April 27, 2024

ప్రియనేస్తమా

రచన: శ్యామదాసి

వాసుదేవా! విజయక్కా, ఏంటి తల్లీ బిజీనా, మాకు కూడ కొంచం సమయం కేటాయించండి ప్లీజ్! మాటతో పాటే నవ్వూ కలిసుండేది ఝాన్సీకి. ఆ పలకరింపుతో కూడిన చమత్కారం ఇక నాకు వినిపించదు. నాలుగు రోజుల క్రితం నాకు ఫోను చేసి అక్కా! మందుల వల్ల చాలా మత్తుగా వుంటున్నది. కొంచం సేపు పడుకుని నీతో మళ్ళీ మాట్లాడుతాను. ఈ వేళ సత్సంగానికి కూడ అటెండ్ కాలేకపోయాను. అంటూ మాట్లాడిన ఆ స్వరం ఇక నేను వినబోను, అదే చివరి మాట అవుతుందని అస్సలు అనుకోలేదు.
పరిచయాలు మాత్రం నలభయి సంవత్సరాల వయినా, మేము సుదీర్ఘ ప్రయాణం చేసినవాళ్ళము కాము. కాలం తెచ్చిన మార్పులతో వలస పక్షుల్లా ఎక్కడెక్కడకో ఎగిరిపోయి, ఆరేళ్ళు క్రితం అనుకోకుండా మొదట మేము పరిచయమయిన వూరులోనే కలుసుకోవడం జరిగింది. కానీ, అప్పటికి అక్కడే ఆగిపోయిన మా స్నేహ యాత్ర ఒక పరమార్ధంతో ముడి పెట్టి వుంచాడు పరమాత్మ అని ఎఱుగము. కార్య కారణాలు కల్పిస్తూ ఆ స్వామి లీలలు అనంతాలు. ఆర్ధికంగా దెబ్బ తిన్నారని విని వాళ్ళ బంధువుల ద్వారా ఫోను నంబరు సంపాయించి ఫోను చేశాను. సున్నితమైన విషయం నొచ్చుకోకుండ పరిస్థితేంటి అని అడిగాను నాకేమయినా అవకాశమిస్తావా ఝాన్సీ అనగానే, అరక్షణం కూడ ఆలోచించకుండ నన్ను వదిలిపెట్టకుండ నాతో వుండక్కా, నాకు ఇంకేమి వద్దు. తినడానికి, ఉండడానికి పిల్లలు, మావారు చూసుకుంటున్నారు నాకు కావలసింది నీ తోడు అదిస్తే చాలు నాకు. ఆ రోజు మొదలు ఈ నాలుగేళ్ళల్లో ఒక్క రోజు కూడ మాట్లాడు కోకుండా లేము. ఆధ్యాత్మిక మార్గంలో బాటసారులమయ్యాము. కలసి ప్రయాణం చేస్తున్నాము. జీవిత గమనంలో అలసి సొలసి సేద తీరే సమయానికి మేమిద్దరం ఆత్మబంధువలమయి, సమయం విలువ గ్రహించిన వాళ్ళముగా ప్రతిదినము, మా సంబాషణలోని ప్రతి పదాన్ని గమ్యాన్ని చూపే కరదీపకగా చేసుకున్నామనడంలో ఎటువంటి సందేహం లేదు.
కేటాయించుకున్న సమయానికి పనులను పూర్తి చేసుకుని, ఇద్దరం కూడ ఒకే మనఃస్థితిని కలిగి సత్సాంగత్యాన్ని సద్వినియోగపరచుకున్న సంతృప్తిని, ఎనలేని ఆనందాన్ని పొందేవాళ్ళం. మధ్యకాలంలో ఏమైపోయాము? ఇప్పుడెట్లా మళ్ళీ కలుసుకున్నాము? అదీ ఈ మార్గంలో, భగవంతుడు ఎప్పుడు ఎవరిని జత చేస్తాడో! దీనినే అంటారేమో అక్కా, ఋణానుబంధం అని అంటూ, తరచూ తన సంతోషాన్ని వ్యక్తం చేసేది ఝాన్సీ. ఫోను ద్వారా మాట్లాడుకునే వాళ్ళమే తప్ప, ఫోనులో వీడియో సౌకర్యాన్ని ఎందుకు ఉపయోగించుకునేవాళ్ళం కామో తెలియదు.
మా సంబాషణలో మేము స్పృశించని మహానుభావుల పాదపద్మములు అరుదు. అర్చామూర్తి భగవంతుని నుండి అంతటా నిండియున్న భగవత్తత్వాన్ని మేము గ్రహించేందుకు ప్రయత్నించేవారము, భగవద్గీత, భాగవతము, రామాయణాలతో బాటు యోగవాసిష్టం వంటి మహత్ గ్రంధాల నుండి మేము విన్న మహనీయుల ప్రవచనాలను చర్చించుకునేవాళ్ళము. కానీ భక్తి మార్గం పైనే మొగ్గు చూపేవాళ్ళం. బహుశ: మా స్థాయి అదేనేమో!
ఝాన్సీ ఉండేది హైదరాబాదు, నేను బెంగుళూరు. తను “ఆర్ట్ అఫ్ లివింగ్” సభ్యురాలు. పాతిక ముప్పైమంది సభ్యులతో కూడిన ఆన్లైన్ జూమ్ సత్సంగం ప్రతి రోజు ఉదయం జరిగేది. ఝాన్సీ కూడ అందులో యాక్టివ్‌గా పాల్గొనేది. గురూజీ ఉపదేశాలను ఒక క్రమంలో అందరూ కలిసి వినడం, విశ్లేషించు కోవడం జరిగేది. సూక్ష్మమైన విషయాలను, ఎంతో సులభంగా, మనిషికి మనిషికి మద్య ఉండవలసిన సామరస్య భావాలను సత్సంబంధాలను నిత్య జీవితంలో ఆటుపోట్లను గృహస్థ జీవితంలో ఎదురయ్యే సందిగ్ధాలకు నిలబడగల శక్తిని, భగవత్తత్వంతో మేళవించి సరళంగా జీవించగల ఓర్పునేర్పులను, పాజిటివ్ థింకింగ్ను సాధన పూర్వకంగా గురువుగారి మార్గ దర్శకత్వంలో నేర్పుతున్నట్లుండేవి . ఏ రోజు కా రోజు ఆనాటి వారి చర్చాంశాన్ని నాకు పంచుతూ పరోక్షOగా నేను కూడ సత్సంగంలో పాల్గొన్న అనుభూతిని నాకు కలిగించేది ఝాన్సీ. అలాగే నేను ఇస్కాన్ సభ్యురాలను, నా గురువుల నుండి నేను తెలుసుకున్న విషయాలను, ప్రవచనాలను ఇద్దరం కలిసి వివరణ చేసుకునే వాళ్ళము. ప్రయాణం చేస్తున్న త్రోవలు వేరైనా మా చరమ గమ్యం మాత్రం ఒక్కటే. విలువలతో కూడిన మనిషిగా బ్రతకాలి “పరోపకారం పుణ్యాయ, పాపాయ పర పీడనమ్”.
నాలుగు నెలల క్రితం ఫోనులో ఆయాసపడుతూ మాట్లాడుతుంటే, చాలా యిబ్బంది పడుతున్నట్లున్నావు ఝాన్సీ రెస్ట్ తీసుకో మళ్ళీ మాట్లాడుకుందాము అంటే ఒప్పుకోలేదు. కొంచెం సేపయినా నీతో మాట్లాడనివ్వక్కా, నాకు తృప్తిగా వుంటుంది అని మాట్లాడసాగింది. తన అవస్థ అర్థమయి ఇక ఈ రోజుకు ఆపు దాము డాక్టరుకు చూపించుకున్నావా? ఏం చెప్పారు.
వెళ్ళానక్కా! లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అన్నారు. రోజు జ్వరం కూడా అందుకే వస్తున్నదట. మందులు, ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ పదిరోజులకు రమ్మన్నారు. మరునాడు కూడా కాస్త ఆలస్యంగా ఫోను చేసి ఈ రోజు పర్వాలేదు అన్నది. నేను భాగవతం నుండి ఆ రోజు విన్న టాపిక్ చెబుతుంటే తను వింటుండేది. రోజూ ఏదో ఒక సమయంలో మాట్లాడుకుంటూనే వున్నాము.
నెల్లాళ్ళ క్రిందట మందులు బాగానే పని చేశాయి అని చెబుతూ, మా అమ్మాయితో కలిసి రేపు బెంగుళూరు వస్తున్నాను రెండు మూడు రోజుల్లో వీలు చూసుకుని మిమ్మల్ని తప్పక కలుస్తాను. అన్నట్లుగానే కూతురుతో కలిసి మా యింటికి వచ్చి చాలాసేపే సందడిగా గడిపారు. ఆరోగ్యం కుదుటబడింది. చూసేందుకు కూడ తేటగా, ఆరోగ్యంగానే కనిపించింది పర్వాలేదు అనుకున్నాను. ఝాన్సీ కూతురు, అల్లుడు చెన్నై నుండి ట్రాన్స్ఫర్ మీద బెంగళూరు వచ్చియున్నారు. అమ్మాయి వద్ద నెలాఖరు వరకు ఉంటానని, ఆశ్రమానికి కూడా వెళ్ళి గురూజీ దర్శనం చేసుకుంటానని, సత్సంగంలో పాల్గొంటానని తన ప్రోగ్రాం చెప్పింది. అరేళ్ళయింది మేము కలుసుకుని, ఇప్పుడిది రెండోసారి మేము ముఖాముఖి కలుసుకోవడం. లిఫ్ట్ దగ్గరకూ వెళ్తూ హఠాత్తుగా నన్ను గట్టిగా కావలించుకుని మళ్ళీ ఎప్పటికి కలుస్తామో అక్కా! అంటూనే, అయినా మనము రోజూ కలుసుకుంటున్నట్లే వుంటుంది. మనసులో వెలితి లేదులే అంటూ నిండుగ నవ్వింది.
కొందరికి నవ్వు కళ్ళల్లో వుంటుంది. కొంతమంది పెదవులపై చిరు నవ్వు స్నేహపూరితంగా పలకరించినట్లుండటం చూస్తుంటాము. ఎప్పుడూ చిద్విలాసమైన తేట నవ్వుతో కొంచం కొంటెతనంతో కూడిన నవ్వు ముఖం ఝాన్సీది. అప్పుడప్పుడు అల్లరి మాటలతో ఉడికించి, వెంటనే పకపక నవ్వుతూ, నవ్విస్తూ అరవైలో, ఇరవయిలా మా వయసులు మరచిపోయినట్లుండేవాళ్ళము.
యధావిధిగ ఫోనులో కలుస్తూనే వున్నాము. ఆశ్రమ విశేషాలు గురూజీ దర్శనం అన్నీ ఎంతో సంతోషంగా చెప్తుండేది. రోజు సత్సంగ విషయాలతో సహా. తను హైదరబాదు వెళ్ళిన తరువాత ఒక రోజంతా ఫోను చేయలేదు. నేను చేస్తే ఎంగేజ్ అనిపిస్తుంది. ఆ ప్రక్క రోజు వాళ్ళ అమ్మాయి ఫోను చేసి ఆంటీ అమ్మకు బాగా ఆయాసంగా వుంది. మాట్లాడలేక పోతున్నారు. రేపు మీతో మాట్లాడతానని చెప్పామన్నారు. అమ్మను వదిలి వెల్దామని నేను తోడుగా వచ్చాను. ఇంతలో ఇలా అయిందాంటి. మరుసటి రోజు ఝాన్సీకి ఫోను చేస్తే వాళ్ళమ్మాయే మాట్లాడుతూ, అమ్మను నిన్ననే హాస్పిటల్లో చేర్చామని ఎమెర్జెన్సీలో వుంచారని పర్వాలేదు అంటున్నారు డాక్టర్లు అని చెప్పింది. ప్రక్క రోజు ఉదయాన్నే మెసేజిలో అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించండి ఆంటీ అని వుంది. ఎంత ధైర్యం చెప్పుకున్నా మనసు కీడును శంకిస్తూనే వుంది. వెంట వెంటనే ఫోన్లు హార్ట్ స్ట్రోక్ అన్నారు, బ్రెయిన్ స్ట్రోక్ అన్నారు ఈ శరీరాన్ని ఇంకా ఎక్కువ బాధ పెట్టడం ధర్మం కాదని గుండె గూడు నుండి గువ్వ ఎగిరిపోయింది.
రెప్పపాటు కాలం జీవితం అంటారు. కానీ ఈ కాస్త వ్యవధిలో ఎన్ని బంధాలు, అనుబంధాలు, ఆనందాలు, ఆవేదనలు, జ్ఞాపకాలెన్నో. ఎన్నో సంఘటనలు. సుదూర ప్రయాణం చేసిన బడలిక. ఎన్నో, ఇంకెన్నింటినో ఇవే నిజం, శాశ్వతమనేలా, మాయకమ్మిన మనసు జన్మజన్మలుగా ఆడిస్తున్న ఇంద్రజాల మేనని తెలుస్తున్నా, యదార్ధాన్ని చూడలేని అశక్తులము ” ఎంతకీ మెలఁకువరాని కలలా ఈ జీవి ప్రయాణం సాగుతూనే వుంటుంది కదా”!
తోడును కోల్పోయిన ఒంటరి మనసు మూగ వేదనతో ముసురు పట్టిన మబ్బయి, నా కళ్ళ వెంట కన్నీటిధారలుగా ప్రియనేస్తానికి నివాళులిచ్చాయి. “ఝాన్సీ”రోజు కొక్కసారయినా పలికే ఈ పేరు పెదవులపై నుండి మనసు మూలలలోకి జారి జ్ఞాపకంగా నిలిచిపోతుంది. కొన్ని పరిచయాలు భౌతికంగా బాధను మిగిల్చినా చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
మనమిక్కడ శాశ్వతంగా ఉండేందుకు రాలేదు. అలా వీలు లేదు కూడ. ఎవరు దిగవలసిన స్టేషను రాగానే వారు దిగిపోతారు. తరచూ మా మనసులకు మేము హెచ్చరికగా నేర్పుతూ వచ్చిన ఈ పదాలే ఇప్పుడు నా మనసుకు ఊరట నిస్తున్నాయి. నేను దిగవలసిన స్టేషను కూడా త్వరలోనే వస్తుంది. ఇన్ని రోజుల మా సత్సంగ సాధన ఝాన్సీని తప్పక గమ్యం చేర్చి ఉంటుంది. నేను గమ్యం చేరే వరకు నాకూ ఆ సాధనే తోడుగ నిలుస్తుంది. ఇది నా మనసు కోలుకునేoదుకు నేను చెబుతున్న హితవు. ఝాన్సీ నాకు పంపిన చివరి మెసేజ్
కోరుకోవడం
కోల్పోవడం
కోలుకోవడం
మద్య సాగేదే మన జీవితం.

1 thought on “ప్రియనేస్తమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *