1. ఉప్పుతాత

రచన: కాశీ విశ్వనాధం పట్రాయుడు

 

పుడమి తల్లి పచ్చచీర కట్టి నుదుట సింధూరాన్ని ధరించినట్లు ఉంది. సాయం సంధ్యాసమయంలో పచ్చని చెట్లతో  నిండిన కొండవాలు ప్రాంతం మదిని దోచే ఓ అద్భుత దృశ్యం. గున్నమామిళ్ల మధ్య స్వచ్ఛమైన చల్లని గాలిని పీలుస్తూ తన్మయత్వం చెందుతున్న అతడు . ‘సన్నిబాబు’ అన్న పిలుపుతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాడు..ఎదురుగా ఉప్పుతాత..

ఉప్పుతాతని చూడగానే  అతడి కళ్ళల్లో మెరుపు..గభాలున దగ్గరికెళ్లి  గట్టిగా కౌగలించుకుని…తాతా బాగున్నావా? ఏంటి సంగతి ఇలా వచ్చావు?”

“మెరక మడిలో మొక్కలు చూద్దామని బయలు దేరాను..దారిలో నువ్వు కనిపించావు”

“నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను తాతా..మోడువారిందనుకున్న నా జీవితంలో వెలుగుని నింపావు.  నువ్వు ఉప్పుతాతవి కాదు నా ప్రాణదాతవి. నేనిప్పుడు ఎంత ఆరోగ్యంగా, ఎంత ఆనందంగా ఉన్నానో  తెలుసా!  .. నాతో రా నా కుటుంబాన్ని పిల్లల్ని చూద్దువుగాని అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లాడు.

సుజాతా, బంగారం, మధురం, వయ్యారం, ..ఎవరొచ్చారో చూడండి” …అంటూ సంబరపడిపోతూ గట్టిగా పిలిచాడు…అతడి సంతోషాన్ని ఉత్సాహాన్ని చూస్తున్న ఉప్పుతాతకి ఆశ్చర్యం వేసింది…

తాతా ఇదిగో ఇదే నా పెద్ద కూతురు సుజాత చాలా బుద్ధిమంతురాలు.ఎంత తొందరగా ఎదిగిపోయిందో చూడు..నన్ను మించిపోయి ఉంది చూడు.

“ఇదే నా రెండో కూతురు బంగారం. నిజంగానే బంగారం ..ఆడ పిల్లలు తొందరగా ఎదిగిపోతారని అందరూ అంటుంటారు. నా బంగారాన్ని చూస్తే అది నిజమే ననిపిస్తోంది ..” అంటూ  పిల్లల్ని చూపించి చెప్తూ పరవశించి పోతున్న అతడిని చూస్తూ ఉంటే..దొర్లిపోయిన కాలం వెనక్కి తిరిగి వచ్చి గతాన్ని గుర్తుచేసింది ఉప్పుతాతకి.

********************

ఓ చల్లని సాయంత్రాన రామాలయం దగ్గర ఉన్న రావిచెట్టు కింద చప్టా మీద కూర్చుని ఉన్నాడు సన్నిబాబు . ఆకాశం నిండా కారు మేఘాలు ఆవరించుకున్నాయి. వీచే గాలికి రావి ఆకులు ఒక్కొక్కటిగా రాలి పడుతున్నాయి. ఇంతలో అటువైపుగా వచ్చిన ఉప్పు తాత… సన్నిబాబుతో..

“సన్నిబాబు ఏమైంది  అలా ఉన్నావు?” అని అడిగాడు.

ఆ పలకరింపులో ఆత్మీయత తొణికిసలాడింది..ఒక ఆత్మబంధువు గుండెలకు హత్తుకుని ఓదార్పు ఇచ్చినట్లు అనిపించింది సన్నిబాబుకి..

“అదే అర్ధం కాలేదు తాతా. తింటే ఆయాసం తినకపోతే నీరసం. ఏ పని చెయ్యబుద్ధి కాలేదు” అన్నాడు సన్నిబాబు నీరసంగా..

“కూర్చుంటే ఏ సమస్యా పరిష్కారం కాదు ”

“లేదు తాత చాలా మంది డాక్టర్లను కలిశాను.. అయినా ఫలితం లేదు..” అన్నాడు నిట్టూరుస్తూ..

“అలా వెళ్ళొద్దాం రా!” అని చెప్పి నల్లచెరువు వైపు తీసుకు వెళ్ళాడు.. దారిపొడవునా ఏవేవో కబుర్లు చెప్తూనే వున్నాడు ఉప్పుతాత. అన్యమనస్కంగా వింటున్నాడు సన్నిబాబు.

దారిలో గేదె పేడ కనిపించింది..”ఒక్క నిమిషం  ఆగు” ఆ పేడ పురుగుని చూడు తనకంటే పెద్దదైన పేడ ఉండని తోసుకుంటూ వెళ్తోంది .సమయం వృధా కాకుండా వేటి పని అవి చేసుకు పోతున్నాయి. ముందుగా మనమీద మనకు నమ్మకం ఉండాలి. శ్రమించే తత్వం కలిగి ఉండాలి. ..అని సుతిమెత్తగా హితబోధ చేసాడు ఉప్పుతాత..

అలా నడుచుకుంటూ నల్లచెరువు దగ్గరలో కొండవాలు ప్రాంతంలో ఉన్న మెరక మళ్లను చేరుకున్నారు..

“ఒరేయ్ సన్నిగా నీ వాటాకి వచ్చిన కారిమడి ఉందా అమ్మేశావా?” అని సందేహం వ్యక్తం చేశాడు.

“ఇదిగో మనముందు తుప్పలు డొంకలుతో ఉన్నది నాది ఆ ప్రక్కన ఉన్న గున్న తోట అప్పలనాయుడు బావది.”

“చూసావా కిలకిల మని నవ్వే పిల్లల్లా అప్పలనాయుడు మొక్కలు ఎంత బావున్నాయో.. మొక్కని నాటి నీళ్లుపోస్తే అవి మనకి నీడనిస్తాయి, పాదు కడితే ప్రాణమిస్తాయి, ఈరోజు నువ్వు వాటికి ఆసరాని ఇస్తే .. పెరిగి పెద్దవై అవసానదశలో మనకి ఆసరాగా ఉంటాయి. మనుషులకి మోసం చెయ్యడం తెలుసుగాని మొక్కలకి తెలియదురా!” అన్నాడు ఉప్పుతాత.

అతని మాటమీద గురి కుదిరింది సన్నిబాబుకి.

తాత సాయంతో కూలి వాళ్ళని పెట్టి తుప్పలు, డొంకలు కొట్టించి,  భూమిని చదును చేయించాడు. చక్కగా దున్నించాడు. అందులో సువర్ణ రేఖ, బంగిన పల్లి, కలెక్టరు, రసాలు,మొదలైన  మామిడి మొక్కలు నాటించాడు.

మర్నాటి నుంచి క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం  తోట దగ్గరికి వెళ్ళేవాడు. బంగిన పల్లి మొక్కని బంగారు అని, రసాలు మొక్కని మధురం అని, సువర్ణ రేఖని సుజాతా అని, కలెక్టరుని వయ్యారం అని ముద్దుగా పిలుచుకునేవాడు..వాటిని తన పిల్లలుగా భావించి సంరక్షించేవాడు..

ఇలా ఉండగా ఒక రోజు…”ఏం బంగారం అలా వాడుగా ఉన్నావు ఏమైంది” అని కుశల ప్రశ్నలు వేస్తూ మొక్కమొదట్లో ఉన్న చెదను చూసి” ఓహో నీ బాధకు ఇదా కారణం..మధురం ఎందుకలా అరుస్తున్నావు.. బంగారానికి చెదపట్టింది.. చీమలమందు జల్లి నీదగ్గరికే వస్తాను.. అని చెప్పి  మధురం దగ్గరికి వెళ్ళాడు.. ఏమైంది రా అలా గోలపెడుతున్నావు అని మొక్కని అంతా తడిమి తడిమి చూసాడు.అయ్యో కొమ్మవిరిగిందా! ఉండు కట్టు కడతాను నొప్పి తగ్గుతుంది. ఊగితే దెబ్బలు తగులుతాయని చెప్పినా వినిపించుకోవు. అంటూ విరిగిన కొమ్మని దగ్గరగా చేసి కట్టుకట్టాడు.

ఇలా మొక్కలతో మమేకమైపోయాడు.

కొత్త చిగుళ్లును చూసి  జన్మనిచ్చిన తల్లి పొందినంత ఆనందాన్ని,

తొలకరి చినుకు చూసి రైతు పొందినంత ఆనందాన్ని, కొడుకు ప్రయోజకుడైతే తండ్రి పొందినంత ఆనందాన్ని,  మనవడితో ఆడుకున్నప్పుడు తాత పొందినంత ఆనందాన్ని పొందాడు సన్నిబాబు.

ఇలా నెలలు గడిచాయి. మొక్కలు కొత్త చిగుర్లు తొడుగుతూ గుబురుగా అయ్యాయి. వాటిమధ్య నిలబడి వాటితో మాట్లాడుతూ, తన కన్న బిడ్డల్లా సాకుతూ,మట్టి పరిమళాన్ని పీలుస్తూ మురిసిపోతున్నాడు.

” గతానికి ఇప్పటికి తేడా గమనించావా సన్నిబాబు” అని అడిగాడు ఉప్పుతాత వాస్తవంలోకి వచ్చి.

“లేని రోగాన్ని ఉహించుకున్నాను అప్పుడు.” మొక్క చుట్టూ గొప్పు తవ్వుతూ….

“అయినా నాలుగు గోడల మధ్య ఏ.సి గదుల్లో ఉన్నోళ్లకి ఈ మట్టి మహిమ ఏం తెలుస్తుందిరా! మనం జీవించడానికి ఆ నేల తల్లి ఒడినిచ్చింది, స్వచ్ఛమైన గాలిని,ప్రకృతిని అందించింది..తనువు చాలించాక తనలోనే కలుపుకొంటుంది..ఇంతకంటే ఏమి కావాలిరా? ఆ తల్లికి సేవచేయడానికి…

“నిజమే తాత మొక్కలను పెంచి నేలతల్లి రుణం తీర్చుకుంటున్నాను అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నాను” అన్నాడు సన్నిబాబు.

సన్నిబాబులో మార్పుకు ఆనందించాడు ఉప్పుతాత.

2 thoughts on “1. ఉప్పుతాత”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *