April 26, 2024

తామసి – 9

రచన: మాలతి దేచిరాజు

కుక్కట్ పల్లి భ్రమరాంబ థియేటర్ చుట్టుపక్కల ప్రాంతం…
ఒక టీ స్టాల్ దగ్గర బైక్ పార్క్ చేసి, ఏరియా అంతా ఒక చూపు చూసాడు గౌతమ్.
షీబా చెప్పిన రెండే రెండు ఆనవాళ్ళు…
ఒకటి: “రేయ్ మన ఏరియాకి పోదాం..రా…”
“వద్దొద్దు… మన ఏరియాలో డ్రైనేజ్ పైప్ లైన్ వర్క్ జరుగుతుంది… ఏదైనా తేడా వస్తే దొరికిపోతాం… ఇక్కడే త్వరగా కానిచ్చేద్దాం.” అని వాళ్ళు మాట్లాడుకున్న మాటలు.
రెండు: నలుగురిలో ఒకడికి… ఎడమ చేతి వేళ్ళల్లో ఉంగరపు వేలు లేదు… (తన వేళ్ళ మధ్యలోకి వాడి వేళ్ళు చొప్పించినప్పుడు గుర్తించింది తను ఆ సంగతి.)
సిటీ మొత్తంలో ఆ రోజు రాత్రి డ్రైనేజ్ పైప్ లైన్ వర్క్ జరిగిన ఏరియా అదొక్కటే… ఈ విషయం తన ఆఫీసు కొలీగ్ సాయంతో తెలుసుకున్నాడు…
బైక్ పైన ఆ ఏరియా అంతా పరిశీలనగా చూస్తూ… అక్కడక్కడా ఆగుతూ (టీ స్టాల్ లు, కేఫ్ లు మొదలగునవి) కాసేపు వచ్చేపోయే వాళ్ళని, వాళ్ళ ఎడమ చేతి ఉంగరపు వేలిని గమనిస్తూ సాయంత్రం దాకా చూడసాగాడు.
చీకటి పడుతోంది. టైం ఏడున్నర కావొస్తుంది.. వేణు వైన్స్ దగ్గర జనం సందోహం…
పక్కనే ఫర్లాంగ్ దూరంలో అక్బర్ కేఫ్ దగ్గర ఉన్నాడు గౌతమ్. వైన్ షాప్ దగ్గర ఏదో గొడవ జరుగుతుండటంతో జనం మూగారు… గౌతమ్ దృష్టి అటు మళ్ళింది… లేచి వైన్స్ దగ్గరికి వెళ్ళాడతను.
“రేయ్..నీ యమ్మ…లం..కొడకా..” నీ యమ్మ *** ” నరుకుతా ..నీ….” ఇలా సగం సగం వినిపిస్తోంది బూతు పురాణం. గౌతమ్ అక్కడికి చేరే టైం కి గొడవ సద్దుమణిగి ఎక్కడివాళ్లు అక్కడికి కదిలారు… గౌతమ్ కూడా వెనుతిరగబోతూ టక్కున ఆగాడు. అతని కంటి చూపు పెద్దదైంది… ఇంతసేపటికి అతని నిరీక్షణ ఫలించింది
ఎడమ చేతికి ఉంగరపు వేలు లేని ఒకతను బీరు బాటిల్స్ పట్టుకుని నడిచి వెళ్తూ కనిపించాడు… క్షణం ఆలస్యం చేయకుండా అతన్ని ఫాలో అయ్యాడు గౌతమ్… అతను మాత్రం తాపిగా నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతను ఒక సందులోకి తిరిగాడు… గౌతమ్ కూడా…
ఆ సందులో కొంత దూరం నడిచారు ఇద్దరూ…
ముందు అతను, వెనక గౌతమ్. తనని ఎవరో ఫాలో చేస్తున్నారన్న అనుమానంతో చప్పున తిరిగాడు అతను…
గౌతమ్ వెంటనే పక్కకు కదిలి దాక్కున్నాడు. ఎవరూ లేకపోవడంతో అతను మళ్ళీ నడక కొనసాగించాడు… గౌతమ్ యథావిధిగా ఫాలో అవుతున్నాడు…
ఇద్దరికీ ముప్ఫై అడుగుల దూరం ఉంది.అతను మలుపు తిరిగాడు. గౌతమ్ అడుగుల వేగం పెంచి ఆ మలుపు దగ్గరికి రాగానే అతను కనిపించలేదు. పరుగున ఆ మలుపు మధ్య వరకు వచ్చాడు. అక్కడ ఎవరూ కనబడలేదు.
అటూ, ఇటూ చూసి వెనక్కి తిరిగే సరికి ఎదురుగా అతను ఉన్నాడు… గౌతమ్ ధైర్యాన్ని గుండె నిండా నింపుకుని అతన్ని చూస్తున్నాడు. అతను ఒక్కో అడుగు వేస్తూ గౌతమ్ ని సమీపిస్తుండగా గౌతమ్ కంట పడింది పక్కనే పడి ఉన్న ఒక ఇనప చువ్వ. అతను గౌతమ్ కి దగ్గరగా వస్తున్నాడు, గౌతమ్ ఆ చువ్వని, అతన్ని మార్చి, మార్చి చూస్తూ నిలబడ్డాడు.
అతను పూర్తిగా దగ్గరకి సమీపించగానే చువ్వ అందుకుందాం అనే లోపు ఒక్కసారిగా ఆగాడు. “బె..బె..బె”… అంటున్నఅతని గొంతు విని..
అతను మూగవాడన్నసంగతి అర్థమైంది గౌతమ్ కి.
అతని భాషలో .. “ఎవరు కావాలి ..నన్నేందుకు ఫాలో చేస్తున్నావు..” అనే భావం అర్థమౌతోంది.
తనని ఫాలో అవ్వట్లేదని ఏదో అడ్రెస్ కోసం వెతుకుతున్నానని అతని భాషలోనే చెప్పాడు గౌతమ్. అతను దారి చెప్పి వెళ్ళిపోయాడు. గౌతమ్ అక్కడనుంచి కదిలాడు.
సందులో నుంచి మెయిన్ రోడ్ వైపుకి వస్తుండగా ఎదురైంది అతనికి ఒక ఇన్నోవా.. ఆ సందులోకి వస్తూ క్యాజువల్ గా చూసి నడుస్తున్నాడతను. ఇన్నోవా ఆగింది.
అందులో నుంచి దిగారు ఓ నలుగురు కుర్రాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. గౌతమ్ ఆగి వాళ్ళని గమనించసాగాడు.
“రేయ్ మీరు వెళ్ళండి. నేను సిగరెట్లు తీసుకు వస్తా…” అని ఒకడు మెయిన్ రోడ్ వైపుకి వస్తున్నాడు. మిగతా ముగ్గురు అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిపోయారు.
మెయిన్ రోడ్ దగ్గర ఉన్న పాన్ షాప్ దగ్గరకి వచ్చి సిగెరట్ తీసుకుని వెలిగించాడా కుర్రాడు. ఇరవై నుంచి పాతికేళ్ళ వయస్కుడతను. మిగిలిన నలుగురిదీ అదే వయసుంటుంది. తన అనుమానం సరైంది కాదనుకుని వెళ్ళిపోబోయాడు గౌతమ్
ఆ కుర్రాడు ఫోన్ మాట్లాడుతూ ఎడమ చేతిని గాల్లో ఊపుతున్నాడు తన మాటలకి తాళం వేస్తున్నట్టు. గౌతమ్ చూపు అతని చెయ్యి మీద పడింది. అతనికి కూడా ఉంగరపు వేలు లేదు. గౌతమ్ కంటి పాప పెద్దదైంది.
ఇన్నోవా… నలుగురు.. ఎడమ చేతి వేళ్ళలో ఉంగరపు వేలు లేకపోవడం… అన్నీ మ్యాచ్ అయినప్పటికీ పూర్తి నమ్మకం కలగలేదు గౌతమ్ కి. కారణం ఇందాక మూగవాడి సంఘటన.
అతను సిగరెట్ తాగడం పూర్తయింది. ఇంకొన్ని సిగరెట్లు తీసుకుని కదిలాడు.
అతన్ని ఫాలో చేస్తూ వెళ్ళాడు గౌతమ్.
అపార్ట్మెంట్ లో మూడో ఫ్లోర్ కి వెళ్ళాడు ఆ కుర్రాడు లిఫ్టులో. లిఫ్ట్ ఎక్కడ ఆగిందో చూసి మెట్లపైనుంచి వెళ్ళాడు గౌతమ్… అతను వెళ్లేసరికి ఫ్లోర్ లో ఎవరూ లేరు.
అటూ, ఇటూ చూసాడు. మొత్తం ఆరు ఫ్లాట్లు. అందులో ఆ కుర్రాడు ఎందులోకి వెళ్ళాడో తెలియడం లేదు. ఏ అర్ధరాత్రో అయి ఉంటే, ఏ ఇంట్లో లైట్ వెలిగితే అదే బ్యాచలర్స్ రూమ్ అనుకుని వెళ్ళుండే వాడు. కానీ టైం ఎనిమిదిన్నర కాబట్టి దాదాపు అన్ని ఫ్లాట్స్ లో లైట్లు వెలుగుతున్నాయి.
రెండు, మూడు నిమిషాలు ఏమీ అర్థం కాలేదు గౌతమ్ కి. మెరుపులాంటి తలంపేదో తట్టింది. ఒక్కో ఫ్లాట్ చూసుకుంటూ కదిలాడు. ప్రతి ఫ్లాట్ గుమ్మాలని చూసుకుంటూ వెళుతున్నాడు. ప్రతీ గుమ్మానికి పసుపు, లేదా తోరణం ఏదోటి ఉంది, ఒక్క గుమ్మానికి తప్ప. సరిగ్గా ఆ గుమ్మం దగ్గర ఆగాడు. తలుపు కొట్టాడు ధైర్యంగా. కాసేపటికి తలుపు తెరచుకుంది. గౌతమ్ మొహం విప్పారింది.
“ఎవరు కావాలి?”అడిగింది ఓ పెద్దావిడ. తటపటాయించాడు అతను.
“ప్రసాద్ రావు గారున్నారా?” నోటికొచ్చిన పేరు చెప్పాడు. కానీ అతను ఊహించని విధంగా
“ఏవండీ…” అని పిలిచింది ఆవిడ. ఖంగు తిన్నాడు గౌతమ్. ప్రసాద్ రావు వచ్చాడు.
“మీ కోసం వచ్చారు…”అంది భర్తతో ఆవిడ.
“ఎవరు బాబు నువ్వు ?” అడిగాడు అతను.
“ప్రసాద్ రావు గారు…”
“నేనే…”
“ఆహా మీరు కాదు…”
“నా కోసం నా ఇంటికొచ్చి నేను నేనే కాదంటావ్ ఏమిటీ?”
“అంటే..నా ఉద్దేశం నాకు కావాల్సిన ప్రసాద్ రావు మీరు కాదని.
“ఈ అపార్ట్మెంట్ మొత్తంలో నేనొక్కడినే ప్రసాద్ రావుని” దర్పంగా చెప్పాడాయన.
“అయితే అడ్రెస్ తప్పేమో… సారీ.” అని కదలబోతుండగా అతని కంట పడింది ఆ ఇంట్లో గోడకి ఉన్న జీసస్ ఫోటో… అతని లాజిక్ తప్పని తెలుసుకుని కదిలాడు అక్కడ నుంచి.
లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి లిఫ్ట్ లో నుంచి బయటకి వచ్చాడు డామినోస్ డెలివరీ బాయ్ అతని చేతిలో పార్సెల్ ఉంది.
గౌతమ్ ని చూసి అతన్ని దాటుకుని పోతుండగా,
“పిజ్జానా?” అన్నాడు గౌతమ్… అతను ఆగి
“అవును సార్..304.” అన్నాడతను.
ఈసారి తనకొచ్చిన అలోచన ఫలించబోతోంది.
“మాదే… ఇలా ఇచ్చేయ్!” అని క్యాజువల్ గా బిహేవ్ చేస్తూ పర్స్ తీసి, “ఎంతా?”అన్నాడు.
“650” చెప్పాడతను. డబ్బులిచ్చి పార్సెల్ తీసుకున్నాడు గౌతమ్.
కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తెరిచాడు నలుగురిలో ఒకడు.
“పీజా సార్…” అన్నాడు గౌతమ్ పార్సెల్ అందిస్తూ
“ఎంత?”అన్నాడతను పార్సెల్ అందుకుని.
“650…” చెప్పాడు గౌతమ్.
“ఒక్క నిమిషం…” అని ఇంకొకడ్ని పిలిచాడతను.
“చేంజ్ ఉన్నాయా?”అడిగాడు.
“నా దగ్గర లేవురా, డ్రా చెయ్యాలి!” అని ఇంకొకడ్ని పిలిచాడు…
ఒక పిలుపుకి ఇద్దరొచ్చారు. నాలుగో వాడు డబ్బు ఇచ్చాడు. తీసుకుని వెళ్ళిపోయాడు గౌతమ్.
*****
చిమ్మ చీకటి… కళ్ళు తెరిచి అటూ,ఇటూ కంగారుగా చూస్తున్న అతనికి చీకటి అలవాటై కళ్ళ వెలుగే కాంతిగా మారి చీకటి కనిపించడానికి కొన్ని సెకెన్లు పట్టింది… పూర్తిగా చీకట్లో ఉన్నానని తెలుసుకున్నాక కదలబోయాడు. చేతులు కట్టేసిన ఫీలింగ్… గింజుకున్నాడు. ఆ కుదుపుకి తనతో పాటు కట్టి ఉన్న మరొకడు, తర్వాత ఇంకొకడు… అలా అందరూ మగత నుంచి బయట పడ్డారు. అందరూ వెల్లకిలా పడుకుని ఉన్నారు వరుసగా… ఒక ఐరన్ రాడ్ కి కట్టి ఉన్నాయి వాళ్ళ చేతులు. నలుగురూ గింజుకుంటున్నారు.
“రేయ్… ఎవర్రా ఇలా కట్టేసింది? అసలు ఎక్కడున్నాం మనం?” అన్నాడొకడు.
టక్కున ఒక స్పాట్ లైట్ వెలిగింది. స్పాట్ లైట్ వెలుగులో నలుగురూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఏదో తడి తగులుతున్నట్టు అనిపించి ఏమిటా అని చూసుకున్నారు. ఎవరికీ ప్యాంట్లు లేవు. ఆ తడి తమ ఒంటి నుంచి వచ్చిన వ్యర్థజలం అని తెలిసింది.
“స్…అమ్మా…” అన్నాడొకడు. అలా ఒకళ్ళ తరువాత ఒక్కళ్ళు అన్నారు. తలెత్తి పైకి చూస్తే ఒక్కోక్కరి ఉదర భాగంకి కాస్త ఎత్తులో సరిగ్గా మర్మాంగానికి ఎదురుగా ఒక బాటిల్ వేలాడుతుంది. అది యాసిడ్ బాటిల్ అని అర్ధం అయ్యింది. చూడగానే కలవరపడ్డారు.
స్పాట్ లైట్ ఆ బాటిల్స్ మీద పడుతోంది… వాళ్ళకి కనిపించకుండా ఎవరో ఒక్కో బాటిల్ని షూట్ చేస్తున్నారు. ఫాట్..ఫాట్..ఫాట్..ఫాట్..మని బాటిల్స్ పగిలి యాసిడ్ వాళ్ళ మర్మాంగాలపై పడింది. దిక్కులు పెక్కటిల్లేలా అరవసాగారు ఆ నలుగురూ.
అది విని తను ఎలా అరిచిందో తలచుకోసాగింది షీబా. ముందు బాధ… అది కాస్తా తీరినట్టు కళ్ళలో ఒక ప్రతీకార జ్వాల చల్లారిన భావం… చివరికి ఏడుపు… ఆమెని ఓదార్చాడు గౌతమ్. కానీ వాళ్ళెవరో తనకి తెలియనివ్వలేదు. వాళ్ళని ఇలా చేసిందెవరో వాళ్ళకీ తెలియనివ్వలేదు.
అతను పిజ్జాలో మత్తు మందు కలపడం, అది తిని వాళ్ళు స్పృహ కోల్పోయాక వాళ్ళని తెచ్చి బంధించడం తలుచుకుని గర్వపడ్డాడు గౌతమ్…
***
“బుల్ షిట్… అసలు తలుపు ఎలా ఓపెన్ చేశాడో, ఆ నలుగుర్ని ఎలా తీసుకొచ్చాడో,
వాళ్ళని బంధించిన ప్రదేశం ఏంటో, ఎక్కడో, అది అతనికి ఎలా దొరికిందో… షీబాకి ఏం చెప్పి అలాంటి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొచ్చాడో… ఇవేవీ చెప్పకుండా ఏదో కమర్షియల్ సినిమా లాగ రాసేశాడు…ప్చ్..లాజిక్ లెస్” అనుకున్నాడు మూతి విరుపుగా ఇజాక్.
అతను అనుకుంది నిజమో కాదో ముందు, ముందు తెలుసుకుంటాడు.
“ఇంతకీ మన నసీమా ఏమైంది? గౌతమ్ షీబా ని పెళ్ళి చేస్కున్నాడా? నసీమా భర్తకి విడాకులు ఇచ్చేసి ఉంటుందా? ఇంకో పెళ్ళి చేసుకుందా? అసలు తను మళ్ళీ గౌతమ్ ని కలిసిందా, లేదా? ఒకవేళ కలిసినా షీబా గౌతమ్ జీవితంలోకి వచ్చింది కాబట్టి, తను కలిసినా ఉపయోగం లేదు. మా నసీమా క్యారెక్టర్ కి తగిన న్యాయం చేయకపోతే చెప్తా ఈ రైటర్ సంగతి.” నవ్వి చదవడం కంటిన్యూ చేసాడు.
*****

తలాక్ (విడాకులు) అయిపోయి పుట్టింట్లోనే ఉంది నసీమా గత కొద్ది రోజులుగా. లీగల్ గా విడాకులు (చట్ట ప్రకారం) రావడానికి ఆరు నెలల సమయం పడుతుంది. కానీ ముస్లిం సంప్రదాయంలో పెద్ద వాళ్ళ సమక్షంలో మూడు సార్లు ‘తలాక్ – తలాక్ – తలాక్’ అంటే విడాకులు మంజూర్ అయినట్టే.
సరైన వివరాలు తెలుసుకోకుండా పెళ్ళి చేసి కూతురి జీవితం తనే నాశనం చేసానని నసీమా తండ్రి బాధ పడని రోజు లేదు. అన్నిటికీ అల్లాహ్ నే ఉన్నాడు అని నమ్మి ప్రార్థించడం తప్ప తల్లి చేయగలిగింది ఏమీ లేదు. ఏమైనా అక్కకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నది ఛోటూ ఉద్దేశం. అయినవాళ్లైనా తనని అర్థం చేసుకుని ఆదరించడమే చాలనుకుంది నసీమా.
తను చదువుకున్న ఎం.ఏ చదువే తనకి ఆర్థికంగా సాయపడింది. పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుంటూ కాలం గడుపుతోంది. రెండవ పెళ్ళికి తల్లిదండ్రుల కన్నా, చుట్టాల నస ఎక్కువగా ఉండేది. కొంతమంది సంబంధాలు కూడా తెచ్చే వాళ్ళు. తిప్పికొట్టేది తను. తన పెళ్ళికి తండ్రి చేసిన 4 లక్షల అప్పు తీర్చడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంది.
కానీ ట్యూషన్లు చెప్పుకుంటూ ఎంత కాలమని? అందుకే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించింది. ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయిని ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుంది. పరీక్షలు కూడా రాసింది. కానీ ఫలితం లేకపోయింది.
హైదరాబాద్ గాయత్రి స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళ నాన్నకి తెలిసిన వాడై ఉండటంతో అక్కడ ఉద్యోగం దొరికింది. నెలకు పదిహేను వేలు జీతం. తన సెకెండ్ ఇన్నింగ్స్ ఇక హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.
కొత్త ఊరు, కొత్త మనుషులు, కొత్త గాలి, కొత్త నీరు, కొత్త వాతావరణం.
హైదరాబాద్ వచ్చీ రాగానే తనకి హాస్టల్ దొరికింది. ఉద్యోగంలో కూడా చేరిపోయింది. రెండు నెలల జీతం తన ఖర్చులు పోనూ మిగిలింది ఇంటికి పంపింది. బ్రతుకు… ఆకలి, నిద్ర అవసరాల కోసం గడుస్తున్నట్లుగా సాగుతోంది, గౌతమ్ ని మళ్ళీ తను కలిసే వరకూ.
*****
“ఎప్పుడూ హాస్టల్, స్కూలేనా? అప్పుడప్పుడు సినిమాలకి షికార్లకి కూడా వెళ్ళాలి… రావే ప్లీజ్.” అంది తన హాస్టల్ మేట్ అరుణ. తనకి కొంత మార్పుగా ఉంటుందనుకుని సరేనంది.
ఇద్దరూ ఐమాక్స్ కి వెళ్లారు. సినిమా చూసి ఫుడ్ కోర్ట్ లో లంచ్ చేస్తున్నారిద్దరూ. తింటూ తింటూ ఆగి రెప్పార్పకుండా చూస్తోంది నసీమా. ఆమె చూపుని గమనించి తల తిప్పి చూసింది అరుణ. ఆమె చూస్తోంది గౌతమ్ ని.
“హే మన గౌతమ్ “అంది తను. తను కూడా చిన్నప్పుడు అదే స్కూల్ అవడంతో తనకి కూడా ఫ్రెండే గౌతమ్.
“పక్కనెవరే? గౌతమ్ కి పెళ్ళి అయ్యిందా? చెప్పనే లేదు, నీకు తెలుసా?” అంది నసీమా, అరుణ
వైపు తిరిగి… ఆమె మాటలు తనకి వినిపించలేదు కాబోలు అనుకుని, చిటిక వేసింది కళ్ళ ముందు.
“ఏంటే అలా చూస్తున్నావ్?” అనగానే తేరుకుని
“ఏదో అంటున్నావ్ ఏంటి?” అనడిగింది అరుణ.
“గౌతమ్ కి పెళ్ళి అయిన విషయం నీకు తెలుసా అంటున్నా?” అడిగింది తింటూ.
“తెలీదు.”
“నీక్కూడా తెలీదా? అయితే ఉండు తననే అడుగుదాం ఎందుకు చెప్పలేదో…”అని
“గౌతమ్… ఏయ్ గౌతమ్…” పిలిచింది.
ఆమె పిలుపు విని అటు వైపు చూసి కదిలాడతను షీబా అతన్ని అనుసరించింది. చేరువగా వస్తూనే నసీమాని చూసి పొంగిపోయాడు గౌతమ్.
“హాయ్..”
“హాయ్..”
“ఏంటి బాబూ, పెళ్ళికి కనీసం ఫ్రెండ్స్ ని కూడా పిలవలేదు?” అంది అరుణ.
నవ్వాడు గౌతమ్.
“నాకు పెళ్లైందని ఎవరు చెప్పారు?”
“అదేంటీ? ఈమె నీ వైఫ్ కాదా?” అంది అరుణ.
షీబా నెర్వస్ ఫీల్ అయ్యింది. గౌతమ్ నవ్వాడు చిన్నగా. నసీమా మాత్రం… గౌతమ్..కాదని అంటే బావుణ్ణు అనుకుంది. ఆమె ఆశ నెరవేరింది.
“కాదు, నా ఫ్రెండ్.” చెప్పాడు గౌతమ్. షీబా నొచ్చుకుంది. నసీమా మొహం విచ్చుకుంది.
కూర్చున్నారు వాళ్ళు కూడా.
“మీట్ మై ఫ్రెండ్, అరుణ…” అనగానే నవ్వుతూ పలకరించింది అరుణ.
షీబాతో కూడా నవ్వుతూనే “తను సీమా..”చెప్పి ఆగి..”నసీమా..” అన్నాడు.
నసీమా కూడా నవ్వింది.
అరుణని ఫ్రెండ్ అని చెప్పి, నసీమాని సీమా అని సంబోధించడంలో ఏదో భావం గోచరించింది షీబాకి.
“షీబా …” అని వాళ్లకి పరిచయం చేసాడు. ముందు, వెనక ఏ ట్యాగ్ లైన్ లేదు.
గౌతమ్ మనసులో తన స్థానం కేవలం ‘షీబా’ మాత్రమేనా అనిపించిందామెకు.
“నువ్వేంటి ఇక్కడా?” అడిగాడు నసీమాని.
“రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నా. గాయత్రి పబ్లిక్ స్కూల్లో తెలుగు టీచర్ గా చేస్తున్నా.” కొంత ఆనందం, కొంత ఆశ్చర్యం కలిగిన భావం గౌతమ్ ది.
“అవునా? మరి చెప్పనే లేదు? నెంబర్ కూడా ఇచ్చా కదా…”అన్నాడు.
“అంత ఆలోచించలేదు. అసలు వచ్చి రెండు నెలలైంది అంటే నాకే నమ్మ బుద్ధి కావటంలేదు.”
“మీ ఆయన జాబ్ చేయాడానికి ఒప్పుకుని, ఇంత దూరం పంపిచారంటే, గ్రేట్… యు ఆర్ సో లక్కీ.” అన్నాడతను. ఆ మాటకి తన ముఖంలో మారిన ముఖకవళికలు అతనికి కనబడకుండా జాగ్రత్త పడింది తను. అరుణ కి విషయం తెలిసినా తను చెప్పడం మంచిది కాదని ఊరుకుంది… గౌతమ్ కి మాత్రం ఏదో మతలబ్ ఉన్నట్టు అనిపించింది. అది ఏమిటో అతనికి ఆ మరుసటి రోజే తెలియనుంది.
*****
సాయంత్రం నాలుగున్నర కి స్కూల్ బయట ఎదురు చూస్తున్నాడు గౌతమ్ నసీమా కోసం.
బెల్ మోగిన అయిదు నిమిషాలకి వచ్చింది తను బయటకి.
ఆమెని చూడగానే, “సీమా…” పిలిచాడు.
చూసింది తను.
“గౌతమ్… నువ్వేంటి ఇలా వచ్చావ్?”
“ఊరికే కలుద్దామని…”చెప్పాడు. ఇద్దరూ నడుచుకుంటూ కొంత సేపు ప్రయాణం చేసారు.
“ఏం జరిగింది సీమా?” ఉన్నట్టుండి అతనలా అడిగేసరికి కంగారు పడింది తను..₹
“దేని గురించి?”
“నేను దేని గురించి అడుగుతున్నానో నీకు తెలీదా?” అన్నాడు.
గౌతమ్ దగ్గర దాచేముంది, తనకి కూడా చెప్పుకోకపోతే ఇంకెందుకు? అనుకుంది తను. జరిగిందంతా చెప్పింది.
హృదయం ద్రవించింది గౌతమ్ కి… ‘జల్సా’ సినిమాలో ముఖేష్ ఋషి చెప్పిన డైలాగ్ ఈ నిమిషం నిజం అనిపిస్తోంది. (మనకొస్తే కష్టం..మనకి కావాల్సిన వాళ్లకొస్తే అది నరకం) గౌతమ్ పరిస్థితి అలాగే ఉంది. ఆమెకి దగ్గరగా వచ్చి నిలుచున్నాడు తడిసిన కళ్ళతో.
అప్పటివరకు నార్మల్ గా ఉన్న నసీమా కూడా అంత దగ్గరగా గౌతమ్ ని చూసి, కన్నీళ్లు పెట్టుకుని, “చచ్చిపోదాం అనుకున్నా గౌతమ్. బహుశా నిన్ను మళ్ళీ ఇలా కలవాలని రాసి పెట్టుందేమో…” అని అతని గుండె పై వాలి ఏడవసాగింది. చేజారిపోయి తెగిన చిన్ననాటి గాలిపటం కౌగిట్లోకి వాలినట్టు అనిపించింది అతనికి. ఆమెని ఓదార్చాడు.
“సీమా ఊరుకో…” అని ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని,
“నిన్ను మొదటిసారి నేను చూసినప్పుడు నువ్వు నవ్వుతూనే ఉన్నావు… చివరిసారి చూసినప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నావు.. ఇక నుంచి నేను నిన్ను ఎప్పుడు చూసినా నువ్వు నవ్వుతూనే ఉండాలి…”
అతని మాటల్లో ఆప్యాయత, ప్రేమ, వాత్సల్యం అన్నీ గోచరించాయి ఆమెకి.
“మాట ఇవ్వు…” అన్నాడతను. అలాగే అన్నట్టు తలూపింది.
ప్రకృతి పురి విప్పి నాట్యం చేసినట్టు… గాలి వీచి చెట్లన్నీ ఊగుతున్నాయి. పువ్వులు రాలుతున్నాయి. అదే ఆశీర్వాదంలా అనిపించింది గౌతమ్ కి..

****

జీవితంలో ఏదో కొత్త ఉషోదయం వచ్చినట్టుగా ఉంది గౌతమ్ కి. ప్రతి క్షణం ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. అతని ఉత్సాహం చూసి చందూకి కూడా ఆశ్చర్యం వేసింది.. ఇంత త్వరగా అతను మామూలు స్థితికి చేరుకోవడం చూసి ఆనందమూ కలిగింది
ఎంత పని ఉన్నా, ఏమైనా ప్రతి రోజు అయిదు గంటలకి తను నసీమాని కలవడానికి వెళ్ళేవాడు. ఆమెతో గడిపే ఆ కొద్దిపాటి సమయం అతనికి ఎంతో రిలీఫ్ ని ఇస్తుంది. కానీ బాధ ఉన్నంత ఎక్కువ కాలం సంతోషం ఉండదు మనిషితో.
“ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..” అని మోగుతున్న ఫోన్ తీసి చూడగానే… అతని పెదవిపై చిరునవ్వు తాండవించింది.
“చెప్పు సీమా…” అతని అనందం వెంటనే మాయమైంది, అట్నుంచి సీమా గొంతు వినగానే.
అరగంటలో అమీర్ పేట్ లోని ఇమేజ్ హాస్పిటల్ చేరుకున్నాడతను. హడావిడిగా లోపలికి వెళ్ళాడు.
క్యాజువాలిటి బయట నిలుచుని ఉంది నసీమా. గౌతమ్ ని చూడగానే ముందుకొచ్చింది.
“డాక్టర్ ఏమన్నారు?” వస్తూనే అడిగాడు.
“బైపాస్ చేయాలంటున్నారు. నాకేం చేయాలో అర్ధం కావట్లేదు గౌతమ్…” అంది ఏడుపు నిండిన స్వరంతో.
“నువ్వేం కంగారు పడకు…” అని ఆమెని సముదాయించి, తను వెళ్లి డాక్టర్ తో మాట్లాడి వచ్చాడు
ఆపరేషన్ కి ఏర్పాట్లు చేసారు డాక్టర్స్. రిసెప్షన్ లో బిల్ పే చేసాడు గౌతమ్.
“ఇంత ఋణం నేను ఎప్పటికి తీర్చగలను గౌతమ్?” అంది తను కృతజ్ఞతా భావంతో
“ఇది నేను తీర్చుకుంటున్న నీ ఋణం సీమా. నేను ఒంటరితనంలో ఉన్నప్పుడు నీ స్నేహం నాకు కలిగించిన ఊరట వెలకట్టలేనిది. అప్పుడు నువ్వు నాకు చేసింది సాయం. ఇప్పుడు నేను నీకు చేస్తుంది కూడా సాయమే. సాయానికి కొలమానాలు ఉండవు. అవసరాన్ని బట్టి ఉంటుంది అంతే.” అతని మాటలు విని ఆనందంతో అతన్ని అక్కడే కౌగిలించుకుంది తను ఆప్యాయంగా… అతని మనసు ఆకాశంలో తేలిపోయింది.
“ఎప్పుడూ ఇలాగే నాతోడై ఉంటావా గౌతమ్?” అడిగింది తను. ఆమె మాటకి బదులుగా ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు, అనుకోకుండా అక్కడికొచ్చిన షీబా ఆ దృశ్యాన్ని చూస్తోంది అన్న సంగతి తెలియక.

***********

సశేషం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *