April 26, 2024

అమ్మమ్మ – 14

రచన: గిరిజ పీసపాటి

 

 

“నేను ఈ రోజు రాత్రి ఈ గుడిలో నిద్ర చేయాలని వచ్చాను. రేపటికి ముప్పై రోజులు ఆయన నాకు దూరమై. త్వరలోనే నాగని చూడడానికి వెళ్ళాలి. ఎక్కడా నిద్ర చెయ్యకుండా వియ్యాలవారింటికి ఎలా వెళ్తాను? అందుకే మీరు దయతలచి ఈ ఒక్క రాత్రి నన్ను గుడిలో ఉండనిస్తే రేపు ఉదయం వెళ్ళిపోతాను. కాదనకండి బాబూ!” అని వేడుకుంది అమ్మమ్మ.

అమ్మమ్మ మాటలకు చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ “మనుషులు ఆదరించకపోవడంతో భగవంతుని సన్నిధిలో నిద్ర చేయడానికి వచ్చావా తల్లీ! కానీ, గుడి బయట తాళం వెయ్యకపోతే…” అంటూ సందిగ్ధంగా ఆపేసారు ఆయన.

“మీరు బయట తాళం వేసుకుని వెళ్ళండి స్వామీ! నన్ను మాత్రం ఈ రాత్రికి లోపల ఉండనిస్తే చాలు” అన్న అమ్మమ్మ మాటలకు అడ్డొస్తూ…

“రాత్రంతా ఒక్కదానినే ఉండగలవా అమ్మా!” అని అడిగారు.

“ఉండగలను స్వామీ! ఏ దిక్కూ లేని నాకు దేవుడే దిక్కు. ఆయన సన్నిధిలో ఉంటాను. ఇంకెందుకు భయం! మీరు నిశ్చింతగా బయట తాళం వేసుకుని వెళ్ళొచ్చు. నా గురించి దిగులు పడకండి” అంది.

ఆయన బాధపడుతూ అమ్మమ్మను లోపల ఉంచి, సింహద్వారానికి తాళం వేసుకుని వెళ్ళిపోయాక, తను తెచ్చుకున్న రెండు అరటిపళ్ళు తిని, నూతిలోని నీరు తాగి, బట్టల మూటలోంచి ఒక పంచె తీసి గుడి మండపంలో గచ్చు నేల మీద పరచుకుని పడుకుంది అమ్మమ్మ.

నడుమైతే వాల్చింది కానీ, నిద్ర పట్టక భవిష్యత్తు గురించి, నాగ గురించి ఆలోచిస్తూ రాత్రంతా గడిపేసింది. తొలికోడి కుయ్యగానే నూతి దగ్గరే  దంతావధానం కానిచ్చి, స్నానం చేసి, తడి పంచెను చెట్ల కొమ్మలకు ముడివేసి ఆరేసుకుని, జపం చేసుకోసాగింది.

ఉదయం ఏడు గంటలకు పూజారి గారు వచ్చాక, దేవుడిని కడగడానికి నీళ్ళు తోడి అందించి, గర్భగుడిలోని నేలంతా ఊడ్చి, కడిగి, ముగ్గులు పెట్టి, స్వామి సన్నిధిలో కాసేపు గడిపాక పూజారిగారికి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకుని ఇంటి ముఖం పట్టింది.

గుమ్మంలోనే అమ్మమ్మ రాక కోసం ఎదురుచూస్తున్న వరలక్ష్మమ్మ గారు “వచ్చావా అమ్మా! నీ కోసమే ఎదురు చూస్తున్నాను. కాఫీ ఇస్తాను. ఈలోగా కాళ్ళూ చేతులూ కడుక్కో” అంటూ పలకరిస్తే, తల పంకిస్తూ, తడిపొడిగా ఉన్న బట్టలను దండెం మీద ఆరేసి, నీళ్ళ తొట్టె దగ్గర కాళ్ళూ చేతులు కడుక్కుని, తన గదిలోకి వెళ్ళిపోయింది.

వరలక్ష్మమ్మ గారు అమ్మమ్మకి కాఫీ ఇచ్చి “ఇవాళ ఎలాగూ మంచిరోజు. ఒకమారు ఇంట్లో కాలుపెడుదువు గాని రామ్మా!” అనగానే మారు మాట్లాడకుండా ఆవిడ వెంట వాళ్ళింటిలో అడుగు పెట్టింది. “మధ్యాహ్నం నీ భోజనం ఇక్కడే” అని ఆవిడ చెప్పడంతో సరేనంది.

అమ్మమ్మ గుడిలో నిద్ర చేసి వచ్చిన విషయం క్షణాల మీద అందరికీ తెలిసి, ఇరుగు పొరుగు అందరూ ఒకరి తరువాత ఒకరు తమ ఇంటికి తీసుకెళ్ళారు. ఎవరింట్లోనూ పది నిముషాల కన్నా ఉండలేదు అమ్మమ్మ. తిరిగి వరలక్ష్మమ్మ గారి ఇంటికి వచ్చేసింది. సాయంత్రం తిరిగి తన గదికి చేరుకుంది.

తాతయ్య చనిపోయే ముందే హైదరాబాదులో ఉంటున్న తన మేనల్లుడి ఇంటికి వెళ్ళిన డా. రాజేశ్వరమ్మ గారు కూడా ముందు రోజు రాత్రే తెనాలి తిరిగి రావడంతో, జరిగిన విషయం తెలిసి అదేరోజు అమ్మమ్మను చూడడానికి వచ్చారు.

నాగ కడుపులో పడినప్పటి నుండి, నాగ పుట్టాక కూడా నెలరోజుల వరకూ అమ్మమ్మకు మందులు ఇస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినాల్సిన ఆహారం ఇలా ఎన్నో విషయాలలో సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ పది నెలల కాలంలో ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళయారు.

అందుకే తన స్నేహితురాలు భర్తను పోగొట్టుకున్నదని తెలియగానే వెంటనే అమ్మమ్మను చూడడానికి వచ్చారు ఆవిడ. మాటల సందర్భంలో ‘తనకు పొట్టపోసుకోవడానికి ఏదైనా పని చూడమని’ చెప్పింది అమ్మమ్మ.

“ఏనాడూ భర్త లేకుండా బయటకు రాని మీరు ఏం పని చేస్తారు రాజ్యలక్ష్మీ!” అంటూ ఆవేదనగా అడిగి‌న రాజేశ్వరమ్మ గారితో “నేను పుట్టిన, మెట్టిన వంశాలకు తలవొంపులు రానివ్వని పని ఏదైనా చేస్తాను. పాచి పనైనా పరవాలేదు” అన్న అమ్మమ్మతో “సరే! నేను తప్పకుండా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను” అని మాటిచ్చారు రాజేశ్వరమ్మ గారు.

మూడు రోజుల్లోనే మళ్ళీ వచ్చిన రాజేశ్వరమ్మ గారు “రాజ్యలక్ష్మి గారూ! మీరు ఏమీ అనుకోకపోతే… మీ గౌరవానికి తగ్గ పని కాదు కానీ, ప్రస్తుతం మీ ఇబ్బంది గట్టెక్కాలంటే… నాకు తెలిసిన వాళ్లకు రెండు పూటలా వంట చేసి పెట్టడానికి బ్రాహ్మణ స్త్రీ కోసం చూస్తున్నారు. మీరు చాలా రుచిగా వండుతారు కనుక, మీకు అభ్యంతరం లేకపోతే… మీ గురించి వారికి చెప్తాను” అన్నారు.

అమ్మమ్మ నిముషం కూడా ఆలోచించకుండా అంగీకరించింది. “సరే అయితే. రేపు ఉదయం ఏడు గంటలకు మా ఇంటికి వచ్చేయండి. వాళ్ళ ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్తాను” అని చెప్పి వెళ్ళిపోయారు రాజేశ్వరమ్మ గారు.

మర్నాడు ఉదయం స్నానం, జపం పూర్తి చేసుకుని పావుతక్కువ ఏడింటికల్లా రాజేశ్వరమ్మ గారి ఇంటికి వెళ్ళింది అమ్మమ్మ. ఆవిడ అమ్మమ్మను ఒక వృధ్ధ దంపతుల ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేసి, అమ్మమ్మ పరిస్థితి వివరించారు.

వారి పిల్లలు ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలలో ఉండడంతో వీరిద్దరే తెనాలిలో ఉంటున్నారు. ఆవిడ అనారోగ్యం కారణంగా వండుకోలేక వంట మనిషి కోసం వెతుకుతున్నారుట. అమ్మమ్మ వాళ్లకు బాగా నచ్చడం, రాజేశ్వరమ్మ గారి పట్ల వారికున్న నమ్మకం కారణంగా వాళ్ళు వెంటనే అంగీకరించారు.

ఆరోజే పనిలో చేరిపోయింది అమ్మమ్మ. వారం రోజులలోనే తన చేతి వంటతో, మంచి మనసుతో వారి అభిమానాన్ని చూరగొంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా వెళ్ళి వాళ్ళకు వండి పెట్టి, ఇంటికి వచ్చాక మళ్ళీ మడి కట్టుకుని తనకు వండుకునేది.

”ఎలాగూ ఉండేది మేమిద్దరమే కదా! నువ్వు కూడా పిడికెడు మెతుకులు ఇక్కడే తినెయ్యొచ్చు కదా!” అన్నా వద్దని సున్నితంగా తిరస్కరించేది. ‘తను పనిలో చేరినప్పుడు జీతం మాత్రమే మాట్లాడుకుంది.  తనకు భోజనం పెట్టడం అనేది అప్పుడు మాట్లాడుకోలేదు. కనుక ఇప్పుడు అయాచితంగా వచ్చింది కదా అని తినలేదు’ అనుకుంది అమ్మమ్మ. ఇది ఆవిడ వ్యక్తిత్వానికి ఒక ఉదాహరణ మాత్రమే.

మేరు పర్వతమంత వ్యక్తిత్వం ఆవిడ సొంతం. తరువాతి కాలంలో ఆవిడ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఎన్నో సంఘటనలు మన కళ్ళముందుకు రాబోతున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో ఒకరోజు పీసపాటి తాతయ్య దగ్గర నుండి వచ్చింది. ఉత్తరం చదివిన అమ్మమ్మ నిశ్చేష్టురాలైపోయింది.

****** సశేషం ******

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *