May 19, 2024

మల్లేష్

రచన – డా. లక్ష్మీ రాఘవ

బస్టాండు లో బెంగళూరు బస్సుకోసం చూస్తూ వున్నాడు దినేష్. అప్పుడే ఒక డీలక్స్ బస్ వెళ్లి పోయిందట. ఒక పదినిముషాలలో ఆర్డినరీ బస్సు వచ్చింది. ఏదో ఒకటి‘ అనుకుంటూ ఎక్క బోయాడు అతన్ని తోసుకుంటూ “అన్నా ఒక్క నిముషం“ అంటూ లోపలకు దూరిన 12 ఏళ్ల కుర్రాడిని చూసాడు దినేష్. ఒక నిముషంలో లోపలకు దూసుకుపోయి మధ్యగా వున్నఒక సీట్ లో కూర్చున్నాడు ఆ పిల్లాడు. బస్సు ఎక్కాక దినేష్ బ్యాక్ ప్యాక్ తీస్తూ వుంటే “అన్నా, ఇక్కడకు రా…” అని పిలిచాడు. ఆ సీట్ చూసి బాగానే వుంటుంది అనుకుంటూ అక్కడకు నడిచాడు దినేష్.
ఆ కుర్రాడు విండో సీట్ దగ్గరికి జరిగి పక్కన సీట్ లో కూర్చోమని చేయి ఊపాడు. బ్యాక్ ప్యాక్ పైన పెట్టబోతే “వద్దు అన్నా నా కాళ్ళ దగ్గర పెట్టు. ప్లేస్ వుంది అని ముందు వున్న ఖాళీ ని చూపాడు. సాదారణం గా బస్సులో బాగా నిద్రబోయే అలవాటు వున్న దినేష్ బ్యాక్ ప్యాక్ కాళ్ళ మధ్యన పెట్టుకుంటాడు ఎందుకంటే తన ఫ్రెండు ఒకసారి పైన పెడితే ఎవరో దొంగలు కొట్టేశారు. కూర్చుని కాస్త సెటిల్ అవగానే కండక్టర్ వచ్చి టికెట్స్ ఇచ్చాడు.
అప్పుడు అడిగాడు పక్కన అబ్బాయి దినేష్ చేతిలో వున్న వాచీ ని చూస్తూ ”స్మార్ట్ వాచ్ కదన్నా.”
“అవునని” తలవూపాడు దినేష్.
“ఈ వాచీ వాకింగ్ చేస్తే ఎంత నడిచావో చెప్పుతుంది కదా? దీనిలో పోను కూడా చేసుకోవచ్చా అన్నా?” ఆసక్తిగా అడుగుతున్నాడు.“లేదు బాబూ. ఫోను చేసుకునే వాచ్ కావాలంటే కొన్ని వేలు పెట్టాలి”.
మెల్లిగా తన ఎడమ చెయ్యి చూపుతూ “నాది కూడా నీ వాచీ లాగే వుంది కదన్నా..కానీ టైం మాత్రమె చెబుతుంది…”అని నవ్వాడు.
నిజమే గమనిస్తే తన వాచ్ లాగే వుంది.”ఎంతకు కొన్నావు ?”
“నేను కొనలా అన్నా, మా అక్క ఇచ్చింది. ఇది నూరు రూపాయలు అంతే “అని నవ్వాడు.
“మీ అక్కా వాళ్ళు బెంగళూరు లో ఉంటారా?”
“మా అమ్మా, నాయనా కూడా అక్కడే వుంటారు, బిల్డింగ్ పనికని మావూరు విడిచి వెళ్ళినారు. అక్క కూడా వాళ్ళతోనే వుంటుంది కానీ చదువుకు౦టా వుంది. నేను మా అమ్మమ్మ దగ్గర వుంటాను. వూరిలో అయితే ఖర్చు తక్కువ కదా. పైగా మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు. ప్రతి శనివారం బెంగళూర్ కి వెళ్లి మా వాళ్ళని చూసి వస్తాను.’
“అవునా ?”
“నేను ఎప్పుడూ ఈ బస్ మాత్రమే ఎక్కుతా ..ఎందుకంటే ఎక్స్ ప్రెస్ అయితే డబ్బులు ఎక్కువతీసుకుంటాడు. “
“ఎక్కడ దిగుతావు?
“టిన్ ఫ్యాక్టరీ దగ్గర దిగుతాను…అక్కడ నుండీ ఇంకో బస్సు తీసుకోవాల“
“నేను కూడా టిన్ ఫ్యాక్టరీ దగ్గరే దిగాలి…”అని చెప్పి దినేష్ కళ్ళు మూసుకుని నిద్రకు ఉపక్రమించాడు…
నిద్ర లేవగానే పక్కన వున్న బ్యాక్ ప్యాక్ ఉందా అని చూశాడు .
“నాకు నిద్ర రాదన్నా. మీ బాగ్ భద్రంగా చూసుకున్నా“ అని నవ్వాడు .
“నీ పేరు అడగనే లేదు…”
“నా పేరు మల్లేష్ అన్నా”
“నా పేరు దినేష్. బెంగళూరు లో పని చేస్తున్నా“ ఎందుకో అలా చెప్పాలనిపించింది దినేష్ కి.
బెంగుళూరు చేరడంతో టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఇద్దరూ దిగారు. దినేష్ కి తలనొప్పిగా వుంటే కొంచెం టీ తాగాలని అనిపించి పక్కనే వున్న టీ కొట్టు దగ్గరికి వెడుతూ ”మల్లేష్, రా నాతో టీ తాగి వెడుతూ గానీ” అన్నాడు.
“వద్దు అన్నా, నేను టీ తాగను”
“పోనీ కూల్ డ్రింక్ తాగుదూ రా..”
“వద్దు అన్నా, ఎవరి దగ్గరా అడిగి ఏమీ తీసుకో కూడదు అంటుంది అమ్మ“ ఆ మాటలకి ముచ్చటేసింది దినేష్ కు .
“పోనీ అమ్మకు ఫోను వుంటే అడుగు నెంబర్ చెబితే చేసి ఇస్తా..”అన్నాడు మల్లేష్ భుజాన చెయ్యివేసి.
‘”అమ్మకు ఫోను వుంది..చేసి ఇస్తావా అన్నా“ ఆశగా అడిగాడు.
“నీవు కూల్ డ్రింక్ తాగు” అని మాజా తీసి ఇచ్చి తను టీ తాగాడు. అది అయ్యాక వాళ్ళ అమ్మ నెంబర్ చెబితే ఫోను డయల్ చేసి ఇస్తే “అమ్మా నేను టిన్ ఫ్యాక్టరీ దగ్గర వున్నా బస్ దొరక గానే వచ్చేస్తా ..సరేనా”అని చెప్పి పెట్టేసాడు.
“అంతేనా ఇంకా మాట్లాడకుండా పెట్టేశావే…”
“చాలా డబ్బులు అవుతాయి కదన్నా…”
“కాదు. నాకు కాల్స్ ఫ్రీ. మళ్ళీ మాట్లాడతావా?” అంటూ అదే నెంబర్ డయల్ చేసి ఇచ్చాడు.
‘అమ్మా ఇంకా బస్ రాలే….అక్క, నాయన అందరూ బాగున్నారు గదా ..” అని రెండు నిముషాలు మాట్లాడినాడు.
ఆంద్రా లోకూలీ చేసుకునే వారికి పల్లెల్లో వానలు లేక, పంటలు లేక దిన కూలీ దొరకక ఎంత కష్టపడుతున్నారో తెలుసు దినేష్ కు. తనకు తెలిసే దగ్గరగా వుందని బెంగళూరు చేరుతున్నారు.
ఆ సిటీ లో నిరంతరం కొత్త కాంప్లెక్స్ ల నిర్మాణం లో ఎంతమందో వలసకూలీలు పని చేస్తున్నారు. మల్లేష్ ఫామిలి ఇలా వలస వచ్చి పనులు చేసుకుంటూ, కూతురిని దగ్గర పెట్టుకుని చదివించుకుంటూ కొడుకుని అమ్మ దగ్గర పెట్టి, ఏ లోటూ లేకుండా గడుపుతున్నారంటే ఎందుకో సంతోషం గా అనిపించింది దినేష్ కు.జీవితాన్ని ఎంత బాగా ప్లాన్ చేసుకుంటారు అనిపించింది.
ఇతర రాష్ట్రాల నుండీ వచ్చిన వారికి ఒక ఆదరువు చూపించే బెంగళూరు ఇలా కూలీలకే కాకుండా తనలాటి చదువుకున్నవారికి కూడా ఒకమంచి ఆదాయం ఇస్తోంది. అయినా పని కోసం ఎంతదూరమైనా పోవాల్సిన అవసరం వుంది కదా’ ఆలోచిస్తున్నాడు దినేష్.
ఇంతలో ఒక బస్సు వస్తే “నీకు హేబ్బాల్ వెళ్ళే బస్ వచ్చింది చూడు మల్లేష్” అంటే
“ఈ బస్సు వద్దు అన్నా ఎ.సి. బస్సు లో టికెట్ ఎక్కువ. దీని తరువాత ఒక డొక్కు బస్సు వస్తుంది. దానిలో వెళ్ళతా. టికెట్ కూడా తక్కువ ..”అన్నాడు నవ్వుతూ. సాదారణం గా దినేష్ కూడా బస్ కోసం చూడకుండా ఆటోలో వెళ్ళిపోయేవాడు ఈ రోజు ఎందుకో మల్లేష్ తో ఉందామని పించింది.
ఇంతలోడొక్కు బస్ రావటం కనిపించింది.
దినేష్ ఒక వంద రూపాయల నోటు తీసి, తన విజిటింగ్ కార్డు తో బాటు దాన్నిమల్లేష్ జేబులో పెట్టాడు.
“అయ్యో వద్దు అన్నా..” అంటూన్నఅతని తో “పరవాలేదు మల్లేష్. ఉంచుకో అమ్మకు ఇవ్వు. నా కార్డు పెట్టుకో నీవు ఇంకా కొంచెం చదువుకున్నాక ఏదైనా ఉద్యోగం కూడా ఇప్పిస్తా. కొంచెం టచ్ లో వుండు ..”మాటలు పూర్తీ అయ్యేసరికి బస్ వచ్చేసింది మల్లేష్ సంతోషం గా చెయ్యి ఊపుతూ బస్ ఎక్కాడు.
వెంటనే ఆటో లో తన్న రూమ్ కి వెళ్ళిపోయాడు దినేష్ .
మల్లేష్ ఆ తరువాత అప్పుడప్పుడూ గుర్తుకు వచ్చినా క్రమంగా మరుగున పడ్డాడు.
*******
ఒక సంవత్సరం తరువాత మార్చ్ లో అనుకోకుండా చైనా నుండీ వచ్చిన కారోనా వైరస్ కలకలం రేపింది భారత దేశం లో “ఆ..పరవాలేదు లే . మనకేమీ కాదు…రాదు” అనుకుంటూ గడిపిన రోజులు పోయి క్రమంగా ఎన్నో కేసులు కరోనా పాజిటివ్ రావటం…వాళ్లకి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్ ని౦డటం, కొత్తగా వచ్చిన వారికి క్వారంటైన్ అన్నీ వరస పెట్టుకుని రావటం తో ప్రధాన మంత్రి లాక్ అవుట్ పెట్టక తప్పలేదు.
రోజంతా ఇల్లు కదలకుండా, ఇంట్లోనుండీ “వర్క్ ఫ్రం హోం “ అవటంతో బయటకు వెళ్ళటం పూర్తి బంద్ అయ్యింది.
జీవనం అల్లకల్లోలమైంది….వర్క్ ఫ్రం హోం తెలియడంతో కొంచెం కష్టపడి ఎలాగోలా మానేజ్ చేసి దినేష్ బెంగళూరు నుండి ఆంధ్రాలో ఇంటికి వచ్చేశాడు.
తరువాత రాష్ట్రాల సరిహద్దులు బంద్ అయ్యాయి…న్యూస్ చూస్తూ వుంటే పనులకోసం వలస పోయిన వారి కష్టాలు మనసును కలచి వేశాయి. ఎంత దూరమైనా నడుచుకుంటూ వెడుతూ.. కాళ్ళకు చెప్పులు లేకుండా…సరి అయిన తిండి లేకుండా, చెట్ల కింద పడుకుంటూ వలస పోయిన రాష్ట్రం వారు తరుముకుంటే సొంత రాష్ట్రం చేరడానికి వాళ్ళు పడుతున్నకష్టాలు కన్నీరు తెప్పించాయి. దగ్గరలో వుందని కర్నాటక లో బెంగళూరు లో పని చేసే మన కూలీలు కూడా రాష్ట్ర సరిహద్దులు దాటి రాకుండా ఒక మైలుదూరం లో పరీక్షలు చేయించాలని ఆపేశారు. రాష్ట్రం లోకి కరోనాతో వస్తే ఎలా అన్నది మన బాధ. వారు పని చేసే చోట వుండనివ్వరు సొంతరాష్ట్రం లోకి రానివ్వరు అనే పరిస్థితి. ప్రయాణానికి బస్సులు లేక నడిచి నడిచీ కాళ్ళు బొబ్బలేక్కి, తినడానికి తిండి లేక ఘోరమైన స్థితి లో వున్న వారికి సాటి మనుష్యులుగా కాస్త సాయం అందిద్దామని దినేష్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడి తమ వూరు కర్నాటక రాష్ట్రం సరిహద్దు కాబట్టి కర్నాటక నుండీ వస్తూ బోర్డర్ అవతల క్వారంటైన్ కోసం కాచుకుని వున్నవలసకూలీలకు అన్నం పొట్లాలు సప్లయ్ చెయ్యాలని ఏర్పాటు చేసుకుని పర్మిషను తెచ్చు కున్నాడు. అది పంచడానికి వెడుతూ వుండగా చెక్ పోస్ట్ దగ్గర ఒక అబ్బాయి దగ్గరగా వచ్చి “అన్నా….నేను మల్లేష్ “అని అంటూవుంటే పోలీసు
“ఏయ్ ఎందుకురా తిరుగుతున్నావు??”అని లాటీ జడిపించాడు. అతన్ని గుర్తుపట్టాడు దినేష్.
”మల్లేష్ …” అని దగ్గరికి పిలిచాడు.
“ఇక్కడ వున్నావేమి ??”
“అన్నా, అమ్మ వాళ్ళు బెంగళూరు నుండీ బయలుదేరి రెండురోజులవుతూంది. నాయనకు జ్వరంగా ఉందంట. బస్సులు లేవు. నడవలేక పోతున్నాడంట. అన్నం లేదు చాలా కష్టం గా వుంది అని చెప్పినారు. మధ్యలో ఫోను పని చెయ్యలేదు. అందుకే ఇక్కడ కాచుకున్నా అన్నా… దగ్గరగా వచ్చినట్టు వున్నారు. కానీ మన దగ్గరికి రానీరంట ఇంకా కొన్నాళ్ళు పడుతుందంట. నేను అక్కడికి పోతానంటే నిన్న వీళ్ళు కొట్టినారు…ఏదైనా చెయ్యి అన్నా” దీనంగా అంటూన్న అతని భుజం మీద చెయ్యివేసి వెహికల్ లోకి లాగాడు. బోర్డర్ దాటిన తరువాత కొంత దూరం లో వలస కూలీల గుంపు కనిపించింది. అక్కడ ఆగి అన్నం పొట్లాలు ఇవ్వ బోతూ వుంటే మల్లేష్ ముందుకి పరిగెత్తి
“అమ్మా, నాయనా…అక్కా..” అని గట్టిగా అరిచాడు.
ఆ మాటలకి తలతిప్పి చూసిన దినేష్ కి మల్లేష్ వాళ్ళ ఫామిలీ దగ్గరకు వెళ్లి పట్టుకోవడం కనిపించింది.
పరవాలేదు ఈ సమయంలో కూడా ఒక ఫామిలీని కలిపాను అనుకుంటూ ‘అమ్మయ్య చివరికి ఈ విధంగా మల్లేష్ కు ఉపయోగపడ్డాను’ అనుకుని నిట్టూర్చాడు. తనవైపు చేయి ఎత్తి చూపుతున్న మల్లేష్ కు చేయి ఊపాడు
ఆ తరువాత రోజుల్లోనే టెస్ట్ లూ, పాజిటివ్ వస్తే క్వారంటైన్ లూ అయ్యి సొంత ఫామిలీ వారిని చూడలేక, వ్యాది తీవ్రమైతే అయినవారు దరిదాపులుకు రాకుండానే చావు కార్య క్రమాలు జరిగే రోజు వస్తుందని ఆ రోజు వూహించలేదు దినేష్.
********

2 thoughts on “మల్లేష్

  1. కుటుంబ బంధం తో సాగిన కథ బాగుంది.. ప్రస్తుత పరిస్థితుల్ని ప్రతిబింబించే విధంగా రాశారు.. హఠాత్తుగా, ఊహించని విధంగా దినేష్, మల్లేష్ కు ఉపయోగపడటం సంతోషాన్ని కలిగించినా, కథ ముగింపులో రాసిన మాటలు ఏదో అపాయాన్ని సూచించింది.. చక్కని కథ..కథనం బాగుంది..

    1. కథ లో పట్టుని అర్థం చెసుకున్నారు రాధికా. ధన్యవాదాలు ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *