May 19, 2024

పూలమ్మాయి

రచన: లక్ష్మీ పద్మజ

సెల్‌ఫోన్‌ రింగ్‌కు మెలకువ వచ్చింది లలితకి. నెంబర్‌ చూసి వెంటనే లేచి కూచుంది.
“లలితా నిద్ర లేచావా” అరిచినట్టు అంది మాలినీ దేవి.
అయ్యో లేచాను మేడమ్‌ నేనే చేద్దామనుకుంటున్నాను అంది సంజాయిషీగా లలిత.
“ఆ పర్లేదు నీ అకౌంట్‌లో నలభై వేలు వేశాను చూస్కున్నావు కదా. ఎంతవరకు వచ్చింది నా శారీ సంగతి” అంది మాలినీ దేవి.
అదే చూస్తున్నాను మీ రంగుకు, అందానికి తగ్గది వెతుకుతున్నాను… రోజూ అదే పని మీద తిరుగుతున్నాను. ఇవాళ ఇంకో 4 షాపులకు వెళ్లొస్తాను, నేనే ఫొటోస్‌ పెడతాను. ఈరోజు తప్పకుండా పని అయిపోతుంది… మిమ్మల్ని ఎక్కువ వెయిట్‌ చేయనివ్వను మేడం” అంది లలిత.
మా జూబ్లీహిల్స్‌ లేడీస్‌ క్లబ్‌ యానివర్సరీ దగ్గరకొచ్చేస్తోంది… త్వరగా తీసుకురా.. నీ సెలెక్షన్‌, బ్లౌజు కుట్టడం అంతా బావుండాలి. అందరూ వేసుకునే రెగ్యులర్‌ కాంబినేషన్స్‌ ఉండకూడదు. గుర్తుంది కదా సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉండాలి. అందరికీ నచ్చితే నీక్కూడా మంచిదే కదా…
ఇక ఉంటా అంటూ కట్‌ చేసింది మాలినీ దేవి.
సరదాగా పొలాలు చూద్దామని పోచంపల్లి దగ్గర పల్లెటూరు వచ్చిన మాలినీ దేవి తన కుట్టు నైపుణ్యం చూసి ఎంతో ముచ్చట పడి సిటీకి తీసుకొచ్చి తనకి రూమ్‌ ఇచ్చి డబ్బు సాయం చేసి షాపు కూడా పెట్టించింది.
” దేవుడా కనీసం ఇవ్వాళ ఎలాగైనా మేడమ్‌ చీర సెట్టయిపోవాలి ” అనుకుంటూ మంచం దిగి, చకాచకా స్నానం చేసి, కాస్త ఉప్మా చేసుకుని తిని స్కూటీ వేసుకుని బైటికి వచ్చింది లలిత.
ఓ నాలుగు బొటిక్‌లు, నాలుగు షోరూమ్‌లు తిరిగే సరికే మధ్యాహ్నం దాటిపోయింది. అప్పటికే లలితకు నీరసమొచ్చేసింది. ఓవైపు ఎండ మండిపోతుండడంతో విపరీతంగా దాహమేసింది. ఎక్కడైనా వాటర్‌ దొరుకుతుందేమోనని చుట్టుపక్కల తెగ వెతికింది.
**************
దూరంగా గుడి గంటల శబ్దం వస్తే అటుకేసి బైల్దేరింది. నీళ్లు ఏమైనా దొరుకుతాయి కదా అనుకుంది… లలిత స్వగతంలో.
చివరికి తాను అనుకున్నట్టే అక్కడ గుడి కనిపించడంతో ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఎలాగూ నీళ్లు దొరక్కపోవు అలాగే దర్శనం కూడా చేసుకోవచ్చు అనుకుంది లలిత.
లోపలికెళ్లి నీళ్ల ట్యాపు తిప్పి కాళ్లు, చేతులు కడుక్కుని హాయిగా దాహం తీరే వరకూ నీళ్లు తాగింది. గుడిలోపలికెళ్లి దర్శనం చేసుకుని తీర్థం పుచ్చుకుంది. ఇంతలో ప్రసాదం పంచుతున్న ఒకామె వచ్చి ఆకు నిండా పులిహోర లలిత చేతిలో పెట్టింది.
అది తిన్నాక కాస్త హుషారు వచ్చింది. మరోసారి దణ్ణం పెట్టుకుని బైటికి వచ్చింది లలిత.
“అమ్మా పూలు తీస్కుంటారా ” అని వినబడితే యథాలాపంగా అటు చూసింది లలిత.
మల్లెపూల మాల కడుతోంది. ముఖం నిండా చిరునవ్వుతో ఎంతో చూడముచ్చటగా ఉంది ఆ నడివయసు అమ్మాయి.
లేత పచ్చి మావిడి కాయ రంగు చీరకి ముదురాకు పచ్చ జాకెట్టు వేసింది. చీర నెరిసిపోయింది. జాకెట్టు మీద అక్కడక్కడా ఎర్రటి చుక్కలు.. ఎంతో అద్భుతంగా అన్పించింది లలితకి. చకచకా కొన్ని ఫొటోలు తీసింది ఫోన్‌లో. ఇక తన సమస్య పరిష్కారమైనట్టు సంతోషంగా అక్కడినుంచి కదిలింది.
ఇంటికెళ్లి వంట చేస్కుని తిని గబగబా మళ్లీ బయల్దేరింది బస్సులో పోచంపల్లి వైపు.
గంటన్నర ప్రయాణం తర్వాత పోచంపల్లి.
నేరుగా మగ్గం దగ్గరకు చేరుకుంది. చిన్నప్పటి నుంచి అందరూ తెల్సిన వారు కావడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. ఫొటోలు చూపించి ఆ కాంబినేషన్‌లో చీర నెయ్యమని చెప్పింది. రంగు కొంచెం ముదురు కాకుండా అలాగని మరీ లేతగా కూడా కాకుండా కొంత వెలిసినట్టుండాలని మరీమరీ చెప్పింది. వారం తర్వాత రమ్మని చెప్పడంతో… తిరుగు ప్రయాణమైంది లలిత.
చూస్తుండగానే వారం గడిచింది. ఈలోపు మాలినీ దేవి నుండి 2 సార్లు ఫోన్‌ వచ్చింది లలితకి. పది రోజులయ్యాక చీర తెచ్చాడు మగ్గం కుర్రాడు.
***************
లేత పచ్చి మామిడి రంగుకు మరీ అంత ముదురు కాని రంగు బోర్డర్‌.. పమిట చెంగు మీద అక్కడక్కడ చిన్న చిన్న నెమళ్లు… నెమలి కంఠం రంగుతో వాటి ముక్కు దగ్గర ఎర్రని చుక్క… చూడ ముచ్చటగా ఉంది చీర. పోచంపల్లి పట్టుచీర. వెంటనే జాకెట్టు ముక్క కట్‌ చేసి కుట్టడం ప్రారంభించింది లలిత. రెండు రోజులు కష్టపడి ఎంతో అందంగా అద్దినట్టుండే ఫ్యాన్సీగా కూడా ఉండేటట్టు తయారు చేసింది లలిత.
“లక్ష్మీదేవిలా ఉండే మేడమ్‌ ఈ చీరలో ఇంకా ఎంతో బాగుంటారు” అనుకుంది లలిత. ఆరోజు తృప్తిగా నిద్రపోయినట్టు అనిపించింది లలితకి.
తెల్లారగానే అన్ని పనులు చకచకా పూర్తి చేసుకుని జూబ్లీహిల్స్‌ బయల్దేరింది చీర తీసుకుని.
***************
సోఫాలో కూచుని దానిమ్మ జ్యూస్‌ తాగుతోంది మాలినీ దేవి. లలితను చూడగానే సాదరంగా ఆహ్వానించింది. జ్యూస్‌ లలితకు కూడా ఇచ్చింది.
“ఏం లలితా చీర తెచ్చినట్టున్నావు ” ఇంతకీ ఏ చీర సెలెక్ట్‌ చేశావో అంది దర్పంగా.. కొంత కుతూహలంగా.
“తెచ్చాను మేడమ్‌.. మీకు నప్పే విధంగా తయారు చేయించాను. మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. చూడండి అంటూ అపురూపంగా కవర్లోంచి తీసింది.
చీర చూసిన మాలినీ దేవి కళ్లు మెరిసాయి. ఒక్కసారిగా మొహం వెలిగిపోయింది.
“చాలా బావుంది లలితా నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుస్తోంది. అసలు ఈ పాస్టల్‌ కలర్‌ ఎక్కడ దొరికింది, ఇప్పుడీ లేత రంగుల ఫ్యాషనే నడుస్తోంది. నీ టేస్టే..టేస్ట్‌ నిజంగా అద్భుతం.
అవును మేడం మీరు కట్టుకుంటే ఇంకా అందం వస్తుంది చీరకి. చక్కగా పూలు పెట్టుకోండి, మెడలో హారం వేసుకోండి.
“సాక్షాత్‌ లక్ష్మీ దేవే ప్రత్యక్షమైందంటారు చూడండి.” అంది లలిత మరింత ఉత్సాహంగా.
“నువ్వే వచ్చి తయారు చెయ్యి” అంది మాలినీ దేవి.
“తప్పకుండా మేడమ్‌” అంతకన్నానా… మహద్భాగ్యం అంది లలిత.
ఒక్క నిమిషం.. నీకు ఇరవై వేలు గిఫ్టుగా ఇస్తున్నా తీసుకో.. బ్యాగులోంచి తీసి చేతిలో పెట్టేసి కవర్‌ తీస్కుని పై ఫ్లోర్‌కెళ్లిపోయింది.
స్కూటీ స్టార్ట్‌ చేస్కుని గుడి దగ్గరకు చేరుకుంది లలిత. లోపలికెళ్లి దర్శనం చేసుకుని బయటకు వచ్చింది.
అదే స్థలంలో కూచుని పూలమ్మాయి పూల మాలలు కడుతోంది. నా దేవత లోపల్లేదు బయట ఉందనుకుంది లలిత.
“మూర మల్లెపూలు ఎంత” అని అడిగింది లలిత
“పది రూపాయలు అమ్మా” అని చెప్పింది పూలమ్మాయి.
“రెండు మూరలు ఇవ్వు” అంది లలిత.
“ఇదిగో అమ్మా” అందించింది పూలమ్మాయి.
“ఇవిగో డబ్బులు… పది వేలు వేరుగా పెట్టిన కవరు పూలమ్మాయికి ఇచ్చి స్కూటీ స్టార్ట్‌ చేసేసి రయ్‌న… వెళ్లిపోయింది లలిత.
కవర్లో పెట్టిన డబ్బు చూసి ఆశ్చర్యంగా చూస్తుండి పోయింది పూలమ్మాయి.

************

2 thoughts on “పూలమ్మాయి

  1. చాలా బాగుంది…. సింపుల్ గా అందరినీ ఆకట్టుకునే తీరులో వ్రాయటం లో లక్ష్మీ పద్మజ గారి ప్రతిభ తెలుస్తోంది…. చిన్ని చిన్ని కథలలో విషయం అంతా చెప్పడం ఒక కష్టమైన ప్రక్రియే…. పద్మజ గారి ప్రత్యేకతే అది…… మోహన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *