March 19, 2024

అనగనగా అక్కడ

రచన: వసంత శ్రీ

అదో అటవీప్రాంతం. సమయం మధ్యాహ్నం మూడు గంటలకే బాగా చీకటి పడి బాగా మబ్బు పట్టి ఉంది వాతావరణం. చీకటి పడేలోపునే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలనుకుంటారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలవారు. సుమారుగా నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతంలో కార్ రిపేర్ రావడంతో చిక్కుకుపోయాడు ఆనందరావు. అతను చాలా పెద్ద పరిశ్రమ నడుపుతున్న పారిశ్రామికవేత్త. సమయం= సంపాదన అనేంత. ఏం చెయ్యాలి ఇప్పుడు? నిజానికి ఇలాటి ఖాళీ సమయాన్ని జీవితంలో మరిచిపోయాడతాను. సంపాదనలో పడి.ఎలాగో ఇక్కడ ఈ రోజుకి ఆగక తప్పదని తెలిసిపోయింది. ఎక్కడ ఉండాలో నిశ్చయించుకోడమే ఇక. కార్ దిగి నడవడం మొదలెట్టాడు. దూరంగా ఏదో భవనం కనబడింది. అక్కడెవరైనా ఉంటే బాగుండు అనుకుంటూ వెళ్ళాడు అటేపు.
చిన్నగా వాన మొదలైంది. లోపల తనలాటి వారు మరో ముగ్గురు కనబడ్డారు. ఈ పరిస్థితులలో ఇంకా ముందుకెళ్ళే సాహసం చేయలేక ఉండిపోయినవారే అని తెలిసింది. వెనక్కెళ్ళి కారుని తీసుకొచ్చి ఆ భవనం ముందు పార్క్ చేసి, కారులోనిoచి సామాను బయటపెట్టాడు ఆనందరావు. మిగతావాళ్ళుకూడా సహాయం చేసారు. ఇలా క్యాంపుల కెళ్ళినప్పుడు ఉండడానికి అవసరమైన సరంజామా అంతా కారులో ఉంది కాబట్టి ఆరాత్రి అక్కడ ఉండడం పెద్ద ఇబ్బంది కాదు.
అదొక పాత కాలపు భవంతి. ఏదో తలదాచుకునేందుకు బాగానే ఉంది. మొబైల్ సిగ్నల్స్ లేవు, కాబట్టి కబుర్లే కాలక్షేపం. పర్వాలేదు మిగతావారు కూడా సంస్కారవంతంగానే కనబడడంతో ఇబ్బందేమీ లేదనిపించింది. బ్రెడ్ తమతో ఉన్న తినుబండారాలను అంతా ఒక చోట చేర్చి, భోజనం లాటిది చేసి, ఆనందరావు తెచ్చిన కంబళీ, దిళ్ళు వేసుకుని అంతా విశ్రమించారు.
ఒకరితో ఒకరు పరిచయాలు ప్రారంభించారు. “నా పేరు తులసీదాసు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని. “చెప్పారు వయసులో అందరికంటే పెద్దవాడు అతను.
రెండో అతను భాస్కర్ . ఆనందరావు వయసు వాడే. నలభై అయిదేళ్ళుంటాయి వారిద్దరికీ. ఇంకొకతను ముప్పై పైన ఉన్నతను పేరు- గోపాల్. అందరికంటే చిన్నవాడు చైతన్య.
మాటల సందర్భంలో అంతా ఒకరికొకరు కొత్తే, కాబట్టి తమ జీవితాలలో మరచిపోలేని సంఘటనలు ఆరోజు చెప్పుకోవాలని నిశ్చయించుకున్నారు.
ముందుగా తులసీదాస్ తన కూతురు గురించి చెప్పడం మొదలుపెట్టేరు. ”మాదో మధ్యతరగతి కుటుంబం. ఆ రోజుల్లో ఆడపిల్ల పుట్టడం అంటే శాపంగా భావించేవాళ్ళం . కాబట్టి నాకు పుట్టిన తొలి సంతానమైన కూతుర్ని పదేళ్లవరకు పెంచా. . నానా తిట్లు తెట్టేవాణ్ణి. తన మొహం చూడాలంటేనే కంపరంగా అనుకునేవాణ్ణి. ఎప్పుడూ మాటలతో హింసించడమే కాక విపరీతంగా కొట్టేవాణ్ణి. ఓసారి మా అత్తగారు వచ్చినప్పుడు ఇలాగే నా భార్యని ఆడపిల్లని కన్నావని తిడుతుంటే జరిగిన గొడవ పెద్దదై . . . మా అత్తగారు ఆ పిల్లని తీసుకెళ్ళిపోయారు. ఆ తరవాత పుట్టిన కొడుకు నాకు సర్వస్వం అయిపోయాడు. నాకో కూతురు పుట్టిందనే మర్చిపోయాను తననసలు నేనెప్పుడూ పట్టించుకోలేదు. వాడికి పదేళ్ళ వయసు వచ్చేసరికి నా భార్య చనిపోవడంతో వేరే పెళ్లి చేసుకున్నా. దాంతో మా అత్తగారింటి వారితో సంబంధాలే తెగిపోయాయి. రెండో ఆమెకి పిల్లలు పుట్టలేదు, వాణ్ణి బాగానే చూసుకునేది తను, వాడు ఇంటర్, ఇంజినీరింగ్, హాస్టల్ లో చదివి ms చెయ్యడానికి అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడి పోయాడు. కొడుకో, కొడుకని నేను గారాబం చేసిన నా కొడుకు నన్ను పట్టించుకోకపోవడం నేను తీరని ద్రోహం చేసానని పశ్చాత్తాప పడుతూ ఉంటాను. ఎక్కడుందో నా కూతురు. క్షమార్పణ కైనా నాకు అర్హత ఉందో లేదో. . “అతని దుఃఖం ఆపతరం కానట్టుంది. కుమిలి, కుమిలి ఏడుస్తున్నారతను.

******************

వాతావరణo చాలా గంభీరంగా మారిపోయింది. మూడ్ తేలిక చెయ్యాలని అంతా ప్రయత్నించారు. తరవాత ఆనందరావు చెప్పడం మొదలుపెట్టాడు. “ఎలాగు ఆడపిల్ల గురించే విషయం కాబట్టి నా జీవితంలో నేను వదిలిన ఆణిముత్యం గురించి చెప్తాను. ’’అంటూ చెప్పసాగాడు. “ఆమె ఎంతో అందమైనది. అణుకువైనది. మాకు తెలిసినవారి ఇంటికొస్తూ ఉండేది. కధల పుస్తకాలు, నవలలూ ఇచ్చి పుచ్చుకోవడంతో మొదలైన పరిచయం. ఒకరినొకరు ఇష్టపడే వరకూ వెళ్ళినా బాగా డబ్బున్న ఇంటి అమ్మాయి సంబంధం రావడంతో ఈమెని సులువుగానే వదిలించేసుకున్నా. కానీ డబ్బున్న ఇంటి పిల్ల కావడంతో నన్ను ఖాతరు చేయని నైజం, ఆ అహంకారం, ఆ డబ్బులో ములిగితేలే లక్షణం.
పిల్లలకి సెలవులిస్తే ఏ స్విట్జర్లాండో వెళ్ళాలి, ఫోటోలు తీసుకోవాలి. అందరికీ చూపించుకోవాలి. అని అనుకుంటుందే తప్ప. . . నేననే వాడిని ఉన్నాననే దృష్టే ఉండదు. ఇంట్లో పండుగలు, వ్రతాలూ ఏమి చేసినా తన హోదా ప్రదర్శించడానికే తప్ప. . అందులో భక్తీ, శ్రద్ధ కనిపించదు. డబ్బుంటే ఏవైనా చేయ్యెచ్చనే ఆ పొగరు భరించలేని నేను ఇలా బయట తిరుగుతూ నా గతాన్ని తలుచుకు బాధపడుతూ ఉంటా. జీవితంలో డబ్బే సర్వస్వం కాదనీ, సున్నితత్వం, భావుకత వంటివి ఇసుమంతైనా తెలియని ఓ మరమనిషి అనాలో ఏమనాలో గానీ. . నా జీవితాన్ని నాశనం చేసుకున్నాననే బాధ పడుతూ ఉంటాను. ”బాధతో ముగించాడు ఆనందరావు.

**************

అంతా నిశ్శబ్దం వారి మనసులలా

ఇక భాస్కర్ వంతు ఇప్పుడు. ”గంభీరమైన గొంతుతో అతను మొదలుపెట్టాడు. నా భార్య గురించే నేను చెప్తాను. పెద్దగా డబ్బులేని కుటుంబం నుంచి వచ్చిన పిల్ల. అందచందాల కంటే గుణం ముఖ్యమంటూ పెద్దవాళ్ళు చేసిన పెళ్లది. నాకు ఫాషన్ గా , డబ్బు బాగా ఉండే సంబంధం చేసుకుంటే బాగుణ్ణనే ఆశ. మాకో బాబు పుట్టాడు. ఏమీలేని ఆమె నాకు కంటికి ఆనలేదు. తిట్టేవాణ్ణి, కొట్టేవాణ్ణి. ఎవ్వరూ లేరని చులకనగా చూసేవాణ్ణి. పిల్లాడికి పాలడబ్బా కొనాలన్నా ఖర్చే అని. నీ వల్లే ఇంత డబ్బు ఖర్చు అయిపోతోందనీ తిట్టేవాణ్ణి. చివరికి ఓ ఉత్తరం రాసి పెట్టి. , బాబుని తీసుకుని. నన్ను విడిచి వెళిపోయింది. పీడా పోయిందని వదిలేసా. ఎవరితోనో లేచిపోయిందని పుకార్లు పుట్టించా కూడా. తరవాత డబ్బున్న ఇంటి పిల్లని రెండో పెళ్లి చేసుకున్నా. కానీ అదేంటో రెండో ఆమెతో కూడా హాయిగా ఉండలేపోయేవాణ్ణి. నన్ను శపించిందేమో ఆమె! తనతోనే నా సంతోషం వెళ్ళిపోయినట్టైంది. ఆమె ఎంత సౌమ్యురాలో. ఉత్తిపుణ్యానికి నానా మాటలు ఆడేవాణ్ణి. నా జీవితంలోనించి వసంతం నడిచి వెళ్ళిపోయిందనిపిస్తుంది. ఇక పిల్లలు పుట్టలేదు మాకు.

అందరికంటే చిన్నవాడైన చైతన్య. ఏం చెప్తాడా అని అంతా ఎదురు చూస్తుండగా . . మొదలుపెట్టాడు. ”మా అమ్మ . . కధల్లో నూ చెప్పుకుందుకూ అమ్మ అంటే గొప్పగా చెప్పుకుంటారు కానీ. . అమ్మతో ఎవరూ బాగా ప్రవర్తించరేమో! నన్ను చాలా ముద్దుగా పెంచుకుంది అమ్మ. నేనే సరిగ్గా పెరగలేదు అనుకుంటా. మా నాన్న నన్ను వదిలి వెళ్లిపోయినా జాకెట్లు కుడుతూ నన్ను పెంచుతూ, డిగ్రీ ప్రైవేట్ గా చదివి, తర్వాత B.ed చేసి టీచర్ ఉద్యోగం సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మన్నన పొందిన అమ్మకి నేనో భరించరాని భారాన్నే అయాను. నాకు తెలుసు నేను చాలా అల్లరి చిల్లరిగా తిరిగే జులాయిలా అమ్మకు చెడ్డ పేరు తెస్తున్నానని. కానీ మారాలనుకోలేదు నేను.
ఎప్పుడూ విసిగించేవాడిని. . ఎన్ని విధాల చెప్పి చూసినా. . పట్టించుకునేవాణ్ణి కాదు. అతికష్టం మీద డిగ్రీ పాసయాను. ఈలోగా అమ్మకి కేన్సర్ అని తెలిసింది. ఇప్పుడిప్పుడే జీవితం అందులోని లోతులూ అర్ధం అవడం మొదలయాయి. అమ్మకి మంచి వైద్యం చేయించాలని, నాకున్న ఒకేఒక్క అండ మా అమ్మని బ్రతికించుకుని, బాగా చూసుకోవాలని ఈ మధ్యే ఉద్యోగంలో చేరాను. ” చెప్పడం ఆపి కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు చైతన్య.
మిగతా అంతా భుజం తట్టి ఓదార్చారు. తెలతెల వారుతోంది. ఇంక ప్రతీ ఒక్కరూ అక్కడి నుండి బయటపడే ఆలోచనతో బయల్దేరారు.
వారెవ్వరికీ తెలియని విషయం ఏంటంటే-తులసి దాసు గారి అమ్మాయి, ఆనందరావు ప్రియురాలు, భాస్కర్ భార్య, చైతన్య తల్లి ఒక్కరే అని.
ఆమె-విధివంచిత. .

30 thoughts on “అనగనగా అక్కడ

  1. చాలా బాగా వ్రాసారు మీ శైలి బాగుంది మీ ఇతివృత్తం లో మానవ సంబంధాలు ఉన్నాయి అవి మనలని వదలి పోవు. మీ కధనం లో అంతర్లీనం గా humour ని చొప్పిస్తే అందరం నవ్వుకుంటాం కదా !

    1. మీ సలహాకు ధన్యవాదాలు అండీ.
      అలాగే ఈసారి తప్పక పాటిస్తా

    2. మీ సూచనకు ధన్యవాదాలు. అలాగేనండీ.
      ఈసారి తప్పక పాటిస్తా

  2. జీవితంలో స్త్రీకి బాల్యం, కౌమారం, యవ్వనం, ప్రౌఢం మొదలైన దశల్లో తారసపడే పురుషులు తండ్రి, ప్రేమికుడు, భర్త, పుత్రుడు అనే విధంగా కథను నాలుగు భాగాలుగా వర్గీకరించి, వారిద్వారా ఒక స్త్రీకి జరిగిన అన్యాయం, దానికి వారు వెలిబుచ్చిన పశ్చాత్తాపంతో ఆమెనువిధివంచితగా చూపించారు. పశ్చాత్తాపం చెందినవారు ప్రయోజకులైన పురుషులు. ఆమెకు సహాయం చేయాలని పూనుకుంటే చేయగలరు. ఆమె గురించి ఆరా తీయాలని త్రికరణ శుద్ధిగా ప్ర యత్నిస్తే ఆమె ఉనికిని వెలికితీయటం వారికి పెద్ద కష్టం కూడా కాదు. ఆరకంగా ఆలోచించి ఆమెను విధి వంచితగా కాక విజేతగా చిత్రించి రెండో భాగం రాయండి. ఒక పాత్ర చిత్రీకరణ వేరే పాత్రల కధనం ద్వారా చెప్పడం బావుంది. మిగిలిన భాగం ఉందనే విధంగా ఈ కధనం ముగిసింది. దాన్ని మరింత పగడ్బందీగా చెప్పి రెండో భాగం వ్రాయండి. అభినందనలు.

    1. మీ సలహాకు ధన్యవాదాలు అండీ.
      అలాగే ఈసారి తప్పక పాటిస్తా

    1. మీ సూచనకు ధన్యవాదాలు. అలాగేనండీ.
      ఈసారి తప్పక పాటిస్తా

  3. బాగా రాశారండీ. కథనం లో వేగం ఉంది. చదివించే గుణం ఉంది. ఊహించని మలుపు తో కూడిన ముగింపు వల్ల కథ మరింతగా రక్తి కట్టింది. వివిధరకాల ,మనుషులనూ, మానసిక స్థితులనూ లోతుగా అధ్యయనం చేసి రాశారని తెలుస్తోంది. అభినందనలు. రాస్తూ ఉండండి.

  4. చాలా బాగుంది కధ.. పాపం చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఆ తల్లికి.. తండ్రి చేసింది తప్పు, ప్రేమించిన వాడు చేసింది తప్పు, కట్టుకున్న భర్త అర్ధం చేసుకోలేదు… అయినా కష్టపడి కొడుకుని పెంచుకుంది.. చివరిలో ఫోటో ఏమైనా చూసి వాళ్ళకి అందరూ చెప్పేది ఒకరి గురించే అని తెలిసినా ఆ తండ్రి తప్ప ఇంకెవరు ఆమెని చేరదీసే అవకాశం కూడా లేదు.

  5. సూపర్ వసంత గారు ఎంతో బాగా రాసారు mainly మగవారు ఎక్కువమంది ఏ తప్పు చెయ్యి వారినే తిడతారు చెడ్డ ఆడవారిని మాత్రం చాలా భరిస్తారు ఇది ఒక nature ఐపోయ్యింది వారికి అడిగిన వారిని అంతకంటే తిడతారు ఏ యుగంలోనూ వీరిలో మార్పు ఎందుకు రెఢీ ఎంటా ఆరెనేస్ ఉన్నా కూడా నిజముగా మీ లాస్ట్ లైన్ లా విధి విలాసమెనా ఏమో ofcourse ఆడవారు కూడా మంచి మగవారిని ఇష్టపడరు ప్చ్ కలికాలమా

    1. మీ సలహాకు ధన్యవాదాలు అండీ.
      అలాగే ఈసారి తప్పక పాటిస్తా

  6. చాలా బావుంది వసంతశ్రీ గారు.టైటిల్ కూడా అతికినట్లు సరిపోయింది.

  7. వసంతా చాలా చక్కగా రాసారు..స్త్రీ కీ కూతురిగా ప్రియురాలిగా భార్యగా తల్లిగా ఎక్కడా విలువ లేదు ….మగవాడు ఏస్దానంలో వున్నా ఆమెకి అన్యాయమే జరిగింది… కానీ ఈకధ ఈ కాలానికి అన్వయించలేమేమో ఈ కాలంలో స్త్రీ తన విలువ తాను తెలుసుకుంది ..అన్యాయం ని ప్రతిఘటించే స్దాయికి వచ్చిందనే నా వుద్దేశం ..ఏమైనా వసంతా చాలా బాగా రాసారు …మీలో గొప్ప రచయిత్రి వుంది ..మీరింకా ఎన్నో కధలు రాయాలని నా అభిమతం…

  8. ఆ నలుగురూ చెప్పిన ఆమె వేరు కాదు, ఒకరే అని ఊహించ వచ్చు. కాని, ఈ నెరేషన్ లో ప్రత్యేకత ఏమిటంటే, వేరు వేరు అయినా ఆమె ఉనికి పరంగా ఒకరే … ఎందుకంటే ఆమె స్త్రీ.
    రచయిత్రి కి అభినందనలు.

  9. చాలా బాగుంది వసంత శ్రీ మీ కధ. అయిదుగురు మగ మనస్తత్వాల మధ్య ఒకే స్త్రీ ని కేంద్రబిందువుని చేస్తూ చక్కని కధ అల్లారు. చివరలో వారి జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసిన వ్యక్తి ఒకే స్త్రీ అవడం భలే బాగా వ్రాసారు. గోపాల్ ను అలా వదిలేయడంలో మీ ఉద్దేశ్యం ? గోపాల్ కి ఆ స్త్రీతో ఏ రకంగానూ సంబంధంలేదా ? జస్ట్ అనుమానం సుమా ! అతని విషయంలో కూడా చిన్న ట్విస్ట్ ఇవ్వాల్సింది. ఇకపోతే . సమాజంలో స్త్రీ ఎప్పుడూ విధివంచితురాలే. రోజులు మారాయి, అదివరకులాగ కాదని అంటున్నా, సమయం వచ్చినప్పుడు విధి ముందు తలవంచాల్సిన పరిస్థితే అప్పుడూ ఇప్పుడు కూడా. చక్కని ఇతివృత్తాన్ని కథాంశంగా తీసుకుని నేటి సామాజిక స్థితిగతులను తెలియచెప్పే కధ వ్రాయడం అభినందనీయం. మీ ఆలోచన మెచ్చుకోతగ్గది. పరిణితి చెందినట్లు వ్రాసారు. ఇలాగే వ్రాస్తూ ఉండండి ! అభినందనలు !

  10. చాలా బాగా రాశారు… చివరిలో మీరు చెప్పిన వారందరికి తెలియని నిజం… ఎప్పటికి వాస్తవమే… ఆడపిల్ల, ప్రేయసి, భార్య, అమ్మ ఇలా అన్ని పాత్రల్లో మెాసపోయింది, నష్టపోయింది… చివరకు విధాత కూడ మగవాడే అని ఆ బుద్ధి మారదని బుుజువు చేసిన స్త్రీల కథ …
    అభినందనలు… చాలా చక్కగా రాశారు

    1. మంజుగారు చక్కగా చెప్పారు.ధన్యవాదాలు మీ స్పందనకు

  11. చాలా క్రొత్త అంశం,చాలా మంచి థీమ్ తో చక్కగా వుంది కధ వసంతా ! పేరు కూడా చాలా బాగుంది కధకు తగ్గ పేరు ‘విథివంచిత ‘ సరిగ్గా సరిపోయింది . గాని ఎన్నాళ్ళయినా మానవ థృక్పదంలో మార్పు రావడం లేదు . అదే బాధాకరం .అభినందనలు నీకు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *