June 24, 2024

*శ్రీగణేశ చరిత్ర*

రచన: నాగమంజరి గుమ్మా

17 వ పద్యం

నేటి మొదలు నీ పేరున
మేటిగ తొలిపూజచేసి మేలునుపొందున్
కోటీజనులు తమ పనులను,
సాటిగ రారెవ్వరనుచు సాంబశివుడనెన్
భావం: పునర్జీవితుడైన బాలుని చూచి, పార్వతీదేవితో కూడిన శివుడు (సా అంబ శివుడు), “గజముఖుడు, గజాననుడు అనే పేర్లు కలిగిన నీకు జనులందరూ తమ కార్యముల కొరకు తొలి పూజలు అందజేస్తారు. ఈ విషయంలో మరెవ్వరూ నీకు సాటిగా రాబోరు. వారికి తగిన మేలు చేకూర్చుము” అని దీవించెను.

18 వ పద్యం
వరమిచ్చిరి వెన్నుడు సిరి
వరమిచ్చిరి మరి విరించి వాగ్దేవియునున్
వరమిచ్చెను వేల్పుగురుడు
వరమిచ్చిరి సుర గణంబు వరపుత్రునకున్
భావం: విష్ణువు, లక్ష్మీదేవి, బ్రహ్మ, సరస్వతి, బృహస్పతి (వేల్పుగురుడు) , ఇతర దేవతలందరూ కూడా గజముఖునికి వరములనిచ్చారు.

19 వ పద్యం

వరమిచ్చిన వేల్పుల గని
కరములు మోడ్చి, చరణాలు కనులద్ది శుభం
బరయగ నిటులనె ఘనుడును
కరిముఖమున జీవిక నిడి కరుణించిరి నన్
భావం: అనేక వరములు పొంది గొప్పవాడైన (ఘనుడు) గజముఖుడు తనకు వరముల నిచ్చిన దేవతలందరిని చూసి, చేతులెత్తి దండం పెట్టి, పాదాలు కళ్లకద్దుకుని శుభము కలుగునట్లుగా ఇలా పలికాడు “ఏనుగు ముఖాన్ని నాకు పెట్టి నన్ను తిరిగి జీవింపజేశారు”.
(తర్వాతి పద్యంతో అన్వయం)

20 వ పద్యం

దండిగ వరముల నిచ్చిరి
దండము మీకిదె యజినము దండము తోడన్
దండక వనముల కేగెద
చండ తపము నాచరించి చయ్యన వత్తున్
భావం: నాకు చాలా వరాలు ప్రసాదించారు. మీకు నమస్కారాలు. జింక చర్మము, దండము ధరించి దండకారణ్యానికి వెళ్లి తపస్సు చేసుకుని వస్తాను అన్నాడు కరిముఖుడు.
(చదువుకోడానికి గురుముఖతః నేర్చుకోవడం ఒకపద్దతి కదా తపస్సుచే స్వాధ్యాయనం మరో పద్ధతి.)

21 వ పద్యం

అనుమతి నీయుడు గురువులు
జనకులు మరి బంధువర్గ జనులందరిదే
అని కోరిన పుత్రుని గని
కనులందానంద బాష్ప కణములు రాలన్
భావం: తల్లిదండ్రులు, గురువులు, బంధువులు అందరూ నాకు అనుమతి నిస్తే దండకారణ్యానికి వెళ్లి తపస్సుచేసుకుని వస్తాను అన్నాడు గజముఖుడు. తమ కుమారుని మాటలు వినగానే కళ్ళలో ఆనంద బాష్పాలు నిండగా… (తరువాతి పద్యానికి అన్వయం)

22 వ పద్యం

ఉపనయనము గావింతుము
తపమునకు చన నొక యర్హతయు కావలెయున్
ఉపవీతము ధరియించిన
సఫలమగును నీ తలంపు సరగున పుత్రా
భావం: “నాయనా కుమారా, తొందరపడకు. నీకు ఉపనయనము జరిపిస్తాము. తపస్సు చేయాలంటే ఒక అర్హత కావాలి కదా, గాయత్రీ మంత్రం నేర్చుకుంటే నీ కోరిక తప్పకుండా తీరుతుంది” అని తల్లిదండ్రులు గజముఖునికి తెలియజేసారు.

23 వ పద్యం

అని, ఒక పుణ్యదినంబున
నొనరగ పరిజనుల పిల్చి ఉపనయ సంభా
వన తెల్పిరి గౌరీశులు
ఘనముగ సంబరము జేయ గణములనెల్లన్
భావం: ఒక మంచిరోజు చూసి, ఉపనయనము చేయడానికి ముహూర్తము నిర్ణయించుకొని, అందరికి ఈ విషయం తెలియజేయమని తమ అనుచరులకు పార్వతీ పరమేశ్వరులు తెలియజేసినారు

24 వ పద్యం

హిమవత్పర్వత మంతయు
సుమనోహర కాంతులొప్ప సురలు సువిధలున్
తమతమ చయముల నిడుకొని
ఉమ సుతు తేజంబు చూడ నుత్సాహముతోన్
భావం: హిమాలయం అంతటా కాంతివంతమయ్యేలా దేవతలందరూ తమతమ పరివారంతో, ఉమాదేవి కుమారుడైన కరివదనుని ఉపనయనం చూడడానికి ఉత్సాహంతో… (తర్వాత పద్యంతో అన్వయం)

25 వ పద్యం

అలికిరి ముగ్గులు పెట్టిరి
చలికొండ నలంకరించి చక్కన చేయన్
వలి వెలుగు వెలికిల బడెన్
తెలి ముత్తెపు తోరణములు తెరగున వెలిగెన్
భావం: ఆ హిమాలయాన్నంతా అలికి ముగ్గులు పెట్టేరు. ముత్యాల తోరణాలు కట్టేరు. ఈ విధమైన అలంకారాలన్ని చేసేసరికి అసలే తెల్లని కొండ ఇంకా మెరిసిపోగా శివుడి నెత్తిన ఉన్న నెలవంక తెల్లబోయిందట

26 వ పద్యం

దీక్షా కంకణధరులై
దాక్షాయణి చంద్రమౌళి దరహాసమునన్
అక్షతలు వేసి వటువును
వీక్షించి తమ సరస నుపవిష్టుని జేయన్
భావం: ఉపనయనం చేయడానికి మంచి ముహూర్తాన కంకణాలు కట్టుకున్నారు పార్వతీపరమేశ్వరులు. (ఉపనయనం కాబోయే పిల్లవాడిని వటువు అంటారు) గజాననుని అక్షతలు వేసి ఆశీర్వదించి, తమపక్కనే కూర్చోపెట్టుకుని… (తర్వాతి పద్యంతో అన్వయం)

27 వ పద్యం

అంకురమిడి పుణ్యాహపు
సంకల్పము చేసి బాలసారాది క్రియల్
నింకెరముగ సేసిరి యా
టంకములెదురాయెను అకటా ఉపనయనమున్
భావం: అంకురార్పణ, సంకల్పం, మొదలగు కార్యక్రమాలు జరిగాయి. తర్వాత పుట్టినదాదిగా చేసే క్రియలు బాలసార, అన్నప్రాసన మొదలైనవన్నీ కూడా జరిపించారు. అప్పుడు ఉపనయనంలో ఆటంకాలు ఎదురయ్యాయి

28 వ పద్యం

పోషిత వర గర్వితుడై
మూషిక నామ యసురుండు ముల్లోకములన్
మాషమునను బాధించుచు
మోషకుడై వటు పవిత్రము తునియ జేసెన్

భావం: మూషికుడు అనే రాక్షసుడు ఎన్నో వరాలు పొందినవాడై గర్వంతో ముల్లోకాలను తన మోసం తో బాధిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ అసురుడే దొంగలా యజ్ఞోపవీతమును ముక్కలుచేసాడు.
(ఎలుక కనబడకుండా దాగి వస్తువులన్నీ కొరికివేస్తుంది కదా…. అదే ఇది)
మోషకుడు: దొంగ, మాషము: మోసము

29 వ పద్యం

ఉపవీతములన్నియు దు
ష్టపు పనిచేత తునియలగుటన్ జేసి హరిన్
ఉపవీతము గావించెను
త్రిపురారి, తరుణుడు తేజరిల్లగ నెంతన్
భావం: ఎన్ని ఉపవీతములు తెచ్చినా ఎలుక కొరికివేయడం తో ఒక పామునే (హరి) యజ్ఞోపవీతంగా మార్చి శివుడు గజముఖునికి వేసెను

30 వ పద్యం

వెండియు హేమంబులనక
ఖండితములు చేసె మూషికమదియె నయ్యో
రండనుచు గణములు పలుక
చండీశుండానతీయ చయ్యన లేచెన్
భావం: బంగారు యజ్ఞోపవీతం, వెండి యజ్ఞోపవీతం అనే బేధమే లేకుండా కొరికి పారేసిన ఎలుక అదిగో అక్కడ ఉంది, రండి చంపేద్దాం అని శివుని పరివార గణాలు అంటూ ఉండగా, శివుడు సరే వెళ్ళమనగా వెంటనే లేచెను (గజాననుడు.. తర్వాత పద్యంలో అన్వయం)

1 thought on “*శ్రీగణేశ చరిత్ర*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *