February 23, 2024

అమ్మమ్మ – 28.

రచన: గిరిజ పీసపాటి

ఆ సాయంత్రం నుండి తుఫాను వల్ల ఒకటే ఈదరు గాలులతో కూడిన వర్షం కుండపోతగా కురుస్తోంది. గిరిజ, నాని కూడా నిద్ర పోకుండా అక్కనే చూస్తున్నారు.
అర్ధరాత్రి దాటినా ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉండడంతో ఎదురింటి ఆర్టీసీ కండక్టర్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి, భార్యతో “ఏంటి? వసంత వాళ్ళింట్లో ఇంకా లైట్లు వెలుగుతున్నాయి” అని అడిగాడు.
ఆవిడ “అవునా! వసంతకెలా ఉందో ఏమిటో!? పదండి చూద్దాం” అంటూ ఇద్దరూ వచ్చారు. వస్తూనే వసంత పరిస్థితి చూసి “వసంతను అర్జంటుగా డాక్టర్ కి చూపించాలి. లేకపోతే ప్రమాదం” అని చెప్పాడాయన.
“ఇంత రాత్రి వేళ ఏ డాక్టర్ ఉంటారు. రేపు ఉదయం తీసుకెళ్తాను తమ్ముడు” అంది నాగ. “రేపు ఉదయం వరకు ఆగే పరిస్థితి లేదు అక్కా. ఇప్పుడే తీసుకెళ్ళండి” అన్నాడాయన.
దాంతో భర్త వంక తిరిగి “ఏదైనా నర్సింగ్ హోమ్ లో చూపిద్దామండీ. ఆటో ఖర్చుకు డబ్బు ఉందా? డాక్టర్ గారి కాళ్ళు పట్టుకునైనా ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టమందాము. వెంటనే బయలుదేరుదాం” అని తొందర పెట్టింది నాగ.
ఆయన పెదవి విరవడంతో అచేతనంగా నిలబడిపోయింది. ఇంతలో ఎదురింటాయన కలగజేసుకుని “కెజిహెచ్ లో అయితే ఫ్రీగా వైద్యం చేస్తారు. కానీ, ఇప్పుడు ఓపీ ఉండదు. పరిస్థితి సీరియస్ కనుక అడ్మిట్ చేసుకోవచ్చు.”
“కానీ, నా దగ్గర కూడా డబ్బు లేదు. ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి. ఇరుగు పొరుగు వారిని ఎవరినైనా అడగండి” అని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు.
ఆ రాత్రి వేళ వర్షంలో తల నిండా కొంగు కప్పుకుని, ప్రతీ ఇంటి తలుపు కొట్టి, పరిస్థితి వివరించి, డబ్బు అడగసాగంది నాగ. ఒకరిద్దరి దగ్గర లేకపోయినా ఒకాయన అడిగిన వెంటనే లోపలికి వెళ్లి, ఐదు వందల రూపాయలు తెచ్చి నాగ చేతిలో పెట్టాడు.
అతని దగ్గర నుండి గుప్పున వచ్చింది ఆల్కహాల్ వాసన. అడగగానే సాయం చేసిన ఆయనకు చేతులెత్తి నమస్కరించి, గబగబా ఇంటికి వచ్చి “బయలుదేరండి. డబ్బు తెచ్చాను” అంది భర్తతో.
“నాకు గుండె దడగా ఉంది నాగా… కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి. నేను రాలేను. నువ్వే తీసుకెళ్ళి చూపించు” అన్నారాయన. ఇక ఆయన రారని అర్ధమై, నాని వంక చూసి “త్వరగా ఆటో పిలుచుకురా నానీ!” అంటూ ఎదురింటి వైపు పరుగున వెళ్ళి, వాళ్ళ తలుపు దబదబా బాదింది.
కండక్టర్ తలుపు తెరవగానే “తమ్ముడూ ఆయన రావడానికి భయపడుతున్నారు. నాతో సాయంగా నువ్వు వస్తావా!? బయట వాతావరణం అస్సలు బాగోలేదు. నాని ఆటో తేవడానికి వెళ్ళాడు” అంది రొప్పుతూ.
“పదండి అక్కా! నేను కూడా ఆటో కోసం వెళ్తాను. నాని చిన్న పిల్లాడని ఆటో వాళ్ళు రాకపోవచ్చు” అంటూ నాని వెళ్ళిన వైపే వెళ్ళి, పావుగంటలో ఆటోతో వచ్చారిద్దరూ.
వసంతతో సహా ఆటో ఎక్కి, ఇంట్లోకి వెళ్ళబోతున్న నానితో ” నానీ! నువ్వూ రా!” అంది నాగ. నలుగురూ కలిసి ఆ అర్ధరాత్రి వేళ వసంతను తీసుకెళ్ళి కెజిహెచ్ లో అడ్మిట్ చేసారు.
ఆ రోజు శనివారం. సోమవారం నాడు పీసపాటి మామ్మకి అరవై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఘనంగా ‘షష్టిపూర్తి’ చెయ్యాలని తలపెట్టారు పీసపాటి తాతగారు.
బంధు మిత్రులను అప్పటికే ఆహ్వానించారు. భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీళ్ళ కుటుంబం కూడా మర్నాడు బయలుదేరుదాం అనుకున్నారు. ఇంతలో ఇలా జరిగిపోయింది.
మర్నాడు ఉదయానికి వర్షం వెలుసింది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో నాని ఒక్కడే ఇంటికి రావడం చూసి “ఒక్కడివే వచ్చావేంటి తమ్మూ!? అమ్మ, అక్క ఏరి?” అనడగిన గిరిజతో “అక్కని హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. అమ్మ మంచి నీళ్ళు, పేస్ట్, బ్రష్ లు, అక్కకి బట్టలు తీసుకుని రమ్మంది” అన్నాడు.
“నేనూ నీతో వస్తాను” అంటూ అక్కకి, అమ్మకి బట్టలు, స్టీల్ కేన్ నిండా మంచినీళ్ళు తీసుకుని తమ్ముడితో బయలుదేరుతుండగా “నేనూ వస్తాను” అని తండ్రి అనడంతో ముగ్గురూ బస్సు ఛార్జీకి కూడా మ డబ్బు లేకపోవడంతో అక్కయ్యపాలెం నుండి కెజిహెచ్ కు నడుచుకుంటూ వెళ్ళారు.
వీళ్ళని చూడగానే “వచ్చారా!” అంటూ గిరిజ తెచ్చిన మంచినీళ్ళ కేన్ అందుకుని “రాత్రి నుండి దాహం అని అక్క ఒకటే గొడవ. ఇక్కడేమో మంచినీళ్ళు లేవు” అంటూ కేన్ లో నీళ్ళు దేంట్లో పోసి తాగడానికి ఇవ్వాలా అని చూస్తున్న తల్లికి, బట్టలు సర్దిన బేగ్ లోంచి స్టీల్ గ్లాస్ తీసి అందించింది గిరిజ.
అప్పటికే అక్క ఉన్న పరిస్థితికి కళ్ళ వెంబడి జలజలా కన్నీళ్ళు వస్తున్నాయి గిరిజకి. వసంతకు మంచినీళ్ళు ఇస్తూ “ఎందుకు గిరీ! ఏడవకు. అక్కకి తగ్గిపోతుంది” అంటూ ఊరడించే ప్రయత్నం చేసింది.
“అక్కని ఇలా కింద పడుకోబెట్టారేంటమ్మా? మంచం లేదా?” అనడగిన గిరిజతో “బెడ్స్ ఖాళీ లేవట” అంది నాగ వస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ బొంగురు గొంతుతో.
ఇంతలో “విజిటర్స్ వెళ్ళిపోవాలి” అంటూ హాస్పిటల్ స్టాఫ్ అరుపు విని “గిరీ! నువ్వు అక్కతో ఉండు. నేను ఇంటికెళ్ళి, వంట చేసి, అక్కకు భోజనం తీసుకొస్తాను. అప్పుడు నువ్వు వెళ్ళు. మగ వాళ్ళు ఉండకూడదట. అక్క జాగ్రత్త” అంటూ భర్తతో, కొడుకుతో ఇంటికెళ్ళింది నాగ.
అప్పుడు హాస్పిటల్ వాతావరణాన్ని పరికించి చూసిన గిరిజ గుండె ఝల్లుమంది. అది బర్న్స్ వార్డ్. అందరూ కాలిపోయిన శరీరారలతో గాయాల మంట భరించలేక పెద్దగా కేకలు పెడుతున్నారు. వార్డంతా అదోలాంటి కవురు వాసన. (మనిషి శరీరం కాలితే వచ్చే వాసన అది.)
అతి కష్టం మీద ఆ వాసనను భరిస్తూ కూర్చుంది గిరిజ. మధ్యాహ్నం పన్నెండు గంటలకు వసంతకు భోజనం తీసుకుని వచ్చి, గిరిజను ఇంటికి పంపుతూ “రాత్రికి అక్కకి చపాతీలు, కూర చేసి తమ్ముడి చేత పంపు. నాకు భోజనం అక్కర్లేదులే” అంది నాగ.
మళ్ళీ ఆ బరువంతా పిల్లలు మోసుకుంటూ నడుచుకుంటూ రాలేరని తనకు భోజనం వద్దంది నాగ. ఆ విషయం అర్ధమైన గిరిజ ఇంటికొచ్చి భోజనం చేస్తుండగానే ఇరుగు పొరుగు వచ్చి వసంత గురించి అడగడం ప్రారంభించారు.
పని మనిషి లేకపోవడంతో మొత్తం ఇంటి పనంతా ఒక్కర్తే చేసుకోవాలి కనుక నిముషం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఇంటి పనిలో పడింది. సాయంత్రం ఆరున్నరకల్లా తల్లికి భోజనం, అక్కకు చపాతీలు కారియర్ లో సర్ది, మరో కేన్ కి మంచినీళ్ళు నింపి తమ్ముడితో కలిసి మళ్ళీ కెజిహెచ్ కి వెళ్ళింది.
వెళ్తూనే “డాక్టర్ గారు ఏమన్నారమ్మా?” అనడిగింది తల్లిని. “ఇవాళ ఆదివారం కదా! డాక్టర్లు రారట. రేపు ఉదయం వచ్చి చూస్తారట.” అంది నాగ.
“రేపు ఉదయం వంట చేసి, కారియర్, మంచినీళ్ళు తీసుకురా గిరీ! నేను ఏకంగా సాయంత్రం ఇంటికి వచ్చి, స్నానం చేసి అక్కకి చపాతీలు, మనకి వంట చేసి, కారియర్ తీసుకొస్తాను. అప్పటి దాకా నువ్వు అక్క దగ్గర ఉండు. ఇక్కడ స్నానం చెయ్యడానికి కూడా నీళ్ళు లేవు” అంది నాగ.
వాళ్ళు భోజనం చేసాక ఖాళీ కారియర్, విడిచిన అక్క బట్టలు, ఖాళీ అయిన మంచినీళ్ళ కేన్ తీసుకుని మళ్ళీ ఇంటికి బయలుదేరిన గిరిజతో “నడిచి వచ్చి, వెళుతుండడంతో కాళ్ళు నొప్పులు వచ్చాయా గిరీ!” అడిగింది నాగ.

**** సశేషం ****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *