April 28, 2024

40. పితృ యజ్ఞం

రచన: కె.వి.సుబ్రహ్మణ్యం

 

విజయ్ తన ఇంటి హాల్లో కూర్చుని ఉన్నాడు. ముందరి వైపుకు ఉన్న బెడ్ రూం గుమ్మంలో తల్లి నిలబడి, కొడుకు మూడ్ ని గ్రహించడానికి ప్రయత్నం చేసి, బాగానే ఉన్నట్లున్నాడని ముందరికి వచ్చింది.

“నాయనా నీతో కొంచెం మాట్లాడాలిరా”

కనపడని విసుగు, కనపడే నవ్వుతో, “వచ్చి కూర్చోమ్మా. అని చెప్పి, బహుశ భార్య అక్కడ దగ్గరలో ఉందేమోనని….వంటింటి గది వైపు చూశాడు. ఆతని ఇబ్బంది గమనించి…

” కోడలిక్కడ లేదులే, పేరంటానికి వెళ్లింది”  తల్లి మాటతో విజయ్ ముఖంలో నిర్భయత్వం తో కూడిన దరహాసం విరిసింది దానిని తల్లి గమనించకపోలేదు. విషయం చెప్పమన్నట్లు తల్లి కేసి చూశాడు.

“మీ నాన్నగారూ నేనూ కాశీకి వెళ్తామనుకుంటున్నాం రా. ఆయనకి ఎప్పటినించో ఆ కోరిక మిగిలి పోయింది.  ఆ విషయం నీకూ తెలుసు. అక్కడ ఒక సత్రం లో శివాజీ అని  నాన్నగారి శిష్యుడొకరు అక్కడే ఉద్యోగమో, సేవ కోసమో ఉంటున్నాడట. కావాలంటే ఓ పదిరోజులుండి వెళ్లచ్చన్నాడు, అక్కడివన్నీ తనే దగ్గరుండి చూపిస్తానన్నాదు. కాబట్టి పది రోజులూ ఆ సత్రంలో భోజనం, ఉండడానికి, అందరితో పాటే మాకూ ఉచితం గానే ఇస్తారుట.  విశ్వనాధుని కోవెల కూడా చాలా చేరువేనని అన్నాడు, అందుకని, దారి ఖర్చు తప్ప ఎక్కువ అవదు. శివాజీ నీకంటే ఒక క్లాసు తక్కువ కూడా, మనింటికి అప్పుడప్పుడు వచ్చి నాన్న గారి వద్ద అనుమానాలు  తీర్చుకునేవాడు, నీకు కూడా గుర్తుండే ఉంటుంది.  మేం కూడా ఈ మాత్రం ఓపిక ఉన్నపుడైనా వెళ్లొచ్చేస్తే ….. ఆయన చిరకాల సంకల్పం నెరవేర్చిన వాడివవుతావు నాయనా ”

” అమ్మా ఈ నెల పిల్లలిద్దరికీ పరీక్ష ఫీజులు కట్టాల్సి ఉంది. అదీ కాక అబ్బాయికి పరీక్షలవగానే వాళ్ల స్కూలు వారు ఏదో  ఎక్స్కర్షన్  కి తీసుకెల్తారని దానికి,  ‘నో’ అనడానికి వీల్లేదనీ బెదిరించాడు కూడా. కొంచెం వెసులుబాటగానే  చూద్దాం అమ్మా”.

“నువ్వు కొంచెం వెసులుబాటు చేసుకో నాయనా…మాదీ పోయే వయసే కానీ వచ్చే వయసుకాదు కదా” మ్లానంగా లోపలికి వెళ్ళిపోయింది.

ఆలోచనల్లో పడ్డాడు విజయ్. శివాజీ తనకి కూడా తెలుసు. బాల్యంలోకోసారి తొంగి చూసుకున్నాడు. తన తల్లిదండ్రులిద్దరూ తనని తమ స్తోమతకి మించే పెంచి పెద్దచేశారు. మరీ గొంతెమ్మ కోరికలు తప్ప అన్నీ తీర్చినట్లే చేశారు. ఇప్పటికీ తాను ఎగువ మధ్యతరగతి లో ఉన్నాడంటే కేవలం తన ఉద్యోగం గొప్పతనం కాదు.  పల్లెలో తండ్రికి ఉన్న అయిదెకరాల మాగాణీ మీద వచ్చే అయివేజు, తండ్రికి వచ్చే పెన్షన్, తన జీతం కలిస్తేనే ఈ రకంగా పిల్లలని ఖరీదయిన కాన్వెంట్ లో చేర్చి చదివించగలుగుతున్నాడు. అమ్మ అడిగిన కోరికలో తప్పేం లేదు. కేవలం నాన్నగారి రెండు నెలల పెన్షన్ పెడితే  అక్కడ ఉచిత వసతి భోజన అవసరం లేకుండానే వెళ్లి వచ్చేయగలరు.  వారి ఆదాయం కూడా ప్రతినెలా తానే అనుభవిస్తున్నాడు. నాన్నగారి చిరకాలంగా తీరని  కోరిక కోసం, అమ్మ తనని అడిగింది. ఎంత చిత్రం!  వారి డబ్బు వారు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకోడం కోసం,  వారి ధనంతో విలాసంగా జీవించే తనని అడిగారు.

జీవితంలో ఒక ఒరవడి ఆదాయానికి అలవాటు పడితే అక్కడనించి వెనక్కి రావడానికి ఏ ఒక్కరికీ ఇష్టం ఉండదు. మానవ జీవితంలో ఎంత అసహజమైన సహజ పరిణామం? ముఖ్యంగా రాజకీయాలలో…ఒకసారి పదవికి అలవాటు పడితే, పార్టీ మారి అయినా పదవి పొందాలనే ధ్యేయం బాగా కనిపిస్తుంటుంది.

చిన్నతనంలో తాను హైస్కూలు లో చదివేటప్పుడు స్కూల్ టూర్ కి వెళ్దామంటే వారి కాశీ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని అప్పటికే మంజూరయిన తన సెలవుని క్యాన్సిల్ చేసి తనని  టూర్ కి  పంపించిన సంఘటన గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ రోజేమో తన కొడుకు టూర్ గురించి చెప్పి వారి కాశీ  ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నాడు.  ఇప్పుడు మాత్రం? తన డబ్బడగడం లేదు వాళ్లు…కేవలం అనుమతి కోరుతున్నారు.

తన స్కూల్ టూర్ కోసం  ఒకసారి వాయిదా వేసుకున్నారు వారు తమప్రయాణాన్ని, ఇప్పుడూ అదే కధ, మనుమడి స్కూల్ టూర్ కోసం వాయిదా వేస్తున్నాడు తను. నిజానికి వాళ్లని పంపితే తనకి వచ్చే ’నష్టం’ అంటూ ఏమీ లేదు. తనకి  ఆగిపోయే కార్యాలూ ఏమీ ఉండవు కూడా.  ఇక్కడ తన భార్య,..వాళ్ల పట్ల అయిష్టం గానో, ఇష్టం గానో, వారిని సేవిస్తూనే ఉంది సేవా లోపం లేకుండా.   ఒక మాట అనకుండా, ఒక మాట పడకుండా.  కానీ భార్యనడిగి చెప్పచ్చని, ఎందుకయినా మంచిదనీ, వాయిదా కోరాడు..తల్లిని.  తన సంసారంలో రాబోయే ఉప్పెన ని తప్పించుకోడానికి మాత్రమే.  ఏం? వారంతట వారు…మేం కాశీ యాత్రకి వెళ్తామంటే వెళ్లగలరు కూడా.  తనేంజేయగలడు. మీ ఇష్టం అనుకుని వారడిగిన డబ్బిచ్చి మవునంగా ఉండడం తప్ప?

భార్య సునీత తో ఈ విషయం చర్చించి, ఇద్దరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు స్థూలంగా సునీత నిర్ణయమే అది.  రెండు మూడు నెలలలో పంపిస్తామని, ఈ లోపు త్రీ టైర్ ఏ.సీ. లో టికెట్ రిజర్వేషన్ చేయిస్తాననీ, దానికి ఆమాత్రం గడువు కావాలనీ, తల్లికి  చెప్పాడు. అంతటితో ఊరుకోకుండా “అయినా ఈ విషయం నాన్న గారే అడగవచ్చు గదా ” అని నోరు జారాడు.  “ఏరా చిన్నపుడు నీ కేది కావాలన్నా నువ్వు నన్నే గదా అడిగిందీ, నే వెళ్లి నాన్న గారితో చెప్పడం..నీ కోరిక తీరడం, ఇలాగేగా జరిగిందీ,  నేనడిగితే ఒకటీ ఆయన అడిగితే ఒకటీ నా?  ఆయనే  అడిగితే సమాధానం మా కనుకూలంగా వస్తుందంటే,  ఇప్పుడు మాత్రం ఏం పోయింది, ఆయననే వచ్చి అడగమంటాను” అని ఒక్క ఝలక్ ఇచ్చింది. “అక్కర్లేదు ఏదో మాటవరసకి, పొరపాటున ఆన్నానని క్షమించమ్మా ”  అనేశా. “ఇంత చిన్న దానికి క్షమ దాకా ఎందుకులే. టికెట్ల సంగతేదో చూడు” అంటూ తమ గదిలోకి వెళ్ళిపోయింది. ఈ వాయిదా  నమ్ముకోదగినది కాదని  ఆమెకి అర్థమైంది. తమ డబ్బు తో తమని పంపించవచ్చు గదా అని అందామనుకునే దుస్సాహసానికి ఆమె సంస్కారం అడ్డుపడింది. అయినా కాశీ వెళ్లాలంటే కుమారుది ఆజ్ఞ  కాదు కావలసింది, ఆ కుమారస్వామి తండ్రే అనుమతి ప్రసాదించాలి అని సమాధానపడింది.

ఈ నెల తో అన్ని ఖర్చులూ పూర్తయాయమ్మా, ఇక  నెల జీతం రాగానే మీ టికెట్ల గురించి ప్రయత్నం చేస్తానని ఓ రోజు తల్లితో చెప్పాడు విజయ్. అన్ని ఏర్పాట్లూ పూర్తి అయ్యాక నమ్ముదామని ఆవిడ కూడా విని ఊరుకుంది. ఎక్కువగా సంభాషణ పెంచదలుచుకోలేదు.

అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతుంటే మనిషికి “ఏదో”.. “ఎక్కడో” ఉంటుంది. అనుకోకుండా ఒక రోజు తన తండ్రికి హఠాత్తుగా గుండె పోటు వచ్చి, హాస్పిటల్ కి తరలించే ఏర్పాట్ల మధ్యలోనే కన్ను మూశారు. జీవిత కాలం తోడుండాల్సిన తోడు,  తప్పేసరికి అమ్మ దుఃఖానికి అంతే లేకుండా పోయింది. జీవన  ప్రయాణాల్లో ఎవరు ముందరో?  ఎవరు  తరువాతో ముందే రాసి ఉంటుంది. కానీ ఆ రాతలు  “పై వాడి” దగ్గరే ఉంటాయి, మన చేతుల్లో, చేతల్లో కాదు. కన్నతల్లి ఊరడిల్లడానికి కొంత సమయం పట్టినా, ఆమెకి తాను ఉన్నానని  నిరూపించుకోడంలో తాను విఫలమయాననే అర్థమైంది విజయ్ కి.  పాపం ఆయన కాశీ వెళ్లాలనే కోరిక అలాగే మిగిలిపోయిందని అమ్మ పిన్నితో అనడం విన్నాడు. విజయ్  దుఃఖం పెరిగి కళ్ల వెంట నీరు వచ్చింది.  తండ్రి పోయినందుకు ఇంకా తేరుకోలేదనే అనుకున్నారు అందరూ చూసి.

నిజానికి వారిని కాశీ పంపించ గలిగినా ఎందుకు వాయిదా వేశాడో తెలియదు. భార్య కారణమా? స్వతంత్రంగా  నిర్ణయం తీసు కోలేకపోవడమా? ఈ ఆదాయం అంతా తనదా? వారిదే కదా?  ఎందుకు ఇలా జరిగిపోయిందో తెలియ లేదు. తండ్రి పట్ల తప్పు చేశాననే భావన నించి తప్పించుకోలేక పోయాడు. దీనికి పరిష్కారం ఏమిటి? ఏం చేసి ఈ మథన నించి తప్పించుకో గలడు? రాత్రంతా నిద్రలేమితో గడిపి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. అది ఎవరికీ తెలియకుండా అమలు పరచాలని నిర్ణయించుకున్నాడు. చివరకి తన భార్యకు కూడా.

పరామర్శకు వచ్చిన బంధు మిత్రులందరూ వెళ్ళిపోయాక, మరో రెండ్రోజులాగి  ఆఫీసుకి చేరుకుని మరో పది రోజులకి సెలవు తీసుకుని ఇంటికి చేరాడు. నాలుగయిదు రోజులు ఆఫీసు పని మీద క్యాంప్ కి వెళ్ళాలని ఇంట్లో అందరికీ చెప్పి చిన్న బ్యాగు తో బయలుదేరి బయటికి వచ్చాడు. అక్కడనించీ స్మశానానికి చేరి తన తండ్రి అస్తికలున్న లాకరు నించి వాటిని తీసుకుని సరాసరి ఏర్ పోర్ట్ కి చేరుకున్నాడు.

 

కాశీలో,  తన తండ్రి శిష్యుడు శివాజీ చిరునామా  తెలుసుకుని విషయం తెలిపాడు. మంచి గురువుని పోగొట్టుకున్నానని బాధ పడి, విజయ్ ని  ఓదార్చాడు. ఆతని ద్వారా తన తండ్రికి చేయవలసిన  కర్మలు శాస్త్రోక్తంగా నిర్వహించి, అస్థికలని గంగమ్మ వడిలో నిమజ్జనం చేశాడు. మనసులో బాధ ఎగతన్నుతుంటే, ఏడుస్తూ… తనని మన్నించాలని, గంగాదేవినీ,  తండ్రిని  దర్శనం కోసం పంపించ లేక పోయినందుకు, విశ్వనాధునీ, క్షమించమని ప్రార్థించాడు… రోదించాడు.

సూర్యాస్తమయం అయే వరకూ గంగానది ఒడ్డునే కూర్చుని తనకు తన తండ్రితో ఉన్న జ్నాపకాలు తవ్వుకుని  తండ్రిని తలచుకుని  తనని మన్నించమని, తన తప్పును క్షమించమనీ మరీ మరీ వేడుకున్నాడు. రోదనం నిశ్శబ్దంగా అనుకున్నాడు గానీ శబ్దం తోనే వచ్చింది. చుట్టుపక్కల వారు ఓ సారి చూసుకుంటూ, మన లోకంలో లేడని తెలిసి వెళ్ళి పోయేవారు.  విజయ్ ని వెతుక్కుంటూ వచ్చి అతన్ని గమనించిన శివాజీ, విజయ్ బుజం మీద చెయ్యి వేసి ఊరడిస్తూ “వ్యక్తులు ఉన్నంతవరకు వారి విలువ తెలియదు ఎవరికీ. వారు దూరం అవగానే గతం తరుముకుని గుర్తుకొచ్చి మధనపడుతూండడం సహజమే.  తరువాత పశ్చాత్తాపమూ అంతే సహజం. కానీ ఈ స్వానుభవం తో నయినా మిగిలి ఉన్న  పెద్ద వారిని  జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండడం ఇప్పుడు నీవు చేయవలసిన తక్షణ కర్తవ్యం.  వారితో రోజూ కొద్ది సేపయినా ప్రేమగా మాట్లాడడం, వారి కష్టసుఖాలు

కనుక్కుంటూండం, వారికి నీవున్నామనే సంగతి వారనుకునేలా చేయగలగడం, నీకు మిగిలిన మానవ ప్రయత్నం. అందుకని నీ తల్లి గారిని ఏ లోటూ లేకుండా… నీ తండ్రి గారి పట్ల నువ్వు చెయ్యలేదనుకున్న సాయం, నీ తల్లిగారికి చేసి కొంతయినా పితౄణం తీర్చుకో విజయ్”  అన్నాడు. కొద్ది సేపటికి నెమ్మదిగా ఆశ్రమానికి ఇద్దరూ కలిసి వెళ్ళారు.

కనీసం ఇప్పుడయినా అమ్మని జాగ్రత్త గా చూసుకోవాలనీ, దానినే ఇకనించి ‘పితృయజ్ఞం’ గా చేస్తూండాలని,  (భార్యని ఒప్పించి, …. అవసరం  అయితే ఎదిరించి అయినా సరే తానుగా అమలుపరచాలని) నిర్ణయం తీసుకున్నాడు.    పెద్దవారి పట్ల అనాప్యాయతలు,  అగౌరవాలు కాశి లోనే వదలిపెట్టి తిరుగు ప్రయాణమయ్యాడు విజయ్ మనస్ఠిమితంగా.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *