May 19, 2024

రాజస్థాన్ లోని రణతంబోర్ గణేష్:

రచన: రమా శాండిల్య

2018 లో నా స్నేహితురాలు, జైపూర్ లో ఉన్న వారి వియ్యాలవారి ఇంటికి వెళుతూ నన్ను ఆహ్వానించింది.
సరే, ప్రయాణాలంటే ఇష్టమున్న నేను ‘అక్కడ ఏదైనా గుడి గోపురం చూపిస్తే వస్తానని’ జోక్ చేసాను. దానికి ఆమె, “మనం వెళ్లేదే గుడి కోసం” అని చెప్పింది.
వారి ఇళ్లల్లో పెళ్లిళ్లు, పేరంటాలు అయినా, పిల్లలు పుట్టినా, ఏదైనా ముఖ్యమైన పనులు జరిగినా రణతంబోర్ గణేశ గుడికి తప్పక వెళతారట. నా స్నేహితురాలి రెండవ కొడుకు వివాహం అయిన సందర్భంలో మ్రొక్కు తీర్చుకోవడానికి వెళదామని నన్ను తనతో తీసుకుని వెళ్ళింది.
శ్రావణమాసం మార్వాడీవారికి చాలా పవిత్రమైన నెల. శివుడికి పూజలు, భజనలు, అభిషేకాలు, ఆరాధనలు చేస్తూ ఉంటారు.
నా స్నేహితురాలి వియ్యాలవారికి వంశపారంపర్యంగా ఆరాధన జరుపుకుంటున్న ‘ఝార్ఖండ్ మహాదేవ్’ అనే గుడి ఉంది. జైపూర్ లో ఒక చోట ఒక పెద్ద ఉన్న పేద్ద శివాలయమది. అక్కడ మొత్తం వారి వంశీకులే ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అక్కడికి తనూ, నేను కలిసి వెళ్ళాము.

**

జైపూర్ జేరిన తరువాత ఆ గుడి చూసి నాకు చాలా ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. మొత్తం గుడి అంతా చెన్నై నుండి స్థపతులను పిలిపించి, మన దక్షిణ భారతదేశ సంప్రదాయంలో గుడి కట్టారు. అది కూడా 200 సంవత్సరాల క్రితం. గుడి, గోపురము, గోపురమంతా చెక్కిన శిల్పాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి.
జైపూర్ రైల్వే స్టేషన్ బయటకొచ్చి ‘ఝార్ఖండ్ మహాదేవ్’ అని అడిగితే, ఆ గుడి వద్దకు ఏ ఆటో అబ్బాయి అయినా తీసుకెళతాడు.

**

రెండు రోజుల తరువాత, అక్కడికి దగ్గరలోని ‘రణతంబోర్’ లో ఉన్న గణేశ గుడి చూడటానికి నేను, నా స్నేహితురాలు, వారి వియ్యపురాలు ప్రయాణమయ్యాము.
రాజస్థాన్ లోని జైపూర్ నుండి ఐదు గంటలు ప్రయాణం చేస్తే ఈ రణతంబోర్ వస్తుంది.
దారి పొడుగునా చిన్న చిన్న పల్లెలతో తలమీద కుండలతో నీరు తీసికెళ్లే రాజస్థానీ కట్టు బొట్టు వ్యవహారంతో ఉండే అమ్మాయిలు, పొలంలో పని చేసే అబ్బాయిలు బాగా కనిపిస్తారు.
జైపూర్ నుండి కార్లో ఉదయం అయిదు గంటలకు బయలుదేరి పది గంటలకు ‘సావోయి మాధపూర్’ అనే చోటుకి చేరాము. అక్కడనుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో రణతంబోర్ ఉంది.
అక్కడి నుంచి అదంతా అటవీ ప్రాంతం. చిక్కటి చెట్లతో, ఎత్తైన కొండలతో అందానికి పెట్టింది పేరుగా అద్భుతంగా ఉన్న చోటిది.
అన్ని వయసుల వారు వెళ్ళడానికి అనువయిన చోటు ఈ రణతంబోర్. ఇక్కడ నేషనల్ పార్క్, ట్రెకింగ్ ప్లేస్ ఉన్నాయి. ఏనుగులపైన ఒంటెల మీద ఎక్కి తిరగ వచ్చు. లోకల్ జీపులో మనలను అడవి లోపలకి తీసుకెళతారు. అక్కడ వన్యమృగాలు కనిపిస్తాయి. అన్ని రకాల వన్య మృగాలు స్వేచ్ఛగా తిరుగుతుంటే, మనం జీప్ లో తిరుగుతూ చూడటం ఒక థ్రిల్లింగ్ అనుభవం.
మాకు మాత్రం విపరీతంగా కోతులు, జింకలు, నెమళ్లు, రెండు పాములు కూడా కనిపించాయి.
కారులో అంతదూరం ప్రయాణం చేసి రణతంబోర్ ఫోర్ట్ చేరుకున్నాము. ఏడు కిలోమీటర్లు ఫోర్ట్ పైన కొండమీదకు, పై వరకూ ఎక్కవలసిందే ఎవరైనా సరే!
ఎక్కేటప్పుడు కూడా అలవకుండా ఉండాలంటే లోకల్ కొండజాతి వారిని గైడ్ గా తీసుకుని వెళితే, ఆ ఫోర్ట్ యొక్క చరిత్ర చెబుతూ తీసుకు వెళతారు.
‘రాణీ పద్మిని మంటల్లో దూకిన చారిత్రాత్మకమైన చోటు ఇది.’
మొత్తం ఫోర్ట్ ఎక్కి గణేశుడి గుడికి రావటానికి ఒక జ్ఞాత సేపు పట్టింది. ఆ కొండ మీద నుంచి అక్కడి దృశ్యాలను చూడవలసిందేగాని వర్ణించ వీలుకాదు. అంత బావున్నాయి. చుట్టూ చిన్నచిన్న నీటి చెలమలు, వాటిమీద ఎగిరే కొంగలు, చిరుజల్లులు పడుతూ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది.
అదంతా చూసుకుంటూ నెమ్మదిగా గుడి దగ్గరకు చేరాము.
అది చాలా చిన్న గుడి. కానీ, రాజస్థాన్ లోని మార్వాడీలకు చాలా ముఖ్యమైన పవిత్రమైన, తప్పనిసరిగా దర్శించవలసిన క్షేత్రమిది. పెళ్లి, విద్య, ఉద్యోగం, బిజినెస్, పిల్లలకోసం, పనులవ్వకపోతే, తలచిన పనులయిపోతే దేనికైనా మొక్కుకోవటానికి, మొక్కు తీర్చటానికి కూడా దర్శిస్తారు.
ఇక్కడి గణేశుడు మూడు కన్నులు కలవాడు. అందుకే ఈయన పేరు త్రినేత్ర గణేష్ జీ అంటారు.
గణేశుడు తన పూర్తి కుటుంబంతో కొలువై ఉంటాడు. సిద్ధి, బుద్ధి, ఇరువురు భార్యలతో, లాభం, క్షేమం ఆయన పిల్లలతో, సకుటుంబంగా దర్శనమిస్తాడు.
అక్కడ జరిగే సేవ… హారతి మాత్రమే! టిక్కెట్ తీసుకుంటే, మనచేతనే స్వామికి హారతిప్పిస్తారు. అద్భుతమయిన అనుభూతి మనకు కలుగుతుంది. తప్పక చూడవలసిన మందిరమిది. కొంచెం శ్రమతో కూడిన యాత్ర ఇది.
టీ, సమోసా తప్ప తినడానికి కొండమీద ఏమి దొరకవు.
దర్శనానంతరం తిరిగి ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళితేగాని మాకు భోజనం దొరకలేదు.
దారిలో, ఫోర్ట్ లో అనేక చెరువులు చూసాము. ఒక గుహలో ఒక శివలింగాన్ని దర్శించుకున్నాము. అన్నీ చూసి తిరుగు ప్రయాణం అయ్యాము.
లోకల్ రాజస్థానీ దాభా హోటల్ లో దొరికే దాబెల్లి, మూంగ్ దాల్ కచోరీ, స్వీట్స్ పేర్లు గుర్తులేవు కానీ, వాటిని తినని నేను విపరీతంగా తిన్నది అక్కడే, అప్పుడే. లస్సీ ఒక పెద్ద గ్లాస్ అవలీలగా తాగేస్తాము. పాలు, పెరుగు, పాల పదార్థలతో హాయిగా బతికేస్తాము అక్కడ.
నేను పూర్తి రాజస్థానీ ఫ్యామిలీతో ఈ ప్రయాణం చేసాను. నా స్నేహితురాలు రాజస్థానీ ఆవిడ కనుక తనతో వాళ్ళ వియ్యాల వారి ఇంటికి వచ్చాను. అందుకే నా రాజస్థాన్ యాత్ర మర్చిపోలేనిది.
అక్కడి లోకల్ డిస్ట్రిక్ట్స్ చాలా చూసాను. అక్కడ కోటా చీరలు చాలా ప్రసిద్ధి. బొమ్మలు కూడా చాలా బావుంటాయి.
ఇంకా ఆ ట్రిప్ లో జైపూర్ లోని చాలా ప్రదేశాలు చూసాము. మోటా గణేష్, శ్రీకృష్ణ మందిరం, ఫోర్ట్ ఇలా చాలా ప్రదేశాలు చూసాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *