May 9, 2024

అద్దం

రచన: లలితావర్మ

 

కిరణ్ చాలా అసహనంగా వున్నాడు. ఏసీ కారులో వెళ్తున్నా చెమటలు పడ్తున్నాయి.  మే నెల హైదరాబాద్  లో  ఎండ తీక్షణంగా వుంది. దానికి తోడు ట్రాఫిక్ జామ్.  కూకట్ పల్లి నుండి జాబిలీ హిల్స్  పన్నెండు కిలోమీటర్ల దూరం ,  ఉదయం పదింటికి బయలుదేరాడు భార్యా కొడుకుతో,  గంటన్నరైంది యింకా గమ్యం చేరలేదు.

మాటి మాటికీ చిరాకుపడుతూ డ్రైవర్ ని విసిగిస్తూనే వున్నాడు

“ఇంకా ఎంత సేపు” అంటూ

“సార్ ట్రాఫిక్ టైమ్ సార్. ఈ టైమ్ లో బయలుదేరితే యింతే సార్ ”  అంటూ సమాధానమిస్తున్నాడు డ్రైవర్

కిరణ్ అసహనానికి అసలు కారణం వేరు.దానికితోడు ఈ ప్రయాణం , తన అసహనాన్ని అణచుకోలేక

యెవరిపైన చూపించాలో తెలీక , సీటుమీద కారు బొమ్మ తో ఆడుకుంటున్న కొడుకుపై చూపించాడు

“స్టాప్ నాన్ సెన్స్ ” అంటూ గట్టిగా అరవడంతో వాడు బిక్కచచ్చిపోయి ముడుచుకుని తల్లికి దగ్గరగా జరిగి లోలోపల కుములుతున్నాడు. మానస కి గుండెలో మెలిపెట్టినంత బాధ .

కిరణ్ ని యేమైనా  అంటే మరింత రాద్ధాంతం చేస్తాడు దాంతో బాబు మరింత  కుమిలి పోతాడని తెలుసు అందుకే కిమ్మనకుండా బాధని దిగమింగి బాబు తల నిమురుతూ వుండిపోయింది.

కిరణ్ కువైట్ నుండి వచ్చేటపుడు  ఫ్లైట్ లోనూ యిదే ప్రవర్తన. సీటు బెల్టు పెట్టుకోమని, ఆక్సిజన్ మాస్క్ ఉపయోగించుకునే విధానం గురించి, ఎయిర్ హోస్టెస్

సైగలతో చెప్తుంటే   వాళ్లని నోటికొచ్చినట్లు తిట్టుకుంటూ ,  తన ఒళ్లోవున్న బాబుని లాగి సీట్లో కుదేశాడు. వాడు యేడుస్తుంటే ఒక్కటంటిచ్చాడు.

మానసకి ప్రాణం పోయినంత పనైంది.

బాబుని ఓదారుస్తూ వుండిపోయింది.

కొడుకు పరిస్థితి కి తను తల్లడిల్లి పోతుంటే తనకి  ధైర్యం చెప్పి అన్ని విధాలా చేదోడు వాదోడుగా వుండాల్సిన కిరణ్  , అడుగడుగునా అసహనం ప్రదర్శిస్తూ , చీటికి మాటికి కోపం తెచ్చుకోవడం ,

ఆ కోపం బాబుపైనే చూపటం,  తనేమన్నా అంటే  మరింత రాద్ధాంతం చేయడం, దాంతో బాబు బెదిరిపోవడం,  నరకం అనుభవిస్తోంది మానస.

ఆ విషయంలో ఎన్నోసార్లు గొడవపడింది కిరణ్ తో. ‘వాడి పరిస్థితి అర్థం చేసుకోకుండా వాణ్ణి అరిస్తే, కొడితే ప్రయోజనమేంటి కిరణ్ , చదువుకున్న నువ్వే యిలా ప్రవర్తిస్తుంటే యెలా ‘ అంటూ

“ఏం చెయ్యను మానసా ఆరేళ్లొచ్చాయి యెంత ట్రై చేసినా నోరు తెరిచి ఒక్క మాటా మాట్లాడడు. స్టిల్ టూ యియర్స్ బేబీలా ఆ డైపర్లు , వాడి ప్రవర్తనా భరించలేకపోతున్నా ఐ కాంట్  బేర్ !”  అంటూ అరుస్తాడు

‘కిరణ్ వాస్తవంలోకి రా హి ఈజ్ అబ్    నార్మల్ ‘అని మానస యెంత నచ్చ చెప్పినా

“అదే ! వై ? యెందుకు ? నాకే యిలా” అంటూ జుట్టు పీక్కుంటాడు.

బాబుని చూస్తే ఆటిజంతో బాధపడుతున్నాడు

కిరణ్  ని చూస్తే యెక్కడ డిప్రెషన్ లో పడిపోతాడో అన్నట్లున్నాడు. ఆ  దిగులు మానసని కుంగదీయసాగింది

తనూ బాధపడుతూ కూర్చుంటే పరిస్థితి చేయిజారిపోతుందని గ్రహించి ధైర్యం కూడదీసుకుని  తన వంతు ప్రయత్నం చేస్తూనే వుంది మానస.

అందులో భాగమే స్నేహితులు  బంధువులు చెప్పగా కువైట్ నుండి  హైదరాబాద్ కి రావటం.

మానస,  కిరణ్  విజయవాడ  లో ఇంటర్ కాలేజీ ఫ్రెండ్స్.

ఇంటర్ తర్వాత వేరు వేరు కాలేజీల్లో డిగ్రీ చదువులు కొనసాగినా , వారి స్నేహమూ కొనసాగి ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.  కిరణ్ మానసని యిష్టపడటంలో ముఖ్య కారణాలు రెండు.

ఒకటి మానస అందం,  రెండు మానస తండ్రి హోదా.

కిరణ్  చిన్నప్పటినుండీ అందాన్ని ఆరాధించేవాడు. కంటికి ఇంపుగా లేనిది యేదైనా  చూట్టానికికూడా యిష్టపడేవాడు కాదు.  అందుకే  అందగత్తె అయిన మానస తో స్నేహం చేసి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు

కొడుకు పెళ్లయ్యాక కిరణ్ తండ్రి తన వ్యాపారం విస్తరించడం లో భాగంగా  కువైట్ లో బ్రాంచి  తెరవడం తో కిరణ్ మానేజింగ్   డైరెక్టర్ గా వెళ్లి స్థిరపడటం జరిగింది.అప్పటికే బాబుకి  సంవత్సరం వయసు.

కువైట్ కి వెళ్ళాక రెండు సంవత్సరాలు వాళ్ల దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోయింది.

బాబుకి మూడో సంవత్సరంలో గానీ సమస్య యేమిటో తెలియరాలేదు.

తెలిసినప్పటినుండీ వారిద్దరి ఆందోళనకు అంతు లేదు.

కిరణ్ బిజినెస్ పనుల్లో మునిగితేలుతూ దొరికిన కాస్త సమయం బాబుతో గడపాలని ఆశించేవాడు . వాడి ముద్దు ముచ్చట్ల తో అలసట మర్చిపోవాలనుకున్న కిరణ్  కి   వాడి  పిచ్చి చూపులు, యెంత చెప్పినా యేం చెప్పినా  అర్థం చేసుకోలేని  వాడి పరిస్థితి ప్రవర్తనా విసుగు తెప్పించేది.

రాను రానూ కిరణ్ లో అసహనం పెరిగి పోవటంతో  కొంతమంది సలహా మేరకు బాబు ని ఒంటరిగా వుంచటం  మంచిదికాదని, నలుగురి మధ్య పెంచాలని, హైదరాబాద్ లో మంచి ఇన్స్టిట్యూట్స్  వున్నాయని తెలిసి యిలా రావటం జరిగింది.

కూకట్ పల్లి లో వున్న మానస  అన్నయ్య (పెదనాన్నగారబ్బాయి )యింట్లో దిగారు. అతడే జాబిలీ హిల్స్ లోని ఇన్స్టిట్యూట్ గురించి చెప్పి , వెంట వెళ్లేందుకు తనకు వీలుకాక డ్రైవర్ నిచ్చి పంపించాడు.

తన స్నేహితుడు డా: విల్సన్ న్యూరాలజిస్ట్,  లండన్ లో ప్రత్యేకంగా పిల్లల్లో ఆటిజం గురించి పరిశోధనచేసి, ఇక్కడ  జూబ్లీహిల్స్లో ”  ఆలంబన  న్యూరో అండ్ రిహాబిలిటేషన్  ,  స్పీచ్ అండ్ లాంగ్వేజ్  సెంటర్ ”  పేరుతో ఇన్స్టిట్యూట్ పెట్టాడని అక్కడ స్పీచ్ థెరపీ వల్ల తనకు తెలిసిన పిల్లల్లో చాలా మార్పు వచ్చిందనీ చెప్పడంతో ,

కిరణ్ గూగుల్ సెర్చ్ కూడా చేయగా మంచి రేటింగ్స్ కనబడ్డాయి.   దాంతో  మానసలో  కొత్త ఆశలు చిగురించాయి కానీ కిరణ్ ప్రవర్తనలో మార్పులేదు.

మానస మనసులో కోటి దేవుళ్ళకి మొక్కుకుంది. ఇక్కడ బాబు కి నయమై అందరు పిల్లల్లా నార్మల్ గా మారాలని, కిరణ్ మామూలు మనిషవాలని.

ఇంతలో కారు ఒక గేటు ముందాగడంతో మానస ఆలోచనల నుండి బయటపడింది

గేటు దగ్గర సెక్యూరిటీ  గార్డు  సలాం కొట్టి లోపలకి దారి చూపించాడు.  గేటు లోపల అడుగు పెట్టగానే చల్లని గాలి   శరీరానికి సోకి అంత యెండలోనూ  ఆహ్లాదాన్ని కలిగించింది.

చుట్టూ  ఎత్తైన  చెట్లు ,  గేటు కిరుప్రక్కలా అందమైన  పూల మొక్కలు, గేటునుండి  రిసెప్షన్  దాకా వెళ్లే దారికి రెండు వైపులా పచ్చని లాన్, అందులో విరగబూసి మందార చెట్లు ,  మాలి పైపుతో చెట్లకి నీళ్లు పడుతుండటంతో , ఆ నీటితుంపరలపైనుండి వీచే గాలి చల్లగా హాయిగా తాకి ,అప్పటివరకూ చేసిన ప్రయాణ బడలికను చేత్తో తీసేసినట్లుగా   మాయం చేసింది. ఆ ఇన్స్టిట్యూట్ యజమాని డా: విల్సన్ అభిరుచికి నిదర్శనంలావుంది ఆ ప్రాంగణం ‘నిజమే పూలని ప్రేమించే వారు పిల్లల్నీ ప్రేమించగలరు ‘

అనుకుంది మానస.

రిసెప్షనిస్టు దగ్గరకెళ్లి, ఆన్ లైన్ లో అపాయింట్ మెంట్ తీసుకున్న విషయం నిర్ధారించుకున్నాక  కాసేపు కూర్చోమని చెప్పడంతో  కూర్చుని ఎదురుచూడసాగారు కిరణ్ దంపతులు

మానస ఆ హాలునంతా పరీక్షగా చూడసాగింది.

హాల్లో యింకా ముగ్గురు దంపతులు తమ పిల్లలతో పాటు కూర్చుని వున్నారు. గోడ పైన టీవీ లో స్లైడ్స్ చూస్తున్నారందరూ.

ఆటిజం పిల్లలకు రకరకాల ఎక్సర్ సైజులు చేయిస్తున్న సిబ్బంది.

ఆటలాడిస్తున్న దృశ్యాలు, డ్రాయింగ్ పెయింటింగ్ వగైరా పనులు చేయిస్తున్న దృశ్యాలు , మానసని ఆకట్టుకున్నాయి.

అక్కడ గోడపై వున్న పోస్టరు ఒకటి మానసని మరింతగా ఆకట్టుకుంది

” ఇఫ్ దే కాంట్ లర్న్

ద వే వి టీచ్,

వి టీచ్ ద వే , దే లర్న్”

 

ఇంగ్లీషు లో వ్రాసివున్న ఆ అక్షరాల్లో భావం మానస కి యెంతో ఆత్మ స్థైర్యం కలిగించగా  కిరణ్ వంక చూసింది. మానస చూపులోని భావాన్ని గ్రహించిన కిరణ్ తల పక్కకి తిప్పుకున్నాడు.

ఆ పరిసరాలను, టీవీ లో కనబడుతున్న స్లైడ్లను,

ఆ పోస్టర్ ని, తమలాగే యెదురు చూస్తున్న మిగతా  దంపతులను చూస్తున్నపుడు కిరణ్ లోనూ ‘ ఆశ ‘ చిగురించటంమొదలైంది.

ఈ ‘ఆలంబన’ ఇన్స్టిట్యూట్  బాబు జీవితానికి ఆలంబన కావాలని మనసులో కోరుకుంటున్నాడు.

*           *          *

అరగంట తర్వాత లోపలికి రమ్మని పిలుపు రావడంతో కిరణ్ , మానస బాబుతో పాటు  లోపలి కెళ్లారు.

చిరునవ్వుతో ఆహ్వానించి తనకెదురుగుండా కిరణ్ మానసలను కూర్చోమని చేయి చూపించి బాబుని తన పక్కగా కూర్చోబెట్టుకున్నాడు డా: విల్సన్.

కిరణ్ దంపతులను ప్రశ్నలడుగుతూ వాళ్ల కుటుంబంలో వారెవరికైనా ఆ లక్షణాలున్నయేమో తెలుసుకునేందుకు ఫామిలీ హిస్ట్రీ రాబడుతూనే

బాబు ని చెకప్ చేసాడు.

మరికొన్ని పరీక్షలు చేసిన మీదట సమస్య తీవ్రత గురించి చెప్పగలనని , బాబు తప్పక నార్మల్ అవుతాడని , స్పీచ్ థెరపీలో   నిపుణురాలు మిసెస్ విల్సన్ కి ఒకసారి బాబు ని చూపించమని ప్రక్క గది చూపించాడు డా: విల్సన్.

గది బయట నిలబడివున్న ఆయా “ఒక్క నిమిషం  ”

అంటూ లోపలికెళ్లి మరలా బయటకొచ్చి “రమ్మంటున్నారు వెళ్లండి  ” అంది తలుపు తీసి పట్టుకుని .

లోపలికి అడుగు పెట్టిన దంపతులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అక్కడ దర్జాగా కుషన్ కుర్చీలో కూర్చునివున్న వ్యక్తిని చూస్తూనే.

అప్రయత్నంగా వారి నోటి నుండి వెలువడింది “స్వాతి ” అని.

వారిద్దరినీ  చూసిన మిసెస్ విల్సన్  తానూ అప్రయత్నంగా లేచి నిలబడి సంభ్రమంగా ” కిరణ్ , మానసా ” అంది .

మొహం నిండా నవ్వుపులుముకుని తమని సంబోధిస్తున్న స్వాతి ని,  తలెత్తి చూసే ధైర్యం లేక కాస్త తలవంచుకున్నారిద్దరూ

అపరాధభావం నిండిన మొహాలతో  తనవేపు చూస్తున్న వారిద్దరి నీ కూర్చోమని చెప్పి , బాబు ని యెత్తుకుని తన ప్రక్కనే కూర్చోబెట్టుకుంది స్వాతి

“వూఁ చెప్పండి యేంటి సమస్య  హైదరాబాద్ లోనే వుంటున్నారా”  అంటూ ప్రశ్నిస్తున్న స్వాతి కంఠం వీణమీటినట్లుగా వినబడింది మొదటిసారి కిరణ్  దంపతులకు .

” ఆఁ  ఆఁ   లేదు    కువైట్ , కువైట్ నుండొచ్చాము . నువ్వూ, మీరూ యిక్కడా ” అంటూ కిరణ్ తడబడుతుంటే ,

“ఫరవాలేదు కిరణ్ కొత్తగా మర్యాద లెందుకు  నువ్వు అనే అను ” అంది స్వాతి

కిరణ్ చెంప మీద ఛెళ్లున  కొట్టినట్లయింది.

మానస మొహం లోనూ కొట్టొచ్చినట్లు కనబడుతున్న న్యూనతాభావం చూసి వాళ్లను కాస్తసర్దుకునేలా చేయాలని భావించిన స్వాతి

“యేం తీసుకుంటారు కూల్ , ఆర్ హాట్? ” అడిగింది

“అఁహ ఇప్పుడేం వద్దు ” అన్నారిద్దరూ

“అదేం కుదరదు ” అంటూనే కాలింగ్ బెల్ నొక్కి, ఆయా లోపలికి రాగానే  కూల్ డ్రింక్స్ తెప్పించాలని పురమాయించి “సార్ ని ఒకసారి రమ్మను “అని చెప్పిపంపింది   స్వాతి.

రెండు నిమిషాల తర్వాత లోపలికొచ్చాడు డా: విల్సన్ .

ముగ్గురం  విజయవాడ లో ఇంటర్ కాలేజీలో క్లాస్మేట్సని పరిచయం చేసింది స్వాతి విల్సన్ కి.

“వావ్ ఇట్స్ గ్రేట్ ” అంటూ కూర్చున్నాడు విల్సన్.

బాబు కున్న ఆటిజం సమస్య గురించి కాసేపు చర్చించి , ఏం ఫరవాలేదని , ధైర్యంగా వుండమని,

బాబు నార్మల్ అవుతాడని భరోసా   యిచ్చారు విల్సన్ స్వాతి.

ఇంతలో కూల్ డ్రింక్స్ రావడంతో వాటిని సేవిస్తూ ,

ఇంటర్ తర్వాత  తామెక్కడ చదివిందీ, పెళ్లి , కువైట్ కి వెళ్లటం, లాంటి  విషయాలు చెప్పాడు కిరణ్.

” ఇంటర్ తర్వాత  హైదరాబాద్ లో బి.ఎస్సీ నర్సింగ్ లో చేరాను.  శిక్షణా సమయంలో పిల్లల విభాగంలో పనిచేస్తున్నపుడు ,ఈ ఆటిజం పిల్లల పట్ల ప్రత్యేక  శ్రద్ధ కలిగింది. శిక్షణ పూర్తయాక  విల్సన్  దగ్గర ఉద్యోగం లో చేరాను ” అని స్వాతి చెప్తుంటే

“ఆఁ ఆఁ ఇక్కడినుండీ నేను  కంటిన్యూ చేస్తా ” అంటూ స్వాతి  ని అడ్డుకుని

“ఎనీ వే మా స్వాతి గురించి నాకన్నా మీకే బాగా తెలిసుంటుంది టీనేజ్ ఫ్రెండ్స్ కదా! అంటూ  నవ్వుతున్న విల్సన్  ని చూసి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు కిరణ్ స్వాతి.

‘మా స్వాతి ‘అన్నప్పుడు అతని కళ్లలో  కదలాడిన గర్వపు రేఖ కిరణ్ మానస ల చూపు దాటిపోలేదు.

“స్వాతికి వృత్తి పట్ల వున్న అంకిత భావం , పిల్లల పట్ల ప్రేమ, సేవా గుణం,  యివన్నీ నన్ను ఆకట్టుకున్నాయి. ఆమె గొప్ప వ్యక్తిత్వం నన్ను ఆకర్షించింది.  సో నేనే ప్రపోజ్  చేశా.  అలా మా పెళ్లి జరిగింది.”

చెప్పాడు విల్సన్.

కిరణ్ దంపతులతో మాట్లాడుతున్నా  విల్సన్ , స్వాతి దృష్టంతా బాబుమీదే , బాబు చేష్టల్ని గమనిస్తూనే వున్నారిద్దరూ.

ఆ తర్వాత హోమ్ అంతా  తిప్పి చూపించారు.

వీళ్ళంతా మా పిల్లలే చెప్పాడు విల్సన్ హోమ్ లో పిల్లల్ని  చూపిస్తూ .

ఎవరి పిల్లలో ,  ఏ సంబంధమూ లేని పిల్లల్ని ,

అందరి కన్నా భిన్నంగా వుండే పిల్లల్ని తమ పిల్లలుగా భావించి , వారిలో మార్పుకోసం కృషి చేసే విల్సన్, స్వాతి ధన్యులు అనుకుంది మానస.

కావలసిన లాంఛనాలు పూర్తి చేసుకుని ,

ఇంటికి తిరిగి  బయలు దేరారు కిరణ్ మానస .

 

వారికి వీడ్కోలు పలికిన స్వాతి కి, కారులో కూర్చున్న కిరణ్ మానస కి ఇంటర్ కాలేజీ రోజులు, జరిగిన సంఘటనలు  సినిమా రీలులా కళ్లముందు కదలాడసాగాయి

 

************

” అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా

రంభా వూర్వశి కైనా యింతందం సాధ్యమా     ”

తన వెనక పాట విన్పించి  ఒక్కసారి తిరిగి చూసింది స్వాతి.

అమ్మో రాణీ రుద్రమదేవి రోయ్ అని ఒకరు,

ఝాన్సీ లక్ష్మీ బాయి రోయ్ అని మరొకరు కామెంట్ చేస్తుంటే , కిసుక్కున నవ్వింది పక్కనే వున్న అమ్మాయి.

స్వాతి  వాళ్ల సంస్కారానికి నవ్వుకుని తిరిగి వెళ్లిపోయింది.

స్వాతికదేం కొత్త కాదు చిన్నప్పటినుండీ రకరకాల నిక్ నేమ్స్, రకరకాల కామెంట్స్ , తన తోటివారి దగ్గర వింటూనేవుంది.

చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో , నాన్నమ్మ నిరాదరణ తట్టుకోలేక నాన్నే అమ్మ కూడా అయి పెంచాడు స్వాతిని. స్కూలు మాష్టరయిన నాన్న,   ఆదర్శ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్న నాన్న పెంపకం లో మొక్కవోని ఆత్మ స్థైర్యం సొంతం చేసుకుంది స్వాతి.

చిన్నప్పటినుండీ నాన్న చెప్పే  భారత రామాయణాది ధార్మిక కథలు,   స్వాతంత్ర్య  సమరయోధుల త్యాగాల కథలు, శివాజీ వీర గాథలు ,  మదర్ థెరిసా సేవాగాధలు,   ఝాన్సీ ,రుద్రమ పరాక్రమాలు అన్నీ యెంతో శ్రద్ధగా వినేది. వివేకానంద , అబ్దుల్ కలామ్ వంటి మహనీయుల సూక్తులు ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి.

ఎవరేమన్నా లెక్క చేయని ధైర్యం ఆమె సొంతం.

ఇంటర్మీడియట్ లో కాలేజీలో చేరిన మొదటి రోజే  ఎన్నో వ్యాఖ్యలు వినబడ్డాయి. ఇపుడు పాట. స్వాతి అవేవీ పట్టించుకునేది కాదు

చదువులో ఫస్ట్.   గొంతువిప్పితే కోకిల కంఠం .మంచి వక్త. లెక్చరర్లందరికీ ప్రత్యేక అభిమానం .

అదే కొందరికి కంటగింపుగా మారింది.

ఎలా అయినా స్వాతినేడిపించాలని కంకణం కట్టుకున్నారు. అందులో మొదటివాడే కిరణ్,

అతనితో పాటు స్వాతినేడిపించాలని ప్రగాఢ కోరికతో ప్రయత్నించేది కిరణ్ స్నేహితురాలు మానస.

ఓ సారి స్వాతి నోటు పుస్తకంలో నుండి ఒక పేజీని దొంగిలించి , అచ్చు స్వాతి చేతి వ్రాత కాపీ చేస్తూ స్వాతి వ్రాసినట్టుగా  కిరణ్ కి ఓ ప్రేమలేఖ వ్రాసి , ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేశారు కిరణ్ , అతని స్నేహితులు .

దాంతో కాలేజీ అంతా ఆ విషయమే చర్చనీయాంశంగా మారింది.

మరో అమ్మాయి అయివుంటే ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏం చేసేదో కానీ స్వాతి ఇసుమంతైనా చలించలేదు.తను వ్రాయలేదని కచ్చితంగా చెప్పింది ప్రిన్సిపాల్ కి.

ప్రిన్సిపాల్  గది నుండి బయటకొచ్చిన స్వాతి ని, వరండా లో కాపు కాచుకునివున్న మానస, మిత్ర బృందం రకరకాలుగా కామెంట్ చేశారు.

ఆఖరున ” దీని మొహానికి కిరణ్ కావలిసొచ్చాడా” అని మానస వ్యాఖ్యానిస్తే

“అదే కదా! ఓ సారి అద్దంలో మొహం చూసుకొమ్మనవే ”  అంటూ మరో అమ్మాయి సెటైరు.

అన్నీ విని కూడా అసలు ఏమీ విననట్లే వెళ్తున్న స్వాతి ని చూస్తుంటే వాళ్ల అహం శాంతించలేదు సరికదా మరింత మండిపోయారు.

ఆ రోజు యింటికెళ్లిన  స్వాతి అద్దం ముందు కూచుంది. తన రూపాన్ని చూసుకుంది

బాగా పైకి పొడుచుకొచ్చిన కుడి కన్ను, గుంటలో కూరుకుపోయిన యెడమకన్ను, లావైన పెదవులు, పై పెదవిపైన పెద్ద కాయలాంటిదానిపైన వెంట్రుకలు, మొహమంతా అవాంఛిత రోమాలు,  లావుపాటి శరీరం, నల్లని శరీరఛాయ, ఏవో జన్యు పరమైన లోపాలవల్ల తనకా రూపం సంభవించిందని స్వాతి కి తెలుసు, కానీ యేనాడూ తనలా పుట్టినందుకు బాధపడలేదు స్వాతి.

పుట్టుక దేవుడిచ్చిన వరం.అది మన చేతుల్లో లేదు. ఉత్తమ గుణం, సత్ప్రవర్తన,  ఉన్నత వ్యక్తిత్వం

సంపాదించుకోవడం మన చేతుల్లోనే వుంది.

అవే మనిషికి నిజమైన అందాన్నిస్తాయి అని తండ్రి చెప్పిన మాటలు ఆమె యేరోజూ మర్చిపోలేదు.

అందుకే జీవితంలో యెన్ని అవమానాలెదురైనా లెక్కచేయక తన లక్ష్యం దిశగా అడుగులు వేసింది స్వాతి.

“అందం ముఖంలో లేదు నీ నిజాయితీ ,నీ వ్యక్తిత్వం నీ అందాన్ని యినుమడింప జేస్తాయి”   అనే కలామ్ మాటలను గౌరవించే విల్సన్ కి స్వాతి లోని మానసిక సౌందర్యమే కనబడింది.

ఈ సత్యాన్ని గ్రహించిన కిరణ్ మానస సిగ్గుతో కుచించుకుపోయారు.

జ్ఞాపకాలనుండి బయటపడిన స్వాతి , కిరణ్  మానస

ఇద్దరూ పశ్చాత్తాపంతో బాధపడుతున్నారని గ్రహించింది. వాళ్ల బాబు ని నార్మల్ గా మార్చటానికి శాయశక్తులా ప్రయత్నించాలి అనుకుంది.

ఇల్లు చేరిన మానస అద్దం ముందు కూచుంది. అద్దంలో తన ప్రతిబింబం వికృతంగా కనబడసాగింది.

భరించలేక వెనుదిరిగిన మానస ,బాబుని ప్రేమగా గుండెలకు హత్తుకున్న  కిరణ్ ని చూసి నిట్టూర్పు  విడిచింది

‘ఆలంబన మా జీవాతాలకే ఆలంబన అవుతుంది

థాంక్యూ స్వాతీ’ అనుకుంది మనసులో.

 

సమాప్తం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *