July 6, 2022

తేనె మనసులు

రచన: పరేష్ బాబు

ఎన్నో వ్యాపారాలు చేసి నష్టపోయి ఆఖరి ప్రయత్నంగా శంకర్ విలాస్ భోజన హోటల్ ప్రారంభించాడు శంకరరావు. హోటల్ కు వచ్చే కస్టమర్ల కోసం ఆయన భార్య అన్నపూర్ణమ్మ వంటలు చేసేది. సరిగ్గా హోటల్ ప్రారంభం రోజే ఎక్కడినుంచి వచ్చాడో ఒక యువకుడు వచ్చి శంకర్రావును కలిసాడు
‘సార్. నా పేరు సుందరం. నాకు మీ హోటల్లో సర్వర్ ఉద్యోగం ఇవ్వండి సార్. నమ్మకంగా పనిచేసుకుంటా’. అడిగాడు
‘చూడు బాబూ. నేను నా భార్య కలిసి పొట్టగడవటం కోసం పదిమంది పొట్టనింపే ఈ హోటల్ శంకర్ విలాస్ ప్రారంభించాం. నాకు నా భార్య. నా భార్యకు నేను తప్ప పిల్లలు కూడా లేరు. . మా ఇద్దరికే గడవటం కష్టంగా ఉండి ఈ హోటల్ పెట్టుకున్నాం. ఇక నీకు జీతం ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉంది. ఆవేదనగా చెప్పాడు శంకర్రావు
” మీరు అలా అనకండి సార్. నేను ఒక అనాథను. నాకు జీతం ఏమి వద్దు సార్. ఒక్క పూట అన్నం పెట్టండి చాలు సార్. నన్ను మీ కొడుకు అనుకోండి సార్. ” ప్రాధేయపడ్డాడు. సుందరం.
అతని మాటలకు శంకర్రావుకు జాలి వేసింది
“సరే నీకు సర్వర్ ఉద్యోగం ఇస్తాను కానీ నమ్మకంగా పనిచేసుకోవాలి. ఏ ఒక్క కస్టమర్ తో మాట పడకుండా పనిచేయాలి. అలా చేస్తానని నాకు మాట ఇస్తేనే నీకు ఈ ఉద్యోగం. చెప్పాడు శంకర్రావు
“అలాగే సార్ “. సంతోషంగా చెప్పాడు సుందరం
“అయితే ఈ రోజు నుంచి నువ్వు సర్వర్ సుందరానివి” నవ్వుతూ అన్నాడు శంకర్రావు
అలా శంకర్రావు , అన్నపూర్ణమ్మ , సర్వర్ సుందరంతో ప్రారంభమైన చిన్న రోడ్ సైడ్ హోటల్ శంకర్ విలాస్ అనతికాలంలోనే మంచి భోజన హోటల్ గా పేరు తెచ్చుకుంది. నెమ్మదిగా హోటల్ కు వచ్చే కస్టమర్లు పెరిగారు. దానితో చిన్న హోటల్ కాస్తా పెద్ద రెస్టారెంట్ అయ్యింది. . అయితే హోటల్ మొదలు పెట్టినప్పటి నుంచి మధ్యాహ్నం భోజన వేళ ముగిసిన తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్దాలను అన్నిటినీ పార్సెల్ కట్టించి తనే స్వయంగా బయటకు తీసుకుపోయేవాడు శంకర్రావు. . అది ఎందుకో ఎవరికి అర్థం అయ్యేది కాదు. ఇదిలా ఉండగా హోటల్లో నెమ్మదిగా పనివాళ్ళు పెరిగారు. అన్నపూర్ణమ్మకు సహాయకులైతే వచ్చారు కానీ ఆమె గత మూలాలను మర్చిపోకుండా వంట పనులను తానే స్వయంగా పర్యవేక్షించేది. ఆర్థికంగా కూడా శంకర్రావు నిలదొక్కుకున్నాడు. సుందరం హెడ్ సర్వర్ అయ్యాడు. అతని కింద కొంతమంది సర్వర్లు చేరారు.
ఆ హోటల్ అంతలా ఎదగడానికి అన్నపూర్ణమ్మ చేతి వంట , సర్వర్ సుందరం పని తీరే ప్రధాన కారణం అని శంకర్రావు విశ్వాసం. ఎందుకంటే హోటల్ కి వచ్చిన వాళ్లకు సుందరం ఒక సర్వర్ లా కాకుండా కుటుంబ సభ్యుడిలా ఆపేక్షగా భోజనం వేడి వేడిగా కొసరి , కొసరి వడ్డించటంతో అనతికాలంలోనే పాపులర్ అయ్యాడు. ఎంత పాపులర్ అంటే భోజనానికి హోటల్ కి వచ్చినవాళ్ళు ముందుగా సుందరాన్నే ఆడిగేవాళ్ళు. పై పెచ్చు సుందరం వద్దన్నా వినకుండా పదో పరకో టిప్పు కింద బలవంతంగా అతని చేతిలో పెట్టేవాళ్ళు. సహజంగా ఇది హోటల్ లో పని చేస్తున్న మిగతా సర్వర్లకు కంటగింపు అయ్యింది. నెమ్మదిగా శంకర్రావుకి సుందరం మీద చాడీలు చెప్పటం మొదలు పెట్టారు. శంకర్రావు వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాళ్ళ పోరు ఎక్కువ కావడంతో శంకర్రావు కి సుందరాన్ని పిలిచి అడగక తప్పలేదు.
” చూడు సుందరం. చిన్నగా నేను మొదలు పెట్టిన ఈ హోటల్ అంచలంచలుగా ఎదగడం వెనుక నీ చెయ్యి కూడా ఉందన్న విషయం నేను ఎప్పటికి మర్చిపోను. ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా ఆకలి విలువ తెలిసినవాడినే. నేను ప్రతిరోజు మన హోటల్లో మిగిలిపోయిన ఆహార పదార్దాలను, కస్టమర్లు తిని వదిలేసిన ఆహారాన్ని ప్యాక్ చేసుకుని ఎక్కడికి తీసుకెళ్తున్ననో తెలుసా?. కూటికి లేని బిచ్చగాళ్లకు పంచిపెట్టటానికే. ఈ హోటల్ కు మంచి పేరు తీసుకు రావటానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు. నిన్ను కూడా నా కన్న కొడుకులా చూసుకున్నాను. అయితే ఈ మధ్య నువ్వు కస్టమర్ల దగ్గరనుంచి టిప్పులు తీసుకుంటున్నవని నీ తోటి సర్వర్లు నాకు చెప్పటం మొదలు పెట్టారు. ఈ రోజు నువ్వు టిప్పులు అడగటం మొదలు పెడితే రేపు వాళ్ళు కూడా అడగటం మొదలు పెడతారు. . అయితే వారి ముందు నిన్ను చిన్నబుచ్చటం నాకు ఇష్టం లేదు. అందుకే నేరుగా నిన్నే అడుగుతున్నా. అది నిజమేనా?
“నిజమే సార్. అయితే కస్టమర్లు నేను వద్దన్నా వినకుండా సంతోషం కొద్దీ ఇస్తున్నామని నా చేతిలో బలవంతంగా టిప్పులు పెడుతున్నారు. వారి మాటను కాదనలేక తీసుకున్న టిప్పు డబ్బులను ఇదిగో ఇలా వంటగదిలో దేవుడి పటం దగ్గర నాకు అన్నం పెట్టిన మీ పేరున, అమ్మ అన్నపూర్ణమ్మ పేరున హుండీలో వేస్తున్నాను సార్. టిప్పులుగా వచ్చిన డబ్బుల్లో నేను ఒక్క పైసా కూడా ముట్టలేదు సార్” కన్నీటి పర్యంతం అయి చెప్పాడు సుందరం.
ఆ హుండీని చూసిన శంకర్రావుకు కన్నీళ్లు ఆగలేదు
హుండీ మీద అంటించిన కాగితం మీద ఇలా రాసుంది
“నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలీదు. అమ్మా, నాన్నలు లేని అనాధనైన నన్ను నమ్మి చేరదీసి అన్నం పెట్టిన శంకర్రావు గారు, అన్నపూర్ణమ్మగార్లే నాకు దేవుళ్ళు. ‘
‘మాతృదేవో భవ. పితృ దేవో భవ’
చదివిన శంకర్రావుకు ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకోవటం సాధ్యం కాలేదు.

……………………………

1 thought on “తేనె మనసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *