April 28, 2024

మారిన తీరు

రచన: లక్ష్మీ రాఘవ

కొడుకు వెంకటేశు మాటలు విని శానా కోపం వచ్చింది రామయ్యకు
“మా చేత కాదురా. ఎట్లా బతుకుతున్నామో ఆలోచన సెయ్యి.” కాస్త గట్టిగానే అన్నాడు.
“ఏమి బతుకు నాయనా? అప్పుడు తాతను చూసినా, ఇప్పుడు నిన్ను చూస్తావున్నా, ఏంది మారింది? అందరి గుడ్డల మురికి వదిలించి మనం పూసుకున్నట్టు వుంది. నీట్ గా ఇస్త్రీ చేసిస్తే వాళ్ళు దర్జాగా ఉంటే చేసిన మనమేమో నలిగిన బట్టల్లోనే వుంటూ…ఛీ …? ఎట్లో నా మొండికి స్కూలులో అంతా ఫ్రీగా జరిగిపోతాందని వొప్పుకున్నావు. నీకు చదువు ఖర్చు లేదు ఇన్నాళ్ళూ. ఇంక పైన కుదరదు.. మీలాగే బతకాలని అంటే కుదరదు.” ఖచ్చితంగా అంటూన్న వెంకటేశుని కోపంగా చూసి లోపలకు వెళ్ళినాడు రామయ్య. నులక మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. తన గతం కళ్ల ముందు కనిపించింది ఒక్కసారి…
****.
“మునయ్యా, అప్పగారింటికి వచ్చి గుడ్డలు తీసకపోవాలంట. బిర్నా రావయ్యా. ఆలీసం చేస్తే మళ్ళీ నన్ను తరుముతారు” గట్టిగా అరచినాడు నారన్న, మునయ్య గుడిసె ముందు నిలబడి.
“పద, వస్తా నారన్నా, నాలుగునాళ్ళ కింద ఉతికిచ్చినా కదా. ఇంకా కాసిన్ని రోజులకు పోవచ్చులే అనుకున్నాలే” అన్నాడు మునయ్య బయటకు వస్తా.
“పట్నం నుండీ చిన్నఅమ్మాయిగారు వచ్చినారు గదా..”
“సరేలే, ఇబ్బుడే వస్తాoడా” అని భుజాన వున్న తుండుగుడ్డ ఇదిలించుకొని నారన్న ఎనకాలే వెళ్ళినాడు మునయ్య.
ఇంకా పండుకోనున్న కొడుకు రాముడిని తట్టి లేపుతా “లేయిరా బిడ్డా, మీ నాయన గుడ్డలు తేగానే సవుడు లేదంటే తిడతాడు. బిర్నా బోయి సవుడు భూమిలో ఒక సంచిడు సవుడు తీసకరావాల…” అనింది తల్లి ఈరమ్మ.
“నేను పోనే అమ్మా..” అని పక్కకు తిరిగి పండుకున్నాడు రాముడు.
“ఒరేయ్, మళ్ళీ మీ నాయన ఎల్లి తెచ్చికోవాల. కష్టం అవుతాదిరా నా బంగారూ లెయ్యి“
“అమ్మా ఉతికి, ఉతికి నా సేతులు, భుజాలూ నొప్పులేస్తా వుండాయే. ఈ పని కన్నా ఇంకేదైనా చేసుకుందాము”అన్నాడు లేచి వొళ్ళు విరుచుకుంటూ.
“ఏమి చేసుకుంటామురా. తరాలనుండీ వచ్చిన కులవృత్తి ఆయె. ఇంకే పనికి పోయినా రానీరు. అయినా వూరందరి గుడ్డలూ మనమే గదా శుబ్రం చేసేది. పనికి తగినట్టు తిండి గింజలు ఇస్తారు. పండగా వారమూ, పెళ్ళీ ఇట్లా అన్నిటికీ మనo కావాలే. సివరకు చచ్చినా శవం దగ్గర మన పని ఉంటుంది. తగినన్ని దుడ్లూ వస్తాయి. జీవనం గడిచిపోతుంది నాయనా నా మాట ఇనుకో..”
అమ్మ మాటలు పూర్తిగా ఇనకుండానే మొగం కడుక్కుని వచ్చి అమ్మ ఇచ్చిన సద్ది గంజి తాగి, సవుడు కోసం సంచి తీసుకుని వూరు ముందర వున్న సవుడు భూమికి ఎళ్లినాడు రాముడు.
సవుడు భూమిలో పైకి పొంగివచ్చే నున్నటి సవుడు సంచుల్లో తెచ్చుకుంటారు చాకలి వాళ్లు అందరూ. బట్టలు బానలో వుడుకు నీళ్ళలో వేసి నప్పుడు చారెడు సవుడు వేస్తే తెల్లగా అవుతాయి. కలర్ బట్టలకు ఏస్తే రంగుపొతాయి అని వాటికి వేయరు.
బట్టలు అన్నీ వూరి చెరువుపక్కనే వున్న పెద్ద బండ మీద ఆరేస్తారు మళ్ళీ ఎక్కువ నలగకుండా మడతేసి మూట కట్టి ఇళ్లకు తీసకపోతారు. మొదటనే జీడి తెచ్చి మధ్యలో గుచ్చి వచ్చిన నల్లరంగుతో వూరిలోని ఒక్కో ఇంటికి ఒక్కో గుర్తు బట్టలకు ఒక మూల వేసుకుంటారు. అందుకే అందరి బట్టలూ కలిసి వుతికినా, గుర్తులను బట్టి వేరు చేసి మూటలు కడతారు. వీళ్ళు తీసుకు వచ్చిన మూట లోని బట్టలు లెక్కబెట్టు కుంటారు ఆ ఆ ఇంటి వాళ్ళు. ఎప్పుడూ లెక్క పొరబాటు కాదు. ఎక్కువ చదువుకోక పోయినా లెక్క చూసుకునేంత తెలుసుకుంటారు చాకలివాళ్ళు.
మునయ్య కొడుకు తో కుల వృత్తి వదలకూడదని అన్ని మెలకువలూ చెప్పుతాడు. కానీ రాముడు ఈ కష్టం కంటే ఆ వూరిలోనే వున్న చాకలి గంగరాయుడు చేసే ఇస్త్రీ పనే సులభం అని వాదిస్తాడు. ఇది చూసి,చూసి ఒకనాడు ఈరమ్మ మొగుడి తో ఆనింది. “పోనీలే, గంగరాయుడికి ఇద్దరూ కూతుర్లే కదా. తన దగ్గర రాముడిని పంపుదాము. అక్కడ ఆ పనీ నేర్చుకుంటాడు. వీలైతే అల్లుడినీ చేసుకుంటాడు. ఆలోచించు. కొడుకు కళ్ల ముందు వుంటాడు.’ అని సలహా ఇచ్చింది.
“మన పని వదిలేస్తే ఎట్లా. మనకూ నలుగురు పుట్టినా వీడొక్కడే నిలిచినాడు. వీడన్నా నా మాదిరి వుండాల కదా” మునయ్య బాధ.
“వాడికి దీనిమీద మనసులేదు. మన బలవంతాన పని సేస్తావున్నాడు. వాడి కిష్టమైన పని ఇంటిపట్టునే జరిగిపోతుంది. మనలాగా కాయకష్టం వుండదు. వాడు సుఖంగా వుండేదే కదా మనమూ అనుకునేది” ఈరమ్మ మాటల్లో సత్యం కనిపించింది మునయ్యకు.
మరునాడు గంగరాయుడి ఇంటికి వెళ్ళి “నా కొడుకును పంపిస్తా కాసంత పని నేర్పు. వాడికి ఇస్త్రీ మీద ఇష్టం వుంది” అని అడిగినాడు. గంగరాయుడు ఒక నిముషం తరువాత
“రేపు పంపు, కానీ ముందుగా ఈ పని లో కష్టాలు వున్నాయి అని చెప్పు వాడికి. బొగ్గులు చేసుకోవాల. దాచుకోవాల. బరువైన ఇస్త్రీ పెట్టె దినమంతా ఎత్తుతూ ఇస్త్రీ చేయ్యాల. కుడి చేయికి బలం వుండాల. ఏ తరహా బట్టకు ఎంత కాపు వుండాల తెలుసుకుని చేయాల, వేడి ఎక్కువైతే కొన్ని బట్టలు కాలిపోతాయి. అప్పుడు వాళ్ళ చేత తిట్లు తప్పవు. దుడ్డ్లు కూడా పట్టుకుంటారు. జాగ్రత్తగా చేయాల. ఇంకా కొన్నిటికి గంజి పెట్టాల. గంజి పెట్టినప్పుడు సరిగా ఆరేయక పోతే ఇస్త్రీ కష్టం అవుతుంది. చీరలకు వేరేగా, జుబ్బాలకు ఇంకోరకంగా గంజి పెట్టుకునేదే కాదు, గంజి బట్టలు ఇస్త్రీ చేయడం కూడా కష్టమే. ఇస్త్రీ పనేమీ అంత సులభం కాదు”
“నాకు తెలుసు కదా. చెప్పి చూస్తాను. వాడి మోజు ఈడే వుంటే వస్తాడు. రేపు పంపుతా చూడనీ .. సరేనా” అని ఎల్లబారినాడు మునయ్య.
అట్లా చాకలి గంగరాయుడి దగ్గర ఇస్త్రీ చేయడం నేర్చుకున్నాడు రాముడు. వుతకడం కంటే ఇస్త్రీ చేయడం సులబంగా అనిపించింది. ఇష్టమైన పని అంటే అట్లాగే వుంటుందేమో…
కాలం తో బాటూ గంగరాయుడు తన కూతురు సరోజని రాముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళయిన రెండో ఏడే రాముడికి వెంకటేశు పుట్టినాడు.
మునయ్య, గంగరాయుడూ కాలం చేశారు. ఈరమ్మ కొడుకు దగ్గరే వుంది. రాముడు తండ్రి చెప్పిన మాట ఇనుకోకున్న చాకలి వాళ్ళ వృత్తిలోనే వున్నాడు అన్న తృప్తి ఈరమ్మకు…
ఇప్పుడు తన కొడుకు వెంకటేశు పట్నం వెళ్లిపోతానంటే కోపంగా వుంది రామయ్యకు.
నులక మంచం మీద పడుకున్నరామయ్య కాళ్ళ దగ్గర కూర్చున్న వెంకటేశు మెల్లిగా
“నాయనా కోపం తెచ్చుకోవద్దు. నేను చెప్పేది విను వూర్లో అందరూ కులవృత్తులే చేస్తా వున్నారా? ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో, భూస్వాముల కొడుకులూ ఒక్కరూ ఊరి లో లేరు. రైతు కొడుకు సేద్యం, మంగలోడు క్షవరం మానేసినట్టే చాకలోడు ఉతకడం మానేసి చదువుకుంటే వేరే పని చేసుకోవచ్చు.” మాట్లాడుతున్న కొడుకును తీవ్రంగా చూసి “ఎప్పుడూ కులవృత్తి మీద చిన్నచూపు వుండకూడదురా. తర తరాలుగా మనకు బతుకునిచ్చిందానిని ఇడిసిపెడతా నంటే ఎట్లా?” నులక మంచం మీదనుంచీ లేచి భుజాన వున్న టవల్ విదిలించి లేచి సందులోకి పోయినాడు.
రామయ్యను ఒప్పించగల సత్తా అవ్వ కే ఉంది అనుకుంటూ వెంకటేశు మెల్లిగా ఈరమ్మ దగ్గరికి పోయి కూర్చుని
“అవ్వా , నాయన కు నువ్వుఅయినా చెప్పు. నేను చదువుకుంటే బాగుపడుతాను అని, మీకంటే ఎక్కువ సంపాదిస్తాను. అందరం పట్నం పోవచ్చు. ఇప్పుడు నాకు చదువుకు ఖర్చు అవుతుంది. ఇన్నేళ్ళు కుల వృత్తి చేసి ఎంత వెనకేసుకున్నాము? నేనెట్లో కష్టపడి చదువుకుంటా అంటే వద్దే వద్దు అంటాడు నాయన. కానీ నాకిష్టం లేని పని చేసుకుంటా ఈ పల్లె లోనే వుండి పోయేది బాగుంటుందా? ఒక సారి చెప్పు అవ్వా” దీనంగా అడిగినాడు వేంకటేశు.
ఈరమ్మకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. వుతికే పని నాకిష్టం లేదు. నేను ఇస్ట్రీ పనికి పోతా అని కొడుకు మొండికేయడం. మునయ్య గంగరాయుడి దగ్గర చేరడం. ఈ పొద్దు వెంకటేశు ఈ పనే కుదరదు అంటే ఎందుకు ఆలోచించకూడదు? వాడి అదృష్టం బాగుంటే ఇంకా బాగా పైకి వస్తాడేమో. రాముడికి చెప్పాలి అనుకుని చెప్పింది
”ఒక సారి ఆలోచించుకో రాముడూ, వాడి ఇష్టం చదువు మీదే వుంది. నీవు వుతుకుడు మానేసి ఇస్త్రీ కి పోలా” అని.
రామయ్య గుర్తు చేసుకున్నాడు. నిజమే ఆ కాలం లో తానే నాయన మాటలు వినలేదు. ఇప్పుడు కొంచెం చదువు కున్నాక ఇంకా చదువుతా అని అంటే కాదని ఎట్లా అంటాడు?
రామయ్య భార్య సరోజ కూడా ‘కొడుకు ఇష్టమే బాగుంటుంది’ అనింది.
పొద్దున లేవగానే రామయ్య ఆ వూరి పెద్ద కాపు దగ్గరకు వెళ్ళినాడు.
“అయ్యా.. నా కొడుకు ఇట్లా మొండికేస్తా వున్నాడు. ఏమి చేయ్యాల?” అని సలహా అడిగినాడు.
“నిజమేరా.. ఈ కాలం పిల్లోళ్ళు ఇట్లనే వున్నారు. వాడు చదువు కోనీ, కొన్నాళ్ళ తరువాత అయినా. నేను మనోళ్లతో చెప్పి పట్నం లో వున్న డ్రై క్లీనింగు షాపులో చేర్పిస్తా…దానికి కొంచెం చదువుకూడా రావాలె, షాపుకి వచ్చినోళ్ళతో మాట్లాడడానికి , బిల్లులు రాసేదానికి. అట్లనే ఉతికే మెలుకువలూ నేర్చుకోవాల, ఇప్పటిలాగా కష్టపడే పని లేదు. అక్కడ పని వేరే. డిటర్జెంట్లు, మిషన్లు, పెట్రోల్ వాష్ లాటి పని అంతా నేర్చుకుంటే, మీరు కూడా తోడుంటే మంచిగా డబ్బు వస్తుంది.. మీకు బట్టల పని లోనే పిల్లగాడు వున్నట్టు వుంటుంది. వాడు పని బాగా చేయడం నేర్చుకుంటే మెల్లిగా చిన్న షాపు పెట్టుకుంటాడు. నేను డబ్బు సాయం చేస్తా.. తరాలుగా మాఇంటి బట్టల సంగతి చూసుకున్నారు. ఆ మాత్రం చేస్తే నాకూ తృప్తి గా వుంటుంది.”
రామయ్యకు సంతోషం వేసి పెద్దకాపు కాళ్ళు పట్టుకుని ”మీ దయ “అన్నాడు.
“ముందు వాడితో మాట్లాడి నాకు చెప్పు” అనగానే తలవూపుతూ దండం పెట్టి ఇంటికి బయలు దేరాడు తృప్తిగా..
ఇంటికి వెళ్ళాక ఈ విషయం వెంకటేశు ఒప్పుకుంటే కులవృత్తి మీద చిన్నచూపు లేకుండా, వృత్తి కాసంత తీరు మారినా, పూర్తిగా ఎల్లి పోదు తమ ఇంటి నుండీ అనుకున్నాడు రామయ్య తృప్తిగా.

**********

1 thought on “మారిన తీరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *