May 25, 2024

రాజీపడిన బంధం – 6

రచన: కోసూరి ఉమాభారతి

sahityam

“అల్లుడు శ్యాంప్రసాద్ చిన్నప్పటి నుండీ కూడా గొప్ప క్రీడాకారుడు కదా…. అలా ఆటల్లో ఎదుటివాడిని ఓడించి, తను గెలవడమే ధ్యేయంగా జీవిస్తారు కదా క్రీడాకారులు. దుర్గాప్రసాద్ చెప్పంగా శ్యాం, వాళ్ళ నాన్న కూడా అలాగే ఉండేవారంట. శ్యాం ఎందులోనూ ఓటమి ఎరుగడట. అతని చదువు కూడా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ తోనే అయిందట” క్షణమాగారు..
నాన్న చెప్పేది మౌనంగా వింటున్నాను.
“దుర్గాప్రసాద్ చెప్పినదాన్ని బట్టి అల్లుడుగారి బాల్యం, పెంపకం, వ్యక్తిత్వం పై నాకు కొంత అనగాహన కలిగింది”
“అయితే ఏమంటారు మీరు” అడిగింది అమ్మ.
“చెప్పేదేమంటే, ఐదోయేడు నుండి ఆటలు, గెలుపులుగా నడిచిందట అతగాడి బాల్యం. ఆ అబ్బాయి మానసికంగా, శారీరికంగా ధృడంగా ఉండాలని ఎంతో క్రమశిక్షణలో ఉంచేవారంట కూడా” క్షణమాగి కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ పెట్టుకున్నారు.
“అన్నీ మంచి సంగతులే చెప్పాడాయన. అయితే, మరి అల్లుడుగారు పదే పదే ఇలా నిన్ను, పిల్లాడిని బాధ పెడుతున్నాడని నీవు కుమిలిపోవడం కూడా దుర్భరమే. నువ్వు కూడా అన్నీ ఆలోచించు. ఇదేమన్నా సమిసిపోయే విషయం అయితే, నీవే తెలుసుకుంటావు. అలివి కానిదిగా ఉంటే మాత్రం మీ శ్రేయస్సు కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి మరి” నా వంక సూటిగా చూసారు..
“కాని అది అంతా నీవు మాత్రమే నిర్ధారణ చేసుకోగలవు. నీవూ తెలివైనదానివే. స్కాలర్షిప్పు తోనే కాలేజీకి వెళ్ళిన దానివిగా. ఆ మాటకొస్తే, ఇప్పుడైనా మాస్టర్స్ చేసి లెక్చరర్ అయ్యేలా ప్రయత్నాలు మొదలుపెట్టడం మంచిది. అవసరం వస్తే, స్వతంత్రంగా బతకవచ్చు” అన్నారాయన…..
నాన్న చెబుతున్నది మౌనంగా ఆకళింపు చేసుకుంటున్నాను…
“నీకు మా సహాయం, తోడు మేము బతికున్నన్నాళ్ళు ఉంటుంది తల్లీ. నీ మీద మాకు పూర్తి నమ్మకముంది. కత్తి మీద సాము లాంటి ఈ పరిస్థితిని జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. తొందరపడనూ వద్దు. అలాగని జాప్యం చేయావద్దు…నీవెటు అడుగు వేయవలసొచ్చినా మేమూ నీ వెంటే” అన్నారు గంభీరంగా.
ఆయన మాటల్లో నాకు ఎంతో స్వాంతన, ధైర్యం తోచాయి.
ఇక పడుకోండమ్మా… ఆలస్యం అయింది…అంటూ పైకి లేచారు నాన్న.
బాబుకి దుప్పటి కప్పి బెడ్-లైట్ వేసి వెళ్ళింది అమ్మ…
‘శ్యాంతో ఈ పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. చేయిదాటుతుందని అనిపిస్తే, నాన్నగారు అన్నట్టు మార్గాలుంటాయి. నా జీవితంపై నేనే ఎలాగైనా పట్టు సాధించాలి.
ఇకనుండి పెద్దవాళ్ళని నా విషయంగా కలవరపెట్టకూడదు’ అనుకుంటూ నిద్ర లోకి జారుకున్నాను.
*****
పొద్దున్నే ఆరుగంటల సమయంలో అత్తయ్య ఫోన్ చేసారు..
“అత్తయ్యా బాగున్నారా?” అడిగాను.
“అంతా బాగున్నాము, నువ్వు బాబు ఎలా ఉన్నారు?” అడిగారు.
“బాగున్నామత్తయ్యా” అన్నాను.
“చూడమ్మా నీలా, నీకు తెలుసుగా నాకు మోకాలు సర్జరీ అవసరమని. రెండురోజుల క్రితం బాత్రూములో కాలు జారి పడ్డాను. బాగా ఇబ్బంది పడుతున్నాను. ఇక తప్పదు. ఎల్లుండి సర్జరీ చేయించుకుంటాను” క్షణమాగారు అత్తయ్య.
“నీవు లేకుండా ఇక్కడ మాకు బాగా వెలితిగా కూడా ఉంది. అదీకాక, క్యాండి, మిండిలకి కూడా నీ అవసరం ఉంది. నీవు వస్తే బాగుంటుంది” అనేసారు ఆమె.
“అత్తయ్యా, ఈ రాత్రికే బయలుదేరడానికి ప్రయత్నిస్తాను” అని చెప్పి ఫోన్ పెట్టేసాను.. మానేజర్ గుప్త గారికి ఫోన్ చేసి రాత్రి పదిన్నర ఫ్లైట్ కి నేను, బాబు తిరిగి ఢిల్లీ వెళ్ళేలా ఏర్పాటు చేయించాను.
*****
నేను ఢిల్లీ చేరిన మరునాడే అత్తయ్య మోకాలు సర్జరీ చేయించాము.
మా రెండో కుక్కపిల్ల ‘మిండి’ కి మాత్రం ‘హెర్నియా’ సర్జరీ అయి, అప్పటికే నాలుగురోజులుగా ఇంట్లోనే కోలుకుంటుందని తెలిసింది..
తానెంత వారించినా వ్యాయాయం పేరిట.. శ్యాం మిండీని అతిగా ప్రాయాస పెట్టాడని, నా వద్ద వాపోయారు అత్తయ్య.
శ్యాం వైఖరికి విస్తుపోయాను. మూగజీవుల పట్ల నిర్లక్ష్యం అనుకున్నాను.. కాని ఇప్పుడది ‘క్రూరత్వం’ అనిపిస్తుంది. ఇలాగే ఏదో ఒకటి చేసి నన్ను బాధపెట్టడమే నా భర్త ధ్యేయమా? అదే అయితే, కనుచూపు మేరలో నాకు విముక్తి ఉండబోదని అర్ధమయ్యింది.
శ్యాంతో అసలు మాట్లాడాలని లేదు. అవసరమైన మాటలు మాట్లాడ్డం మినహా, నాకు గత్యంతరం లేకనే అతనితో కాపురం సాగిస్తున్నాను. నా బాబు, పరివారం, నా పెంపుడు కుక్కలు…… వీరందరి క్షేమమే నాకు ముఖ్యం.
*****
గేమ్-రూములో ‘సోని-ప్లే-స్టేషన్’ చూసినప్పుడల్లా సందీప్ పుట్టినరోజున జరిగిన సంఘటన కళ్ళ ముందుకి వస్తుంది. అది వాడి పుట్టినరోజు కానుకగా మామయ్య తెప్పించి అమర్చారు. అలాంటిది,, ఆ పార్టీ సమయంలో వాడికి దెబ్బతగలడం, నేను హైదరాబాద్ వెళ్ళడం అనుకోకుండా జరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఆ ప్లే-స్టేషన్ తో ఆడాలంటే కూడా ముందుగా విరిగిన చేయి బాగవ్వాలి అని సందీప్ కి తరచుగా సర్ది చెబుతూనే ఉన్నాను.
నిద్రలో వాడు చేతి మీదకి దొర్లకుండా జాగ్రత్తగా చూసుకోవలసి రావడంతో రాత్రిళ్ళు కూడా వాడి వద్దే ఉంటున్నాను. తెల్లారుజాము నుండి ఒక్కోప్పుడు అత్తయ్యని సందీప్ వద్ద ఉంచి, వంటింట్లో పనులు చేస్తున్నాను.
*****
శనివారం పొద్దున్నే ఏడయ్యింది. టి.వి లో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వస్తుంది. ఇంటి ముందు వరండాలో నీరెండకి పేపర్ చదువుతున్న మామయ్యగారికి కాఫీ అందించి వెనుతిరుగాను.
“నీలా, ఐదు నిముషాలు ఇలా కూర్చోమ్మా” అంటూ ఆపారు మామయ్య.
అప్పుడే నిదుర లేచిన సందీప్ ని వెంట బెట్టుకొని, అక్కడికి అత్తయ్య కూడా వచ్చారు. మోకాలు సర్జరీ అయ్యాక అత్తయ్య పూర్తిగా కోలుకుని నిలకడగా నడుస్తున్నారు కూడా.
ఇద్ధరం మామయ్య ఎదురుగా కూర్చున్నాము. సందీప్ తాతగారి పక్కనే చేరాడు.
“మన ఇంటి వెనుక ఆవరణలో క్యాండీ-మిండీల స్థావరం దాటగానే మీ తులసికోట, మల్లె-జాజి పందిళ్ళు ఉన్నాయి కదా! ఆ పైన ఇంకా ఐదొందల గజాల స్థలం ఉంది. అందులో టెన్నిస్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కి కూడా వేయిద్దామని ఎప్పుడో ప్లాన్స్ వేయించి రెడీ పెట్టాను. ఇప్పటికి కాని దానికి సమయం రాలేదు మరి” అన్నారాయన కాఫీ తాగుతూ.
“సరిగ్గా శ్యాం పుట్టినరోజు నాటికి, తయారయ్యేలా వెంటనే పని మొదలు పెట్టించండి.. అవి తయారయ్యాక మన సందీప్ బాబు స్విమ్మింగ్, టెన్నిస్ అన్నీ ఇంటి దగ్గరే నేర్చుకోవచ్చు” అని అత్తయ్య అంటుండగా శ్యాం వచ్చారు.
“ఏంటి ఈ సమావేశం? నన్ను పిలవలేదే?” అంటూ సందీప్ ని ముద్దు పెట్టుకొని, “సాయంత్రం చెప్పండి నాకిప్పుడు ఎలాగూ టైం లేదు” అంటూ ఆఫీస్ కి బయలుదేరి పోయారు.
“సందీప్ ని కూడా క్రీడాకారుడుగా తీర్చిదిద్దాలని మీకు కోరికగా ఉన్నా, ఈ వయస్సులో మీకు అంత ఓపికుందా?” అన్నారు అత్తయ్య, నవ్వుతూ….మామయ్యతో.
నేను ఆలోచిస్తూ ఖాళీ కాఫీ కప్పందుకుని అక్కడి నుండి కదిలాను….
*****
మామయ్యగారు చేపట్టిన నిర్మాణం, కాలయాపన లేకుండా జరుగుతుంది. ఆధునీకరణతో పాటు ఎక్కడికక్కడ పిల్లల భద్రతకి ద్వారాలు పెట్టిస్తూ దగ్గరుండి పనులు చేయిస్తున్నారు మామయ్య.
పనిలో పనిగా కింద అంతస్థులో నేను ఉపయోగించే గదిని మరింత విశాలంగా, అధునాతనంగా ఉండేలా చేయిస్తున్నారు. పిల్లలకి వసతిగా ఉండాలని అత్తయ్య ఆదేశాలు.
దానికి వెనుకగా పనివాళ్ళ వసతికి, ఇంకో వైపుగా మరో ‘అతిధి గృహం’కి కూడా పునాదులు వేసి ఆ పని కూడా మొదలు పెట్టించారు.
*****
అనుకున్న ప్రకారమే… ఆరునెలలకి మమయ్యగారి కట్టడాలు అందంగా పూర్తయ్యాయి.. చిన్నసైజు ‘స్పోర్ట్స్- కాంప్లెక్స్’ లా ఉందని శ్యాం ఆయన్ని అభినందించారు.
శ్యాం ముప్పైఆరవ పుట్టినరోజున పార్టీ ఏర్పాటు చేశాము.
కోలాహలంగా పార్టీ ముగిసాక…వచ్చిన అతిధులందరి ఎదురుగా తన పుట్టినరోజు వేడుక ఇలా ఘనంగా ఏర్పాటు చేసినందుకు శ్యాం మాకు ధన్యవాదాలు చెప్పారు.
*****
మళ్ళీ వారానికి, శ్యాం ఆర్డర్ చేసిన ‘టెన్నిస్ బాల్-షూటర్’ వచ్చింది. ఒక్కరే ఆడుకునే వీలు కోసం శ్యాం తెప్పించుకున్నారు. నిర్దేశించిన వేగంతో వంద బాల్స్ వరకు షూట్ చేసే ఆ మిషన్ చాల నచ్చింది సందీప్ కి.
నెలలో ప్రతి రెండో ఆదివారం ఫ్రెండ్స్ ని పిలుచుకొని టెన్నిస్ ఆడుతారు శ్యాం. సందీప్ గేటు ఇవతల కూర్చుని చూస్తుంటాడు. ఎవరన్నా టెన్నిస్ ఆడుతుంటే, క్యాండి మిండీల క్కూడా సందడే.
శ్యాం వాళ్ళ ఆట అయ్యాక, కోర్ట్స్ లోనికి వెళ్ళి ఆ బాల్స్ ని కలెక్ట్ చేసి మళ్ళీ ఆ మెషిన్ లో వేయడం వాడికి సరదా. నేను దగ్గరున్నపుడు మాత్రమే వాడ్ని అలా టెన్నిస్ బాల్స్ ని కలెక్ట్ చేయనిస్తాను.
*****
నాన్నకి ఫ్లూ-జ్వరం సోకి ఓసారి, ఇంకేదో కారణంగా మరోసారి బాబు పుట్టినరోజు సమయానికి …రెండేళ్ళగా ఢిల్లీ ట్రిప్ మానేసుకున్నారు అమ్మావాళ్ళు. వాళ్ళని చూడక అప్పుడే మూడో యేడు…
‘ఈ యేడన్నా తప్పక వాళ్ళని రమ్మని చెప్పాలి’ అనుకున్నాను. మధ్యాహ్నం భోంచేస్తూ అత్తయ్య దగ్గర అదే విషయం ప్రస్తావించాను.
“అవును, మన మీద అలగలేదు కదా! మీ వాళ్ళు” అన్నారామె నవ్వుతూ. “శివరాం అన్నయ్యని, మా రాజ్యం వదిన గారిని చూసి రెండేళ్ళవుతుంది. … మీ తమ్ముడికి వేసవి సెలవలు వస్తున్నాయిగా! తప్పక రమ్మందాం అమ్మావాళ్ళని” అంటూ భోజనం అయ్యాక అమ్మకి ఫోన్ చేసారామె.
*****
మళ్ళీ వారానికి ఢిల్లీ వచ్చారు అమ్మావాళ్ళు. టైపు ఇన్స్టిట్యూట్ లో జాబ్ చేస్తుండడంతో వినోద్ రాలేకపోయాడు.
నన్ను దగ్గరికి పిలిచి, “అంతా సవ్యంగానే ఉందా?” అని అమ్మ ఆరా తీసింది. ప్రత్యేకించి నా క్షేమసమాచారాలు కనుక్కున్నారు నాన్న.
“నీ బిడ్డ సహా నీవు క్షేమంగా, హాయిగా ఉన్నావనే భావిస్తున్నాము. మాకూ సంతోషమే” అన్నారాయన.
*****
ఎదిగే వయస్సులో రిస్ట్-ఫ్రాక్చర్ వంటి అఘాతాల ఏర్పడితే పిల్లవాడి ఎదుగుదల మీద ప్రభావం ఉంటుందని చదివాను. డాక్టర్ని అడిగి తెలుసుకున్నాను కూడా. సందీప్ ఉండాల్సినంత ఎత్తుగా ఆరోగ్యంగా లేడనిపిస్తుంది. యేడేళ్ళ సందీప్ మరీ బలంగా లేకపోయినా, వేసవి సెలవల్లో వారానికి రెండుసార్లు ఇంటి వద్దనే టెన్నిస్, స్విమ్మింగ్ నేర్చుకునేలా ట్రైనర్స్ ని ఏర్పాటు చేసాను.
శ్రద్ధగా ఆట నేర్చుకుంటున్నాడు సందీప్. క్లాస్ అవగానే ప్రతి సారి “డాడి లాగా అడుతున్నానా లేదా నానమ్మా?” అని అడుగుతుంటాడు. డాడీలా టెన్నిస్ మెషిన్ తో ఆడతానంటాడు. ఇంకాస్త పెద్దయ్యాకే డాడీలా బాల్-షూటర్ తో ఆడాలన్నాడు ట్రైనర్.
సందీప్, ఆ సంగతిగా వాళ్ళ డాడీకి ఫిర్యాదు కూడా చేసాడు.
“నువ్వు నా కొడుకివి. నీలో ఓ గొప్ప క్రీడాకారుడు ఉండే ఉంటాడు. అతి వేగంగా వచ్చే టెన్నిస్ బంతుల్ని ఎలా తిప్పి కొట్టాలో నేర్పిస్తానులే నీకు. నేనున్నాగా” అన్నారు శ్యాం వాడితో.
“వాడింకా చిన్న వాడు. ఆట రానివాడు. ఆ మెషిన్ తో ప్రాక్టిస్ చేసేంత ఆటగాడు అవ్వలేదుగా! తొందరేమీ లేదు” అన్నాను అక్కడే ఉన్న నేను. టెన్నిస్ ప్రాక్టిస్ నెపంతో బాబుకి మళ్ళీ ఏమి ఉపద్రవం రానుందో? అని నా గుండెల్లో రాయి పడింది.
మర్నాడు సమయం చూసి అత్తయ్యకి అన్నీ వివరించాను. ఇదివరలో సంఘటనలు గుర్తు చేసాను.
“ఇప్పుడిప్పుడే ఆట నేర్చుకుంటున్నాడు సందీప్. డాడీ తోనో, ఆ మెషిన్ తోనో ఆడే సత్తా ఉందా వాడికి? మీరు కలగ జేసుకొని ఇటువంటివి జరగకుండా చూడాలి. బాబుకి దెబ్బలు తగలకుండా చూసుకునే బాధ్యత నాతో పాటు మీకూ ఉంది” అని ఆమెకి గుర్తు చేసాను.
*****
నేను శ్యాంతో సఖ్యతగా లేననీ, ముక్తసరిగా మాట్లాడుతానని ఆయనకి నా మీద పీకల వరకు కోపమే. ఇలా సఖ్యత లేని నన్నెందుకు ఉపేక్షిస్తున్నారో! అని తోచక భయం వేస్తుంది ఒక్కోసారి నాకు. నా అత్తవారింట ఓ కోడలిగా, శ్యాంకి ఓ భార్యగా ఎన్నో బాధ్యతలని… కొన్ని నా ఇష్టం లేకున్నా, కష్టమైనా… సక్రమంగానే నిర్వహిస్తున్నాను. ఒక్కోసారి దుర్భరమనిపించినా మనుగడ సాగిస్తున్నాను…..
సందీప్ ని తీసుకొని అత్తయ్యతో చిన్మయమిషన్ కి నేనూ వెళ్తున్నాను. అక్కడ గడిపే రెండు గంటల సమయం నా మనసుకి, మనోగతికి కూడా ఎంతో శాంతినిచ్చేవే.
అక్కడ నేర్చుకున్న ఎన్నో విషయాలని పాటిస్తూ నా జీవన మార్గాన్ని సుళువు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను. నాలో పెరుగుతున్న నిర్లిప్తత, నా రోజువారి జీవనంలోకి తొంగి చూడకుండా నిబ్బరంగానే ఉండగలుగుతున్నాను.
*****
క్లాస్ ఫస్ట్ వచ్చి, మూడో తరగతికి ప్రొమోట్ అయ్యాడు సందీప్…క్రీడలన్నా అంతే ఆసక్తి. డాడీ లాగా తన ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చి తనతో ఆడాలని గొడవ చేయడం మొదలెట్టాడు వాడు. అత్తయ్యకి, శ్యాంకి తెలియజేసి ఇంటి చుట్టుపక్కల మాకు తెలిసిన సందీప్ స్నేహితుల తల్లితండ్రులతో మాట్లాడాను.
శనివారం మధ్యాహ్నాలు, రెండుగంటల సేపు మా ఇంట ఆడుకొని, పిల్లలంతా సరదాగా గడిపేలా ఏర్పాటు చేసాను.
*****
టెన్నిస్ నేర్చుకోవడం మొదలుపెట్టిన యేడాదికి, సందీప్ ఆట బాగా మెరుగయిందని ట్రైనర్ అనడంతో, చాలా సంతోషంగా ఉన్నాడు వాడు. వాళ్ళ డాడీ తోనో, డాడీలా టెన్నిస్ బాల్-షూటర్ తోనో ఆడేందుకు ఎదురు చూస్తున్నాడు.
ప్రతి శనివారం మాత్రం పొద్దుటి నుండే బాస్కెట్-బాల్ కోర్ట్స్ చుట్టూ శుభ్రం చేయించేస్తాడు. పెంపుడు కుక్కలకి కూడా రాము చేత స్నానాలు, ముస్తాబు చేయించి, స్నేహితుల కోసం నిరీక్షణలో గడుపుతాడు.
వాడి ఆదుర్దా, ఆటల్లో వాడి ఆసక్తి చూసి అత్తయ్యకి ముచ్చటగా ఉంది. ‘అచ్చం శ్యాం చిన్నప్పటిలా’ అంటూ తన కొడుకు బాల్యం గుర్తు చేసుకుంటారామె. రెండవ మోకాలు సర్జరీ కూడా అయి…. కోలుకున్నాక ..శనివారాలు పిల్లల ఆటలప్పుడు అజమాయిషీ చేస్తుంటారు కూడా…..
మొత్తం ఎనిమిదిమంది పిల్లలు ఆసక్తిగా వస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్ళల్లోని వారే కాబట్టి ఆటలయ్యాక వాళ్ళని ఇళ్ళ వద్ద దిగవిడచే బాధ్యత తీసుకున్నాను. సందీప్ తో పాటు నేను, అత్తయ్య కూడా అందరు పిల్లలతో సరదాగా గడిపే శనివారాలకోసం ఎదురు చూస్తుంటాము..
*****
పొద్దున్నే మామూలుగా పెందరాళే లేచాను…నిస్సత్తువుగా అనిపించింది. శనివారం అని గుర్తొచ్చి, ఓపిక చేసుకొని లేచివెళ్లి …కాఫీ తాగుతూ టేబిల్ వద్ద కూర్చుండిపోయాను.
“…ఏమలా నీరసంగా ఉన్నావు? కాసేపు పోయి పడుకోమ్మా. ఆగ్రా నుండి ఇవాళ రాత్రికో, రేపు పొద్దున్నో గాని రాలేనని శ్యాం ఫోన్ చేసాడు. వంట నేను చేయిస్తాను” అన్నారు అత్తయ్య.
అక్కడినుండి వెళ్లి ఎంతసేపు పడుకుండి పోయినో కూడా తెలియదు… కొద్దిసేపుగా మాత్రం శనివారం అని గుర్తు చేస్తూ, నన్ను లేవమని గొడవ చేస్తున్నాడు సందీప్.

పైకి లేవగానే కడుపులో తిప్పేసింది. పరుగున వాష్ రూంకి వెళ్ళి వాంతి చేసుకున్నాను. ఉపవాసం ఉన్న తెల్లారి అప్పుడప్పుడు ఇలా వాంతి చేసుకోడం కూడా పరిపాటే… అయినా గర్భావతినేమో అన్న అనుమానం ఓ పక్క పీడిస్తూనే ఉంది.
కడుపులోది కక్కేసాక కాస్త తేలికనిపించి, ఓపిక చేసుకొని కిందకి వెళ్ళాను. అత్తయ్య ఎదురు వచ్చారు. “పడుకున్నావు కదా అని నిన్ను లేపకుండా సందీప్ లంచ్ నేనే తినిపించేసాను. వాడు స్నేహితులతో పూల్ వద్ద ఉన్నాడు” అన్నారామె.
పిల్లలకి గార్డెన్ లో అన్ని ఏర్పాట్లు చేసి, అత్తయ్యతో పాటు వెనకాల వరండాలో కూర్చున్నాను.
పువ్వులు కోసి నాలుగు రోజులయిందని గుర్తొచ్చి, లేచి వెళ్లి మల్లెలు తీస్తుంటే మళ్ళీ తల తిప్పేయడం మొదలైంది. కోసిన పువ్వులు అతయ్య చేతికిచ్చి పక్కనే చతికిలపడ్డాను.
“ఏమ్మా నీలా, ఇంకా అలాగే నీరసంగా ఉన్నావే… వంట్లో బాగోలేదా? అడిగారు అత్తయ్య.
“లేదత్తయ్యా, కొద్దిరోజులుగా చెప్పాలనే అనుకున్నాను. నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనుకుంటా. దానివల్లే కాస్త నలతగా ఉందేమో” అన్నాను నీరసంగా.
అత్తయ్య ముఖం సంతోషంతో విప్పారింది.
“ఎన్నాళ్ళగానో ఈ మంచి వార్త కోసమే చూస్తున్నాను. అలా నీరసంగా చెబుతావేమ్మా? అంటూ ఆవిడ సంతోషాన్ని పంచుకోను శ్యాంకి ఫోన్ చేస్తే ఆయన దొరకలేదు.
నా వైపు తిరిగి, “చూడు నీలా, నేనుంటాలే ఇక్కడ పిల్లల కోసం. వాళ్ళని ఆడించి, తినిపించి అన్నీ చూసుకుంటాను. ఇద్దరు పనివాళ్ళు, జానకి కూడా ఉన్నారుగా. నువ్వు కాసేపు వెళ్లి నడుం వాల్చు” అంటూ నన్ను బలవంతంగా లోనికి పంపారు.
సశేషం

1 thought on “రాజీపడిన బంధం – 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *