April 28, 2024

నేను కాదు మనం…

రచన: జ్యోతి వలబోజు

చిత్రం: కూచి చిత్రకారుడు

“నాన్నా! మీరు పేపర్సన్నీ పెట్టుకుని, టాక్సీ మాట్లాడుకుని రేపు వచ్చేస్తారా.? నన్ను రమ్మంటారా..? లేక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయనా?” ఫోనులో మాట్లాడుతున్నాడు కిశోర్.
కొద్దిసేపు మాట్లాడి “సరే మీ ఇష్టం. జాగ్రత్తగా రండి. బయలుదేరేటప్పుడు కాల్ చేయండి” అంటూ ఫోన్ పెట్టేసాడు.
పక్కనే ఉన్న అతని భార్య ప్రియ “ఏమంట? మామయ్యవాళ్లు ఎందుకొస్తున్నారు. ఏమైంది?” అని అడిగింది.
“అమ్మకు, నాన్నకు రెగ్యులర్ హెల్త్ చెకప్ ఉందిగా. అలాగే అమ్మకు ఈ మధ్య బాక్ పెయిన్ వస్తోందంట. ఇక్కడ స్పెషలిస్టుకు చూపించాలని వస్తున్నారు” అని చెప్పాడు. తల్లితండ్రులు వస్తున్నారన్న ఆనందం అతని మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రియ మాత్రం మొహం మాడ్చుకుంది.
తెల్లారి ఆదివారం కావడంతో కిశోర్ తమ ఇంట్లో ఉన్న నాలుగు బెడ్‌రూమ్స్ లో ఒకదాన్ని తెరిచి పనిమనిషితో శుభ్రం చేయించి, బాత్‌రూం అవీ క్లీన్ చేయించాడు. బెడ్‌షీట్స్, కర్టెయిన్స్ కూడా తనే మార్చాడు. అతని హడావిడి చూసి, బామ్మా, తాతయ్యలు వస్తున్నారని తెలిసిన పిల్లలిద్దరు మేము కూడా చేస్తాం అంటూ అతనికి సాయం చేయసాగారు. టీవీ పక్కన టేబుల్ మీద చిన్న గాజు సీసాలో పువ్వులు పెట్టారు. తాతయ్య చదువుతాడని పుస్తకాలు కూడా పెట్టారు పిల్లలు.
కిషోర్, పిల్లలు ఇంత హడావిడి చేస్తున్నా ప్రియ కనీసం తొంగి కూడా చూడలేదు. వంటింట్లో పని చేసుకుంటూ ఉండిపోయింది ఇది ఎప్పుడూ ఉండేదే కదా అనుకుంటూ.
అసలు ప్రియకి పెళ్లైనప్పటినుండి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం లేదు. కాకినాడలో అత్తగారింట్లో అసౌకర్యంగా ఫీలయ్యేది.
మణి ఒక్కడే కొడుకని, కోడలిని కూడా ఎంతో ప్రేమగా చూసుకునేది. ప్రియ, కిషోర్ ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. లక్షల్లో సంపాదించినా ఇంటి పెత్తనం అంతా కిషోర్ తండ్రి మధుసూధన్ దే. ఇంట్లో ఆయన చెప్పినట్టే నడవాలి. అలాగని ఆయన నియంతలా ప్రవర్తించలేదు. ఒక క్రమశిక్షణతో ఉండాలి అనేవాడు. అది ప్రియకు నచ్చలేదు. హైదరాబాదులో పుట్టి పెరిగిన అమ్మాయి. ఒక్కతే కూతురు కావడంతో ఒంటరిగా అలవాటయింది. పుట్టింట తనకు నచ్చినట్టుగా ఉన్న వ్యక్తి, అత్తగారింట పెద్దవాళ్లు చెప్పినట్టు ఉండాలంటే ఇబ్బందిగా ఫీలయ్యేది. అలాగే సణుగుతూ, అసహనంతో రెండేళ్లు గడిపింది. ఒక బాబు పుట్టిన తర్వాత కూడా ప్రియ అత్తగారింట సర్దుకుపోలేదు. పట్టుబట్టి కంపెనీ మార్చే ప్రయత్నం చేసి భర్త, కొడుకుతో కలిసి. హైదరాబుకు షిఫ్ట్ అయింది..
భార్యను కట్టడి చేయలేక, తల్లితండ్రులను వదిలిపెట్టలేక కిషోర్ చాలా సతమతమయ్యాడు.
అతని పరిస్థితి చూసి, అతని బాధను అర్ధం చేసుకున్న తండ్రి “నాన్నా! కిషోర్!… ఇప్పుడేమైందని. మీరు వెళ్లండి. మేము రాము. సొంత ఇల్లు, వ్యవసాయం, బంధుజనం, ఊరివాళ్లు అందరూ ఉన్నారు. ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాం కదా. మమ్మల్ని మేము చూసుకోగలం. అయినా హైదరాబాదు ఎంత దూరమని. సంతోషంగా వెళ్లండి” అని ఆశీర్వదించి పంపించాడు మధుసూధన్..
హైదరాబాదులో ఉన్న ప్రియ తల్లితండ్రులు అప్పటికే ఒక ఇల్లు చూసి పెట్టారు. వాళ్లకు అన్ని సదుపాయలు ఉన్నాయో లేదో చూసి వెళ్లిపోయారు.
మరో రెండేళ్ళకు కూతురు పుట్టినపుడు వచ్చి మళ్లీ వెళ్లిపోయారు.
ఎందుకో మరి ప్రియకి అత్తామామలు వచ్చినపుడు అసహనంగా ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేకుంటే తనిష్టమొచ్చినపుడు నిద్ర లేవడం, వంట చేయడం, చేయకపోతే బయటినుండి ఆర్డర్ చేయడం, పార్టీలు అంటూ బయటకు వెళ్లడం, ఇంట్లో చేసుకోవడం.. అలా గడిపేస్తూ ఉండింది. ఆమె తల్లితండ్రులు వచ్చినా అడ్డంకి ఉండదు. కాని అత్తమామలు వచ్చినపుడు మాత్రం ఇవన్నీ కుదరవు కదా. అత్తగారు మణి కూడా గయ్యాలి ఏమి కాదు కాని పద్ధతిగల వ్యక్తి. అన్ని టైమ్ ప్రకారం జరగాలి అంటుంది అంతే..
అందుకే వాళ్లు వస్తున్నారంటే అసహనంగా, చిరాగ్గా ఉంది ప్రియకి.

******

తెల్లారి వస్తానన్నవాళ్లు నాలుగు రోజుల తర్వాత వచ్చారు. ఊర్లో ఏదో పంచాయితీ పని పడింది మధుసూధన్‌కి.
స్కూలునుండి వచ్చేసరికి కనపడ్డ బామ్మా, తాతయ్యలను చూసి “బామ్మా! తాతా!” అని అరుస్తూ వెళ్లి హత్తుకున్నారు.
పెద్దవాళ్లిద్దరు కూడా ఎంతో సంతోషపడ్డారు చాలా రోజుల తర్వాత మనవళ్లను చూసినందుకు.
తను స్వయంగా చేసిన సున్నుండలు, కజ్జికాయలు, జంతికలు, కారప్పూస, జున్ను, థోతలో కాసిన మామిడిపళ్లు, పనసపండు, అల్లనేరేడు పళ్లు తీసి టేబుల్ మీద పెట్టింది మణి..
పిలల్లతో పాటు కిషోర్ కూడా పిల్లాదైపోయాడు. నాకూ అంటూ గారాం చేసాడు.
రాత్రి ఏడు గంటలకు వచ్చిన ప్రియ ఇద్దరికీ నమస్కరించింది.
రాత్రి భోజనాలయ్యాక తల్లితండ్రులను హాస్పిటల్ కి తీసుకువెళ్లడానికి కావలసిన పేపర్లన్నీ తీసి పెట్టుకున్నాడు కిషోర్.
తెల్లారి లీవ్ పెట్టాడు కిషోర్.
ఆఫీసులో పనుందని ప్రియ వెళ్లిపోయింది. పిల్లలు స్కూలుకెళ్లారు.
తర్వాత కిషోర్ తల్లిదండ్రులను తీసుకుని వెళ్లి టెస్టులన్నీ చేయించి, డాక్టర్‌ని కలిసి , కావలసిన మందులు రాయించుకుని ఇంటికొచ్చారు.
తెల్లారి వెళ్లిపోదామనుకున్నారు మణి, మధుసూధన్. కాని కిషోర్, పిల్లలు వెళ్లొద్దని మొండికేసారు. రెండురోజులుందాములే అని ఉండిపోయారు. ప్రియకి ఏమాత్రం ఇష్టం లేదు కాని ఏమనలేక ఊరకుండిపోయింది.
రెండురోజులకు వచ్చిన అదివారం నాడు జనతా కర్ఫ్యూ అన్నారు. తర్వాత కరోనా మూలంగా లాక్‌డౌన్ ప్రకటించారు.
ఇది వినగానే “కిషోర్! లాక్‌డౌన్ అంటున్నారు. మాకు ఓ టాక్సీ మాట్లాడు. లేదా ఫ్లైట్ టికెట్స్ తీసుకొ. మేము ఇంటికెళ్లిపోతాం”అన్నాడు మధుసూధన్.
“నాన్నా! లాక్‌డౌన్ అంటే మొత్తం అన్నీ మూసేసారు. ఏది వెళ్లనివ్వరు. బస్సులు, రైళ్లు, కార్లు ఏవి కూడా. ఇంట్లోనే ఉండాలి. మీరు ఇక్కడే ఉండండి. ఈ పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలీదు. మీరక్కడ, నేనిక్కడ ఎందుకు. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు” అని బ్రతిమిలాడాడు కిషోర్.
కోడలికి ఇష్టం ఉండదని తెలిసినా, చేసేదేమీ లేక ఇద్దరూ మిన్నకుండిపోయారు.
తను చెయగలిగేదేమీ లేనందున ప్రియ ముభావంగానే తన గదిలోకి వెళ్లిపోయింది.
****
తెల్లారి ఏడుగంటలకు లేచి బయటకు వచ్చిన ప్రియకు వంటింటినుండి కుక్కర్ శబ్దం వినపడింది. ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలు బయటకొస్తున్నాయి. సాంబార్ వాసనలు హాలు వరకు గుభాళిస్తున్నాయి. కిచెన్లోకి వెళ్లి చూస్తే అత్తగారు ఒకవైపు సాంబారు పెట్టి, ఒక వైపు కుక్కర్లో కూర చేస్తూ, మరోవైపు ఇడ్లీలు వేయడానికి ప్లేట్లు తీసిపెడుతోంది.
“ప్రియా! ఇడ్లీకి చట్నీతో పాటు పొడి చేసేదా. నీకు ఏ పొడి ఇష్టం చెప్పు. అదే చేస్తా. మరో అరగంటలో టిఫిన్ రెడీ అవుతుంది. అందాక కాఫీ తాగుతావా” అంటూ ఆప్యాయంగా అడిగారు.
ప్రియ మనసుకు ఎంత హాయిగా అనిపించిందో, లేట్ నైట్ వరకు ఆఫీసు వర్క్, పొద్దున ఓపిక లేక పిల్లలకు సరిగా వండలేక, ఏదో ఒకటి చేసి పెట్టి, తామిద్దరూ కూడా తిన్నామంటే తిన్నామన్నట్టు అఫీసులకు పరిగెత్తడం అలవాటైపోయింది.. ఇవాళ నిద్ర లేవగానే ఇంటి భోజనం రెడీగా ఉంటే అంతకంటే ఏం కావాలి.
“కాఫీ ఇవ్వండత్తయ్యా! స్నానం చేసాక అందరం ఒకేసారి టిఫిన్ చేద్దాం” అంటూ గ్లాసు తీయడానికి వెళ్లింది.
ఎలాగూ ఆఫీసులకు వెళ్లేది లేదు, పిల్లలకు స్కూళ్లు లేవు. అందరూ ఒకేసారి వేడి వేడీ ఇడ్లీలు చట్నీ, వెల్లుల్లి కారం పొడి, సాంబార్ తో తిన్నారు.
పిల్లల ఆనందానికైతే అంతులేదు.
టిఫిన్ అయ్యాక ప్రియ, కిషోర్ తమ గదిలోకి వెళ్లిపోయారు ఆఫీసు పని చేసుకోవడానికి.
మణి వంటింట్లోకి వెళ్లింది మధ్యాహ్నం వంట పనులు చూడడానికి.
పిల్లలు “తాతయ్యా! ఎలాగూ స్కూలు లేదుగా. మేము గేమ్స్ ఆడుకుంటాం. నువ్వు టీవీ చూసుకో” అన్నారు.
“ఒరేయ్ పిల్లలూ.. ఇట్రండి. నాకు చాలా ఆటలు వచ్చు తెలుసా. మా ఊర్లో నేనే చాంపియన్. ఏమనుకున్నారో” అని పిలిచాడు మధుసూధన్.
“ఐపాడ్‌లో గేమ్స్ ఆ?” అడిగారు ఉన్నచోటినుండే.
“ఏమీ కాదు. అది పక్కన పెట్టి మీరిద్దరూ ఇట్రండి” అని పిలివగానే ఉత్సాహంగా పరిగెత్తుకొచ్చారు. వాళ్లకు కూడా ఐపాడ్‌లో గేమ్స్ అన్నీ బోర్ కొట్టాయి.
మధుసూధన్ తన రూంలో ఉన్న ఫైల్ నుండి ఒక వైట్ పేపర్ తీసి అష్టాచెమ్మా గీసాడు. అటు ఇటు వెతికి, షెల్ఫులో గవ్వలు కనిపించాయి. అవి ఇంకో రెండు మూతలు తెచ్చి వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి అష్టాచెమ్మా ఎలా ఆడాలో నేర్పించాడు.
ఈ రకం ఆట కొత్తగా ఉండడంతో పిల్లలు కదలకుండా గంట సేపు ఆడారు. అయిపోయినా మళ్లీ .. మళ్లీ అంటూ ఇంకా ఆడతామన్నారు. కాని బామ్మ వచ్చి భోజనానికి రమ్మంది.
ముద్దపప్పు, క్యాబేజీ కూరా, టమాటా పచ్చడి, రసం పెట్టి తను తెచ్చిన గుమ్మడొడియాలు, మినప అప్పడాలు వేయించి పెట్టింది.
“కిషోర్.. ప్రియా! రండి తిందురు గానీ” అంటూ కేకేసింది మణి.
పొద్దున టిఫిన్ తిన్నప్పటినుండి తమను అస్సలు డిస్టర్బ్ చేయకుండా, అల్లరి చేయకుండా పిల్లలు ఏం చేస్తున్నారో అనుకుంటూ క్రిందకు దిగారు ఇద్దరూ.
రోజూ తినడానికి సతాయించే పిల్లలు బుద్ధిగా కూర్చుని ముద్దపప్పులో బామ్మ తెచ్చిన నెయ్యి వేసుకుని అప్పడాలు ఒక చేతిలో పెట్టుకుని తింటున్నారు.
వాళ్లను చూసి కిషోర్, ప్రియలకు కూడా ఆకలి గుర్తొచ్చింది.
తృప్తిగా తినేసి, మళ్లీ వెళ్లి తమ ఆఫీసు పనిలో పడిపోయారు వాళ్లిద్దరూ.
గంట సేపు ఆడిన తర్వాత ఇద్దరికీ ఆసక్తి పెరిగి వాళ్లే ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈలోపు పెద్దవాళ్లిద్దరూ కాస్త కునుకు తీసారు.
రాత్రి భోజనాల తర్వాత పిల్లలు టీవీలో కార్టూన్స్ చూస్తామన్నారు. అపుడు బామ్మ పిలిచింది.
“నాకు బోల్డు కథలు వచ్చు. చెప్పేదా?”
“అంటే కార్టూన్స్ లో వచ్చే కథల్లాంటివా?” అనడిగారు పిల్లలు.
“అదేం కాదు. నాకు వచ్చిన కథలు ఆ టీవీవాళ్ళకెవరికీ తెలీదు తెలుసా?” అని కాస్త ఊరించింది మణి.
“అవునా!.. చెప్పు చెప్పు” అంటూ బామ్మ దగ్గరకొచ్చి కూర్చున్నారు.
“పదండి అలా బయటకెళ్లి కూర్చుందాం. మీకు రోజుకో కొత్త కథ చెప్తా” అని వాళ్లను బయట వరండాలో కూర్చోబెట్టుకుని అనగనగా అంటూ ఎంతో ఆసక్తికరంగా కథ చెప్పింది. వాళ్లు ఊ కొడుతూ విన్నారు. ఓ గంట అలా విన్న తర్వాత ఆవులింతలు తీస్తుంటే కిషొర్ వచ్చి తీసికెళ్లాడు.
మొదట అత్తామామలు ఉండడం ఇష్టపడని ప్రియ కూడా మారసాగింది. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఎంత సుఖమో ప్రత్యక్షంగా అర్ధమైంది. పిల్లలు కూడా ఐపాడ్, టీవీ అనడం మానేసారు. బామ్మ, తాతయ్యల దగ్గర మంచి మంచి కథలు, ఆటలు నేర్చుకుంటున్నారు.
రెండు నెలల తర్వాత లాక్‌డౌన్ సడలించినప్పుడు ప్రియ అత్తగారిని తనకు తెలిసిన చీరలు అమ్మే వాళ్లింటికి తీసికెళ్లి ఆమెకు నచ్చిన మంచి ఉప్పాడ పట్టు చీర కొనిచ్చింది.
మొదటిసారి తన కోడలు ఇష్టంగా కొనిచ్చిన చీరను చూసి మణి కూడా మురిసిపోయింది.
మధ్యలో ఒకసారి డాక్టర్ చెకప్ ఉంటే కిషోర్ జ్వరంతో ఉన్నాడని ప్రియానే తీసికెళ్లింది.
నాలుగు నెలల తర్వాత లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేసారు. ఇక ఇంటికి వెళతామని బయలుదేరారు మణి, మధుసూధన్.
“బామ్మా!తాతా! వద్దు మీరు వెళ్లొద్దు. ఇక్కడే ఉండండి” అంటూ ఏడుపు మొహం పెట్టారు పిల్లలిద్దరూ.
ప్రియ కూడా దిగులుగా ఉంది. నాలుగు నెలలు వాళ్లతో బాగా అలవాటు పడింది. ఇంట్లో పెద్దవాళ్లు ఉండడం ఎంత అవసరమో తెలిసి వచ్చింది.
“అత్తయ్యా, మావయ్యా మీరు వెళ్లకండి. ఇల్లు సరిపోతుంది కదా. నేను చేసిన తప్పులకు మన్నించి మీరు కూడా ఇక్కడే ఉండండి. మనమంతా కలిసి ఉందాం” అన్నది ప్రియ..
“అమ్మా!ప్రియా!.. నాకు నీ మీద ఎప్పుడూ కోపం లేదు. అయినా నేను నేను అని కాకుండా, మనం అని అనుకుని మనవాళ్లందరినీ కలుపుకుని బ్రతుకుతామో అప్పుడు మన జీవితం సంతోషంగా గడిచిపోతుంది. పదిమందితో కలిసిమెలిసి ఉంటే మనకు అవసరమైనపుడు వాళ్లు వచ్చి సహాయం చేస్తారు. ఆపదలో ఆదుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే మీకు, పిల్లలకు కూడా చాలా మంచిది. వాళ్ల అనుభవలను రంగరించి మీకు, మీ పిల్లలకు మంచి చేయడానికే ప్రయత్నిస్తారు. మేము వెళ్లాలి. ఊర్లో చాలా పనులున్నాయి. మళ్లీ వస్తాం కదా.. ” అన్నాడు మధుసూధన్.
” అమ్మా ప్రియా! దిగులు పడకు. మేము వెళ్లాక అమ్మవాళ్లని పిలిపించుకో. వాళ్లు ఇద్దరే ఉంటారు కదా. వాళ్లు కూడా పిల్లలతో, మీతో గడిపితే సంతోషంగా ఉంటారు. అసలు వాళ్లు ఒంటరిగా ఎందుకుండాలి. ఇక్కడే ఉండమను. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. మేమూ వస్తుంటాము” అంటూ అనునయంగా చెప్పి కోడలిని హత్తుకుంది మణి.
“బామ్మా, తాతా! ఈసారి మేమే వస్తాం హాలిడేస్ రాగానే. సరేనా.. నీకు ఏమేం కావాలో చేప్పు. మేము తీసుకొస్తాం ఈసారి” అంటూ చెప్పారు ఆరిందాల్లా పిల్లలు..
“సరేరా.. లిస్ట్ పంపిస్తా.. ఉంటా మరి.. అమ్మానాన్నలను సతాయించొద్దు. మేము చెప్పినవి గుర్తుపెట్టుకోండి..బై” అంటూ కారెక్కారు మణి, మధుసూధన్..
“థాంక్స్ కరోనా” మనస్ఫూర్తిగా అనుకున్నాడు కిషోర్..
*****

1 thought on “నేను కాదు మనం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *