June 14, 2024

అమ్మమ్మ – 20

రచన: గిరిజ పీసపాటి

తెనాలిలో పది రోజుల పాటు కష్టపడినా రాని సొమ్ము హైదరాబాదులో ఒక్కరోజు వంట చేస్తే వచ్చింది. అదే అమ్మమ్మకి చాలా అబ్బురంగా అనిపించింది. “రాజేశ్వరమ్మా! వాళ్ళు పొరపాటున ఎక్కువ ఇచ్చినట్లున్నారు. ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళకు ఎక్కువ ఇచ్చారని చెప్తాను” అన్న అమ్మమ్మను ఆపేసారు రాజేశ్వరమ్మ గారు.
“ఈ ఊరిలో వంట చేసేవారు ముఖ్యంగా మన గుంటూరు వంట చేసే బ్రాహ్మణ స్త్రీలు దొరకడం కష్టం. అందుకే వాళ్ళు మీ పని మెచ్చుకుని సంతోషంగా ఇచ్చిన డబ్బు ఇది. మీరు ఫోన్ చెయ్యక్కర్లేదు. ఇప్పటికైనా తెనాలిలో కన్నా ఈ ఊరిలో మీకు బాగుంటుందనిపిస్తే చెప్పండి. అక్కడ ఉన్న మిగిలిన సామాను కూడా తెప్పించేద్దాం” అన్న ఆవిడ మాటలకు అమ్మమ్మ సమాధానం ఇచ్చే లోగా పోస్ట్ మాన్ వచ్చి ఉత్తరాలు ఇచ్చి వెళ్ళాడు.
వాటిలో అమ్మమ్మ పేరిట ఉన్న ఉత్తరాన్ని అమ్మమ్మకి ఇచ్చారు. రాముడువలస నుండి వియ్యంకుడు పీసపాటి నరసింహమూర్తి గారు రాసిన ఆ ఉత్తరంలో ‘అంతా క్షేమంగా ఉన్నామని, తమ చిన్న కొడుకు వివాహం నిశ్చయమైనందున తప్పకుండా రావలసింది’గా రాసారు.
ఇక్కడ అమ్మమ్మ పెళ్ళి వంటకు ఒప్పుకున్న ముహూర్తానికే ఆ ముహూర్తం కూడా కావడంతో ‘తాను రావడానికి వీలు కాదనీ, వధూవరులకు ఆశీస్సులు తెలుయజేస్తూ’ తిరిగి ఉత్తరం రాసింది. అమ్మమ్మ తెనాలిలో ఉండగా రాజేశ్వరమ్మ గారు ఒప్పుకున్న రెండవ వంట పనికి కూడా వెళ్ళి ఎక్కడా తేడా రాకుండా చూసుకుంది.
ఇద్దరు మనుషులను చేతి కింద పని సాయానికి ఇవ్వడంతో, వారితో మాట్లాడి, వారి వివరాలు తెలుసుకుంది. వారు కూడా నా అన్న వారు లేనివారే కావడం, ఇద్దరూ కలిసి ఒక రూమ్ తీసుకుని, అద్దె షేర్ చేసుకుంటున్నారని విని బాధ పడింది. కాకపోతే వారు అక్కడి వారే కావడం వల్ల ఊరంతా కొట్టిన పిండి వారికి.
మరో మూడు రోజులకే రాజేశ్వరమ్మ గారు ఒప్పందం పడిన మూడవ ఇంటికి వెళ్ళి, వంట చేద్దామని గాడి పొయ్యి దగ్గరకు వెళ్ళగానే, కిందటిసారి చేతి సాయానికి వచ్చినవారే ఈసారి కూడా రావడం చూసి సంతోషంగా పలకరించింది.
వంట పని అవుతుండగా ఆ ఇద్దరు స్త్రీలను పిలిచి “మీ ఇద్దరికీ అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతో పాటు మీ గదిలో ఉండొచ్చా!? నాకు ఈ ఊరు కొత్త. ఇల్లు వెతుక్కోవాలన్నా ఊరు తెలియదు. మీకు ఊరు తెలుసు కనుక ఇకనుండి ఏ పనైనా ముగ్గురం కలిసి చేసుకుందాం. నా వాటా అద్దె నేను ఇచ్చేస్తాను” అని అడిగింది.
అప్పటివరకు ఎవరైనా సహాయానికి పిలిస్తేనే పని దొరుకుతుండడంతో వారు కూడా ఆనందంగా ఒప్పుకుంటూ “మీరెప్పుడొస్తారో చెప్పండమ్మా! ఇప్పుడు మేము ఉంటున్న గది ఎలాగూ ఖాళీ చెయ్యాలి కనుక ముగ్గురికీ సరిపడా మరో గది చూస్తాం” అంటూ మాటిచ్చారు వాళ్ళు.
వాళ్ళకు రాజేశ్వరమ్మగారి ఫోన్ నంబర్ ఇచ్చి, గది దొరకగానే తనకు ఫోన్ చేయమని చెప్పింది. అంతే కాకుండా తను తరువాత ఒప్పుకున్న పనుల తేదీలు, అడ్రస్ వాళ్ళకు ఇచ్చి, తనకు పనిలో సాయం చెయ్యడానికి రమ్మనీ, వచ్చిన డబ్బు ముగ్గురం పంచుకుందామని చెప్పింది.
ఆ రోజు కూడా అందరి చేతా ‘వంటంటే ఇలా ఉండాలి’ అనిపించుకుని, వారు ఇచ్చిన సొమ్ము తీసుకుని పురుషోత్తంగారితో ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే తను అడ్వాన్స్ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ ఫోన్ చేసి సహాయకులను తనే తెచ్చుకుంటానని, వారికి అదనంగా కొంత డబ్బు ఇస్తే చాలని చెప్పింది.
రాజేశ్వరమ్మగారు అది విని నవ్వుతూ “ఏంటమ్మోయ్! అప్పుడే హెడ్ కుక్ వి అయిపోయావే?” అంటూ ఆట పట్టించేసరికి, “నేను కుక్కనా!? నన్ను కుక్క అంటావా!?” అంటూ వెంటపడింది అమ్మమ్మ. అలా హాయిగా రాజేశ్వరమ్మగారి చెంత ఉంటూ, పనుల మీద పనులు ఒప్పుకుంటూ బిజీ అయిపోయింది అమ్మమ్మ.
ఒకరోజు తనకి వంటలో సహాయం చేస్తున్న స్త్రీల దగ్గర నుండి ఫోన్ వచ్చింది అమ్మమ్మకి. ‘చిక్కడపల్లిలో ఒక గది, వంటిల్లు ఉన్న చిన్న ఇల్లు దొరికిందనీ, మీకు కూడా ఇష్టమైతే అద్దె షేర్ చేసుకుంటూ అందులో ఉండొచ్చ’ని చెప్పారు వాళ్ళు. అమ్మమ్మ రెండో ఆలోచన కూడా లేకుండా ‘సరే’నంది.
రాజేశ్వరమ్మగారితో ‘వేరే ఇల్లు దొరికిందనీ, ఇంకా మీ మీద ఆధారపడి ఉండడం భావ్యం కాదని, తను పనికి వెళ్ళే ప్రతీసారీ పురుషోత్తం దిగపెట్టడం, తీసుకురావడం ఒక డాక్టర్ గా వృత్తిరీత్యా అతనికీ ఇబ్బంది అవుతుందని, అర్థం చేసుకోమని’ బతిమిలాడింది అమ్మమ్మ.
రాజేశ్వరమ్మగారు కూడా ముందు బాధపడినా, అమ్మమ్మ చెప్పింది కూడా నిజమే కనుక ఒప్పుకున్నారు. మంచిరోజు చూసి కొత్త ఇంటికి మారింది అమ్మమ్మ. అప్పటికే కొత్త స్నేహితురాళ్ళు ఇద్దరూ వచ్చి ఉండటంతో ముగ్గురూ కలిసి ఉండసాగారు. ఎవరి సంపాదన, ఖర్చు, వంట వారిదే. తను ఇల్లు మారానని, కొత్త ఇంటి అడ్రస్ ఇస్తూ, చినబాబు పెళ్ళికి రాలేకపోయినందుకు ఏమీ అనుకోవద్దని చెప్తూ వియ్యంకుడికి ఉత్తరం రాసి పోస్ట్ చేసింది. ఖాళీ చూసుకుని తెనాలి వెళ్ళి, తనకు అవసరమైన సామాను మాత్రమే ఉంచుకుని, మిగిలినదంతా అమ్మేసింది.
వచ్చిన డబ్బుతో విజయవాడలో భారీ స్థాయిలో వంట చేయడానికి అవసరమైన ఇనప గరిటెలు, చట్రాలు వంటివి కొంది. తిరిగి తెనాలి వచ్చి బంధుమిత్రులందరికీ తను శాశ్వతంగా హైదరాబాదులో ఉండడానికి వెళ్ళిపోతున్నానని చెప్తూ, వీడ్కోలు పలికి తిరిగి హైదరాబాదు చేరుకుంది.
రాగానే మొదట చేసిన పని ఆంధ్రా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి, తనకు ఆ నెల ఖర్చులకు కావలసిన డబ్బు మాత్రమే తనవద్ద ఉంచుకుని మిగతా మొత్తాన్ని బాంకులో వేసుకుంది. తను ఒప్పుకున్న ప్రతీ పని మీద వచ్చిన డబ్బు నుండి తన అవసరాలకు కొంత ఉంచుకుని మిగతాది వృధాగా ఖర్చు పెట్టకుండా బాంక్ లో వేసుకుంటూ ఉండేది.
ఏడాది గడిచేసరికి తెలంగాణ వంటలు కూడా నేర్చుకుంది అమ్మమ్మ. ఇప్పుడు హైదరాబాదులో అమ్మమ్మకు తెలియని ప్రదేశం లేదు. ఎక్కడ పని దొరికినా బస్సులో వెళ్ళి వస్తోంది.
పనికి వెళ్ళిన ప్రతీ చోటా అందరూ ‘మామ్మగారూ’ అంటూ ఎంతో గౌరవంగా చూసేవారు తప్ప, ఎవరూ వంట పనికి వచ్చిన మనిషి అని చిన్నబుచ్చి ఎరుగరు. తను ఎంతలో ఉండాలో, అవతలి వారిని ఎంతలో ఉంచాలో ఆ హద్దు తెలుసుకుని ప్రవర్తించే అమ్మమ్మ అందరికీ ప్రీతిపాత్రురాలయింది.
తమ చిన్న కొడుక్కి ఆడపిల్ల పుట్టిందని వియ్యంకుడు రాముడు వలస నుండి ఉత్తరం రాసారు. దంపతులను, పాపను ఆశీర్వదిస్తూ తిరుగుటపా రాసింది. మరో ఏడాది గడిచింది. అమ్మమ్మ ఇంకా బిజీ అయిపోయింది.
ఇప్పుడు మరో ఇద్దరు మనుషులను తనకు సహాయంగా పెట్టుకుని, భారీ స్థాయిలో పనులు ఒప్పుకోసాగింది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇద్దరూ భార్యాభర్తలు. వీళ్ళ ఇంటికి దగ్గరలోనే వారి ఇల్లు కూడా.

****** సశేషం ******

1 thought on “అమ్మమ్మ – 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *