April 28, 2024

వెంటాడే కథ – 20

రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507
నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. . ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

హ్యాపీ టైమ్స్!
యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వయసున్న ఓ పేద కార్మికుడతను.. పైగా బ్రహ్మచారి. లావుపాటి మహిళలంటే అతనికి తగని ఇష్టం. అలాంటి ఒక మహిళను ప్రేమించాడు. ఆ మహిళకు భర్త లేడు, కానీ పదేళ్ల కొడుకున్నాడు. కొడుకుతో పాటు పన్నెండేళ్ల సవతి కూతురును కూడా పోషించాల్సిన బాధ్యత ఆమెపై పడింది.
ఆ సవతి కూతురు అంధురాలు. దాంతో ఆ సవతి కూతుర్ని ఎలాగైనా వదిలించుకోవాలి.. కనీసం ఆ కూతురికి ఏదైనా ఉద్యోగం దొరికితే తనకు కొంత భారం వదులుతుంది అనుకుందామె. అదే విషయం తన ప్రియుడికి చెప్పింది.
”ఫలానా ఇన్ని రోజుల్లో నువ్వు ఆమెకి ఉద్యోగం ఇప్పించి ఆ పీడాకారాన్ని నాకు వదిలించగలిగితే నిన్ను చేసుకుంటాను లేకుంటే వేరేవాడిని చేసుకుంటాను” అని బ్రహ్మచారికి షరతు పెడుతుంది.
దాంతో ముసలాయన ఆ పిల్లకు ఉద్యోగం ఇప్పించడానికి నానా తంటాలు పడతాడు. అంధురాలికి ఎవరు ఉద్యోగం ఇస్తారు? పైగా పన్నెండేళ్ల పిల్ల ! సవతి తల్లి పోరుతో ఆమెకు కూడా కొంత మొండితనం అబ్బుతుంది. అయినా ఇంట్లో గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం వంటి పనులన్నీ సవతి తల్లి ఆమెతోనే చేయిస్తూ ఉంటుంది.
ఇంటి నుంచి వెళ్ళిపోయిన తన తండ్రి నుంచి ఎప్పటికైనా ఉత్తరం వస్తుందని, తనను తీసుకెళ్లి వైద్యం చేయించి చూపు
తెప్పిస్తాడని నమ్ముతూ ఉంటుంది ఆ బాలిక. అందుకే తండ్రి నుంచి ఉత్తరాలు వస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది.
“ఉద్యోగం చేస్తావా… డబ్బులు వస్తాయి” అని బ్రహ్మచారి అడిగితే “తప్పకుండా చేస్తాను కానీ మసాజ్ సెంటర్ అయితేనే చేస్తాను.. నాకు మసాజ్ చేయడం బాగా వచ్చు పైగా చాలా ఇష్టం కూడా” అని చెబుతుందా పిల్ల.
ఈమెకు ఉద్యోగం ఇచ్చేవారి కోసం బ్రహ్మచారి గారు ఎంతో ప్రయత్నం చేస్తాడు కానీ ఎవ్వరూ ఇవ్వరు.
మరోపక్క ప్రియురాలు పెట్టిన గడువు దగ్గర పడుతూ ఉంటుంది.
ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని కొందరు స్నేహితులతో సమాలోచనలు చేస్తాడు. వారు ఒక మంచి సలహా చెప్తారు. అదేమిటంటే వీళ్లంతా కలిసి కార్మికులుగా పనిచేసిన యజమాని దగ్గరకు వెళ్లి ఊరి బయట ఆయనకు ఉన్న షెడ్డును కొన్నాళ్లపాటు తమకు ఇవ్వమని అడుగుతారు. అతను మంచి మూడ్లో ఉండటంతో ”సరే వెళ్లి వాడుకోండి కొన్నాళ్ల పాటు” అని షెడ్ తాళాలు ఇస్తాడు.
బ్రహ్మచారి అతని స్నేహితులు కలిసి ఆ షెడ్డులో రెండు మూడు టేబుల్స్ రెండు కుర్చీలు వేసి ఇదే మసాజ్ సెంటర్ అని ఆమెను నమ్మిస్తారు. ఆమె అంధురాలు కనక వారి మాట నమ్ముతుంది. అందరూ తలా కొంత డబ్బు వేసుకొని కొన్ని క్రీములు పౌడర్లు నూనెలు తెచ్చి అక్కడ పెడతారు.
మసాజ్ సెంటర్ రెడీ అయింది మరి కస్టమర్లు ఎలా?
దానికి కూడా వారు ఒక ఉపాయం ఆలోచించి- వాళ్లే ఒకరి తర్వాత ఒకరు వచ్చి మసాజ్ చేయించుకుని ఆమె చేతిలో తలొక పావలా/ అర్థ రూపాయి పెడతారు. తమాషా ఏంటంటే ఆ ఉన్న ఐదుగురి మొదటి రౌండ్ అయ్యాక మళ్ళీ రెండో రౌండ్ వస్తారు.
చిల్లర డబ్బులు గలగల లాడుతుంటే ఆ పిల్లకు చాలా సంతోషం కలుగుతుంది. విచిత్రం ఏంటంటే ఈ కార్మికులు కూడా పేదవాళ్లే కావడంతో ఒక్కోసారి ఆమె సంచిలో వేసుకునే డబ్బులే తీసి మళ్ళీ ఆమె చేతిలో పెడుతుంటారు.
బ్రహ్మచారి ఆమె మసాజ్ సెంటర్ బాగా నడుస్తుందని చెప్పడానికి ఒక రోజున ప్రియురాలి ఇంటికి వెళ్తాడు.
కానీ ఆమె అప్పటికే వేరే వ్యక్తితో శృంగారంలో ఉంటుంది.
”ఇచ్చిన గడువు పూర్తికాకుండానే ఇలా మాట తప్పుతావా?” అని బ్రహ్మచారి అడిగితే –
“గుడ్డి పిల్లను మోసం చేసినట్లు నన్ను చేయాలనుకుంటున్నావా? అది నీ వల్లకాదు. ఇక పో.. ఇంకెప్పుడూ నీ ముఖం నాకు చూపకు! నువ్వే కాదు ఆ పిల్ల కూడా నాకు కనబడటానికి వీల్లేదు” అని మొహం మీద తలుపు వేస్తుంది ప్రియురాలు.
బ్రహ్మచారి తల కొట్టుకుంటూ మళ్లీ షెడ్ దగ్గరికి వస్తాడు.
ఈ కొన్ని రోజుల అనుబంధంతో ఆ గుడ్డిపిల్లపై అతనికి పితృ వాత్సల్యం కలుగుతుంది. ఆమెను సంతోషపెట్టడం కోసం అతను, అతని మిత్రులు ప్రయత్నం చేస్తూఉంటారు. రోజూ మసాజ్ చేయించుకుని చిల్లర పైసలు ఆమెకు ఇవ్వడానికి వాళ్ల దగ్గర డబ్బు ఉండదు. అందుకే ఆమె దగ్గర డబ్బులు కొట్టేసి మళ్లీ అవే ఆమె చేతిలో పెట్టి వ్యాపారం బాగా సాగుతున్నట్టు డ్రామా రక్తికట్టిస్తారు.
ఆమెను సంతోషపెట్టడం కోసం బ్రహ్మచారి ఆమె తండ్రి రాసినట్టుగా ఒక ఉత్తరం రాయించి తెచ్చి “ఇదిగో మీ నాన్న ఉత్తరం రాశాడు.. త్వరలోనే వచ్చి నీ కళ్ళకు వైద్యం చేయిస్తాడట” అని అది చదివి చెప్తాడు.
ఆ చిన్నారి మనసు సంతోషంతో పరవళ్లు తొక్కుతుంది.
“నాకు తెలుసు మా నాన్న ఎప్పటికైనా వస్తాడు. నాకు వైద్యం చేయిస్తాడు.. కొత్త బట్టలు తెస్తాడు” అని వారితో ఆనందంగా చెబుతుంది.
ఆ పిల్ల అమాయకత్వానికి వారు అవును అంటూనే తీవ్ర మానసిక వ్యధకు లోనవుతారు.
ఒక రోజున బ్రహ్మచారి, అతని మిత్రులు షెడ్ కి వచ్చేసరికి ఆ పిల్ల ఉండదు. కళ్ళు కనపడని పిల్ల ఎక్కడికి వెళ్లిందా అని వారు భయపడతారు. ఏ ప్రమాదంలో చిక్కుకుంటుందోనని ఆందోళన పడతారు. మసాజ్ సెంటర్ కోసం వాళ్ళు ఎప్పుడో తెచ్చి పెట్టిన ఒక పాతకాలపు టేప్ రికార్డర్ అక్కడే ఉంటుంది.
ఒక మిత్రుడు దాన్ని ఆన్ చేస్తే అందులో నుంచి ఆ పిల్ల మాటలు వినపడతాయి.
“అంకుల్స్ మీరు నన్ను సంతోష పెట్టడానికి ఆడుతున్న నాటకం అంతా నాకు తెలుసు. రెండోరోజునే ఈ విషయం నేను గ్రహించాను. మిమ్మల్ని సంతోష పెట్టడానికి, సంతృప్తి పరచడానికి నేను కూడా మీ నాటకం నాకు తెలియనట్టుగా నాటకం ఆడుతున్నాను.. కళ్ళు కనబడకున్నా మీ అందరి ఆర్థిక పరిస్థితులు అర్థం అవుతూనే ఉన్నాయి. అయినా మీరు నా సంతోషం కోసం ఎంతో చేశారు. ఇక మీకు భారం కాదల్చుకోలేదు. అందుకనే వెళ్ళిపోతున్నాను.. నేను మా నాన్నను వెతకటానికి వెళుతున్నానే తప్ప, చనిపోవడానికి కాదు. నాకు మీరు చాలా ఆత్మవిశ్వాసం ఇచ్చారు.. అందరికీ నమస్కారం”
బ్రహ్మచారితో సహా మిత్రులందరూ కలవర పడిపోయారు..
ఆమె మాత్రం కనిపించలేదు.
-:000: –

నా విశ్లేషణ:
ఇది సాధారణ కథ కాదు.. ఓ చైనీస్ సినిమా కథ! సినిమా పేరు ‘హ్యాపీ టైమ్స్’ యూట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఉంది. బహుశా ఈ కథను, ఈ సినిమాను ఎప్పటికీ మర్చిపోలేను. కనుకనే దీన్ని ఈ నెలకు ‘వెంటాడే కథ’గా మీ ముందుకు తీసుకువస్తున్నాను. కథ ఎలా మొదలై ఎలా పూర్తయిందో చదివారు కదా? సినిమా కూడా చూడండి మీకు మరింత నచ్చుతుంది. మీ మనసుకు మరింత చేరువవుతుంది.
ఇందులో ప్రధానంగా కనిపించేది మానవీయత.
పెళ్లి చేసుకోవాలనుకుని ఉవ్విళ్ళూరిన బ్రహ్మచారి ‘పితృ వాత్సల్యం’ అనే మరో బంధంలో చిక్కుకుపోతాడు. ఆ పిల్ల కూడా చాలా తెలివైనది కావడంతో వీరు ఆడే నాటకం గ్రహిస్తుంది.. తన కోసం వాళ్లు పడుతున్న అవస్థల్ని, చూపిస్తున్న ప్రేమాభిమానాల్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని వారికి భారంగా ఉండకూడదని మరి ఎక్కడైనా బతకవచ్చు అన్న ఆలోచనతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వెళ్ళిపోతుంది.

1 thought on “వెంటాడే కథ – 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *