March 30, 2023

బెంగ

రచన: – కర్లపాలెం హనుమంతరావు

తెల్లవారింది. మెలుకువ వచ్చినా లేవబుద్ధి కావడంలే. ఈ మధ్యనే ఈ గొడవంతా.
ఇంటిల్లిపాదీ నిద్దర్లు లేచేవేళకి అన్నీ అమర్చి పెట్టడం అత్తగారు నేర్పిన విద్య. తు. చ తప్పకుండా పాటిస్తూ వచ్చా ఇప్పటిదాకా. కొంపలు కూలిపోతాయా వక్కరగంట ఆలీసమైతే.. అనిపించడం.. ఇదిగో ఈ మాయదారి అనుమానం మొదలయినప్పట్నుంచే !
రాత బావో లేక నేను గాని చచ్చిపోతే? పాలు లేక పిల్లలు, బెడ్ కాఫీల్లేక ఆయనగారు కూడా చచ్చిపోతారా?
నవ్వొచ్చింది నా పిచ్చి ఊహకి నాకే.
మళ్లీ రోగం మాట గుర్తుకొచ్చి మూడ్‌ ఖరాబయింది. చేతివేళ్లు చూసుకున్నా. నిన్నటికీ ఇవాళ్టికీ తేడా ఉందా?.. లేదా? ఉన్నట్లూ ఉంది. . లేనట్లూ ఉంది. . ఇదో గోల !
నా వేళ్లు సన్నగా నాజూగ్గా ఉంటాయంటారంతా. ఇప్పుడు అట్లా లేవు. కణుపుల చుట్టూ ఉబ్బుతున్నాయి రోజు రోజుకీ.
టీవీలోనో ఎక్కడో విన్నా.. అట్లాంటి వాపులు గాని మొదలయితే కుష్ఠు వ్యాధిలాంటిదేదో వస్తుందని ! నాకా దిక్కు మాలిన రోగం చుట్టుకుంటుందా ? లేచినా, కూర్చున్నా.. పడుకున్నా, నిండా పనిలో ఉన్నా.. అదే పీకులాట పొద్దస్తమానం.
శాయిబాబా గుడి దగ్గర చూస్తుంటా.. కాళ్ల దగ్గరా చేతుల్దగ్గరా వేళ్లు తెగి.. కరిగిపోతూ పరమ వికారంగా కనిపిస్తారు కుష్ఠు రోగులు. వట్టి వాపులూ.. మచ్చలూ ఉన్న మనుషుల్ని చూస్తేనే కడుపు దేవినట్లుంటుంది. ఆ దరిద్రమే నాకూ తగలబోతుందో ?
ఈ మధ్య ఈ అంటురోగం గురించి చాలా సమాచారమే సేకరించా. అదేదో చర్మానికి సంబంధించిన రోగంట.. సవాలక్ష కారణాలున్నాయంటుందో పత్రికలో డాక్టరు.
ఏం డాక్టర్లో.. ఏం పాడో! వంట చేసేటప్పుడు పోపు గింజలు చిట్లి చేతులు మీద పడచ్చు. కళపెళలాడే అన్నం గిన్నె మూత వట్టి చేత్తో లాగినా ఆవిరి కొట్టొచ్చు. కాలే కాలే గంజి వేళ్ల మీద పడ్డా, బట్టలుతికే సర్ఫునీళ్లలో చేతులు ఆట్టే సేపు నానబెట్టినా, ఖర్మ బాలేకపోతే కీళ్ల దగ్గరిట్లా పొడలూ పాడూ రావడం కద్దు. అట్లాగని ఆడంగులం.. ఆ మహాతల్లెవరో చెప్పిందని ఇంటి పన్లు మానుక్కూర్చోగలమా ?
వాకిట్లో ఏదో అలికిడయింది. ఆయనగారు తలుపు తీసినట్లున్నారు.
పనిపిల్ల సుబ్బులనుకుంటా! ఎంత పొద్దులో లేస్తారో ఈ పనివాళ్లు!.. పాచి కసువు వూడ్చే పనికైనా పడుతూ లేస్తూ వచ్చేస్తారు! నాకే.. ఈ పనికిమాలిన బద్ధకం పట్టుకుంది. . కొత్తగా.
పాలగిన్నె స్టవ్ మీద పెట్టి అంట్ల పనిలో పడ్డట్లుంది సుబ్బులు. కొంపలో అంతలేసి అలికిళ్లవుతున్నా పడక దిగబుద్ధవడం లేదు ! మరీ బద్ధకిస్తే ఆయనగారికెక్కడ డౌటొస్తుందో! బలవంతాన లేచి బాత్ రూములోకి దూరిపోయా.
అక్కడా అవే పిచ్చాలోచనలు ! ఆయనగారేవీ పట్టించుకోరు కనక సరిపోతుంది. తనకి ఈ రభసంతా తెలిస్తే? కుష్ఠు పెళ్లాంతో కాపురం చేస్తాడా ఎంత శ్రీరామచంద్రుడయినా ?
నిజంగానే ఈ పొడలు ఏ కుష్ఠు వల్లనో అయితే ? నా బిడ్డల గతి? ఆ దిగులే మరీ రోజు రోజుకీ నన్నిట్లా మింగేస్తోంది.. రోగం కన్నా ముందే !
ఈ వాపులూ అవీ ఏ ఆవిరో తగిలి తగలడ్డవని సరిపెట్టుకో చూస్తానొక్కోసారి. ఆ రోజు పెందలాడే పడక దిగబుద్ధవుతుంది. పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఇష్టమైనవేమైనా చేసి పెట్టడం.. ఆఫీసు నుంచి ఆయనగారొచ్చీ రాగానే ఏ వేడి వేడి పకోడీతోనో పడగొట్టడం.. రోజంతా మహా ఉల్లాసంగా గడిచిపోతుందట్లాగే !
తెల్లారేసరికల్లా యధాప్రకారం మూడ్ ఖరాబ్! దాంతో బల్లిలా మళ్లీ మంచానికతుక్కు పోవడం!
మనసు మొరాయించే రోజులే ఎక్కువవుతున్నాయీ మధ్య మరీ. ‘ఇవి కుష్ఠుపొడలే! ఏ పోపు గింజల్లాంటి వాటి వల్ల వచ్చినవి కావు. నిజం ఒప్పుకోడానికి వణికి చస్తున్నావు’ అంటూ వెక్కిరింతలకు దిగుతుందీ దిక్కుమాలిన మనస్సు. దాంతో మళ్లీ వళ్లు మండిపోవడం.. ఆ మంటంతా ఇంట్లో గిన్నెలూ చెంబుల మీద చూపెట్టడం ! చేతికేదీ అందకపోతే చిన్న పిల్లలమీద ప్రతాపం !
తప్పేం జరిగిందో తెలీక పాపం ఆ పిచ్చి కుంకలు చెంపలు వాయగొట్టే నన్నే పట్టుకుని ‘ అమ్మా.. అమ్మా’ అంటూ లుంగలు చుట్టుకు ఏడుస్తుంటే ఏం చెయ్యాలో పాలుపోని దుస్థితి నాది. . ఆ నిస్సహాయ స్థితిలో ఏం చేశానో ఆనక తెలిసి.. కొట్టిన బిడ్డల్నే ఒళ్లోకి లాక్కుని నేనూ ఘొల్లుమని ఏడ్చేయడం తప్పించి.
ఎన్నోసార్లు జరుగుతుందీ సీను ఇంట్లో.. ఈ మధ్యన మరీ ఎక్కువయింది! ఇంచక్కని నా సంసారంలో ఈ చిచ్చును పెట్టిందెవరో ? ఎందుకనో?
పనిపిల్ల సుబ్బులు ఈ పొడలూ అవీ పసికట్టిందంటే కొంప మునిగిపోతుంది. పనికి రాంరాం చెప్పేస్తుందేమో కూడా! ఈ పనోళ్లకే ఎక్కళ్లేని పుక్కిటి పురాణాలు కావాలి.. కాలక్షేపానికి ! ఇది ఊరూ వాడా.. ఉన్నదీ లేందీ కల్పన చేసి మరీ టముకేసేస్తే.. పేపరేసే కుర్రాడైనా ఇంటి ఛాయలకి వస్తాడా ?
పెళ్లిళ్లూ పేరంటాలంటే ఎట్లాగో తగలడనీ! ఏమీ ఎరగని పసిబిడ్డలని సాటి పిల్లలు ఆటల్లోకి రానీయకపోతే.. !
బిగపట్టుకున్న ఈ ఏడుపు నింకెంత కాలమని తొక్కి పట్టడం ? తెరలు తెరలుగా దుఃఖం తన్నుకొస్తుంటే.. బాత్ రూంలోనే గుండె బరుమ దించేసుకున్నా. ఒక నిశ్చయాని కొచ్చేశాక గాని. మనసు తేలికయింది కాదు నాకు.
అసలేదీ నిర్ధారణ కాకుండా ఎవరి కంటా పడకూడదింక. వీలున్నంత దాకా పిల్లల్తో, ఆయన్తో దూరం పాటించాలి. . తప్పదు ! ఏదో వంక చెప్పి ఇంకో రెండొందలు ఆశపెడితే సుబ్బులే సగం ఇంటిపని నెట్టుకొచ్చేస్తుంది. . నేను గుట్టు కాస్త దాచుకు తిరగాలంతే !
దేవుఉన్నాడో లేడో తెల్సుకోడం కష్టం కాదేమో కానీ, , తనకీ మాయదారి అంటురోగం తగులుకుందో లేదో తేల్చుకోడమే కష్టంగా ఉంది. ఇహనన్నా ఓ క్వాలిఫైడ్ డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. ఉన్నది దాచకుండా చెప్పేసి అనుమానం తీర్చేసుకుంటే చిటికెలో తేలిపోతుందీ వ్యవహారం మొత్తం. . అటో.. ఇటో!

***

ఇవాళ.. నడుం కిందక్కూడా ఆ పొడలు పాకుతున్నట్లు కొత్తగా అనుమానం బైలుదేరింది. మూడ్ మరింత పాడై పక్క అసలు దిగబుద్ధే కావడంలేదందుకే.
ఆదివారం అవడం చేత ఆయనగారు తీరిగ్గా పేపరు తిరగేస్తున్నారు. ఎదుటి బల్ల మీద కాఫీ కప్పు! సుబ్బులు గాని కలిపిచ్చిందేమో!
“అమ్మా, లేమ్మా పాలే! ‘ బుల్లిపాప తగులుకుంది. . ఎప్పుడు లేచిందో పిల్ల రాక్షసి! ఎప్పుడూ దీనికి పాల గోలే! రేపు నే పోయిన్తరువాత ఎట్లా బతికి చస్తారో ఈ అబ్బా బిడ్డలంతా !
బుల్లిపాపను వెనక్కు తోసి కాగితాల్తో ఏవో పడవలు ఉద్ధరించే బాబిగాడి మీద పడ్డా “ఎప్పుడూ ఆ వెధవాటలేనట్రా ! చెల్లాయినట్లా బైటికి తీసుకెళ్లు కాస్సేపు ! టిఫెన్‌ రడీ చేసి పిలుస్తా.. అప్పుడొచ్చి మింగుదురు గానీ అందరూ ! ”
నా అరుపులకు జడిసినట్లున్నాడు పాపం.. బుల్లిపాపతో సహా బైటకు పరిగెత్తాడు బాబిగాడు చెంగుచెంగుమని ఎగురుకుంటో.
కుళ్లూ కల్మశమెరుగని ఆ పిల్లల లోకంలోకెళ్లి పోతే ఎంత బాగుణ్ణో ! సంసారం, సన్యాసం అంటూ రొచ్చులో పడ్డమే మమషుల మనసుకు పట్టుకున్న పెద్ద అంటురోగం! అసలీ మాయదారి లంపటం పిల్లలూ, మొగుడూ ! లేకుంటేనేం? వీళ్ల వల్ల కాదూ.. ఈ రోగాలూ రొచ్చులూ. . బతుకంతా న్యూసెన్సులూ !
బైటకి అనడం లేదు గానీ.. ఈ మధ్యన మరీ పిచ్చి పెచ్చి ఆలోచనలు పెచ్చుమీరుతున్నాయి! పిల్లకాయల మైల గుడ్డలూ, ఎకడెక్కడ ఏం కలబడి కొంపకొస్తారో ఈయనగారి అంటుబట్టలూ.. వీటి వల్ల మాత్రం ఎందుకు రాకూడదా ఈ మహమ్మారి అంటురోగం!
“ఇట్లాంటి జబ్బులు అట్లాంటి పన్ల వల్ల రావమ్మా! అట్లాగయితే ప్రతింట్లో కుష్ఠురోగులుండాలిగదా?” అని డాక్టర్లిట్టే కొట్టి పారేస్తారని తెలుసు. అయినా వదలదు మనసుకు పట్టిన అనుమానపు ముసురు. అనుమానం పెనుభూతం. ఆ భూతం సైజు పెరిగే కొద్దీ రోగమూ పెరుగుతున్నదనిపిస్తోంది. రోగం ముదిరే కొద్దీ మనసులోని బెంగా అడ్డూ ఆపూ లేకుండా బెదరగొట్టేస్తుంది.
అన్నీ తెలుస్తూనే ఉన్నాయి నాకు! అందుకే ఆయనగారి దగ్గర బైటపడంది కూడా. బైట పడ్డా “డాక్టర్ల ఫీజులు దండగ” అని తేల్చేసే రకం.
ఈ సంసారం పాడూ ఏమీ లేకుండా పోతేనే.. ప్రాణానికి సుఖం. ఆయన్నీ, పిల్లల్నీ ఏ దొంగలో వచ్చి ఎత్తుకు పోతే బావుణ్ణు! ఏ పెద్ద రోగమో వచ్చి అంతా ఒక్కసారే కొట్టుకు పోయినా తెరిపే ! ఈ రోగానికింకేం థెరిపీలు.. గిరిపీలు అక్కర్లేదు ! ఇల్లంతా తూనీగలా తనొక్కతే చక్కర్లు కొట్టేయచ్చు.. అచ్చు హైస్కూలు రోజుల్లో ఫ్రెండ్సందరితో కల్సి పిక్నిక్కెళ్లినంత కిక్కు !
“ఢామ్ !.. ఢామ్ ఢామ్ !… డ్.. డడ్డడ్.. ఢామ్.. ఢామ్.. ఢామ్ ! ! !
ఉన్నట్లుండి పెద్ద పెద్ద శబ్దాలు!. . ఎక్కడ్నో.. ఏవో.. పేలిపోతున్నట్లు!..
ఎవర్నో.. ఎవరో.. పేల్చేస్తున్నట్లు !
ఎక్కడా? ఆ శబ్దం వస్తోందెక్కణ్ణుంచీ? నా ఇంటి ముందేనా ! నా వాకిట్లోనేనా.. ఆ పేలుళ్లన్నీ!
బాబిగాడిందాకే బైటికి పరుగెత్తాడు. . బుల్లిపాప చెయ్యికూడా పట్టుకు పరుగెత్తాడు !
గుండె దడదడలాడింది. ఒక్క ఉదుటున పక్క మీంచి లేవబోయా!.. ఏం చేస్తున్నానో.. ఏమంటున్నానో.. ఏ ధ్యాసా లేదు.. ఒక్క పిల్లల మీదే బెంగంతా !
“మన బాబీగాడు.. మన బుల్లిపాప.. అయ్యో! అయ్యయ్యో! ముందు పిల్లల్ని లోపలి కీడ్చుకురండీ! ఎవరూ కదల్రేం ! ఎంతకూ పరిగెత్తరేం ? మీర్రాక పోతే నేనే పోతా.. నా పిల్లల కోసం.. నేనే పోతా.. నా బంగారాలు.. నా రత్నాలు. . నా వజ్రాలు.. నా వైఢూర్యాలు.. నా బిడ్డలు.. నాక్కావాలి ముందు.. .. నాక్కావాలి.. ”
బైటికే కాబోలు నేను పరుగెత్తుతుంట. .
ఆయనగారు అమాంతం పరుగెత్తుకుంటూ వచ్చి నా జబ్బలు ఒడిసి పట్టుకున్నారు. అరుస్తున్నారు బిగ్గరగా “ఏంటిది మధూ ! ? ఎక్కడికా పరుగు.. పిచ్చి దాన్లా?.. అట్లా ఎందుకోయ్ పరిగెత్తేది ? వర్షం పడ్డది గదా రాత్రంతా ! ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయుంటుంది. అందుకేలే ఆ చప్పుళ్లన్నీ.. ”
“కాదయ్యా !.. ఈ బజార్చివరిల్లు.. కలప కొట్టాయన.. శేషయ్య నాయుడున్నాడు చూడు.. నిన్న రాత్రి పొయ్యాడాయన. కుష్ఠురోగంతో. . పొయ్యి సుకపడ్డాడు సామీ!.. కాటికి తీసుకుపోతా ఉండార్సార్ ఈ ఈది గుండానే ! పీనుగ పొయ్యే జాతర్లటప్పుడు ఆళ్లలో ఇట్లాగే పేలుస్తారండయ్య పెద్ద పెద్ద టపాసులు.. బాంబులూ.. అవీ.. మా భారీగా !.. ”
” బాంబులా? పేలుస్తారా ? ” మరింత బెంబేలయింది నాకు!
ఇంతలో.. ” అమ్మా! బాంబే.. పేలిందే.. ఢాంఢాంఢామ్మని పేలిందే ! బాబీగాడు.. చచ్చిపోయాడే.. అక్కడ.. ఇట్లాగా.. ” అంటూ తల అరచేతులు మీద వాల్చేసుకుని నాలుక బైట పెట్టి మరీ చచ్చిపోయినట్లు నటించించేసింది.. అప్పుడే లోపలికి పరుగెత్తుగొచ్చిన బుల్లిపాప.
చెల్లెలు వెనకాలే ఫెళఫెళా నవ్వుల్తో బాబిగాడు కూడా ! ఆ భడవా పొట్ట చేత్తో పట్టుకుని పకపకా నవ్వేస్తుంటే.. నిజం చెప్పొద్దూ.. ఉడుకుమోత్తనంతో చచ్చే ఏడుపొచ్చేసింది నాకు.
“వెధవల్లారా! అసలే బెంగతో నే హడలి ఛస్తుంటే నన్నూరికే చెదరగొడతార్రా! ఉంఉండి!.. చంపేస్తానివాళ.. ఉండండక్కడే.. ” అంటూ నిజంగా చంపటానికే అన్నంత ఉక్రోషంగా ప్రక్క మీంచి లేవబోయా. . తూలి పడబోయా.
గభాల్న ఆయనొచ్చి పట్టుకోకపోతే.. నిజంగా బొక్కబోర్లా కూడా పడుండేదాన్ని కూడా !
నన్ను మంచం మీదకు మళ్లీ నిదానంగా చేరుస్తూ “మధూ, వూరుకో! ఏంటిది మరీ ? పిచ్చిదానివై పోతున్నావ్ రోజు రోజుకీ ! పిల్లల్ని చూడు.. ఎట్లా బెదిరిపోయారో ! ” అంటూ ఏమిటేమిటో అంటున్నారు. అంటూనే నా ముఖం మీద పడ్డ వెంట్రుకలను సుతారంగా పైకి సర్ది దువ్వుతున్నారు.
తన నులి వెచ్చని ఆ మెత్తని కొత్త స్పర్శకు ఇంతకాలం బట్టి మనసులో గడ్డకట్టుకుపోయున్న పెనుదుఃఖమంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నట్లు.. కంటి నుంచి వరద ప్రవాహంగా జారుతూ చెక్కిళ్లను తడిపేస్తుంటే.. నిస్త్రాణగా ఆయనగారి భుజమ్మీదలాగే సోలిపోయి ఎక్కిళ్లు పెట్టేస్తున్నా నేను !
ఆపకుండా ఏడ్చేసే నన్నట్లాగే కొద్దిసేపు యధేచ్ఛగా ఏడవనిచ్చి ఆనక వీపుమీద నిదానంగా నిమురుతో “బాగా భయపడుతున్నావు గదూ ! కాస్సేపిలాగే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో ! ఒక విశేషముంది.. దాంతో అన్ని బెంగలూ అవే మబ్బుతెరల్లాగా తొలిగిపోతాయి మధూ!” అన్నారీయన మృదువుగా.
ఎంత బోళాతనం ! నాకు దాపురించిన మాయరోగం సంగతి ఇన్నాళ్లయినా పసిగట్టలేని పిచ్చితనం! ఇకపై దాచే శక్తి నాకు లేదు. కడుపులో పేరుకుని ఉన్నదంతా ఏడుస్తూనే బైటికి కక్కేశా.. ఆ ఎకిళ్ల మధ్యనే నా గుండెల్లోని బరువంతా దింపేసుకొంటూ !
నాకొచ్చిన రోగమేదో చెప్పి.. “కుష్ఠురోగమేమోనని బెంగగా ఉందండీ!.. పిల్లలూ… మీరూ… లేకుండా.. నేను.. నేను ఒక్క క్షణమైనా బతకలేనండీ.. చచ్చిపోతా.. రోగం ముదరిపోకముందే చచ్చిపోతా కచ్చితంగా.. కుష్ఠురోగమే గానీ నిజంగా దాపురించిందంటే !.. ”
నా నోటిని తన అరచేత్తో సుతారంగా మూసేస్తూ ఆయనగారన్నారూ ” పిచ్చి మధూ ! నాకంతా తెల్సు ! నువ్వట్లా పద్దాకా నా పక్కనే పక్కలో పడి కలవరింతల మధ్య కుళ్లి కుళ్లి ఎందుకేడుస్తున్నావో.. ఆ మాత్రం అర్థం కానంత మొద్దు కాదులే నీ ముద్దుల మొగుడు. కోవిడ్ వంకతో నిన్నీ మధ్య టెస్టులకని తీసుకెళ్లా.. గుర్తుందా ?.. నిజానికవేవీ కోవిడ్ టెస్టులు కావు. డెర్మటాలజిస్టులంటే చర్మవ్యాధి వైద్య నిపుణులు. వాళ్లు కోవిడ్ టెస్టులెప్పుడూ చెయ్యరు.. ”
చివాలున తలెత్తి విస్మయంగా ఆయన ముఖంలోకి చూశీ నమ్మలేనట్లుగా !
సాభిప్రాయంగా తలూపుతూ “నిన్నే వచ్చాయి రిపోర్టులన్నీ. ప్రిస్కిప్షన్సిచ్చారు. ఆ మందులేవీ కుష్ఠుక్కావు. శీతపైత్యం వల్ల కొంతమందికిట్లా కొంతకాలం కీళ్లు వాయడం మామూలేనంట ! బెంగపడద్దు మొద్దూ!. . ఇచ్చిన మందులు వేళకు వేసుకో. చాలు తగ్గిపోతయ్యన్నీ ! పెందలాడే పడక దిగి పిల్లలకి కడుపు నిండా పాలు, మొగుడి మొహానకిన్ని కాఫీ నీళ్లు పొయ్యి! ఇంకా పెందలాడే తగ్గిపోతయ్ ఈ వాపులూ.. తీపులూ.. బెంగలూ.. అన్నీ ! ” అన్నారాయన చిర్నవ్వులు చిందిస్తూ.

***

3 thoughts on “బెంగ

  1. మాలిక కు మనసారా ధన్యవాదాలు !

  2. అనుమానం పెనుభూతం అంటారు. అది ఆడవాళ్ళలో కాస్త ఎక్కువే అనుకుంటా. చక్కగా రాశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

April 2022
M T W T F S S
« Mar   May »
 123
45678910
11121314151617
18192021222324
252627282930