April 16, 2024

అమ్మమ్మ – 7

రచన: గిరిజ పీసపాటి

అన్నపూర్ణ శాస్త్రుల గారిని ఆశ్రయించిన అమ్మమ్మని వారు మెత్తగా చీవాట్లు పెట్టి ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని అక్షర లక్షలు జపించమనీ, ఎంత త్వరగా జపిస్తే అంత త్వరగా ఫలితం లభిస్తుందనీ, అలా జపించినట్లైతే సుబ్రహ్మణ్య స్వామి కంఠానికి కాటు ఇచ్చిన దానికి సమానమనీ చెప్పి పంపించారు.

ఆ మంత్ర జపం త్వరగా పూర్తి చేయాలని, అహోరాత్రులు జపిస్తే కాని త్వరగా పూర్తవదని గ్రహించిన అమ్మమ్మ ఇంటికి రాగానే తాతయ్యకు, పెద్దన్నయ్యకి, వరలక్ష్మి గారికి (పెద్దన్నయ్య వాళ్ళ అమ్మగారు) విషయం వివరించి నాగ బాధ్యతను వారికి అప్పగించి, మడి కట్టుకుని పూజ గదిలో జపమాల తీసుకుని మంత్ర జపం ప్రారంభించింది. అది మొదలు తిండి, నిద్ర మానేసి కేవలం పాలు మాత్రమే స్వీకరిస్తూ మంత్ర జపం చేయసాగింది.

అలా మూడు పగళ్ళు, మూడు రాత్రులు మంత్రాన్ని జపించగా నాలుగో రోజు తెల్లవారుజామున మంత్ర జపం పూర్తవడంతో కళ్ళు మూసుకుని ఆ స్వామిని ప్రార్ధిస్తూ, క్షమాపణ కోరుకుంటున్న సమయంలో అమ్మమ్మ కళ్ళ ముందు స్వామి ఐదు పడగలతో ప్రత్యక్షమై ‘మొత్తానికి గట్టిదానివే… నా కోపాన్ని నీ మంత్రజపం వల్ల పోగొట్టి, నన్ను ప్రసన్నం చేసుకున్నావు. ఇక నీ బిడ్డకొచ్చిన భయమేమీ లేదు. మీ పిల్లని మీకు ప్రసాదిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి’ అని‌ చెప్పి జరజరా పాకుతూ వెళ్ళిపోవడం స్పష్టంగా కనిపించింది.

ఇక్కడ అమ్మమ్మ జపం చేసుకుంటుండగా – తాతయ్య, పెద్దన్నయ్య, వరలక్ష్మమ్మ గార్లు వేప మండలతో నాగ పొక్కుల మీద రాస్తూ, పది నిముషాలకొకసారి కొద్దిగా హార్లిక్స్/గ్లూకోజ్ నీళ్ళు స్పూన్ తో నాగ గొంతులో పోస్తూ, దురదకి, మంటకి ఏడుస్తున్న నాగని సముదాయిస్తూ తిండి నిద్ర మానుకుని నాగని కనిపెట్టుకుని చూసుకున్నారు.

సరిగ్గా అమ్మమ్మకి నాగేంద్రస్వామి కనిపించి వరమిస్తున్న సమయంలోనే – నాగ పక్కనున్న ముగ్గురికీ మగత కమ్మి‌ నిద్రకీ మెలకువకీ మధ్య స్థితిలో మంచం పక్కన కూర్చునే కళ్ళు మూసుకున్నారు. అప్పుడు ముగ్గరికీ ఒకేసారి ఘల్లు ఘల్లుమంటూ కాలి అందెల చప్పుడు వినిపించి, ఒక స్త్రీ నీడ ఆకారం ఇంట్లోంచి బయటకు వెళ్తూ ‘నేను వెళ్తున్నానర్రా… పిల్లకింకేం పరవాలేదు. ఇక స్నానం చేయించండి. మళ్ళీ పిల్ల మీదికి ఇంకెప్పుడూ రాను’ అన్న మాటలు వినిపించాయి.

ముగ్గురూ ఉలికిపడి ఒక్కసారే కళ్ళు తెరిచి చూడగా ఎవరూ కనిపించలేదు. అప్పుడు ఒకరినొకరు మీకేమైనా మాటలు వినిపించాయా అని అడగ్గా ముగ్గురూ వాళ్ళకు వినిపించిన మాటలు చెప్పుకుని, ముగ్గరికీ ఒకేసారి అదే ఆకారం, మాటలు, అందెల చప్పుడు వినపడడం లాంటి కల రావడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. జపం పూర్తి చేసుకుని పూజ గదిలోంచి బయటకు వచ్చిన అమ్మమ్మ కూడా జపం పూర్తయ్యాక తనకు స్వామి కనిపించిన సంగతి వారికి చెప్పింది.

తెలతెలవారుతుండగా జరిగిన ఈ రెండు సంఘటనలు నిజంగా ఒక అద్భతమే… మానవ మాత్రులకు నమ్మశక్యం కాని విషయమే అయినప్పటికీ ఇవి యదార్ధంగా జరిగిన సంఘటనలు.

తెల్లారేసరికి అప్పటి వరకూ ఇరవై ఒక్క రోజుల పాటు ఎన్ని మందులు వాడినా తగ్గని అమ్మవారి పొక్కులు అన్నీ మాడిపోయి, కొన్ని ఆనవాలు కూడా లేకుండా పోయాయి. వెంటనే నాగకి స్నానం చేయించి, పథ్యం తినిపించాక ఇరవై ఒక్క రోజుల తరువాత నాగ ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోవడంతో మిగిలిన వారు కూడా కాస్త ఎంగిలిపడి కంటినిండా నిద్రపోయారు.

ఈ విధంగా భగవంతుడిని ప్రసన్నం చేసుకుని ఒకవిధంగా చెప్పాలంటే పోరాడి తన బిడ్డను తిరిగి దక్కించుకుంది అమ్మమ్మ. అంతవరకూ తమ ఇళ్ళల్లో నూనె కూడా వాడని తెనాలి నాజర్ పేట వాస్తవ్యులందరూ సాయంత్రం వచ్చి నాగను చూసి – హమ్మయ్య రాజ్యలక్ష్మమ్మ బిడ్డ బతికి బట్టకడుతుందో లేదోనని తెగ బెంగపడ్డాం. ఇక పరవాలేదు. గట్టి పిండమే అని సంతోషంతో నాగను దీవించి వెళ్ళారు.

యముడి కోరల నుండి తప్పించుకుని, బాలారిష్టాలు గట్టెక్కి తిరిగి మునుపటిలా చక్కగా ఆడుకుంటున్న నాగని చూసి అమ్మమ్మ, తాతయ్య మురిసిపోయారు.
తనకి ఆరోగ్యం చిక్కగానే నాగ తిరిగి పెద్దన్నయ్య గారి ఇంటిలోనే మళ్ళీ ఎక్కువ సమయం గడపసాగింది. కానీ రాత్రి సమయంలో మాత్రం అమ్మమ్మ, తాతయ్య తమ దగ్గరే పడుకోపెట్టుకునేవారు.

ఒక్కోసారి మధ్య రాత్రి మెలకువ వస్తే చడి చప్పుడు కాకుండా పెద్దన్నయ్య గారింటికి వెళ్ళి వాళ్ళ పిల్లల మధ్య పడుకునేది నాగ.
నాగకి అనారోగ్యం తగ్గిందనే ఆనందంలో అమ్మమ్మ, తాతయ్య ఉన్న ఆ సమయంలోనే‌ వచ్చింది – వారు బిడ్డ పుట్టిన దగ్గర నుండి తమ చేతుల మీద జరిపించాలని ఎంతగానో తపించిపోతున్న వేడుక. అది నాగ పుట్టిన రోజు వేడుక.

అది ఆశ్వయుజ మాసం. దసరా నవరాత్రులు ప్రారంభమై, ఊరిలోని ప్రతి ఇంటా అమ్మవారి ప్రత్యేక పూజలు, రకరకాల నివేదనలు, బంధుమిత్రుల రాకతో కళకళలాడుతూ సందడిగా ఉన్న రోజులు. వీధుల్లో అమ్మవారు కొలువు దీరిన పందిళ్ళు, పూజలు, వేదపండితుల వేద ఘోషతో, సాక్షత్తూ అమ్మవారే అక్కడ కొలువయ్యరేమోననిపిస్తున్న దుర్గాదేవి ప్రతిమలు చూసి తీరవలసిందే.

ఆంధ్రా పారిస్ గా పిలవబడే తెనాలి వీధులు రాత్రయ్యే సరికి‌ హరికధలు, పౌరాణిక నాటకాలు, శాస్త్రీయ సంగీత కచేరీ, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో కళలకు నెలవుగా ఉండేది. అలాంటి రోజుల్లో విజయదశమి మర్నాడు ఏకాదశి రోజున నాగ పుట్టిన రోజు కావడం అమ్మమ్మ, తాతయ్యలకు ఆ పండుగ మరింత ఉత్సాహాన్నిచ్చింది.

అందుకు కారణం అప్పటి వరకూ తమ బిడ్డ అనుకుని చేరదీస్తేనే ఎక్కడ తమ పిల్ల తమకు దూరమైపోతుందోననే భయం. ఆ భయం వల్లే కనీసం కొత్త గౌను కూడా అప్పటివరకూ కొనలేదు నాగకి. కానీ ఆ పుట్టిన రోజుకి మాత్రం ఇక నాగకి ఏమీ‌ కాదు, గండాలు, బాలారిష్టాలు గడిచిపోయాయి కనుక ఇక తమ బిడ్డకి ఏమీ కాదని నమ్మి ఆ పుట్టిన రోజును చాలా ఘనంగా, వేడుకగా జరపాలని నిశ్చయించుకున్నారు.

ఏకాదశి నాడు ఉదయాన్నే నాగని నిద్ర లేపి మంగళ హారతి ఇచ్చి, బొట్టు పెట్టి, తలకి నూనె పెట్టి, అక్షింతలు వేసి ఒళ్ళంతా వెన్న రాసి, వెన్న వంటికి నలుగు పెట్టి, షీకాయ ఉడికించి రుబ్బి, ఆ ముద్దతో తలంటి, స్నానం చేయించి, జుత్తుకి సాంబ్రాణి పొగ వేసి ఆరాక జడ వేసి, బొట్టు, కాటుక పెట్టి వాళ్ళు వీళ్ళూ ఇచ్చిన బట్టలలో కాస్త శుభ్రమైనవి వేసి నాగను బజారుకి తీసుకెళ్ళారు అమ్మమ్మ, తాతయ్య.

సశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *