May 25, 2024

చంద్రోదయం – 5

రచన: మన్నెం శారద

బలమైన తిండితో అతని ఛాతీ వెడల్పయింది. కళ్ళు ఆరోగ్యంగా మెరుస్తున్నాయి. వతైన అతని వుంగారాల క్రాపు చూస్తే శేఖరానికి అసూయ కలుగుతోంది!
“నువ్వెటునుంచి వస్తున్నావు?” అన్నాడొకరోజు శేఖర్, సీరియస్ గా.
“అంటే?” సారధి ఆశ్చర్యంగా అడిగేడు.
“అదే, ఆఫీసునుండి ఏ దారిన వస్తున్నావు? వుమెన్సు కాలేజీ రూటేనా?”
“అవును,” సారధి అర్థం కానట్లు చూసేడు.
శేఖర్ సీరియస్ గా మంచమ్మీద నుంచి లేచి కూర్చున్నాడు.
“నువ్వటే ఎందుకొస్తున్నావో తెలుసుకోవచ్చా?”
“అదిదగ్గర దారి కాబట్టి”
“కాదు, నువ్వు అమ్మాయిలకి ఫోజులు కొట్టడానికి మాత్రమే అటోస్తున్నావని నా వుద్దేశ్యము.”
సారధి పక పకా నవ్వేసేడు. “మైడియర్ ఫ్రెండ్ నేను వచ్చేటప్పుడు టైమెంతో తెలుసా? రాత్రి పదిగంటలు! నేను నైట్ కాలేజినుంచి వచ్చేటప్పటికి నా కోసం అమ్మాయిలు కాదు – దయ్యాలు కూడ వుండవు.”
శేఖర్ కూడ నవ్వేస్తూ “పోనీ మీ కాలేజీలో ఐ మీన్ అమ్మాయిలు వున్నారా?”
“ఉన్నారు”
“వాళ్ళు నీవంక చూస్తారా?”
“చూస్తారు”
శేఖర్ కేసు పట్టుకున్నానని గర్వంగా ఫోజు పెట్టాడు.
“చూసి నవ్వుతారా?”
“ఆఁ!”
“అయితే నువ్వు . . .ఏం చేస్తావు?
“ఏం చేస్తాను? నేనూ నవ్వుతాను.”
“అంటే. . . అంటే నువ్వు దార్లో పడుతున్నావన్న మాట!”
“ఖర్మ! వాళ్ళేం టీనేజ్ గర్ల్స్ కాదు తండ్రి! అందరూ పెళ్ళయి పిల్లలున్న వాళ్ళే! ఉద్యోగాలు చేస్తూ చదువుకొంటున్నారు. మాది నైట్ కాలేజీ అన్న విషయం నువ్వు గుర్తుంచుకోవాలి.”
శేఖర్ మాట్లాడకుండా ఆలోచిస్తున్నాడు.
“ఇందాకటినుండి నన్ను తెగ క్రాస్ చేస్తున్నావు! నీ సంగతి చెప్పు! మీ ఆఫీసులో ఏదైనా.. వ్యవహారం .. సందేహంగా అడిగాడు సారధి
“ఛీ! ఛీ! ఛీ!” అనేశాడు శేఖర్ కంగారుగా.
“ఏం, నీ విషయమైతే అంతకంగారు దేనికి నీకూ పెళ్ళి కాలేదుగా! పైగా డబ్బున్న వాడివి! నిన్నే అమ్మాయిలు ఎక్కువగా ప్రేమించే అవకాశం వుంది!”
బదులుగా శేఖర్ సారధిని అద్దం దగ్గరికి లాక్కెళ్ళేడు.
సారధికి అర్ధం కాలేదు.
“చూడు! ఆ వత్తయిన క్రాపు, చురుకయిన కళ్ళు వెడల్పయిన ఛాతీ, ఆ కట్స్ రియల్లీ హౌ మాన్లీ, యూ ఆర్! ఆడది డబ్బుని కాదురా ప్రేమించేది! ఈ అందాన్ని” అన్నాడు నవ్వుతూ.
సారధి ఆ మాటలకి తెగ సిగ్గుపడిపోయేడు. సిగ్గుపడుతున్న సారధిని చూసి శేఖర్ పడీ పడీ నవ్వేడు.
* * *
శేఖర్ వూరెళ్ళి నాల్గురోజులయింది.
సారధికి తోచటం కష్టంగావుంది.
రాత్రి పూట అతనితో కబుర్లు చెప్పందే అతనికి తోచదు.
అందులో ఆ రోజు ఆదివారం…టైం గడపటం చాలా కష్టంగా వుంది.
తోచక సారధి సినిమాకి బయల్దేరేడు.
కాని హాలు దగ్గర రద్దీ చూస్తే … అతనికి టిక్కెట్టు దొరుకుతుందనే నమ్మకం కుదరలేదు.
లేడీస్ క్యూ కొద్దిగా ఫర్వాలేదు!
ఉన్న వాళ్ళు చాలావరకూ స్టూడెంట్సే! అడిగి చూస్తే…? అనుకున్నాడు సారధి. సారధి క్యూ చుట్టూ తిరిగేడు.
“గురుడు టిక్కెట్టు కోసం అవస్థపడుతున్నాడు.” ఓ పిల్ల వంకరగా నవ్వింది. సారధి ఆ మాటల్ని పట్టించుకోకుండా క్యూ కేసి చూశాడు.
అక్కడ కౌంటర్ కి కాస్త దగ్గరలోవున్న తెల్లచీర అమ్మాయిని చూస్తే తన పని అవుతుందనిపించింది సారధికి.
“మేడమ్! నాకు ఓ టిక్కెటు తీస్తారా?” అడిగేడు.
ఆ అమ్మాయి ఏదో చెప్పబోయేంతలో “స్వాతీ, డోంట్ టేక్!” అంటూ అరిచింది. రెండు జడల బెల్ బాటమ్ ఆమ్మాయి.
“టిక్కెట్టు తీస్తే మన మధ్య బైఠాయించొచ్చని చూస్తున్నాడు పాపం!” అందో రెండు జడలగుర్రం.
“పాపం! ఆడవాళ్ళ అవసరం ఇలాంటప్పుడు తెలుస్తుంది మగవాళ్ళకి!” అందో షల్వార్ కమీజు-కుర్తా.
ఆ అమ్మాయి ఓ క్షణం వీళ్ళ వంక ఆదోలా చూసి “ఇవ్వండి” అంటూ సారధి దగ్గర పదిరూపాయల నోటు అందుకొంది.
ఆ వెంటనే “అలాస్” అరుపులు, గాఢమైన నిట్టూర్పులు తలకొట్టుకోవటాలు చూసి నవ్వుకున్నాడు సారధి.
“ఈ స్వాతి ఎప్పుడూ యింతే! టూ మైల్డ్! దాన్ని బుకింగ్ లో నిలబెట్టటం మనదే తప్పు!” జరగరానిది జరిగినట్లు అరుస్తుందో లేగదూడలాంటి ఓణి వేసుకున్న పిల్ల.
సారధి నవ్వునాపుకుంటూ ఓపక్కకి నిలబడ్డాడు.
మరి కాస్సేపటిలో బుకింగ్ తెరిచేరు.
“ఇదిగోండి” ఆ అమ్మాయి టిక్కెటు, మిగతా చిల్లర అందించింది.
సారధి “థాంక్స్” చెప్పి హాల్లోకి నడిచి నెంబరు చూసుకు కూర్చున్నాడు. లైట్లు ఆఫ్ అయ్యేయి.
అమ్మాయిలంతా బిలబిలలాడుతూ .. పాప్ కారన్ పొట్లాలు, చిక్కిలు పట్టుకొని వచ్చి గొడవ గొడవ చేస్తూ నెంబర్లు చూస్తూ కూర్చుంటున్నారు.
“అమ్మో! నేనిక్కడ ఛస్తే కూర్చోను!” బెల్ బాటమ్ సారధి పక్కసీట్లోంచి ఎగిరపడి లేచి అరిచింది.
“ఏమయింది?” అందో అమ్మాయి.
ఆ అమ్మాయి సారథిని చూపించింది.
“ఎవరో ఒకళ్ళు కూర్చోండి ” ఓ అమ్మాయి గదిమింది.
“ఆ స్వాతినే కూర్చోమనండి! చేసిందిగా ఘనకార్యం!” మరో అమ్మాయి గట్టిగా అంది.
సారధికిదంతా అర్థం కాలేదు. “ఆ అమ్మాయిలింతగా. బాధపడవల్సిన విషయం ఏం జరిగిందని? తనేం కాని పని చేశాడు? తన పక్కన కూర్చుంటేనే మైలపడిపోతారా? డిగ్రీలు వెలగ బెడుతూ-టైట్ దుస్తులు వేసుకోని శరీర ప్రదర్శన చేస్తూ మగవాణ్ణి ఎన్నడూ చూడనట్లు – ఆ గాలి సోకనట్లు… ఓహ్!” సారధికి చాలా చిరాకని పించింది.
“లేచి వెళ్ళిపోదామా” అనుకున్నాడో క్షణం.
“నేను కూర్చుంటాను, అల్లరి చేయకండి.” స్వాతి అతని ప్రక్కకి వచ్చి కూర్చోడంలో ఆ గొడవ సద్దు మణిగింది.
“థాంక్స్! నేను వెళ్ళిపోదామనుకున్నాను” అన్నాడు సారధి నెమ్మదిగా
ఇంకా వుంది…

1 thought on “చంద్రోదయం – 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *