April 28, 2024

సుందరము సుమధురము – 4

రచన: నండూరి సుందరీ నాగమణి

ఈ శీర్షికలో ఇటీవలే ఎంతో వైభవంగా మనం జరుపుకున్న శ్రీరామనవమి సందర్భంగా, ఈ నెల భూకైలాస్ చిత్రంలోని ఒక మంచి పాటను గురించి ముచ్చటించుకుందాం.

నందమూరి తారకరామారావు గారు రావణ బ్రహ్మగా నటించిన ఈ చిత్రానికి శ్రీ కె. శంకర్ గారు దర్శకత్వం వహించగా, ఎవియం పతాకం పై, శ్రీ ఎలా మొయ్యప్పన్ గారు నిర్మించారు. చిత్రకథ, సంభాషణలు, గీతాలు సముద్రాల సీనియర్ రచించగా సంగీతాన్ని ఆర్. సుదర్శనం, ఆర్. గోవర్ధనం గారలు అందించారు.
ఈ పాటను నారదపాత్ర ధరించిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారిపై చిత్రీకరించారు.
చిత్రంలో, శివానుగ్రహం పొందిన రావణాసురుడు శివుడిని ఆత్మలింగం కోరుకోవాలనుకుంటాడు కానీ విష్ణు మాయ వలన అందుకు బదులుగా పార్వతీదేవిని అడుగుతాడు. శివుడు ఆమెను రావణుడితో లంకా నగరానికి వెళ్ళమంటాడు.
దారిలో రావణుని వెంట నడచిపోతున్న జగన్మాతను చూసిన నారద మహర్షి ఎంతో కలవరానికి లోనౌతాడు. కానీ అతనికి భవిష్యత్తులో జరగబోయే రామజననం నుంచి రావణసంహారం వరకూ అనేక దృశ్యాలు కనిపిస్తాయి. అప్పుడతని నోట వెలువడిన అక్షర కావ్యమే ఈ గీతం.
ఒళ్ళు ఝల్లుమనేలా, మనసు కరిగి నీరయేలా ఎంతో మధురంగా గానం చేసినవారు అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు.
పల్లవి:
ద్వారపాలుర మరల దరిదీయు కృపయో…
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో…ఓ…
రాముని అవతారం… రవికులసోముని అవతారం….
(నారాయణుని ప్రతీ అవతారంలోనూ వైకుంఠపు ద్వారపాలకులైన జయవిజయులు రాక్షసులుగా జన్మించి, ఆయన చేతిలోనే మరణిస్తారు. అలా జయవిజయులే రావణ, కుంభకర్ణులుగా త్రేతాయుగంలో జన్మిస్తే దశరథ రాజు కుమారుడుగా రాముడు జన్మించి ఆ రాక్షస వీరులను సంహరించి ధర్మాన్ని కాపాడతాడు.)
రాముని అవతారం …రవికులసోముని అవతారం
రాముని అవతారం …రవికులసోముని అవతారం
సుజనజనావన ధర్మాధారం…దుర్జనహృదయవిదారం …
రాముని అవతారం
(రాముని అవతారం, సూర్యవంశంలో పుట్టిన చంద్రుని అవతారం. కవి చమత్కృతి గమనించండి. మంచివారిని రక్షించటం, దుర్మార్గాన్ని అంతం చేయటం ఇదే రామావతారం యొక్క ప్రయోజనం.)
చరణం 1:
దాశరథిగ శ్రీకాంతుడు వెలయూ…కౌసల్యాసతి తపము ఫలించూ
జన్మింతురు సహజాతులు మువ్వురు…
జన్మింతురు సహజాతులు మువ్వురు…లక్ష్మణ శత్రుఘ్న భరతా
రాముని అవతారం …రవికులసోముని అవతారం
(దశరథుని కుమారుడుగా రాముడు జన్మించాడు. కౌసల్య తపము పండింది. ముగ్గురు సహజాతులు లక్ష్మణ, భారత, శత్రుఘ్నులు ఆయనకు తమ్ములుగా పుట్టారు.)
చరణం 2:
చదువులునేరుచు …మిషచేత చాపముదాలిచిచేతా
విశ్వామిత్రుని వెనువెంట …యాగముకావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపము …అంతము చేయునహల్యకు శాపము
వొసగును సుందర రూపం …
రాముని అవతారం…రవికులసోముని అవతారం
(చదువులు నేర్చే నెపముతో, చేత చాపము దాల్చి, విశ్వామిత్రునితో అతని యజ్ఞాన్ని రక్షించటానికి బయలుదేరాడు. అహల్యకు శాపవిమోచనం చేసి అందమైన రూపాన్ని అనుగ్రహించాడు.
ఈ చరణంలో ‘చేత’ అనే పదాన్ని రెండు విభిన్న అర్థాలలో ఉపయోగించారు సముద్రాల వారు.)
ధనువో జనకుని మనసున భయమో…ధారుణి కన్యాసంశయమో
దనుజులుకలగను సుఖగోపురమో…
దనుజులుకలగను సుఖగోపురమో…విరిగెను మిథిలానగరమునా
రాముని అవతారం రవికులసోముని అవతారం
(ఈ చరణంలో బహుచక్కని క్రమాలంకారాన్ని గమనించవచ్చును. ఆ శివధనుస్సో, జనకుని మనసులో సీతకు ఎటువంటి భర్త లభిస్తాడోననే భయమో, భూతనయ జానకి సందేహమో, రాక్షసులు కలగనే సుఖాల గోపురమో… ఇవన్నీ విరిగాయట మిథిలానగరములో. ఎంత బాగుందో కదండీ!)
కపట నాటకుని పట్టాభిషేకం… కలుగును తాత్కాలిక శోకం
భీకర కానన వాసారంభం … లోకోద్ధరణకు ప్రారంభం
భరతుని కోరికతీరుచుకోసం …పాదుకలొసగే ప్రేమావేశం
భరతుని కోరికతీరుచుకోసం …పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికినవ నవసంతోషం …గురుజనసేవకు ఆదేశం
రాముని అవతారం రవికులసోముని అవతారం
(భరతుడికి పట్టాభిషేకం చేయమని, రాముడిని వనవాసానికి పంపమని కైకేయి అడిగిన కోరిక ప్రకారం తండ్రి ఆజ్ఞ మేరకు అరణ్యవాసానికి బయలుదేరతాడు రామచంద్రుడు. భరతుని కోరిక ప్రకారం తన పాదుకలను అతనికి కానుకగా ఇస్తాడు.)
చరణం 3:
అదిగో చూడుము బంగరు జింకా… అదిగో చూడుము బంగరు జింకా…
మన్నైకనునయ్యో లంకా… హరనయనాగ్ని పరాంగన వంకా…
అరిగిన మరణమె నీకింకా…
(అదిగో ఆ బంగారు జింకను చూడుము. ఇక లంకానగరం మట్టిలో కలిసిపోవలసిందే. శివుడి మూడవకంటి మంట వంటిదోయీ పర స్త్రీ అంటే. ఆమె జోలికి పోయావా నీకు మరణమే… అని రావణుని ఉద్దేశించి కవి అంటున్నాడు.)

రమ్ము రమ్ము హే భాగవతోత్తమ …వానరకుల పుంగవ హనుమా
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ… వానరకుల పుంగవ హనుమా
ముద్రిక కాదిది భువన నిధానం… ముద్రిక కాదిది భువన నిదానం..
జీవన్ముక్తికి సోపానం… జీవన్ముక్తికి సోపానం
(ఓ భాగవతోత్తమా! వానరకులంలోని పుణ్యాత్ముడా హనుమా! ఇదిగో ఇది ముద్రిక కాదు. భూలోకంలోని ఒక విలువైన మణి దీనిని తీసుకుపోయి సీతకు చూపించు!)
రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకులసోమా…
సీతాశోక వినాశనకారి… లంకావైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబౌనిక నీ చరిత…
సమయును పరసతిపై మమకారం…వెలయును ధర్మవిచారం
(రామనామాన్ని జపించే ఓ భక్తాగ్రేసరా! సీత శోకాన్ని హరించావు, లంకా వైభవాన్ని నాశనం చేసావు.
అయ్యో రావణా! నీ చరిత మరణం లేనిది. పరసతిపై మమకారం మరణించింది. ధర్మవిచారం నెలకొంది.)
రాముని అవతారం… రవికులసోముని అవతారం
రాముని అవతారం… రవికులసోముని అవతారం
ఇలా రామాయణ గాథను ఎంతో హృద్యంగా అందమైన పదబంధాలతో అల్లిన శ్రీ సముద్రాల గారు, బాణీ ఇచ్చిన సంగీత దర్శకులు, గుండెల్లో అమృతాన్ని ఒంపిన గాయకమణి, నారదుడిగా నవరసపోషణ చేసిన అక్కినేని వారు, పాటను వింటూ పరవశించిపోతున్న మనము – అందరమూ ధన్యులమే! కాదనగలరా?
ఈ పాటను ఈ వీడియో లింక్ లో విని ఆనందించండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *