March 4, 2024

ధృతి – 8

రచన: మణికుమారి గోవిందరాజుల

“నాన్నా! దినేష్… కరణం గారింట్లో ఎంగేజ్మెంట్ రేపే కదా. వెళ్ళకపోతే ఆయనకు బాగా కోపం వస్తుంది. ఇక మేము బయలుదేరుతాము. అన్నట్లు శనాదివారాలే కదా? మీరంతా కూడా రావచ్చు కదా?” మర్నాడు సాయంత్రం కాఫీలయ్యాక పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా చెప్పింది బామ్మ.
“నాన్నా! నాన్నా… వెళ్దాం నాన్నా. ప్లీజ్ నాన్నా” ఆర్తీ కార్తీ తండ్రి వెంట పడ్డారు.
“అమ్మా! ఒక పని చెయ్యి. నాకు రావడం కుదరదు కానీ పిల్లల్ని తీసుకెళ్ళు. రేపు రాత్రికి మళ్ళీ పంపించు. ధృతికి పరీక్షలు దగ్గర పడ్డాయి. వస్తుందో రాదో”
“పరీక్షలుంటే? ఎంజాయ్ చేయడం మానేస్తారా? బామ్మా… నేనొస్తున్నాను నీతో. ఇది పక్కా… రేపు వచ్చేస్తాము” చెప్పింది ధృతి
“బామ్మా! ఫంక్షన్ అవగానే మళ్లీ నువు మాతో రావొచ్చు కదా? నాల్రోజులే ఉన్నావు. ఒకే సినిమా చూసాము. ఎప్పుడూ చాలా సినిమాలు చూస్తాము” గారంగా అడిగారు పిల్లలు.
“మీ పరీక్షలయ్యాక వస్తాలే. దినేష్… రాత్రి ఆంటీ మళ్లీ ఫోన్ చేసిందిరా… ఏమనుకుంటున్నారు అంటూ” పిల్లలకు హామీ ఇస్తూనే దినేష్ ను అడిగింది బామ్మ.
“అమ్మా! ఆవిడన్నట్లు ఇది చాలా మంచి సంబంధం. నో డౌట్. పూర్ణ కు బాగా నచ్చాడు ఆ అబ్బాయి. ధృతిని ఇంకా అడగలేదు కదా”
వెనకటి రోజుల్లో అయితే ఏదన్నా సంబంధం గురించి మాట్లాడుతుంటే, ఆడపిల్లకు, తన గురించేనేమో అనిపిస్తే సిగ్గుపడి లోపలికి వెళ్లేది. కాని ఈ రోజుల్లో పిల్లలు అలా కాదు. ధృతికి అర్థమయింది తన గురించే ఏదో మాట్లాడుకుంటున్నారు అని. అందుకే “ఏంటి నాన్నా? నన్ను ఇంకా అడగనిది?” అని అడిగింది తండ్రిని.
“నిన్న ఆ అమ్మమ్మతో కలిసి వచ్చాడే అతనికి నిన్ను ఇచ్చి పెళ్ళి చేయమని అడుగుతున్నది ఆమె. నిన్నుమాల్ లో చూసింది కదా? నువు బాగా నచ్చావుట. ఆ అబ్బాయి పెళ్ళి కొరకే దేశం చూడాలని వంక బెట్టుకుని తీసుకొచ్చిందట. మన సంస్కృతీ, సంప్రదాయాలు తెలిసి ఉన్న వాళ్ళైతే తర్వాతి తరం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆవిడ ఆశ పడుతున్నది” చెప్పాడు దినేష్.
“నాకు ఇష్టం లేదు నాన్నా” సింపుల్ గా చెప్పేసింది ధృతి.
“ఇష్టం లేదంటే? ఈ పాటికి పెళ్ళి చేస్తే ఇద్దరు పిల్లలుండేవారు. మంచి సంబంధం మనకు ఇష్టం ఉన్నప్పుడు రాదు. ఆలోచించు” పిల్లాడు నచ్చేసరికి కన్నతల్లిగా అంతకు ముందు ఉన్న ఆలోచనలన్నీ, ఆడపిల్ల తల్లిగా మరచిపోయింది పూర్ణ.
“పూర్ణా… మన తల్లికి ఇష్టమైనప్పుడే పెళ్ళి చేద్దాము. వయసేమీ ముంచుకు పోలేదు కదా? అమ్మా! ధృతీ… కాకపోతే వాళ్ళు నీ చదువు అయ్యేదాకా ఆగుతాము అంటున్నారు. మేము ఊహించను కూడా లేదు, నీకు ఇంత మంచి సంబంధం వస్తుందని. జస్ట్ ఒకసారి మన నిర్ణయం కరెక్టో కాదో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిది కదా అని అమ్మ అనుకుంటున్నది అంతే” అనునయంగా చెప్పాడు దినేష్.
“అవును అమ్మలూ! ఒకసారి ఆలోచించు. నా వయసయిపోతున్నది. నీ పెళ్ళి చూసి పోవాలని మనసు కొట్టుకు లాడుతున్నది” అడిగింది బామ్మ.
“అయ్యో! బామ్మా… ఇంకా నయం నా పెళ్ళి చూడగానే నువు పోతావంటే నేనసలు పెళ్ళే చేసుకోను. ఆ తర్వాత అందరూ ‘సుబ్బి పెళ్ళి వెంకి చావుకొచ్చింది’ అని నన్ను చూసినప్పుడల్లా అనుకోవటానికా” టీజ్ చేసింది బామ్మను. అందరూ నవ్వారు.
“నాన్నా! కిశోర్ చాలా మంచివాడు… ఫ్రెండ్ గా నాకు చాలా నచ్చాడు. నో డౌట్… కాని ఎందుకో నాకు ఇష్టం లేదు అంతే. ఇక దీని గురించి, ఇది ఫ్యూచర్ లో కూడా సరైన నిర్ణయమే అనుకుంటాను” తన నిర్ణయం చాలా కచ్చితంగా చెప్పింది ధృతి.
“మా బంగారం ఏ నిర్ణయం తీసుకున్నా అది వంద శాతం కరెక్ట్ అవుతుంది” అప్పుడే లోపలికి వస్తున్న శివ ధృతి నిర్ణయాన్ని ఒప్పుకుంటూ వచ్చి అన్నాడు.
“నువ్వొకడివి…అది ఏది చేసినా నీకు అపురూపమే… ఏమైనా దాని సైడే ఉంటావు, అది తప్పైనా … ఒప్పైనా” విసుక్కుంది బామ్మ.
“లేదమ్మా నేను నిజమే చెప్తున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసి వస్తున్నాను” చెప్పాడు శివ. “రెండు చెంబులు నీళ్ళు పోసుకుని వచ్చి అంతా చెప్తాను” చెప్పి లోపలికి వెళ్ళాడు శివ.
ధృతి తప్ప మిగతా వాళ్ళంతా మొహ మొహాలు చూసుకున్నారు. ఏది జరిగినా తనకేమీ సంబంధం లేనట్లు టీవీ రిమోట్ తిప్పసాగింది ధృతి.
పదినిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చాడు శివ. తిన్నగా వెళ్ళి బామ్మ కాళ్ళదగ్గర మఠం వేసుకుని కూర్చున్నాడు.
“చెప్పరా… ఏమి ఎంక్వైరీ చేసావు? నేనసలు నీకు కనుక్కోమనే చెప్పలేదు కదరా?” అడిగాడు దినేష్.
“భలే వోరండీ మీరు. మనమ్మాయిని అడగడానికి వచ్చారు. ఏమీ కనుక్కోకుండా ఎలా ఇస్తాము మన బంగారు తల్లిని? అందుకే నిన్న ఆవిడ వెళ్ళిన దగ్గర నుండి అదే పనిలో ఉన్నాను”
“సరే చెప్పు… ఏమి కనుక్కున్నావో?” కుతూహలంగా అడిగాడు దినేష్. మిగతా అందరిలో కూడా ఉత్సుకత పెరిగింది. ధృతి కూడా టీవీ రిమోట్ పక్కన పెట్టి శివ వేపు చూసింది చెప్పమన్నట్లుగా.
“అన్నా! నిన్న నువు మీ వాడికి ఇష్టమేనా అని అడిగినప్పుడు ఆవిడ చాలా తడబడింది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే వాళ్ళను అనుసరించి వెళ్ళాను. ఇల్లు చాలా బాగుంది. నిజానికి ఆస్తుల గురించి ఆవిడ చెప్పినవన్నీ నిజాలే. మంచావిడ అన్నది అమ్మ ఫ్రెండ్ గా తెలుసిన సంగతే కదా. కాని ఆ మంచితనాన్ని ఆవిడ మనవడికి ఎలాగో ఒకలా పెళ్ళి చేయాలి అన్న ఆరాటం కప్పేసింది”
“అదేంట్రా?” ఆరాటంగా అడిగింది బామ్మ.
“ఎహే! నీ సోది ఆపి సంగతి చెప్పు” విసుక్కుంది పూర్ణ.
“అదే అమ్మా! నిన్న సాయంత్రం వాళ్ళు వెళ్ళాక ఆవిడ చెప్పిన అడ్రెస్ ప్రకారం ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను. అది ఇక్కడ కొత్తగా కొన్నారట. చాలా పెద్ద పాలేస్ లాగా ఉన్నది. బాగా ఆస్తులున్నవాళ్ళే. నాకు ఆ వైభవం చూడగానే చాలా సంతోషం వేసింది. ఇంతటి కోటీశ్వరుల ఇంటికి మన తల్లి వెళ్తున్నది కదా అని…”
“ఇంకేంట్రా నీ గోల? పెళ్ళొద్దన్నదంటే మంచిదంటావ్. మళ్ళీ వాళ్ళ ఐశ్వర్యం చూసి ఆనందం వేసిందంటావ్ చావగొడుతున్నావ్ కదరా” విసుక్కున్నది బామ్మ
“సుత్తి ఆపి సంగతి చెప్తావా? నాలుగు తన్నమంటావా?” కసురుకున్నాడు దినేష్.
“అదే! అదే… వస్తున్నాను అక్కడికే. వాళ్ళింటి దగ్గరకు వెళ్ళానా… సాధారణంగా పనివాళ్ళకు అన్ని సంగతులు తెలుస్తాయి కదా? అందుకే వాళ్ళ పనిమనిషి కోసం మాటేసి పట్టుకున్నాను. ఎలాంటి వాళ్ళు, ఏమిటి? అని నెమ్మదిగా అడిగితే చెప్పలేదు. పోలీస్ డ్రెస్ వేసుకెళ్ళాలేండి. అందుకని విషయం చెప్తావా… బొక్కలో తోయమంటావా అని బెదిరించాను. నా డ్రెస్ చూసి భయపడింది. రోజూ ఇంట్లో జరిగే గొడవలన్నీ చెప్పుకొచ్చింది. మనింటికొచ్చిన అబ్బాయికి ముందే అమెరికా అమ్మాయితో ఒకసారి పెళ్ళయిందట. అందుకని ఆ అబ్బాయి నేనింకో అమ్మాయిని చేసుకోను అంటున్నాడట. అయితే పెద్దవాళ్ళందరూ కలిసి చస్తామని బెదిరించి ఇక్కడిదాకా తీసుకొచ్చారట
“ఓసినీ! స్నేహం ముసుగులో ఎంతపని చేసింది?” అశ్చర్యంతో బుగ్గలు నొక్కుకున్నది బామ్మ.
“అయినా దాని తెలివి దొంగల్దోలా… తెలిసి ఉన్న అమ్మాయిని చేసుకుంటే దాని భండారం అందర్లో బయటపడిపోదూ…”
“నిజమే బామ్మా… కాని పరువు కోసం ప్రాణమైనా ఇచ్చే మనలాంటివాళ్ళం ఆ సంగతి బయట పెట్టలేమని వాళ్ళకొక భరోసా. అదీ గాక మనమ్మాయి అందం చూసి పెళ్ళి చేసుకున్నాక ఇక ఆ అమ్మాయిని వదిలిపెడతాడని అనుకున్నారట. కాని ఆ అబ్బాయి ససేమిరా ఒప్పుకోవడం లేదట”
“పెద్దావిడ అని గౌరవిస్తే ఎంత పని చేసింది… పోనీలే ఆ అబ్బాయి అయినా నిజాయితీగా ఉన్నాడు” కోపంతో అన్నది పూర్ణ.
“ఎంత గండం తప్పింది? ఇంకా ధృతి ఒప్పుకోవటం లేదే అని బాధ పడుతున్నాము. అంతా మన మంచికే. ఇక ఇలా వచ్చిన సంబంధాలన్నీ ఒప్పుకోకూడదు. థాంక్స్ రా శివా” శివ భుజం తట్టాడు దినేష్
“అన్నా! నాకు థాంక్సేంటి? ఇది నా బాధ్యత” చెప్పాడు శివ.
“పరీక్ష రాయగానే పోలీసు లక్షణాలు వచ్చేశాయి నీకు” మెచ్చుకున్నాడు దినేష్.
కాసేపు అందరూ అమ్మాయి, అబ్బాయి తరపు వారి నుండి వచ్చే అవస్థలు, బాధితుల గాధలు చెప్పుకున్నారు. అప్పుడే సువర్చల ఫోన్ చేసింది బామ్మకు.
ధృతి ఆన్సర్ చేసింది “అమ్మమ్మా! నాకు చాలా నచ్చాడు మీ అబ్బాయి. మరి కట్నం ఏమ్తిస్తారు?” నవ్వు బిగపట్టుకుంటూ అడిగింది.
“ఓసి నీ ఇల్లు బంగారం కానూ… నువ్వడగాలే కాని ఏమైనా ఇస్తాము. బంగారు తల్లివి” సంతోషంగా అన్నది సువర్చల.
“మరి మొత్తం నాకిస్తే… కిశోర్ మొదటి భార్యకు ఏమిస్తారు?” బాణం వదిలింది ధృతి.
“మొదటి భార్యేంటి” తెలీనట్లు అన్నది సువర్చల. వెంటనే ఫోన్ బామ్మ లాక్కుంది.
“చాల్చాల్లే… స్నేహితురాలివి కదా అని వదిలిపెడుతున్నాను. ఎంత ధైర్యం నీకు? నా దగ్గరికే వచ్చి నన్ను మోసం చేద్దామనుకున్నావా? అసలు నీ బుద్దేమయింది? ఇంకొక్కసారి నాకు ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు” పూర్తి చేయకుండానే ఫోన్ కట్ చేసిన సువర్చల ఇక ఆ తర్వాత ఫోన్ తీయలేదు.
“ఇక తీయదులే అమ్మా! మొహం చెల్లొద్దూ? ఇక మీ ప్రోగ్రాం … రేపు పొద్దున్నే టిఫిన్ చేసి బయలు దేరండి. పూర్ణ లంచ్ ప్యాక్ చేసి ఇస్తుంది. మధ్యలో ఎక్కడన్నా తినేసేయొచ్చు” చెప్పాడు దినేష్.
“లంచ్ ప్యాక్ ఎందుకురా? అసలు టిఫిన్ కూడా మధ్యలో ఎక్కడన్నా తినేసి, లంచ్ టైం కి ఇంటికెళ్తాము. అక్కడ వంట చేసి ఉంచుతుందిలే సంజమ్మ”
నవ్వింది పూర్ణ. “ఒకవేళ ఇక్కడ ఏమన్నా చేసి ఇచ్చినా ఎవ్వరూ తినరుగా. సరేలెండి అత్తయ్యా… పొద్దున్నే కాఫీ తాగి బయల్దేరుదురు కాని. పిల్లలూ తొందరగా లేవాలి కదా? అన్నాలు తినేసి పడుకోండి ఇంక” చెప్పింది పిల్లలతో
దినేష్ కి తల్లి సంగతి తెలుసు కాబట్టి ఇక ఏమీ మాట్లాడలేదు.

*******************************************
మర్నాడు పొద్దున్నే కాఫీలు తాగి బయల్దేరారు అందరూ. ఆర్తీ, కార్తీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా రోజులయింది ఇల్లు కదిలి, అందుకే ఆ ఉత్సాహం. చెరొక కిటికీ సీట్ ఆక్రమించుకున్నారు. చూస్తుండగానే హోటల్ సెవెన్ వచ్చింది. కారు లోపలికి పోనిచ్చాడు శివ. అందరూ ఎవరికి ఇష్టమైనవి వారు ఆర్డర్ ఇచ్చుకున్నారు. తిని బయటికి వచ్చారు. ఆ హోటల్లో ఎప్పుడూ ఏవో ఒక సంబరాలు జరుగుతూనే ఉంటాయి. ఆ రోజు ఎవరో రిక్వెస్ట్ చేసారని కొంతమందిని పెట్టించి కోలాటం ఆడిస్తున్నారు.
ధృతి, ఆర్తి, కూడా వెళ్ళి కోలాటం ఆడసాగారు. అసలే డ్యాన్సర్ ఏమో, వేస్తున్న అడుగులు చాలా కరెక్ట్ గా పడ్తున్నాయి, ధృతికి. కోలాటం కర్రలు పట్టుకున్న తామర తూడుల్లాంటి చేతులు చక్కగా తిరుగుతున్నాయి. తమ సమూహంలోకి ఒక అందమైన అమ్మాయి వచ్చి చేయడం, చుట్టూ ఉన్న అందరూ దాన్ని ఎంజాయ్ చేయడం చూసి కోలాటం ట్రూప్ కి ఇంకా ఉత్సాహం వచ్చింది.
ఇంతలో సడన్ గా ఒక కారు వచ్చి ఎంట్రెన్స్ లో ఆగింది. అందులో నుండి హైహీల్స్ టక టక లాడించుకుంటూ మోడ్రన్ గా ఉన్న ఒక అమ్మాయి దిగి లోపలికి వస్తున్నది. ఆమె వచ్చే స్పీడ్ కి, గుండ్రంగా తిరుగుతూ కోలాటం ఆడుతున్న ఒక అమ్మాయి కర్ర కొద్దిగా తగిలింది. ఆ మాత్రానికే ఆ అమ్మాయికి చాలా ఆగ్రహం వచ్చేసింది. గిర్రున వెనక్కి తిరిగి “కంట్రీ బ్రూట్స్” అని తిట్టుతూ కోలాటం అమ్మాయిని కొట్టటానికి చేయెత్తింది. అప్పటికే ముందమ్మాయి టర్న్ అయిపోయి ఆ ప్లేస్ లోకి ధృతి వచ్చింది. అంతా గమనిస్తున్న ధృతి ఎత్తిన ఆ అమ్మాయి చేతిని పట్టుకుని గట్టిగా కిందికి విదిలించింది. “ఎవరు కంట్రీ బ్రూట్? మరుగవుతున్న కళలను బతికిస్తున్నారు వాళ్ళు. ముందు నువు మర్యాద నేర్చుకో”
ఒక్కసారి అందరూ ఆగిపోయారు. నిశ్శబ్దం రాజ్యమేలింది. అందరి ముందు జరిగిన అవమానానికి కృద్ధురాలైన ఆ అమ్మాయి హైహీల్స్ గట్టిగా నేలకు తన్నుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అందరూ ఆమెని విచిత్రంగా చూసి రక రకాలుగా వ్యాఖ్యానించుకున్నారు. తర్వాత కొద్దిసేపు ఆడాక “ఇక చాల్లే వెళదాం పదండి” అన్నది బామ్మ.
“బామ్మా! నువు కూడా రా… కోలాటం ఆడుదువు కాని” పిలిచింది ధృతి.
“ఇక చాల్లే… ముసలిదానికి దసరా పండగ…” నవ్వింది బామ్మ. అప్పటికే ధృతికి కనెక్ట్ అయిన కోలాటం పిల్లలు బామ్మను వదల్లేదు. బలవంతాన లాక్కెళ్ళి కర్రలు చేతిలో పెట్టారు. సిగ్గు పడుతునే వెళ్ళిన బామ్మ రెండు స్టెప్స్ వేయగానే ఫొటోలు తీసాడు శివ. ఆ తర్వాత వాళ్ళకు బై చెప్పి వచ్చి కారెక్కారు.
మధ్యలో అవీ ఇవీ కొనుక్కుంటూ, ఇష్టం వచ్చిన చోట ఆగుతూ మూడు గంటలకు ఊరి పొలిమేరల్లోకి వచ్చారు.
“ఈ గాలీ… ఈ నేలా ఈ ఊరూ సెలయేరూ” పాట అందుకున్నది ధృతి. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మనసు పరవశించి పోతుంటుంది ధృతికి. తన చిన్నప్పుడు ఎలా ఉన్నారో మనుషులు, వారి ప్రేమలూ… ఇప్పటికీ అలానే ఉన్నారు అందరూ. అందుకే అంత ఇష్టం.
అక్కడివారి పిల్లలంతా అమెరికాలో, విదేశాల్లో సెటిల్ అయినవారు. పెకుంటిళ్ళు మార్పించి డాబా ఇళ్ళు కట్టుకోమని, లక్జరీగా జీవితం గడపమని కొంతమంది తమ పేరెంట్స్ కి చెప్పారు. కొంతమందికి సొంతంగా కట్టుకునే స్థోమత ఉన్నది. కానీ డాబా ఇళ్ళు కట్టిస్తే సిటీ మాదిరి కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోయి పల్లెటూరి సొగసులు మారిపోతాయని కొంతమంది పెద్దలు ఆలోచించారు. అందుకే ఊరంతా ఒక మాట మీద ఉండి పల్లెటూరి వాతావరణం ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదని నిర్ణయించుకున్నారు. బయటనుండి చూస్తే పెంకుటిళ్ళు, విశాలమైన ఆవరణ పూలచెట్లు, ఆకుకూరల మడులతో ఉండేలా. కాని ఇంట్లో కెళ్ళి చూస్తే ఆధునిక హంగులతో ఉండేలా డెవలప్ మార్చుకున్నారు. దేనినీ మిస్ అవకుండా వాళ్ళు గడుపుతున్న జీవన విధానం చాలా హాయిగా ఉంటుంది. అందుకే ఆ ఊరి వీధులగుండా వెళ్తుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
రంగనాయకమ్మ కూడా పిల్లలొస్తే ఇబ్బంది పడకూడదని ఇంట్లో అన్ని హంగులు ఏర్పాటు చేయించింది. కారొచ్చి గుమ్మం ముందు ఆగగానే సంజమ్మ వచ్చి పిల్లలకు దిష్టి తీసింది. వద్దన్నా బామ్మ వినిపించుకోదు కాబట్టి మాటాడకుండా దిష్టి తీయించుకుని లోపలికి వచ్చారు.
గేటు దాటి లోపలికి వస్తుండగా గేటు పైన ఆర్చీకి పాకించిన సన్నజాజి పూలు గేటు కదలికకు జల జలా రాలి పూల వర్షం కురిపించాయి అందరి మీద. ఆవరణలోకి రాగానే ఆశ్చర్యంతో, ఆనందంతో నించుండిపోయింది. వెంటనే “మనసు పరవశించెనె… తనువు పులకరించెనే… ” అంటూ పాడుకుంటూ చేతులు రెండూ చాపి గుండ్రంగా తిరిగింది. విరగబూసిన గన్నేరు, మందార పూలు, పలకరింపుగా సంతోషంగా నవ్వాయి. గేటు నుండి ముఖద్వారం వరకూ వరుసగా ఉన్న గులాబీలు ఆహ్వానిస్తున్నట్లుగా తలలూపాయి. ఆ పక్కనే అరుగుల మీద కుండీల్లో ఉన్న రకరకాల చామంతులు మమ్మల్ని చూడవా అన్నట్లు వీస్తున్న గాలికి ఎగిరెగిరి చూస్తున్నాయి.
“బామ్మా! ఎన్ని రకాల పూలో… భలే పెంచుతున్నావు” ఒక్కొక్క మొక్క దగ్గరకెళ్ళి సున్నితంగా ఆకులను స్పృశించుతూ, మెచ్చుకోలుగా అన్నది ధృతి.
“నేను కాదులేవే.. సంజమ్మే నన్ను చేయికూడా వేయనివ్వకుండా మొత్తం తానే చూసుకుంటున్నది” అసలు మతలబు తెలీని బామ్మ సంజమ్మని మెచ్చుకున్నది.
అర్థమైన ధృతి నవ్వుకున్నది. “స్నానాలు చేసి రండమ్మా! అన్నం తిందురుగాని” చెప్పింది సంజమ్మ.
“అంత హడావుడి లేదు లేవే… మొదలు కాస్త కాఫీ ఇవ్వు” హాల్లో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చుంటూ చెప్పింది బామ్మ.
పిల్లల్ని పెరట్లోకి తీసుకెళ్ళాడు శివ. అక్కడ చెట్టుకి కట్టిన తాడు ఉయ్యాల చూడగానే తెగ ఉత్సాహ పడిపోయారు ఆర్తి, కార్తి. కాసేపు ఆడాక లోపలికి వచ్చి స్నానం చేసారు. అప్పటికి సన్నగా చీకటి పడుతున్నది.
భోజనాలయ్యాక ఆడుకుంటూ కూర్చున్నారు ఆర్తీ, కార్తీ. మాట్లాడుకుంటూ కూర్చున్నారు మిగిలిన వాళ్ళు. ఇంతలో “అమ్మా! నమస్కారం. లోపలికి రావచ్చామ్మా” అడుగుతూనే లోపలికి వచ్చాడు కరణం.
“అయ్యా! కరణం గారూ… అడిగిన ప్రశ్నకు జవాబు పొందకుండానే లోపలికి వచ్చారండీ” వెక్కిరించింది ధృతి.
“అదలాగే అంటుంది. రావయ్యా విశ్వం. ఎంతవరకొచ్చాయి తాంబూలాల హడావుడి?
“అదే చెప్దామని వచ్చాను అమ్మా! బాగున్నావా? ధృతీ… చిన్నప్పుడు నా పిలకా, నా గోచీ నీ ఆటవస్తువులు” నవ్వాడు కరణం.
“అవును కదా? ఉండండి… ఇప్పుడు నా బదులు మా చెల్లీ, తమ్ముడూ వస్తారు… మీ పిలక, గోచీ కోసం” ఆటపట్టించింది ధృతి.
“మా అమ్మ కదా? మా బంగారం కదా? ఇప్పుడంత పరిగెత్తే ఓపిక లేదు తల్లీ… నన్నొదిలేయి” బతిమాలుకున్నాడు కరణం.
“ఏదీ మరి నా తాయిలం?” చేయి చాపింది ధృతి.
“నువొచ్చావని తెలిసాక తేకుండా ఉంటానా?” చేతిలో ఉన్న కవరు ధృతి చేతికి ఇచ్చాడు కరణం.
“ఈసారి ఏమి తెచ్చారు?” ఆతృతగా కవరు ఓపెన్ చేసింది. “అబ్బా మామిడి తాండ్ర… నాకెంత ఇష్టమో” చిన్న ముక్క తెంపి నోట్లో వేసుకున్నది.
“నువ్వేమీ మారలేదు ఇంత పెద్ద అయినా” నవ్వాడు కరణం.
“అమ్మా! విశ్రాంతి తీసుకున్నారా? కొద్దిసేపు మీతో మాట్లాడి వెళదామని వచ్చాను” బామ్మ వేపు తిరిగి అడిగాడు.
“ఆ అన్నీ అయ్యాయి. కూర్చో. రేపు ఎన్నింటికి? పిల్లాడి తరపు వాళ్ళు ఎప్పుడొస్తారు?ఎంతమంది వస్తున్నారు?” ఆరా తీసింది.
“వాళ్ళు మొత్తం పదిహేను మంది వస్తామన్నారు. ఈ రోజు కొంతమంది వచ్చారు, పెళ్ళికొడుకుతో సహా. రేపు కొంతమంది వస్తారట. వచ్చిన వాళ్ళకు ఏర్పాట్లు చేసి ఇటొచ్చాను. రేపు పొద్దున్న టిఫిన్‌లు అక్కడే మీకు. మీరొచ్చి అక్కడ కూర్చుంటే చాలు. మాకు కొండంత అండ” వినయంగా ఆహ్వానించాడు విశ్వం.
“పన్నెండుకి ముహూర్తం. శాస్త్రిగారు తొందరగానే వస్తామన్నారు. ఆ తర్వాత భోజనాలయ్యాక ఇక వాళ్ళు తిరుగు ప్రయాణం. అనుకోకుండా తొందరగా తాంబూలాలు తీసుకోవలసి వచ్చింది. మీ ప్రయాణం మాకోసం ముందుకి జరుపుకున్నారు. సంతోషం అమ్మా! మరి నే వస్తాను” లేచాడు. “ధృతీ! రేపు మీ అందరికీ మా ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్. తమ్ముడూ, చెల్లెల్ని తీసుకుని అందరూ కలిసి రండి. రేయ్ శివా అమ్మని తీసుకుని రా తప్పకుండా” అందరినీ పేరు పేరునా ఆహ్వానించాడు.
“అన్నట్లు ఈ అబ్బాయి వాళ్ళ మేనమామకు హైదరాబాదులో పెద్ద కాలేజీ ఉన్నదట. అదేంటి ఆ పేరు… రాజారాం కాలేజీ అట” చెప్పాడు ధృతి తో.
“అవునా? నేను ఆ కాలేజీనే… ఆయనొస్తున్నారా?” ఉత్సాహంగా అడిగింది.
“ఆయన రావడం లేదు కాని పెళ్ళికొడుకు కుటుంబంతో పాటు ఆయన భార్యా, కూతురూ వచ్చారు. మరి నే వస్తానమ్మా” చెప్పేసి వెళ్ళిపోయాడు విశ్వం.
“ఆ రోజు కాలేజీ ఫంక్షన్‌లో కాలేజీ ఫౌండర్ అయిన శంకరం భార్యా పిల్లలూ వచ్చారా?” గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించి గుర్తుకు రాక తల విదిలించింది ధృతి.

**************సశేషం*******************

1 thought on “ధృతి – 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *