May 19, 2024

సాఫ్ట్‌వేర్ కథలు – 1. మజ్జిగ

రచన: రవీంద్ర కంభంపాటి

దీపక్‌కి చాలా విసుగ్గా ఉంది. . గంట నుంచీ తన మేనేజర్ శరత్ క్యాబిన్ ముందు నుంచుని ఉన్నాడు. నిజానికి పదిన్నరకి మీటింగ్. . పదీ ఇరవై ఐదుకే ఆ మీటింగ్ క్యాబిన్ దగ్గరికి వచ్చి నుంచున్నాడు తను.
శరత్‌తో ఇదే గొడవ. . మీటింగ్ అని పిలుస్తాడు. . ఆ మీటింగ్‌లో డిస్కస్ చేసే విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చు. . కానీ తన క్యాబిన్‌కి పిలిపించుకోవడం, వచ్చాక వెయిట్ చేయించడం అదో సరదా అతనికి !
‘‘రోజుకొకసారైనా ఈ మీటింగ్ అనే తతంగం పెట్టనిదే నిద్దరట్టదు శరత్ కి ‘‘, మనసులోనే తిట్టుకున్నాడు దీపక్.
నిస్పృహగా అటూ ఇటూ చూస్తూంటే , లోపలికి రమ్మని సైగ చేసేడు శరత్
‘‘గుడ్ ఆఫ్టర్‌నూన్ శరత్ ‘‘అంటూ లోపలికెళ్లిన దీపక్‌ని కూచోమని సైగ చేసి, ‘‘ఏమిటి దీపక్? . నీ డెసిషన్ ఏమిటి? అని శరత్ అడిగితే,
‘‘డెసిషన్ ఏముంది శరత్? మన కంపెనీ విడిచిపోడానికే డిసైడ్ చేసుకున్నాను ‘‘ బదులిచ్చేడు దీపక్
‘‘మీ జనరేషన్‌తో ఇదే ప్రాబ్లెమ్. . ఎక్కడా స్టెబిలిటీ ఉండదు. . ఏదైనా ఉద్యోగాన్ని ఒక మారథాన్ లాగ చూడాలి. సింపుల్ గా చెప్పాలంటే. . ఉద్యోగం అనేది ఒక పంట అయితే , ఆ పంట పండేదాకా మనకి ఓపిక ఉండాలి. . కానీ మీ ఆటిట్యూడ్ ప్రతి రోజూ నాకు బంగారు గుడ్లు కావాలి అనేట్టుగా ఉంది. ‘‘ బాధగా అన్నాడు శరత్
‘‘కానీ శరత్. . . మాకు కూడా కెరీర్ లో ఎదగాలని ఉంటుంది కదా. . నాలుగేళ్ళ నుంచీ ఇదే రోల్ లో ఉన్నాను. . ప్రమోషన్ లేదు. . మిగతా కంపెనీల్లో ఉన్న మా ఫ్రెండ్సందరూ నాకన్నా చాలా ఎక్కువ సంపాయిస్తున్నారు. . వాళ్ళ జీతంతో నా జీతం పోల్చుకుంటే సిగ్గేస్తూంది. . మా ఇంట్లో అడుగుతున్నారు. . ఇంకా ఎంత కాలం ఇంతలా కష్టపడడం అంటూ ‘‘ సంజాయిషీ ఇస్తున్నట్టు చెప్పాడు దీపక్
‘‘అలా ఎలా పోల్చుకుంటావు దీపక్?. . ఇంకా నీకు చిన్న పిల్లాడిలా ఆలోచించడం పోలేదు. . మీ ఫ్రెండ్స్‌కి వస్తున్న జీతంతో పోల్చుకునే బదులు. . ఇక్కడ నువ్వు పని చేస్తున్న ప్రాజెక్ట్ గొప్పదనాన్ని పోల్చి చూడు. . మనం ఏం నేర్చుకున్నామన్నది ఇంపార్టెంట్. . . అంతేకానీ. . మనం ఎంత సంపాయించేం అన్నది ఇంపార్టెంట్ కాదు. . ఎప్పటికప్పుడు నీ పనిని నేను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నా కదా. . ఇంక ప్రమోషన్ అంటావా. . అది రావాల్సిన టైంకి వస్తుంది ‘‘
‘‘రావాల్సిన టైం అంటే ఎంత శరత్?. . అందరూ కెరీర్ లో గ్రో అవుతూంటే , నేను ఇంకా ఇలాగే ఉండిపోతున్నాను. అలాంటప్పుడు. . నేను బయట అవకాశాలు వెతుక్కోవడం తప్పు కాదు కదా ‘‘
‘‘అదే చెబుతున్నాను. . నీ ప్రాబ్లెమ్ నువ్వు ఎదగడం గురించి కాదు. . పక్కవాళ్ళు ఎదుగుతున్నారని. . ఆ పోల్చుకోవడమే వద్దంటున్నాను ‘‘
‘‘పోల్చుకోకపోతే. . ఎదిగేమని ఎలా తెలుస్తుంది శరత్?. . పక్కవాళ్ళతో పోల్చుకోవద్దంటున్నారు సరే. . పోనీ నాతో నన్నే పోల్చుకుంటాను. . నాలుగేళ్ళ క్రితం ఏ పొజిషన్ లో ఉన్నానో ఇప్పుడూ అక్కడే ఉన్నాను. . శాలరీ అంటారా. . ఏడాదికి రెండు- మూడు పర్శంట్ కన్నా పెరగదు. . అలాంటప్పుడు ఏం సాధించాలని ఈ కంపెనీతో పని చెయ్యాలి?. . నాకు ఇక్కడ వస్తున్న శాలరీ కన్నా డబుల్ శాలరీ ఇస్తామంటున్నారు. . ఇక్కడ ఇంక పని చెయ్యాలంటే ఉత్సాహం ఉండడం లేదు ‘‘
‘‘మరి నేనెలా ఇంత ఉత్సాహంతో పని చేస్తున్నాను దీపక్? నేను కూడా ఇదే కంపెనీలో పని చేస్తున్నాను. . నీతోనే పని చేస్తున్నాను. . కానీ నేను చూడు ఎంత ఉత్సాహంగా ఉంటానో? మనం చేస్తున్న పని మీద మనకి గౌరవం ఉండాలి ‘‘ సూటిగా చూస్తూ చెప్పాడు శరత్
‘‘నాక్కూడా మీలాగా నాలుగేళ్లలో రెండు ప్రమోషన్లు వస్తే. . నేను కూడా రెట్టించిన ఉత్సహంతో పని చేస్తాను. . ‘‘
‘‘సరే, నేను చెప్పాల్సింది చెప్పేను. . నీ ఇష్టం. . ఇంత కాలం నిన్ను నా టీం మెంబర్ లా కాకుండా ఒక ఫ్రెండ్ లా చూసేను. . కాబట్టి. . నీ మంచి కోసం ఒక సలహా. . . జీతం ఎక్కువ ఇస్తున్నారని. . ఏ కంపెనీ కి బడితే ఆ కంపెనీలో జాయిన్ అయిపోకు. . ‘‘
‘‘థాంక్స్ శరత్. . మంచి కంపెనీలోనే జేరుతున్నాను. . అన్నీ చెక్ చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను ‘‘ అంటూ చేరబోతున్న కంపెనీ పేరు చెప్పేడు దీపక్
‘‘ఆ కంపెనీ యా?. . మనతో పోలిస్తే చాలా చిన్న కంపెనీ కదా ‘‘
‘‘నిజమే. . కానీ. . . మంది ఎక్కువయ్యే కొద్దీ చిక్కని మజ్జిగ పల్చనవుతుందనే నానుడి ఉంది. . అలాగే. . కంపెనీ పెద్దదయినంత మాత్రాన , మనకి ప్రాముఖ్యత కూడా పల్చనవుతుంది ‘‘
‘‘సరేలే. . చిక్కని మజ్జిగ అంటూ ఏదేదో చెబుతున్నావు. . నిజానికి పల్చని మజ్జిగ మాత్రమే దాహం తీరుస్తుంది. నీకు ఎదగాలనే దాహం లేదని అర్ధమైంది. . . . నీ ఇష్టం. . నిన్ను నేను ఆపదల్చుకోలేదు. . కానీ మన కంపెనీని ఎందుకు వదిలేసానా అని భవిష్యత్‌లో నువ్వు బాధపడకూడదని కోరుకుంటున్నాను. . ఆల్ ది బెస్ట్ ‘‘ అంటూ లేచేడు శరత్
హమ్మయ్య. . ఇంతటితో వీడి గొడవ వదిలింది అనుకుని. . ‘‘థాంక్ యూ. . నాక్కూడా మీతో పని చెయ్యడం చాలా ఇష్టం. . మిమ్మల్ని నా బాస్ లాకాకుండా ఓ గురువులా ఫీలయ్యేను. . కానీ. . నాకు శాలరీ , కెరీర్ కూడా ముఖ్యం కదా. . ‘‘ అని శరత్ కాబిన్ లోంచి బయటకి వచ్చేసేడు దీపక్
***
మంచి ఉత్సాహంగా కొత్త కంపెనీలో చేరిన దీపక్ , తన జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని , తన పై మేనేజర్ కార్తీక్ అట. . అతన్ని కలవమన్నారు. .
అతని క్యాబిన్ కి వెళ్ళి, దీపక్ తనని పరిచయం చేసుకుంటే, విసుగ్గా మొహం పెట్టి ‘‘సారీ ఏమనుకోకు. . మూడ్ బాగోలేదు. . మా బాసు ఉదయాన్నే గంట సేపు నన్ను నుంచోబెట్టి మరీ సోదంతా చెప్పి బుఱ్ఱ తినేసేడు. వాడికెవడో చెప్పేడట. . . మజ్జిగ. . మంది. . పల్చన. . అంటూ ఏదో సిద్ధాంతం చెప్పేడు. . బుర్ర వేడెక్కిపోయింది. . అన్నట్టు అతనిది కూడా మీ కంపెనీయే. . శరత్ అట. . అతను తెలుసా నీకు?’‘ అంటూ చెప్పుకుపోతున్నాడు కార్తీక్.

7 thoughts on “సాఫ్ట్‌వేర్ కథలు – 1. మజ్జిగ

  1. హహహ! మళ్ళీ నక్షత్రకుడు తయారయ్యాడు! ఈ ట్విస్ట్ ఊహించలేదు సుమా! శుభారంభం రవీ

  2. మళ్ళీ మీ ట్విస్ట్ తో కథ అదరగొట్టారు రవీంద్ర గారు. రామేశ్వరంపోయినా శనేశ్వరం వదలలేదన్నట్టు ఆ శరత్ కొత్తకంపెనీలో కూడా దీపక్ కి పెంట పెట్టేడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *