April 27, 2024

16. అమూల్యం

రచన:  భాస్కరలక్ష్మి కర్రా

“ టింగ్ టాంగ్ “ అంటూ ఆపకుండా మొగుతున్న డోర్ బెల్ మోతకి లేవడం ఇష్టం లేకపోయినా లేచాను.  టైం చూస్తే పది దాటింది.  డోర్ తీయగానే అపార్ట్మెంట్ వాచమన్. “ఏంటి వినయ్ బాబు,  ఎన్ని సార్లు బెల్లు నొక్కానో తెల్సా. మీ అమ్మగారు నాన్నగారు నాకు పొద్దునుండి పదిసార్లు ఫోన్ చేసారు.  మీకు రాత్రినుండి కాల్ చేస్తుంటే,  ఫోన్ ఎత్తట్లేదని వాళ్ళు ఒకటే కంగారు పడుతున్నారు .  ఒంట్లో బానే ఉందా బాబు? ఓ సారి అమ్మగారికి ఫోన్ చేయండి,  వాళ్ళు రాత్రినుండి పడుకున్నట్టు లేరు” అంటూ మా కారిడార్ లో ఉన్న ఆంటీ వాళ్ళని,  కింద ఉండే సెక్రెటరీని,  అంతా అక్కడే ఉన్నారేమో,  అందరని సాగనంపాడు. రెండు రోజుల నుండి సరిగ్గా తినకపోవడం వల్ల నీరసంగా ఉంది,  కాని ముద్ద మింగుడు పడట్లేదు.  ఒక్క రోజు వాళ్ళకి ఫోన్ చేయకపోతేనే ఇంత హడావిడి అయింది మరి నేను తీసుకున్న నిర్ణయం సబబేనా?
ఎందుకు కాదు! అమ్మకి నాన్న ఉన్నారు,  నాన్నకి అమ్మ ఉంది. ఎప్పటికీ తోడుగా ఉండేది మన లైఫ్ పార్టనర్సే  కాని,  పేరెంట్స్ కాదు కదా. అలాంటి లైఫ్ పార్టనర్ కంటే ఎక్కువగా అనుకున్న నా అమూల్య నాకు కాకుండా పోయినప్పుడు నేను ఇంక ఎవరికోసం ఆలోంచించాలి.  నేను అనుకున్నది ఇవాళ్ళ ఎలాగయినా చేసి తీరాలి అని దృడంగా లేచాను.  వెంటనే నా లాప్టాప్ ఆన్ చేసి మెయిల్ రాయడం మొదలు పెట్టాను.
” ఈ నా సూసైడ్ చేసుకోవాలనే నిర్ణయం కేవలం నాదే.  దీనికి ఎవరు బాధ్యులు కారు.  ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా అమూల్య తన పేరెంట్స్ ని మా పెళ్ళికి ఒప్పించలేకపోయింది. అలా అని నాకోసం తన ఫ్యామిలిని వదులుకోలేకపోయింది.  ఇష్టం లేకుండా వేరే పెళ్ళి చేసుకుని నన్ను ఒంటరివాడిని చేసింది.  తను లేని నా లైఫ్ ని నేను ఎంత ప్రయత్నించినా ఉహించుకోలేకపోతున్నాను.  జీవితంలో ప్రేమ,  పెళ్ళి ఒక భాగం మాత్రమే అని తెలిసినా,  ఆ ప్రేమ లేనిదే జీవితం లేదు అన్నట్టు గా ఉంది. నాకోసం ఎవ్వరూ బాధపడ్డదు.  నేను బ్రతికున్నా ఆనందంగా ఉండలేను,  నా పేరెంట్స్ ని సరిగ్గా చూసుకోలేను.  అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.  నా బాంక్ అకౌంట్లో ఉన్న ఫిక్స్డ్ డిపోజిట్స్ కి,  నా పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ కి నా పేరెంట్స్ ని నామినీస్ గా పెట్టాను,  తప్పకుండా ఆ డబ్బులు వాళ్ళకి అందేలా చూడండి. ఇదే నా చివరి ఆశ.  ఇట్లు మీ వినయ్”
మెయిల్ ఒకటికి రెండుసార్లు చదువుకున్నాను.  ఎవరెవరికి పంపాలో ఆలోచించి మెయిల్ ని డ్రాఫ్ట్ చేసి పెట్టుకున్నాను.  రాత్రి కరెక్ట్ గా ఏడింటికి  ఆ మెయిల్ అందరికీ పంపేలా ఆటోమేట్ చేసుకున్నాను.  అది అందరికీ చేరే లోపే నేను చావుదరి చేరాలనుకున్నాను.  దానికోసం ఒక సీసా స్లీపింగ్ పిల్స్ కూల్ డ్రింక్ లో కలుపుకుని మధ్యానమే తాగాలని నిశ్చయించుకున్నాను. ఇవాళ్ళ నా డెత్ డే,  నాకు భయం వేయట్లేదు సరికదా, కనీసం రేపటి నుండి అయినా నాకు ఎటువంటి బాధ ఉండదనే ఫీలింగ్ నాకు హాయినిచ్చింది.  లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్,  ఈ మిగిలిన కొద్ది గంటలు నాకు నచ్చింది చెయ్యాలనుకున్నాను.  లేచి అమూల్య నాకు ఇచ్చిన షర్ట్ వేసుకుని రెడీ అయ్యాను.  స్విగ్గీలో నా ఫేవరేట్ చైనీస్ నూడిల్స్ తెప్పించుకుని తిన్నాను.  అన్నిటికన్నా నాకు బాగా ఇష్టం అయిన పని,  ప్రతి రోజు డైరీ రాయడం.  డైరీ తీసి రాద్దామనుకున్నాను కానీ,  నా జీవితంలోని చివరి పేజీని రాయలేకపోయాను.

ఒక్కసారి ఈ నా పాతికేళ్ల జీవితం కళ్ళ ముందు మెదిలింది.
పొదరిల్లు లాంటి ఇల్లు,  అమ్మా,  నాన్న, అక్క, నేను . ముచ్చటయిన కుటుంబం మాది . పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్.  వారిద్దరూ కూడా ఏనాడు మమ్మల్ని అజమాయిషీ తో పెంచలేదు.  వాళ్ళు ప్రేమగా ఉంటూ, అంతకన్నా ఎక్కువ ప్రేమతో మమ్మల్ని పెంచారు.  అక్కా నేను ఎప్పుడు చదువులో ముందే.  అలానే అక్క ఐఐటీ ముంబాయిలో చదివి అమెరికాలో మాస్టర్స్ కి వెళ్ళి ఉద్యోగం చేస్తూ తన కొలీగ్ ని పెళ్ళి చేసుకుని లైఫ్ లో స్థిరపడింది.  దాని లవ్ మ్యారేజ్ కి ఒకటే కులం కావడం వల్ల పెద్ద ఇబ్బందులు రాలేదు. నేను ఐఐటి హైదరాబాద్ లో జాయిన్ అయిన రోజే అమూల్య ని చూసాను,  తను నా క్లాస్ మెట్ కావడం వల్ల నాలుగేళ్ళలో మా పరిచయం స్నేహం నుండి ప్రేమగా మారింది.  కాలేజ్ ఫైనల్ ఇయర్ లోనే ఇద్దరికి క్యాంపస్ ఇంటర్వూస్ లో ఉద్యోగాలు కూడా వచ్చాయి. మూడేళ్లు తరువాత ఇంట్లో చెప్పి అందర్నీ ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనేది మా ఆలోచన.  ఎందుకంటే తను వాళ్ళ పేరెంట్స్ కి ఒక్కతే కూతురు కావడం ఒక కారణం అయితే,  మా కులాలు వేరు కావడం రెండవది.
అన్నీ అనుకున్నట్టే జరగవు కదా,  అదే జీవితం.  ఎంత ప్రయత్నించినా వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు,  చివరికి ఆయనకి మాస్సివ్ హార్ట్ ఎటాక్ రావడం, అమూల్య భయపడి వాళ్ళు చూపించిన సంబంధం చేసుకోడం క్షణాల్లో జరిగిపోయాయి. నేను ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ఇంట్లో వాళ్ళకి అమూల్యకి పెళ్ళి అయిందన్న విషయం తెలియదు.  ఇంకా తను ఇంట్లో ఒప్పించే ప్రయత్నంలోనే ఉందనుకుంటున్నారు.  ఒక్కసారి ఏడుపు వచ్చేసింది.  ఇంత చదువుకున్నాను, ఇంత ఫ్యామిలీ సపోర్ట్,  ఫైనాన్సిల్ సపోర్ట్ ఉన్నా నేను ఒడిపోయాను.  బతికే ధైర్యం రావట్లేదు.

డైరీ రాయలనిపించలేదు.  నా అమూల్యతో నేను గడిపిన రోజులు తలచుకుంటూ చావుకు దగ్గర అవ్వాలనుకున్నాను.  పాత డైరీలు చదివితే నా అమూల్యతో గడిపిన రోజులు తలచుకోవచ్చు అనే ఉదేశంతో వాటిని తీసాను.  మేము ఇద్దరం చూసిన సినిమాలు,  కలసి తిరిగిన ప్రదేశాలు,  రెస్టారెంట్స్,  ఇంకా ఎన్నో గుడ్ మెమోరీస్ ని చదువుకుని,  తలచుకుని ఆనందపడ్డాను.  ఇంతలో నేను రాసుకున్న డైరీ లోని ఒక సంఘటన దగ్గర నా కళ్ళు ఆగిపోయాయి
” ఇవ్వాళ ఆఫీస్ నుండి నేను,  అమూల్య తొందరగా బయలుదేరాము.  రైల్వేస్టేషన్ కి వెళ్ళి, అమూల్యని వాళ్ళ ఊరికి ట్రైన్ ఎక్కించి, నా రూమ్ కి వచ్చాను.  ఫ్రెషప్ అయ్యి బట్టలు మార్చుకుని కిందకి వెళ్ళి ఏదయినా తిందాం అని అనుకుంటుంటే కారిడార్ లో పెద్ద పెద్ద అరుపులు విని పెరిగెత్తుకుంటూ వెళ్ళాను.  అప్పటికే పదిమందివరకు,  నా పక్కనే ఉండే విష్ణు రూమ్ ముందు గుమ్మిగూడి,  విష్ణు విష్ణు అని పిలుస్తూ రూమ్ తలుపు బద్దలు కొట్టారు.  నేను వెళ్ళేసరికి అందరూ ఒక్కసారి షాక్ అయిచూస్తూ ఉండిపోయారు.  విష్ణు ఫ్యాన్ కి ఉరివేసుకుని విగతజీవుగా ఉన్నాడు. లోపలకి ఎవరూ వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు.  నా లైఫ్ లో నేను అంత క్లోజ్ గా చూసిన సూసైడ్ ఇన్సిడెంట్ ఇదే.  ఒక్కసారిగా నాకు వణుకు వచ్చేసింది.  కళ్ళముందు ప్రాణాలు పోతున్నా ఎవ్వరం అపలేకపోతున్నాము అనే థాట్,  ఇంకా బతికే ఉంటే మనం ఆ ఛాన్స్ ని వదిలేస్తునామా అనే ఫీలింగ్ రాగానే, నేను ఇంక ఏమి ఆలోచించకుండా ముందుకు వెళ్లి గబ గబా విష్ణుని పట్టుకుని తాడు తీయడానికి ప్రయత్నించాను.  ఈలోపు ఇంకో ఇద్దరు లోపలకి వచ్చి నాకు సహాయం చేశారు. వెంటనే అంబుల్సన్స్ కి కాల్ చేసి దగ్గరి లో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాము కానీ,  లాభం లేకపోయింది.  హాస్టల్ ఇంచార్జి విష్ణు పేరెంట్స్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు.  హాస్పిటల్ లో ఉండగానే మా వార్డెన్ కాల్ చేసి రూమ్ లో సూసైడ్ నోట్ దొరికిందని,  ఆరు నెలల నుండి ఎంత ప్రయత్నించినా జాబ్ రాలేదని,  ఇంకా ఎన్నాళ్ళు ఇలా పేరెంట్స్ మీద ఆధారపడాలో,  అనే భయంతో సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారు. ఇంతలో విష్ణు పేరెంట్స్,  అన్నయ్య,  చుట్టాలు అందరూ కంగారుగా హాస్పిటల్ కి వచ్చి విషయం తెలుసుకుని గుండెలు అవిసేలా ఏడ్చారు.  ఆ పరిస్థితిలో నాకు ఏంచేయాలో అర్ధం కాలేదు.  వెంటనే విష్ణు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఓదార్చడానికి ప్రయతించాను.  ఆవిడ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.  నెమ్మదిగా లేపి కూర్చోపెట్టాను.  ఆవిడ నా చెయ్యి పట్టికుని ఏడుస్తూ ” జీవితంలో స్థిరపడడానికి కావాల్సింది ఉద్యోగం కాదు ధైర్యం.  మా వాడు చావడానికి చూపించిన తెగింపు, దైర్యంలో ఒకటోవంతు బతకడానికి చూపించుంటే బావుండేది.  ఎప్పుడు ఫోన్ చేసినా బానే ఉన్నాను అని మాత్రమే చెప్పేవాడు. కనీసం ఇలా అని ఒకసారి మాతో కానీ, తన అన్నయ్య తో కానీ,  తన బాధని షేర్ చేసుకుని ఉంటే ఇలా జరిగుండెది కాదు.  డిప్రెషన్లో ఉన్నపుడు ఫ్రెండ్స్,  ఫామిలీ తో ఓపెన్ గా మాట్లాడాలి.  విష్ణు చేసిన పనికి ఇంక మేము ఇప్పుడు బతికి ఉన్నా,  లేనట్లే .  పిల్లలు ఆవేశంలో చేసే పనికి తల్లితండ్రులు రోజు చస్తూ బతకాలి.  ఇలాంటి పరిస్థితి ఏ పేరెంట్స్ కి రాకూడదమ్మా వినయ్ “అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు.  విష్ణు ఇంత పిరికివాడనుకోలేదు,  తన పేరెంట్స్ ని ఇంత బాధ పెట్టి తను ఎంసాదించాడో నాకు అర్థంకాలేదు.  హాస్టల్ లో ఉండాలనిపించట్లేదు.  అర్జెంటగా ఏదియైన అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయిపోవాలి ”

ఒక్కసారిగా నా చంప చెళ్లుమనిపించినట్టు అయింది.  నేను రాసుకున్న నా మాటలే మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను.  విష్ణుని పిరికివాడన్నాను,  మరి నేను ఏంటి? పేరెంట్స్ ని బాధపెట్టాడు అన్నాను మరి నేను చేయబోయే పనికి నా పేరెంట్స్ ఎంత బాధపడతారు? సెల్ఫిష్ గా నా ప్రేమ,  నా బాధ అనే ఆలోచించాను కానీ ఇంత అర్డంచేసుకునే నా పేరెంట్స్ కి నేను ఏం చేసాను? విష్ణు వాళ్ల అమ్మగారు అన్నట్టు చావడానికి చూపించే ధైర్యంలో ఒకటోవంతు బతకడానికి చూపిస్తే బావుంటుంది ! అవును ఆ ఆలోచన రాగానే అమూల్య గుర్తుకువచ్చింది.  నేను ఎంతగా తనని ప్రేమించానో, తను నన్ను అంతకన్నా ఎక్కువగానే ప్రేమించింది. మరి తను లైఫ్ ని ధైర్యంగా ఎదురుకుంది,  పేరెంట్స్ కోసం ఆలోచించింది.  మరి నేను? నేను తీసుకున్న నిర్ణయానికి  సిగ్గుతో కుంగిపోయాను.  వెంటనే లేచి డ్రాఫ్ట్ చేసుకున్న ఇమెయిల్ డిలీట్ చేసేసాను. స్లీపింగ్ పిల్స్ డబ్బా తీసి చెత్త కుండిలో పడేసాను. ఈ నా డిప్రెషన్ ఫీలింగ్స్ ని ఎవరితోనయినా  షేర్ చేసుకుంటే బెటర్ అనుకున్నాను. మా ఆఫీస్ లో డిప్రెషన్ తో ఉన్నవాళ్ళకి,  ఎమోషనల్ గా వీక్ గా ఉండి ఎవరితోనూ వాళ్ళ ఫీలింగ్స్ ని చెప్పుకోలేని వాళ్ళకి,  కౌన్సిలింగ్ ఇచ్చి,  లైఫ్ మీద మళ్ళీ హోప్ ఇచ్చే ఫ్రీలాన్స్ కౌన్సెల్లెర్స్ ఉన్నారు. ఇన్నిరోజులూ,  సొల్యూషన్ లేని నా ప్రొబ్లంకి వాళ్ళు మాత్రం ఏమిచేయగలరు అనే ఉద్దేశంతో వాళ్ళకి కనీసం ఫోన్ కూడా చేయలేదు.  ఆ విషయం గుర్తుకు రాగానే గబగబా వాళ్ళ ఫోన్ నెంబర్ కోసం వెతికి,  కాల్ చేసి నా సిట్యుయేషన్ చెప్పాను.  వెంటనే వాళ్ళు పది నిముషాల్లో నా అపార్ట్మెంట్ కి వచ్చి నన్ను ఆఫీస్ కి తీసుకుని వెళ్ళారు.  నా ప్రాబ్లెమ్ అంతా విని,  వెంటనే అమ్మవాళ్ళకి ఫోన్ చేసి,  అర్జెంట్ గా వాళ్ళని బయలుదేరి రమ్మన్నారు. రెండు వారాలు ఆఫీస్ కి సెలవు పెట్టించి,  రోజు విడిచి రోజు కౌన్సిలింగ్ ఇచ్చారు.  ఈ విషయం విని మొదట భయపడినా, తరువాత అమ్మవాళ్ళు కూడా నాతో పాటు కౌన్సిలింగ్ సెషన్స కి వచ్చేవారు.  ఒక నిమిషం కూడా నన్ను ఒంటరిగా ఉండనిచ్చేవారు కాదు. నేను పూర్తిగా కొలుకున్నానని వాళ్ళకి అనిపించాకే నన్ను ఆఫీస్ కి పంపించారు. లైఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక్కోసారి సొల్యూషన్ ఉండకపోవచ్చు,  అలా అని వాటన్నింటికి చావు ఒకటే సొల్యూషన్ కాదు.  ప్రాబ్లమ్సని ధైర్యంగా ఎదురుకోవాలి.  అలా అనుకుంటే జీవితం అనే డైరీలో అన్నీ గుడ్ మెమోరీస్ మాత్రమే ఉంటాయని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను కూడా నా ఆఫీస్ లో వన్ ఆఫ్ థి కౌన్సెలింగ్ మెంబెర్ ని.
నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికి నా కథే ఉదాహరణగా చెప్పి,  చివరిగా ఒక మాట చెపుతాను
“నా జీవితంలో అమూల్య లేకపోవచ్చు,  కానీ జీవితమే అమూల్యమైనది వెరీ వెరీ ప్రెషస్,  దాన్ని చివరిదాకా ఆస్వాదించి తీరాలి,  పిరికివాడిలాగా వెనకడుగు వెయ్యద్దు”

 

3 thoughts on “16. అమూల్యం

  1. చాల బాగుంది. ఒక్క నిమిషం నా జీవితంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *