April 28, 2024

ఏది శాశ్వతం?

రచన : తాతా కామేశ్వరి

శారద తన ఇంట్లో బీరువాలు, షోకేసులలో ఉన్న వస్తువులను రెండు చేతులతో పట్టుకొని విరక్తిగా వాటికి తనకి ఉన్న బంధం తీరిపోయింది అని మనసులో అనుకుంటు వాటిని అటు ఇటు తిప్పి చూసి మళ్ళీ చక్కగా తీసిన చోటే పెట్టసాగింది. ఆమెను చూస్తే ఆమె మనసులో ఎంత విరక్తి చెంది ఉందో అర్థం అవుతుంది. అవి ఆమెకి చాలా ఇష్టమైన వస్తువులు అయినా కూడా ఆమెకు ఇపుడు వాటి మీద ఏ ఆసక్తి కలగడం లేదు. ఒకప్పుడు వీటిని ఎవరినీ ముట్టనిచ్చేది కాదు. శుభ్రం కూడా తానే స్వయంగా చేసేది. నేడు వాటిని చూస్తే ఆమెకి విరక్తి కలుగుతోంది. ఒకప్పుడు వాటిని ఏరి కోరి తెచ్చుకొని ఇంట్లో అమర్చింది. ప్రస్తుతం తనకి వాటి అవసరం లేదు కానీ వాటిని చూస్తూ ఆమె ఏమీ తోచని సంధిగ్ధంలో పడింది. శారద బీరువాలనే కాదు, ఆ గదిని, ఆ గది నాలుగు వైపులా చూస్తూ ఆమె మనసు గతంలోకి జారిపోయింది.
శారద భర్త ఆనందరావుగారు సెంట్రల్ గవర్నమెంటులో ఉన్నతపదవిలో చేసి మంచి పేరు, ప్రఖ్యాతులతో పాటు చాలా ఆస్తి కూడా సంపాదించి రిటైరయ్యారు. శారదతో అతని వివాహం అయినది మొదలుకుని, ప్రతి ఏడు ఆమెను ఏదో ఒక ప్రాంతం విహారానికి తీసుకువెళ్లేవారు. ఆమెను సంతోషపరచడానికి ఆమెను మంచి ప్రదేశాలు, విదేశాలకి కూడా తీసుకుని వెళ్ళేవారు. తను ఏది అడిగినా కాదనకుండా కోరిక తీర్చేవారు. ఇద్దరు ఆదర్శ దంపతులకి నిదర్శనంగా ఉండేవారు. ఆయన ఆఫీసు పనిమీద టూర్లకు వెళ్లినప్పుడు, తను ఇష్టపడే ఇంటి అలంకరణ కోసం రకరకాలయిన వస్తువులు తెచ్చి, ఆమె వాటిని అందంగా అలంకరించితే చూసి తృప్తి చెందేవారు. చెప్పాలంటే శారద ఇల్లు అందంగా అలంకరించిన వస్తువులతో కళకళ లాడుతూ ఉండేది.
కానీ ఆమెకు ఉన్న లోటు అల్లా సంతానం. సంతానలేమి ఇమెను బాధపెట్టి, కృంగదీసేది కానీ ఏ రోజు భర్తకి తెలియనిచ్చేది కాదు. కానీ ఒకనాడు వాళ్ళ ఆనందంగా సాగిపోతున్న జీవితం తారుమారు అయి ఒక్క క్షణంలో కృంగిపోయింది. వీటినే కష్టసుఖాలు కావడికుండలు అంటారు ఏమో. ఆనందరావుగారు ఒక నాడు హార్ట్ ఎటాక్ వచ్చి, హఠాత్తుగా కన్ను మూసి శారదని వంటరిదాన్ని చేసి వెళ్లిపోయారు. భర్త లేని లోటుతో ఆమె ఒంటరిదయ్యింది. ఆమె బ్రతుకు వెళ్ళబుచ్చడం కోసం హుషారు తెచ్చుకొని బ్రతికేది. తనకి భర్త మిగిల్చిన కొంత డబ్బు భర్త పేర చారిటీలకు ఇచ్చింది. ఆమె తన పేరున కూడా కొన్ని అనాథ అనాథాశ్రమాలకి చాలా మొత్తం కట్టింది, అయినా ఆవిడకు తృప్తి లేదు. కానీ మనసును రాయి చేసుకుని ఆమె తన ఒంటరితనాన్ని తట్టుకోలేక సామాజిక కార్యాలలో, స్నేహితులతో, తనకి నచ్చిన పుస్తకాలు చదువుతూ, పాటలు వింటూ రోజులు గడప సాగింది. భర్త పోయి సుమారు ఇరవయి సంవత్సరాలు అయింది. ఆమెకు యనభై సంవత్సరాలు వచ్చేసరికి ఆమెకు ఈ వంటరి జీవితం భారం అనిపించసాగింది. ఒంటరితనంతో దిగులు మొదలు అయింది. ఏ కాస్త నలత చేసినా భయం, రాత్రి అయితే భయం. ఏం చేయాలో తోచక చివరికి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. అప్పటి కప్పుడు తాను తరుచుగా వెళ్ళే చిన్న చిన్న పసికందులు ఉండే ‘ప్రేమాలయం’ అనే అనాథాశ్రమం పేరున తన ఆస్తిలో ముడో వంతు రిజిస్ట్రీ చేయించి, అనాథాశ్రమం యజమానికి అందచేసింది. తన లాయర్ రాఘవయ్య గారిని పిలిచి తన తదనంతరం తాను ఉండే ఆ ఇల్లు, కారు, మిగిలిన డబ్బు ఎంతో కాలంగా తన ఇంటిలో తన బాగోగులు చూస్తూ, పని చేస్తున్న డ్రైవరు శివయ్య మరియు అతని భార్య గంగమ్మ పేరున విలునామా తయారు చేయించింది.
మర్నాడు ఆమె తనకి సదుపాయంగా ఉండే వృద్ధాశ్రమంకి వెళ్ళి తనకు నచ్చిన రూమ్ బుక్ చేసుకుని, వాళ్లకి తాను వచ్చే తారీకు చెప్పి, ఇంటికి చేరేక ఆమె మనసు కొంత కుదుటపడింది.
ఆమె ఇప్పుడు తనతో వృద్ధాశ్రమంకి ఏ వస్తువులు తీసుకొని వెళ్లాలో అన్న సంధిగ్ధంలో పడింది. బీరువాలలో చక్కగా సర్దిపెట్టుకున్న, తన భర్త ప్రేమతో తెచ్చిన వస్తువులు, ఖరీదైన అలంకరణ సామాను, అందమైన క్రొకరి, ఇష్టంగా కొన్న చీరలు ఒకటి ఒకటీ తీసి చూస్తూ జ్ఞాపకాలలోంచి బయటకు వచ్చి తన చెమ్మగిలిన కళ్ళని పైటకొంగుతో తుడుచుకుంది.
ఆమె మౌనంగా తనలో తానే “ఈ వస్తువులు నాకు ఇన్ని రోజులు చాలా ఆనందాన్ని యిచ్చాయి, కానీ ఇప్పుడు నాకు వీటితో ఉన్న అనుబంధం మరియు అవసరం కూడా తీరిపోయింది” అని మనసుని నచ్చ చెప్పుకుంది. తనకి వీటి అవసరం ప్రస్తుతం లేదని తెలుసుకొని, ఒక సూట్కేసులో తనకు అవసరం అయిన బట్టలు, కొద్దిపాటి తీసి ఉంచుకున్న డబ్బు, ఏటీఎం కార్డు, అవసరం అయిన పత్రాలు, తన మెడికల్ ఫైల్, మందులు పెట్టుకుని సర్దడం అయ్యింది అనిపించింది. ఒకసారి నిట్టూర్చి తన మనసుని వృద్ధాశ్రమంకి వెళ్ళ డానికి సిద్ధం చేసుకుంది.
ఇక తాను వృద్ధాశ్రమంకి వెళ్ళే రోజు ఇంట్లో ఉన్న శివయ్య మరియు గంగమ్మకి కొంత డబ్బు యిచ్చి ఇల్లు జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి, ప్రతి నెల డబ్బు పంపుతానని చెప్పి, ప్రేమగా వారిని కౌగిలించుకొని సెలవు తీసుకుని, తన భర్తతో గడిపిన ఆ ఇంటిని మరోసారి ప్రేమ గా చూసి కారు ఎక్కింది.
శారదకి ఇవాళ జీవిత సత్యం తెలిసింది. ఈ ఆస్థి, అంతస్తులు, ఇళ్ళు, సంపద శాశ్వతం కాదని, క్షణిక సంతోషాలు, సుఖదుఖాలుతో కూడిన ఈ జీవితంలో ఆఖరికి ఏ ఆస్థి మనసుకి శాంతినివ్వదు అని ఆలోచిస్తూ, తనకు చాలా ఇష్టమయిన యేసుదాస్ పాడిన పాట ‘ఓ బాటసారి ఇది జీవిత రహదారి, ఎంత దూరమో ఏది అంతమో, ఎవరూ ఎరుగని దారి ఇది, ఒకరికీ సొంతం కాదు ఇది’ గుర్తుకు వచ్చింది. అలా తాను ఆలోచనాలలో ఉండగా “అమ్మా! ఆశ్రమం వచ్చింది” అనే డ్రైవరు శివయ్య పిలుపుతో ఉలిక్కిపడి “హా! ఇక్కడే కారు ఆపు” అని మెల్లగా కారు దిగింది. ఆమె తోడుగా శివయ్య సూట్కేసు తీసుకొని వస్తుంటే, వారించి తానే ఆ సూట్కేసు తీసుకొని, తనకి మనఃశాంతిని ఇవ్వమని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ వృద్ధాశ్రమంలో కాలు పెట్టింది. నేరుగా ఆఫీసుకు వెళ్లి తన రూము తాళం చెవి తీసుకొని రూములో కాలు పెట్టింది. సూట్కేసు ఒక వేపు పెట్టి రూము అంతా చూసి మంచం పక్క ఉన్న కుర్చీలో కూర్చుని తను తీసుకున్న నిర్ణయము సరియేనది అని అనుకోని తృప్తి చెందింది.
ప్రస్తుతానికి ఆమె తెచ్చుకున్న సూట్కేసులో ఉన్న వస్తువులు తప్ప తనకి ఏమి ఆక్కరలేదు. మరి కొన్ని రోజులకు వీటి అవసరం కూడా ఉండదు, అని వృద్ధాశ్రమంలో తన కొత్త జీవితం మొదలుపెట్టింది శారద.

***

1 thought on “ఏది శాశ్వతం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *