June 24, 2024

అమ్మమ్మ – 31

రచన: గిరిజ పీసపాటి

 

 

బైపాస్ సర్జరీ కోసం ఒక పార్టనర్ డబ్బు వెనక్కి తీసుకున్నా, మిగిలిన పార్టనర్స్ పెట్టుబడి తో  షాప్ బాగానే నడుస్తోంది.

ఒక రోజు వీళ్ళచేత షాప్ కి పెట్టుబడి పెట్టించిన బంధువు మళ్ళీ వీరి ఇంటికొచ్చి నాగతో “చెల్లీ! నేను బయట పనులు, రిప్రజెంటెటివ్స్ ని మోటివేట్ చెయ్యడం, వాళ్ళ MD లు వస్తే వాళ్ళతో కలిసి డాక్టర్స్ ని విజిట్ చెయ్యడం వంటి బిజినెస్ ప్రమోషన్ కి సంబంధించిన పనులు చూసుకోవాలి.”

“చదువుకున్నదానివి. ఎలాగూ ఇప్పుడు ఉద్యోగం ఏమీ చెయ్యడం లేదు. బావ, పిల్లలు వెళ్లిపోయాక ఇంట్లో ఒక్కర్తివీ ఉండే బదులు మన షాప్ కొచ్చి కూర్చోవచ్చు కదా! నువ్వు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు.”

“ఆర్డర్స్ ప్రకారం బాయ్స్ చేత స్టాక్ పంపడం, వాళ్ళు తెచ్చిన కలెక్షన్స్ రిసీట్ బుక్ ప్రకారం చెక్ చేసి తీసుకోవడం, డే బుక్ రాయడం అంతే. పైగా మేనేజింగ్ పార్ట్‌నర్ గా జీతం కూడా వస్తుంది. పెద్ద పాప మందుల ఖర్చుకైనా పనికొస్తుంది. ఏమంటావ్?” అనడిగాడు.

“ఏమో అన్నయ్యా! మీ బావ వెళ్ళమంటే వెళ్తాను” అంది నాగ. “ఏరా బావా! అంతా వింటూ కూడా ఏం మాట్లాడవు?” అని గట్టిగా అడగడంతో ‘సరే’నని తలూపాడు పెదబాబు. మర్నాటి నుండి నాగ షాప్ కి వెళ్ళసాగింది.

ఇంతలో కాలేజ్ రీ-ఓపెన్ అవడంతో వసంత, గిరిజ ఎప్పటిలాగే ఉదయం కాఫీ తాగి, మధ్యాహ్నం మూడింటికి ఇంటికి వచ్చి భోజనం చేస్తుండడంతో కాస్త తేరుకున్నారు. వసంత కూడా రెండు పూటలా ఇన్సులిన్ ఇంజక్షన్లు చేసుకుంటూ ఉండడంతో షుగర్ కంట్రోల్ లో ఉండడంతో చేతి గాయం పూర్తిగా మానిపోయింది.

తనకు వేళ్ళు లేవన్న బాధను ఇంట్లో ఎవరూ గుర్తించనట్లే ఉండడంతో, మానసికంగా కూడా తేరుకుని, మునుపటిలా ఉత్సాహంగా ఉండసాగింది. మరో నాలుగు నెలలలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయనగా వాళ్ళ జీవితాన్నే పూర్తిగా మార్చేసిన సంఘటన ఒకటి జరిగింది.

ఆరోజు ఇంకా ఎవరూ నిద్ర లేవకముందే కరెంటు పోవడంతో ఉక్కపోతకి తట్టుకోలేక పెదబాబు తప్ప మిగిలిన వారంతా రోజూ కన్నా ముందే నిద్ర లేచారు.

కాలేజ్ కి టైమవుతోందని వసంత అందరి కోసం కాఫీ డికాక్షన్ తీసి, కాఫీ కలిపింది. తండ్రి తాగనిదే తల్లి కూడా కాఫీ తాగదు కనుక చెల్లికి, తమ్ముడికి చెరికో గ్లాసు ఇచ్చి, తను కూడా తాగింది.

సుమారు ఏడు గంటల సమయంలో పెదబాబు కూడా నిద్ర లేవడంతో తనకి, భర్తకి కాఫీ తెచ్చింది నాగ. ఆయన కాఫీ తాగుతూ “కరెంటు పోయి ఎంతసేపయింది?” అని అడిగారు. “చాలా సేపయింది. ఎప్పుడిస్తాడో ఏంటో!” అంది నాగ.

ఆడపిల్లలిద్దరూ ఈ సంభాషణ వింటూనే కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇంతలో పెదబాబు నాగతో “నాదో జత పేంట్-షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టు” అన్నాడు నాగతో.

“అలాగే కరెంటు రాగానే చేస్తాను.” అంది.

“నువ్వు షాప్ కి వెళ్ళే లోపు కరెంటు రాకపోతే?” తిరిగి ఎదురు ప్రశ్న వేసాడు పెదబాబు.

“నానికి బట్టలిచ్చి పంపి బయట ఇస్త్రీ బండి దగ్గర చేయించుకుని రమ్మంటాను. సరేనా!” అంది నాగ నవ్వుతూ.

“బయట బండివాడు చెయ్యడానికి వీల్లేదు. నువ్వే చెయ్యాలి. అవి ఇస్త్రీ చేసాకే నువ్వు షాప్ కి వెళ్ళాలి. అంతే.” అన్నాడు పెద బాబు కోపంగా.

“నేను షాప్ కి, మీరు స్కూల్ కి వెళ్ళే టైమ్ ఒకటే కదండీ. ఆ టైమ్ కి కరెంటు వస్తే సరే లేకపోతే బయట చేయించకుండా ఎలా?!” అంది నాగ

అంతే ఉగ్ర స్వరూపం దాల్చాడు పెదబాబు. “నా మాటకే ఎదురు చెప్తావా? ఎంత ధైర్యం నీకు? సంపాదిస్తున్నాననే కదా ఆ అహంకారం?” అంటూ నాగ జుత్తుని పట్టుకుని, తల గోడకేసి కట్టి, ఇంకా కోపం చల్లారక ఈడ్చి చెంప మీద బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు.

తల్లిదండ్రుల మధ్య చిన్న చిన్న మాటలు ఎప్పుడూ ఉండేవే కదా  అని కాలేజికి వెళ్ళడానికి చెప్పులేసుకుంటున్న ఆడపిల్లలిద్దరూ ఈ హఠాత్పరిణామానికి నివ్వెరబోయి పరుగున వాళ్ళ దగ్గరకు వెళ్ళారు.

తల్లిని మరో దెబ్బ కొట్టడానికి చెయ్యెత్తిన తండ్రి చెయ్యి పట్టుకుని ఆపిన వసంత “అమ్మ ఏం తప్పుగా మాట్లాడిందని అమ్మని కొడుతున్నారు నాన్నా?” అనడిగింది కోపంగా.

వసంత చేయిని విదిలించి కొట్టి, మళ్ళీ నాగను కొట్టడానికి మీదకు వెళుతున్న తండ్రిని ఈసారి వసంతతో పాటు గిరిజ, నాని కూడా ఆపి, ఇక తండ్రి కదలడానికి వీల్లేకుండా గోడకి ఆన్చి నించోబెట్టేసి, చుట్టూ తమ చేతులతో దడి కట్టేసి “అమ్మ ఒంటి మీద మరొక్క దెబ్బ పడ్డా మర్యాద దక్కదు నాన్నా!” అన్నారు

వీళ్ళు గమనించలేదు గానీ వీళ్ళ పోర్షన్ కి ఎదురుగా ఉండే పోర్షన్ లో ఉంటున్న దంపతులు ఇద్దరూ నిలబడి సంశయంగా వీళ్ళ ఇంటి వంకే చూస్తూ నిలబడి ఉన్నారు. తాము కల్పించుకోవాలా వద్దా అన్న సందిగ్ధావస్థలో ఉన్నట్లు వాళ్ళ ముఖ కవళికల ద్వారా తెలిస్తూనే ఉంది.

వాళ్ళిద్దరూ ఉదయాన్నే అక్కడ కూర్చుని పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుతారు. అది వారి దినచర్యలో భాగం. వీరి గుమ్మానికి వారి గుమ్మానికి మధ్య మూడడుగుల ఖాళీ గచ్చు జాగా ఉంటుంది. చాలా మంచి వ్యక్తులు. ముఖ్యంగా అన్నపూర్ణ అంటీ ఎప్పుడూ చిరునవ్వుతో, సహనంతో ఉంటూ, అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఉంటారు.

ముందుగా వాళ్ళని చూసిన నాగ అవమాన భారంతో “వసంతా! అన్నపూర్ణ ఆంటీ, అంకుల్ మన వైపే చూస్తున్నారు. ఇక మీరు కాలేజికి వెళ్ళండి” అంది.

తండ్రి చుట్టూ చేతులను దడిగా కట్టేసి నిలబడ్డ పిల్లలు‌ ముగ్గురూ తల్లి మాటలకు తెప్పరిల్లి, మెల్లిగా వెనక్కి వచ్చి గోడకి ఆనుకుని కూర్చుని “ఈ రోజు ఇక వెళ్ళమమ్మా!  వెళ్ళినా లెసన్స్ తలకెక్కవు. పైగా నాన్న కోపం ఇంకా చల్లారలేదు. మళ్ళీ నీ మీద చెయ్యి చేసుకోవచ్చు. మేమింట్లోనే ఉంటాము” అంది.

నాగ ఇక ఏమీ మాట్లాడలేనట్లు వంట గదిలోకి వెళ్ళి మౌనంగా కత్తిపీట, కూరగాయలు ముందేసుకుని, కూరలు తరగసాగింది. వసంత కూడా తల్లి వెనకాలే వెళ్ళి బియ్యం కడిగి, కాస్త కందిపప్పు, బియ్యం కుక్కర్ పెట్టి మళ్ళీ ముందు గదిలోకి వచ్చింది.

ఇంకా అలాగే బిక్కచచ్చిపోయి కూర్చున్న చెల్లిని, తమ్ముడిని చూసి వాళ్ళను నార్మల్ గా చెయ్యాలని చెల్లెలితో “వెళ్ళి విడిచిన బట్టలు సర్ఫ్ నీటిలో నానేసి ఉతుకు” అంటూ తమ్ముడి వైపు చూసి “నువ్వు లేచి స్కూల్ కి రెడీ అవు” అంది.

“ఈ రోజు నేను కూడా స్కూల్ కి వెళ్ళనక్కా!” అన్నాడు నాని భయంగా తండ్రి వంక చూస్తూ. “సరే మానేస్తే మానెయ్. కనీసం వెళ్ళి నూతిలో నీళ్ళు తోడి కుండీలు రెండూ నింపు” అనేసి తిరిగి వంట గదిలోకి వెళ్లిపోయింది.

ఇంట్లో ఉంటే పని చెయ్యక తప్పదని అర్ధం అయిన నాని మెల్లిగా చెప్పులేసుకుని బయటకు జారుకున్నాడు. వంట పని పూర్తయాక తండ్రికి కేరేజి సర్ది, స్కూల్ కి బయలుదేరుతున్న తండ్రి చేతికి అందించబోయింది వసంత.

ఆయన కేరేజి వంక కన్నెత్తి కూడా చూడకుండా వెళిపోయారు. ఆయన వెళ్ళాక “నువ్వు కూడా త్వరగా తెమిలి షాప్ కి బయలుదేరమ్మా! ఇప్పటికే ఆలస్యం అయింది ” అంటూ తల్లిని హడావుడి చేసింది.

 

‌               ***** సశేషం *****

1 thought on “అమ్మమ్మ – 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *