May 19, 2024

స్త్రీల మనసులను ఉద్దీపనదిశగా నడిపిన నవల

రచన: సి. ఉమాదేవి

పోలంరాజు శారదగారు జగమెరిగిన రచయిత్రి. ఆంధ్రభూమిలో ప్రచురింపబడిన నవల బంగారు కంచం. ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో రచింపబడిన నవల. నేటి పరిస్థితులకు భిన్నంగా ఒకనాటి హద్దులు, సామెతలు కొడుకునైనా, కోడలినైనా కట్టడి చేసే విధంగా అత్తలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వల్లెవేయడం పరిపాటి. ఈ నవల వాటి పరిణామాలను బహిర్గతపరచింది. ఒకనాటి ఉమ్మడి కుటుంబాలలో పెద్దలమాటే శిరోధార్యం. వారి మాటలను అతిక్రమిస్తే నలుగిరిలో చిన్నబోవడమేకాక కఠినమైన శిక్షలకు కూడా గురవుతారు. తరాలు మారాయి. కాని ఎక్కడో ఒకదగ్గర స్త్రీలు ఆత్మహత్యలకు పాల్పడటం స్త్రీల బేలతనానికి నిదర్శనం.
ఇక నవలలోకి అడుగిడితే రాఘవరావు, రాజమ్మ దంపతులకు కూతురు కాత్యాయని. చిన్న వయసులోనే కాత్యాయనికి పెళ్లి చేయమనే నాయనమ్మ , నిత్యం పదేపదే చెప్పడంతో రాఘవరావు తన కూతురికి సంబంధం వెతకాలనుకుంటాడు. కాత్యాయని చదువుకోవాలనే కోరికకు అక్కడే చరమగీతం పడుతుంది. కాత్యాయని మేనమామ శ్రీనివాస శర్మ లాయరు వృత్తేకాని దానగుణాన్ని తన స్వార్థంతో మిళితం చేసి తననుండి సాయం అందుకున్నవాళ్లు తనకు దాసోహమనాలనే తపన మెండుగా ఉన్నవాడు. కాత్యాయని పెళ్లిఖర్చులు తానే భరిస్తానంటూ ప్రక్క ఊరిలోనున్న శివరావు గురించి చెప్పి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేస్తాడు. తల్లి ఇష్టమే తన ఇష్టమంటాడు శివరావు.
శివరావు తల్లి సౌభాగ్యమ్మ, కాత్యాయని నాయనమ్మ సుందరమ్మకు ఒకే మూసలో పోసిన అనిప్రాయాలు, ఆలోచనలు. కాత్యాయని పెళ్లి జరిగాక అత్తగారింట అడుగు పెట్తుంది. తోడబుట్టిన ఇద్దరు తమ్ముళ్లను, తల్లిదండ్రులకు దూరమయాననే బాధ కాత్యాయని మనసులో దుఃఖం నింపుతుంది. అటు శివరావు తన తమ్ముళ్లనిద్దరిని చక్కగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకుంటాడు. అయితే తల్లిమాటకు ఎదురుచెప్పడు. తల్లి సౌభాగ్యమ్మ చిన్ననాటనే అన్నిటిని కోల్పోయి ఇతరులెవరైనా కళకళలాడుతుంటే ఓర్వలేకపోతుంది. అదే కాత్యాయనికి శాపమైంది. పనిమనిషిని వద్దని కాత్యాయనిని ఇంటి పని, వంటపనికి అంకితం చేస్తుంది. రాఘవరావు, శ్రీనివాస శర్మ కాత్యాయని ఊరివైపు వెళ్లవలసివస్తుంది. రాఘవరావు రానన్నా కాత్యాయనిని ఒకసారి చూసొద్దామని బలవంతంగా తీసుకెళ్లిన శ్రీనివాస శర్మ సౌభాగ్యమ్మతో తగవువేసుకుని కాత్యాయనిని బలవంతంగా చేయిపట్టుకుని కారులో కూర్చుండబెట్టి ఇంటికి చేరుస్తాడు. కాత్యాయనిని మళ్లీ అత్తగారింటికి ఎలా పంపాలా అనే ఆలోచనతో వియ్యపురాలిని కలుసుకుంటాడు రాఘవరావు . అయితే ఏమాత్రం సంకోచించకుండా అతడి కూతురిని గడపతొక్కనీయనంటుంది. చివరకు తండ్రి వెంట బయలు దేరిన కాత్యాయని అత్త కాళ్లకు నమస్కరించి, క్షమించమన్నా ఆమె విసిరి కొట్టినపుడు కాత్యాయనికి నుదుట గాయమవుతుంది. చివరకు అల్లుడు శివరావు కూడా తమ్ముళ్లను చదివించాలంటే తానక్కడే ఉండాలని, వేరు కాపురం ఆలోచనే లేదని చెప్పడంతో తండ్రి కూతురు వెనుతిరుగుతారు. కాత్యాయని చివరకు లైబ్రరీ బాటలో పయనిస్తుంది. అదే ఆమె పాలిట వరమై అందులోనే ఉద్యోగంలో చేరి అక్కడకు వచ్చిన లెక్చరర్ల ద్వారా తన బి. ఏ, యం. ఏ పూర్తి చేసుకుని లెక్చరర్ గా ఉద్యోగంలో చేరుతుంది. సామెతలు చెప్పి తనకు అడ్డుపడవద్దని నాయనమ్మకు నిష్కర్షగా చెప్తుంది. కడకు మేనమామను కూడా అనవసర జోక్యం చేసుకోవద్దంటుంది.
కాత్యాయనికి లైబ్రరీ, బ్రతుకు పాఠానికి నాంది పలుకుతుంది. జీవితంలో తారసపడే కష్టాలకు ఆవేదనచెందక ఆడబిడ్డ ధైర్యంగా జీవించగలగాలి అనే కాత్యాయని నిర్ణయాలు స్త్రీలను ఉద్దీపన గావిస్తాయి. కాత్యాయని పి. హెచ్. డి చెయ్యాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇంట్లోనున్న వెండిపళ్లెం తీసుకునివెళ్లి బంగారు పూత వేయించి ఆ పళ్లానికి చేర్పు అవసరం లేకుండా స్టాండును అమర్చడంలో ఆమె మనోగతం వెల్లడవుతుంది.
శివరావు తమ్ముళ్లిద్దరు ఒకరు డాక్టరుగా మరొకరు ఇంజనీరుగా స్థిరపడుతారు. కాత్యాయని తమ్ముళ్లు ఒకరు పోలీసు ఆఫీసరుగా, మరొకరు బ్యాంకు ఆఫీసరుగా ఉద్యోగాలలో చేరుతారు. పోలీస్ ఆఫీసరుగా ఉన్న తమ్ముడితో శివరావు దగ్గరకు వెళ్తారు. కాత్యాయనిని చూసిన అత్తగారిలో పశ్చాత్తాపం మొదలై కళ్లనీరు నిండుతుంది. కాత్యాయని సంపూర్ణ యువతిగా రూపాంతరం చెంది ఒకనాటి భయం ఏ కోశాన కనబడని స్త్రీమూర్తిగా చుట్టుప్రక్కలవారిలో కూడా ఆనందం నింపుతుంది. శివరావు పొలాలను కౌలుకిచ్చి అందరు పట్నం చేరుకుంటారు. పట్నంలో తోటను తీర్చిదిద్దుతారు. బాటనీ విద్యార్థులకు, లెక్చరర్లకు తోటలోని విశేషాలు తెలిపే శివరావును కాలేజికి కూడా ఆహ్వానింపబడుతాడు. అత్యాచారాల నీడలో ఆత్మహత్యలు చేసుకునేవారికి బంగారు కంచం నవలలో కాత్యాయని పాత్ర మార్గదర్శకం అని రచయిత్రి చెప్పడం అక్షరసత్యం. బంగారు పోతపోసిన పళ్లెంకి పీఠం అమర్చి స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడగలదని బంగారు కంచం నవల నిరూపించింది. స్త్రీలలోని బేలతనానికి ముగింపు పలికి కాత్యాయని పాత్రను ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దిన పోలంరాజు శారదగారికి అభినందనలు, అభివందనాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *