April 16, 2024

అలిశెట్టి ప్రభాకర్ ని గుర్తుచేసిన ‘ శిథిల స్వప్నం ‘

సమీక్షురాలు
యడవల్లి శైలజ ( ప్రేమ్)

అనాగరిక సమాజం నుండి నాగరిక సమాజంలోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలైన ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు మనుషుల్లో అంతరాల తేడాలు, అంతస్తుల తేడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వర్గ సమాజాలు, వర్ణ సమాజాలు మనుషులను, మనుషులు గా గుర్తించిన దాఖలాలు లేవు అటువంటి వర్గ, వర్ణ తారతమ్యాలు ఎదుర్కొన్న వాళ్ళలో రాజ్యాంగ నిర్మాత Dr. BR అంబేద్కర్, మహాత్మ గాంధీ, నెల్సన్ మండేలా ఉన్నారు.
‘ శిథిల స్వప్నం ‘ కవితా సంపుటిలో ఆర్థిక, రాజకీయ,
సామాజిక, సాంస్కృతిక, సాంఘిక అంశాలను స్పృశిస్తూ రాసిన కవితలు ఎన్నో ఉన్నాయి.
‘ లెనిన్ శ్రీనివాస్ ‘ రాసిన ‘ బతుకు చితిపై ‘ కవిత చదువుతుంటే అలిశెట్టి ప్రభాకర్ గారు రాసిన ‘ వేశ్య ‘
కవిత గుర్తుకు వచ్చింది.
తను శవమై ఒకరికి వశమై
తనువు పుండై ఒకడికి పండై
ఎప్పుడు ఎడారై ఎందరికో ఒయాసిస్సై….
అని అలిశెట్టి ప్రభాకర్ గారు అంటే ఇక్కడ ‘ లెనిన్ శ్రీనివాస్
ప్రతి చీకటి రాత్రి పైశాచిక క్రీడ
నిశీధిలో నిఖిల జగతిని మరిపిస్తూ …..
మురిపిస్తూ…. రక్తం ధారలైనా
మాంసపు ముద్దను ముద్దాడానికి విటులను ఇట్టే
రాబట్టాలి/ పొద్దు వంగిందంటే చావు భయం/ తెల్ల వారిందంటే బ్రతుకు భయం.
ప్రతి రేయీ మృత్యువు ముంగిట సయ్యాట అన్నాడు.
భాషా ప్రయోగం విషయంలో చాలా అద్భుతమైన పద ప్రయోగాలు చేసారు.
పసితనమెక్కడో పచ్చి కుండలా పగిలింది !బాల్యమెక్కడో అద్దంలా భళ్ళున పగిలింది. అని ‘ చెదిరిన స్వప్నాలు ‘ అనే కవితలో అంటాడు.
అన్యాయంగా, అక్రమంగా మనదేశంలో జొరబడి మన దేశాన్ని తెల్లదొరలు కొల్ల గొడుతుంటే అన్యాయాన్ని ఎదిరించాలి, తిరుగుబాటు చేయాలని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గూడెం ప్రజలలో చైతన్యం తీసుకొచ్చాడు.
‘ బ్రిటీషు సింహ స్వప్నం – అల్లూరి ‘ అనే కవితలో
ప్రశాంత కొండ కోనల్లో ప్రగతి కరువైన చోట
జగతి వేగుచుక్క అల్లూరి సీతారామరాజు
అడవి బిడ్డలను పులి బిడ్డలుగా మేలుకొల్పి
మోడువారిన మొక్కలకు చివురులు పూయించిన
విప్లవ సేనాని అల్లూరి సీతారామరాజు అంటాడు.
ఇంకా ఎన్నో ఎన్నెన్నో స్పూర్తిధాయకమైన కవితలు ఈశిథిల స్వప్నంలో.
” నా భాష నా యాస నా శ్వాసంటూ/ ఇది నా గొడవ
కాదు జనం గోడు ” అన్న కాళోజీ గారి గురించి ‘ నిత్య చైతన్య శీలి ‘ అనే కవితలో….
నిలువెత్తు పోరాట సంతకం
తెలంగాణ తేట తెలుగు – కాళోజీ! అన్నాడు. వాస్తవికత కు అద్దం పట్టేలా ఉన్నాయి.
తెలంగాణ భవితకు భాగ్యోదయం అనే కవితలో తిమిరాన్ని తరిమే సమరం భవితకు భాగ్యోదయం పలికే సంకేతం. కరువు కోరలను పీకి ఒక్కొక్క వాన చుక్కను ఒడిసిపట్టే భగీరథ, మిషన్ కాకతీయ, చెరువుల కళ కళ అని తెలంగాణ ప్రభుత్వ గొప్పతనాన్ని పొగుడుతూ తెలంగాణపై తనకు గల అభిమానం చాటుకున్నారు.
‘గాయాల జ్ఞాపకంలో ‘ ఈనాటి కాలం వంశోద్దారకులు తమ తల్లిదండ్రులపై ప్రేమ కురిపించే తీరు గురించి చెబుతూ….
“కొన ఊపిరుండగానే కొరివికి సిద్ధం చేస్తూ
ప్రాణమున్న నాడు పిడికెడు మెతుకులు కరువు
పిండాలనాడు పండుగ చేస్తున్న తీరు ”

మరో కవిత రక్తం చిందని యుద్ధ విజయంలో ….
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమ కారుల ఖార్ఖానలో రాలిపడ్డ పూ మొగ్గలెన్నో
చరిత నిర్మాణంలో పునాది రాళ్ళెన్నో
తెలంగాణ కోసం పరితపించిన ప్రాణాలెన్నో…

తెలంగాణ ఉద్యమం కళ్ళముందు నిలుపుతూ రాసిన లెనిన్ శ్రీనివాస్ కు అభినందనలు. సాహితీ ప్రయాణంలో మరెన్నో శిఖరాలు అధిగమించాలని కోరుకుంటూ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *