March 19, 2024

‘ఆర్డినరీ’ మనిషి. . .! ఎక్స్ట్రార్డినరీ జర్నీ !!

రచన: ధరిత్రిదేవి. ఎమ్

“అబ్బ! ఏమిటీ, నా కాళ్లు ఇలా ఇరుక్కుపోయాయి! బాబోయ్!. . రావడంలేదేంటి?. . ”
మగతగా కళ్ళు మూసుకుని కునికిపాట్లు పడుతున్న పరమేశ్వర్రావు ఒక్కసారిగా కళ్ళు తెరిచి సీటులోంచి కదలబోయాడు. కానీ సాధ్యం కాలేదతనికి. ఎందుకో అర్థం కాక అటూ ఇటూ చూశాడు. ముందు సీటులో బైఠాయించిన ఆసామీ ఇంట్లో డన్‌లప్ బెడ్ మీద ఆరాంగా పడుకున్న చందాన వెనక్కి జారగిలబడి ఎంచక్కా నిద్రిస్తున్నాడు. అతను బస్సులో ప్రయాణిస్తున్నానన్న స్పృహలో కూడా ఉన్నట్టు లేడు. పరమేశ్వర్రావుకు కోపం తన్నుకొచ్చి, అతన్ని లేపి గట్టిగా అరిచేద్దామన్నంత ఆవేశం పుట్టుకొచ్చింది ఒక్కసారిగా. కానీ మరుక్షణమే RTC వారు ప్రయాణీకులకు కల్పించిన వైభోగం ఈ డీలక్స్ బస్సు ప్రయాణం అన్న సంగతి ఠపీమని గుర్తొచ్చి బలవంతాన నిగ్రహించుకున్నాడు. అయినా ఇదేమి సౌకర్యం రా బాబూ ! పడుకున్న వాళ్లకి సరే, వెనక ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి ? వాళ్లూ ఆ విధంగా పడుకుంటే తప్ప ప్రయోజనం ఉండదాయె !
పరమేశ్వర్రావు చిన్నతనమంతా పల్లెటూర్లో, ఆ తర్వాత డిగ్రీ చదువు పక్కన ఉన్న చిన్నటౌన్ లో గడిచిపోయింది. ఏదో ఓ చిన్న ఆఫీసులో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూన్న అతను ఆటోల్లో, ఆర్డినరీ బస్సుల్లో తప్ప ఎన్నడూ ఇలా లగ్జరీ బస్సుల్లో ప్రయాణించి ఎరగడింతవరకూ. చెప్పాలంటే అసలా బస్సులెక్కి సిటీల కెళ్లే అవసరమే రాలేదు అతనికి. రెండ్రోజుల క్రితం అతని కజిన్ ఒకాయన యాక్సిడెంట్ అయి హైదరాబాదు హాస్పిటల్ లో చేరాడు. బాగా దగ్గరి బంధువైనందున అతన్ని చూసి పరామర్శించాల్సిన అవసరం వచ్చి పడిందతనికి. అక్కడికేమో ఆర్డినరీ బస్సులు ఉండవాయే ! తప్పనిసరై రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఏసి డీలక్స్ బస్సు ఎక్కి కూర్చున్నాడు. అదీ విషయం!
ఒక్కసారి కిటికీలోంచి తొంగి చూశాడు బస్సు ఎందుకాగిందబ్బా అనుకుంటూ.
డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ అటుగా ఉన్న టీ స్టాల్ దగ్గర కబుర్లాడుతూ కనిపించారు. ఠక్కున పరమేశ్వర్రావుకు కడుపుబ్బి పోతున్న ఫీలింగ్ ! దిగితే గానీ తప్పేట్లు లేనట్లు అనిపించి, లేవాలని ప్రయత్నించాడు. ఉహూ ! ముందున్నసీటు తన పొట్ట దాకా వచ్చింది. పోనీ, పక్కన ఉన్న అతన్ని లేపయినా లేద్దామని పక్కకు చూశాడు. ఏముంది! షరా మామూలే !అతను కూడా అదే పొజిషన్ లోఉన్నాడు.
” ఇదేమిట్రా దేవుడా! ఇలా ఇరుక్కుపోయానేంటి నేను ! ఇప్పుడెలా?. . . తనకేమో దిగక తప్పేలా లేదు. ఇంకా రెండు గంటల దాకా బస్సు గమ్యం చేరే ప్రసక్తి లేదు. . . ” అనుకుంటూ ఇక తప్పదన్నట్లు పక్కనున్న అతన్ని తట్టి లేపడానికి ప్రయత్నించాడు. ఒక పట్టాన అతడు లేవడే ! విధిలేక మళ్ళీ మళ్ళీ అతన్ని తట్టాడు. అతను విసుగ్గా కళ్ళు తెరిచి, ఏమిటీ అన్నట్లు చిరాగ్గా చూశాడు.
” ప్లీజ్, కాస్త సర్దుకుంటారా, నేను కిందికి వెళ్లాలి. . ” రిక్వెస్టింగ్ గా ఇంకా దీనంగా ముఖంపెట్టి అడిగాడు. అతనికి అర్థం కాలేదో, అయినా నిద్రమత్తులో కదల్లేక పోయాడో గానీ మళ్లీ కళ్ళు మూసుకున్నాడు.
పరమేశ్వరరావు ఈసారి “మిమ్మల్నేనండీ, కాస్త జరగండి. . . “అంటూ చేత్తో గట్టిగా ఊపాడు. ఇక తప్పదన్నట్లు అతను మెల్లిగా సీటు సర్దుకుని లేచాడు.
‘అమ్మయ్య’ అనుకొని పరమేశ్వర్రావు కూడా లేచి నిలబడ్డాడు. అంతలోనే డ్రైవర్, కండక్టర్ ఎప్పుడెక్కారో ఏమో. . . . బస్ స్టార్ట్ అయి ముందుకు కదిలింది. పరమేశ్వర్రావు హతాశుడై నిలుచున్నవాడల్లా నిట్టూరుస్తూ మళ్లీ సీట్లో కూలబడ్డాడు.
” ఈబస్ ఎప్పుడు హైదరాబాద్ చేరుతుందీ, . . . అంతవరకు నేనీ బాధ ఎలా భరించాలీ! . . . ? ”
పోనీ, డ్రైవర్ ను రిక్వెస్ట్ చేద్దామా అంటే బస్సు బయలుదేరిపోయింది కూడా. విధిలేక తనకు తానే సర్దిచెప్పుకొని, మనసు ధ్యాస మళ్లించుకోడానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకున్నాడు.
మరో గంటన్నర భారంగా గడిచాక, బస్ హైదరాబాద్ సమీపిస్తుండగా రెడీగా తన బ్యాగ్ తీసుకుని ఒళ్ళో పెట్టుకొనికూర్చున్న పరమేశ్వర్రావు ఎందుకైనా మంచిదని పక్కనున్న ఆయన్ని లేపుదామనుకున్నాడు, కానీ ముందున్నాయన, పక్కనున్నాయన ఇద్దరూ లేచి సర్దుకోవడం గమనించి’ అమ్మయ్య’ అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.
ఇవేవీ పట్టని బస్సు తన మానాన తను సర్రున వెళ్లి బస్టాండ్ లో నిలబడింది. ఆగిఆగంగానే కామేశ్వర్రావు గబగబా అందర్నీ తోసుకుంటూ దిగిపోయి పరుగులాంటి నడకతో లోపలివైపు దూసుకుపోయాడు.
మరో పావు గంట తర్వాత హ్యాపీ గా బయటపడి, “ఇంకెప్పుడూ ఈ డీలక్స్ బస్సులు ఎక్కనంటే ఎక్కను” అనుకుని వెంటనే,
” ఆహా! ఆర్డినరీ బస్సులు ! ఎంత హాయి! ఎంత హాయి !! “అనుకోకుండా ఉండలేకపోయాడు పాపం ‘ఆర్డినరీ’ మనిషి పరమేశ్వరరావు.
********

1 thought on “‘ఆర్డినరీ’ మనిషి. . .! ఎక్స్ట్రార్డినరీ జర్నీ !!

  1. మాలిక పత్రిక నిర్వాహకులకు వందనం. చక్కని సాహిత్యం ప్రతినెలా అందిస్తున్నారు. మదిలో మెదిలే భావాలను కవితల రూపంలో, కథల రూపంలో అందిస్తూ నలుగురితో పంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *