April 27, 2024

విరించినై విరచించితిని – అడివి గీత

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి

ఢిల్లీ వారిని ఆకట్టుకున్న తెలుగు కళాకారిణి గీతారావ్

కొందరిలో సహజంగా లలితకళలు వెల్లివిరుస్తూ ఉంటాయి. ఈ పాట ఎవరు నేర్పారు? ఈ నటనకి మార్గదర్శకులెవరు? ఈ కవిత ఎవరు రాయించారు అని ఆశ్చర్యపోనక్కరలేదు. గాలికి కదలిక ఎంత సహజమో, వెన్నెలకి చల్లదనం ఎంత సహజమో, అంత సహజంగా వారిలో కళాప్రతిభ బయటపడుతుంది. అలాంటి వ్యక్తుల కోవకు చెందిన ధీరవనిత అడివి గీత.
నేనూ, శ్రీలక్ష్మీ గీత వాళ్ళ గుమ్మంలోకి అడుగుపెట్టగానే ‘రండి, రండి’ అంటూ వికసించిన మనస్సు ముఖంలో ప్రతిఫలిస్తూండగా ఆహ్వానించింది గీత. గీత డ్రాయింగ్ రూమ్ ప్రాక్పశ్చిమాల కలయికలా ఉంటుంది. రెండు తరహాల వారిని ఆకర్షిస్తుంది. అయినా ఆ అలంకరణలో అంతర్గతంగా ఒక కళాదృష్టి, సాంప్రదాయమూ కన్పిస్తాయి. సెంటర్ టేబుల్ మీద కట్స్ డిష్ లో నీలితామరలు తేలియాడుతుంటాయి. ఇండోర్ ప్లాంట్స్ మధ్య పెద్ద వినాయకుడు చిరునవ్వులు చిందిస్తుంటాడు ఒక పక్క.

ప్ర. రవీంద్రభారతిలో పరదేకె పీఛె నాటిక చూశాం. ఆ నాటిక మీరే డైరెక్ట్ చేశారుకదూ?
జ. అవునండీ నేనే! ఏడిద గోపాలరావుగారి సంస్థ ద్వారా వేశాం. రచన కూడా నాదే అంది.
ప్ర. మీరు డ్రామా స్కూల్లో ఏదైనా కోర్సు చేశారా?
జ. అందరూ అలాగే అనుకుంటారు. నిజం చెప్పాలంటే నా జీవితమే నాకొక రంగస్థలం – గురువు కూడా అయింది. ఆ రోజుల్లో బాల్యవివాహాలు విరివిగా జరుగుతూండేవి. నాకూ 14 ఏళ్ళకే పెళ్ళిచేశారు. మా నాన్నగారు శంకర శ్రీరామారావుగారు, అమ్మ కామేశ్వరమ్మ. మా నాన్నగారు వృత్తిపరంగా వైద్యులు అయినప్పటికీ తీరిక దొరికినప్పుడల్లా తన మనసు కవిత్వంవైపు ఒరిగేది. ముప్ఫై పైగా నాటికలూ, చెప్పలేనన్ని పద్యాలూ, వ్యాసాలు రాశారు. రేడియో టాక్స్ ఇచ్చేవారు. మా ఇంటికి కళాకారులు వచ్చిపోతూండేవారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణరావుగారు, కమలాబాయి ఛటోపాధ్యాయ, బందా కనకలింగేశ్వరరావు, వేదాంతం ప్రహ్లాదశర్మ, బాలమురళీకృష్ణ, బాపు, విశ్వనాథ్ వీరందరిని అప్పుడే చూసే అదృష్టం నాకు కలిగింది. అప్పుడు మహామహులని తెలిసే జ్ఞానం లేదు. అడవి రామారావు, నేను చిన్నకావడం వల్ల వీరందరూ నాన్నగారి స్నేహితులనే తెలుసుకాని వెంకటలక్ష్మిగారు మా అత్తమామలు. దూరంగా భావనగర్, రాంచీలలో మా వారు ఉద్యోగం చేస్తూంటే నేను అక్కడికి వెళ్ళాను. కొత్త మనుషులు, కొత్త భాషలు.
ప్ర. అక్కడే మీ రచనా వ్యాసంగం మొదలయిందా?
జ. అక్కడ నాలో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాలేదు. నా జీవితంలో మలుపు తెచ్చింది బొకారో. అక్కడ మావారు స్టీల్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్గా పనిచేసేవారు. అది ఒక విశ్వ కుటుంబం. అక్కడ అన్ని రాష్ట్రాల వారూ ఉండేవారు. రకరకాల భాషలు, వివిధ వేషధారణలు కనిపించేవి. మేమంతా కలిసి స్టీలు ప్లాంటు ఫామిలీ అని పిలుచుకునే వాళ్ళం. పేరు అలా ఉంది కానీ అందరివీ కోమల హృదయాలే. అక్కడ కల్చరల్ అసోసియేషన్ ఉండేది. దానికి 15 సంవత్సరాలు సెక్రటరీగా పనిచేశాను. అప్పుడే నా పరిధి విస్తృతమైంది. అవకాశాలు ఒకదాని వెనుక ఒకటి వచ్చి నన్ను మేల్కొలిపాయి. హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ మాట్లాడేవాళ్ళం.
ప్ర. చిన్న వయసులో కాపురానికి వెళ్ళారుకదా, మీ చదువు అదీ…
జ. అదే, హైస్కూలు చదువు ఏలూరులో అయింది. వస్తూపోతూ ఇంటర్ పూర్తి చేశాను. తరువాత ప్రైవేట్గా ఉస్మానియా బి.ఎ. పాసయ్యాను. చదువుకంటే వాతావరణం, అవసరం, అనుభవం నాకు నాలెడ్జిని సంపాదించి పెట్టాయి. మా వారు ఎ.ఆర్.రావుగారు ఇంగ్లీషు లిటరేచరు బాగా చదివారు. ఆయన ప్రోత్సాహం, సహకారం వల్ల ఇంగ్లీషు బాగా వచ్చింది. ఆయనేకాదు, మా అత్తమామలు, అటువైపువారు అందరూ నన్ను ప్రోత్సహించారు. పెరటి చెట్టు మందుకు పనికిరాదు అంటారు కాని ఇంటిలోని వారి ప్రోత్సాహం మనిషిని ఇంతవారిని అంతవారుగా చేస్తుంది.
ప్ర. నాటికలు డైరెక్ట్ చేయాలని ఎందుకనిపించింది?
జ. అది సంకోచంలోంచి పుట్టిన సాహసం. మా సంస్థలో వేయిస్తుండే నాటికలు చూస్తూంటే నాకు అనేక ఆలోచనలు వచ్చేవి. ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది అలా ఉంటే బాగుంటుంది కదా అనిపించేది. వాళ్ళందరూ పెద్దవాళ్ళు. వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి సంకోచించేదాన్ని. చివరికి ధైర్యం చేసి “షక్” అనే నాటకం డైరెక్ట్ చేసి ఇంటర్ స్టీల్ ప్లాంట్ కాంపిటీషన్ ద్వారా వేయించాను. నాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది.
ప్ర. బెంగాలీ భాషతో పరిచయం ఎలా కలిగింది?
జ. బెంగాలీవాళ్ళు చందోరూపా అనే జాతీయ నాటకోత్సవాలు జరిపేవారు. వారు అన్ని భాషల నాటకాలు వేసేవారు. అప్పుడు ఒక హిందీ నాటికకి, రెండు తెలుగు నాటికలకి స్క్రిప్ట్ రైటర్గా, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్గా అవార్డులు వచ్చాయి. చందోరూపాలో ఒకసారి కాంపిటీషన్ కి జడ్జిగా కూడా వెళ్ళాను. ఐయాన్రెండ్ రాసిన ది నైట్ ఆఫ్ జనవరి 16 రెండుగంటల డ్రామాని ఇంజినీరింగ్ ట్రైనీస్ కి డైరెక్ట్ చేశాను. అక్కడ గొప్పతనం ఏమిటంటే మేం అందరం కలిసి రంగురంగుల కలలు కనేవాళ్ళం. మైత్రీభావంతో, ఉత్సాహంగా పనిచేసేవాళ్ళం. ఎవరిలో ఏ కాస్త క్రియేటివిటీ కనిపించినా సహృదయంతో ఆహ్వానించేవాళ్ళం.
ప్ర. మరి మాతృభాషలో ఏం రాశారు?
జ. తెలుగులో నాటికలు సొంతవి కొన్ని, అనువాదాలు కొన్ని ఉన్నాయి. పరదేకె పీఛె, షక్, ఏక్ షరత్ అజీబ్సీ, దిల్ బదల్ గయా మొదలైనవి హిందీవి. భలేపెళ్లి, ఒక విచిత్రమైన షరతు, హంగామా తెలుగులో రాశాను. కళాతృష్ణ పెరిగేందుకు వాతావరణం, పెద్దల పరిచయం కావాలి. బొకారో సాంస్కృతిక కార్యక్రమాలకు గొప్ప గొప్ప కళాకారుల్ని ఆహ్వానించేవాళ్ళం. పంకజ్ ఉదాస్, ఉషాఉతుప్, బిస్మిల్లాఖాన్, సుబ్బలక్ష్మి, సీతారాదేవి మొదలైనవారి కార్యక్రమాలు చూడడం వల్ల సంగీత సాహిత్యాలమీద అభిమానం మరింత పెరిగి మనమూ ఏదో చేయాలనే తపన కూర్చోనిచ్చేది కాదు. ముషాయిరాలు, గజల్స్, కవి సమ్మేళ నాలు జరిగేవి. ఒక్కటీ వదిలేవాళ్ళంకాము. వీళ్ళు ఇంత వాళ్ళు అవడానికి ఎంత కృషి చేశారో అనిపించేది. ఆ భావనే నాకు గురువయింది.
ప్ర. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారా?
జ. లేదండీ, మధ్యలో ఢిల్లీ వెళ్ళాం. మా వారు అక్కడే రిటైర్ అయ్యారు. ఢిల్లీలో ఆంధ్రవనితా మండలి కమిటీ మెంబర్ గా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నడిపించాను. ఎ.పి.భవన్లో నాటికలు ప్రదర్శించాం. ఇతర సంస్థల నాటికలలో పాల్గొన్నాను. సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఉన్నాను. ఢిల్లీ రేడియో వారి 800 నాటికలలో పాల్గొన్నాను. కొన్ని టి.వి. యాడ్స్, డబ్బింగ్ తో కెమెరా అనుభవం కలిగింది. ఆల్రౌండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్ అవార్డు ఆంధ్రవనితా మండలివారు ఇచ్చారు. మావారు రిటైరయ్యాక హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాం. ఈ వూరూ, కల్చరల్ వాతావరణం అర్ధం చేసుకోవడానికి కొంతకాలం పట్టింది. ఈ ఊళ్ళో మేం ఉంటున్న ప్లాట్స్ కూడా చిన్నసైజు బొకారోలా ఉంటాయి. అన్నిభాషల వాళ్ళు ఉన్నారు. అందరికి కళాభిరుచి, ఆధ్యాత్మికత, ఐకమత్యం, ఉత్సాహం ఉన్నాయి.
పరదేకి పీఛె చూశాం అన్నారు కదా! దూరదర్శన్లో ఇంటిగ్రేషన్ మీద బాలే వేశాం. టాక్ షో ఒకటి ప్రసార మయింది. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ పైకి తేవాలని ఆశ.

ఒక గృహిణిగా బాధ్యతలు స్వీకరించి కళారంగంలో ఒక్కొక్కమెట్టు ఎక్కి ఇంత ఔన్నత్యాన్ని పొందిన మీ ధీరత్వాన్ని మెచ్చుకుంటున్నాం. సెలవా మరి?!

ఉదాత్తులైనవారు భావాల గురించీ, ఆలోచనల గురించీ చర్చించుకుంటారు, మామూలు మనుషులు సంఘటనల గురించి చర్చించుకుంటారు, తెలివితక్కువవారు మనుషుల గురించి చర్చించుకుంటారు.
– చైనా దేశపు సామెత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *