April 26, 2024

చంద్రోదయం – 7

రచన: మన్నెం శారద

“నాకు నీ పెళ్ళి చూడాలని వుందిరా. పెళ్లికొడుకు వేషంలో నువ్వు చాలా బాగుంటావు. నా కోరిక తమాషాగా అనిపిస్తోంది కదూ!”

“బావుంది. నీ సరదా కొసం ఎవర్ని బడితే వాళ్లని కట్టుకోమంటావేం ఖర్మ”

“అలా ఎందుకంటాను? నచ్చితేనే”

“అంటే ఏదో సంబంధం తెచ్చేవన్నమాట.”అన్నాడు సారధి శేఖర్‌ని పరీక్షగా చూస్తూ.

“ఓ విధంగా అంతేననుకో. కాని కథంతా విని ఆలోహ్చించి నీ నిర్ణయం తెలియబరచు”

సారధి మాట్లాడలేదు.

శేఖర్ కూడా కాస్సేపు మౌనంగా కూర్చుని చెప్పటం మొదలెట్టేడు. “మా ఇంగ్లీషు మాస్టారు శంకరంగారు ఈ ఊళ్ళోనే వున్నారురా. ఒకప్పుడాయిన క్లాసులోకి వస్తే పులిని చూచినట్లు గజగజలాడేవాళ్లం. అంత భయంలో వుంచేరాయన. అలా అని ఆయన దుర్వాసుడు కాదు. కేవలం చదువు విషయంలోనే ఆయనలా ప్రవర్తించేవారు. క్లాస్ బయటకు వచ్చేక ఆయన పిల్లలతో పిల్లవాడిలా కలసిపోయేవాడు.

స్కూల్లో బీదపిల్లలకి గుప్తంగా ఫీజులు కట్టడం, చదువులో వెనుకబడ్డవారికి వూరికనే ట్యూషన్ చెప్పటం, అంతటితో వూరుకోక భోజనాలు పెట్టడం, చాలా మంచి వ్యక్తి.

అలాంటి మాస్టారిప్పుడెలా వున్నారో తెలుసా? గుర్తుపట్టడమే కష్టం. బక్కచిక్కి కృంగిపొయి ఎంతో దీనంగా కన్పించారు.

నన్ను చూసి ఎంతగానో సంతోషించేరు.

పాపం మాటల మీద చెప్పేరు. భార్య పోయిందంట. ముగ్గుతూ ఆడపిల్లలే. పెద్ద పిల్ల బి.ఏ. పరీక్షలు వ్రాసిందట. ఆ అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం వుంటే చూడమని చాలా జాలిగా అడిగేరు. అమ్మాయి బాగుంటుందని కూడా చెప్పేరు. ఆయన కట్నకానుకలు ఇచ్చుకోలేరు. పెన్షన్ డబ్బులతో ఇల్లు గడవడమే కష్టం ఆయనకు.

వెంటనే నాకు నువ్వే గుర్తొచ్చావు. కష్టాల్లో బ్రతికిన వాళ్లకి యితరుల కష్టాలు కూడా తేలిగ్గా అర్ధం అవుతా యంటారు.ఈ పెళ్లి చేసుకోవటంతో నువ్వు తోటివారిని ఆదుకొన్న ఆదర్శమూర్తివవుతావు.” అని శేఖర్ చెప్పటం ఆపి సారధి వంక చూసేడు.

సారధి మాట్లాడలేదు.

శేఖర్‌కి అనుమానం వేసింది. “నీకు యిష్టం లేదా?” అన్నాడు సూటిగా. సారధి  జవాబు చెప్పటానికి తడబడ్డాడు. “నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదురా” అన్నాడు మెల్లిగా.

శేఖర్‌కి కాస్త కష్టమనిపించింది.”పెళ్లి అప్పుడే చేసుకోవాలని లేదా? అసలు చేసుకోవాలని లేదా? లేక ఈ అమ్మాయిని చేసుకోవాలని లేదా?” సారధి కోపంగా చూసేడు.

“నిజమేరా! కేవలం జాలితో కట్టుకుంటే ఆ సంసారం ఏం బాగుంటుంది. ఆ అమ్మాయి ఎలా వుంటుందో తెలియవు, గుణగణాలు తెలియవు. పోనీ వాళ్ల ఆర్ధిక పరిస్థితి బాగా లేదు కాబట్టి డబ్బు సాయం చేసి ఆదుకుంటే బావుంటుంది” అన్నాడు.

శేఖర్ సారధి వైపు తీవ్రంగా చూసేడు.

“అవును. కష్టాలలో వున్నవారికి డబ్బు సహాయం చేయగల స్థాయికి ఎదిగేవు. కాని శంకరంగారు దానం పట్టేందుకు  పాత్ర వేసుకుని తిరగటం లేదు” అన్నాడు కోపంగా.

సారధి నిరుత్తురుడయి చూసేడు.

ఆ వెంటనే “ఇంతవరకూ వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నన్ను క్షమించు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెను తప్ప మరెవ్వరినీ చేసుకోలేను.” అనేసేడు తల వంచుకొన్ గబగబా.

శేఖర్ సారధి వంక ఆశ్చర్యంగా చూశాడు.

ఆ వెంటనే సారధి చాతి మీద గుద్దుతూ “రాస్కెల్! నా దగ్గర నీకు రహస్యాలు కూడా వున్నాయన్నమాట. ఇంత దగా ఎప్పుడు నేర్చుకున్నావు?” అన్నాడు ఆవేసంగా.

శేఖర్ చేష్టకి సారధి క్షణం ఆశ్చర్యపోయి “ఏం లేదు. ఏం చెప్పమంటావు?” అన్నాడు.

“మళ్లీ అదేం డైలాగ్! ఇప్పుడే ప్రేమిస్తున్నానన్నావు. మళ్లీ ఏం లేదు అంటావు?” శేఖర్ చిరాగ్గా అడిగేడు.

“నిజమే! ప్రేమించేను. లౌ ఎట్ ఫస్ట్ సైట్. కాని తిరిగి ఆమెను కలవలేకపోయాను. కనీసం ఆమె ఏ కాలేజీ స్టూడెంటో, ఏం చదువుతుందో కూడా నాకు తెలియదు. దరిదాపు వూళ్ళో వున్న కాలేజీలన్నింటి చుట్టూ పహరా తిరిగేను. వుమెన్సు కాలేజీ ముందు బీటు వేసేను. ఆమె ఆచూకి తెలియలేదు. కానీ.. ఏదో  ఓకరోజు ఆమె నాకు కనిపించి తీరుతుందన్న నమ్మకం నాకుంది. వెళ్తూ వెళ్తూ ఆమె నా వైపు చూసిన చూపు నేనీ జన్మకి మరిచి పోలేను. ఏనాటికైనా నేను పెళ్లి చేసుకుంటే, చేసుకునే గీతవుంటే అది ఆమెని మాత్రమే”

సారధి మాటల్లోని సీరియస్‌నెస్‌కి శేఖర్ మ్రాన్స్పడి చూసేడు. అతనిలో రవ్వంత అసూయ కూడా పొడ సూపింది. “అంటే.. నీకు ఏం కాని.. నీకంటూ ఏం చేయని ఓ అమ్మాయికి నీ హృదయాన్ని యిచ్చేసేవన్నమాట.”

సారధి మాట్లాడలేదు. నిస్సహాయంగా చూసేడు స్నేహితుడివైపు. “అయితే ఈ స్నేహితుడికి యింక నీ మనసులో చోటెక్కడిది?” జోక్‌గా అందామనుకున్నా అతని మాటల్లో నిష్టూరమే ఎక్కువగా ధ్వనించింది.

సారధి కళ్లు బాధతో రెపరెపలాడేయి.

అతను శేఖర్ చేతులు గట్టిగా పట్టుకొన్నాడు.

“అలా ఎప్పుడూ అనుకోకు. ఈ హృదయం నువ్వు తయారుచేసింది.  ఇందులో ప్రవహించే రక్తం నీ డబ్బుతో, నీ త్యాగంతో, నీ గొప్పతనంతో తయారయింది. అందులో ప్రతి అణువూ నిన్నే స్మరిస్తోంది. నీ కోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. నా ప్రేమకథ చెప్పేను. కాదూ కూడదంటే చెప్పు, మీ మాస్టారమ్మాయినే చేసుకుంటాను” అన్నాడు చాలా మెల్లిగా సారధి.

అతనలా అనేసరికి శేఖర్ మనసు విలవిలలాడింది.

“శంకరం మాస్టారికి నేను మాట యిచ్చేను. ఏదైనా సంబంధం చూసి ఆ అమ్మాయికి పెళ్లి చేసి మాస్టారి ఋణం తీర్చుకుంటాను”

“ఋణమా?” ఆశ్చర్యంగా అడిగేడు సారధి.

“ఏం, మనమంతా ఋణగ్రస్తులం కామా? కేవలం జీతం డబ్బులకోసమే వాళ్లంత కష్టపడి పాఠాలు చెప్పి మనని తీర్చిదిద్దారంటావా? కనీసం ఒకసారి ఆయన్ని చూసి క్షేమసమాచారాన్ని విచారిస్తున్నారా? ఈ పరుగు బ్రతుకులో ఒకరి గురించి ఒకరు నిలబడి ఆలోచించగల తీరికెక్కడిది. అంతా స్వార్ధం చుట్టూ తిరుగుతున్న గ్రహాలం. ప్రతి నిముషాన్ని డబ్బుగా మార్చుకుంటున్న బిజీ మనుషులం. స్నేహం, ఆత్మీయత, ప్రేమ, సహకారం, యిలాంటి పదాలు మన డిక్షనరీలనుంచి తొలగించుకోవాల్సిన కాలం ఇది” ఆవేశంగా అన్నాడు శేఖర్.

సారధి క్షణం మాట్లాడలేనట్లు శేఖర్ వైపు చూశేదు.

“నేను అనవసరంగా చాలా ఆవేశంగా మాటాడేను కదరా?” శేఖర్ నవ్వటానికి ప్రయత్నించేడు.

సారధి నవ్వలేదు. అతనికేదో చెప్పలని వుంది. భయంగానూ వుంది..

“ఏరా. అలా చూస్తావు?” శేఖర్ నవ్వుతూ అడిగేడు.

“నువ్వేమీ అనుకోకపోతే నిన్నోమాట అడగనా?”

“అడుగు. దానికంత సందేహం దేనికి?”

“నువ్వు ఎవర్నయినా ప్రేమించావా?”

“శేఖర్ సారధి ప్రశ్నకి నవ్వేడు.”అవున్నిజమే. ప్రేమించేను. ఒకప్పుడు డబ్బుని. ఆ డబ్బుతో కొనుక్కోగల సుఖాల్ని ప్రేమించేను. కాని నిన్ను కలిసిన క్షణం నుంచి పక్కవారి కష్టాల్ని మాత్రమే ప్రేమిస్తున్నాను.” అన్నాడు

“అలాంటప్పుడు ఆ అమ్మాయిని నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా.”

శేఖర్ సారధి వైపు ఆశ్చర్యంగా చూసేడు.

ఆ వెంటనే సారధి చేతులు గట్టిగా నొక్కి  వదిలేడు.

“నిజమే నాకీ ఆలోచన రానే లేదు. ఇంతసేపూ నీ మీదే వుంది నా దృష్టి. రియల్లీ ఐ థాంక్ యూ వేరీ మచ్.”

శేఖర్ డృఢంగా నిశ్చయించుకున్నట్లు పైకి లేచి నిలబడ్డాడు.

 

ఇంకా వుంది..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *