May 18, 2024

అమ్మమ్మ – 38

రచన: గిరిజ పీసపాటి

 

కృష్ణమూర్తి గారు చెప్పిన మాటలు విని ఆలోచనలో పడింది నాగ. కాసేపటికి గిల్ మేన్ కంపెనీ రిప్రజెంటేటివ్ రావడంతో ఆలోచనలు కట్టిపెట్టి ఆయనతో ఆరోజు ఆయన కవర్ చెయ్యబోయే ఏరియాలు, డాక్టర్స్ లిస్ట్ వివరాలు మాట్లాడసాగింది. ఇంతలో కృష్ణమూర్తిగారు కూడా బేంక్ నుండి వచ్చి వీరితో జాయిన్ అయారు.

కాసేపు మాట్లాడాక సురేష్ గారు డాక్టర్స్ విజిట్ కోసం వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళగానే కృష్ణమూర్తిగారు జేబులోంచి కొంత డబ్బు తీసి నాగ చేతిలో పెడుతూ “నీకు రావలసి‌న జీతం చెల్లీ!” అన్నారు.

“ఇంకా ఒకటో తారీఖు రాలేదు కదా అన్నయ్యా!” అంది నాగ ఆశ్చర్యంగా.

“మిగతా పార్ట్నర్స్ కి నేను చెప్తాలే. ఉంచు” అన్నాడాయన.

“వద్దు అన్నయ్యా! నేను ఒకటో తారీఖున తీసుకుంటాను” అంది నాగ నిక్కచ్చిగా.

“నా దగ్గర తీసుకోవడానికి కూడా ఆత్మాభిమానం అడ్డొస్తోందా నీకు? నా పిల్లలు కూడా నీ పిల్లల వయసు వారే. సరుకులతో పాటు వసంతకి ఇన్సులిన్ కూడా తీసుకో. ఆత్మాభిమానానికి పోయి పిల్లలను పస్తుంచుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చెయ్యకు”

“అయినా నేనేం ఊరికే ఇవ్వట్లేదు కదా! ఎలాగూ నీకు ఇవ్వాల్సిన జీతమేగా. కాకపోతే కాస్త ముందుగా ఇస్తున్నానంతే. ఇంకేం మాట్లాడకు” మందలింపు ధోరణిలో అన్న అన్నగారి మాటలతో మారు మాట్లాడకుండా డబ్బును హేండ్ బేగ్ లో ఉంచింది.

“నీ పని అయిపోయిందా చెల్లీ!?” అనడిగిన కృష్ణమూర్తిగారితో “లేదన్నయ్యా! ఇంకా డే బుక్ కూడా రాయలేదు” అంది నాగ.

“ఆ పనేదో నేను చూస్తాలే కానీ నువ్వు వెంటనే వెళ్ళి ముందు కాస్త వండి, పిల్లలకు కూడా పెట్టి రా! సోషొచ్చి పడిపోయారంటే చాలా ఇబ్బంది. అసలే ఎదిగే పిల్లలకు సరైన ఆహారం లేకపోతే భవిష్యత్తులో కూడా వాళ్ళకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి” అంటూ తొందర పెట్టడంతో ఇంటికి బయలుదేరి వెళ్ళతూ దారిలోనే అవసరమైన కొన్ని సరుకులు కట్టించుకుని మరీ వెళ్ళింది.

“తలుపు కొట్టిన శబ్దానికి తలుపు తీసిన వసంత “అప్పుడే వచ్చవేంటమ్మా?” అని అడగడంతో “కృష్ణ మామ ఈ పూట షాప్ లో ఉంటారట పాపా! నన్ను కాసేపు రిలాక్స్ అవమని పంపించారు. ఈ నెల జీతం అందింది వసంతా! నాకు తోచిన సరుకులు కొన్ని తెచ్చాను. మిగిలినవి ఏం కావాలో చూసి చెల్లి చేత తెప్పించు” అంటూ తన చేతిలోని సంచీని వసంతకి అందించింది.

తల్లి షాప్ కి వెళ్ళగానే నేల మీదే దిండ్లు వేసుకుని ఒంట్లో శక్తి లేనట్లు పడుకున్న గిరిజ, నాని కూడా తల్లి సరుకులు తేవడం చూసి ‘భోజనం చేస్తామన్న సంతోషంతో హుషారుగా లేచి కూర్చున్నారు. గిరిజ పనిలో అక్కకు సాయం చెయ్యసాగింది.

అరగంటలో వంట పూర్తి చేసి వడ్డించింది వసంత. చాలా రోజుల తరువాత అందరూ తృప్తిగా భోజనం చేసి, హాయిగా, నిశ్చింతగా నిద్రపోయారు.

కృష్ణమూర్తిగారు చెప్పిన రోజున పిల్లలతో కలిసి రైల్వేస్టేషన్ కు చేరుకుంది నాగ. మామగారు వస్తున్న ట్రైన్ నాల్గవ నంబర్ ప్లాట్ మీద ఆగుతుందని తెలుసుకుని పిల్లలతో కలిసి ఆ ప్లాట్‌ఫారమ్ దగ్గర ట్రైన్ రాక కోసం ఎదురుచూడసాగింది.

కాసేపటికే ట్రైన్ రావడం, అందులో నుండి మామగారితో పాటు భమిడిపాటి మూర్తి కూడా దిగడం చూసి దగ్గరగా వెళ్ళబోయారు. ఇంతలో  అభిమానులు, శిష్యులు దాదాపు ఇరవై మంది ఆయన చుట్టూ మూగి పోవడంతోనూ, పైగా అందరూ మగవారే కావడంతో ఆ గుంపులోకి వెళ్ళలేక వాళ్ళకి కాస్త దూరంలో నిలుచుండిపోయారు.

ట్రైన్ దిగుతూనే వీళ్ళను చూసి కూడా చూడనట్లు, అసలు వాళ్ళ ఉనికినే గుర్తించనట్లు ముఖం తిప్పేసుకున్న మామగారి చర్యకు మనసు చివుక్కుమన్నా వచ్చిన పని గుర్తొచ్చి, ఆయనను కలిసి మాట్లాడే అవకాశం కోసం వేచి చూడసాగింది.

ఇంతలో వచ్చినవారు అనుసరించగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వైపు దారి తీసారాయన. అందరి కన్నా ఆఖరున వారికి ఐదడుగుల దూరంలో వారిని అనుసారించసాగారు నాగ, పిల్లలు.

వచ్చిన వారిలో చాలా మంది నాగకు పరిచయస్తులే. కొందరు భర్తతో కలిసి పని చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇది వరకు మామగారు వచ్చిన ప్పుడల్లా ఆయన కోసం తమ ఇంటికి వచ్చి అతిధి మర్యాదలు పొందిన వారే. వారంతా ఈ రోజు తనని ఒక అపరాధిలా చూడడం భరించలేకపోతోంది.

ఇంతలో మామగారి పక్కనే నడుస్తున్న రంగారావు మాష్టారు వీరి వద్దకు వచ్చి “ఏమ్మా! పెద్దాయనతో మాట్లాడతారా?” అని అడగడంతో అవునన్నట్లు తల ఊపింది.

వెంటనే ఆయన వెళ్ళి మిగతావారికి ఏం చెప్పాడో గాని, అందరూ కాస్త వెనుకకు వచ్చి నిలబడ్డారు. రంగారావు మాష్టారు వీళ్ళను రమ్మన్నట్లుగా సంజ్ఞ చేయగానే గబగబా వెళ్ళి పిల్లలతో సహా మామగారికి నమస్కరించింది.

“ఏమిటిలా వచ్చారు?” అన్నాడాయన కోపం, వ్యంగ్యం మిళితమైన స్వరంతో.

“మిమ్మల్ని ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాము మామయ్య గారూ!” అంది నాగ వినయంగా.

“నా కొడుకు లేని ఇంటికి నేనెలా వస్తాననుకున్నావు?” ఎదురు ప్రశ్న వేసారాయన.

“ఆయన లేకపోయినా మీ వంశాంకురాలు ఉన్నారు కదా! వాళ్ళ కోసమైనా వస్తారేమోనని” అంది.

“రాను. అయినా నా కొడుకుకి గౌరవం ఇవ్వని మీరు నాకు మాత్రం ఇస్తారా!? తల్లీ పిల్లలు ఏకమై వాడిని కొడతారా?” రౌద్రంగా అరిచినట్లు అన్నాడాయాన.

“మేమాయన్ని కొట్టడం ఏమిటి మామయ్యగారూ! ఆయన మీకలా చెప్పారేమో కానీ అది నిజం కాదు. అసలేం జరిగిందో వివరంగా చెప్తాను. ఇక్కడ ఆ విషయాలన్నీ మాట్లాడడం బాగోదు. దయచేసి నా మాట మన్నించి ఒక్కసారి ఇంటికి వచ్చి నేను చెప్పేది కూడా వినండి మామయ్యగారు” అర్ధించింది నాగ.

“నా కొడుకు నాకు అబద్ధం ఎందుకు చెప్తాడు. అయినా నువ్వేమైనా సత్యసంధురాలివా? వాడికి ఇవ్వకుండా నీ పిల్లలు కాఫీ తాగుతున్నారట? కన్న తండ్రిని ‘మీరు’ అని గౌరవంగా సంబోధించకుండా ‘నువ్వు’ అని సంబోధిస్తు న్నారట? వాడికి సమయానికి తిండి కూడా పెట్టట్లేదట? వాణ్ణి చంపెయ్యాలను కుంటున్నారట కదా! వాడు మనసు విరిగిపోయి ఎక్కడెక్కడో తిరిగి చివరికి శ్రీకాకుళం చేరుకుని, రైలు పట్టాలపైన పడి చనిపోదామనుకున్నాడట. మా అదృష్టం బాగుండి, వాడి మనసు మారి రాముడువలస వచ్చాడు”

“ఆ రోజు నా కొడుకు రూపం చూడగానే నాకొచ్చిన కోపానికి మీరు ఎదురుగా ఉండుంటే తెలిసేది ఏం చేసేవాడినో. జుట్టు, గడ్డం, మీసం పెరిగిపోయి, దుమ్ము కొట్టుకుపోయిన శరీరం, నలిగి, మాసిపోయి, అక్కడక్కడ చిరిగిన బట్టలు, మనిషి చిక్కిపోయి, బాగా నీరసపడిపోయాడు.”

“అయినా నా కొడుకును నేను పోషించుకోగలను. వాడు వెళిపోయాక ఏ ధైర్యంతో ఇంతకాలం బతికారో ఇప్పుడూ అలాగే బతకండి” అంటూ ఇంకా చాలా మాటలు అంటూనే, కొన్ని అసభ్య పదాలను కూడా వాడి తల్లీ పిల్లలను నానా మాటలు అన్నారాయన.

భర్త తండ్రికి చెప్పిన అబద్ధాలకు, అవి నమ్మి ఆయన వేసిన నిందలకు, అంతమంది ముందు ఆయన తిట్టిన తిట్లకు, అందుకు ఆయన ఉపయోగించిన అసభ్య పదాలకు అప్పటికప్పుడు భూమి రెండుగా చీలిపోయి తనను, పిల్లలను లోపలికి లాక్కుంటే బాగుండునన్న భావన కలిగింది నాగకి.

 

 

***** సశేషం *****

 

1 thought on “అమ్మమ్మ – 38

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *