April 28, 2024

గోపమ్మ కథ – 7

రచన: గిరిజారాణి కలవల

లక్ష్మి, కోటి కాపురం … ఇక వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. మూడు పురుడులు పోసి … తన బాధ్యత తీర్చుకుంది గోపమ్మ.
మరో పక్క… కొడుకు పిల్లలు పెద్దవుతున్నారు. కొడుకు, కోడలు, మనవలు అంటూ మళ్ళీ మొదలెట్టింది. చిలక్కి చెప్పినట్లు చెప్పాను. ‘పెళ్ళి చేసావు. వాడికీ పెళ్ళాం, పిల్లల బాధ్యతలు తెలియనియ్యి. తల్లి కోడిలాగా, నీ రెక్కల కిందే ఎన్నాళ్ళు చేస్తావు? నీకూ రెక్కల శ్రమ ఎక్కువ అవుతుంది.’
వింటే కదూ! రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించడం, తనకంటూ ఏదీ మిగుల్చుకోకుండా, మొత్తం వాళ్ళకే ధారపోయడం. గోపమ్మ బతుకే అంత అని ఊరుకున్నాను.
రిక్షాలు ఇప్పుడు ఎవరూ ఎక్కడం లేదు. అన్నిచోట్లా ఆటోలు పెరుగుగతున్నాయని కొడుకు, ఆటో కొనడం కోసం, తల్లితో అప్పు చేయించి మరీ కొన్నాడు. ‘మారుతున్న రోజులని బట్టి మారక తప్పదు కదమ్మా!’ అంటూ, బేంకులో లోను పెట్టి ఆటో కొని కొడుక్కి ఇచ్చింది.
గవర్నమెంట్, పేదలకి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసింది. ఆ లిస్టులో గోపమ్మ పేరు కూడా ఉండడంతో, తన పేరున, తనకీ అంటూ పట్టా వచ్చింది. అయితే ఆ స్ధలంలో, వాళ్ళు ఇచ్చిన గడువు లోపల, తప్పనిసరిగా పునాదులు లేపి, ఇల్లు కట్టాలనీ, లేకపోతే ఆ స్ధలం తిరిగి తీసేసుకుంటామని చెప్పేసరికి, గోపమ్మ గుండె గుభేలుమంది.
ఎలాగోలా… కాలూ చెయ్యి కూడ తీసుకుని, పునాదులు తీయించడం మొదలెట్టించింది. అదే సమయంలో మేము కూడా మా పాత ఇంటిని పడకొట్టించి, అక్కడే, బాగా ఎత్తు లేపి కొత్త ఇల్లు కట్టించాలని పనులు మొదలెట్టాము. దాంతో పడకొట్టిసిన ఇంటి తాలూకు రద్దుని, ట్రాక్టర్ లకి తోలి, గోపమ్మ ఇంటి పునాదులలో పోయడడానికి పంపించాను. మా ఇంటికి తెప్పించినప్పుడే ఇసుక, సిమెంటు గోపమ్మకి కూడా తెప్పించాను. మా పాత ఇంటి నుంచి తీసేసిన కిటికీలు, ద్వార బంధాలు కావాలని అడిగితే, గోపమ్మకి ఇచ్చేసాను.
మొత్తంమీద… నెమ్మదిగా మూడు గదులకి స్లాబ్ వేయించుకోగలిగింది. ప్లాస్టింగ్ నెమ్మదిగా చేయించుకోవచ్చు అనుకుని, భర్త, కొడుకు కోడలు మనవలతో కొత్త ఇంటికి మారిపోయింది.
ఆ కొత్త ఇల్లు బాగా దూరమయిపోయింది. దాంతో మా ఇంట్లో పని మానేస్తుందనుకున్నాను. కానీ, నేను చేసే సహాయాలకి విశ్వాసమో, లేదంటే చిన్నతనం నుండి మా ఇంట్లో పని చేసే అలవాటో కానీ… రావడం మానేయలేదు. పొద్దున్నే కొడుకు ఆటోలో ఊళ్ళోకి వచ్చేటప్పుడు, గోపమ్మని ఎక్కించుకుని తీసుకువచ్చేవాడు. మిగతా ఇళ్ళల్లో చేసినా చేయకపోయినా, మా ఇంట్లో మాత్రం పని మానేయనని అంటూ ఉండేది.
రోజులు గడుస్తున్నాయి.
ఆ రోజు గోపమ్మ ఇంకా పనికి రాలేదు. ఎప్పుడైనా ఒంట్లో బాగుండక రాకపోతే, కోడలిని పంపించేది. ఆరోజు ఆ అమ్మాయీ రాలేదు.
ఎదురు చూసి, చూసి… ఇక నేనే నెమ్మదిగా బయట ఊడ్చుకుని, ముగ్గు వేసుకున్నాను. ఇక గిన్నెలు తోముకుందామనుకుంటూండగా, గోపమ్మ కొడుకు గేటు బయట నుంచి “అమ్మగారూ!” అంటూ పిలిచాడు.
వచ్చింది కాబోలు, అనుకుంటూ బయటకి వచ్చాను.
“మీ అమ్మేదిరా? ఈరోజు రాలేదేంటీ?” అడిగాను.
“మా అయ్య చచ్చిపోయాడమ్మగారూ! అందుకే రాలేదు మా అమ్మ. మీకు చెప్పి పోదామని వచ్చాను. ” అన్నాడు.
“అయ్యో! ఔనా! ఇంత సడెన్ గా ఏమైందిరా?” బాధగా, అన్నాను.
“సడనేంలేదు అమ్మగారూ! మా అయ్యకి ఎప్పటినుంచో నెమ్ము జబ్బు వుంది కాదా! రేతిరి దాంతో ఆయాసమెచ్చి పోయాడు.” అన్నాడు.
ఈ నెమ్ము జబ్బు ఏంటోకానీ, వీళ్ళ నోళ్ళలో ఎప్పుడూ ఆడుతూవుంటుంది. వీళ్ళని పట్టుకుని వదిలే జబ్బు కాదని అనుకున్నాను. అంతకుముందు గోపమ్మ అన్న, మరిది కూడా ఇలాగే నెమ్ము జబ్బుతో పోయారని అంది. కానీ… ఒకసారి ఏదో మాటల సందర్భంలో, “మా ఇళ్ళల్లో మగోళ్ళకి ఉండే పాడు అలవాట్ల మూలంగా, చాలామందికి ఎప్పటికీ
నయమవని జబ్బు అంటుకుంటాదమ్మా! ఇక సావే వాళ్ళకి గతి. అది బయటకి చెప్పుకోలేక నెమ్ము జబ్బు అని అంటూంటాము”. అంది.
పాపం…గోపమ్మని తలుచుకుని జాలిపడాలో, లేక కొన్ని కష్టాల నుంచి బయటపడిందని సంతోషించాలో తెలీలేదు.
ఆ రోజు గోపమ్మని చూడడానికి వెడదామనుకున్నాను, కానీ, అక్కడ వాళ్ళందరూ తాగుళ్ళూ, ఊగుళ్ళతో ఉంటారని, ఆగిపోయాను.
రెండురోజుల తర్వాత, సాయంత్రం నాలుగింటప్పుడు, రిక్షా మాట్లాడుకుని గోపమ్మ ఇంటి వైపుకి వెళ్ళాను.
అక్కడ గోపమ్మ అవతారం చూసి నిర్ఘాంతపోయాను. మామూలుగా సాదా పాత చీరలో, జుట్టుని పైకి కొప్పు కట్టుకుని, మెడలో, చేతులకీ ఏమీ లేకుండా, (మతం పుచ్చుకున్నానని చెప్పింది) మా ఇంటికి పనికి వచ్చేది. అలాంటిది… ఈ రోజు… కొత్త చీర కట్టి, జడ నిండా బోలెడు పువ్వులు, రూపాయికాసంత బొట్టు, కంటి నిండా కాటుక పూసేసి, రెండు చేతులకీ నిండా గాజులతో ఓ పక్కన కూర్చుని ఉంది. నన్ను చూడగానే, గొల్లున ఏడుస్తూ, రెండు చేతుల్లో ముఖం దాచుకుంది.

సశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *