూర్తి.
మంజుల చిన్నగా నవ్వింది. మాధవమూర్తి భోజన ప్రియుడు. ఎప్పుడో పదేళ్ళ క్రిందట నెల్లూరు మనోరమ హొటల్ లో తిన్న పూరీ కూర రుచి ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడు..
మంజుల చేతి గడియారం చూసుకుంది. రెండు గంటల సేపు ఎక్కడా ఆపకుండా కారు నడిపిన అలసట భర్త ముఖంలో కనబడింది. ఎండ ఎక్కక ముందే వూరు చేరుకోవాలని వుదయం ఆరు గంటలకల్లా కర్నూలులో బయలుదేరారు.
“అంత దూరం మీరెందుకు అవస్థ పడడం. డ్రైవర్ ని పిలుద్దాము ” అంది మంజుల. కానీ స్వంత కారు స్వయంగా నడుపుకుంటూ తన వూరు వెళ్ళాలి అని మాధవమూర్తి ఉత్సాహ పడేసరికి కాదనలేక వూరుకుంది.
మూడువందల జీతంతో మొదలుపెట్టి ఇద్దరూ ముప్ఫై ఏళ్ళు పనిచేసి ఇరవై వేల సంపాదనతో పదవీ విరమణ చేసాక మూడొ పిల్ల పెళ్ళికి ముందు మూడు లక్షల లొపు వున్న మారుతీ కారును అప్పు చేయకుండా కొనడం గొప్ప లక్ష్యాన్ని సాధించిన అనుభూతిని ఇచ్చింది వాళ్ళిద్దరికీ.
అప్పు లేనివాడు అధిక ధనవంతుడు అన్న సూత్రాని నమ్మిన ఆ ఇద్దరూ ముగ్గురు పిల్లలను పెద్దచదువులు చదివించి, పెళ్ళి చెయడానికి తమ చిన్న చిన్న సరదాలు సై తం వదులుకున్నా ఎప్పుడూ విచారించలేదు.
ఎర్రగా కాల్చి పైన వెన్న పూస వేసిన మసాలా దోసె తిని , చిక్కని ఫిల్టర్ కాఫీ తాగి బయటకు వచ్చి కారెక్కారు ఇద్దరూ.
మన్రో సత్రం మీదుగా వెళ్ళి పేట రోడ్డులో ఎడమ వైపు తిరిగి కాస్త దూరం వెళ్ళి కారు ఆపాడు మాధవమూర్తి.
“నేరుగా అనంతపురం రహదారి పట్టక ఇదేమిటి వూళ్ళోకి వచ్చారు? ” ఆశ్చర్యంగా అడిగింది మంజుల.
సమాధానం ఇవ్వకుండా బండి దిగి అక్కడున్న ఇళ్ళ వైపు పరీక్షగా చూస్తున్న భర్త వాలకం అర్థం కాక తానూ దిగి అతని వెనుక నడిచింది.
“ఆ. ఇదే ఈ ఇల్లే ! ” మెరిసే కళ్ళతో చూస్తూ , సంతోషం తొణుకుతున్న గొంతుతో అన్నాడు మాధవమూర్తి.
ఎక్కడో పోయిందనుకున్న ఆటబొమ్మ మళ్ళీ కనబడినప్పుడు పసి పిల్లవాడి ముఖంలో తొంగిచూసే ఆనందం వెల్లివిరిసింది అతని వదనంలో.
“ఎవరి ఇల్లండీ ఇది ? ” జరుగుతున్న దేమిటో అర్థం కానీ మంజుల అయోమయంగా అడిగింది.
” మాదే మంజూ. ఇదే మా ఇల్లు.” ఒకవిధమైన పరవశత్వంతో అన్నాడు.
మాధవమూర్తి గుత్తిలో పుట్టాడు అని తెలుసుగానీ వాళ్ళకు అక్కడ మేడ వున్నట్టు ఆమెకు చెప్పలేదు అతను.
ఈ ఇల్లా? ” నమ్మలేనట్టు చూసింది. కొత్త గా రంగులు వేసి కనబడుతున్నది మేడ.
“అంటే ఇక్కడే , ఈ స్థలం లోనే మా తాతగారిల్లు వుండేది. అక్కడే నేను పుట్టాను. ” అంటునే ఆ ఇంటి వైపు అడుగులు వేసాడు.
” ఆగండీ. ఇది ఎవరి ఇల్లో ఏమో. ఎప్పుడో యాభై ఏళ్ళ క్రిందట ఇక్కడ మా ఇల్లు వుండేది అంటే నవ్వి పోతారు. పదండి వెళ్ళిపోదాము. అనవసరంగా అవమానం పాలు కావొద్దు. ” భర్తను వారించింది మంజుల.
రెండేళ్ళ క్రిందట తన స్నేహితురాలు మీనాక్షికి జరిగిన పరాభవం గుర్తుకు వచ్చింది ఆమెకు. మీనాక్షి వాళ్ళ తాతగారిల్లు అనంతపురం కోర్ట్ రోడ్ లో చివరన వుండేదట. ఏదో అవసరానికి ఆయన ఆ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు వాడుకున్నాడు. ఆ తరువాత అసలు మాట అటు వుంచి వడ్డీ కూడా కట్టలేదు. దానితో అప్పిచ్చిన అతను ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నాడు. ఆ బెంగతోనే ముసలాయన కళ్ళు మూసాడు. తాతగారిల్లు అంటే మీనాక్షికి ఎంతో ఇష్టం. ఒకసారి అనంతపురం వెళ్ళినప్పుడు ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూడాలనిపించి తలుపు తట్టిందంట. ఆ ఇంట్లో అద్దెకు వున్న అతను ఈమెను బిచ్చగత్తెను విదిలించి కొట్టినట్టు కసురుకున్నాడట. ఆ అవమానం గురించి చెప్పి మీనాక్షి కళ్ళనీళ్ళు పెట్టుకున్న విషయం మంజుల మనసులో మెదిలింది.
అంతలో ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. నలభై అయిదేళ్ల వయసులో వున్న వ్యక్తి బయటకు వచ్చాడు. అత్తా కోడలు అంచు జరీ పంచలో హుందాగా వున్నాడు.
“ఎవరు కావాలండి? ” మర్యాదగా అడిగాడు ఆ ఇద్దరినీ పరిశీలనగా చూస్తూ.”అంతసేపూ ఉత్సాహంగా వున్న మాధవమూర్తి ఒక క్షణం మూగబోయాడు.
మంజుల ముందుకు అడుగు వేసింది. “మేము కర్నూలు నుండి వస్తున్నామండి. ఇద్దరము ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసాము. ”
” మీకెవరు కావాలమ్మా ? ” ఈ ఉపోద్ఘాతం ఎందుకో అర్థంకాని అతను మళ్ళీ అడిగాడు.
అంతలో ఉద్వేగాన్నుండి తేరుకున్న మాధవమూర్తి అందుకున్నాడు.
“క్షమించండి. నా చిన్నప్పుడు ఇక్కడ మా తాతగారిల్లు వుండేది. నేను పుట్టింది ఇక్కడే. వూరికే చూసి పోదామని ఆగాము. వస్తాను.” అంటూ వెనుదిరిగాడు.
“అయ్యో అలా వెళ్ళిపొతారేమిటి? లోపలికి రండి. చూసి వెళ్ళండి. ” అంటూ మర్యాదగా ఆహ్వానించాడు ఆయన.
మొహమాటంగానే ఇద్దరూ లోపలికి వచ్చారు.
“కూర్చోండి. మంచినీళ్ళు తీసుకు వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళాడు.
ఖరీదైన సోఫాలు, తలుపులకు కిటికీలకు సిల్కు తెరలు , గొడ మీద దండలు వేసివున్న పూర్వీకుల ఫోటోలు; వేంకటేశ్వర స్వామి ,పట్టాభిరాముడు పటాలు – ఆధునికత పాత సంప్రదాయం కలగలిసినట్టుగా వుంది ఇంటి అలంకరణ.
లొపలికి నుండి ఆయన భార్య కాబోలు మంచినీళ్ళు తీసుకువచ్చి అందించింది. వెంకటగిరి జరీ చీరలో ,మెడలో నల్లపూసల గొలుసు, చెవులకు రాళ్ళ కమ్మలతో ఆ ఇంటి లక్ష్మిలా వుంది ఆమె.
“మేము ఈ ఇల్లు కట్టించి పది ఏళ్ళు అవుతోంది. మీరు ఇటువైపు వచ్చినట్టు లేదు.”అన్నాడు ఇంటి యజమాని.
” మేము ఉద్యోగరీత్యా ఉత్తరాదిలో వుండిపోయాము. ఈ మధ్యనే వచ్చి కర్నూల్ లో వుంటున్నాము. ఇక్కడ అనంతపురంలో మా బంధువులు వున్నారు. వాళ్ళను చూడాలనే ఈ ప్రయాణం. ” సమాధానం చెప్పాక ఇక కూర్చోలేనట్టు లేచాడు మాధవమూర్తి. మనసు నిండి పొర్లిపోతున్న ఆనందం అతన్ని నిలువనీయడం లేదు.
” ఇదిగో మంజులా ఈ మూలగదిలోనే మా అమ్మ నన్ను కన్నది. “అంటూ ఆ గది వైపు వడివడిగా నడిచాడు..” ఆ పక్కన పూజ గది వుండేది. ఓ మీరూ ఇక్కడే పూజకు ఏర్పాటు చేసారన్నమాట. అటు ఉత్తరం వైపు నేల మాళిగ ఉండేది. అందులో ధాన్యం నిలవ చేసేవారు. ” ఒక విధమైన ఉద్విన్నతతో అది పరాయి వాళ్ళ ఇల్లు ఆన్న స్పృహ లేకండా ఇల్లంతా కలయ తిరుగుతున్న భర్త వైపు చిరునవ్వుతో చూస్తున్న ఆ ఇంటి దంపతులను చూస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతోంది మంజుల.
“మీరు ఏమీ అనుకోక పోతే ఇంటి వెనుక చెట్లు వుండాలి ఒకసారి చూస్తాను ” అని వాళ్ళ సమాధానం కోసం ఆగకుండానే వంట గది దాటి ఇంటి వెనుక వైపుకు నడిచాడు మాధవమూర్తి.
భర్త ఉత్సాహానికి అడ్డు కట్ట వేయడం ఇష్టం లేనట్టు అతన్ని వెంబడించింది మంజుల.
మాధవమూర్తి చెప్పినట్టు అక్కడ చెట్లు ఏమీ లేవు. పారిజాతం, మందార, గన్నేరు , మల్లి వంటి పూల మొక్కలు ఉన్నాయి.
” అయ్యో! చెట్లు అన్నీ కొట్టేసినట్టున్నారు.. ఇక్కడ ఉసిరి చెట్టు వుండేది. ఒకసారి ఏమయ్యిందనుకున్నావు మంజూ! ఉసిరి కొమ్మ తలకు తగులుతున్నదని పడేళ్ళ పిల్లవాడ్ని పెద్ద మొనగాడిలాగా గొడ్డలి తీసుకుని నరకబోయాను. ఆది కాస్తా కాలిమీద పడి ఇంత లోతున గాయమయ్యింది. తాతకు తెలిస్తే తంతాడని కుయ్యిమనకుండా ఇంత పసుపు అద్ది కట్టు కట్టేసుకున్నాను. కానీ మా మామ కనిపెట్టెసాడు. తిడతాడేమో అనుకుంటే ” శహబాష్ నా మేనల్లుడివి అనిపించావు ” అని వీపు తట్టి మెచ్చుకున్నాదు.” మాధవమూర్తి కన్నులలో మెరుపు , ముఖంలో ఉద్విగ్నత , పెదవుల మీద దరహాసం చూస్తుంటే మంజులకు కళ్ళలో నీరు తిరిగింది.
” ఇంకో తమాషా చెప్పనా మంజూ ! మా అమ్మమ్మ దసరాకి బొమ్మల కొలువు పెట్టేది. అందులో సీతా రామ లక్ష్మణులతో బాటు ఆంజనేయుడి ఇత్తడి బొమ్మలు వుండేవి. నాకు హనుమంతుడంటే చిన్నప్పటి నుండీ ఇష్టం. ఒకసారి ఆ హనుమంతుడి బొమ్మను చాటుగా తీసుకుని ఇక్కడ ఈ మూల మట్టిలో దాచి పెట్టాను. తరువాత దానికోసం వెదికితే దొరకనే లేదు. అమ్మమ్మ ఆ ఆంజనేయుడి కోసం ఇల్లంతా వెదికింది పాపం. నేనేమో తేలు కుట్టిన దొంగలా వూరుకున్నాను” ఏదో పూనకంలో వున్నట్టు చెప్పుకు పోతున్నాడు మాధవమూర్తి.
మాధవమూర్తి వెనకే పెరటిలోకి వచ్చిన ఇంటి యజమాని ముఖంలో ఈ వుదంతం వినగానే సంభ్రమం తొంగి చూసింది.
“మాస్టారూ! మీ తాతగారి పేరేమిటో చెప్పారు కాదు.” మధ్యలో కల్పించుకుంటూ అడిగాడు ఆయన.
” ఆయన పేరు వెంకట సుబ్బయ్య అండి. అన్నట్టు నా పేరు మాధవమూర్తి. నా భార్య మంజుల. ” అప్పుడు తమ గురించి పరిచయం చేసుకున్నాడు.
“నా పేరు రత్న స్వామి. నా భార్య కోమలవల్లి. ” అని చెప్పి ముందుకు వచ్చి సంతోషంతో మాధవమూర్తి చేతులు పట్టుకుని ” ముందు మీరు లోపలికి వచ్చి కూర్చోండి. ఇది మీ ఇల్లే అనుకోండి ” అంటూ అతిథులు ఇద్దరినీ ముందు గదిలోకి నడిపించి సోఫాలో కూర్చోబెట్టాడు
” అయ్యగారికి అమ్మగారికి కాస్త పాలు ఫలహారం తీసుకురా వల్లీ” అని భార్యకు పురమాయించాడు.
తను వచ్చి మాధవమూర్తి. కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు.
” అయ్యో అదేమిటండీ మీరు నేలమీద కూర్చోవడం… ” అంటూ లేవబోయాడు మాధవమూర్తి.
” మీ దగ్గర ఇలా కూర్చోవడం వల్ల నాకు ఆంజనేయుడికి రాముడి పాదాల చెంత కూర్చుంటే కలిగే సంతోషం కలుగుతోంది ” అని కోమలవల్లి తెచ్చిన పళ్ళూ , పాలు అందించాడు ” ముందు మీరు ఫలహారం కానివ్వండి.” అన్నాడు.
మాధవమూర్తి , మంజుల మరేమీ మాట్లాడకుండా అరటి పండు తిని పాలు తాగారు. ” అయ్యా ఇలా రండి ” అని వారిద్దరిని ఇంటి ప్రధాన ద్వారం బయటకు తీసుకు వెళ్ళాడు రత్న స్వామి.
“మా ఇంటికి పెట్టిన పేరు చూసారా? ” అంటూ ఇంటి ముందు వున్న ఫలకం వైపు చూపించాడు. అక్కడ ‘ వెంకట నిలయం’ అన్న పేరు నల్లని ఫాలరాయి మీద చెక్కి వుంది.
“అది మీ తాతగారి పేరే స్వామీ ” వినయంగ చెప్పి వాళ్ళిద్దరినీ తిరిగి లోపలికి తీసుకు వచ్చాడు
“మా తాతగారు మీకు తెలుసా ? ఎలా ? నాకేమీ అర్థం కావడం లేదు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు మాధవమూర్తి ” మీ చిన్నప్పుడు మీ అమ్మమ్మ గారి ఇంట్లో చిన్నమ్మ అనే ఆమె ఇంటి పనీ, వంట పనీ, చూసుకుంటూ అమ్మమ్మ గారికి తోడుగా వుండేది గుర్తుందా మీకు? “ రత్నస్వామి అడిగాడు.
మాధవమూర్తికి చట్టున చిన్నమ్మ ముఖం కళ్ళ ముందు తోచింది.
“అవును. నేను పసి పిల్లవాడిగా వున్నప్పుడు నన్ను తన కాళ్ళ మీద వేసుకుని నీళ్ళు పోసేదట. అమ్మ చెప్పింది. నాకు పదేళ్ళప్పుడు కూడా తలంటి పోసేది. నాకు ఇష్టమని మురుకులు, నిప్పట్లు చేసి పెట్టేది . నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది.” ప్రేమగా తలచుకున్నాడు మాధవమూర్తి.
” ఆ చిన్నమ్మ మనవడినే నేను. తాతగారు చిన్నమ్మకు రాసి ఇచ్చిన ఎకరం చేను మా నాయనకు వచ్చింది. ఆ చేను అమ్మి ఈ స్థలం కొన్నాను. నా కష్టార్జితంతో ఈ ఇల్లు కట్టాను. ఆదీ మా నాయనమ్మ ఆత్మశాంతికోసమే.” రత్న స్వామి కళ్ళు చెమరించాయి.

“మా నాయనకు అన్నం పెట్టాలని చేని గట్టుకు పోయిన చిన్నమ్మ తాతగారు కన్ను మూసిన ఘడియలోనే , అక్కడే గుండె పోటుతో కూలిపోయిందని మా నాయన చెప్పాడు. తాత పోయే ముందు చిన్నమ్మ ఎక్కడ అని అడిగారట. అన్నం ఇచ్చి వచ్చేదానికి చేనికి పోయింది వచ్చేస్తుంది. ఆని చెప్పినారంట. అట్లనే వీధి వాకిలి వైపు చూస్తూనే ప్రాణం విడిచి పెట్టినాడంట. ఇరవై అయిదేండ్లు ఈ ఇంట గడిపిన ఆయమ్మ ఆత్మ ఈ ఇంట్లోనే తిరుగుతుందని అనేవాడు మా నాయన. ” రత్న స్వామి కళ్ళు తుడుచుకున్నాడు.
” మా అమ్మ చెప్పేది చిన్నమ్మ మా అమ్మమ్మను పండుకోమని పంపించి రాత్రి తెల్లవార్లు తాత కాళ్ళు పట్టేదంట ” మాధవమూర్తి గుర్తు చేసుకున్నాడు..
“మీ అమ్మ గారికి మామయ్యకు ఏదో మాట పట్టింపు వచ్చి అమ్మగారు ఇక్కడికి రావడం మానుకున్నారట. ఆమ్మమ్మ గారిని మాత్రం చివరిదాకా తన దగ్గరే పెట్టుకున్నారట.” రత్న స్వామి చెప్పుకుపోతున్నాడు.
” అవును. నాకు గుర్తు వుంది. ఆమ్మమ్మ మరో రెండేళ్ళలో పోయింది. తరువాత కొన్నేళ్ళకే మా అత్త చనిపోవడంతో మామయ్య ఎటో వెళ్ళిపోయాడు. మా మామకు సంతానం లేదు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎంతో ముద్దు చేసేవాడు. తనకు గుర్తు వున్నది చెప్పాడు మాధవమూర్తి.
” అవునండి. మీ మామయ్య గారే నన్ను చదివించారు. ఇల్లు అమ్మేసి ఆ డబ్బు అన్నదాన సత్రానికి ఇచ్చి వెళ్ళి పోయారు. ఆయన చలవ వలననే నాకు చదువు అబ్బి , ఉద్యోగం రావడం. మీ మామ మా నాయనను తమ్ముడిలా చూసుకునేవారు. మా నాయన పోయేముందు ” ఒరే నాయన! నువ్వు ఎట్లాగూ చేని పని చేయ లేవు. ఆ ఎకరం అమ్మేసి అయ్యగారి ఇల్లు కొనుక్కుని అక్కడే వుండు. స్వర్గాన వున్న మీ నాయనమ్మ ఆత్మ సంతోషపడుతుంది ” అని చెప్పి పోయినాడు.” కళ్ళు ఒత్తుకున్నాడు రత్న స్వామి.
“మీ మామ గుర్తు గా ఈ ఫోటో మిగిలింది నాకు.” ఆంటూ లేచి వెళ్ళి ఒక ఫోటో తీసుకు వచ్చి పై కండువాతో తుడిచి అందించాడు..
“కుడి వైపున వున్నది మీ మామ గారండి. ఎడమ పక్కన వున్నది మా నాయన.” అ మాటలు అంటున్నప్పుడు రత్నస్వామి గొంతులో గౌరవం ,అభిమానం తొంగి చూసాయి.
ఆ ఇద్దరినీ పక్క పక్కన చూస్తుంటే అన్నదమ్ములలా వున్నారు.
చిన్నప్పుడు తనను ఎత్తుకుని తిప్పిన మేనమామ స్పర్శ అనుభవిస్తున్నట్టు ఆ ఫొటోను గుండెకు హత్తుకున్నాడు మాధవమూర్తి.
” రండి స్వామీ. మీ భార్యాభర్తలు మా పూజ గదిలోకి అడుగుపెట్టి ఒక నిముషం కూర్చుంటే మా ఇల్లు పావనం అవుతుంది ” లేచి నిలబడి ఆ దంపతులను ఆహ్వానించాడు.
మనసు నిండిపోయి మాటలు రాని మౌనంతో దేవుడి గదిలోకి అడుగు పెట్టారు ఇద్దరూ. కన్నుల పండుగగా అలంకరించి వున్న దేవుని పటాలకు నమస్కరించారు. పటాలకు కుడి వైపు గోడ మీద మాధవమూర్తి తాత అమ్మమ్మ వున్న ఫోటొకు కుంకుమ పెట్టి దండ వేసి వుంది.అక్కడ కింది మెట్టు మీద వున్నఆంజనేయస్వామి బొమ్మను చూసిన మాధవమూర్తి తన కళ్ళను తానే నమ్మకం లేక పోయాడు.
“ఈ ఆంజనేయుడు.. ” అంటూ వుండగానే రత్నస్వామి అందుకున్నాడు
” మీరు భూమిలో దాచుకున్న హనుమంతుడే స్వామీ. ఈ ఇల్లు కట్టించినప్పుడు పునాదులు తవ్వుతుంటే దొరికాడు. ఈ రోజు మిమ్మల్ని అనుగ్రహించాడు. తీసుకోండి. ” అంటూ ఆ విగ్రహం మాధవమూర్తి చేతిలో పెట్టాడు రత్నస్వామి. ” వద్దనడానికి మనస్కరించక ఇష్టంగా అందుకున్నాడు. భర్త ముఖంలో కనబడుతున్న ఆనందం చూసి మంజుల కళ్ళు తడిసాయి.
” మా ఇంట దీపం వెలిగించిన తాతగారి వారసులు మీరు మా ఇంటికి వచ్చిన ఈ రోజు మాకు పండుగ రోజు అయ్యగారూ. మా తృప్తి కోసం ఈ పూట ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి.. మా మాట కాదనకండి.” ఆంతవరకు జరుగుతున్నవన్నీ ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయిన కోమలవల్లి వారిద్దరికీ నమస్కరిస్తూ అంది.
“అయ్యగారూ, బాబు గారు అంటూ మమ్మల్ని దూరం పెట్టకండమ్మా. మాకు దేవుడు ఇచ్చిన ఆత్మ బంధువులు మీరు. ఆలాగే కానివ్వండి. ” చనువుగా అన్నాడు మాధవమూర్తి.
” మీరు కూడా వీలు చూసుకుని మా ఇంటికి తప్పకుండా వచ్చి వెళ్ళాలి ” మంజుల కోమలవల్లి భుజాల చుట్టు చేయి వేసి ఆత్మీయంగా అంది.
ఆ పూటకు అక్కడే భోజనం చేసి , వాళ్ళు ఇచ్చిన కొత్త చీర , పంచల చాపు, తాంబూలం అందుకుని కారెక్కారు మాధవమూర్తి , మంజుల.
” ఇది మీ ఇల్లే అనుకోండి స్వామీ మీరూ రావడం మా భాగ్యం. ” బయలుదేరే ముందు మరొకసారి చెప్పాడు రత్న స్వామి.
అనుకోని ఈ మజిలీ ఇచ్చిన అనుభూతులను నెమరు వేసుకుంటూ సంతోషంతో నిండిన మనసులతో ప్రయాణం కొనసాగించారు మాధవమూర్తి , మంజుల. వాళ్ళిద్దరి ముందు కారు డెక్ మీద అభయమిస్తూ నిలబడి వున్నాడు ఆంజనేయుడు.
————– ———— ———–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *