March 19, 2024

చాణక్యనీతి – సువర్ణసుగంధం.

కథా రచన:- పంతుల ధనలక్ష్మి.

“ఏమండీ! ఆషాఢమాసం వెళ్ళిపోతుంది. ”అన్నారు తాయారుగారు.
“అయితే ఏమిటే? కాలాలు ఋతువులు, సంవత్సరాలు వస్తాయి, వెళతాయి ఆషాఢం కూడా అంతే”అన్నారు పరంధామయ్యగారు.
“అలాకాదండీ! ఈ ఆషాఢం వేరు. ఆ ధనలక్ష్మీమాల్ లో శ్రావణమాసం కాసులకీ , హారాలకి, ముఖ్యంగా ముక్కుపుడకలకి మంచిగంధపు వాసన వచ్చేటట్టు తయారుచేసి అమ్ముతున్నారట. అదీ ఆషాఢం నెలాఖరు రోజు మాత్రమే! మంచి గంధంతో బంగారం ఎంత బాగుంటుందో కదా! ” అంది తాయారు.
“నీ మొహం! బంగారానికి తావి భగవంతుడే పెట్టలేదే! వాడెలా పెడతాడు?నాకయితే డౌటనుమానం సుమా” అన్నారు ప. ధా. గారు.
“ఊరుకోండి! మీదంతా ఛాదస్తంకాకపోతే! మీకు కొనడం ఇష్టంలేక! ”
“ఛాదస్తం కాదే! చాణక్యుడు చెప్పేడు. ”
“ఏం చెప్పేడేవిటి? నాకడ్డంగా తయారయి?”తాయారు.
“గంధం సువర్ణే” అన్నాడే.”
“అంటే బంగారానికి గంధంవాసనే కదా?”
అదికాదే! బంగారానికి సువాసన బ్రహ్మ ఇవ్వలేదని చెప్పాడే! ”
“బ్రహ్మకి బుద్ధిలేక ఇవ్వలేదులెండి! షాపువాడు ఇస్తున్నాడు. ”
“ఇప్పుడేమంటావ్?”
ఎల్లుండినుండి శ్రావణం. ఇవాళే వెళ్ళి కనీసం” శ్రీదేవిముక్కుపుడక” తెచ్చుకుంటాను”.
“ఇప్పుడు ఆవిడ ముక్కుపుడక ఎందుకు? ఆవిడ…”
“లేకపోయినా ఆవిడదే ఆ మోడలు”
“సరే! నీ ముచ్చట ఎందుకు కాదనాలి?”
మరునాడు ధనలక్ష్మి మాల్ కి వెళ్ళేరు. హారాలు లైనులో కొద్దిమందే ఉన్నారు. ముక్కుపుడక లైను మాత్రం చాంతాడంత కాదు మూడు తాళ్ళంత పొడవున్నాది. ”అందరూ ముక్కు పుడకలే”
“అవునే! అదొక్కటే రేటు తక్కువ”
“లైను దాటేసరికి శ్రావణమాసం వెళిపోతుందేమో”
“ఉండండి నే లోపలికెళతా” అంటూ తాయారు లోపటికెళ్ళేరు.
“ఒక కౌంటరువద్ద నిలబడి” ఒరేయ్ నువ్వు వాళ్ళబ్బాయివి కదా? హమ్మయ్య! బతికేను! ఇంత పెద్దాడయ్యావురా! ” అన్నది.
ఆ అబ్బాయి తెల్లమొహం వేసి “ఈవిడెవరబ్బా! ” అనుకున్నాడు.
“ఏవిట్రా అలాచూస్తావ్? నా మీదే అనుమానవా?కావాలంటే ఇదిగో! ఆధార్ కార్డ్! అడ్రసులన్నీవున్నాయి. అదిగో మా ఆయన! ఆ కార్డు కూడా తేవాలా?” అడిగింది.
“ఇంతకీ మీకేంకావాలి?” అడిగేడు అబ్బాయి. ఈవిడతో మనకెందుకని.
“శ్రీదేవి ముక్కుపుడక బాబూ! అది మీ వొఖ్ఖ షాపులోనే దొరుకుతుందని తెలిసి వచ్చేను. ”
లోపటినుంచి ముక్కుపుడకల బాక్స్ తెచ్చి చూపించాడు. ”అయినా ఈ పెద్దావిడకి శ్రీదేవి ముక్కుపుడక ఎందుకో” అనుకున్నాడు.
నచ్చినది తీసుకుని “ ఇదేమిటి? దీనికి గంధం వాసనేదీ?”అని అడిగింది.
“అది మీకు బాక్స్ లో పెట్టి ఇచ్చాక ఇంటికెళ్ళి తెరిచాక వస్తుంది.” అన్నాడు.
మజూరీలూ, కోతలు అన్నీ లెక్కవేసి పదివేలు, టాక్స్, ఇంకా గంధం వాసనకి ప్రత్యేకమయిన రేటు కలిపి ఇరవై వేల రూపాయలవుతుంది” అన్నాడు.
“పరంధామయ్యగారు ఫోను పే, గూగుల్ పే చేయనన్నారు.
డబ్బు లెఖ్ఖబెట్టి , భార్యకికూడ ఇచ్చి మరోసారి నోట్లు అంటుకున్నాయేమో చూడమని ఇచ్చేడు.”
ఆవిడ రెండు వేళ్ళూ వందసార్లు వాడిచ్చిన మంచినీళ్ళ గ్లాసులో ముంచి చివర్లు చిరిగి పోయేట్టు లెక్కపెట్టి తడిసిన నోట్లనిచ్చింది.
“అమ్మా! మీరు అన్ని సార్లు లెక్కెడితే ఎలా? అవతల లైను చూసారా?మీ ఒక్కదానితో నాకు మూడుగంటల బేరం! మిషనులో పెడితే ఎన్నో కోట్ల రూపాయలు లెక్కపెట్టవచ్చుఈ సమయానికి” అన్నాడు.
“కష్టార్జితం బాబూ! నీకు తగ్గినా మాకు తగ్గినా బాధే కదా”! అన్నారు తాయారుగారు.
ఎలాగయితేనేం? ముక్కుపుడకతో బయటపడి ఆ లైను చూసి “హు! వెర్రి వెధవలు! తాయారా! మజాకా! ” అనుకుంది ఆవిడ మురిసిపోతూ!
వరలక్ష్మీ వ్రత శుక్రవారం వచ్చేవరకు దానిని తీయలేదు. ఇహ ఆ రోజు పూజ చేసి ఇలా వరలక్ష్మికి చూపించి అలా ముక్కుకి తగిలించేసుకుంది. మంచి గంధం వాసన గుప్పుమంది.
“ఆహా ఎంత మంచి వాసన! ” అంటూ స్టవ్వు దగ్గరికెళ్ళి పులిహోర పోపు వేయించుతుంటే గంధంవాసన తగిలి మత్తుగా కళ్ళు మూసుకుంది. ఆస్వాదించింది. తరువాత బొబ్బట్లు పెనంమీద వేయగానే మళ్ళీ గంధం వాసన. మళ్ళీపీల్చి కళ్ళమూసుకుంది తన్మయత్వంతో గారెలు, చిట్టిబూర్లు, చల్లబూర్లు, పరవణ్ణం, ఇలా ఒక్కొక్కటి చేస్తూ గంధం వాసనని హాయిగా ఆస్వాదిస్తూ, కళ్ళు మూసుకుంటూ ఆనందంగా వంటచేసి నైవేద్యాలు చూపించేసి భోజనానికి పిలిచింది భర్తగారిని.
అరిటాకులో అన్నీ వడ్డిస్తూ మధ్యలో కనులుమూత, వడ్డన, మళ్ళీ కనులమూత, “అయిందా?” పిలుపుకి ఉలిక్కిపడి
“అంత గట్టిగా అరిచారేమిటి?” అడిగింది.
“నువ్వు ఓ బొబ్బట్టు ముక్క తినవోయ్! ”అంటూ ఓ ముక్క లాటిది ఎంచుకుని ఆవిడ నోట్లో పెట్టారు.
ఇంకేముంది! ”కెవ్…వ్…వ్…వ్” పెద్ద కేక. ప్రతిధ్వనితో.
కొంచెం నీళ్ళు ఆవిడ ముఖంమీద చల్లి ”చూసావా! నీ వంటని?”
చూసింది అరిటాకుని. అందులో అచ్చు పెనం తెచ్చి వేసినట్టు నల్లని గుండ్రని పదార్థం. దాని పేరే బొబ్బట్టు. పులిహార పోపులో బొగ్గు ముక్కలు కుప్పలా, చింతపండు పులుసు చిన్న బెల్లం మాడి తారులా జిగురుగా. ! పదార్థాలు వాసన చూసినా తెలీలేదు.
భగవంతుడు అన్నిట్లో ఉన్నాడన్నట్టు అన్నింటిలో నలుపు రంగు తప్ప మరేమీ లేదు.
“నీ ముక్కు పుడకని ఎన్నిసార్లు వాసన చూసావు? వంట చేసేటప్పుడెందుకు పెట్టుకున్నావు?” అన్నీ మాడ్ గయా! ”అన్నారు ప. ధా. గారు.
“అయినా నీ పిచ్చి గానీ! ఏది సువాసన గల పదార్థమయినా ఆ సువాసన కొంతసేపే మనం వాడినప్పుడుంటుంది. అగరుబత్తి, కర్పూరం, గంధం, ఏవయినా! తరువాత వుండదు. వాసన సహజమైనదయినా! అది సుగంధ లక్షణం. బ్రహ్మకి బుద్ధిలేక కాదు. బంగారానికి వాసననిస్తే ఇదిగో! ఇలాగే వంటలు తగలడతాయి! అంతేకాదు వాసన పసికట్టి నువ్వు ఏ మూల దాచినా దొంగలు సులువుగా దోచేస్తారనే! రాజులకాలంలో మగవారు కూడ బంగారం ఎక్కువ ధరించేవారు. ఇలాటి సువాసన వుంటే పనిమీద శ్రద్ధ ఉండదు. అందుకే బ్రహ్మగారు బంగారానికి సువాసన ఇవ్వలేదే! ” అంటూ బొబ్బట్టులో తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతుక్కుంటూ! ”
“ఇప్పుడు నాకు వాసన రావటం లేదండీ!” అన్నారు తాయారు విచారంగా! ! !

శుభం.

మూలం:- చాణక్యుని నీతి శాస్త్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *