రచన:  వావిలికొలను రాజ్యలక్ష్మి.

 

ఉదయం టైమ్ ఆరు కావస్తుంది. వేడివేడిగా కాఫీ కల్పుకున్న కప్పు చేతపట్టుకొని బాల్కనీలోకొచ్చి తాపీగా కుర్చీలో కూర్చొని, సన్నగా పడుతున్న వర్షపు జల్లులను తదేకంగా చూస్తూ కాఫీని ఆస్వాదిస్తూ తాగుతోంది రేణుక.

ఈ కరోనా మాయదారి రోగం దేశదేశాల్లో ప్రబలి పోయి, మన దేశానికి కూడా త్వరితగతిన వ్యాపించేసరికి లాక్ డవున్ మొదలై, ఐటి వుద్యోగస్తులంతా యింటి నుంచే పనిచేస్తూ, ప్రవేట్ సంస్థలో పనిచేసేవారు వుద్యోగాలులేక కూరగాయలమ్ముకుంటూ కొందరూ, మట్టి పనికెళ్ళుతూ కొందరు తమ కుటుంబాలను పోషించుకుంటూ జీవితాలు గడుపుతున్నారు. పాపం, ఎలాంటి వాళ్ళకు ఎలాంటి దీన స్థితి వచ్చిందో కదా! అని అనుకుంటూ వుండగానే తన సెల్ రింగయింది.

లేచి లోపలికెళ్ళి  ఫోన్ తీసుకొని చూసి ఎవరిదో కొత్తనెంబరు లాగుందనుకుంటూ సెల్ ఆన్ చేసింది.

“హలో, ఎవరండీ?”మామూలుగానే అడిగింది.

“నేను భార్గవ్ ని. ”

“ఏ భార్గవ్ ?”

” భానుచందర్ పెద్ద తమ్ముడిని. ”

“ఓ , మీరా!చెప్పండీ ఫోనెందుకు చేశారు?”

“మా అన్నయ్య భానుచందర్ చనిపోయాడు. ”

కాసేపు యిద్దరి  మధ్య మౌనమే రాజ్యమేలింది

“ఎప్పుడు, ఎలా జరిగింది ?”

“ఈరోజే , తెల్లారుజామున నాల్గంటికి”.

” ఏమైంది?”

“హార్ట్ ఎటాక్ అనిచెప్పారు డాక్టర్ . కరోనా టెస్ట్ కూడా చేశారు హాస్పిటల్లో . నెగట్ వే వచ్చింది. ”

“స్మైలీ ఎలావుంది?”అడగగూడదని అనుకుంటేనే అడిగేసింది రేణుక.

“అదే , తండ్రి పోయాడనీ, ఇక లేడన్ననిజాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆ దుఃఖంలో తనని పట్టడం మాకెవ్వరికీ సాధ్యం కావడం లేదు. అంత శోకతప్త మనస్సుతో ఏడుస్తూ తానే మా అమ్మకి ఫోన్ చేయండని నాకు చెప్పింది. ‘వద్దమ్మా!నాన్నకి అమ్మకి విడాకులై ఒక ఏడాదైపోయింది. ఇప్పుడీ విషయం చెప్పిఅమ్మని పిలవడం అవసరమా ? ఆ వివాహబంధం తెగి పోయిందెప్పుడో. . . ‘ అని నేనన్నా  వినడంలేదు. అన్నయ్యతో  స్మైలీకి చిన్నప్పటి  నుంచి వున్న ప్రేమానురాగాలు, మమతానుబంధం, ఆత్మీయతఎలాంటివో ఆ ‘తండ్రీబిడ్డల యొక్క బంధం ‘ఎంత దృఢమైందో’ మీకు తెల్సినంతగా మాకెవ్వరికీ  తెలియదు  కూడా. పిచ్చిదిక ఎలా  బతుకుతుందో మాకర్ధం కావడం  లేదు . ”

“బాడీ ఎక్కడుంచ్చారు?”

“అన్నయ్య మీరు కలిసి ఎంతో యిష్టంగా కట్టించుకున్న కలల సౌధం’శాంతినిలయాని’కి ఇప్పుడే తీసి

కెళ్ళుతున్నాం. ”

“వాట్ ?!  అక్కడికా!?”చెప్పలేనంత ఆశ్చర్యంతో నమ్మశక్యం కానట్లుగా అడిగిందామె.

” ఆ , అక్కడికే. ఓమారు ఎప్పుడో స్మైలీతో అన్నయ్య అన్నాడట. ‘తనకేమన్నా ఐతే ఆయింటికి తీసి

కెళ్ళి అక్కడినుంచే తన అంత్యక్రియలు చేయా’లని చెప్పాడట. అందుకని స్మైలీ మాటకాదనలేక అంబులె

న్స్ లో అక్కడికే తీసికెళ్ళుతున్నాం. ”

“ఇన్నిసంవత్సరాలనుంచీ ఖాళీగా తాళం పెట్టివున్న అశుభ్రంగా వుండే ఆ యింటికెలా తీసుకెళ్ళాలని

అనుకుంటున్నారు?”తాను అడగకూడని ప్రశ్నది. కాని అనుకోకుండా అడిగేసింది రేణుక.

“మా పెద్దక్కయ్య కొడుకు వంశీ లేడూ!ఈ లాక్డవున్ సమయంలో సిటీకీ దూరంగా వున్న అక్కడికెళ్ళి ప్రశాంతంగా ఓ ఆరునెలలుండాలనే వుద్దేశ్యంతో అన్నయ్య అనుమతితోనే నాల్గురోజుల క్రితమే పనివాళ్ళని తీసికెళ్ళి ఇల్లంతా శుభ్రం చేయించాడు. పిచ్చిచెట్లన్నీ కొట్టించి, చెత్తచెదారం లేకుండా చేయించాడు. జంగ్ పట్టిన

ట్యాబ్ లన్నీ తీయించి కొత్తవి వేయించాడు . మిద్ద మీదుండే వాటర్ ట్యాంక్ ను  బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రంగా కడిగించాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. అన్నయ్య కోసమే అన్నట్లుగా ఆ యిల్లునలా శుభ్రం చేయడం జరిగింది. గేట్ బయటమీరు నాటిన మామిడిచెట్లు రెండూ పెద్దగై రెండేళ్ళ నుంచి కాయలు కూడా కాస్తున్నాయట. కాలనీవాళ్ళే తెంచుకుంటారట, అన్నట్లు అంబులెన్స్ వచ్చిందట

పిలుస్తున్నారు” ఫోన్ పెట్టేశాడు.

రేణుకకు ఓక్షణం నిస్సత్తువుగా అనిపించి అలాగే కింద కూలబడింది. మళ్ళీ సెల్ రింగయింది. ఎత్తింది

ఈ మారు అమ్మ చేసింది.

“ఎవరితో మాట్లాడుతున్నావే ఇంతసేపు?నీకోసం చాలా సేపటినుంచీ ఫోన్ చేస్తున్నాను. నీకీ విషయం తెల్సిందా?”

” ఊ , ఇప్పుడే తెల్సింది. భార్గవ్ ఫోన్ చేసి చెప్పాడు. ”

“మరి ఏం నిర్ణయించుకున్నావ్ !వెళ్ళుతున్నావా ?”

“నేనక్కడికి వెళ్ళాల్సిన అవసరం వుందంటావా అమ్మా?”ఎదురుప్రశ్నవేసింది తల్లికి .

” అదికాదే, రేణుకా! నాకు కూడా తెలిపారు కానీ, నేను వెళ్ళలేని పరిస్ధితి. స్మైలీ కారణంగానన్నా మీరిద్దరూ మళ్ళీ ఏదో ఓనాడు కలుస్తారని నామనస్సులో ఏదో చిన్న ఆశ వుండేది. అదీనాడు పూర్తిగా తుడిచి పెట్టుక పోయిందే. ఆస్తీ, అంతస్తు వున్న కుటుంబంలో యిచ్చామని మురిసిపోయాం. కాని ఏం లాభం?చివరికిలా విడిపోయారు. నేనెంత మోత్తుకున్న నీవేమాత్రం వినలేదానాడు. చిన్నవిషయానికే పెద్ద రాద్ధాంతం చేశావ్ ? పెళ్ళినాడు పెట్టిన నగా, నట్రా అన్నీ అక్కడే వదిలేసి, ఐదేళ్ళనాడు కట్టుబట్టలతో ఆయింటినుంచి వచ్చేసి, నీ చదువుకు తగ్గ వుద్యోగం చూసుకొని ఒక్కత్తివే స్వతంత్రంగా బతుకుతున్నావ్ . చివరికి విడాకులనాడు కూడా భరణం వద్దన్నావ్. తండ్రికి పిల్లంటే ప్రాణమని స్మైలిని అతనికే వదిలేశావ్ . ”

“ఇప్పుడీ సోదంతా నాకెందుకు చెప్తున్నావమ్మా !” విసుగ్గా అంది రేణుక.

“ఎందుకు చెప్తున్నానంటే ఆస్తీ ఇటు నీకూ కాక, అటు బిడ్డకి కాక మొత్తమంతా అన్నదమ్ములకే దక్కిందికదే!”

తల్లి మాటలకు కోపంతో ఒళ్ళు మండి పోయి చటుక్కున ఫోన్ నొక్కేసింది రేణుక.

**     **    **

సన్నగా చినుకులు పడుతున్నై. గేట్ వరకు కారు వచ్చేసింది. లోపలికి వెళ్ళడానికి వీలుకానట్లుగా వుంది రోడ్డంతా అడ్డదిడ్డంగా తవ్వేసి వుంది. కొత్తవి డైనేజి పైపులు వేస్తున్నారులా వుంది. ఏం చేయాలో ఓక్షణం పాలుపోలేదు రేణుకకు.  కాలనీ వాళ్ళవి చాలామంది కార్లు గేట్ బయటే ఆగున్నై.

ఓ పక్కగా ఆపి కారు దిగిందామె. ఈ కాలనీకి ఐదు సంవత్సరాల తర్వాత తాను మళ్ళీ వచ్చింది. ఇలా రావల్సి వస్తుందని కూడా అనుకోలేదేనాడు. కారు కీస్ హ్యండ్ బాగ్ లో వేసుకొని , చున్నీని మెడమీది నుంచి తల మీదిగా కప్పుకొని నోరు, ముక్కు కనబడకుండా బిగ్గరగా కట్టుకొని  గేట్ దాటి లోపలికెళ్ళసాగింది. బహుశా, ‘అంబులేన్స్ బయటే ఆగితే బాడీని స్టెచ్చర్ పై మోసుకొని యింటికి తీసికెళ్ళి వుండవచ్చు. ‘ అనుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తుా ముందు కెళ్ళుతుంది.

ఇల్లు సమీపిస్తుంటే ఎలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందోనని , అక్కడున్న బంధువులలో నుంచి

ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందోనని ఒకింత భయంగానేవుంది రేణుకకు. తానున్నప్పుడు పరిచయం వున్న వాళ్ళేవ్వరూ కనబడలేదు. ఒకరిద్దరు దారిలో కనబడినా కొత్త ముఖాలే.

మొత్తం మీద ధైర్యంగానే ఇంటికి చేరింది. భార్గవ్ చెప్పినట్లుగానే గేట్ కి అటుయిటు తాను నాటిన మామిడి

చెట్లు రెండూ గుబురుగా పచ్చగా కళకళలాడుతున్నై.

చెప్పులొదలేసి నేరుగా బయటి గుమ్మం నుంచే లోపలికెళ్ళింది రేణుక. పెద్దగా వున్న హాలోకి కలిసే ఎడం వైపుగా వున్నడైనింగ్ హాల్లో పండుకో బెట్టారు. తండ్రి పక్కగా కూర్చుని రోదిస్తున్న స్మైలీ , రేణుకని చూడగానే

ఒక్కఉదటున లేచి పరిగెత్తుక వచ్చి”అమ్మా!”అంటూ ఒక్కసారిగా బిగ్గరగా ఏడుస్తూ , “నాన్నిక లేడమ్మా”అంది

స్మైలి ఏడ్పు వింటుంటే అప్రయత్నంగా తనకి తెలియకుండానే దుఃఖం పొంగి పొర్లింది రేణుకకు. తనను వాటేసుకున్న కూతుర్ని మరింత దగ్గరగా పొదుముకుంది .

అక్కడున్న బంధువులు ఆ దృశ్యాన్ని తదేకంగా వీక్షించసాగారు. ఏడుస్తూనే “నాన్నని చూడమ్మా! ఎలా పడుకున్నాడో !”అంటూ రేణుక చెయ్యి పట్టుకొని తండ్రి శవం దగ్గరికి తీసికెళ్ళింది.

దగ్గరగా వెళ్ళిందామె. భర్త వైపు తదేకంగా చూసిందో క్షణం. రెండు నెలలక్రితం ఎవరిదో చుట్టాలపెళ్ళిలో అనుకోకుండా కల్సింది భానుచందర్ని. తానుకూడా ఆ పెళ్ళిలో అతన్నలా చూసి ఆశ్చర్య పోయింది. అతనే తన దగ్గరగా వచ్చి ‘రేణూ ఎలా వున్నావ్ ?’అంటూ ప్రేమగా పలుకరించాడు . ‘ఊ. . ‘అంటూ తాను తలూపింది. ఆరోజు తర్వాత మళ్ళీ ఇప్పుడిలా నిర్జీవంగా చూడ్డం.

ఎంతైనా భార్యాభర్తల బంధం. ఆయనతోనూ, ఈ ఇంటితోనూ ఎన్నోమధురానుభూతులు నిండుకొని వున్నాయి తనలో. స్మైలీ బాల్యం కూడా ఇక్కడే ఈఇంట్లోనే గడిచింది. . ఓణి ఫంక్షన్ వరకూ.

కళ్ళు తుడుచుకుంటూ రేణుక ఓమారు చుట్టూ చూసింది బంధువుల వంక . పెద్దాడ పడుచు, చిన్నాడపడుచు, బావగారు యిద్దరు మరుదులు. . ముగ్గురుతోటికోడళ్ళ పిల్లలు అంతావున్నారు. . వాళ్ళందరి చూపులు తన మీదనే వున్నాయని గ్రహించినామె అక్కడినుంచి కొంచెం మెల్లగా దూరంగా జరిగింది

 

**     **     **

భర్త అంత్యక్రియలు జరిగాక రేణుక అక్కడి నుంచి నేరుగా యింటికెళ్ళడానికి ప్రయత్నించింది. . . ఒక్క

స్మైలీ తప్పా . . . ఎవ్వరూ ఆమెను వుండమని అడగలేదు. వుండాలని కూడా తన మనస్సులో ఏ కోశానా లేదు.

స్మైలీని దగ్గరికీ తీసుకొని ‘ఏడవకు, నేను మళ్ళీ వస్తాననీ , ధైర్యంగా వుండమని పలు జాగ్రత్తలు చెప్పి కారెక్కిందామె.

కారు డ్రైవ్ చేసుకుంటూ తానింటికి ఎలా చేరిందో ఆమెకే తెలియదు . చాలా నీరసంగా నిస్సత్తువుగా వుంది

శరీరం. గ్లీజర్ ఆన్ చేసుకొని బాత్రూం లోకెళ్ళి తలారా స్నానం చేసింది. ఆకలితో కడుపు నకనకలాడుతుంది.

పొద్దునెప్పుడో తాగిన కాఫీ.  ముందుగా కడుపులో ఏదైన పడితేనే తాను మనిషవుతుంది అనుకుంటూ బియ్యం కడిగి కుక్కర్ పెట్టింది స్టవ్ వెలిగించి.

రేణుక మనస్సంతా దుఃఖంతో కాకవికలంగా వుంది. పదేపదే బిగ్గరగా విలపిస్తున్న స్మైలీ ముఖమే కళ్ళముందు కదలాడుతుంది .

ఆవకాయ పెరుగు వేసుకొని కొంచెం అన్నం తింది. ప్లేట్లో వడ్డించుకున్న మిగిలిన అన్నం వదిలేసి చేయి కడిగేసుకొని . . . . లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళి మంచంపై అలసటగా వాలిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా స్మైలీ ‘భాను చందర్ రూపమే కదలాడుతోంది. అతనితో గడిపినా వైవాహిక జీవితానికి సంబంధించిన గతం ఒక్కసారిగా కళ్ళ ముందుకదలాడ సాగింది.

**    **    * *

“నో , నేనిప్పుడే పెళ్ళి చేసుకోనమ్మా ! . . . ”

” ఏం ,  ఎందుకనీ ?ఇప్పుడేమైంది ?నీది ఇంజనీరింగ్ చదువు కూడా అయిపోయిందిగా.  రేణూ , భాను చందర్

చదువు సంస్కారం వున్నవాడు, ఆస్తీ అంతస్తు కలవాడు. ముఖ్యంగా మనకు తెల్సినవాడు . మనకు దగ్గరి

బంధువు. మీపెద్దమ్మకు అల్లుడు . మీఅక్క భర్త . . . . నీకు

బావ. రెండో పెళ్ళియన్న మాటే గానీ , భానుచందర్ కు ఏం తక్కువ రేణుకా? అందమూ , అణుకువ వున్న అందగాడు.

పాపం , చిన్న వయస్సులోనే అతన్ని తండ్రిని చేసి పాప పుట్టిన ఏడాది దాటకుండా ఏదో వైరల్ జ్వర

మోచ్చి ఆసుపత్రిలో వారం రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది మీ అక్క.

పెద్దమ్మకూడా ఇదే అంటుందిప్పుడు.

అల్లుడు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఎవరో పరాయి అమ్మాయ్ ఐతే . . . సవతి తల్లిగా తన మనమరాలిని

సరిగా చూసుకుంటుందో లేదోనని ఆవిడ భయం ఆవిడది. నీవైతే తనకిక ఏబెంగ లేదని ఆవిడ అభిప్రాయం . ఒప్పుకోవే రేణూ !మీపెద్దమ్మ కూడా ఈ పెళ్ళికి చాలా సంతోషపడుతుంది . . . ” అంటూ అమ్మ , పెద్దమ్మ పదే పదే అడగడం , ఫోన్స్ చేయడం వలన ఏదో ఓ నిర్ణయానికి రావాలని అనుకుంది . అంతలోనే ఓ రోజు తనకి ఫోన్ చేసి భానుచందరే స్వయంగా యింటికొచ్చాడు. ముక్కుసూటిగా మాట్లాడాడు

“రేణుకా! మా అత్తగారి . . . అదే మీ పెద్దమ్మ , మీఅమ్మగారి అభిప్రాయం కాదు నాకు కావల్సింది. ముఖ్యంగా నీ మనస్సులోని మాట కావాలి. పెద్దవాళ్ళు అన్న మాటల్లో కూడా నిజం లేకపోలేదు . స్మైలీ అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుకదా! తనని వదిలి నేనుండలేను రేణుకా ! ఇందులో నా స్వార్ధం కూడా వుంది . ఎందుకంటే  పరాయి  అమ్మాయ్ నాకు భార్యగా వస్తే సవతి తల్లి పాపను బాగా చూసుకుంటుందో లేదోనని

అదో భయం. అందుకని నేనే స్వయంగా వచ్చాను . నీ మనస్సులోని మాట తెలుసుకుందామని. ఇంకా రెండు మూడు రోజులు బాగా ఆలోచించుకునే ఏవిషయం చెప్పు రేణుకా!వస్తా మరిక. . . . ” అంటూ వెళ్ళిపోవడానికి లేచాడు.

“ఉండండి , బావా ! టీ తీసుకొని వెళ్ళుదురుగాని. . . . ”

“ఇప్పుడొద్దు రేణుకా ! రెండురోజుల తర్వాత నీవు చెప్పబోయేది శుభవార్త ఐతే. . . అప్పుడిద్దరం సంతోషంగా

కలిసి తాగుదాం ‘ టీ ‘ సరేనా ? ” సమ్మోహనంగా నవ్వుతూ వెళ్ళి పోయాడు.

ఆ  నవ్వుతో పడిపోయింది రేణుక. . . అచ్చం స్మైలీ కూడా ఇలాగే చిలకలా నవ్వుతోంది . దాని నవ్వు చూసే

అంతా స్మైలీ అనే పిలుస్తారు . బారసాల రోజు పెట్టిన పేరు సుహాసిని . ఆపేరు కూడా మంచి నవ్వుకల్గినదని అర్ధం.

రెండు మూడు రోజులు బాగా ఆలోచించి తన నిర్ణయం చెప్పింది. ఆ తర్వాత అమ్మ. . . . పెద్దమ్మ భానుచందర్ అంతా సంతోషపడిపోయారు . తనకు రెండో పెళ్ళే అయినా రేణుకు పెళ్ళి మొదటిసారి జరుగుతుంది కావున . . దేనిలోను   లోటు రాగూడదని తన అత్తగార్లకు చెప్పి . . . ఇరు వైపులా డబ్బంతా భానుచందరే ఖర్చు చేశాడు.  స్మైలీ తల్లి నగలు చాలానే వున్నాయి . అయినా కూడా వాటికి తోడు కొత్త డిజైన్స్ వి మరికొన్ని నగలు ఆర్డరిచ్చి చేయించాడు రేణుక కోసం.

వారిద్దరి వివాహం వైభవంగా జరిగింది. ఇల్లాలులేని ఆయింటికి మళ్ళీ పూర్వకళ వచ్చేసింది

స్మైలీని ఎంతో ప్రేమతో కన్నతల్లి కన్నా మిన్నగా చూసుకుంది రేణుక. వాళ్ళబంధం విడదీయరానిదైనది. చక్కగా భార్యాభర్తలు కల్సిమెల్సి వారిద్దరి ఆలోచనలకు అనుగుణ్యంగా సిటీకి దూరంగా వున్న వెంచర్ లో మరో కొత్త ఇల్లు కట్టారు. రేణుకతో పెళైయిన భానుచందర్ కి పట్టిందల్లా బంగారం అవ్వసాగింది. వ్యాపారం అంచెలంచెలుగా అభివృధ్ధి చెంద సాగింది. కొత్త ఇంటికి స్మైలీ తల్లి పేరు కలిసొచ్చేలా “శాంతి నివాస్ “అని పేరుపెట్టి బంధుమిత్రులను పిలిచి బ్రహ్మాండంగా గృహప్రవేశం చేశారు. దానితో పాటు స్మైలీకి ఓణీ పంక్షన్

కూడా వాళ్ళ అమ్మమ్మ ఘనంగా జరిపింది.

మొత్తంమీద భానుచందర్ రేణుక సంసారనౌక కొత్తింట్లో ఆరుపూవులు మూడు కాయలుగా ఆనందంగా హాయిగా సాగిపోతున్న శుభతరుణంలో వాళ్ళమ్మ కూతురి మనస్సులో ఓచిన్న విషబీజం వేసి వెళ్ళిపోయింది. అదే రేణుకలో రోజురోజుకు వట వృక్షంలా పెరగసాగింది. భానుచందర్ భార్యలో కన్పిస్తున్న మార్పును ఆశ్చర్యంగా తిలకించసాగాడు . రేణు మారిపో వడానికి కారణమేమిటో అతనికి తెల్సిరాలేదు అంతుపట్టలేదు. అన్యోనంగా సాగి పోతున్న వాళ్ళ దాంపత్య జీవనానికి  మధ్య పెద్ద వారధి కట్టినట్లు గా అనిపించింది రేణుక మౌనం.

” ఏమైంది రేణూ ! ఎందుకిలా వున్నావ్ ? నాతో చెప్పు. . . ఏం కావాలి నీకు ? భర్త దీనంగా అడిగిన మాటలకు ” ఏం కావాలన్నా యిస్తారా ?”వాడిగా సూటిగా ప్రశ్నించింది.

” తప్పకుండా . . . . అడుగు. ”

” నాకు మాతృత్వం కావాలి. మీ ద్వారా నేనో బిడ్డకి తల్లిని కావాలి ! ”

ఆ మాటలకి భానుచందర్ అవాక్కు ఐనాడు.

” ఏం , మాట్లాడ రేం ?”

“అది సాధ్యం కాదు రేణూ !”

ఎందుకు సాధ్యకాదు బావా ? నాకు సంతానం కలిగితే స్మైలీని బాగా చూడనని మీకనుమానమా!? ”

“ఇన్నేళ్ళకి నీకిప్పుడీ ఆలోచనేమిటి ? స్మైలీకూడా పెద్దగైంది . . . . . ఎవరైనా నీ బుర్రలోకెక్కించారా ?”

“ఎవరన్న బుర్రలోకి ఎక్కించడానికి నేనేమన్న చిన్న పిల్లనా బావా ! నావిషయం నాకు తెలియదా ? ఏ ఆడదాని కైనా తల్లి కావాలన్నది ఓ మధుర స్వప్నం. . స్మైలీ పెద్ద గైంది. ఇప్పుడిక నేనో పిల్లనో , పిల్లాడినో కంటే బాగుంటుందని నిర్ణయించుకున్నాను  బావా! సాయంత్రం మీరు నేను గైనకాలజిస్ట్ డాక్టర్ పారిజాత దగ్గరికి వెళ్ళుదాం . . . . ”

” ఏం అక్కరలేదు  రేణూ! నానుంచి నీకు  పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేదు. మన పెళ్ళికి ముందే నేను వేసక్టమీ చేయించుకున్నాను.

తన మీద పిడుగు పడినట్లుగా వులిక్కి పడిందామె

“ఏమిటీ !? నిజమా ! . . . “నమ్మలేకపోయింది రేణు ఎందుకలా చేశారు ?

“నా కూతురి కోసం !నీకు సంతానం కలిగితే నాకూతురి జీవితం ఎలా వుంటుందో ఊహించుకున్నాను. అలా కాకూడదనే ముందు చూపుతో నేను పిల్లలు పుట్టకుండా ఆపరేరేషన్ చేయించుకున్నాను. ”

“పెళ్ళికి ముందే మరి నాకెందుకు ఈవిషయం చెప్పలేదు బావా? ”

” నీవెందుకు నన్నడగలేదు మరదలా? ”

ఇలా భార్యాభర్తల మధ్యన మస్తు గొడవ జరిగింది. అలా కొన్నాళ్ళపాటు ప్రతి చిన్న విషయానికి వాళ్ళిద్దరి మధ్య ఏవేవో తగాదాలు. . . . . చిర్రుబుర్రులు. అది రోజు రోజుకి చిలికి చిలికి గాలి వానలా పెద్దపెట్టున జరిగి

నది . ఫలితం ఆలుమగల మధ్య దూరం పెరిగింది; బంధం తెగింది.

 

**   **     **

దశ దినకర్మకు కూడా రేణుక వెళ్ళలేదు.

రమ్మని వాళ్ళెవ్వరూ పిలువలేదు ; పిలిచినా తనకు మాత్రం వెళ్ళాలని లేకుండె. స్మైలీ రోజూ రమ్మని పిలుస్తూనే వుంది.

ఓ రోజు తల్లి ఫోన్ చేసింది. “ఏంటమ్మా ?” మామూలుగానే అడిగింది.

“అక్కడికెళ్ళుతున్నావా ?”

“లేదు. . . . ”

“వెళ్ళితేనే బాగుండునేమో !”

“ఎవరికి బాగు ?”

“స్మైలీ ఒక్కత్తి కదే !”

“ఒక్కత్తేం కాదు . తన తండ్రి తరుపున బంధువులు చాలానే వున్నారక్కడ . ”

“ఎంతమంది వుంటేం? తల్లి వైన నీవు లేకపోతే . . . ”

“నేనేం తన కన్న తల్లిని కాదుకదా?!”అలా అంటుంటే రేణుక గొంతు దుఃఖంతో గద్గదికమైంది.

” కన్నతల్లికన్నా మిన్నగా పెంచావు. ఇప్పటికీ స్మైలీ అంటే నీకు ఎనలేని ప్రేమానురాగా లున్నాయని నీ గొంతే తెల్పుతుంది రేణూ! ఆఆస్తి అంతా భాను చందర్ తన కన్నకూతురైన స్మైలీ పేరునే రాశాడట. అందుకని ఆ పిల్లని తమతో వుండమని అత్తలు , పెద్ద నాన్న, బాబాయ్ లు అంతా పిలుస్తున్నారట తెచ్చి పెట్టుకున్న ప్రేమలతో. . . . నిన్ననే తెల్సింది నాకు. కాబట్టి ఆ పిల్లని నీవు నీ దగ్గరుంచుకుంటే ఆఆస్తి పాస్తులు అన్నీ నీకే దక్కుతాయే! ఏమంటావ్ ?. . . ”

“ఏమంటానమ్మా ?నావిషయంలో నీవు యింక్కో మాటకూడా మాట్లాడవద్దంటాను. నాకు కోపం తెప్పించ వద్దంటాను. లోగడ నీవు నామనస్సులో వేసిన విషబీజంవలనే ఆనాడా అనర్ధం జరిగింది. . . ” రేణుక చాలా కోపంగా అంది తల్లితో.

” ఆ తర్వాత నేను నీ నిర్ణయాన్ని ఖండిస్తూ . . . నెత్తి నోరు బాదుకున్నాను కదే ! అయినా నీవు వినలేదు కదా!”

“చేతులు కలినాక ఆకులు పట్టుకొని ప్రయోజనంఏమిటి?  లాభం ఏమిటి ? జరగాల్సిన ఘోరం జరిగి పోయిందిగా. . . ” మరో మాటకైనా తల్లికవకాశం యివ్వకుండా ఫోన్ పెట్టేసి. . . రెండుచేతులతో ముఖం కప్పుకొని తనలోని దుఃఖభారం పోయ్యేలా బోరున విలపించసాగింది రేణుక.

వారంరోజులు యాంత్రికంగా గడిచిపోయాయి

స్మైలీ నుంచి ఎలాంటీ ఫోన్ లేదు.

ఐటీ ఉద్యోగిని కాబట్టి రేణుక యింట్లో నుంచి పని చేసుకుంటుంది. భానుచందర్ , స్మైలీ ఆలోచలతో అన్య మనస్కుతో గడుపుతున్న రేణుకు పని మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోతుంది. భర్త ఇంత త్వరగా పోవడానికి కారణం తానై అయివుండొచ్చుని అనుకుంటూ పదే పదే బాధ పడసా గింది.  ఏచిన్న చెడ్డ  అలవాటైనా లేని భానుచందర్ బాగా డ్రింక్ చేయడానికి అలవాటు పడ్డాడనీ, చనిపోయే రోజు కూడా రాత్రి పన్నెండుగంటల వరకూ తాగుతూ కూర్చున్నాడనీ ఆ రోజు వాళ్ళ తమ్ముళ్ళు మాట్లాడుకుంటుంటే వింది తాను . ‘అతని మరణానికి పరోక్షంగా కారణం తానేనేమో! ‘అన్న ఆలోచనతో మనస్సు  ఒక్క చోట కుదురుగా నిలవడం లేదు. ఆసమయంలో ఎందుకు నా మనస్సంతా మారిపోయింది. నేను తొందరపడి విడాకులు తీసుకున్నానా?  నాపట్ల ఎన్నెన్నో ప్రేమానురాగాలు పెంచుకున్న భానుచందర్ హృదయాన్ని

ముక్కలు చేశానా ? నేను దూరమైనానన్న దుఃఖాన్నిభరించలేక తాగుడకి బానిసై తన జీవితాన్ని చేజేతులా

నాశనం చేసుకున్నాడా ?’ఇలాంటి ఆలోచనలే తన మనస్సులో సుళ్ళు తిరుగుతూ తన బాధని మరింత ఎక్కువ చేసాయి.

“నేనెలా మారిపోయాను ? ఐదేళ్ళనాడు నాలో ఈఆలోచనలు నన్ను చుట్ట ముట్ట లేదె! ఇప్పుడెందుకొస్తున్నాయి ? భాను చందర్ చనిపోయాడన్న సానుభూతితో నన్నింతగా ప్రభావితం చేస్తున్నాయా ? పాపం మమ్ములిద్దర్ని కలపడానికి ఎంతో ప్రయత్నించి విఫలురాలైంది స్మైలీ. అలా ఆలోచిస్తున్న రేణుక కళ్ళ వెంట నీళ్ళు వర్షిస్తూనే వున్నాయి.

అంతలో కాలింగ్ బెల్ మోగింది. చున్నీతో కళ్ళు వత్తు కుంటూ , లాప్ టాప్ ముందు కూర్చునామె అయిష్టంగానే లేచి వెళ్ళి బయటి గుమ్మం తలుపులు తెరిచింది.

ఎదురుగా చేతిలో సూట్ కేస్ పట్టుకొని చిరునవ్వుతో నిల్చుని వుంది స్మైలీ .

తన కళ్ళను తానే నమ్మ లేక పోయిందామె. ఆశ్చర్యం , ఆనందం మేళవించిన స్వరంతో “స్మైలీ రా” అంటూ సూట్ కేస్ అందుకొని కూతుర్ని భుజాలు చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా పట్టుకొని నిండు మనస్సుతో లోపలికి తీసుక వచ్చింది.

” అమ్మా, నాన్న లేని నేనాయింట్లో వుండలేకపోయానమ్మా ! నాన్న నా పేరున రాసిన ఆస్తినంతా , చిన్న

బాబాయ్ సహాయ సహకారాలతో అమ్మనాన్నపేరు మీద అనాధ ఆశ్రమానికి రాసిచ్చాను. అమ్మవి , నీవి నగలు మాత్రం తీసుకొచ్చాను. నన్ను మాత్రం వెళ్ళిపొమ్మని అనకమ్మా ప్లీజ్ !” అంటూ రేణుకను బిగ్గరగా కౌగలించుకుంది. అది దుఃఖమో , ఆనందమో అర్ధంకాని అయోమయావస్థలో వర్షిస్తున్న అరమోడ్పు కన్నులతో చూస్తూ అంది .

“మంచి పని చేశావు స్మైలీ !చాలా మంచి పని చేశావు . నాకు ఎలాంటి అపకీర్తిని రానీయకుండా , ఆ ఆస్తిని వెంట బెట్టుకొని రానందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చిన్ని కృష్ణున్ని ప్రేమతో పెంచిన

యశోధ లాంటి ఈ అమ్మ  దగ్గరికి  నీ అంతట నీవే రావడం నిజంగా నాకు మహాదానందంగా వుండడమే గాక , బాధాగ్ని తో మండుతున్న నాగుండెల్లో పన్నీరు చిలకరించినట్లుగా వుంది . పువ్వులోని సువాసనలు దాగనట్లుగా  నాహృదయంలో సహజంగా వుండే కన్నతల్లి ప్రేమకన్నా పెంచిన ప్రేమే గొప్పదని తెలియజేశావు. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని , మీ నాన్న ఆత్మకి శాంతి కల్గేలా చూసుకుంటాను స్మైలీ !”మనస్ఫూర్తిగా ఆతల్లి మనస్సులోని ఆంతర్యాన్ని అర్థంచేసుకున్న స్మైలీ . . . రేణుని బిగ్గరగా వాటేసుకొని ఆ అమ్మ వెచ్చని గుండెల్లో సేదతీరినట్లుగా కళ్ళుమూసుకుంది. అరవిచ్చిన నవ్వే పువ్వు నువ్వే అన్నట్లుగా తన స్వంత చెట్టు కొమ్మకి చేరుకున్న శుభసమయమది.

 

 

అయిపోయింది

 

 

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *