April 26, 2024

నెరవేరిన కల

రచన: సునీత పేరిచెర్ల

” తెల్లవారనే లేదు ఇప్పటి నుండే ఏం చేసేస్తున్నావు లక్ష్మీ ” మోహన్ కళ్లు నులుముకుంటూ తన భార్యతో అంటూ హాల్ లోకి వచ్చాడు..
“మర్చిపోయారా ..! ఈ రోజు మనకెంతో ముఖ్యమైన రోజు కదా..మీతో పాటు ఫంక్షనుకు నేను కూడా వద్దామని కాస్త ముందుగానే లేచి పనులన్నీ పూర్తిచేసాను ” కాఫీ కప్పు చేతికందిస్తూ అంది లక్ష్మి…!
***
మోహన్ కాలేజీలో లెక్చరర్.. మానవతా దృక్పథం ,ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి.. సమాజం కోసం పాటుపడే మనస్తత్వం తనది..
లక్ష్మి కూడా ప్రతి పనిలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇద్దరూ కలిసి నలుగురికీ చేతనయిన సాయం చేస్తూ ఉంటారు. ఒక వృద్ధాశ్రమాన్ని కూడా నడిపిస్తున్నారు…
మోహన్ ,లక్ష్మీ ఒకరినొకరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వారు చేయదలుచుకున్న సమాజ సేవకు పిల్లలు ఆటంకం అని పిల్లల్ని కూడా వద్దనుకున్నారు..
వారి పెళ్లి అయిన దాదాపు 20 సంవత్సరాలకు, మోహన్ ఇంట్లోకి కొత్తగా పెళ్లి అయిన జంట అద్దెకు వచ్చారు..
మోహన్, లక్ష్మితో వాళ్లిద్దరూ బాగా కలిసిపోయారు. శ్రావణి అయితే లక్ష్మిని అసలు వదిలిపెట్టేది కాదు.. ఇంటి పని,వంట పని నేర్చుకుంటూ లక్ష్మి వెనకాలే తిరుగుతూ బోలెడు కబుర్లు చెపుతుంటుంది…
***
శ్రావణికీ చిన్నప్పటి నుండి చదువంటే ప్రాణం..కానీ మధ్యతరగతి కుటుంబం కావడంతో పై చదువులు చదివిస్తే అంత కన్నా ఎక్కువ చదివిన వారికి , ఎక్కువ కట్నంతో పెళ్లి చేయాలని పదవ తరగతి అవ్వగానే వాళ్ళ బావ సుధీరుతో పెళ్లి చేసేస్తారు తల్లిదండ్రులు….
సుధీర్ కి వైజాగ్ లో ఉద్యోగం. అందుకే భార్యని తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాడు ..
భార్యగా తన బాధ్యతలు ఎంతో శ్రద్ధగా నిర్వర్తించేది శ్రావణి. లక్ష్మి ప్రోద్బలంతో అన్నిపనులు నేర్చుకుంది. కానీ ఏదో మూల చదువుపై ఆసక్తి మాత్రం పోలేదు తనకు… మోహన్ గదిలో ఉన్న పుస్తకాలు ఒక్కొక్కటిగా చదువుతూ ఉండేది. అది చూసి మోహన్ చాలా సంతోషపడేవాడు..
***
” శ్రావణీ ఈ స్వీట్ తీసుకోమ్మా” లక్ష్మి లోపలికి వస్తూ శ్రావణి చేతిలో లడ్డు పెట్టి “పక్కింటి అనసూయగారి పాప డిగ్రీ పాసయ్యిందట ” అంది సంతోషంగా..
” నేను కూడా చదువు మధ్యలో ఆపకుండా ఉంటే ఈ పాటికి డిగ్రీ పూర్తయ్యి ఉండేది “మనసులోనే బాధపడింది శ్రావణి..
” ఏంటి శ్రావణి ఆలోచిస్తున్నావు ఏమైంది ” లక్ష్మి అడగడంతో
” నాకు కూడా చదువుకోవడం ఇష్టం ఆంటీ. బాగా చదువుకుని టీచరు అవ్వాలనేది నా కోరిక. కానీ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది ” అంటూ చెమర్చిన కళ్ళను చున్నీతో అద్దుకుంటూ చెప్పింది శ్రావణి..
“బాధపడకు శ్రావణి ” అనునయించింది లక్ష్మితర్వాత మోహన్ తో ” శ్రావణిని చదివిస్తే బాగుంటుందండి ..పాపం పిచ్చిది చదువుకోవాలని ఆశపడుతుంది .టీచరు అవుతుందట .. మీరే ఎలా అయినా సుధీరుతో మాట్లాడి ఒప్పించండి. మనము దగ్గరుండి చదివిద్దాం ” అంది లక్ష్మి..
లక్ష్మి మాటలు విన్న మోహనుకు తన గదిలో ఉన్న పుస్తకాలను శ్రావణి ఎంత శ్రద్ధగా చదివేదో గుర్తొచ్చింది ..
” సరే రేపే మాట్లాడతాను సుధీరుతో ” అన్నాడు..
***
“కాఫీ చల్లగా అయిపోయింది, తాగకుండా ఏం ఆలోచిస్తున్నారు ” లక్ష్మి అరుపుకి ఉలిక్కిపడిన మోహన్ ఆలోచనలలో నుండి తేరుకుని “ఏం లేదులే ” అంటూ లక్ష్మికి కాఫీ కప్పు తిరిగిస్తూ
“నిదానంగా చేసుకో పని ఎందుకంత హడావిడి ” అన్నాడు
” హడావిడి కాదండీ ఆనందం . శ్రావణి ఈ రోజు ఉత్తమ ఉపద్యాయురాలిగా అవార్డు తీసుకోబోతుంది .నాకెంత సంతోషంగా ఉందో మాటలు రావడం లేదు ” అంది లక్ష్మి..
“ఎంత కష్టపడి చదివిందో ..మీకు గుర్తుందా? సుధీరును మీరు ఒప్పించినా, తన అమ్మానాన్న కోడలికి చదువెందుకు అని ఒక పట్టాన ఒప్పుకున్నారా ..పాపం సుధీరు మన మాటలకు విలువిచ్చి అమ్మానాన్నలను ఎదిరించి మరీ భార్యను చదివించాడు ” అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది లక్ష్మి..
***
ఆధునికతకు ఆమడ దూరంలో ఉండే మారుమూల ప్రాంతంలో శ్రావణికి టీచరుగా పోస్టింగ్ వచ్చింది. పాఠశాలలో పిల్లలకు శ్రావణి అంటే ఎంతో ఇష్టం. సహోద్యోగులు కూడా ముచ్చటపడేవారు తనని చూసి.
కేవలం పుస్తకాలలో ఉండే పాఠాలు మాత్రమే కాకుండా విద్యార్థులకు వ్యక్తిత్వ , వికాస పాఠాలు కూడా భోధించేది శ్రావణి.
ఓటమిని ఎదుర్కొనే బలాన్ని, అనుకున్నది సాధించగలిగే పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో నింపేది..
పిల్లల తల్లితండ్రులు కూడా పిల్లల్లో వచ్చిన మంచి మార్పుకు శ్రావణిని అభినందిస్తూ ఉండేవారు..
పిల్లల్లో ఉండే టాలెంట్ ను బయటకు రప్పించి వారి ప్రతిభకు మెరుగులద్ది వాళ్ళను ప్రదర్శనలకు ,పోటీలకు సిద్ధం చేసేది.
తను టీచరుగా వెళ్లిన రెండు సంవత్సరాలకే ఆ స్కూల్ పిల్లల ప్రతిభా పాటవాల వల్ల ఆ స్కూల్ జిల్లాలోనే బెస్ట్ స్కూల్ గా నిలిచింది..
అదంతా శ్రావణి వల్లే అని తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్ శ్రావణి కి బెస్ట్ టీచర్ అవార్డును ప్రకటించారు.
***
పిల్లలందరి కరతాల ధ్వనుల మధ్య శ్రావణి కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకుంది..
టీచరు మీద ఉన్న అభిమానంతో తన బోధనా విధానంతో వాళ్లలో ఎంతో స్ఫూర్తి నింపినందుకు, పిల్లలే స్వయంగా టీచరుపై పాట రాసి, అలపించి తమ అభిమానాన్ని తెలియచేశారు. కొంతమంది పిల్లలు సన్మాన పత్రాన్ని చదివి వినిపించారు.
శ్రావణి భర్త , అత్తమామలకు చాలా గర్వంగా ఉంది. అదంతా చూస్తుంటే మోహన్ , లక్ష్మి కళ్ళలో ఆనంద బాష్పాలు చూసి సుధీర్ వాళ్ళను గట్టిగా హత్తుకున్నాడు..
కలెక్టర్ శ్రావణి గురించి ,ఆ పాఠశాల అభివృద్ధి గురించి మాట్లాడి, శ్రావణిని మాట్లాడమని ఆహ్వానించారు..
శ్రావణి వినమ్రంగా చేతులు జోడించి అక్కడున్న పెద్దలకు ,పిల్లల తల్లిదండ్రులకు నమస్కారాలు చేసింది.
తనకు లభించిన పురస్కారం మోహన్ గారి దంపతులకు అంకితం చేస్తున్నానని, వాళ్ళ పట్టుదల, భర్త ప్రోత్సాహం లేనిదే తాను ఈ పురస్కారాన్ని అందుకునే స్థాయికి రాలేకపోదునని సభాముఖంగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసింది.
అలాగే సహోద్యోగులు ,ప్రధానోపాధ్యాయులు తనకు అందించిన సహాయాన్ని గుర్తుచేసుకుంది.
“నన్నెంతో అభిమానించే విద్యార్థులే నా విజయానికి కారకులు .ఏమి చెప్పినా శ్రద్ధగా విని ఆచరిస్తూ ఉంటే నాకు రెట్టింపు ఉత్సాహం కలిగేది. ఇక్కడి పిల్లలు పాఠ్యాంశాలను బట్టీ పట్టరు ఇష్టంగా చదువుతారు . పరీక్షల్లో కాపీ కొట్టరు. నిజాయితీగా వాళ్లకు వచ్చిందే రాస్తారు. తోటి విద్యార్థులతో గొడవలు పడరు , స్నేహాభావంతో ఉంటారు
ఉపాధ్యాయులను గౌరవిస్తారు ,తల్లిదండ్రులను ప్రేమిస్తారు. నిజంగా ఇలాంటి విద్యార్థులకు టీచరుగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ స్కూల్ పిల్లలు ఎన్నో విజయాలు సాధించాలి. ఈ పాఠశాలకు మరింత గుర్తింపు రావాలి … ఆ దిశగా అడుగులు వేస్తాను ” అని ముగించింది శ్రావణి..
సభకు హాజరైన అందరూ లేచి నిలబడి చప్పట్లతో శ్రావణిని అభినందించారు.
తాను కన్న కల నెరవేరినందుకు శ్రావణి
తన భార్య ఇంతటి గొప్ప స్థాయికి చేరుకున్నందుకు సుధీరు
ఒకరినొకరు ఆనందంతో ఆలింగనం చేసుకుని
మోహన్ ,లక్ష్మి లతో కలిసి ఇంటికి తిరిగి వెళ్తారు….!!
*****

1 thought on “నెరవేరిన కల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *