June 19, 2024

అమ్మమ్మ – 41

రచన: గిరిజ పీసపాటి

వీళ్ళ నవ్వులు విన్న అన్నపూర్ణ ఆంటీ తలుపు తీసి, వీళ్ళను చూస్తూ “ఎన్నాళ్ళు అయిందండీ మీరు ఇలా హాయిగా నవ్వగా చూసి. అన్నయ్య గారు వెళ్ళిపోయాక మీరందరూ అసలు నవ్వడమే మర్చిపోయి, మర మనుషుల్లా మారిపోయారు. మీ ఇంట్లో మళ్ళీ మునుపటిలా నవ్వులు వినిపిస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. మీరు నలుగురూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి” అంటూ మనస్ఫూర్తిగా దీవించారు.
అప్లికేషన్ పోస్ట్ చేసి, చాలా రోజులు ఇంటర్వ్యూకి పిలుపు వస్తుందేమోనని ఎదురు చూసి, అటువంటిదేమీ జరగకపోయేసరికి చాలా నిరాశకి లోనయి “ఇద్దరిలో ఎవరో ఒకరికి ఉద్యోగం వస్తుందని నమ్మకం పెట్టుకున్నాను. ఇలా జరిగిందేమిటి?” అంది గిరిజ నిరాశగా.
“పోనీలే! ఇది కాకపోతే మరొకటి. ఇవాళ మరో ఉద్యోగానికి అప్లికేషన్ పంపిస్తున్నాం కదా! అదొస్తుందేమో చూద్దాం. మొదటి ప్రయత్నానికే నిరాశ పడితే ఎలా? నాకు రాకపోయినా నీకు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉద్యోగం ఇస్తారు. నాకా నమ్మకం ఉంది” అంది వసంత.
“నీకెందుకు రాదు?” ఎదురు ప్రశ్న వేసింది గిరిజ.
“పిచ్చిదానా! మనం అప్లై చేస్తున్నది సేల్స్ గర్ల్స్ ఉద్యోగాలకి. అందంగా ఉండాలి. దాంతోపాటు అవయవ లోపం ఉండకూడదు. నాకు ఒక చెయ్యి ఉన్నా లేనట్టే. మూడు వేళ్ళు లేని నా చెయ్యి చూసి ఉద్యోగం ఎవరిస్తారు? ఆ చెయ్యి చూసి కస్టమర్లు ఎక్కడ అసహ్యించు కుంటారో అని ఎవరికైనా ఉంటుంది కదా! బిజినెస్ పోగొట్టుకోరు కదా! అమ్మ తృప్తి కోసం అప్లై చేస్తున్నాను గానీ, నాకైతే నమ్మకం లేదు” అంది.
ఇంట్లో అందరూ వసంతకి ఉన్న అవయవ లోపం గురించి ఏనాడో మర్చిపోయారు. ఉన్న రెండు వేళ్లతోనే సునాయాసంగా వంట పని, ఇంటి పని చేసే అక్క ఇప్పుడిలా మాట్లాడేసరికి కళ్ళంట నీళ్లు తిరిగాయి గిరిజకి. “రెండు చేతులు సవ్యంగా ఉన్న చాలామంది కన్నా నువ్వు బాగా పని చేస్తావు అక్క. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు. అమ్మ వింటే బాధపడుతుంది” అంది.
ఇంతలో ఢిల్లీ మామ రావడంతో “రా మామా! ఏంటి సంగతులు” అడిగింది వసంత.
“అమ్మేదీ!?” అడిగాడు ఢిల్లీ.
“లోపల గదిలో ఉంది. పిలుస్తానుండు” అంటూ తల్లిని కేకేసింది.
అప్పటివరకు తల దువ్వుకుంటూ పిల్లలిద్దరి సంభాషణ విని బాధపడుతున్న నాగ ముఖం మీద చిరునవ్వును పులుముకుంటూ బయటికి వచ్చింది.
“ఈ రోజు వర్క్ లేదా తమ్మూ! ఉదయాన్నే వచ్చావు” అంటూ పలకరించింది.
“వర్క్ కి వెళుతూ ఇలా వచ్చానక్కా. కొంచెం నీతో మాట్లాడదామనీ…” అంటూ మాటను మధ్యలోనే ఆపేసి నసుగుతున్న ఢిల్లీని చూసి “ఏంటి తమ్మూ!? కొత్తగా మొహమాటపడుతున్నావేంటి?” అడిగింది వింతగా చూస్తూ.
“ఇలా నిన్ను అడగవచ్చో లేదో అర్థం కావట్లేదు అక్కా. నా అవసరాన్ని, నీ అవసరాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని అడుగుతున్నాను. తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోకూ!”
“విషయం ఏమిటో చెప్పకుండా కొత్తగా, వింతగా ఏదేదో మాట్లాడుతావ్ ఏంట్రా! స్ట్రైట్ గా పాయింట్ కి రా!” అంది చనువుగా కసురుతూ.
“మరేం లేదక్కా. నాకు ఈ మధ్య ఎక్కువ పనులు వస్తున్నాయి. ఇదివరకట్లా ఒక్కడినీ చేసుకోలేకపోతున్నాను. ఒక హెల్పర్ ని పెట్టుకోవాలనుకుంటున్నాను. బయటి వాళ్ళు ఎవరో ఎందుకు? మన నానిగాడు అయితే నాకు బాగుంటుంది. వాడు కూడా పని నేర్చుకున్నట్టు ఉంటుంది. నీకూ వేడినీళ్లకు చన్నీళ్లు తోడైనట్లు ఉంటుంది. ఆ విషయమే నిన్ను అడుగుదామని వచ్చాను” అన్నాడు.
“ఈ మాత్రం దానికి ఇంత తటపటాయించాలా!? తీసుకెళ్ళు” అంది.
“పీసపాటి మామకి ఏకైక వంశానిపురం వీడు. వీడిని కూలి పనికి తీసుకెళ్తానని అడగాలంటే ఏదోలా అనిపించిందక్కా! ఉన్న విషయం చెప్తున్నాను. రోజుకి 20 రూపాయలు ఇస్తాను. అక్కడ వాడు ఎలక్ట్రిక్ సామాను మోయాల్సి ఉంటుంది. ఆఖరికి నిచ్చెన కూడా మొయ్యాలి. నీకు అభ్యంతరం లేకపోతేనే పంపించు” అన్నాడు కళ్ళు చెమరిస్తుండగా.
“ఇప్పుడు వాడు పీసపాటి నరసింహమూర్తిగారి మనవడిగా రావట్లేదు తమ్మూ. కేవలం ఈ నాగ కొడుకుగా వస్తున్నాడు. మీ బావ ఎప్పుడైతే తిరిగి మా దగ్గరకు వస్తారో అప్పుడే మేము మళ్లీ ఆయన వారసులమని చెప్పుకుంటాము. అంతవరకు మేము ఆయన పేరు వాడుకోదల్చుకోలేదు” అంది నిక్కచ్చిగా.
ఆ రోజు నుంచి నాని ప్రతిరోజు ఢిల్లీతో పాటు పనికి వెళ్లి, రోజుకి 20 రూపాయలు చొప్పున తెచ్చి తల్లి చేతికి ఇవ్వసాగాడు. ఆ 20 రూపాయలతో రోజూ పాలు, కూరలు ఖర్చు గడిచిపోసాగింది.
ఇరవై రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో షాప్ అడ్రస్ కి నాగ పేరున టెలిగ్రామ్ వచ్చింది. ‘శుక్రవారంనాడు గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నాను. రైల్వే స్టేషన్ కి వచ్చి రిసీవ్ చేసుకో’మని తల్లి పంపిన ఆ టెలిగ్రామ్ చదివిన నాగ గుండెల్లో రాయి పడింది.
ఇన్నాళ్లూ ఇక్కడి విషయాలేవీ తల్లికి తెలియకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు ఆవిడే వస్తోంది. ఇప్పుడు నిజం చెప్పక తప్పదు. తీరా చెప్పాక ఇన్నాళ్లూ చెప్పనందుకు బాధపడుతుంది. మధ్యాహ్నంవరకు అన్యమనస్కంగానే పని చేసింది.
మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి, వసంతతో విషయం చెప్పింది. వసంత ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ “ఎన్నాళ్ళని దాస్తాం అమ్మా!? ఎప్పటికైనా తెలియాల్సిందే కదా! మనం తప్పు చేస్తే కదా భయపడాలి. ఆయన వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం. నువ్వేం టెన్షన్ పడకు” అంటూ తల్లికి ధైర్యం చెప్పింది.
శుక్రవారం ఉదయాన్నే తల్లి, పిల్లలు స్టేషన్ కి వెళ్లి, ఆవిడని రిసీవ్ చేసుకున్నారు. ఆవిడ కూడా ఎప్పటిలాగా చిరునవ్వుతో కాకుండా కొంచెం సీరియస్ గా ఉంది. బాగా సుస్తీ చేసినట్లు కనిపిస్తోంది.
“ఏమ్మా నీరసంగా ఉన్నావు? ఒంట్లో బాగుందా!?” అడిగింది నాగ కంగారుగా.
“ఆ విషయాలన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం నాగేంద్రుడూ! ముందు రిక్షా మాట్లాడు” అంది క్లుప్తంగా. రెండు రిక్షాలలో అందరూ ఇంటికి చేరుకున్నాక, ఆవిడ స్నానం, జపం అయ్యాక కాఫీ గ్లాసు అందించింది వసంత.
“అమ్మకి కూడా కాఫీ ఇవ్వు వసంతా!” అంది.
“అలాగే అమ్మమ్మ. మేమెవ్వరం ఇంకా తాగలేదు. నువ్వు వచ్చాక అందరం కలిసి తాగుదామని ఆగాము” అంటూ అందరికీ తలకో గ్లాసు ఇచ్చింది వసంత.
“నాగేంద్రుడూ ఇలా వచ్చి కూర్చోమ్మా!” అందావిడ. తల్లి సీరియస్ గా ఉండడంతో మౌనంగా వచ్చి కూర్చుంది నాగ. “ఇంత జరిగితే నాకు చెప్పకుండా ఎందుకు దాచావే తల్లీ!? చెప్తే మాత్రం ఈ ముసలి తల్లి ఏం చేస్తుందిలే అనుకున్నావా?” అంది గొంతు గద్గదిక మవగా.
“నీకెలా తెలిసిందమ్మా!?” అంది నాగ మెల్లిగా.
“ఎలా తెలిసినా ఆఖరున తెలిసింది నాకేగా!” అందవిడ నిష్టూరంగా. “కష్టాన్నైనా, సుఖాన్నైనా పంచుకోవడానికి ఇక్కడ మేము నలుగురం ఉన్నాము. నువ్వు అక్కడ ఒక్కర్తివి యాతన పడుతున్నావు. నీకు తెలిస్తే తట్టుకోలేవని తప్ప నీ దగ్గర దాచాలని కాదమ్మా!” అంది నాగ బుజ్జగిస్తున్న స్వరంతో.
“నాకు తెలుసే అమ్మా! కానీ ఇక్కడ మీరు పస్తులుంటుంటే అక్కడ నేను కడుపునిండా తిన్నాను. మీ కష్టానికి నేను దగ్గర లేను. అదే నా బాధ” అందావిడ కళ్ళు తుడుచుకుంటూ.

***** సశేషం *****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *