December 6, 2023

మునికుల చూడామణి “కణ్వ మహర్షి”

రచన: శ్యామ సుందరరావు

కణ్వుడు కశ్య ప్రజాపతి వారసుడైన అంగీరసుని వంశంలో ఘోరుడు అనే ఋషికి జన్మించాడు ఈయనను “మునికుల చూడామణి”అని అంటారు అంటే మునులలోకెల్లా శ్రేష్ఠుడు అని అర్ధం. ఈయన బాల్యము నుండి తపోనిష్ఠలో ఉండి బ్రహ్మచారిగా ఉండిపోయాడు కణ్వుడు మహా నిష్ఠాగరిష్ఠుడు. గొప్ప తపస్సంపన్నుడు అతను మన వేదాలలో పెక్కు మంత్రాలకు ద్రష్టగా నిలిచారన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. రుగ్వేదంలో కణ్వుడి పేరిట చాలా మంత్రాలే ఉన్నాయి. కణ్వుడు, అతని వంశజులు దర్శించిన మంత్రాలు మన చతుర్వేదాలలో అడుగడుగునా కనిపిస్తాయి. వీటికి తోడుగా ‘కణ్వస్మృతి’ పేరుతో ఈయన రచించిన ధర్మశాస్త్రానికి కూడా గొప్ప ప్రాముఖ్యత ఉంది. తన తపస్సు నిరాటంకంగా సాగేందుకు అతను మాలిని అనే నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు ఈయన ఆశ్రమము ఇంద్రుని ఖాండవ వనము, కుబేరుని చైత్ర రధము లాగ గొప్పగా ఉండేది ఈ ఆశ్రమములో ఎప్పుడు వేద ఘోష వినిపిస్తూ ఉండేది, నిత్యమూ అగ్నిహోత్రాలు ఉండేవి ఆ ప్రాంతానికి వచ్చే రాజులైన మహర్షులైన అయన ఆశీర్వచనాలు తీసుకోకుండా వెళ్లేవారు కాదు. అంత పవిత్రమైనది అయన ఆశ్రమము ఈ మాలినీ నది హరిద్వార్‌ కు దగ్గరలో ఉందని అంటారు. అక్కడ కోట్‌ ద్వారా అనే ఊరిలో కణ్వుడి పేర ఇప్పటికీ ఓ ఆశ్రమం ఉంది. మరికొందరేమో మహారాష్ట్రలోని కణాల్ద (జల్‌గావ్) అనే ప్రాంతంలో ఉన్న గుహలే ఆనాటి కణ్వుడి ఆశ్రమం అని నమ్ముతారు . మేనక విశ్వామిత్రుల కుమార్తె శకుంతలను పెంచిన తండ్రిగా కణ్వ మహర్షి ప్రసిద్ధుడు. కణ్వస అనే గోత్రీకులకు మూల పురుషుడితడు.

ఇలా మాలినీ తీరాన ఉన్న ఆశ్రమంలో ధార్మిక జీవనాన్ని గడుపుతున్న కణ్వుడి జీవితం ఒక రోజు అనుకోని మలుపు తిరిగింది. అతనికి పక్షుల నీడన, తామరాకుల మీద పడుకోబెట్టింది ఓ చిన్న బిడ్డ కనిపించింది. ఇంతలో ఆశరీరవాణి , ” ఓ మహర్షి ఈ పసిబిడ్డ మేనక, విశ్వాత్రులకు జన్మించినది. ఈ బిడ్డను నీవు ఈ బిడ్డను నీ ఆశ్రమానికి తీసుకువెళ్లి శకుంతల అని నామకరణము చేసి పెంచి పెద్ద చేయి. శకుంతలకు పుట్టే బాలుడు గొప్ప చక్రవర్తి అయి భారతఖండాన్ని ఏలుతాడు ” అని చెపుతుంది .అప్పుడు కణ్వుడు ఆ పసిబిడ్డను తన ఆశ్రమానికి తెచ్చుకొని తానే తల్లిదండ్రి అయి, ఆమెను కన్న కూతురిలాగా అపూరూపముగా పెంచి పెద్దచేశాడు కణ్వుడు. ఆ శకుంతలని ఒక రోజు కణ్వుడు ఆశ్రమములో లేని సమయములో దుష్యంతుడు అనే రాజు చూసి మోహిస్తాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని కణ్వుడు వచ్చినాక అయన అనుమతితో రాజ్యానికి తీసుకొని వెళతానని చెప్పి అయన తన రాజ్యానికి తిరిగి వెళ్లిపోతాడు. దుష్యంతుడు తనని సకలలాంఛనాలతో అతని రాజ్యానికి తీసుకుని వెళ్తాడని కలలలో తేలిపోతున్న సమయములో ఆశ్రమంలోకి అడుగుపెట్టిన దుర్వాస మహర్షిని సరిగా గమనించుకోదు. శకుంతల పరధ్యానానికి కోపగించుకున్న దుర్వాసుడు, దుష్యంతుడు ఆమెను మర్చిపోతాడంటూ శపిస్తాడు

ఆశ్రమానికి తిరిగి వచ్చిన కణ్వమహర్షి విషయము తెలుసుకొని, శకుంతల గాంధర్వ వివాహాన్ని ఆమోదించి దీవించి ఏమైనా వరము కోరుకోమంటాడు. అప్పుడు శకుంతల తనకు పుట్టబోయే కుమారుడు బలవంతుడై ఆయురారోగ్యాలతో ధర్మకార్యాలు నిర్వహిస్తూ ఉండేటట్లు తనను దీవించామని అడుగుతుంది అలాగే దీవిస్తాడు కణ్వుడు. ఆ మహర్షి దీవెనల ఫలితముగా శకుంతల మగబిడ్డను ప్రసవిస్తుంది. ఆ బిడ్డకు కణ్వుడు భరతుడు అని నామకరణము చేస్తాడు ఆ బాలుడు తనకు ఉన్న బలముతో క్రూర జంతువులను వేటాడుతూ ఆశ్రమవాసులను కాపాడుతూ ఉంటాడు. భరతునికి సర్వదమనుడు అనే పేరు కూడా ఉంది. బాలుడు పెరిగి పెద్దయినాక యువరాజ పట్టాభిషేకానికి సమయము ఆసన్నమయినది భావించి, శకుంతలాభరతులను ఆశ్రమవాసులను తోడిచ్చి దుష్యంతుని దగ్గరకు పంపుతాడు. ఆ సమయములో శకుంతలకు చెప్పిన జాగ్రత్తలు, హితవచనాలు నేటికీ ఆచరణీయమైనవి చాలా బాధతో కన్నకూతురు కాకపోయినప్పటికీ శకుంతలను అత్తవారింటికి సర్వ లాంఛనాలతో పంపుతాడు. కణ్వుని చరిత్ర కన్నప్రేమకన్నా పెంచిన ప్రేమ ఏ మాత్రము తీసిపోదని లోకానికి తెలియజేసింది. సర్వసంగ పరిత్యాగిగా జీవిస్తున్న కణ్వుడు కూడా కూడ పెంచిన ప్రేమకు లోనవుతాడు. ఏంతో బాధతో శకుంతలను అత్తవారింటికి పంపుతాడు.

కానీ దుర్వాసుని శాపఫలితముగా దుష్యంతుడు శకుంతలను గుర్తించడు. ఆ సమయములో అశరీరవాణి మాటలతో శకుంతలను గుర్తించటం వలన శాపవిమోచనం జరిగి శకుంతలా దుష్యంతులు కలుసుకోవటం జరుగుతుంది. వారిరువురికీ జన్మించిన భరతుడు దుష్యంతుని రాజ్యానికి వారసుడు అవుతాడు. మన దేశానికి భరతఖండము అనే పేరు రావటానికి కారణము ఇతడే.

కణ్వుడు ఈ తీరున ఒక వంశం (భరత) ఏర్పడేందుకే కాదు, మరో వంశం (యదు) నిర్మూలం అయ్యేందుకు కూడా కారణం అయ్యాడు. అదెలాగంటే- కణ్వుడు ఒకనాడు విశ్వామిత్రుడు, నారదుడు వంటి మహర్షులతో కలిసి కృష్ణుని పాలనలో ఉన్న ద్వారకకు చేరుకున్నారు. ఈ మహర్షులను చూసిన యాదవ కుర్రకారుకి వారిని కాసేపు ఆటపట్టాలని అనిపించింది. వెంటనే సాంబుడు అనే యాదవునికి కడుపుతో ఉన్నట్లుగా స్త్రీ వేషము వేసి, మునులను ఏ పిల్లను ప్రసవిస్తుంది అని అడుగుతారు మునులు ఆగ్రహించి ఒక ముసలం (రోకలి) పుడుతుందనీ, శపిస్తారు ఆ సంఘటన తరువాత యాదవ వంశం నిర్మూలం అవుతుందనీ శపిస్తాడు కణ్వుడు. శాపము వల్ల నిజంగానే సాంబుడి కడుపున ముసలం జన్మిస్తుంది. బలరామ కృష్ణుల ఆదేశము ప్రకారము యాదవులు ఆ ముసలాన్ని అరగదీస్తారు. కానీ చిన్న రేకు ముక్కను ఉపయోగించి తయారు అయిన బాణమును ఒక వేటగాడు వేటాడుతూ ప్రయోగించటం వలన ఆ బాణము తగిలి శ్రీ కృష్ణుడు అవతారాన్ని చాలిస్తాడు . ఆ సంఘటన తరువాత యాదవులంతా తాగి ఆకారణముగా ఒకరితో ఒకరు కలియబడి చంపుకుంటారు. ఆ విదముగా యదు వంశము నాశనము అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

January 2022
M T W T F S S
« Dec   Feb »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31