May 11, 2024

పెద్దరికం

రచన: ప్రభావతి పూసపాటి

దేవి నవరాత్రులు మొదలయ్యాయి. ఈ రోజు అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు .గుడి అంతా భక్తులతో కళకళలాడుతోంది.కల్పన దర్శనం చేసుకొని గుడి మంటపం లో కూర్చొని వచ్చేపోయే భక్తులను  చూస్తోంది. ఎదురుగాఒక పెద్దజంట తమ కొడుకు కోడళ్ళు  మనవళ్లతో  కలిసి వచ్చినట్టున్నారు.అందరు ఆనందంగా ,సంతోషంగా కనపడుతున్నారు.వాళ్ళని చూస్తూవుంటే అత్తగారు,మామగారు వున్నరోజులు గుర్తుకువచ్చాయి. తన పెళ్లి అయ్యి అత్తగారింటికి వచ్చేనాటికి వాళ్ళది వుమ్మడి కుటుంబం.అత్తగారు మామగారు తమ భాద్యతగా తమ్ముళ్ళని ,చెల్లెళ్లని చదివించి పెళ్లిళ్లు చేసి స్థిరపరిచారు .తన భర్త కంటే పెద్దది అయిన ఆడపడుచుకి పెళ్లి చేసేసారు,తను వఛ్చిన తర్వాతనే మరిదికి ,చిన్న ఆడపడుచుకి పెళ్లిళ్లు జరిగాయి. అత్తగారు ,మామగారు ఉన్నన్నాళ్ళు పండగలకి పబ్బాలకి అందరు వచ్చేవారు .మరిది,ఆడపడుచులు “వదిన వదిన” అంటూ ఆప్యాయంగా వుంటూ ప్రతి పనిలోనూ కలసిమెలసి ఉండేవారు ,తోడికోడలు ఉన్నవాళ్ళ అమ్మాయి అయినా సొంత చెల్లెలి లాగా “అక్క అక్క” అంటూ కలివిడిగావుండేది.మామగారు కూడా వున్నా ఆస్తి అందరికి సమానంగా ఇచ్చి న్యాయంగానే ప్రవర్తించారు.

” నువ్వు కల్పనే కదూ?” అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చింది కల్పన. చనువుగా భుజం మీద చెయ్యివేసింది ఎవరా అనివెనక్కి తిరిగి నవ్వు తున్న సావిత్రిని చూసి ఆశ్చర్యపోయింది.

సావిత్రి తన చిన్ననాటి స్నేహితురాలు.విజయవాడ లో సావిత్రిది  తమది పక్క పక్క ఇళ్లు .సావిత్రి వాళ్ళది కాస్త వున్న కుటుంబం, ముగ్గురు అన్నలతో  ,అక్కలతో సావిత్రి వాళ్ళ ఇల్లు కళకళలాడుతూ ఉండేది,కాలేజీ చదువులు వచ్చేనాటికి సావిత్రి వాళ్ళ నాన్నగారికి వేరే వూరు బదిలీ  అవడంతో విడిపోయారు,మల్లి   ఇన్నాళ్ళకి ఇలా గుడిలో కలిశారు.

కుశల ప్రశ్నల తరువాత సావిత్రి వాళ్ళు ఉండేది తమ పక్క వీధి అని తెలిసి ప్రసాదం తీసుకొని కారులో ఇద్దరు ఇంటికి బయలుదేరారు.దారిలో సావిత్రి తాను పండగకి తమ అన్నగారింటికి వచ్చామని,తాను బెంగుళూర్ లో ఉంటానని చెప్పింది.తమ తల్లి తండ్రి చనిపోయారని,అప్పటినుంచి పెద్దఅన్నయ్య తమ భాద్యత తీసుకొని తమ అందరిని జీవితం లో స్థిరపరిచాడని చెప్పింది.

మాటల్లోనే సావిత్రి వాళ్ళ ఇల్లు వచ్చింది.తనని చూస్తే  ఆందరూ సంతోషిస్తారు అని, తర్వాత తీరుబడిగా వస్తానని చెప్పిన వినకుండా ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది సావిత్రి.ఇల్లంతా బంధువులతో చుట్టాలతో,హడావుడిగావుంది.తనని గుర్తుపట్టి అందరు ఆప్యాయం గాపలకరించారు,ఫలహారం చేస్తే కానీ వదిలి పెట్టలేదు .సావిత్రి వాళ్ళ వదినగారు తాముండేది పక్క వీధి అని తెలిసుకొని పండగకి తాను,భర్త భోజనాలకి రావాలని మరి మరీ పిలిచారు,వాళ్ళ ప్రేమాభిమానాలకు ఉక్కిరి బిక్కిరి అవుతూ,మళ్ళీ వస్తానని చెప్పి ఇంటికి చేరాను.

ఇంట్లో కి రాగానే  ఒంటరిగా కూర్చొని టీవీ చూస్తున్న భర్తని చూస్తే  తాము ఇన్నాళ్లు ఏమి కోల్పోయామో,దేనికోసం మనసు ఆరాటపడుతోందో బాగా తెలిసొచ్చినట్టు అనిపించింది .భోజనాల సమయం లో భర్త “పిల్లలు ఫోన్ చేసారని,ఈ సారి కూడా పండగకి రాలేకపోతున్నామని “చెప్పారని,గద్గదమైన గొంతుతో చెపుతూ,కన్నీ ళ్ళు తాను గమనించ కూడదని వడి వడిగా గదిలోకి వెళ్లిపోయారు.

భర్త చెప్పిన మాటలు చెవిలో గింగురుమంటున్నైయ్  ,తన పిచ్చిగాని పిల్లలు ఎందుకు వస్తారు, తాముఎమంతా ఆప్యాయతలమధ్య వాళ్ళని పెంచామని?మనసుకి ఎంత సర్ది చెపుతున్న మళ్ళీ గతం లోకి జారీ పోయింది.

తనకి ఇద్దరు పిల్లలు పుట్టే వరకు అత్తా మామగారు బ్రతికే వున్నారు.  మామగారు అత్తగారు కాలం  చేసాక తనలోనూ భర్త లోను ఆలోచనావిధానం లో మార్పు వచ్చేసింది,మామగారు పోయాక జరిగిన కార్యక్రమాల ఖర్చులవలన,ప్రతిసారి వస్తూపోతూ వున్న ఆడపడుచుల చీర సారే ఖర్చులవలన,బంధువుల తాకిడి వాళ్ళపెట్టుపోతల  ఖర్చుల వలన ఇలా తమ జీవితాలు, జీతాలు ఖర్చు పెట్టుకొంటూ పొతే ఇంకా తమకి,తమ పిల్లలికి ఏమి మిగులుతుంది అన్న ఆలోచన బాగా ప్రబలి ఆప్యాయత   స్తానం లో” స్వార్థం” కమ్మేసి తను, తన భర్త, తన పిల్లలు,ఇవే ముఖ్యం. వీళ్ళే  కుటుంబం అన్న భావం వచ్చేసి,తన ప్రవర్తన లోను,భర్త వ్యవహార శైలి లోను మార్పు వచ్చేసింది.ఫలితం అప్పటినుండి ఆడపడుచులతో మాట్లాడకపోవడం,మరిది తోటికోడలితో ముభావంగా ఉండటం,వాళ్ళ ఇళ్ల ల్లో శుభకార్యాలకు వెళ్ళక పోవటం,తమ ఇంట కార్యక్రమాలకి పిలవక పోవటం చేసాము..తోడబుట్టినవాళ్ల ఎదుగుదల మా మనస్సులో” ఈర్ష్య అసూయలని” ప్రేరేపించాయి, ఫలితం తమవారికన్నా తాము ఉన్నతంగా ఉండాలి ,పిల్లల్నికూడా అలాగే ఉంచాలి అన్నదే ధేయముగా తమ జీవితం అంతా గడిపేశాము.వూరికి దూరం గా వున్నా గేటెడ్ కమ్యూనిటీ   లో ఆధునిక వసతులతో వున్న ఇల్లు తీసుకొన్నాము,తమలాంటి వైభవోపేతమైన జీవితం అతి తక్కువ వయసులోనే ఏర్పరుచుకొన్నాము అన్న అఃహంకారం అందరిని దూరం జరిగేలా చేసింది,తమ ప్రవర్తన తెలిసి  నెమ్మది నెమ్మదిగా బంధవుల  రాకపోకలు తగ్గాయి,కొంత కాలం తర్వాత ఫోన్ పలకరింపులు  కూడా తగ్గాయి,ఎప్పుడైనా ఎదురు పడితే ముక్తసరి పలకరింపులు వచ్చేసాయి.

పిల్లలు సహజంగానే తెలివితేటలూ వున్నవారు,తమ మనసు గ్రహించి,తమకి రెక్కలు రాగానే తమ గమ్యాలు నిర్ణయించుకొని వెళ్లిపోయారు,బహుశా తామే పరోక్షంగా పంపేసామేమో …..  అందుకు మిగిలింది విపరీతమైన ఒంటరితనం. అప్పుడు చేసిన తప్పుల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామేమో ఆలోచనలతో సతమవుతూ ఉండగానే తెల్లారింది

పొద్దున్నే మొక్కలకి నీళ్లు పోస్తున్న నేను సావిత్రి గేట్ తీసుకొని లోపలి కి రావటం చూసి  సంతోషం తో ఎదురు వెళ్లి కొగిలించుకుని లోపలి తీసుకు వచ్చాను . మాది  చాల పెద్ద ఇల్లు .ఇంటి ముందు రెండు కార్లు, ఇంట్లో రెండు జాతి కుక్కలు, ఇల్లంతా ఆధునికం గ అలంకరింపబడి ఉంటుంది .ఇంటి ముందు వెనక గార్డెన్ తో అట్టహాసం గ వుంది.కానీ ఇల్లే బావురుమంటోంది .తాను ,భర్త ఇద్దరే బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాము.

ఇంట్లో కి రాగానే తానూ చెప్పనవసరం లేకుండానే చాల విషయాలు సావిత్రి కి అర్థం అయినట్టు వున్నాయి,క్లుప్తం గ నేను కూడా జరిగిన విషయాలు చెప్పాను .కాఫీలు తాగి గదిలోకి వచ్చి కూర్చున్నాక మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టింది .

నిన్న గుడిలో మొదటిసారి నిన్ను చూసినప్పుడు,నువ్వు కల్పనవి   అన్న సంతోషం కన్నా  నాకు తెలిసిన కల్పనవి మాత్రం కాదని అన్న భావం  భాద కలిగించింది .నిన్న మా ఇంటిలో నువ్వు అందరిని చూసి పొందిన  ఆనందం,సంతోషం కన్నా ,నీ కళ్ళలో ఎదో కోల్పోయిన దిగులు నన్ను మీ ఇంటిని వెతుక్కొంటూ  వచ్చి నీతో మాట్లాడాలి అనేలా  చేసింది.

మా నాన్నగారు  కాలం చేసాక మా పెద్ద అన్నయ్య మా అందరికి పెద్ద దిక్కు అయ్యాడు,మా వదినతో కుటుంబం అంటే కేవలం నేను ,నా భార్య ,నా పిల్లలు మాత్రమే కాదు,నాతొ పాటు నా తమ్ముళ్లు, చెల్లెలు,వాళ్ళ కుటుంబాలు అన్ని కలిపి నా పెద్ద కుటుంబం అని చెప్పి మా అందరి భాద్యత తీసుకొన్నాడు.అన్నయ్య వదిన తమ  స్వార్థం   చూసుకోకుండా మా అందరికి  అండగా నిలబడినందుకు కృతజ్ఞతగా  మేమందరం మా బాధ్యతలని తెలుసుకొని మా  కర్తవ్యాన్ని నిర్వర్తించాము..

ఇంటికి పెద్ద దిక్కుగా భాద్యత తీసుకోవటం అంటే కేవలం ఆర్థికంగ  మాత్రమే అని చాలామంది అపోహ పడి మనకెందుకు అని తమ పెద్దరికాన్ని చేజేతులా వదులుకొంటారు.ఏదయినా వదులుకోవడం తేలిక ,మళ్ళీ ఆ స్థానం పొందటం కష్టం.మా అన్నయ్య మా బాధ్యతల వత్తిడి వల్ల తనకంటూ ఏమి సమకూర్చుకోలేకపోయాడు.ఊర్లోనే ఆ పాతబడ్డ ఇంట్లోనే  ఉంటానన్నారు,కానీ మేమంతా కొంత సొమ్ము వేసుకొని మా అన్నవదినల కోసం ఇక్కడ ఇల్లు తీసుకొన్నాము.తన పెద్ద వయసులో మా అందరిమధ్య సంతోషంగా ,నిశ్చింతగా , సంతృప్తిగా గడపాలని మా అందరి కోరిక. ఇలా చెయ్యటం వలన మేమందరం కొంతైన మా  భాద్యత ,ఋణం తీర్చుకొంటున్నాము..అంతేకాదు పండగలకి ఎలాంటి పనులు వున్నా పిల్లల దగ్గరినుంచి,స్కూళ్ళు,కాలేజీలు ,ఉద్యోగాలు అన్ని వదులుకొని అన్నవదినలతో  కలిసి గడపడమే అసలైన పండగ  అని  మేమంతా భావిస్తున్నాము ఇదే  మా  అందరి అభిప్రాయము..

నాకు తెలియదు మీ ఇల్లు పండగ రోజుల్లో కూడా ఇంత నిశబ్దం గ ఎందుకు ఉందొ?ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో? ఎవరు బాధ్యులో  ?కానీ తప్పెవరిది ఐన ఇంటిని ఒక త్రాటి   మీద నడపాల్సిన భాద్యత మాత్రం  ఆ ఇంటి పెద్ద వాళ్లదే.తల్లి తండ్రి వున్నంతవరకు వాళ్ళది,వాళ్ళతరువాత ఇంటి మొదటి సంతాననిది .ఏఏ ఇంట్లో అలంటి భాద్యత తీసుకొన్న వారు వున్నారో ఆ ఇల్లు కళకళలాడుతున్నాయి.నువ్వు  బావగారు ఏమి చేస్తారో తెలియదు మళ్ళీ నేను పండగ చేసుకోవడానికి  ఈ వూరు వచ్చే సమయానికి మీ ఇల్లు కూడా పిల్లపాపలతో సుఖ సంతోషాలతో కళాకలాడాలి అని నాలో  ఉత్సాహాన్ని నింపి తను భారమైన మనసు తో  వెళ్ళిపోయింది.

స్వార్థం ,అసూయ,అహంకారం  ఈ మూడుగుణాలు అందరిని మాకు దూరం చేసాయి .వాటి స్తానం లో ఆప్యాయత ,అనురాగం, అణుకువ అలవరచుకొని తెగిన బంధాలను,తెరమరుగైన అనుబంధాలను మెరుగుపరచుకొని రాబోయే పండగలకైనా తన వాళ్ళు అందరు రావాలని ఆశతో తన వంతు ప్రయత్నంకి      సన్నద్ధమైనది కల్పన. విరిగిన మనసులు అతకడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు … ఇంటి పెద్దగా తాము కోల్పోయిన  తమ పెద్దరికాన్ని తిరిగి  నిలబెట్టాలన్న  తన ప్రయత్నం లో  కల్పన విజయం సాధించాలని ఆశీస్తూ………..

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *