April 28, 2024

స్మార్ట్ వర్క్

రచన: కవిత బేతి

“అరేయి నితిన్, ఇక్కడున్నావేంటి? అందరూ నీకోసం వెతుకుతున్నారు” ఆఫీస్ కాఫ్టేరియాలోని బాల్కనీలో నిలుచుని బయటకి చూస్తున్న నితిన్ దగ్గరగా వస్తూ అన్నాడు శశాంక్. “నీ ఫోన్ కూడా అక్కడే వదిలేసి వచ్చావ్. బాస్ మూడుసార్లు అడిగాడట. ఇదుగో నీ ఫోన్, కాల్ చేసి వస్తున్నానని చెప్పు” అని ఫోన్ అందియబోయాడు. ఒకే ఆఫీస్‌లో పనిచేసే నితిన్, శశాంక్ ఇద్దరూ, మంచి స్నేహితులు.
నితిన్ కనీసం వెనకకి తిరిగి చూడకుండా నింపాదిగా జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. అది చూసి చిర్రెత్తుకొచ్చింది శశాంక్‌కి. “పిచ్చెక్కిందా నీకు లేకపోతే రిసిగ్నేషన్ లెటర్ రెడీగా పెట్టుకున్నావా?” అని భుజం మీద చెయ్యేసినవాడు, నితిన్ మొహం చూసి కంగారుగా “ఏమైందిరా?” అన్నాడు.
“ఏం చెప్పాలిరా బాస్‌కి కాల్ చేసి, వదిలేయ్. క్లయింట్‌కి నిన్న పంపిన ప్రపోజల్ మార్చమన్నాడు నేను మార్చలేదు.” అని సిగరెట్ తాగడంలో నిమగ్నమయ్యాడు నితిన్.
“అదేం పెద్ద పని, ఎందుకు చేయలేదు మరి?” అన్నాడు శశాంక్.
“ఇంటికి వెళ్లి చేద్దామనుకున్నా కుదరలేదు. రాత్రి ఆఫీసులోనే కూర్చున్నా పనయిపోయేది” విరక్తిగా అన్నాడు నితిన్.
“సరేలే అయితే ఏమైంది. పొద్దున చేయొచ్చు కదా, ఇప్పుడు చేయొచ్చు కదా” అడిగాడు శశాంక్.
“మూడ్ లేదురా, ఇంట్లో రాత్రంతా గొడవ. నిద్రలేదు, అసలు బుర్ర పని చేయడం లేదు”
“ఏమైంది? ఎవరికి? రితికతో గొడవ పెట్టుకున్నావా?”
“నేను కాదురా. అమ్మకి, రితికకి అస్సలు పడడంలేదీ మధ్య. ఇద్దరి మధ్యలో నేను నలిగి పోతున్నాను. వీకెండ్ వస్తే చాలు, ఏదో ఒక పెంట పెడతారు”.
“అమ్మో! పెద్ద సమస్యే. అయినా ఏముంది, సర్దిచెప్పలేకపోయావా? మానేజ్ చేయాలోయ్” అన్నాడు శశాంక్.
“అయినా ఏముందా? నీకేంట్రా ఎన్నయినా చెప్తావ్. మీ అమ్మవాళ్ళు ఊర్లో ఉంటారు. నీ కథ వేరు, నా కథ వేరు”
“ఏ కథ అయినా అత్తాకోడలు అనేసరికి ఒకటేరా. ఊర్లో ఉంటే ఏంటి, మేము అక్కడికి వెళ్తాం కదా, ఫోన్‌లో మాట్లాడుకుంటూనే ఉంటాము కదా” అన్నాడు శశాంక్.
“అయినా, రంజిత నువ్వు చెప్పిన మాట వింటుంది. రితిక ఆలా కాదు. తన మాటే నెగ్గాలి అంటుంది, తననుకున్నది జరగకపొతే చిందులు వేస్తుంది. మనిషి మంచిదే అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది కానీ మా అమ్మ దగ్గరికి వచ్చేసరికి తేడా కొడుతోంది. ఇక అమ్మ సంగతి సరే సరి, పట్టుపట్టింది అంటే వదలదు. భిన్నధృవాలయిపోయారు ఇద్దరు” మొదటిసారిగా స్నేహితుడి దగ్గర తన బాధ చెప్పుకున్నాడు నితిన్.
“మెల్లిగా వాళ్ళే సర్దుకుంటారులే పదా వెళ్దాం” అని లేవబోయాడు శశాంక్.
“లేదురా, సర్దుకోవడం కష్టం. అమ్మ వయసులో పెద్దది, అత్తగారు అన్న గౌరవం ఉండాలి కదా, రితిక అమ్మపై గట్టిగా అరుస్తుంటే భరించలేక చేయి చేసుకున్నాను, మొదటిసారి. అందుకే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నాను. పనిలో కాన్సెంట్రేట్ చేయలేను, నువ్వెళ్ళు” అని తలదించుకున్నాడు నితిన్.
ఆశ్చర్యపోయాడు శశాంక్, మొబైల్ తీసి ఇద్దరి తరపున అర్జెంటుగా పర్సనల్ పని తగిలి వెళ్లాల్సి వచ్చింది హాఫ్‌డే లీవ్ అని హెచ్.ఆర్‌కి మెసేజ్ పెట్టి నితిన్ ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. “టూమచ్, ఇది చాలా అన్యాయం. తప్పు చేసావు” ఇద్దరికీ టీ చెప్పి అన్నాడు.
“క్లయింట్ ప్రపోజల్ మార్చాలి అని ఒక వైపు, అయిందా అయిందా అని బాస్ మెసేజీలు, కాల్స్ ఒక వైపు, వీళ్ళిద్దరి గొడవ ఒకవైపు. టెన్షన్‌లో ఉన్నారా అప్పుడు” తలదించుకునే చెప్పాడు నితిన్.
“అదే గొడవలో అమ్మ కూడా ఉంది కదా, ఎంత కోపం వచ్చినా సరే అమ్మ పైన చేయి చేసుకుంటావా? మరి, రితికని మాత్రం… ఎలా? ఇదేరా మనం చేసే తప్పు ఎక్కడి కోపమో ఎక్కడో చూపిస్తాం” నితిన్ చెసిన పనికి కొపంగా అన్నాడు శశాంక్.
“నాది తప్పే, మరి తను చేసిందేమిటి? అత్తగారిని మర్యాద లేకుండా మాట్లాడొచ్చా?” తను చేసిన దానికి కారణం చెప్పబోయాడు నితిన్.
“నితిన్, నువ్వు మీ అత్తగారి ఇంటికి ఎప్పుడు వెళ్ళావ్?” అనడిగాడు శశాంక్.
హఠాత్తుగా ఈ ప్రశ్న ఏమిటి అనుకొని కాసేపు ఆలోచించి, “గుర్తులేదు” అన్నాడు నితిన్.
“సరే, లాస్ట్ ఎప్పుడు తనతో మాట్లాడావు, ఫోన్ గాని మెసేజ్ గాని, గుర్తులేదా” ప్రశ్నించాడు శశాంక్.
“నేనెందుకు మాట్లాడతారా? ఏమవసరం ఉంటుంది” ఆశ్చర్యంగా అన్నాడు నితిన్.
“నువ్వు మీ అత్తగారితో అస్సలు మాట్లాడవు, నీ భార్య మాత్రం తన అత్తగారిని గౌరవించాలి, మర్యాదగా చూడాలి అని కోరుకుంటావు. ఇది ఎలా కరెక్ట్ చెప్పు? రంజిత నీ మాట వింటుంది, మీ అమ్మని బాగా చూసుకుంటుంది అన్నావు కదా, ఎందుకో తెలుసా? నేను వాళ్ళమ్మని బాగా చూసుకుంటాను కాబట్టి. తను ఎప్పుడు పుట్టింటికి వెళ్తానన్నా నేను కాదనను. అందుకే ఎప్పుడు మా ఊరు వెళ్దామన్నా తను వస్తుంది. మా అమ్మ కోసం ఏమైనా కొన్నా రంజితకి ఇచ్చి, తన చేత ఇప్పిస్తాను. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది, అలా సెట్ చేసాను మరి. నా మాట విను, నువ్వు రితిక వాళ్ళమ్మతో ఫ్రెండ్షిప్ చెయ్, మీ అమ్మను చూసుకున్నంత ప్రేమగా ఆవిడను చూసుకో, అప్పుడు చూడు రితికలో రియాక్షన్. ఇక అమ్మకి, మీ గొడవలవల్ల ఆఫీసులో సరిగా పని చేయలేకపోతున్నాను అని చెప్పు, ఇంట్లో నాకు ప్రశాంతత కావాలి, నీ కోడలిని ఇలా హ్యాండిల్ చేస్తావో నీ ఇష్టం, మీరిద్దరూ గొడవ పడొద్దు అని మనసు విప్పి మాట్లాడు. ఇద్దరి మధ్య నలిగిపోతున్నా అంటున్నావ్, అసలు మధ్యకి ఎందుకు వెళ్తున్నావు. వాళ్లిద్దరూ ఒకపక్క నువ్వు ఒక పక్క ఉండేలా చూడు. చూడూ, కొడుకుగా భర్తగా వాళ్ళిద్దరికీ నీ మీద హక్కు ఉంటుంది, ఎవరికి వాళ్ళు నీ దగ్గర వాళ్లకున్న బంధం వల్ల, చనువు వల్ల నువ్వు వారినే సపోర్ట్ చేయాలని ఎక్ష్పెక్ట్ చేస్తారు. ఒకరి ఎదురుగా ఒకరిని మెచ్చుకోవడం కానీ కించపరచడం కానీ చేయకు. అర్థం అవుతుందా ఏం చెప్తున్నానో. క్లయింట్‌ని ఎలా డీల్ చేస్తావో అలా డీల్ చేయరా” టీ పూర్తి చెసి, చెప్పాడు శశాంక్.
కాసేపు ఆలోచించి “అదెలా కుదురుతుంది బే, నువ్వు చేస్తావా?” అని ప్రశ్నించాడు నితిన్.
“ఎస్, పక్కా చేస్తా. మన మెయిన్ టార్గెట్ ఏముంటుంది క్లయింట్‌ని కన్విన్స్ చేయడం కదా, దాని కోసం ఎన్ని వేషాలేస్తాం. ఇక్కడా అంతే, వాళ్ళిద్దరి మధ్య ఫ్రిక్షన్ లేకుండా చేయటం టార్గెట్‌గా పెట్టుకో నీ దిమాగ్‌లో, నీకే ఐడియాస్ వస్తాయి. అన్నీ ఎలా సెట్ అవుతాయో చూడు. ఎంతసేపూ ఇద్దరు కొట్టుకుంటున్నారు అని నువ్వు బుర్ర బద్దలుకొట్టుకోకుండా ఏం చేస్తే ఆ గొడవ తగ్గుతుందో ఆలోచించి, అది ఆచరణలో పెట్టు. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నప్పుడు నువ్వు టెన్షన్ పడకురా, వాతావరణం హల్కా చేయడానికి ట్రై చెయ్. ఎంతమంది క్లయింట్స్‌తో డీల్ చేస్తావ్, ఎంత నేర్పుగా అవతలి వాళ్ళని కన్విన్స్ చేస్తావ్, ఆ చాకచక్యం ఉందికదా. కొంచం బుర్ర వాడరా, స్మార్ట్ వర్క్ చేయి. గాట్ ఇట్?” అంటూ నితిన్ భుజం చరిచాడు శశాంక్.
“ఎస్, గాట్ ఇట్” అని నిట్టూర్చాడు నితిన్.
“ఎలాగో ఆఫీస్ దొబ్బించావు, పద ఒక బీర్ కొట్టించు” అని లేచాడు శశాంక్.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *