March 30, 2023

వెళ్ళాం! వొచ్చాం!

రచన: జె. యు. బి. వి. ప్రసాద్‌

“ఓ వరలక్ష్మొదినా! పనిలో వున్నావా?” అంటూ పార్వతి, పెరటి గోడ మీద నుంచి, పక్కింటి పెరట్లోకి చిన్న కేక పెట్టింది.
“పనెప్పుడో అయిపోయింది. ఒక కునుకు కూడా తీసి, లేచి, కాఫీ తాగేశాను. మీ అన్నయ్య గారు ఇంకా శయనాగారం లోనే వున్నారు. ఎప్పుడు పిలుస్తావా? – అని ఎదురు చూస్తున్నాను ఇందాకట్నించీ!” అంటూ ఒక్క పరుగున ఆ గోడ దగ్గిరికి వొచ్చేసింది, నేస్తం వరలక్ష్మి.
“మేం వచ్చే నెల్లో అమెరికా వెళ్ళబోతున్నాం!” అంటూ కడుపులో ఉగ్గబెట్టుకున్న మాటను చెప్పేసింది పార్వతి.
“అబ్బా! భలే! మీ అబ్బాయి దగ్గిరికేగా? హాయిగా వాళ్ళ దగ్గిర కొన్నాళ్ళు వుండి రండి, నువ్వూ, అన్నయ్య గారూ! భలే!” అంటూ సంతోషించింది వరలక్ష్మి.
“మరే! మా పిల్లాడూ వాళ్ళు ఇక్కడికి వొచ్చి, ఎన్నేళ్ళయిందో! మా మనవడు పుట్టిన యేడాదికి వచ్చారు. నాలుగు రోజులున్నారంతే! మిగిలిన రోజులన్నీ ఈ దేశం అంతా తిరిగారు. మళ్ళీ రాలేదు. ఆ తర్వాత మనవరాలు కూడా పుట్టేసి, మూడేళ్ళయింది. ఎప్పుడూ ఏవో పనులంటారు. ఇండియా రమ్మని మేము అడుగుతూ వుంటే, మమ్మల్నే అక్కడికి రమ్మన్నారు!” అంటూ పార్వతి మురిసిపోతూ చెప్పింది.
“పోనీలే! ఇన్నాళ్ళకి కొడుకుని చూడబోతున్నావు! చాలా సంతోషం! నేనెప్పుడూ చూడలేదు మీ కోడల్ని. ఆ పిల్ల, చేపలూ అవీ తింటుందని చెప్పావు కదా?”
నవ్వింది పార్వతి. “అవును లక్ష్మీ! అవడానికి మన వాళ్ళే అయినా, ఆ పిల్ల అమెరికా లోనే పుట్టి పెరిగింది కదా? అక్కడి అలవాట్లే వొచ్చాయా పిల్లకి. తెలుగు కూడా చాలా తప్పులతో, కష్టపడి మాట్లాడుతుంది, నాతో అవసరం వొస్తే. లేకపోతే మొత్తం ఇంగ్లీషే! ఆ పిల్ల ఇష్టం ఆ పిల్లది! నేనేం చెయ్యగలన్లే? మా వాడు, ఆ పిల్లని అక్కడే కలిసి, ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. తెలుసులే నీకు. వాడు అప్పుడప్పుడు ఆవు మాంసం కూడా తింటాడట! వాణ్ణి పెళ్ళికి ముందే ఆ తిండికి కావలిసినట్టుగా మార్చుకుంది. మేం ఆ పెళ్ళికి వెళ్ళలేక పోయాంగా? అప్పుడే మీ అన్నయ్య గారికి ఒంట్లో బాగోలేదు. అలా జరిగిపోయింది! వాడు సంతోషంగా వుంటే చాల్లే – అనుకున్నాం” అని లక్ష్మికి తెలిసినవన్నీ చెప్పుకొచ్చింది పార్వతి కాస్త నిరాశగా.
ఈ అత్తగారికి ఆ కోడలితో తెలుగులో ముచ్చట్లు చెప్పుకోవాలని కోరిక! అదెప్పుడూ తీరదాయే!
“గతం గతః! ఎప్పటివో తవ్వకు! ఇప్పుడు వెళ్ళి, మీ కోడలికీ, మీ మనవలకీ కూడా తెలుగు నేర్పి రా! ఎన్నాళ్ళుంటావు అక్కడ?” అనడిగింది వరలక్ష్మి.
“ఆర్నెల్లు చాలని మేం అనుకున్నాం గానీ, మా వాడు, కనీసం ఒక యేడాదన్నా వుండాలంటున్నాడు, ‘ఇన్నాళ్ళకి ఇంత దూరం వొస్తున్నారు కదా?’ – అన్నాడు. మీ అన్నయ్య గారు కూడా, ‘అలాగే’ అనేశారు. అంత కాలం ఇల్లు వొదిలి వెళ్ళాలంటే, కష్టంగా వుంది లక్ష్మీ!” అంది పార్వతి కాస్త దిగాలుగా.
నవ్వింది వరలక్ష్మి. “నీ దిగులంతా నీ పెరట్లో మొక్కల గురించేగా? నేను రోజూ నీళ్ళు పోస్తూ, బాగా చూసుకుంటాలే. ఇదే, నీకు నా ప్రమాణం!” అంటూ నవ్వుతూ, గోడ మీద నించి పార్వతి చేతిలో చెయ్యి వేసి, చెప్పింది వరలక్ష్మి.
పార్వతి బాగా నవ్వింది. “మొక్కలే కాదు లక్ష్మీ, నీకు కూడా దూరంగా వుండాలి. రోజూ మాట్లాడకపోతే, తోచదాయే!” అంది దిగులుగా.
సంతోషించింది వరలక్ష్మి ఆ మాటలకి. “ఇప్పుడలాగే అంటావు గానీ, రోజూ ఫోనులో పలకరించ లేవా? అమెరికా వెళ్ళాక, ఆ మోజుతో, మనవల మురిపాలతో, నేను అసలు గుర్తే రానులే నీకు!” అని నవ్వుతూ హాస్యం చేసింది గోడ నేస్తం. మళ్ళీ వెంటనే, “అమెరికా ప్రయాణం అంటే, చాలా ఖర్చుతో కూడిన పని కదా? మీ అబ్బాయి డబ్బు పంపిస్తున్నాడా?” అని చనువుగా అంది.
“ఎందుకు అడుగుతావు తల్లీ? వాడు, ‘నేను టికెట్లు పంపిస్తానూ, ఇన్స్యూరెన్సూ, వీసా, మొదలైన ఏర్పాట్లవీ మీరే చేసుకోండీ!’ అన్నాడు. మీ అన్నయ్య గారు, ఒప్పుకోలేదు. ‘వొద్దులేరా! డబ్బు కావలిస్తే నిన్నే అడుగుతాం కదా? టికెట్లు మాత్రం నువ్వెందుకు? నేనే అన్నీ చేస్తాలే’ అన్నారు. కొడుకు దగ్గిర్నించీ డబ్బు తీసుకోవడం ఈయనకి ఇష్టం వుండదు. ‘మనకి లేకపోతే కదా? ప్రతీ దానికీ పిల్లల మీద ఆధార పడడం ఎందుకు?’ అన్నారు. నేనూ ఒప్పుకున్నాను. ఆయనకి పెన్షన్ వొస్తూ వుంటుంది. ఇప్పటికీ ఆయన, పిల్లలకి ప్రైవేట్లు చెబుతూ కొంత సంపాదిస్తున్నారు. నేనూ నా సంగీత పాఠాలతో, ‘వేణ్ణీళ్లకి చన్నీళ్ళన్నట్టు’ ఏదో వెనకేస్తున్నాను. సొంత ఇల్లే కదా? ఖర్చులూ తక్కువే! మా ఖర్చు తోనే వెళుతున్నాం! ఇప్పుడు మా ప్రైవేట్లు అన్నీ ఆగిపోతాయి యేడాది పాటు!” అని వివరంగా చెప్పుకొచ్చింది పార్వతి.
ఎప్పుడూ ఆ పలకరింపులు గోడల మీదే. ఆ నేస్తాల మాటలు, అలాగే చాలా సేపు సాగాయి. “గోడ అరిగి పోతుందేమో!” అంటుంది పార్వతి చాలా సార్లు.

* * *

‘ఆగదు ఏ నిమిషము నీ కోసమూ’ – అని సినిమా కవులు అనేది చాలా నిజం! బొత్తిగా ఆగదు కాలం. ఎంత వేగమో దానికి! “కాస్సేపుండవే, వొస్తున్నాగా!” అని ఏ దేశాధ్యక్షుడు చెప్పినా చందమామ వినదాయే! చందమామ, భూమి చుట్టూ గిర్రున తిరగడం ఎంత సేపు!
అలా చూస్తుండగానే ఒక అమెరికా సాయంత్రం పూట, ఆ దేశం నేలపై కాలు పెట్టేశారు, యాభై రెండేళ్ళ పార్వతీ, ఆవిడ భర్తగారైన యాభై ఎనిమిదేళ్ళ పరంధామయ్యా! ప్రయాణం బాగానే సాగింది. పార్వతికి ఇంగ్లీషు రాదు గానీ, పరంధామయ్యకి బాగానే వొచ్చు. ఎటొచ్చీ, అమెరికన్ యాస అర్ధం చేసుకోడానికి కాస్త ఇబ్బంది పడతాడు, అంతే.
“మన మూర్తి వొచ్చాడా? మీకు కనపడ్డాడా?” అని అడిగింది పార్వతి ఆదుర్దాగా చుట్టూ చూస్తూ, ఇద్దరూ ఇమిగ్రేషన్, కస్టమ్స్‌పూర్తి చేసుకుని బయటకు రాగానే.
అక్కడ ఎంతో మంది తమ ఆప్తుల కోసం ఎదురు చూస్తూ నించుని వున్నారు. ఆ ఆప్తులలో తమ కొడుకు కోసం చూశారా తల్లిదండ్రులు. కనపడలేదు మరి! ఏం పనిలో వుండి పోవలిసి వచ్చిందో!
అప్పుడే, పార్వతీ, పరంధామయ్యా అంటూ వీళ్ళ పేర్లే వున్న ఒక బోర్డు పట్టుకుని నిల్చుని వున్న ఒక మెక్సికన్ మనిషిని, పరంధామయ్య చూశాడు. ఇంగ్లీషు మాట్లాడ్డం రాని పార్వతి, ఆ పేర్ల బోర్డు మీద కొంచెం కొంచెంగా చదవడం తెలిసి, ‘పార్వతి’ పేరు చదివి, భర్త వేపు ఆత్రుతగా చూసింది.
“వుండూ, అడుగుతాగా!” అంటూ పరంధామయ్య ఆ మెక్సికన్‌వున్న చోటికి వెళ్ళాడు.
“ఈ పేర్లు గల మనుషులు మీరేనా?” అని అడిగాడు ఆ బోర్డు మనిషి, అమెరికన్ మెక్సికన్ యాసలో.
ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు ఇంగ్లీషు బాగా వొచ్చిన పరంధామయ్యకి. కానీ, అతని చేతుల కదలిక వల్లా, బోర్డు వేపు చూడడం వల్లా, కాస్త అర్ధం చేసుకున్నాడు. “యెస్” అని జవాబు ఇచ్చాడు.
“పాస్‌పోర్ట్‌! పాస్‌పోర్ట్‌!” అన్నాడా మెక్సికన్ వీళ్ళ వేపు చూస్తూ.
పరంధామయ్య, పాస్‌పోర్టులు చూపించాడు. ఆ మెక్సికన్, వాటిలో వున్న పేర్లని చూసి, ఆ మనుషులు వీళ్ళే అని నిర్ధారణ చేసుకుని, “కం, కం!” అంటూ, వాళ్ళ సామాను బండి తోసుకుంటూ అక్కణ్ణించీ బయలు దేరాడు.
అతని వెనకాలే వీళ్ళూ, అసలు విషయం అర్ధం కాని ఆదుర్దాతో! తమ సామాన్లు ఎత్తుకు పోతున్నాడేమోనని కొంచెం భయ పడ్డారు కూడా. అయితే, ఆ మెక్సికన్, పాపం చాలా మంచివాడి లాగే కనపడ్డాడు. వీళ్ళని తన టాక్సీ దగ్గిరికి తీసుకు వెళ్ళి, సామానులు ట్రంకులో, అదే డిక్కీలో, పెట్టి, టాక్సీ వెనక తలుపు తెరిచాడు వీళ్ళని లోపలకి ఎక్కమంటూ!
అప్పటికి పరంధామయ్యకి కాస్త అర్ధం అయింది, ఇతను ఒక టాక్సీ డ్రైవరు అనీ, తమని, తమ కొడుకు ఇంటికే తీసుకు వెళతాడనీ! కొడుక్కు రావడం కుదరక, టాక్సీ డ్రైవరుని పంపాడని బాగా అర్ధం అయింది. సంతోషిస్తూ, భార్యతో ఆ మాటలే చెపుతూ చూశాడు. అయినా, దారంతా బిక్కు బిక్కు మంటూనే వున్నారు వీళ్ళు, దేశం కాని దేశం మరి, ఆ డ్రైవరు తమని ఎక్కడికో తీసుకు పోయి, హత్యలు చేసి, తమ డబ్బూ, సామాన్లూ, ఒంటి మీద వున్న కాస్త బంగారం దోచేసుకుంటాడేమో – అని! అలాగే ఉగ్గ బెట్టుకుని కూర్చున్నారు.
ఒక గంట ప్రయాణం తర్వాత, వాళ్ళని ఒక ఇంటి దగ్గిర, సామానులతో సహా దించేసి, తుర్రున వెళ్ళిపోయాడా డ్రైవరు వేరే బేరం కోసం. అతని జీవన యానం అతనిదీ! ‘బతికేశాం’ అని చిరునవ్వులతో ఆ గుమ్మం ముందుకు వెళ్ళి, కాలింగ్ బెల్లుని గుర్తు పట్టి, దాన్ని నొక్కారు. ఎవరూ తలుపు తీయలేదు. బైట తాళం కప్ప లేదు. అయినా, తలుపులు తెరుచుకోవేం? వసంత కాలం రాబోతున్నా, బయట చలి గానే వుంది. తమ సామానుతో ఆ గుమ్మం దగ్గిర మెట్ల మీద కూర్చున్నారు ఇద్దరూ. అలాగే గంట పైనే గడిచింది. పరంధామయ్య ఒణుకుతూ అలాగే నిద్రకి కూడా వొరిగాడు.
“ఇంట్లో వుండరా? ఈ ఇల్లు కాదా?” అని పార్వతి ప్రశ్నలు!
అప్పుడే ఒక కారు ఆగింది, ఆ ఇంటి డ్రైవ్‌వేలో. అందులోంచి, కోడలూ, మనవలూ దిగారు.
“అప్పుడే వొచ్చేశారా! పిల్లలని డే కేర్‌నించి తీసుకు రావడంలో కొంచెం ఆలస్యం అయింది. రండి, రండి” అని ఇంగ్లీషులో మావగారితో అంటూ, తలుపుల్లోకి తాళాన్ని నొక్కి తలుపు తీసింది.
మనవలిద్దరూ ఈ పెద్ద వారిని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, దూరంగా నిలబడ్డారు. ఈ పేరెంట్సు, తమ సామాన్లు తామే మోసుకుంటూ ఇంట్లోకి నడిచారు.
మేడ మీద కొన్ని గదులు! కింద భాగంలో కొన్ని గదులూ, హాలూ, వంటిల్లుతో సహా! కోడలు, వీరికి కింది గదుల్లోనే ఒక గది చూపించి, “మీరిద్దరూ ఈ గది వాడుకోండి. రేపు క్లీనర్లు వొస్తారు. అప్పుడు ఈ గది శుభ్రం చూస్తారు” అంది.
పార్వతి తెల్లబోయింది. “ఇప్పటికే శుభ్రం చేయించి వుంచొచ్చుగా? వస్తామని తెలుసుగా?” అంది భర్తతో.
ఆ గది అశుభ్రం గానే వుంది. మంచం మీద పక్క అంతా చెదిరి పోయి వుంది. అక్కడ వున్న బల్లల మీద చాలా దుమ్ము! కింద కార్పెట్ మీద ఏవేవో కాయితం ముక్కలు! కోడలిని చీపురు కోసం అడిగితే, గేరేజీ అంతా వెదికి ఒక చీపురు ఇచ్చింది. పార్వతి గభాల్న నడుం వొంచి, అదంతా ఊడుస్తోంటే, పరంధామయ్య సామానులు సర్దాడు.
“పిల్లల పడకలు ఎక్కడమ్మా?” అని కోడల్ని అడిగాడు.
“కింది గదుల్లోనే అంకుల్!” అంది కోడలు.
రాత్రయ్యింది, కొడుకు వొచ్చేప్పటికి. అప్పటికి వీళ్ళు, స్నానాలవీ చేశారు. ఆ అమెరికా ఇంట్లో, ఆ సదుపాయాలతో బాగానే కష్ట పడ్డారు. కోడలిని అడగడానికి ప్రతీ సారీ మొహమాటం! అందరూ భోజనాలకి కూర్చున్నారు.
తమ ప్లేట్లలో కోడలు పెట్టిన సాండ్‌విచ్‌లు చూసి, ఏమీ అనలేక పోయారీ తల్లిదండ్రులు.
“రేపట్నించీ వంట నేను చేస్తానమ్మా!” అంది పార్వతి తన తెలుగు ఇంగ్లీషులో. కోడలు నవ్వి తలూపింది.
“వొద్దులే మమ్మీ! పిల్లలు నీ వంటలు తినరు!” అన్నాడు కొడుకు.
“నువ్వు తిను నాన్నా!” అంది తల్లి.
మర్నాటి నించీ వంటల చోట పార్వతి చక చకా తిరిగింది. అట్లు పోస్తే, ఎవ్వరూ తినలేదు. మర్నాడు ఉప్మా కూడా అంతే. రవ్వా, పిళ్ళూ లాంటి కొన్ని సరుకులు ఇండియా నించి తెచ్చుకుంది.
అప్పుడప్పుడు, కోడలు, మాంసమో ఏదో తెచ్చి, స్టౌ కాడికి వచ్చి, “కొంచెం చూడు!” అనేది తెలుగులో. భోజనాల తర్వాత, ఆ గిన్నెలు తోమ వలిసి వొచ్చేది, పార్వతికి! డిష్‌వాషరు, అన్ని గిన్నెలూ అంత బాగా తోమి చావదు. ఒక రచయిత్రి ఒక కధలో రాసినట్టు, “ప్రపంచంలో ఇన్ని అంట్లు వుంటాయనే తెలీదమ్మా!” అనే పరిస్తితే పార్వతిదీ అయింది. బైట తోమ వలిసినవే డజన్ల కొద్దీ చేరాయి. అప్పటికీ పరంధామయ్య కొన్ని పనులలో సాయం చేస్తూనే వున్నాడు.
“రండిరా! మీకు తెలుగు నేర్పుతాను” అంటూ మనవలని పార్వతి పిలిచింది, రెండో రోజే.
ఈవిడ అన్నది వాళ్ళకి అర్ధం కాకపోయినా, దగ్గిరికి వచ్చారు. అది చూసి, కోడలు, “వాళ్ళకి తెలుగు వొద్దు ఆంటీ! మీరే ఇంగ్లీషు నేర్చుకోండి” అంది వచ్చీ రాని తెలుగులో.
కంగు తింది అత్తగారు. కొడుకు వేపు చూస్తే, అతను ఇదేమీ పట్టించు కోకుండా టీవీ చూడ్డంలో మునిగి వున్నాడు. కోడలి మాటే కొడుకు మాట కూడా – అని ఆ తల్లిదండ్రులికి అర్ధం కావడానికి రెండు రోజులే పట్టింది. ఆ కొడుకు దేనికీ పట్టించు కోడం లేదు, దేనికీ మాట్లాడం లేదు. అడిగితే చెపుతాడు! పిలిస్తే, పలుకుతాడు!
“పిల్లలకి సంగీతం పాటలు కొంచెం నేర్పుతానమ్మా?” అంది అత్తగారు. తనే మళ్ళీ, “మేం యేడాది పాటు ఇక్కడే వుంటాంగా? రోజంతా ఇంట్లోనే వుంటాగా? యేడాదిలో, కొన్ని కీర్తనలు రావచ్చు” అంది కోడలితో మూడో రోజు.
“నో నో నో! వాళ్ళని పియానో క్లాసులో పెడతాను!” అందా కోడలు.
ఇక అత్తగారు నోరు తెరవలేక పోయింది ఆ రోజు. మర్నాడు అంది, “పియానో అయితే యేం? ఇంట్లో నేను నేర్పేది నేను నేర్పుతాగా?” అంది. కోడలు మౌనం. జవాబు లేదు.
పిల్లలు దగ్గిరికి చేరతారు. నవ్వుతారు. పాట ఎత్తితే, “నో! మమ్మీ నాట్ అగ్రీడ్‌” అంటారు.
వీళ్ళు ఇండియా నించి తెచ్చిన తెలుగు పిండి వంటలు వారం దాటినా చెల్లలేదు. అరిసెల్ని కొడుకు బాగా తిన్నాడు. ప్రతీ సారీ కోడలు నవ్వింది. పిల్లలు నువ్వు చిమ్మిలి తిన్నారు గానీ, జీళ్ళు చప్పరించ లేదు.
కోడల్ని తినమని మామగారు అంటే, “వొద్దు అంకుల్! అలవాటు లేక, మా అందరికీ హెల్త్‌రూయిన్‌అవుతుంది. మీరే తినండి” అని ఇంగ్లీషులో మళ్ళీ మళ్ళీ చెప్పింది.
ఆ మాటలన్నీ నెమ్మదిగా భార్యకి అనువాదం చేసి చెప్పాడా భర్తగారు. ఎంత బాధ పడ్డా, “పాపం, వీళ్ళ తిళ్ళు వేరు కదా? వీళ్ళ తప్పేం వుంటుంది? మనకి నచ్చని వాటిని మనం తినగలమా?” అనుకుంది పార్వతి.
వీళ్ళు వెళ్ళిన మూడూ, నాలుగు రోజులికి ఆ కోడలు అత్తగారితో, “రేపట్నించీ పిల్లల్ని డే కేర్‌కి పంపడం లేదాంటీ! మీరిద్దరూ ఇంట్లోనో వుంటారుగా? కాస్త చూసుకోండి. అసలు వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకుంటారు. ఏదయినా అవసరం వొస్తేనే, మీరు కాస్త చూడండి చాలు! డే కేర్‌కి ఎందుకు అనవసరంగా డబ్బు పోయడం?” అంది ఇంగ్లీషులో.
ఆ మాటలకి అనువాదం పని పరంధామయ్యది! తెల్లబోకుండా వినే పని పార్వతిది! ఈవిడ నిజంగా సంతోషించింది. పిల్లలకి తెలుగులో మాట్లాడ్డం నేర్పెయ్యాలని.
ఈ పిల్లల్లో, పిల్లకి మూడేళ్ళు. పిల్లాడికి నాలుగేళ్ళు. వీళ్ళు, వాళ్ళకి వాళ్ళు చేసుకునే శుభ్రం చూస్తే, పార్వతికి తల తిరిగి పోయేది. తుమ్మడమో, దగ్గడమో అయిపోయాక, అప్పుడు టిష్యూ పేపర్‌కోసం పరిగెడతాడు పిల్లాడు, నేల మీద చిందులు పడ్డాక! పిల్ల అయితే, బాత్‌రూమ్‌లోకి పోయి వస్తుంది, పొడి పొడి పాదాలతో! ఒక్కో సారి చెప్పులతో! ఒక్కరూ రుమాలు వాడరు.
“నాయనమ్మ అనండి! తాతయ్యా అనండి!” అంటే వినరు. “గ్రాండ్‌మా, గ్రాండ్‌పా!” అంటారు.
నాయనమ్మకి చేతిగుడ్డ నడుముకీ, తాతయ్యకు జేబు లోనూ! చేతి గుడ్డలు వీళ్ళిద్దరికీ బాగా అలవాటే. పిల్లలకి కొత్త రుమాళ్ళిచ్చి వాడుకోమంటే, వాళ్ళు నవ్వులతో, “వేస్ట్‌, వేస్ట్‌!” అని వాటిని ఎగరేస్తారు.
పిల్లల పడకలు, నెలల పిల్లల దగ్గిర్నించీ కింది గదుల్లోనే నట! వాళ్ళ మొహాలు, పైన గది లోకి కెమేరాలతో కనపడతాయట!
తల్లి, కొడుకుతో అంది ఒక సారి, “బాబూ! పైన రెండు గదులు వున్నాయి కదా? పిల్లల్ని పైన రెండో గదిలో పెట్టుకుంటే, మీరు అప్పుడప్పుడూ చూసుకోవచ్చు” అంది.
“అమ్మా! అవన్నీ పట్టించు కోవద్దు మీరు. ఈ కల్చర్ మీకు తెలీదు” అన్నాడు.
తల్లి నోరెత్తలేక పోయింది.
* * *

పొద్దున్నే లేచి, వంటింట్లో పనులు చేసుకుంటూన్న వరలక్ష్మికి, పక్కింట్లో ఏవో చప్పుళ్ళు వినబడి, గబ గబా భర్తని లేపింది, “ఏమండీ! లేవండి! పక్కింట్లో ఏవో చప్పుళ్ళుగా వుంది. పొద్దున్నే దొంగలా?” అంటూ.
ఆ భర్త ఒక ఉదుటన లేచి, పెరట్లో వున్న ఒక కర్ర పట్టుకుని పక్కింటి దగ్గిరికి వొచ్చాడు. అప్పుడే ఆ తలుపు తీసి, పరంధామయ్య బయటికి వొచ్చాడు.
“మీరా? ఎప్పుడొచ్చారూ? చప్పుళ్ళు వినబడితే, దొంగలనుకున్నాం? బాగున్నారా?” అని అడిగేసి, ఆయన ఆ వార్త పెళ్ళానికి చెప్పాలని, ఇంట్లోకి వెళ్ళిపోయాడు జవాబు కోసం ఎదురు చూడకుండా.
ఆ వార్త విన్న వరలక్ష్మి, గోడ మీదకి కాదు, వీధి గుమ్మం లోకే వొచ్చింది. అక్కడే నించుని పార్వతి కోసం చూస్తోంటే, వడిలి పోయిన మొహంతో పార్వతి కాఫీ తాగుతూనే బయటికి వొచ్చింది.
“నేను కాస్సేపు పడుకుంటాను. మీరిద్దరూ మాట్లాడుకోండి” అంటూ పరంధామయ్య లోపలికి వెళ్ళి పోయాడు.
పార్వతీ, వరలక్ష్మీ అక్కడే మెట్ల మీద కూర్చుని కబుర్లు మొదలెట్టేశారు.
“అదేంటి పార్వతీ? యేడాది వుంటానని వెళ్ళి, యేడు వారాలయినా వుండకుండా వొచ్చేశారు?” అంటూ ఆశ్చర్యపోతూ అడిగింది వరలక్ష్మి.
“ఏం చెప్పమంటావు లక్ష్మీ! ‘కడుపు చించుకుంటే, కాళ్ళ మీద పడుతుం’దంటారు. మా వాళ్ళతో అంతా అదేలే. ‘కన్నూ నాదే, వేలూ నాదే’ – అన్నట్టయింది నా బతుకు” అంది పార్వతి కన్నీళ్ళతో.
“వొద్దొద్దు! బాధ పడకు! చెప్పొద్దులే! విశ్రాంతగా పడుకో! అన్నీ సద్దుకుంటాయి. ఈ పూటకి కూరలు నేనిస్తా. వంటల పని పెట్టుకోకు” అంటూ ఓదార్పుగా మాట్లాడింది.
చేతి గుడ్డతో కళ్ళు తుడుచుకుంది పార్వతి. “ఇంత కమ్మటి మాటలు విని, ఎన్నాళ్లయి పోయిందో! నీకు చెప్పుకోక పోతే ఇంకెవరికి చెప్పుకుంటాను? ఎంతో సంతోషంగా వెళ్ళామా? మాకు అక్కడ అడుగడుగునా అవమానాలే అనుకో! అన్నిటికీ సర్దుకు పోతూనే వున్నాం ఆ నాలుగు వారాలూ!
మేము వెళ్ళాక క్లీనర్సుని మానిపించింది మా కోడలు, “ఇంత మంది వున్నాం! మన పని మనమే చేసుకుందాం!” అంటూ. అలా అని, తను చేసిన పనేమీ లేదు. ప్రతీ వారం ఇల్లు శుభ్రం చేసే పని నాదే! ఆ చీపురే వెధవ చీపురు. రెండో చీపురు లేదు. మీ అన్నయ్య గారే, ఆ మెషిన్లన్నీ పట్టుకుని శుభ్రం చేయడం! ‘మన కొడుకు ఇల్లే కదా, తప్పేంటీ?’ అన్నారాయన. నేనూ అలాగే అనుకునేదాన్ని.
మనవలని మాతో కలవనియ్యదే. నేను పెట్టే తిండి, వాళ్ళని తిననియ్యదు. అసలు, మేము రావడానికి మా కోడలు ఎందుకు ఒప్పుకుందో మరి! అర్ధం కాదు అది. తర్వాత అర్ధం అయిందిలే.”
ప్రతీ మాటా, బాగా ఆశ్చర్యపోతూ వింది వరలక్ష్మి. “నిజంగా? నిజంగా? అయ్యో, అయ్యో!” అంటూనే వుంది.
మళ్ళీ పార్వతే మాట్లాడింది. “మా వాడు ఇంటికి వొస్తే చాలు, టీవీ ముందరే కూర్చుంటాడమ్మా. లేదా కంప్యూటర్ ముందేసుకుని ఆఫీసు పని చూసుకుంటాడు. ఎప్పుడన్నా వాడిని పలకరించి, ఏదో చెప్పబోతే, ఎక్కడున్నా సరే, వెంటనే మా కోడలు అక్కడి కొచ్చేసి, ‘వాట్? వాట్?’ అంటుంది. ఆమెకి తన మీద ఏదో చెప్పేసుకుంటామనే అనుమానమో ఏమో!
మాకు కూడా విరక్తి పుట్టేసిందిలే. ఇండియాలో మా బతుకులు మేము, సుఖంగా, తృప్తిగా బతుకుతున్నాం. ఈ తెచ్చి పెట్టుకున్న కష్టాలేమిటో అర్ధం కాలేదు మాకు.
పెద్దవాళ్ళతో మాటా, మంచీ లేదు! పిల్లలతో ఆటా పాటా లేవు! రాత్రి పెందరాళే తిళ్ళు అవగానే, వాళ్ళంతా మేడ ఎక్కేస్తారు. నేనూ, మీ అన్నయ్య గారూ అంత తొందరగా తిళ్ళు తినం. ఒక్కోసారి, మా అబ్బాయి చాలా సేపటి తర్వాత, నెమ్మదిగా కిందకి దిగి వొచ్చి, టీవీ ముందర కూర్చుంటాడు.
కాస్సేపటికి, ‘అమ్మా! కొంచెం గోంగూర పచ్చడన్నం కలిపిస్తావా?’ అంటాడు నెమ్మదిగా.
నా మనసు కరిగిపోతుంది. భార్య ముందర అది అడగడానికి గానీ, తినడానికి గానీ భయ పడతాడు.
ఏమీ అనకుండా, వాడడిగింది పెడతాను. ఒక రోజు, భార్యకి దొరికి పోయాడు నేను పెట్టినది తింటూ. ఆవిడెందుకో కిందకి దిగి వొచ్చి, వాణ్ణి చూసింది. ‘ఏంటిది? ఇలాంటి తిళ్ళు తింటే, నీ ఆరోగ్యం ఏం కాను? అసలే కొలస్ట్రాల్ ఎక్కువ నీకు! బీపీ, షుగర్ పెరుగుతాయి ఈ తిళ్ళ వల్ల!’ అంటూ కేకలేసింది వాణ్ణి.
వ్యాయామం చేస్తూ, సుబ్బరంగా తినాలి గానీ, ఏం పద్ధతులు ఇవి? మా అబ్బాయి నోరెత్తడు. నా మనసు కుచించుకు పోయేది.
అలాగే, రోజులు లెక్క పెట్టుకుంటూ గడుపుతున్నాం. ‘పిల్లలని మీరే చూసుకోండి’ అంటూ డే కేర్ మానిపించింది. ఆవిడ చెప్పిన తిండే పెట్టాలి పిల్లలకి. ఏ టైంలో వాళ్ళకి ఏం చెయ్యాలో, ఒక లిస్టు రాసి, ఇచ్చి వెళుతుంది రోజూ.
ఆ రోజు పిల్లలు, ఆడుతూ మీ అన్నయ్య గారితో ఏదో అన్నారు ఇంగ్లీషులో. ఆయన మొహం కందగడ్డ లాగా ఎర్రబడి పోయింది. వాళ్ళని ఆయన ఏదో అడిగారు తీవ్ర స్వరంతో. కాస్త బెదిరి, వాళ్ళు ఏవో జవాబులు ఇచ్చారు. ఇంకేమీ అనకుండా, నా దగ్గిరికి వొచ్చారు ఆయన.
‘పార్వతీ! మన పెట్టెలు సర్దేసెయ్యి! మనం ఇక్కడుండొద్దు! మన ఇంటికి వెళ్ళి పోదాం!’ అన్నారాయన చాలా సీరియస్‌గా.
‘ఏమైందందండీ? వాళ్ళేం అన్నారు? ఏమిటీ విషయం?’ అని ఆత్రంగా అడిగాను.
ఆయన్ని అంత సీరియస్‌గా ఎప్పుడూ చూడలేదు.
‘మనం అన్‌పెయిడ్‌సర్వంట్స్‌అట!’ అన్నారాయన చాలా కోపంగా.
‘అంటే ఏమిటి?’ అని అర్ధం కాక అడిగాను.
‘అంటే, జీతం బత్తెం లేని పనివాళ్ళు! పిల్లలు, ఆ మాట అన్నారు. వాళ్ళని వివరంగా అడిగాను. వాళ్ళమ్మ, మనల్ని అలా అంటుందట, వాళ్ళ నాన్నతో మాట్లాడేటప్పుడు. వాళ్ళ నాన్న ఏమీ అనడట. వాళ్ళకి కూడా అలాగే చెప్పిందట, మన గురించి. మనం అన్ని పనులూ ఇంట్లో చేస్తామట, ఏమీ ఖర్చు లేకుండా!’ అని వివరించారాయన బాధ పడుతూ.
నాకు కన్నీళ్ళు ఆగలేదు. మరో మాట లేకుండా సామాన్లన్నీ సర్దేశాను. ఉన్నట్టుండి ఎక్కడికి పోతాం?
మా వాడు రాగానే, ఆయన విషయం చెప్పేసి, ‘వెంటనే మా టికెట్లు కన్‌ఫార్మ్‌చెయ్యి! ఆ సాయం ఒక్కటీ చెయ్యి!’ అని చాలా సీరియస్‌గా చెప్పేశారు. ‘ఏదో సరదాగా అన్నాను. దానికే ఇంతగా అయిపోవాలా?’ అంటూ మొహం తిప్పుకుంది మా కోడలు. అప్పుడు కూడా మా వాడు మాట్లాడలేదు ఏమీ.
మా అదృష్టం కొద్దీ, ఆ మర్నాటికే విమానంలో సీట్లు దొరికాయి. ఆ ఒక్క రోజూ, అక్కడ నరకంలో వున్నట్టు గడిపాము. ఎవరి మధ్యా మాటలు లేవు!
మా వాడు టాక్సీని పిలిచాడు. వెళ్ళేటప్పుడు, ‘వెళుతున్నా’ మని కూడా చెప్పకుండా టాక్సీ ఎక్కేశాం.
నేను కొంచెం ఏడవబోతే, ఆయన బాగా కసిరారు, ‘ఎందుకు అనవసరంగా ఏడుపు?’ అంటూ.
ఎలాగో ఇంటికి వచ్చి పడ్డాం. ఇదమ్మా జరిగింది. ఇంకా చాలా విషయాలున్నాయి. చెబుతాలే నెమ్మదిగా” అంటూ అన్నీ చెప్పింది పార్వతి సిగ్గు పడుతూ.
వరలక్ష్మికి ఏం అనాలో తెలియలేదు. “బాధ పడకు” అనడానికి కూడా, నోరు రాలేదు. బాధ పడే విషయానికి, బాధ పడొద్దనడంలో అర్ధం ఏముంది?
“మొత్తానికి అమెరికా వెళ్ళొచ్చేశారు! అంతా అయిపోయింది చూస్తూ వుండగానే! ‘అడ్డాల్లో బిడ్డలు గానీ, గడ్డాలొచ్చాక కాదు’ అని ఇందుకే అంటారు!” అంటూ నిట్టూర్చింది వరలక్ష్మి.
పార్వతి సిగ్గు పడుతూ అంది, “అసలు నాకు పిల్లల పడకల గురించే ఎక్కువ బాధ అయింది. పైనే వేరే గది వుంటే, అక్కడ పడుకోబెట్టి, చూసుకుంటూ వుండొద్దూ? పిల్లల్ని కింది గదిలో నంట! ఒక్క పాకో, గుడిసో వున్న పేద వాళ్లయితే, అందరూ ఒక చోటే! అన్నీ చూస్తారు పిల్లలు. ఎవర్నీ ఏమీ అనలేం. గదులు వున్న వాళ్ళ బుద్ది ఏమిటి? పిల్లల్ని ఎక్కడో పారెయ్యడం కల్చరా?”
కొంత సేపు మాట్లాడుకుని, అప్పటికి విడిపోయారా స్నేహితురాళ్ళు, ఇంట్లో పనులు చేసుకోడానికి.

* * *

మామూలు గానే తెల్లారింది ఆ మర్నాడు కూడా.
“పార్వతీ! లే! లేచి, తయారవు! మనం వాకింగుకి వెళదాం. మన ఆరోగ్యాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి మీదా ఆధార పడకుండా మనం బతకాలి!” అన్నాడు పరంధామయ్య, భార్యని నిద్ర లేపుతూ.
“ఆ(, ఆ(, లేస్తున్నాను. అలాగే వెళదాం!” అంటూ మంచం దిగింది పార్వతి. “నిజమే! రేపు మనకి ఏ జబ్బులు వొచ్చినా, వాళ్ళకి చెప్పొద్దసలు! మనం, ఒక పని అమ్మాయిని పెట్టుకుందాం. చాలు!”

(***)

1 thought on “వెళ్ళాం! వొచ్చాం!

 1. చిన్నా చితకా తేడాలతో కొన్ని కుటుంబాలు కథలు ఇలాగే ఉంటున్నాయి.
  ఏం సంబంధమూ లేకపోయినా ఎప్పుడో చదివిన “చదువుకున్న కమల” కధ గుర్తు వచ్చింది. అందులో అత్తవారింటి పద్ధతులలో ఇమడలేని కమల తిరుగుబాటు గుర్తు వచ్చింది. సమాజం పూర్తి చక్రం తిరిగి ‘కోడలింట్లో’ అత్తమామలు ఇమడలేక పోవడం కథావస్తువు కావడం ఒక సహజ పరిణామం.
  కధ అమెరికాలో జరిగినా , ఇండియాలో కూడా జరుగుతుందనుకోవడంలో సందేహం లేదు.
  ప్రసాద్ గారి ఇతర కధల మళ్ళే ఈ కథ కూడా పూర్తి చేశాక ,మరిచిపోనీకుండా, గుర్తొచ్చి ఆలోచింపచేస్తుంది.రచయితకు ధన్యవాదాలు. మంచి కథ రాసినందుకు అభినందనలు.
  చిన్న సూచన: సందర్భానుసారంగా ఒక కోరిక. చదువుకున్న కమల నాకప్పట్లో ఇష్టమయిన రచనల్లో ఒకటి. ఆవిడ ఈ పాటికి సీనియర్ అత్తగారూ, బామ్మ గారు, అమ్మమ్మ గారు అయిపోయి ఉండాలి. ఎవరైనా ఆ పాత్రను కంటిన్యూ చేస్తూ సీక్వేల్ రాస్తే (రచయిత్రి అనుమతితోనే సుమా!) బావుణ్ణు అనిపిస్తూ ఉంటుంది. ఈ కథ చదివాక మళ్ళీ ఆ కోరిక గుర్తొచ్చి మీ అందరితో పంచుకోవడం జరిగింది.
  జానకిరామ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

June 2022
M T W T F S S
« May   Jul »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930