June 25, 2024

సర్వజ్ఞుడు

రచన: G.S.S. కళ్యాణి

మహేంద్ర దాదాపుగా నాలుగు గంటలనుంచీ కారు నడుపుతున్నాడు. అతడి ప్రయాణం అతడి స్నేహితుడు సుబ్రహ్మణ్యం దగ్గరకి. సాధారణంగా, కారులో దూరప్రయాణాలు చెయ్యడమూ, అందులోనూ అతడి ప్రాణ స్నేహితుడు సుబ్రహ్మణ్యం దగ్గరకి వెళ్లడమూ మహేంద్రకి ఎంతో ఇష్టమైన పని. కానీ ఈసారి ఆ ప్రయాణం అతడికి కాస్త ఇబ్బందిగా తోస్తోంది. అందుకు కారణం లేకపోలేదు! వారం రోజుల క్రితం మహేంద్ర మంచిదనుకుంటూ చేసిన ఒక పని ఇప్పుడతడికి తప్పని అనిపిస్తోంది!
“ఆ సాధువు మాటల ఆంతర్యమేమిటీ?” పదే పదే తనను తనే ప్రశ్నించుకుంటున్నాడు మహేంద్ర.
అసలేం జరిగిందంటే, సరిగ్గా ఒక వారం రోజుల క్రితం మహేంద్ర సన్నిహితులు కొందరు మహేంద్రకు కరోనా బారిన పడినవారికి వాడే మందులలో అతి కీలకమైన కోవిడ్ మందును ముందుగా కొనుక్కుని తమ ఇళ్లల్లో దాచుకుంటే, తమ ఆప్తులకు అవసరపడినప్పుడు ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా, మందు చేతిలోనే ఉంటుందని సలహా ఇచ్చారు. మహేంద్ర తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో వారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఊహించి, మహేంద్ర తన సన్నిహితులిచ్చిన సలహాను పాటించి సదరు కోవిడ్ మందును అవసరానికన్నా ఎక్కువగా కొని దాచాడు. ఆ తర్వాత ఎంతో మంది అభాగ్యులకు ఆ కోవిడ్ మందు దొరకక వారి ప్రాణాలు పోయాయని అనేక వార్తలొచ్చాయి. ఆ వార్తలు విన్నప్పుడల్లా మహేంద్ర మనసులో ఏదో అపరాధ భావన కలుగుతూనే ఉంది! ఇప్పుడు మహేంద్ర ప్రాణస్నేహితుడైన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు కరోనా వచ్చింది. వారికి ఆ కోవిడ్ మందు అవసరపడింది! కోవిడ్ మందును వాడకపోతే వాళ్ళ ప్రాణాలు దక్కేటట్టు లేవని సుబ్రహ్మణ్యం మహేంద్రకి ఫోన్లో చెప్పాడు.
ఊరంతా కరోనా భయంతో అల్లల్లాడిపోతున్న తరుణమది. ప్రభుత్వంవారు లాక్-డౌన్ పెట్టినా, జనాలు ఇంటి గడప దాటి బయటకు రావడానికి భయపడుతున్నా, తనకు తల్లిదండ్రులతో సమానమైన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను కాపాడేందుకు తన దగ్గరున్న కోవిడ్ మందును తీసుకుని, తన ప్రయాణానికి కావలసిన అనుమతిని పొంది మరీ సుబ్రహ్మణ్యం వాళ్ళ ఊరికి తెల్లవారుఝామునే బయలుదేరాడు మహేంద్ర. మహేంద్ర తల్లి సీత అతడికి దారిలో తినేందుకు పులిహోర డబ్బాలో పెట్టి ఇచ్చింది. దారిలో రోడ్డు పక్కన కారును ఆపుకుని పులిహోర తిన్న మహేంద్ర, ఆ పక్కనే ఉన్న చెట్టు మొదట్లో చెయ్యి కడుక్కున్నాడు. అయితే ఆ నీళ్లు ఆ చెట్టుకు అవతల పక్కన కూర్చుని ఉన్న ఒక సాధువు కిందికి వెళ్లి అతని బట్టలు తడిసిపోయాయి! ఊహించని ఆ ఘటనపై మహేంద్ర నొచ్చుకుని ఆ సాధువుకు క్షమాపణలు చెప్పాడు.
ఆ సాధువు చిరునవ్వు నవ్వి, “నీరు పల్లమెరుగు! నిజము దేవుడెరుగు!!”, అన్నాడు.
ఆ సాధువు నవ్వులో ఏదో సత్బోధ, పరమార్ధం గోచరించాయి మహేంద్రకి. అవునుమరి! కరోనా బారిన పడిన వారి వైద్యానికి అందుబాటులో ఉండాల్సిన కోవిడ్ మందు తన వద్దనున్న డబ్బాలో ఊరికే పడి ఉంది! తను చేసినది తప్పని మహేంద్ర మనస్సాక్షి చెబుతోంది. కానీ, తను చేసిన పని గురించి ఎవ్వరికీ చెప్పకపోతే వస్తే నష్టమేమిటని అదే మనసు తిరిగి మహేంద్రను ప్రశ్నిస్తోంది!
“ఒరేయ్ అబ్బాయ్! ఆ దేవుడు ఎక్కడో లేడురా! మనలోనే ఉన్నాడు!! అందుకే చెడ్డ పనులు చెయ్యకూడదు! అధర్మమైన వ్యవహారాలలో తల దూర్చకూడదు! మనం చేసే ప్రతి పనినీ ఎల్లవేళలా గమనించే సర్వజ్ఞుడు ఆ భగవంతుడని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు!”, అని చిన్నప్పటినుండీ తనకు తన బామ్మ చెప్పిన మాటలు మహేంద్రకి గుర్తుకొస్తున్నాయి!
కోవిడ్ మందు విషయం ఆలోచించే కొద్దీ మహేంద్రలో తను తప్పు చేశానన్న భావన ఇంకా ఇంకా పెరిగిపోతోంది. ఎంతగా అంటే అతడి కాళ్ళూ, చేతులూ చల్లబడేటంత!! వెంటనే కారు ఎక్కి కూర్చుని సుబ్రహ్మణ్యం వాళ్ళుండే ఊరి వైపుకి కారు వేగంగా నడుపుతూ వెళ్ళిపోయాడు మహేంద్ర.
‘అసలే ఆ సుబ్రహ్మణ్యం నీతీ, నిజాయితీలకు అత్యంత విలువనిచ్చే మనిషి. స్వార్ధపరులంటే వాడికి గిట్టదు! నేను నా స్వార్ధం కోసం కొంత కోవిడ్ మందును నా దగ్గర నిల్వ చేసుకున్నానని వాడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా?? మా స్నేహబంధానికి అది పెద్ద ముప్పు!! ఏదో ఒకటి చేసి వాడికి సద్ది చెప్పాలి!’, అని అనుకుంటూ మహేంద్ర సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులున్న ఆసుపత్రి ముందు కారును ఆపాడు.
ఆసుపత్రి బయటే కనపడ్డాడు సుబ్రహ్మణ్యం. అప్పటి వరకూ దిగులుతో ఉన్న సుబ్రహ్మణ్యం మొహం మహేంద్రను చూడగానే కాస్త వికసించి, అతడి పెదవులపై చిన్న చిరునవ్వొకటి విరిసింది.
“ఏరా మహేంద్రా! కోవిడ్ మందు దొరికిందా?”, ఆత్రంగా అడిగాడు సుబ్రహ్మణ్యం.
“ఓ! మందు తీసుకొచ్చాను! నువ్వేమీ కంగారు పడకురా!”, అంటూ గబగబా కోవిడ్ మందులున్న డబ్బాను కారులోంచీ బయటకు తీశాడు మహేంద్ర.
“ఊళ్ళో ఎక్కడా దొరకని కోవిడ్ మందు నీకు దొరికిందంటే అది ఆ భగవంతుడి కృప తప్ప మరోటి కాదురా! ఆ దేవుడే నీ రూపంలో వచ్చినట్లుంది!!” అంటూ మహేంద్ర చేతిలోంచీ డబ్బాను తీసుకుని మరో మాట మాట్లాడకుండా నేరుగా డాక్టరుగారి గదికి పరిగెత్తాడు సుబ్రహ్మణ్యం.
“ఒక్క క్షణం ఆగరా!” అంటూ సుబ్రహ్మణ్యం వెంట పరిగెత్తాడు మహేంద్ర.
సుబ్రహ్మణ్యం చేతిలో డబ్బాను చూసి, “కోవిడ్ మందు వచ్చేసిందన్నమాట! ఇటివ్వండి!!”, అంటూ సుబ్రహ్మణ్యం చేతిలోని డబ్బాను తీసుకుని తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు డాక్టరు.
ఎందుకంటే మహేంద్ర కొన్న కోవిడ్ మందులన్నీ ఆ డబ్బాలోనే ఉన్నాయి!
“ఇన్ని కోవిడ్ మందులు నీకెలా దొరికాయిరా?” మహేంద్రను ఆశ్చర్యంగా అడిగాడు సుబ్రహ్మణ్యం.
“ఆ.. అదీ.. నాకు తెలిసినవాళ్ల దగ్గర కోవిడ్ మందులు ఉన్నాయని తెలిసి వాళ్ళను బతిమలాడి, వాళ్ళదగ్గరున్నవన్నీ ఇక్కడ మన ఊరివాళ్లకు ఉపయోగపడతాయని పట్టుకొచ్చేశా!”, అని తడుముకుంటూ సమాధానం చెప్పాడు మహేంద్ర.
“ఒరేయ్ మహేంద్రా! నీదెంత మంచి మనసురా!! నువ్వు చేసిన పని మన ఊరిలో కరోనా బారిన పడ్డ ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది! వాళ్లంతా నీ పేరు చెప్పుకుని బతుకుతారు!!”, అంటూ తన స్నేహితుడిని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు సుబ్రహ్మణ్యం.
‘ఊరివాళ్ల సంగతి సరే! ఇప్పుడు నా దగ్గర అవసరానికి ఒక్క కోవిడ్ మందు కూడా లేకుండా పోయిందే!!”, అని మనసులో కాస్త బాధపడ్డాడు మహేంద్ర.
డాక్టరుగారు సుబ్రమణ్యం తల్లిదండ్రులకు కోవిడ్ మందునిచ్చారు. కొద్దిరోజుల్లో వాళ్ళు కోలుకుని మహేంద్రకు ఫోన్ చేసి ఆనందంతో కృతజ్ఞతలు చెప్పారు. కొన్నివారాలు గడిచాక అనుకోకుండా మహేంద్ర తల్లిదండ్రులకు కరోనా సోకింది.
‘నేను అనుకున్నంతా అయ్యింది! నన్ను కన్నవారికి కోవిడ్ మందు అవసర పడేలా ఉందనీ, తెప్పించి సిద్ధంగా ఉంచితే మంచిదనీ డాక్టరుగారు అంటున్నారు! ఇప్పుడెలా??’ అని అనుకుంటూ తెగ కంగారు పడిపోయాడు మహేంద్ర.
అంతలో, తమ దగ్గర మహేంద్ర తల్లిదండ్రులకు కావలసిన కోవిడ్ మందు ఉందని తెలుపుతూ, మహేంద్రను కంగారుపడవద్దని చెబుతూ మహేంద్రకి ఫోనులో అనేక మెసేజీలు వరుసగా వచ్చాయి. అవి చూసిన మహేంద్రకి విపరీతమైన ఆనందం, ఆశ్చర్యం కలిగాయి!
“ఏరా మహేంద్రా! ఎలా ఉన్నారు అమ్మా, నాన్నలు??” అని అడిగాడు విషయం తెలుసుకుని అప్పుడే అక్కడికొచ్చిన సుబ్రహ్మణ్యం.
“వాళ్లకి వెంటనే కోవిడ్ మందు కావాలిరా!” చెప్పాడు మహేంద్ర.
“ఉండు! నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ప్రయత్నిస్తాను!” అంటూ ఫోన్ తియ్యబోయాడు సుబ్రహ్మణ్యం.
“ఒకసారి ఇవి చూడరా!’ అంటూ తన ఫోన్లో వచ్చిన మెసేజీలను చూపించాడు మహేంద్ర.
“అబ్బో! చూశావా మరి?? అందుకేరా! ‘నీరు పల్లమెరుగు! నిజము దేవుడెరుగు!’ అని అంటారూ!!”, అన్నాడు సుబ్రహ్మణ్యం నవ్వుతూ.
ఒకప్పుడు సాధువు నోటి వెంట విన్న సామెత ఇప్పుడు తన ప్రాణస్నేహితుడి నోటి వెంట విని అవాక్కయ్యాడు మహేంద్ర.
“ఏమిటలా చూస్తున్నావ్? అర్ధం కాలేదా?? అదేరా! మంచి పనులు చేసేవారికి అవసరం కలిగినప్పుడు మంచి మనసున్న వాళ్లంతా సహాయపడటానికి మరో ఆలోచన లేకుండా ముందుకు వచ్చేస్తారు. అచ్చం నీళ్లు పల్లానికి ప్రవహించినంత సులువుగా అన్నమాట! నువ్వొకప్పుడు కష్టంలో ఉన్నవారందరికీ కోవిడ్ మందు అందేలా చేసి సహాయపడ్డావు! ఆ నిస్వార్ధ గుణాన్ని ఎవరు చూసినా చూడకపోయినా, ఆ దేవుడు చూశాడు! అందుకే నీకు కష్టం కలిగినప్పుడు తగిన సహాయాన్ని సరైన సమయంలో ఆ పరమాత్ముడు నీకు అందిస్తున్నాడు! మరి ఆలస్యమెందుకు? ఆ సహాయాన్ని అందుకో!!” అన్నాడు సుబ్రహ్మణ్యం మహేంద్ర భుజాన్ని తడుతూ.
“అవునురా! నువ్వన్నది నిజమే! అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు ఆ పరమాత్మ!!”, అని అంటూ మహేంద్ర కాస్త కుదుట పడిన మనసుతో తన ఫోనును చేతిలోకి తీసుకున్నాడు.

*****

1 thought on “సర్వజ్ఞుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *