April 26, 2024

అమ్మమ్మ – 29

రచన: గిరిజ పీసపాటి

సాధారణంగా ఒకసారి హాస్పిటల్ లో అడ్మిట్ అయితే డిస్చార్జ్ చేసేవరకు పేషెంట్ ని బయటకు పంపరు. కానీ, వసంత డాక్టర్ ని అడిగి, ఆయన ఒప్పుకోకపోతే అలిగి మరీ ఒకరోజు ఇంటికి వచ్చి, తలంటి పోసుకుని, తరువాత శ్రీదేవి – అనిల్ కపూర్ జంటగా నటించిన ‘మిస్టర్ ఇండియా’ సినిమా మేట్నీ షో చూసి, ఆ సాయంత్రం బీచ్ కి వెళ్ళి, తరువాత తిరిగి హాస్పిటల్ కి వెళ్ళింది.
గిరిజకు జ్వరం ఒకరోజు తగ్గి ఒకరోజు వచ్చి ఇబ్బంది పెట్టసాగింది. మనిషి బాగా నీరసించిపోసాగింది. వసంతను, గిరిజను ఇంటర్మీడియట్ చదువు కోసం AVN కాలేజీలో అడ్మిట్ చేసినా, వసంత అనారోగ్య దృష్ట్యా డాక్టర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి, తను పని చేస్తున్న సంస్థే కావడంతో గిరిజకు కూడా లీవ్ సాంక్షన్ చేయించారు పెదబాబు.
ఇంతలో వీలుచేసుకుని, కొన్ని పనులు తన అసిస్టెంట్స్ కి అప్పచెప్పి, హైదరాబాదు నుండి వచ్చింది అమ్మమ్మ. వసంత క్షేమంగా ఇంటికి తరిగి వచ్చినందుకు లలితా పరమేశ్వరికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి కృతజ్ఞతలు చెప్పుకుంది. కానీ, చేతి వేళ్ళు తీసేసినందుకు చాలా ఏడిచింది. కాకపోతే అప్పటికి ఇంకా చేతికి కట్టు ఉండడంతో చేతిని చూడలేదు.
గదిలో తలుపులన్నీ మూసేసి, ఎవరినీ లోపలికి రావద్దని ఖచ్చితంగా చెప్పి, డాక్టర్ చెప్పిన విధంగా వసంతకు డ్రెస్సింగ్ చెయ్యసాగింది నాగ. వస్తూనే అమ్మమ్మ కొంత డబ్బు సహాయం చెయ్యడంతో చాలా ఊరటగా అనిపించింది. వసంతకు షుగర్ వచ్చినప్పుడే తప్పని పరిస్థితులలో ఉద్యోగం మానేయాల్సి రావడంతో ఆర్ధిక ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యాయి.
ఇంతలో ఒకరోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో కాస్త దిగాలుగా కూర్చుని ఉన్న వసంతతో “తల్లీ! నీకేమైనా కొనిపెట్టాలని ఉంది. నీకేం కావాలో చెప్తే కొంటాను. నువ్వు ఇదివరకటి వసంతలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఇంకెప్పుడూ ఇలా దిగులుగా ఉండకు. మేము తట్టుకోలేము” అంది అమ్మమ్మ.
వెంటనే “నాకు టీవీ కావాలి అమ్మమ్మా!” అంది వసంత. ఆరోజుల్లో టీవీ ఒక లగ్జరీ వస్తువు. మధ్య తరగతి కుటుంబాలకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని వస్తువు.
“నాగేంద్రుడూ! త్వరగా వంట పూర్తి చేసి తయారవండి. అందరం వెళ్ళి టీవీ కొనుక్కొద్దాం” అంది అమ్మమ్మ.
“అమ్మా! టీవీ అంటే మాటలా?! ఇప్పుడు అంత డబ్బు పోసి టీవీ కొనడం అవసరమా! ఇంట్లో ఖర్చులు విపరీతంగా అవుతున్నాయి” అంది నాగ వారిస్తూ.
అమ్మమ్మ టీవీ కొంటాననగానే పువ్వులా విచ్చుకున్న వసంత ముఖం, తల్లి మాటలతో‌ మళ్ళీ ముడుచుకుపోయింది. అది గమనించిన అమ్మమ్మ “టీవీ ధర ఎంత ఉంటుంది వసంతమ్మా!?” అని అడిగింది.
“మూడు వేలు ఉంటుంది అమ్మమ్మా!” అంది వసంత.
“అంతే కదా! అంత జబ్బున పడి హాస్పిటల్ నుండి ఇంటికొచ్చిన పిల్ల అడిగిన కోరిక తీర్చకుండా ఎలా నాగేంద్రుడూ!? నీకు ఇవ్వాలనుకున్న డబ్బు రాగానే నీకిచ్చేసాను. నా దగ్గరున్నది నాకు నచ్చినట్లు ఖర్చు చేసుకుంటాను. త్వరగా తెములు మరీ!” అంటూ తొందర పెట్టింది అమ్మమ్మ.
ఇక తల్లి తన మాట వినదని అర్ధమైన నాగ “సరే. మరో గంటలో బయలుదేరుదాం” అంది.
“ఈరోజు ఆదివారం అమ్మా! మధ్యాహ్నం వరకే షాపులుంటాయి. మిగిలిన వంట తిరిగి వచ్చాక చెయ్యొచ్చు. ఈరోజైతే నాన్న కూడా ఉన్నారు. రేపు మళ్ళీ నాన్న స్కూల్ కి వెళిపోతారు. త్వరగా వెళ్దాం అమ్మా!” అంటూ బతిమిలాడింది వసంత.
అందరూ కలిసి టీవీ షాప్ కి వెళ్ళారు. తనకు నచ్చిన పోర్టబుల్, బ్లాక్ & వైట్ APEL కంపెనీ టీవీ సెలక్ట్ చేసుకుంది వసంత. టీవీ ధర ₹2,800/- కాగా, ఏంటెన్నా ధర ₹400/- వెరసి మొత్తం ₹3,200/-
షాప్ ఓనర్ ఏంటెన్నా బిగించి, టీవీ కనెక్షన్ ఇచ్చి రమ్మని మెకానిక్ ను పంపగా, మధ్యాహ్నం ఒంటిగంటన్నర కల్లా అతను కనెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. అప్పట్లో దూరదర్శన్ మాత్రమే వచ్చేది. క్లారిటీ చాలా బాగుంది.
వసంత, పెదబాబు, నాని టివీ ఫిట్ చేయిస్తుండగా, మిగిలి‌న వంట పూర్తి చేసింది నాగ. అందరూ కలిసి టీవీ చూస్తూ సరదాగా భోజనాలు ముగించారు. ఆరోజు నుండి ఉదయం ‘వందే మాతరం’ మొదలు రాత్రి ‘శుభ్ రాత్రి’ అని ఏంకర్ చెప్పేవరకు టీవీ మోగుతూనే ఉండేది.
గిరిజకు జ్వరం రావడం, వారం రోజులున్నాక తగ్గడం, తగ్గిన వారానికి మళ్ళీ రావడం ఇలా జరుగుతూ ఉండడంతో ముందే బక్క పలుచని మనిషి పూర్తిగా క్షీణించిపోయింది. దీనకి తోడు “లంకణం పరమౌషధం” అంటూ గిరిజ పక్కలు వెచ్చబడే సరికి భోజనం పెట్టనిచ్చేది కాదు అమ్మమ్మ.
జ్వరం ఉన్న వారం రోజులు పస్తు, తగ్గాక వారం రోజులు తినడం జరగుతూ ఉండడంతో ఇంకా క్షీణించిపోయింది. దీంతో భయపడిన నాగ తమకు తెలిసిన డాక్టర్ కి చూపించింది.
ఆయన ఇంజక్షన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం మానడానికి వీల్లేదనీ, తేలికగా అరిగే ఆహారం పెట్టమని చెప్పి, టాబ్లెట్స్ తో పాటు ఇంజక్షన్స్ కూడా 15 రోజులపాటు ప్రతిరోజూ చెయ్యాలని చెప్పడంతో, రోజూ వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొచ్చేది గిరిజ.
తన వల్లే పిల్ల నీరసించిపోయిందని బాధ పడిన అమ్మమ్మ ఒక్కోరోజు గిరిజకి సాయంగా డాక్టర్ దగ్గరకి వెళ్ళేది. ఆ కోర్స్ పూర్తయ్యాక మరి జ్వరం రాలేదు గిరిజకి.
వసంత, గిరిజ ఇద్దరూ కాలేజికి వెళ్ళసాగారు. వసంత చేతి కట్టుతోనే వెళ్ళసాగింది. స్టాఫ్ పిల్లలు కావడంతో వీళ్ళకు సీనియర్స్ నుండి ఏవిధమైన ఇబ్బంది ఎదురు కాలేదు సరికదా అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉండసాగారు.
రెండు నెలలు వీళ్ళతో సరదాగా గడిపిన అమ్మమ్మ, పిల్లలు కాలేజ్ కి వెళుతూండడంతో తృప్తిగా తిరిగి హైదరాబాదు బయలుదేరి వెళ్ళిపోయింది.
ఇంతలో B.Ed ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ పడిందనీ, ఇద్దరం రాద్దామని నాగతో కలిసి బిఏ చదివిన స్నేహితురాలు అప్లికేషన్ ఫామ్ ఇచ్చి వెళ్ళింది.
ఎలాగూ భర్త, పిల్లలు వారి ఉద్యోగం, చదువులతో బిజీగా ఉంటున్నారు. ఒక్కర్తీ రోజల్లా ఖాళీగా ఉండేకన్నా BEd పాసయి, ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే హైస్కూలులో టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని భావించి‌న నాగ భర్త, మామగార్ల అనుమతి తీసుకుని తల్లికి విషయం తెలియపరుస్తూ ఉత్తరం రాసింది.
వెంటనే అవసరమైన డబ్బు MO చేసింది అమ్మమ్మ. గైడ్ కొనుక్కొని ఎగ్జామ్ కి ప్రిపేరై, పరీక్ష కూడా చాలా బాగా రాసింది. రెండు నెలల్లో ఎక్జామ్ రిజల్ట్స్ రావడం, నాగ మంచి మార్కులతో ఉత్తీర్ణురాలు కావడం కూడా జరిగింది.
‘తను BEd పరీక్ష మంచి మార్కులతో పాసయ్యానని, సీటు కూడా వచ్చే అవకాశం ఉంద’ని అమ్మమ్మ కు ఉత్తరం రాసింది నాగ.
‘మంచి మార్కులతో పరీక్ష పాసయినందుకు చాలా సంతోషంగా ఉందనీ, సీటు వచ్చిన వెంటనే తనకు తెలియజేస్తే అవసరమైన డబ్బు పంపుతానని, తాత్సారం చెయ్యొద్దనీ’ రిప్లయ్ ఇచ్చింది అమ్మమ్మ.
నాగకు విజయనగరం లోనూ, నాగ స్నేహితురాలికి తిరుపతి లోనూ సీట్ వచ్చింది. “నీకే నయం వదినా! పక్క ఊరిలోనే సీట్ వచ్చింది. ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చెయ్యొచ్చు. ఇంటిని మిస్ అవక్కర్లేదు. నాకు ఏకంగా తిరుపతి లో ఇచ్చారు. అందరినీ వదిలిపెట్టి ఆరు నెలలు ఉండాలి. పైగా ఆ హాస్టల్ భోజనం ఎలా ఉంటుందో ఏమిటో” అని ఒక పక్క సణుగుతూనే నాగకు అభినందనలు చెప్పి వెళ్ళిపోయిందా స్నేహితురాలు.
ట్రైనింగ్ కి వెళ్ళాల్సిన రోజు దగ్గర పడుతోంది కానీ, భర్త దగ్గర నుండి ఇంకా వెళ్ళడానికి అనుమతి లభించకపోవడంతో లోలోపలే మధనపడసాగింది నాగ. ఆఖరికి ఒకరోజు ఉండబట్టలేక “ఏమండీ! ట్రైనింగ్ కి వెళ్ళాల్సిన రోజు దగ్గర పడుతోంది. వెళ్ళనా!” అంటూ అడిగింది.

***** సశేషం *****

1 thought on “అమ్మమ్మ – 29

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *