June 14, 2024

*గొప్ప సందేశాత్మక ‘ లేఖావలోకనం ‘

సమీక్షురాలు : యడవల్లి శైలజ ( ప్రేమ్)

ఉత్తరం, లేఖ ఎలా పిలిచినా ఆ మాట వింటేనే ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్ళిపోతాం. పోస్ట్ మాన్ సైకిలు బెల్లు శబ్ధం విని ఆతృతతో , ఆనందంతో అందుకుని దాన్ని చింపి చదివేదాక మనసు ఊరుకోదు. ఈ ఉత్తరాల్లో రాసే ప్రతి అక్షరం రాసిన వారికి, చదివిన వారికి గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అమ్మకు, నాన్నకు, స్నేహితులకు, పిన్నికి, బంధువులకి, ప్రేమికులకు రాసిన ఉత్తరాలే మనకు తెలుసు. ‘ఈనాడు తెలుగు వెలుగు వారుప్రేమలేఖల పోటీలు నిర్వహించిన వాటిల్లోను ప్రేమతో చెట్టు, పుట్ట, నింగి, నేల ,గాలి, దూళి, భూమి, మాగాణి, చెలక, పంచ భూతాలకు అక్షరాలను పొదిగిన లేఖలను చదివాను. వీటన్నింటి కంటే భిన్నమైనవి ఈ లేఖలు.
పసిపిల్లలపై లైంగిక హింసను ఖండిస్తూ తెలుగులో మొదటి ఉత్తరాల పుస్తకమిది. ఈ లేఖావలోకనం తీసుకొని రావడానికి శ్రమపడ్డ ఈ పుస్తక సంపాదకులు జ్వలిత గారికి హృదయపూర్వక అభినందనలు.
అవలోకనం ప్రచురించిన జ్వలితగారు వెంటనే లేఖావ లోకనం తీసుకొని రావడం సాహసంతో కూడుకున్న పని. అవలోకనం గుండెను తడి చేసింది. ఈ లేఖావ లోకనం ఆ తడిని మరింత ఎక్కువ చేసింది. ఒక్కొక్క లేఖ,ఒక్కొక్క కమ్మ కన్నీటి చెమ్మ.
అనిశెట్టి రజిత గారు తన స్నేహితురాలికి రాసిన లేఖలో ‘లక్షూ ‘ ఒక సంవత్సర కాలం గడిచిపోయిన భయానక అత్యాచారాల తలంపులు ప్రతిరోజూ మనసును కెలికి మళ్ళీ మళ్ళీ కొత్తగా గాయాలను పచ్చిగా చేస్తూనే ఉన్నాయి. అసలు ఏనాటికైనా స్త్రీ శరీరంపై ఈ క్రూరమైన లైంగిక దాడులు లేకుండా ఉంటాయా? మన బతుకంతా కలత నిద్రలూ భయానక స్వప్నాలే కదా! ఎంత హృదయ
వేదన కనిపిస్తున్నది ఈ లేఖలో.
కాలం మారుతుంది కాలంతోపాటు తల్లి పాత్ర మారిపో తుందని ‘అప్పలకుట్టి రాజ్యలక్ష్మీ’ గారి ఆవేదన. తల్లనే రక్షణ కవచం కాలం చేసిన అరుగుదల వలన తుత్తుని యలై పార్దీవ దేహమై ఒరిగి పోతున్నది. ఎంత గొప్ప సత్యం కన్నుల ముందర.
‘ఆచార్య సూర్య ధనుంజయ్ ‘ ఆత్మీయతలు కొరవడిన ఈనాటి సమాజంలో మానవ విలువలు తరిగిపోయాయి. అందుకే ఈ అత్యాచారాలు . ఆనాటికాలంలో అడవుల్లో మృగాలకు భయపడితే ఇప్పడవి మనిషి రూపంలో ఇక్కడే సంచరిస్తున్నా యని ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే భయంగా ఉందని తన తల్లికి తన హృదయ ఘోష వినిపించారు. స్వర్గలోకం లో ఉన్న తల్లి శక్తిని గుర్తు చేసుకున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ కాలంలోనే మోసాలు పెరుగుతున్నాయి. వాట్సప్, మెసేజ్, ఫేస్ బుక్, తీయని మాటలు అగాధంలోకి దింపుతాయి జాగ్రత్తగా ఉండమని పిన్నిగా తన కూతురికి హితవు చెబుతున్న ఈ లేఖ ఆలోచనాత్మకం. ఈ లేఖ రాసిన వారు ‘ ఓరువాల సరితా నరేష్.

వేదనాపూరిత భావుకత ఇది సుమధురంగా మీటుతూ హృదయాన్ని ధ్రవింపజేస్తూ పాఠకులను రచనను చదివేలా చేయడం ‘ కుప్పిలి పద్మ ‘ గారికే సాద్యం.
” ప్రపంచంలో జరుగుతున్న అరాచకాలను చూసన్నా కాస్త మారమని ఎడ్యుకేట్ చేయమని ఎన్నెల గారు చేస్తున్న హితబోధ “.
తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, పోలీసులు ఆడపిల్లకు అన్యాయం జరిగిన వెంటనే స్పందించాలి అది గురుతర బాధ్యత అని విశదీకరించారు. కె. ఎ. ఎల్. సత్యవతి స్పందించి అమ్మకు రాసిన దేవుడు చిరునామ లేఖ.
టీచర్లగా మనం మార్చడానికి కృషిచేద్దాం ఆడపిల్లల్ని కాపాడడం అమ్మగా మన బాధ్యత. వాళ్ల హక్కుల కోసం కూడా పోరాడడం టీచర్లగా మన బాధ్యతని చెప్పారు. కోమాకుల వినోద.
సంధ్య గోళ్ళమూడి గారు వదినా అని రాస్తూ సందేశాత్మక వినోదాత్మకంగాను బడిలో ఆడపిల్లలకు బుద్దులు, సుద్దులు నేర్పానని రాసారు.
చల్లా సరోజినీ దేవి గారు అంతర్జాలంలో ఆశ్లీల చిత్రాలు, చిన్నతనం నుండి మగపిల్లవాడిని మంచిగ పెంచక పోవడం కూడా కారణమవుతుందని కూతురుకి రాసుకున్నారు .
మారుతున్న సాంస్కృతిక పరిస్థితులు కుటుంబా లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నయి. ఉద్యోగం చేసే తల్లిదండ్రులకు పిల్లలతో మాట్లాడే తీరిక ఉండటం లేదు.
టీ. వి లకు, సెల్ ఫోన్ కు అలవాటుపడి వ్యసనంగా మారుతున్నదని ఆడపిల్లల వినాశనంకు కారణం ఇది కూడా ఒకటని అభిప్రాయ పడ్డారు పులి జమున తన స్నేహితురాలు సుధకు రాసిన లేఖలో.
జోగుళాంబ అమ్మవారికి అనుగ్రహించమని కోరుకుం టూ అభ్యర్థన లేఖ రాసారు. జోషి పద్మావతి.
వ్యక్తిగత సమాచారంను వేరెవరితోను పంచుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెబుతూ ప్రియ శిష్యురాలు స్వాతికి భోదిస్తూ ఒక గురువుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చారు. దేవరకొండ జ్యోత్స్నాదేవి గారు.
చిన్నతనం నుండి మనం పాఠశాలలో నేర్చుకున్న ప్రతిజ్ఞ మన ప్రజల్లోకి నిజంగా ఆచరణలోకి వస్తుందా?రావాలి అది వచ్చిన రోజు ఈ ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో ఉంటుందని షేబారాణి అశావాహ థృక్పథంతో చేసారు.
డా. కె. గీత కవిత రూపంలో రాసిన సందేశాత్మక లేఖ. బహిర్భూమికైనా ఎటువైపుకీ వెళ్లకు తల్లీ అక్కడ ఆడ వాసన కోసం నిరంతరం కాచుకున్న తోడేళ్లుంటాయి అంటూనే నిన్ను నువ్వు కాపాడుకో ప్రజ్వలమయ్యే అగ్ని జ్వాలవై నిన్ను నువ్వు కాపాడుకో. ఆడపిల్లలకు చదువుతో పాటు తనని కాపాడుకునే శిక్షణని కూడా ప్రతి బడిలో నేర్పాలనే సూచన ఇస్తూ అజ్ఞాత మిత్రుడుకి లేఖ రాసారు.
నాగరికత సమాజం అనుకునే మన దేశంలో మహిళలకు సమానత్వం, గౌరవం తక్కువని అనాగరిక సమాజం అనుకునే దగ్గర మహిళలకు గౌరవం ఎక్కువని మారుతున్న సమాజంను మార్చేది యువతే అని తన చెల్లికి రాసిన లేఖలో కొండపల్లి నిహారిణి వివరించారు.
ఆడపిల్ల కనిపిస్తే చాలు ఆవురావురుమనే మగ పిశాచులు తిరుగుతున్నరు. వాళ్లకు వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్ల అని కూడా లేదు. జర జాగ్రత్త. మనుమరాలిపై దృష్టి పెట్టమని కూతురుకి ఉత్తరం డా. చీదెళ్ళ సీతాలక్ష్మి ముందు చూపుతో రాసారు.
చట్టాలు పటిష్టంగా లేకపోతే అత్యాచారాలు ,అరాచ కాలు ఇలాగే జరుగుతాయని చట్టాలు బాగుండాలని సగటు స్త్రీకి కనీస భద్రత ఎందుకు కరువయ్యింది కారణం ఎవరు అని అడుగుతున్నారు డా. తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి తన అంతరాత్మకు రాసుకున్నారు.
డా. తిరునగరి దేవకీదేవి గారు ఎన్నెన్నో సంవత్సరాల తరబడి జరుగుతున్న అత్యాచారాలు ఉటంకిస్తూ తన సహచరుడికి రాసిన లేఖ మారిన విలువలు మారుతున్న జీవితాలు ఎలాగవుతున్నా యో కలవరపడ్డ మనసుతో రాసుకున్న లేఖ.
వనప్రియకు డా. దాసోజు పద్మావతి గారు రాసిన ఉత్తరం చదువుతుంటే ఒక ఉపాధ్యాయురాలు తన శిష్యురాలికి గురువుగాను, తల్లిగాను బాధ్యతతో అలంకరణ, అవేర్నెస్ గురించి ధైర్యంగా ఉండాలని ధైర్య మిచ్చిన తీరు సమాజంలో ప్రతి టీచర్ ఇలాగే ఉండాలని అనిపించేలా ఉంది.
ఆడపిల్ల పుట్టుక ప్రశ్నార్థకం, భ్రూణ హత్యలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు పట్ల తనకున్న ఆవేదన ఇది డా. నన్నపనేని విజయ శ్రీ లేఖ సారాంశం.
ఆడపిల్లకు ఎన్ని కష్టాలో! ఈ వ్యవస్థ మారాలనే ఆవేదనతో డా. నర్మదారెడ్డి గారి లేఖ.
డా. పోలా సాయి జ్యోతి అన్నయ్యకు రాసిన ఆత్మీయ లేఖ మనం ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి చుట్టుపక్కల అందరితో కలిసి చర్చ పెట్టాలంటూ.
మధ్యపానం సకల అరాచకాలకు మూలం అని దాన్ని అరికడితే అంతా మంచే జరుగుతుందన్న ఆశాభావం డా. ప్రతిభా లక్ష్మీ భావన.
డా. మాడ పుష్పలత ఉగాది నిన్ను మంచిగా ఆహ్వానిస్తాం మాకు శుభములిమ్మా అనివేడుకుంటూ రాసిన లేఖ.
ఇప్పుడున్న పరిస్థితులను ముందు తరాలకు తెలియచేయాలని పొందు పరిచిన సమాచారం పుస్తకంగా వేయాల ని మన పుట్టుకకు ఒక అర్థం వుందని చెప్పిన డా. లక్ష్మీ రాఘవ లేఖ. స్ఫూర్తి లేఖ అంటూ వనపర్తి పద్మావతి గారి లేఖ పుట్టే బిడ్డ ఎవరైనా పర్వాలేదు మంచి విలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వమని కోరుతూ తన మనుమరాలికి ప్రేమతో .డా. శ్రీ భాప్యం అనురాధ, డా. సి. హెచ్ సుశీల
సామాజిక అభివృద్ధిని కోరుకుంటూ అత్యాచారాలు ఆపాలని రాసిన లేఖలు.
రచయిత, రచయిత్రుల లేఖలన్నీ ఆడపిల్లలను గౌరవించడం మగపిల్లలకు నేర్పాలి. ఆడ, మగ అస
మానతలు పోవాలి, అరాచకం చేసిన వారికి కఠినమైన శిక్షలను అమలు చేస్తే అరాచకాలు జరగవనే అభిప్రాయం కొందరవైతే ఉమ్మడి కుటుంబాలు, సంప్రదాయాలు, మారిన విలువలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, అంతర్జాలం, అశ్లీల చిత్రాల ప్రదర్శన, మద్యపానం, మత్తు పదార్థాల వినియోగం వల్ల అత్యాచార పర్వం ఎక్కువైతందని, ఆడపిల్లలకు ఆత్మ రక్షణ విద్య నేర్పించాలని చైతన్యవంతమైన ఉత్తరాలను రాసారు.
ఎవరు ఎవరికి రాసినా ఎలా రాసినా అందరూ ఆకాంక్షిం చేది ఒక్కటే మహిళల మనుగడ కొనసాగాలని,వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చుకునే అవకాశం ఇవ్వాలన్నేది సమాజం అభివృద్ది జరగాలన్నా ముందు తరాలకు మన భారతీయ సంస్కృతి పట్ల గౌరవం, ఆదరణ పెరగాలన్నా ఆడపిల్లలకు జన్మనివ్వాలి. ఎక్కడ ఆడపిల్ల కళకళ లాడుతూ తిరుగుతుందో అక్కడ అభివృద్ధి జరుగును.
పసిపిల్లలపై లైంగిక దాడులు ఆపాలని రాసిన రచయిత లందరికి అభినందనలు తెలుపుతూ, జ్వలిత గారు ఆశించిన మార్పు మగవాళ్ళలో రావాలని కోరుకుందాం.
ఇటువంటి బాధకరమైన లేఖలు మళ్ళీ రాయకూడదనే ఆశిద్దాం.
లేఖలనైతే బతికించుకుందాం. ముందు తరాలకు మన ఆత్మీయ పలకరింపులను చవిచూపిద్దాం.
ఇంతమందిని భాగస్వామ్యులను చేసి ప్రముఖుల లేఖలను ఇందులో పొందుపరిచి మంచి ఆలోచన, సందేశాత్మక ,స్ఫూర్తిధాయక లేఖలను మన ముందుకు తీసుకుని వచ్చిన జ్వలిత గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఇటువంటి పుస్తకాలు మరెన్నో వెలుగులోనికి తీసుకొని రావాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

ప్రతులకు:
జ్వలిత,
సాహితీవనం,15-21-130/2, బాలాజీ నగర్,
కుకట్పల్లి, హైదరాబాద్- 72.
Mobile: 9989198943
Jwalitha 2020@gmail.com

2 thoughts on “*గొప్ప సందేశాత్మక ‘ లేఖావలోకనం ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *