March 30, 2023

పరవశానికి పాత(ర) కథలు – సయొనారా

రచన: డాక్టర్ కె.వివేకానందమూర్తి (యు.కె)

ప్రేమించిన చక్కటి అమ్మాయి కళ్లల్లోంచి కురిసే చిక్కటి వెలుగు లాంటి వెన్నెల జాలు వానగా కురిపిస్తున్న పున్నమి చంద్రుణ్ణి, ఆ అమ్మాయిని అదుపులో పెట్టడానికి ప్రయత్నించే ముసిలి తండ్రిలాగ, నల్లటి మేఘం వొకటి నిండా కప్పేసింది. అంచేత ఆకాశంలో చంద్రుడు షెడ్ చాటున టేబిల్ లైటులా వున్నాడు. చాలని చిరువెన్నెల పరుచుకున్న భూమ్మీద పల్చని చీకటి మసగ్గా వ్యాపించివుంది.
ఇప్పుడు ‘రామకృష్ణా మిషన్ బీచ్’లో వెన్నెల పున్నమినాటిలా లేదు. జనం అప్పుడే చీకటి పడిన శనివారంలా లేరు. ‘స్కాండల్ పాయింట్’ దగ్గర వేడి ప్రేమ జనించే సూచనలు కూడా లేవు. ఇవేం లేకపోయినా, అక్కడ మాత్రం దేశంలో దరిద్రమంత సముద్రం ఉంది. దాని ప్రక్కనే రెండు ముచ్చటైన పొడుగాటి జడలు కూడా ఉన్నాయి. అవి చీకటి సముద్రమంత నల్లగా వున్నాయి. ఆ జెళ్లకి వొక చివర తమాషాగా ముడి వేయబడిన రెండు సిల్కు రిబ్బన్లున్నాయి. మరో చివర తమాషాగా దిక్కులు చూస్తున్న వొక తల వుంది. ఆ తల మీద వొత్తైన జుత్తు వుంది. ఆ జుత్తు మధ్యగా బీచ్ రోడ్డులా తిన్నటి పాపిట వుంది. పాపిడి ప్రారంభమైన చోటుకి దిగువగా విశాలమైన నుదురు వుంది. ఆ నుదుటి మధ్య దిద్దుబాటుల్లేకుండా తీర్చిన తిలకం బొట్టు – కాస్త క్రిందుగా, ఎడా పెడా ఒక జత పెద్ద కళ్ళు వున్నాయి. అవి ఇప్పుడు ఎడాపెడా చూస్తున్నాయి. అవి రేఖ అనే నాజూకు అమ్మాయివి. అందమైన రేఖకి – చారెడు కళ్ళకి బారెడు జెళ్ళకి తోడు అందమైన చెవులు, ముక్కు, పెదాలు, చీరె, జాకెట్టూ కూడా వున్నాయి. మూసిన పెదాల మధ్యనున్న రేఖ నోరు ఇప్పుడు సన్నటి సరళరేఖలా వుంది.
కాస్సేపటి క్రితమే నిరంజనం ఆమెని వొదిలి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు రేఖ వొంటరిగా, చంద్రకాంతి లేని అవాళ్టి సముద్రంలా ఉంది. పున్నమి చంద్రుడు మేఘం పరదా నుండి వెలికివస్తే – వెన్నెల్లో సముద్రాన్నీ, బీచినీ చూసి ఇంటికి మళ్ళే వుద్దేశంతో చాలాసేపు అలాగే, అక్కడే నిలబడింది రేఖ. కాని చంద్రుడెంతకీ బయటకీ రాకుండా వున్నాడు.
పల్చటి చీకటి క్రమంగా దట్టమై ఊరంతా వొళ్ళు విరిచింది.
బీచ్ లో రేఖ తప్ప మరి మనుషుల్లేరు. ఆమె చేతినున్న వాచ్ లో ముళ్ళున్నా లేనట్టే వున్నాయి. అందమైన అమ్మాయి కాబట్టి రేఖకి భయం వేస్తోంది. పదో నెంబరు చివరి బస్సు ఇందాకే వెళ్లిపోయింది. నిరంజనం తోడు వచ్చి ఇంటికి దిగబెడతానన్నాడు. కాని తను వెన్నెల చూశాక వెళ్ళాలి అనుకుంది. అందుకని తనొక్కతే వెళ్ళగలనంటూ ఏదో పనుందన్న నిరంజనానికి ‘గుడ్ నైట్’ చెప్పేసింది. తీరా ఇంతసేపు చూసినా వెన్నెల రాలేదు. చీకటి పోలేదు. ఇంతలో చినుకులు రాలడం ప్రారంభమైంది. కాస్సేపటికి సన్నటి వర్షం మొదలైంది.
ఈ వాతావరణంలో రేఖకి చలికంటే భయం ఎక్కువగా వేస్తోంది. పండు వెన్నెల్లో మనోజ్ఞతకి ఇరవై యేళ్ళుగా అలవాటుపడిన రేఖకి వర్షపు చీకట్లో భయం, ఇదే తొలి అనుభవం.
ఆమె యిపుడు ఎడాపెడా చూడ్డం మానేసి, దూరంగా లాసన్స్ బే వైపున్న రెడ్ లైట్ హౌస్ ని తదేకంగా చూస్తోంది.
విరిగి పడే కెరటాల ధ్వని ఆమెని జడిపిస్తోంది.
విసురుగా వీచే వానగాలి ఆమెను వొణికిస్తోంది.
ఇంతలో – అట్నుంచి ఏదో కారు ఒకటి ఇటుగా వస్తూ ఆమె నిశ్చలమైన చూపుని తన వైపు మరల్చుకొంది. హఠాత్తుగా వర్షం తగ్గిపోయి, వెన్నెల వచ్చినంత తేలికపడింది రేఖ. తడిసిపోయే యిసుకలో గబాగబా నడచి, రోడ్డు అంచుకి వచ్చి నిలబడింది. హెడ్ లైట్ కాంతి మీద పడగానే కారు ఆపమన్నట్టు చెయ్యి వూపింది. క్షణంలో కారు ఆమె పక్కగా వచ్చి ఆగింది. ఆగిన వెంటనే డ్రైవింగ్ సీట్లో వున్న ఒక్క వ్యక్తి చురుగ్గా మాట్లాడాడు.
‘‘ఇది పదో నెంబరు బస్సు కాదు – అంబాసిడర్ కారు’’
‘‘ప్లీజ్! హాస్పిటల్ రోడ్డు వరకూ కాస్త లిఫ్టిస్తారా?’’ రేఖ అతన్ని ప్రాధేయపూర్వకంగా చూసింది. అతని కళ్ళు క్షణంపాటు ఆమెని పరిశీలనగా చూశాక, అతను మౌనంగా వొంగి కారు తలుపు తీసి, కూర్చోమన్నట్లు తల వూపాడు. రేఖ ‘‘థాంక్స్’’ చెప్పి ఫ్రంట్ సీట్లో అతని పక్కన కూర్చుంది. అతను కారు స్టార్టు చేశాడు.
స్టీరింగు మీద దృఢంగా చేతులు మోపి రోడ్డు వైపు తిన్నగా చూస్తున్నాడతను. కృతజ్ఞత నిండిన మనస్సుతో రేఖ తల పక్కకి తిప్పింది. అతని చెంపలు కనిపించాయి. వాటి బిగి పాతికేళ్ళ అతని వయస్సుని సుమారుగా సూచిస్తోంది.
అలాగే చూస్తూ అతను అడిగాడు – ‘‘నర్సేమిటి మీరు’’
‘‘కాదు, మెడికల్ స్టూడెంట్ ని!’’ చీర కొంగుతో తడి ముఖాన్ని తుడుచుకుంటూ అంది రేఖ.
‘‘ఏమిటి మీ పేరు?’’
‘‘రేఖ.’’
‘‘మీకు అందమే గాని ఆలోచన లేనట్టుంది.’’
రేఖ మాట్లాడలేదు. చెవి రింగుల్ని, నుదుటి మీద ముంగురుల్ని సరి చేసుకోంటోంది.
‘‘నాకేం నచ్చలేదు – ఇలా రాత్రిపూట వొక్కరూ, వర్షంలో, జనంలేని బీచ్ లో వంటరి మగాడి కారాపి ఎక్కడం, ఎంత ధైర్యం! ఇందుకనేమో ఆడవాళ్ళలో ధైర్యం బాగుండదని చెప్పేడు మావఁయ్య.’’
ఆమె వణికింది. అతనామె కేసి చూశాడు.
‘‘మీరు చలికి వణకట్లేదని నాకు తెలుసు. ధైర్యం బాగుండదన్నానని వొంట్లోకి భయం తెచ్చుకుంటున్నారులా వుంది. అయినా ఇప్పుడు భయపడాల్సింది నేను. వర్షపురాత్రి తొమ్మిది దాటాక వొంటరిగా పోయే వాణ్ణి అపుజేసి కూడా పడ్డారు. మీరిప్పుడేమైనా చేస్తే నేనేం చెయ్యగల్ను?’’
క్షమించండి! అలా అర్థం చేసుకోకండి దయచేసి! ఇందాకటి వరకు మా ఫ్రెండూ నేనూ కలిసి కబుర్లు చెప్పుకున్నాం. వెన్నెల వస్తే కాస్సేపు కూర్చుని పోవచ్చు కదా అని ఒక్కతెను వుండిపోయేను. వెన్నెలకి బదులు వర్షం వచ్చింది.’’
‘‘అంత ఇష్టమా మీకు వెన్నెల?’’ రేఖ ముఖం వేపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు. బదులుగా ఆమె కళ్ళతో నవ్వి ఔనన్నట్టు తల పంకించింది.
‘‘ఎలా వుంటుందేమిటి మీకు వెన్నెల?’’
అతని చిలిపితనం ఆమె నాకర్షించింది.
‘‘అంటే?’’
‘‘చల్లగానా? – వేడిగానా?’’
‘‘చలీ వేడి ఏమిటి? హాయిగా వుంటుంది వెన్నెల.’’
‘‘అయితే మీకు వెన్నెల గురించి ఏమీ తెలీదన్నమాట!’’
‘‘మీకు తెలుసేఁవిటి?’’
‘‘వో!-’’
‘‘అయితే చెప్పండి!’’
‘‘అందమైన అమ్మాయిలతో వెన్నెల గురించి మాట్లాడకూడదు.’’
‘‘మాట్లాడితే – ?’’
‘‘మాట్లాడితే దాన్ని ‘ప్రేమం’టారు.’’
చటుక్కున ఆమె అతన్ని కోపంగా చూసింది. అతను గ్రహించాడు.
‘‘కోప్పడకండి మరి. నా కారులో కూర్చున్నారు కనుక కాస్త ఫ్రీగా మాట్లాడుతున్నానంతే! మీకిబ్బందిగా వుంటే-’’
‘‘వుంటే?’’
‘‘కారు ఆపు చేస్తాను. దిగిపోదురు గాని’’
ఈ జవాబుతో రేఖకి వుడుకుమోత్తనం వచ్చింది.
‘‘అయితే ఆపండి, దిగిపోతాను!’’
వెంటనే అతను కారు ఆపు జేశాడు. ఇది వూహించని రేఖ తత్తరపడింది.
‘‘ఆపాను. దిగిపోతారా?’’
ఆమె సంశయిస్తూ అంది ‘‘దిగి పోతాను.’’
‘‘కారు దిగి తడిసిపోతారు. బయట వున్నది వెన్నెల కాదు. వర్షం.’’
‘‘నేనెలా పోతే మీకేం? కారుందిగా మీకు! హాయిగా తడవకుండా వెళ్ళండి.’’
‘‘తడిస్తే చలేసి రొంపపడుతుంది. అలా వుడుక్కుంటే వేడెక్కరు’’
ఆమె తలుపు తెరవబోయింది.
‘‘పే చెయ్యకుండా దిగిపోవడం న్యాయం కాదు!’’
ఆమె వులిక్కిపడింది. ‘టాక్సీనా ఇది. అయితే నేను దిగను. ఇంటి దగ్గరే డబ్బు అన్నీ పే చేస్తాను.’ టాక్సీ డ్రైవరు తన్ను అంత లోకువకట్టి మాట్లాడతాడా అని కోపంతో చలించి పోతూ అంది రేఖ. అతను కారు కదిలించాడు.
‘‘పర్స్ మర్చిపోయారేమిటి?’’
‘‘కాదు, ఏం మర్చిపోయానో ఇంటి దగ్గరే చెపుతాను.’’
‘‘అదీ మరచిపోయినట్టున్నారు. కాస్త జ్ఞాపకం చేసుకోండి, – ఏం మర్చిపోయారో’’
‘‘షటప్’’
‘‘షటప్పా?’’
‘‘అతిగా మాట్లాడితే మీ యజమానితో చెప్పి డిస్మిస్ చేయిస్తాను.’’
‘‘అయితే చెప్పండి. నేనే దీనికి యజమానిని!’’
‘‘మిష్టర్! జాగ్రత్త. డ్రైవింగ్ లైసెన్స్ పీకించెయ్యగలను.’’
‘‘సారీ! నాకు లేదు. మీరు పొరబడుతున్నారు. ఇది టేక్సీ కాదు.’’
‘‘పే చెయ్యమనడానికి లేని సిగ్గు టేక్సి అని చెప్పుకుంటే వొచ్చింది కాబోలు!’’
‘‘ఇది మీ రెండో పొరపాటు. నేను పే చెయ్యమన్నది డబ్బు కాదు. థాంక్స్.’’
అతని మాటకారితనం, చొరవా అమెకాశ్చర్యాన్ని కలిగించాయి. అతను పెదాలు విరిచి చిరునవ్వు తయారు చెయ్యడం చూడగానే కోపమంతా పోయి ఆమెకి వెన్నెలంత హాయి కలిగింది.
నొచ్చుకుంటూ మెల్లగా అంది. ‘‘సారీ! నాకు ఎలా బిహేవ్ చెయ్యాలో తెలీదు. ఏమీ అనుకోకండి!’’
ఇప్పుడేవీఁ అనుకోలేదు గానీ, ఇందాక మాత్రం మీరు కారెక్కేటప్పుడే అనుకున్నాను – మీకు ‘‘బిహేవియర్ తెలీదని!’’
ఆమె ఆశ్చర్యంగా చూసింది. అద్దంలోంచి వర్షం వెలిసి పోవడం కనబడింది.
‘‘మీ పేరు తెల్సుకోవచ్చా’’ అడిగింది.
‘‘చిన్నా.’’
‘‘ముద్దు పేరా?’’
‘‘ఎవరికి?’’
‘‘మీ వాళ్లకి!’’
‘‘మా వాళ్ళంటే?’’
‘‘అమ్మా, నాన్నా’’
‘‘వాళ్ళు నాకు లేరు!’’
‘‘సారీ!’’ రేఖ మనస్సు చివుక్కుమంది.
కాస్సేపు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం నిలిచాక రేఖే మాట్లాడింది.
‘‘ఏం చేస్తున్నారు మీరు?’’
‘‘కనిపించడంలా? డ్రైవ్ చేస్తున్నాను!’’
‘‘అది కాదండి, వుద్యోగం?’’
‘‘వుద్యోగవాఁ? అది చేస్తే ఇలా వంటరి అమ్మాయిలకి లిఫ్ట్ లివ్వను. ప్రస్తుతం నేనూ మీలాగే స్టూడెంట్ ని. ఇక్కడే ఎమ్మెస్సీ చదువుతున్నాను.’’
‘‘ఇంక ఆపేసేయండి’’
‘‘చదువా, కారా?’’
‘‘కారే లెండి. అదిగో ఆ లాండ్రి షాపు దగ్గరాపండి. మా యిల్లు వచ్చేసింది.’’
చిన్నా కారాపాడు. రేఖ దిగి ఎంతో కృతజ్ఞతాభావంతో అంది ‘‘వెరీ మెనీ థాంక్సండీ! వీలు చూసుకుని ఎప్పుడేనా వోసారి మా యింటికి రండి!’’
‘‘అలాగే వస్తాను, మరి గుడ్ నైట్’’ అంటూ కారు స్టార్టు చేశాడు. చీకట్లో అది టార్పెడోలా ముందుకు దూసుకుపోయింది. సరదాలు పులకించిన మనస్సుతో రేఖ గేటువైపు నడిచింది.
* * *
ఖాళీ చేసిన కప్పు టీపాయ్ మీద పెడుతూ అన్నాడు చిన్నా, ‘‘చాలా బాగుంది!’’
‘‘కాఫీయేనా?’’ రేఖ అడిగింది.
‘‘కాదు, ఇలా కాఫీ త్రాగడం!’’ అన్నాడు. సమాధానంగా కళ్ళతో నవ్వింది ఇంకా సిప్ చేస్తున్న రేఖ. చిన్నా ఆమె పెదాల్నీ, కప్పు అంచునీ, అవి స్పృశించే తీరునీ చూస్తున్నాడు. తనాకప్పుకు అంచునైతే ఎంత బాగుణ్ణు అని ఆలోచిస్తున్నాడు.
కాఫీ ముగించి లేచిన రేఖ పిట్టగోడ వేపు నడుస్తూ అంది ‘‘లేచి రండి, ఇక్కణ్ణుంచి వ్యూ కనిపిస్తుంది!’’ ఆలోచన మాని చిన్నా కూడా పిట్టగోడ వైపు నడిచాడు.
‘‘చూశారా! సాయంత్రపు వెలుగులో సముద్రం ఎంత బాగుందో!’’
‘‘చీకట్లో ఇంకా బావుంటుంది!’’
‘‘బలేవారే, – చీకట్లో కనిపిస్తుందేవిఁటీ?’’
‘‘కనిపించదు కాబట్టే బావుంటుంది నాకు.’’
‘‘అదేమిటీ?’’
‘‘సముద్రమంటే నాకు భయం!’’
‘‘మిమ్మల్ని చూస్తే నవ్వొస్తూంది!’’ పళ్ళు బిగిస్తే కళ్ళు నవ్వేయి.
‘‘అవును పాపాయి ఏడుపుకీ, – ఆడదాని నవ్వుకీ వేళాపాళా వుండదుట!’’
రేఖ గలగలా నవ్వి, అతన్ని పసివాడిలా చూసి అడిగింది. ‘‘అయితే తమకి సముద్రమంటే ఎందుకో భయం మరి!’’
‘‘మా నాన్నగారు సముద్రస్నానం చేస్తూ మునిగి చనిపోయారు’’ నిర్లిప్తంగా జవాబిచ్చేడు చిన్నా. దాంతో ఆమె హఠాత్తుగా నవ్వు మర్చిపోయింది. ఆశ్చర్యపోయింది. అతనికి దగ్గరగా వచ్చి జాలిగా అంది.
‘‘సారీ చిన్నా!’’
కాస్సేపు ఇద్దరూ మౌనంగా వుండిపోయారు. తరవాత అతను ఇటుగా తిరిగి చూస్తూ మాట్లాడేడు.
‘‘సముద్రం కంటే ఆ కొండ మీద హాస్పటల్ వ్యూ నాకు చాలా బాగుంది!’
‘‘మీకు బాగానే వుంటుంది. రోజూ చదువు కోసం ఆ యెత్తు యెక్కీ దిగలేక ఆయాసం వస్తూంది. ఎలాంటి చోట కట్టారో చూడండి. ఇంకెక్కడా చోటు దొరకనట్టు!–’’
‘‘దానికేం? ఎత్తుగా, చక్కగా కైలాసంలా వుంది. బాగా ఆలోచించే కట్టారు. ఒక వేళ ఎప్పుడేనా సముద్రం పొంగితే మా నాన్న గార్ని మింగినట్టు అది రోగుల్ని మింగలేదు.’’
‘‘వాళ్ళని సముద్రం మింగదు, ఆ పని చేసేందుకు రోగాలున్నాయి వాళ్ళకి’’
‘‘తప్పు, ‘డాక్టర్లున్నారు’ అనాలి!’’
‘‘మీదే తప్పు! – వాళ్ళు మింగేది రోగుల్ని కాదు, రోగాల్ని!’’
‘‘మరి వాళ్ళని మింగేదెవరు?’’
‘‘వోర్పు! – కాని నేర్పుతో దాన్ని స్వాధీనం చేసుకుంటే మంచి డాక్టరయ్యే అవకాశం వుంది.’’
‘‘అయితే మంచి డాక్టరయ్యే అర్హతకీ ఒక ఆడలక్షణం సంపాదించాలన్నమాట!’’
ఈ మాటకి రేఖ తెలివిగా ఏదో బదులు చెప్పబోయేంతలో చిన్నా చేతివాచీ చూసుకుని త్వరపడ్డాడు.
‘‘నే వెంటనే ఇంటికి చేరాలి. మావఁయ్య ఎదురు చూస్తూ వుంటాడు – వొస్తాను మరి’’ అంటూ కదలబోయాడు.
‘‘ఇంకా ఏడేనా అవలేదు. అప్పుడే యింటికి వెళ్లి ఏం చేస్తారు?’’
‘‘అలా కుదరదు. పంక్చువాలిటీ లేకపోతే మావఁయ్య వూరుకోడు. ఆయన కాలంతో బాటు నడుస్తాడు. ఇవాళ ఆరూ నలభై అయిదుకల్లా యిల్లు చేరకపోతే మావఁయ్య ప్రవర్తన యెలా వుంటుందో నాకు తెల్సు!’’
‘‘మీ మావఁయ్యంటే అంత భయం వుందా?’’
‘‘భయం కాదు – గౌరవం! భక్తి! ఆయనక్కూడ నేనంటే వల్లమాలిన అభిమానం. అందుకే సంసారాన్నంతా హైదరాబాదులో విడిచిపెట్టి, నాకోసం వొక్కడూ ఇంత దూరం వొచ్చేసి, నాతోపాటే వుంటూ నన్ను చదివిస్తున్నాడిక్కడ. నిజంగా నాకు ప్రపంచంలో మనస్సుకు మామయ్యంత దగ్గరపడ్డ వ్యక్తి ఇంకెవ్వరూ లేరు. ఆలోచించి చూస్తే మావఁయ్యలో యేదో వొక తెలియని ఆకర్షణ వుందనిపిస్తుంది.’’
‘‘చిత్రమైన మనిషిలా వున్నారే మీ మావఁయ్య!’’
‘‘అవును. నిజానికి మావఁయ్య చిత్రమైన మనిషి అని వప్పుకు తీరాలి. ఎస్ట్రానమర్ పనిచేసి రిటైరైపోయినా ఆయనలో యింకా ఆ ఛాయలు మిగిలిపోయాయి. సూర్యుణ్ణీ, నక్షత్రాల్నీ పదే పదే గమనించి కాలాన్ని కాగితాల మీద పరుస్తాడు. ఎప్పుడూ ఏవో రకరకాల గీతలు గీస్తాడు. ఏవేవో మీటర్లని పరిశీలిస్తూ ఆలోచిస్తాడు. రోజూ కాలంతో కుస్తీ పడుతూనే వుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మావఁయ్యని కాలానికి బానిస అనాల్సొస్తుంది. అసలు ఆయన కాలాన్ని కొలుస్తాడు. గడియారంలా కాదు – భక్తుడిలా. ఆయనకి కాలమే ‘దైవం’. మావఁయ్య చర్యలో మరీ విచిత్రమనిపించేదొకటుంది – ప్రతి ఉదయం ఆయన తన డ్రాయింగ్ రూమ్ లో టేబిలు మీద వున్న ‘బిగ్ బెన్’ టైంపీసుని అనురాగంతో ముద్దు పెట్టుకుంటాడు! భక్తితో ఆరాధిస్తాడు! అలాగని మావఁయ్యకి పిచ్చి వుందనుకునేరు! అసలు నన్నడిగితే మావఁయ్య కాలం అంశతో పుట్టాడంటాను.’’ మళ్ళీ చేతివాచీ చూసుకున్నాడు. ‘‘మాటల్లో మర్చి పోయాను. ఇక క్షణం ఆలస్యం చేస్తే లాభం లేదు. వెళ్తాను మరి!’’ అతను కదిలాడు. ‘‘అన్నట్టు వచ్చే శనివారం సాయంత్రం అయిదింటికల్లా సిద్ధంగా వుండాలి మీరు. మా ఇంటికి తీసికెళ్లి మావఁయ్యని మీకు పరిచయం చేస్తాను. మర్చిపోకండి! వస్తాను.’’ అంటూ మెట్లు దిగాడు. రేఖ అతన్ని కారు దాకా సాగనంపింది. లోపలికి నడిచే రేఖ ముఖంలో కాంతి రేఖలు, హృదయంలో సంతోషరేఖలు ఉజ్జ్వలంగా ప్రజ్వరిల్లాయి.
విచిత్రమైన ఈ పరిచయానికి ఆమెలో అంబరమంత సంబరం కలిగింది. మంచి చెడ్డలు తెలియని వ్యక్తితో యిలా కలుపుగోలుతనంతో మసలడం, మాట్లాడ్డం మొదలైనవి యిప్పటివరకూ సినిమాలోలాగ అనిపించినా రేఖ విషయంలో మాత్రం యిది పరిమితి దాటడం కాదు. దుష్ప్రవర్తన అంతకన్నా కాదు. ఎందుకంటే, రేఖ స్వతహాగా అతి మంచి అమ్మాయి. చెవులకు రింగులు పెడుతుంది. మంచి చీరా జాకెట్టు కడుతుంది. పమిట సరిగ్గా వేసుకుంటుంది. కల్మషం లేకుండా అందరితోనూ సరదాగా కబుర్లాడుతుంది. చిన్నాకి లాగా ఎవరికేనా చనువిస్తుంది. కాఫీ కూడా ఇస్తుంది. నిరంజనానికైతే హృదయం కూడా ఇచ్చింది. పైగా ఆమె ఒంటరిగా అక్కడికీ యిక్కడికీ తిరగదు. సాధారణంగా నిరంజనం తోడుంటాడు. కాపోతే తెగ మాట్లాడేసే ఒక దురలవాటు మాత్రం రేఖకున్నదని నిరంజనం తరచూ అనుకుంటూ వుంటాడు.
రేఖ చదివే ఆ మెడికల్ కాలేజీలోనే నిరంజనం కూడా స్టూడెంటు. రేఖకి ప్రేమంటే ఎంత యిష్టవోఁ, సరదా కబుర్లంటే అంత ఇష్టం… కనుక ఆమె చిన్నాతో పరిచయాన్ని నిరంజనంతో ప్రేమలాగా గట్టిగా పెంచుకోదలిచింది.
రేఖ గదిలోకి అడుగు పెట్టగానే, ఆమె కోసం ఎదురుచూపులు చూసి చూసి విసుగెత్తిపోయి యీజీ ఛైర్ లో అనీజీగా కూర్చున్న నిరంజనం కన్పించాడు. ఎదురుగ్గా గ్రీకు దేవతలా నిలబడివున్న రేఖని చూడగానే ఎప్పటిలాగే మతిపోయింది. అప్పుడామె అమృతాంజనం రాసినట్లు నిరంజనం నుదుటి మీద తన చేతుల్తో ప్రేమగా నిమిరింది.
రెండ్రోజులకల్లా శనివారం సాయంత్రం రానే వచ్చింది. కానీ వస్తానన్న ప్రకారం చిన్నా రానే లేదు. తెగని నిరీక్షణతో అవస్తపడుతున్న రేఖ మాత్రం అతని రాక కోసం వడిగాపులు పడుతూ బాల్కనీ పిట్టగోడ నానుకుని అలాగే వుండిపోయింది. కానీ ఆ సాయంత్రం అలా వుండిపోలేదు. కాస్సేపటికి సాయంత్రాన్ని తరిమేస్తూ చీకటి వచ్చింది. చీకటితోపాటే రేఖకి విసుగుదలా వచ్చింది. అలా వచ్చిన విసుగుదల మూడ్రోజుల వరకూ పోలేదు. చివరికి మూడోరోజు సాయంత్రం విసుగుతో విసుగెత్తి పోయాక, ఆమె కంటికి దూరంగా రోడ్డు మీద తనింటివేపుగా నడిచివస్తున్న చిన్నా కనిపించాడు. వెంటనే స్నేహంలో బలం శరీరమంతా పాకింది. ఒక్క వుదుటున ఆమె మెట్ల వైపు పరిగెట్టింది. క్షణంలో మేడదిగి క్రిందికి వచ్చి అతన్ని కారిడార్ లో కలిసింది. తీరా అతన్తో ఏదో మాట్లాడబోయేసరికి ఆమెకి కోపం గ్యాపకానికొచ్చింది. వెంటనే ముఖంలో లేని విముఖత తెచ్చి పెట్టుకొని వెనక్కు తిరిగి చకచకా మేడెక్కేసింది. రేఖ చేష్టకి చిన్నా చిన్నగా నవ్వుకుని ఆమెని అనుసరించాడు.
పిట్టగోడ అంచుమీద మోచేతులు మోపి దూరంగా చీకట్లోకి చూస్తూ భావాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్న రేఖ భుజమ్మీద చిన్నా చేయి పడేసరికి గిరుక్కున తలతిప్పి అతని ముఖంలోకి కోపంగా చూసింది. చిన్నా ముఖం చిన్నబోయి వుంది. అతని రెండు కళ్లూ దీనంగా చూస్తున్నాయి. అతనిలో యిప్పుడు పాత గంభీరత లేదు. చీకటి మూలంగా యీ భావాల్ని ఆమె గుర్తించలేకపోయింది.
‘‘కార్లో రాలేదేం?’’ అని అడగాలని మనస్సులో వున్నా తనువంతా ప్రవహిస్తున్న కోపం రేఖని మరోలా మాట్లాడించింది.
‘‘మీరు చెప్పిన శనివారం మూడ్రోజుల క్రితమే వెళ్ళిపోయింది. కాఫీ యీపాటికి బాగా చల్లారిపోయి వుంటుంది. నేను రాదల్చుకోలేదు!’’
చిన్నా చిన్న బాధ నవ్వొకటి విసిరేడు. కానీ అతని చుట్టూరా చీకటి కాబట్టి ఆ నవ్వుకిప్పుడు ప్రయోజనం లేకపోయింది.
‘‘టైమంటే గౌరవం మీ మావఁయ్యకీ, మీకే కాదు. నాకూ వుంది. నేను రాను.’’
థాంక్స్! వస్తావంటారేమోనని భయపడ్డాను. నాకూ శ్రమ తప్పించారు.’’
అతను పిట్టగోడవారనే జూకా మల్లెతీగ వేపు నడిచాడు. ఇప్పుడు లోపలి గదిలోంచి వచ్చే దీపపు కాంతి అతని ముఖంమీద పడింది. కట్టలు తెగిన కోపంతో విసురుగా బదులు చెప్పబోయిన రేఖ వొక్కసారిగా చిన్నా ముఖాన్ని దీపం వెలుగులో చూడగానే నివ్వెరపోయింది. సరదా, చురుకుతనం హరించుకుపోయిన చిన్నా ముఖంలో భావాల్ని సనసన్నగా గ్రహించగానే ఖిన్నురాలైంది. అలా కొత్తగా కనిపించే చిన్నా ముఖాన్ని చూసి తత్తరపడిన రేఖ మెల్లగా దగ్గరికి వచ్చి అంది:
‘‘ఏం జరిగింది?’’
‘‘అనుకున్నది జరగలేదు. మీకు నేనిప్పుడు చెప్పగల్గిందల్లా వొక్కటే, క్షమాపణ!’’
‘‘ఏమిటా జరగనిది?’’
‘‘శనివారం సాయంత్రం మీరు, నేనూ, మావఁయ్య కలిసి కాఫీ త్రాగుతూ కబుర్లు చెప్పుకోవడం.’’ వ్యగ్యంగా అన్నాడు.
‘‘ఇంతకీ ఏం జరిగింది?’’
‘‘మీకీ రెండు ప్రశ్నలే వచ్చుననుకొంటాను!’’
‘‘ముందు జరిగిందేవిఁటో చెప్పండీ!’’
‘‘రెండు రోజులుగా రాత్రీ, పగలూ కష్టపడి ఆలోచించినా మీ యీ ప్రశ్నకి సమాధానాన్ని సిద్ధం చేసుకోలేకపోయాను. నేను చెప్పలేను-’’ అతని గొంతు వొణికింది.
‘‘దయచేసి త్వరగా జరిగిన విషయం చెప్పండి!’’ ఆమె ప్రాధేయపడడంలో కూడా కంగారుంది. అతను తలతిప్పి ఆమెకేసి చూశాడు.
‘‘టైంపీసు పోయింది. ఘోరం జరిగిపోయింది.’’ అతనిలో కరిగి పోయిన గంభీరత అంతా కన్నీరై కట్టలు తెగి ప్రవహించింది.
చిన్నా భుజం మీదికి తల జార్చుకుని నిశ్శబ్ధంగా లోలోపలే గుండె పగిలేలా ఏడుస్తున్నాడు. రేఖకి జరిగేదంతా అగమ్యగోచరమైంది. అసలు విషయం చెప్పలేక చిన్నా ఎందుకిలా పసివాళ్ళా ఏడుస్తున్నాడో ఆమెకర్థం కాలేదు. అయినా అతని పరిస్థితికి జాలి వేసింది. నిశ్శబ్ధం ఆసరాతో రెండు క్షణాలు కష్టపడి అతను ఏడుపు నిలదొక్కుకున్నాక మళ్ళీ పాత ప్రశ్నే అడిగింది:
‘‘ఏం జరిగింది?’’
‘‘మావఁయ్య చచ్చిపోయాడు.’’ అతను నిశ్చలంగా జవాబిచ్చేడు. ఇప్పుడతడు ఏడవకుండా ఎందుకో నిశ్శబ్ధంగా వున్నాడు – ఒకవేళ గుండె పగిలే రోదనలో కన్నీళ్ళన్నీ ఖర్చైపోయాక ఏర్పడిన నిశ్శబ్ధమేమో అది!
ఊహించని అతని సమాధానం విన్నాక చలించిపోయిన రేఖ వొణికే పెదాల్తో అతి కష్టం మీద ‘‘ఎలా పోయారు?’’ అని మాత్రం అనగలిగింది.
కోల్పోయిన గంభీరతని కూడదీసుకుంటున్నట్లు చిన్నా మాట్లాడేడు:-‘‘కొన్ని నిజాలు తల్చుకుంటే నిజంగా నవ్వు వస్తుంది. ఆలోచిస్తే వాటిలో మావఁయ్య పోవడం కూడా వొకటేమో అనిపిస్తుంది. అసలు చనిపోవడానికి ముందు ఆయన ప్రవర్తన ఎంతో వింతగా తోచింది నాకు. ఆ రోజు మీతో కాఫీ త్రాగి యింటికి వెళ్ళేసరికి దేనికోసమో ఇల్లంతా కంగారుగా వెతుకుతూ కనిపించాడు మావఁయ్య. ఏమిటని అడిగితే రోజూ తను ఆరాధించే బిగ్ బెన్ టైంపీసు కనిపించడం లేదన్నాడు. నేను చూశానేమోనని అడిగాడు. నేను చూడలేదు. ఆ మాటే చెప్పాను. అయినా ఆ గడియారం మావఁయ్య ఆరోప్రాణం అని నాకు తెలుసుననీ నేను దానిని తాకడానికైనా సాహసించననీ ఆయనకు తెలుసు. అప్పుడప్పుడు క్లబ్బులకీ, మీటింగులకీ గనక వెడితే దాన్ని కూడా తనతోబాటే తీసుకువెడతాడు. అదంటే ఆయనకంత ప్రాణం. దానికోసం ఇద్దరం రెండు రోజులు ఇల్లంతా వెతికినా అంతుచిక్కలేదు. చివరకి ఆ గడియారం పోయిందని నిర్ధారణ చేసుకున్నాక మావఁయ్య ఎంతగానో దిగులు పడిపోయాడు. నాకు అలాగ మావఁయ్యని చూసేసరికి మొదటిసారిగా ఆయన మీద జాలి వేసింది. చివరికాయన – ‘‘వొరే చిన్నా! నా టైంపీసు పోయిందిరా! నా సర్వస్వం పోయిందిరా-’’ అని బెంగపెట్టుకున్న చంటి పిల్లాడిలా బావురుమని ఏడిచాడు. ఆ క్షణం మావఁయ్య పడ్డ బాధ ఎంతటిదో నాకు తెల్సు. ఇంగ్లండులో బిగ్ బెన్ కంపెనీ అంతా సొంతం చేసి పెట్టినా, స్విడ్జర్లండంతా రాసిచ్చినా కూడా తీరే బాధ కాదది. ఎంతో ప్రయత్నించి కూడా నేనాయన్ని వోదార్చలేకపోయాను. మావఁయ్య బాధనీ, భావాల్నీ అప్పుడే నేను ఆఖరిసారిగా చదవగలిగాను. ఆ రోజంతా ఆయన తిండీ నిద్రాలేకుండా ఎండిపోయాడు. తీరని మనస్తాపంతో కృశించిపోయాడు. పిచ్చివాడిలా తను కాగితాల గీతల్లో మలిచిన కాలాన్ని చించి పోగులు పెట్టాడు. తెల్లారాక చూస్తే తడికళ్ళతో డ్రాయింగు రూములో ఆ గడియారం లేని ఖాళీ టేబిలు మీద ప్రాణాలు వొదిలేసి కనిపించాడు. ఆయన మీదపడి నేను చాలా సేపు ఏడ్చాను. ఏం లాభం? గతించిన కాలంలాగే మావఁయ్యా తిరిగి రాలేదు. కాలమే మావఁయ్యనలా కాలం చేయించడంతో నాకప్పుడు కాలచక్రం ఆగిపోయినట్టనిపించింది. ఏమయితేనేం – టైంపీసు పోయింది. మావఁయ్యా పోయాడు.’’
సముద్రం మీద పేరుకున్న చీకటిలోకి నిరామయంగా చూస్తూ మాట్లాడుతున్న చిన్నా ఒక్కసారి ఆగి రేఖ వైపు చూశాడు. ఆమె ముఖంలో విషాదాశ్చర్యాలు కూడుకుని వున్నాయి.
‘‘తీరా చూస్తే నిన్న ఆ టైంపీసు కార్లో బేక్ సీటు వెనుకనున్న విండోలో కనిపించింది. హఠాత్తుగా దాన్నక్కడ చూసేసరికి నాకు మతిపోయింది. ఏడుపొచ్చింది. దాని మీద ఎక్కడలేని కోపం వచ్చింది. నాకోసం ఎంతగానో తాపత్రయ పడేందుకు మిగిలివున్న ఒక్క వ్యక్తినీ దూరం చేసి అది నన్ను నిస్సహాయుణ్ణి చేసింది. ఇక ఆ పాడు గడియారంలో టైం చూసుకోవడానికి అసహ్యం వేసింది. భరించలేక ఒళ్ళు తెలియని కోపంలో దాన్ని ముక్కలు ముక్కలుగా చితగ్గొట్టి డ్రెయినేజీలో పారేశాను!’’ ముగించాడు.
రేఖ యిదంతా కళ్లప్పగించి వింది. విన్నాక ఆమె కళ్ళు ఇప్పుడు చెవుల్లా మాటలు వినాలనే ప్రయత్నంలో చూస్తున్నట్లున్నాయి. ఆమె పెదాలు కదలిక మాని నిద్రపోతున్నట్లున్నాయి. అలా వున్న రేఖ ముఖాన్ని రెండు క్షణాలపాటు చూశాక, చిన్నాలో మళ్లీ బాధ కదిలింది. అలాంటి ‘బాధలో చిన్నా’ని రెండు క్షణాలు చూశాక రేఖ హృదయం ఎనలేని జాలితో రెపరెపలాడింది. అప్పుడు రేఖ మెల్లిగా వోదార్చే ధోరణిలో ‘‘పోనీండి చిన్నా! – జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడిక బాధపడి ఏం ప్రయోజనం చెప్పండి! దయచేసి నాకోసమైనా అలా బాధపడ్డం మానేయండి. మీ బాధను చూస్తూ నేను సహించలేను!’’ అంది.
‘‘మరి నా వంటరితనాన్ని చూస్తూ?’’ దీనాతిదీనంగా అడిగాడు. అతని ప్రశ్నలో కోరిక మిళితమై వున్నా కొట్టొచ్చినట్లు కనబడే ద్వైదీభావం దాన్ని కప్పేసింది. మగాడి ముఖంలో ధైర్యం బాగున్నంతగా దైన్యం బాగుండదు కనుక రేఖ ఆ చూపులికి తట్టుకోలేకపోయింది. మనస్సు విచక్షణని నిర్లక్ష్యించడంతో ‘‘నేనుండగా మీరు వంటరివారెలా అవుతారు?’’ అని వూరడించింది. వూరడించేటప్పుడు అతని భజమ్మీద చెయ్యి కూడా వేసింది. అప్పుడు చిన్నా క్రమంగా స్తిమితానికి రాగల్గేడు.
* * *
ఆ మర్నాటి నుండీ ఇద్దరి పరిచయం బలంగా మారి వాళ్ళ మనసుల్లో శ్రద్ధగా పునాదులు నిర్మించడం మొదలుపెట్టింది. ఆ సందర్భంలో వారిరువురూ రేఖ యింట్లో బాల్కనీ పిట్టగోడ అంచున ఎగబాకిన జూకా మల్లెతీగ సరసన ‘సరసమైన’ సరదా కబుర్లెన్నో చెప్పుకోడం చాలాసార్లు జరిగింది.
ఒకరోజు అదే ప్రదేశంలో, రేఖతో చిన్నా – ‘‘జూకా మల్లెపువ్వులు బావుంటాయి’’ అన్నాడు. మరుసటి రోజు – ‘‘జూకా మల్లెపువ్వులు మీ ఎడమ జెడలో ఇంకా బావుంటాయి’’ అన్నాడు. తరువాత రోజు మీ చెవులకి ‘‘రింగులకంటే జూకాలు బావుంటాయి’’ అన్నాడు. ఆ తరువాత రోజు – ‘‘జూకాలు పెట్టుకోండి, బావుంటారు!’’ అన్నాడు – మర్నాడు – ‘‘మీకు పాలపిట్ట రంగు పువ్వుల చీరె బావుంటుంది రేఖా!’’ అన్నాడు. తరువాత ‘‘నీ పేరు తియ్యటి పేరు సుమా!’’ అన్నాడు. వీటితో రేఖ మనస్సులో సంతోషం సంబరంగా గంతులు వేసింది. మరుసటి సాయంత్రం వాళ్లిద్దరూ బీచికి వెళ్లి కెరటాల గురించి మాట్లాడుకున్నారు. ఓరాత్రి సినిమాకి వెళ్ళి, సినిమాలో మనుషులు ఆలస్యంగా ఒళ్ళో చేరతారని, ఇంకా ఆలస్యంగా ప్రేమించుకుంటారనీ, జోక్ గా మాట్లాడుకుని నవ్వుకున్నారు.
క్రమంగా ఇలా చిన్నా, రేఖల చనువు ఆడదాని తొలి యవ్వనంలా శీఘ్రగతిని యేపుగా పెరిగిపోయింది. ఈ సంగతి నిరంజనానికి చూచాయగా తెలిసినప్పటికీ అతనామె సమక్షంలో అలవాటు ప్రకారం ప్రేమ తప్ప మిగతావన్నీ మరచిపోయే వాడు, కాబట్టి యిబ్బంది లేకపోయింది.
ఇలా వుండగా చిన్నా వొకరోజు రేఖతో మాటల సందర్భాన మళ్ళీ మావఁయ్య గురించి మాట్లాడేడు.
‘‘ఇంతకీ మావఁయ్య తాలూకు పెద్ద నిజం నిన్న తెలిసింది నాకు. అప్పుడు నేను చాలా పొరపడ్డాను.’’ ఆమె భుజాలు చూస్తూ అన్నాడు.
‘‘పొరబడటం ఏమిటి?’’
‘‘అవును, పొరబాటే! మావఁయ్య చనిపోవడం గురించి నేనూహించినదంతా నిజం కాదు. నిన్న పాత పుస్తకాల మధ్య ఆయన డైరీ కనిపిస్తే తీసి చదివాను.’’
‘‘చదివితే?’’ ఆమె ఆతృతగా అడిగింది. ‘‘ఏం తెలిసింది నీకు?’’
చిన్నా ఇందాకట్లాగే చూస్తూ చెప్పాడు –
‘‘ఏమిటా మావఁయ్యకో చిత్రమైన గతం వుంది. నేననుకున్నట్లుగా ఆయన ప్రేమించిది కాలాన్ని కాదు, కామాక్షిని!’’
రేఖ దిమ్మెరపోయింది.
‘‘కానీ కాలంలాగే కామాక్షి కూడా తిరిగి మావఁయ్యని ప్రేమించలేదు. ఆయన్తో బాగా పరిచయాన్ని పెంచుకున్నాక తను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నట్టుగా చెప్పిందట. పాపం, పిచ్చి మావఁయ్య ప్రేమంటే అదేనేమో అనుకున్నాడు. కాని కామాక్షి అది స్నేహం అని చెప్పిందట. అసలింతకీ పిటీ ఏమిటంటే, చివరికంత మోసం జరిగినా కూడా మావఁయ్య ఆమెని తనింకా ప్రేమిస్తూనే వున్నట్లు డైరీలో రాసుకున్నాడు. రాసుకోవడమే కాదు, ప్రాణాలు వదిలేవరకూ అంతర్గతంగా ఆమెని ప్రేమించాడు. ఇంతకీ డైరీలో నేను గ్రహించిన నిజవేఁమిటంటే ఆయన ప్రాణాలు తీసిన బిగ్ బెన్ టైంపీసుని మావఁయ్యకి ఆవిడే పెళ్ళికానుగ్గా ఇచ్చిందట-’’
దిమ్మెరపోయిన రేఖ బొమ్మైపోయి వింది. నెమ్మదిగా తేరుకున్నాక అంది. ‘‘ఆశ్చర్యంగా వుంది!’’
‘‘కాదు మరీ!’’ అని చిన్నా అన్నాడే గాని నిజంగా రేఖ అలా ఆశ్చర్యపడినందుకు గల కారణం అతనికి తెలీదు.
మరో పావుగంట సేపతను రేఖతో కబుర్లు చెప్పాడు కాని ఆమె అంతరంగం దీర్ఘాలోచనకి లోబడి పోవడం వల్ల, రేఖ చిన్నా మాటలన్నింటిని భౌతికంగా మాత్రమే వినగలిగింది. చివరికి గుడ్ నైట్ చెప్పి చిన్నా వెళ్ళిపోయాక ఏదో కొత్త చైతన్యం వొంట్లో ప్రవేశించినట్లయింది రేఖకి. అప్పుడు జూకా మల్లెతీగ వైపు నడిచి చేతివేళ్ళతో సుతారంగా తీగ ఆకుల్ని విరుస్తూ ఇలా ఆలోచించింది.
ఆలోచించిన కొద్దీ తనకి విపరీతమైన భయం వేస్తోంది. చిన్నా జీవితం అతని మావఁయ్య జీవితాన్ని పోలగలదేమోనని. ఒకవేళ చిన్నా గాని తన్ని ప్రేమించే వుద్దేశ్యంతో వున్నట్లయితే…? ఈ అనుమానం నిజం కావటం తప్పకుండా నిజం కావచ్చు. అయినా చిన్నా తన్ను ప్రేమిస్తున్నాడని తనెందుకనుకోవాలి. ఏమో! ఒకవేళ ప్రేమిస్తున్నాడేమో? అమ్మో! ప్రేమిస్తే, ఇంకేమైనా వుందా? నిరంజనం? తన ప్రేమంతా దోచుకున్న నిరంజనం? తనకి బాగా తెలుసు. ప్రేమకి అనుభవం కంటే వున్నతస్థానం లేదని, తన విషయంలో అది నిరంజనం దగ్గర మాత్రమే వుంది. మరిప్పుడు చిన్నా తన్ను ప్రేమిస్తే తనేమిటి చెయ్యడం! ఏమిటో? ఏమీ తోచకుండా వుంది… అసలు తను చిన్నాతో అంత చొరవగా ప్రవర్తించడమే దీనికి కారణమేమో… అయినా తను మాత్రం ఏం చెయ్య గలదని? పరిచయం కాస్తా తననీ అన్నీ మరిచిపోయేలా చేసి చిన్నా చిద్విలాసానికి సరదాకబుర్లకి తన్ను ఆకట్టివేసింది. అప్పుడు చిన్నా తన అందాన్ని గూర్చి ఎంతో గొప్పగా మాట్లాడుతుంటే కళ్లముందు ఎంత వున్నతంగా కన్పించాడు? స్త్రీకి తన అందం గురించి గొప్పగా మాట్లాడే మగాళ్ళంతా అలానే కనిపిస్తారు కాబోలు?! ఎందుకో పూర్తి విషయం తెలుసుకోకుండా అతన్ని మరోలా అర్థం చేసుకుని తప్పటడుగు వేశానేమోననిపిస్తుంది. నిజమేనేమో! ఎందుకంటే ‘‘తక్కువ తెలుసుకోవడం, ఎక్కువ అర్థం చేసుకోవడం ఆడవాళ్ళ సహజ లక్షణం’’ అని నిరంజనం తనతో ఓసారి చెప్పినట్లు గ్యాపకం కూడా. ఏమైనా ఇక చేయగలిగిందల్లా వొక్కటే- వచ్చే నెలలో నిరంజనంతో నిశ్చయమైన తన పెళ్ళి గురించి రేపే చిన్నాకి విశదం చేసి, అతని స్నేహానికి శాశ్వతంగా గుడ్ బై చెప్పడం మంచిది. కానీ- ఎలా చెప్పేది? ఇన్నాళ్ళు మావఁయ్య పోయాక తనే మావఁయ్యంత ఆసరా అనుకున్నాడు. ఇంకా యేమనుకుంటున్నాడో ఏమో.., పిచ్చి చిన్నా! ఇంతకీ రేపు తను అతనికి గుడ్ బై ఎలా చెప్పగలదు? చెప్పి అలవాటు లేని అతని జాలిచూపులకి తను మళ్లా ఎలా సిద్ధపడగలదు? పోనీ ప్రయత్నించి సిద్ధపడితే? ఏమనుకుంటాడో? ఏమనుకుంటాడూ, విపరీతంగా బాధపడుతాడు. వాళ్ల మావఁయ్య పోయినప్పటిలా భుజమ్మీదకి తల జార్చుకుని ఏడుస్తాడు. చివరికి తన్ను హృదయమూ, సంస్కారమూ లేని స్త్రీగా జమకడతాడు. అమ్మో! వీటన్నిటికీ, తనెలా సిద్ధపడటం? ఏమైనా ప్రేమనీ చక్కటి ముందు జీవితాన్నీ జీవితమంతా కలసి బ్రతకడానికీ ఎన్నిక చేసుకున్న నిరంజనాన్నికేవలం చిన్నా స్నేహం కోసం తను వదులుకోలేదు. ఏమైనా సరే, రేపే తను చిన్నాకి గుడ్ బై చెప్పేయాలి. ఆ రాత్రి ఎన్నో కలలు – ఎన్నో ఆలోచనలు రేఖ నిద్రని మొదటిసారిగా పాడుచేశాయి.
* * *
ఆవాళ చంద్రుణ్ణి మేఘం చాటుచేయకపోయినా బీచిలోవెన్నెల
కురవటం లేదు. రాబోయే అమావాస్యకి సూచనగా ఆకాశం మధ్యగా వున్న వెన్నెల కురవని చంద్రుడు రేఖలా వున్నాడు.
బీచ్ లో చిన్నా పక్కన కూర్చున్న రేఖ మాత్రం చంద్రుడు లేని సముద్రంలా వుంది. వాళ్ళిద్దరూ చలా సేపట్నుంచీ ఏదో మాట్లాడుకుంటున్నారు.
‘‘ఏమిటి రేఖా! – ఈరోజు హుషారేం లేకుండా అలా వున్నావేం?’’
‘‘వెన్నెల్లేదుగా?’’
‘‘హుషారుగా వున్నప్పుడల్లా వుంటోందేమిటి వెన్నెల?’’
‘‘చుట్టూ లేకపోయినా మనస్సులో వుండేది. ఇవాళ మనస్సులో కూడా లేకుండా పోయింది.’’
‘‘ఎక్కడవీ బరువు మాటలు!’’
‘‘వేళాకోళం కాదు చిన్నా! నిజం. నేనిప్పుడెంత బాధపడుతున్నానో నీకు తెలీదు. ఏమని చెప్పను, నాకెలా మాట్లాడాలో తెలీకుండా వుంది.’’
‘‘పోనీ ఏం మాట్లాడాలో తెలుస్తోందా?’’
‘‘అది తెలిసిందనే, నా బాధ – తెలీకపోయినా బాగుండేది.’’
‘‘నీకు నాలా మాట్లాడ్డం అలవాటై పోయింది. ముందు సంగతేవిఁటో చెప్పు రేఖా!’’
రేఖ తలతిప్పి అంది ‘‘ఇక మీదట నేను నీ వొంటరితనానికి తోడుగా నిలిచే అవకాశం లేదు చిన్నా.’’
‘‘అంటే?’’
‘‘ఏం చెప్పేది చిన్నా!, కొద్ది రోజుల్లోనే నీకు నేను దూరమైపోతున్నాను. నాకు పెళ్ళి కాబోతూంది. ఏమిటో నాకంతా బెంగగా వుంది!’’ అని రేఖ తప్పనిసరిగా మాట్లాడవలసొచ్చినట్లు ఆగి ఆగి చెప్పింది.
ఇది వింటూనే చిన్నా విరగబడి నవ్వేడు – ఎలాగైతేనేం ఇన్నాళ్ళకి ఒక గొప్ప జోక్ చేశావే! ఇంతా చేసి ఇదా సంగతి, ఈ మాత్రానికే అర్థం కాకుండా ఇలా బాధపట్టం దేనికీ ‘‘హేవ్ మై హార్టీ కంగ్రాట్స్’’ అన్నాడు.
వూహించని ఈ జవాబుకి రేఖ చకితురాలై చూసింది. చిన్నాలో ఎంతో బాధనూహించిన మనస్సు భరించశక్యంగాని దిగ్ర్భాంతితో గిజగిజలాడింది. తన మాటల్లో భావం అతనికర్థం కాలేదేమోనని మళ్ళీ అంది. ‘‘కాదు చిన్నా, నేను లేకపోతే ఇక నీ మీద శ్రద్ధ చూపేందుకెవరు తోడుంటారన్నదే నా బెంగ!’’
‘‘అదా నీ వుద్దేశం! భలేదానివే రేఖా! నీ అమాయకమైన అభిమానానికి థాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియకుండా వుంది. నువ్విలా బెంగపడే అవసరం లేకుండా ఏర్పాటు ఎప్పుడో జరిగిపోయిందిలే.’’
‘‘ఏమిటదీ?’’
‘‘ఇంకేమిటీ – పెళ్ళి! నిన్ననే హైదరాబాదునించి వుత్తరం వొచ్చింది. వచ్చే నెలే నిశ్చయం అయింది. మావఁయ్య అభిమానానికి కృతజ్ఞతగా ఆయన కూతుర్ని జీవితాంతం నామీద శ్రద్ధ చూపేందుకు సెలక్టు చేసుకున్నాను. ఈ విషయం ముందు నేనే చెబుదామనుకుంటుండగా, బాధంటూ వంకబెట్టి నీ పెళ్ళి సంగతే ముందు చెప్పేశావు!’’ అంటూ లేచి నిలబడ్డాడు. ఇది విన్న రేఖ లేవడం మర్చిపోయింది. చిన్నా చెయ్యి వూతగా యిస్తూ – ‘‘పద పోదాం! ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది.’’ అన్నాడు. అయినా రేఖ కదలిక లేకుండా అలాగే కూర్చుని వుంది.
‘‘లే, లే! – పెళ్ళి గురించి తర్వాత ఆలోచించుకుందువుగాని లే. రేపే నా ప్రయాణం. బజార్లో నాక్కాస్త పనివుంది. త్వరగా వెళ్ళాలి.’’
నువ్వెళ్ళు చిన్నా, ఇక్కడ నాకింకా కాస్సేపు కూర్చోవాలనుంది. నేను తరువాత వెడతాను!’’ హతాశ అయిన రేఖ పెదాలు అస్తవ్యస్తంగా వణికేయి.
‘‘ఏం, నిరంజనంగాని వస్తానని చెప్పేడేవిఁటి? పెళ్ళికి ముందు ప్లెజర్ టాక్ ప్రోగ్రాంలా వుంది. జాగ్రత్త, వర్షం రాగలదు. నేనిక వెడతాను. వెళ్ళి మళ్ళీ ఇన్విటేషన్లో గ్యాపకం చేస్తాను – మీ యిద్దరూ తప్పకుండా రావాలి సుమా – వస్తాను – గుడ్ బై!’’ అని యిసకలో కంగారుగా వొంగి వొంగి అడుగులు వేస్తూ కారు వేపు కదిలిపోయాడు చిన్నా.
కాస్సేపటికి నిరంజనం రాలేదు. కాని వర్షం మాత్రం వచ్చింది.

0 0 0

1 thought on “పరవశానికి పాత(ర) కథలు – సయొనారా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

April 2022
M T W T F S S
« Mar   May »
 123
45678910
11121314151617
18192021222324
252627282930