March 29, 2023

అజ్ఞాతం వీడింది

రచన: కొత్తపల్లి రవికుమార్

“స్వప్నా! మనం కొత్తగా స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ‘అజ్ఞాతం వీడింది’ అనే వీక్లీ ప్రోగ్రామ్ కి నిన్ను చీఫ్ ని చేస్తున్నాను. ఇది ఎప్పటి నుండో చేద్దామనుకున్న నా డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ సరైన మనిషి దొరక్క ఆ ప్రాజెక్ట్ ని ఇప్పటి దాకా స్టార్ట్ చేయలేదు. ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన ప్రాజెక్ట్. మన మధ్యే ఉంటూ అసమాన ప్రతిభా వంతులుగా మారి, అందరికీ ఆదర్శమై మరల కనుమరుగైన వారిని వెతికి పట్టుకుని వారి జ్ఞాపకాలని, అనుభవాలని, సందేశాలని ప్రేక్షకులకి అందించాలి. వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ వారి నుండి అన్నీ రాబట్టాలి. నువ్వు మాత్రమే చేయగలవన్న నమ్మకంతో నేను నీకు అప్పజెప్పుతున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేయవని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ స్వప్న అండ్ కంగ్రాచ్యులేషన్స్!” అని స్వప్నకు బాధ్యతలు అప్పజెప్పాడు, నో బౌండరీస్ TV సియీవో సత్యదేవ్.
అతను స్వప్నను అంతలా నమ్మడంలో పెద్ద అతిశయోక్తి లేదు. ఎందుకంటే సాధారణ న్యూస్ రీడర్ గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా అందరినీ దాటుకుని అనతికాలంలోనే ఒక ప్రోగ్రామ్ డిజైనర్ స్ధాయికి చేరింది. తన ఈ మజిలీ లో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తన తెలివితో వాటిని తట్టుకుంది. తన తోటి జర్నలిస్టులతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన ప్రతిభా పాఠవాలతో తిప్పి కొట్టింది. తోటి ఆడవాళ్ళే కాదు మగవాళ్ళకి కూడా సాధ్యపడని ఎన్నో ప్రోగ్రామ్ లని పట్టుదలతో చేసింది. ఈ చిన్న వయసులోనే ప్రతీ ప్రోగ్రామ్ ని డిఫరెంట్ గా ఆలోచిస్తుంది. ఎంతోమంది సెలెబ్రిటీల ఇంటర్వ్యూలతో పాటు సిఎమ్, ఆఖరికి పిఎమ్ ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. తన ఇంటర్వ్యూలో స్వప్న అడిగిన కొన్ని ప్రశ్నలకు సిఎమ్, పిఎమ్ లు కూడా సమాధానం చెప్పలేక నీళ్లు తాగారు. ఇవన్నీ దగ్గరనుండి చూసాడు కాబట్టే సత్యదేవ్ ఈ ప్రాజెక్ట్ ని స్వప్నకి అప్పజెప్పాడు.
అందం, ప్రతిభ, ఆత్మస్ధైర్యం ఉన్న అమ్మాయిలు చాలా అరుదు అంటారు. కానీ స్వప్న విషయంలో అది అబద్ధం అనిపిస్తుంది. మోడ్రన్ డ్రెస్ వేసుకున్న లక్ష్మీ దేవిలా వెలిగిపోతుంటుంది. ఎవరైనా అన్యమనస్కంగానైనా స్వప్నను చూస్తే ఒక్క నిమిషం పాటు కళ్ళు తిప్పుకోలేరు. అందుకే స్వప్నని చూసి అందరూ ఒకింత ఈర్ష్య తో చూస్తుంటారు. ఇన్ని లక్షణాలు ఉన్న స్వప్నకి పొగరు కూడా అంతే స్ధాయిలో ఉంది. తనని కించిత్ హేళన చేసినా కాళిలా తాండవం చేస్తుంది. అందుకే అందరూ స్వప్న జోలికి పొరపాటున కూడా రారు. ఆఖరికి స్వప్న తల్లి తండ్రులు కూడా. పాతికేళ్లు దాటాయి, పెళ్ళీడు వచ్చింది పెళ్ళి చేసుకోమని ఎంత మొత్తుకున్నా తనకి ఈ ప్రొఫెషనల్ లైఫ్ ఎంతో ముఖ్యమని, అయినా పెళ్ళి చేసుకుని ఎవరు బాగు పడ్డారని, పెళ్ళి చేసుకుని కష్టాల పాలయ్యే వాళ్ళని రోజుకు వంద మందిని చూస్తున్నామని వితండ వాదం చేసేది. ఇక కూతురికి ఏమీ చెప్పలేక ఆ దేవుడి మీదే భారం వేసారు స్వప్న తల్లిదండ్రులు.
* * *
ఆ రోజు నో బౌండరీస్ TV వార్షికోత్సవం. అందరూ ఎప్పుడూ వేసుకనే మోడ్రన్ డ్రెస్ లు కాకుండా ట్రెడిషనల్ డ్రెస్సులలో ముస్తాబయ్యారు. స్వప్న కూడా లేత గులాబీ రంగు చీరలో పుత్తడి బొమ్మలా ఉంది. కామ దేవతకి ప్రతిరూపంలా ఉంది. పెళ్ళి కాని అబ్బాయిలు స్వప్నని అలా చూస్తుండి పోయారు, సత్యదేవ్ తో సహా. ఈ ఇయర్ లో అనుకున్న టార్గెట్ లు, రీచ్ అయిన టార్గెట్ లు, వాటి సక్సెస్ లో తమ ప్రతిభా పాఠవాలను చూపించిన జర్నలిస్టులను ఒకరి తర్వాత ఒకరిని పిలిచి అభినందిస్తున్నారు. అందరూ సత్యదేవ్ చేతుల మీదుగా మెమెంటో, క్యాష్ ప్రైజ్, సన్మానాన్ని అందుకుంటున్నారు.
ఈ ఏడాది బెస్ట్ ప్రోగ్రామ్ డిజైనర్ గా ప్రతీ ఏడాది లాగే స్వప్న ఎంపికయ్యింది. కానీ ఎందుకో స్వప్నని అభినందిస్తునప్పుడు ఈ సారి కొత్తగా కనిపించింది సత్యదేవ్ కి. మెమెంటో ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాడు. సుతిమెత్తని, తామరాకుల పువ్వులాంటి ఆ చేతిని వదల బుద్ధి వేయలేదు సత్యదేవ్ కి. కానీ అందరి ముందు తన డిగ్నిటీ తగ్గించుకోకూడదన్న భావనతో ఆ పూటకి స్వప్న చేయి వదిలి సన్మానించాడు. కానీ కార్యక్రమం జరుగుతున్నంత సేపు స్వప్నని తేరిపార చూసాడు సత్యదేవ్. నువ్వే నా రాజ్యానికి రాకుమారివి అని గట్టిగా మనసులో అనుకున్నాడు, ఎక్కడ పైకి అంటే తన పరువు తీస్తుందోనని.
* * *
“అజ్ఞాతం వీడింది” ఈ వారం ఎపిసోడ్ లో భాగంగా స్వప్న గోదావరి జిల్లాలకు బయలుదేరింది. గోదావరి జిల్లాల్లో కోనసీమలో పుట్టి, పెరిగి, రాజధానిలో అడుగు పెట్టి, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గా పేరుగాంచిన ‘రవిశంకర్ ప్రసాద్’, ఇప్పుడు మరల తన పుట్టిన ఊళ్ళోనే ఉంటున్న విషయం తెలిసి, ఇంటర్వ్యూ చేద్దామని బయలుదేరింది స్వప్న. కారు హైవే మీదనుండి గోదావరి జిల్లాలో అడుగు పెట్టి లూప్ లైన్ లో కోనసీమ ఎంట్రన్స్ ద్వారం లోంచి కోనసీమ లోనికి అడుగు పెట్టింది. తను ఎప్పుడూ చూడని కోనసీమ అందాలను తనివితీరా కళ్ళతో ఆస్వాదిస్తోంది. ఆ కోనసీమ అందాలకి తనని తాను మైమరచిపోయింది.
అందం అంటే అంతా ఇంత అందం కాదు. పచ్చని తివాచీ కప్పుకున్న నిండైన పొలాలు, ఊళ్ళోకి సాదరంగా స్వాగతం పలికే చక్కని రహదారులు, రహదారులకిరువైపులా కాపలా కాస్తున్న బలిష్టమైన చెట్లు, మట్టితో అలికిన ఇళ్ళు, అలికిన ఇళ్ళల్లో నాట్యమాడుతున్న ముగ్గులు, ఆ అందమైన ఇళ్ళకు ప్రత్యేక ఆకర్షణగా గోమాతలు, ఆ గోమాతలను అనుసరించే కల్మషం లేని లేగ దూడలు. మిగతా ప్రాంతాల సంగతేమో కానీ గోదావరి ప్రాంత ఊళ్ళు నిజంగానే అందానికే కేరాఫ్ అడ్రస్ లుగా అనిపించాయి స్వప్నకి. ఆ అందాలన్నింటినీ తన కెమెరాలో బంధిస్తోంది స్వప్న. తన అందాల ఆస్వాదానానికి బ్రేక్ పడినట్లుగా ఒక ఇంటి ముందు కారు ఆగింది.
“డ్రైవర్! ఇక్కడ కారు ఆపావేంటి?” అని అడిగింది స్వప్న.
” దారిలో జనాలను అడిగితే, సార్ ఇల్లు ఇదేనని చెప్పారు మేడమ్!” అని సమాధానమిచ్చాడు డ్రైవర్.
కారు దిగి వాచీలో టైమ్ చూసింది స్వప్న. సరిగ్గా సాయంత్రం నాలుగున్నర అయ్యింది. ఆ ఇంటి కేసి చూసింది. ఒక రెండెకరాలలో చిన్న దుబ్బు గడ్డి ఇల్లు అది. ఇంటి చుట్టూ నాలుగువైపులా రకరకాల పూల మొక్కలు, రకరకాల కూరగాయల పాదులతో చాలా అందంగా ఉంది. చుట్టూ చూసింది. పెద్దగా జనాభా కనబడలేదు. కొంచెం దూరంగా కూరగాయల పాదుల దగ్గర ఎవరో ఒక పెద్దాయన పని చేస్తూ కనబడ్డాడు. దగ్గరకు వెళ్ళింది. మట్టి కొట్టుకుపోయిన బట్టలతో, మాసిన గెడ్డంతో, తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఒక డెబ్భై , డెబ్భైదేళ్ళు ఉంటాయనిపించింది.
ఆయన దగ్గరకు వెళ్ళి “ఏమయ్యా! రవిశంకర్ గారి ఇల్లు ఇదేనా?” అని అడిగింది స్వప్న.
“అవునమ్మా ఇదే! పదండి. నాతో పాటే రండి. ” అని తన కూడా తీసుకెళ్ళాడు ఆ పెద్దాయన.
ఆ ఇంటి వసారాలో ఉన్న కుర్చీల్లో కూర్చోమని ఇంటి లోపలికి వెళ్ళాడు ఆ పెద్దాయన. కాసేపటి తర్వాత తెల్లటి పైజమా, లాల్చి వేసుకుని ఇంట్లోంచి వచ్చిన పెద్ద మనిషిని చూసి ఆశ్చర్య పోయింది స్వప్న. ఇందాక పొలంలో పనిచేసిన ఆ పెద్దాయనే తను ఇంటర్వ్యూ చేయబోయే పెద్ద మనిషి రవిశంకర్ ప్రసాద్ అని రూఢీ చేసుకుంది. వారి కుర్చీలకెదురుగా ఉన్న పడక కుర్చీలో కూర్చొన్నాడు రవిశంకర్.
“చెప్పండి మేడమ్! నాతో మీకు పనేంటి? ఇంతకీ మీరెవరు? ఇలా ఎందుకు వచ్చారు?” అని అడిగాడు రవిశంకర్.
“నా పేరు స్వప్న. నేను నో బౌండరీస్ TV లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాను. మేము కొత్తగా ప్రారంభించిన అజ్ఞాతం వీడింది అనే కార్యక్రమం లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. మీరు ఏమీ అనుకోకపోతే ఈ పూట మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి సార్!” అని ముద్దుగా బతిమిలాడింది స్వప్న.
తన మనవరాలి వయసున్న స్వప్న అలా ముద్దుగా అడిగేసరికి కాదనలేకపోయాడు రవిశంకర్. “అలాగే కానీయమ్మా!” అని ఇంటర్వ్యూకి తన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. “లైట్ స్టార్ట్, కెమెరా ఆన్, స్టార్ట్ రోలింగ్ ” అని ఇంటర్వ్యూని ప్రారంభించింది స్వప్న.
“అందమైన ఈ కోనసీమ జిల్లాలో పుట్టి, పెరిగి, తనకు దొరికిన అరకొర వసతులతో ఉన్నత చదువులు చదివి, పట్నం వెళ్ళి, వ్యాపారం మొదలు పెట్టి, పారిశ్రామిక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని, ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, అందరికీ సుపరిచితులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారితో ఈ వారం అజ్ఞాతం వీడింది ఎపిసోడ్. ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీయా!” అని కార్యక్రమాన్ని మొదలు పెట్టింది స్వప్న.
“నమస్కారం! రవిశంకర్ ప్రసాద్ గారూ!” అని నమస్కరించింది స్వప్న.
“నమస్కారమమ్మా!” అని ప్రతి నమస్కారం చేసాడు రవిశంకర్.
“ఇంటర్వ్యూలో మొదటిగా, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్!” అని అడిగింది స్వప్న.
“నేను, నా భార్య భారతి” అని తన భార్యను చూపించాడు రవిశంకర్.
“మీరు పారిశ్రామిక వేత్తగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసారు. అన్నింటినీ దాటుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగారు. పట్నంలో బహుళ అంతస్తుల భవంతులలో ఉన్నారు. మీరు మరలా ఈ పల్లెటూళ్ళో, ఈ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారు?” అని అడిగింది స్వప్న.
“నేను పుట్టింది ఇక్కడే. పెరిగింది ఇక్కడే. రేపు ఈ కట్టె కాలాల్సింది ఇక్కడే. కాబట్టి నాకు ఈ ఇల్లు కొత్తగా కనిపించదు. నాకు ఈ ఇల్లు వేద భూమితో సమానం. నేనే కాదు, ఎవరైనా తిరిగి తమ మూలాల దగ్గరకు వెళ్ళాల్సిందే. ” అని చెప్పాడు రవిశంకర్.
“అంటే మీ ఉద్దేశ్యంలో కష్టపడి పైకి వచ్చిన వారందరూ తమ మూలాలను మర్చి పోతున్నారు అంటారా?” అని అడిగింది స్వప్న.
“అలా అని నేను అనడం లేదు. కాల గమనంలో నాకు రాసి పెట్టి ఉంది కాబట్టి ఆ పేరు, దర్పం వచ్చాయి. అన్నీ మన ప్రజ్ఞ వల్ల, మన మేథా శక్తి వల్ల వచ్చాయనుకోవడం మూర్ఖత్వం అని నా నమ్మకం. అంతా దైవేచ్ఛ. ఈ విషయం మాత్రం తెలుసుకోవాలి అంటున్నాను. ” అని చెప్పాడు రవిశంకర్.
“అంటే మీరు దేవుడిని నమ్ముతారా?” అని ప్రశ్నించింది స్వప్న.
“వై నాట్? మనిషి ఎంత ఎదిగినా మనుషులను వెనుకనుండి నడిపేది ఒక శక్తి మాత్రమే. ఆ శక్తి దేవుడని అనుకుంటే నేను కూడా దేవుడిని నమ్ముతాను” అని సమాధానమిచ్చాడు రవిశంకర్.
“సాంకేతిక పరిజ్ఞానం ఇంత పెరిగి, రాకెట్ లలో చంద్రమండలానికి చేరుకునే ఈ రోజుల్లో మీలాంటి ప్రతిభావంతులు దేవుడి గురించి మాట్లాడడం వింతగా ఉంది సార్!” అని చెప్పింది స్వప్న.
“ఇందులో వింతేముంది. చంద్రమండలం ఎంత దూరం ఉందో కనుక్కుని దానికి తగ్గ రాకెట్లను తయారు చేసి చంద్రమండలం మీదకి పంపడం మన మేధావుల నైపుణ్యంతో ఎదిగిన సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. దానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కనుక్కోలేనివి చాలా ఉన్నాయి. అందులో మచ్చుకు ఒక్కటి చెప్తాను. ఒక ఆడది ఒక బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే ఆ బిడ్డ బాహ్య ప్రపంచంలోకి రాగానే ఈ బాహ్య వాతావరణాన్ని తట్టుకోలేక ఆ బిడ్డ గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ కృసించుకుని పోతాయి. ఆల్ మోస్ట్ ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. అప్పటివరకు తనలో లేని మార్పును ఒక్కసారిగా ఆ అమ్మ గమనిస్తుంది. అదేమిటంటే ఆ స్థితిలో ఉన్న తన బిడ్డ నోటికి తన స్తనాన్ని అందివ్వగానే ఆ స్తనం నుండి ఇప్పటివరకు రాని కోలోస్ట్రమ్ అనబడే జిగురులాంటి పసుపు పచ్చని పదార్ధం ఉత్పత్తి అయ్యి ఆ బిడ్డ నోటి ద్వారా కడుపులోకి వెళ్ళి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేసి మోషన్ అయ్యి ఆ బిడ్డ బతుకుతాడు. కానీ పరిజ్ఞానం ప్రకారం మనం ఎంత ఎదిగినా, సమర్ధవంతమైన గైనకాలజిస్టులు సైతం కనిపెట్టలేనిది ఏమిటంటే ఆ కోలోస్ట్రమ్ అనబడే పదార్ధం ఎలా పుడతుందో? డాక్టర్లు సైతం నమ్మేదేటంటే సాక్షాత్తూ ఆ జగన్మాతే ఈ పదార్ధ రూపంలో వచ్చిందని. దేవుడు ఉన్నాడనడానికి ఇంత కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదేమో!” అని చెప్పాడు రవిశంకర్.
ఒక్కసారి ఆ సమాధానం విని నిశ్చేష్టురాలయ్యి, రవిశంకర్ ని ఆరాధనా పూర్వకంగా చూసింది స్వప్న. ఇన్నాళ్ళ తన కెరీర్ లో ఎంతో మందిని తన ప్రశ్నలతో ఇబ్బందికి గురి చేయడం చూసింది కానీ మొట్టమొదటి సారి ఎదుటి వారి సమాధానానికి ఫ్లాట్ అయ్యింది. తేరుకుని మరల రవిశంకర్ ని ప్రశ్నలు అడగడానికి సమాయత్తమయ్యింది.
“సార్! ఇంత పల్లెటూళ్ళో పుట్టి, ఇంత పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించారు? మీ గరువులు ఎవరు?” అని అడిగింది స్వప్న.
“పరిజ్ఞానం అనేది ఒకళ్ళు బలవంతంగా నేర్పేది కాదు. ఎన్ని సౌకర్యాలు కల్పించి, ఎంత మంచి గురువుల చేత చెప్పించినా నేర్చుకోవాలనే తాపత్రయం లేనప్పుడు మనం ఏమి చేసినా వృథానే. అదే నేర్చుకోవాలన్న కసి ఉన్నప్పుడు మట్టిలో కూడా మాణిక్యాలు ఉద్భవిస్తాయి. ఇక గురువుల సంగతి అంటారా! అమ్మ ఒడే మనకు పెద్ద గురువు. మన చుట్టుపక్కల ప్రాంతాలే పెద్ద బాలశిక్షలు. అంతెందుకు, మా గోదావరి తీర ప్రాంత ప్రజలకు చుట్టూ ఉన్న అందాలే గొప్ప గురువులు. ఒక్కసారి మనసు పెట్టి చూడాలే గానీ గోదావరి చుట్టుపక్కల ప్రకృతే అన్నీ నేర్పిస్తాయి. సూరిబాబు కన్నా ముందే మేల్కొని మనందరినీ మేల్కొలిపే కోళ్లను చూసి, బారెడు పొద్దెక్కే దాకా పడుకోకుండా సోమరితనాన్ని ఎలా వదిలి పెట్టాలో నేర్చుకోవచ్చు. సూరీడు పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పగానే నావొట్టుకొని గోదావరిలోకి వెళ్ళిపోయే ఆ జాలరోళ్ళని చూసి, డ్యూటీలు ఎంత పెర్ ఫెక్ట్ గా చేయచ్చో నేర్చుకోవచ్చు. వాళ్ళు వలేసినప్పుడు వాటినుండి తప్పించుకునే చేపలను చూసి, కష్టాలొస్తే ఎలా తప్పించుకోవచ్చో నేర్చుకోవచ్చు. ఒడ్డునే ఉండి ఒంటికాలితో తపస్సు చేస్తా లటుక్కన చేపలనట్టుకొనే కొంగలనుండి, వచ్చిన అవకాశాలను ఎలా చేజిక్కించుకోవచ్చో నేర్చుకోవచ్చు. ఒకదాని వెనకాలే మరొకటి నడుస్తూ పొలానికి వెళ్ళే ఆవుల నుండి క్రమశిక్షణ అంటే ఏమిటో నేర్చుకోవచ్చు. చేతికి వాచీ లేకపోయినా సూర్యుడి ప్రతాపాన్ని బట్టి సకాలంలో అన్ని పనులు చేసే రైతుల నుండి టైమ్ తో పాటు టైమింగ్ ను కూడా ఫాలో కావచ్చు. ఇవన్నీ మనకు తెలియకుండా ఆ దేవుడు ఇచ్చిన గరువులే!” అని చెప్పాడు రవిశంకర్.
రవిశంకర్ ని అలా చూస్తుండి పోయింది స్వప్న. “మేడమ్ ” అన్న కెమెరామెన్ పిలుపు విని ఈ లోకంలోకి వచ్చింది.
“సార్, ఇన్ని సూక్తులు చెప్తున్న మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎందుకు అంత శ్రమించారు? సమన్విత రియల్ ఎస్టేట్స్, సుచరిత డెవలపర్స్ ఇలా పారిశ్రామిక రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగి, లెక్కకు మించి ఆస్తులను కూడబెట్టి ఇప్పుడు ఇలా మీరిద్దరూ ఇక్కడ ఇలా గడపటమేంటి? అసలు మీకెంతమంది పిల్లలు? వాళ్ళ దగ్గరకు మీరెప్పుడు వెళ్తారు?” అని అడిగింది స్వప్న.
“ఇందాకే చెప్పాను కదమ్మా! మనం ఎంత ఎదిగినా దానికి కారణం కేవలం మన తెలివితేటలు ఒక్కటే కాదు. దైవ సంకల్పం కూడా ఉండాలి. గత జన్మలో నేను చేసిన పుణ్యాలకు గాను నాకు ఈ జన్మలో ఇంత మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు. భర్త అడుగు జాడల్లో నడిచే భార్య, రత్నాల్లాంటి ఇద్దరు అమ్మాయిలు, హోదా, డబ్బు. ఇవన్నీ ఆ దేవుడు నేను అడక్కుండానే ఇచ్చినవి. లైఫ్ అన్నాక అన్ని స్టేజస్ దాటాల్సిందే. పెళ్ళీడు వచ్చాక పెళ్ళి చేసుకోవాల్సిందే. పిల్లల్ని కనే టైమ్ లో కనాల్సిందే. వాళ్ళని సుఖంగా చూడడంలో కాలంతో పాటు పరిగెట్టాల్సిందే. అందులో ఎన్నో గెలుపోటములు రుచి చూడాల్సిందే. అందులో భాగంగానే ఈ ఐశ్వర్యాలు, ఈ హోదాలు. మనం పరిగెట్టడం ఆపేసిన తర్వాత మన తరువాతి తరం వాళ్ళు పరిగెట్టడం మొదలు పెడతారు. ఇదంతా కంటిన్యూస్ ప్రోసెస్. దీనికి అంతం లేదెక్కడ. పరుగు మొదలు పెట్టడానికి ముహూర్తం అక్కర్లేదు కానీ మనం పరుగు ఎక్కడ ఆపాలో మాత్రం తప్పక తెలిసుండాలి. ఆ దేవుడు నన్ను ఎంత వరకు పరిగెట్టమన్నాడో అంత వరకు పరిగెట్టాను. అందుకే నేను ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేశాను. ఇద్దరి పిల్లలకి వాళ్ళకి నచ్చిన వాళ్ళతోనే పెళ్ళిళ్ళు చేసాను. ఆ సమయంలోనే నేను చేసే దానధర్మాలకు పోనూ, మా చేతి పట్టున కొంత ఉంచుకుని మిగిలి ఉన్న ఆస్తిని ఇద్దరికీ సమానంగా పంచి ఇచ్చాను. రేపొద్దున్న మా పిల్లలు మాకేమిచ్చారు అని అడగకుండా వారికి ఉపయోగపడే సమయంలోనే అన్నీ సెటిల్ చేసేసాను. వాళ్ళు వాళ్ళ బిజినెస్ లలో బిజీగా ఉన్నారు. మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాం. వాళ్ళు పండగలకి, పబ్బాలకి వస్తుంటారు, వెళ్తుంటారు. మమ్మల్ని రమ్మని పిలిచినా ఇప్పటి నుండీ వారికి మేము భారమవ్వాలనుకోలేదు. ఏ కాలో, చెయ్యో మూల పడిన తర్వాత ఎలాగూ వారి పంచనుండడం తప్పదు. అలాగని వాళ్ళు మనకు సర్వీస్ చేయాలనుకోవడం కూడా మన మూర్ఖత్వమే. తల్లిదండ్రులకు సేవ చేయాలనే సుహృద్భావం వాళ్ళకుండాలి. అది ఒకళ్ళు చెప్తే రాదు. ” అని చెప్పాడు రవిశంకర్.
“సార్! మీరు వేదాంతం మాట్లాడుతున్నారు” అని అడిగింది స్వప్న.
“అదేనమ్మా మన దౌర్భాగ్యం. జీవిత సత్యాలు మాట్లాడితే వేదాంతం మాట్లాడారు అంటారు” అని చెప్పాడు రవిశంకర్.
“సార్! మీరు తలచుకుంటే చాలా మంది పనివాళ్ళతో ఈ తోటలో పనిచేయించుకోవచ్చు. కానీ మీరే కష్టపడడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి?” అని అడిగింది స్వప్న.
“కష్టేఫలీ అనే నానుడిననుసరించే నేను ఈ పని చేసుకుంటున్నాను. మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని మన చేతికందిచ్చేది ఈ భూమి ఒక్కటే. ఇక నేను పని చేయడమంటావా! అది మన అభీష్టం మేరకు ఉంటుంది. నాకు ఈ పని చేయడమంటే చాలా ఇష్టం. ఈ దశలో ఈ మొక్కలే నా నేస్తాలు. మనం వాటిని ఎంత బాగా చూసుకుంటే అంతలా పువ్వుల్లో పెట్టి మనకందిస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే, ఇన్నాళ్ళూ మనం పడిన టెన్షన్ లను మర్చిపోవచ్చు. బిపి, షుగర్ లు కూడా కంట్రోల్ లో ఉంటాయి. ” అని సమాధానమిచ్చాడు రవిశంకర్.
“సార్! చివరగా ఒక ప్రశ్న. అన్ని ఆటుపోట్లను చూసిన ఒక మేధావిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యూత్ కి మీరిచ్చే సందేశం ఏమిటి?” అని అడిగింది స్వప్న.
“ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేధావిని కాను (నవ్వుతూ). ఇక సందేశాలంటావా! అవి వినటానికి చాలా బాగుంటాయి. కానీ ఆచరణలో పెట్టేటప్పటికి దానిలో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి. అయినా నేను ఈ మార్గంలో వెళ్ళాను, మీరూ ఈ మార్గంలోనే వెళ్ళండి అని సందేశం ఇవ్వడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న యూత్ మనకన్నా బాగా కష్టపడుతున్నారు. పైకి ఎదగడానికి కొత్త, కొత్త దారులు వెతుక్కుంటున్నారు. కానీ నేను చెప్పచ్చేదొకటే, మీరు ఏ దారిలో వెళ్ళినా అది సరియైనదా కాదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించండి. పక్కవాడి ఎదుగుదలను కొలమానంగా తీసుకోకండి. మీ వరకు మీరు మీ తాహతకు తగ్గట్టు కష్టపడుతున్నానా లేదా అని ఆలోచించండి. ఎందులోనైనా తృప్తి అవసరం. తృప్తి లేనప్పుడు మీ సంపాదనకు, మీ కష్టానికి ఎల్లలుండవు. అప్పుడు ఎంత సంపాదించినా మీ జీవితంలో విలువైన మనశ్శాంతి కరువవుతుంది. ఇక ఆఖరిగా, అహంభావాన్ని మీ దరిదాపుల్లోకి కూడా రానీయకండి మీరు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

March 2021
M T W T F S S
« Feb   Apr »
1234567
891011121314
15161718192021
22232425262728
293031