April 28, 2024

లోపలి ఖాళీ – ధృవధర్మాలు

రచన: ప్రొ.రామా చంద్రమౌళి

‘‘బెట్టర్‌ యు సుసైడ్‌’’ గుసగుసగా అంది శిశిర సిగ్గుతో తలవంచుకుని. ప్రక్కనే రాయిలా కూర్చుని చోద్యాన్ని చూస్తున్న సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌, రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌, యాభై రెండేండ్ల తండ్రి రామభద్రాన్ని చూస్తూ. నిజానికి అతని ముఖం మసిపట్టిన మట్టి కంచుడు అడుగులా ఉండాలె. కాని తోమిన రాగి చెంబులా ఎర్రగా, వికారంగా ఉంది.
ఆ క్షణం అప్పుడు.. అక్కడ జరుగుతున్న సందర్భమేమిటంటే.. రాష్ట్రంలోని ఐదుచోట్ల ఏకకాలంలో రామభద్రం ఆస్తులపై సి బి ఐ అధికారులు ‘ ఆదాయానికి మించిన ఆస్తుల సముపార్జన ’ కేస్‌ లో జరుపుతున్న దాడిలో భాగంగా ఉన్నపళంగా కుటుంబ సభ్యులను అచేతనంగా గృహ నిర్బంధంలో ఉంచి .. రామభద్రం, శిశిర సమక్షంలో చేస్తున్న తనిఖీల్లో బయటపడ్తున్న కుప్పలక్కుప్పల కరెన్సీ, బంగారు ఆభరణాలు, ఎక్కడెక్కడో ఉన్న వివిధ రకాల భూముల, ప్లాట్ల, భవనాల బాపతు డాక్యుమెంట్లు, వివిధ పట్టణాల్లోని బ్యాంక్‌ లాకర్ల బాపతు తాళం చెవులు.. వాటి వివరాలు.. ఎవరెవరో ఇచ్చిన కానుకలు, వగైరా.. ఎదుట రాశులుగా పడి.,
రామభద్రం కట్టిన నాలుగంతస్తుల ఇంద్రభవనాన్ని తలపించే ఆ బిల్డింగ్‌ ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత నాజూగ్గా , గడ్డకట్టిన వెన్నెల పలకలతో నిర్మించినట్టు కాంతులీనుతోంది. శిశిర తండ్రి ఆ అతిసుందర భవనాన్ని నిర్మిస్తున్నపుడు తను ఇంజనీరింగ్‌ లో ఐ ఐ టి , ఖాన్‌ పూర్‌ నుండి ఎం.టెక్‌ చదివి తర్వాత ఐ ఐ ఎం అహమ్మదాబాద్‌ నుండి ఎం బి ఎ పూర్తి చేసుకుని దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇంటికి రావడం ఇదే ప్రథమం. మూడేండ్ల క్రితం తల్లి సుహాసిని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన తర్వాత ఇక ‘ తనకో ఇల్లుంది’ అన్న భావన పూర్తిగా ఇగిరిపోయింది శిశిర మనసులోనుండి .
శిశిరకు తండ్రి ప్రవర్తనపై మొదటినుండీ సందేహమే. ‘ఇంత భారీ స్థాయిలో సంపాదన ఎక్కడిది వీడికి ’ అని తర్జనభర్జన జరిగేది అనుక్షణం ఆమెలో చిన్నప్పటినుండీ. అందువల్ల తండ్రి అంటే.. ప్రహ్లాదుడూ, హిరణ్యకశిపుని రిలేషనే తమది అనుకునేది ఎప్పుడూ.
తల్లి జీవితమంతా రామభద్రం చెరలో బందీ ఐన ఖైదీలా నిశ్శబ్దంగా , జీవచ్ఛవంలా కనిపించేది నిరంతరం. ఆమె ఎందుకో పోతపోసిన దుఃఖంలా అనిపించేది ఎప్పుడూ. ఆత్మహత్య అనే ప్రక్రియతో తల్లి తనను తాను ఈ దుర్మార్గ భర్త నుండి విముక్తిని సాధించిందని అర్థమయ్యింది శిశిరకు ఈ లోకం పోకడ అర్థం చేసుకున్నకొద్దీ.
శిశిర లోలోపలినుండి పొంగివస్తున్న దుఃఖంతో అప్రయత్నంగానే ఎదురుగా ఉన్న గోడపై మల్లెపూవులా నవ్వుతూన్న చని పోయిన తల్లి మృదుల ఫోటోలోకి చూచింది.
‘ఈ దుర్మార్గుడైన తన తండ్రితో సంసారం చేసిన పాపానికి అమెకు తొందరగా మృత్యువు సంప్రాప్తించడం మంచిదే ఐంది’ అనుకుందామె.
బుద్ది తెలిసిన్నాటినుండీ ఊటీలో సెయింట్‌ షెపర్డ్‌ స్కూల్‌.. అటు తర్వాత ఇంకా అటువంటివే కాలేజీలూ.. ఐ ఐ టి లు.. ఐ ఐ ఎం లూ.. ఇప్పటిదాకా గడిచిన జీవితమంతా కార్పొరేట్‌ చదువులే. ఎప్పుడో ఒకసారి నాల్గయిదు రోజులు సెలవుల్లో వస్తే ఈ తమ ఇల్లు అందమైన పాముల పుట్టలా అనిపించేది ఎందుకో. తన కుటుంబ నేపథ్యానికీ, తనకూ ఏమాత్రం కూడా సంబంధం లేదనీ, తన మానసిక సంస్కృతికీ, తత్వానికీ భిన్నమైన వర్తమానం ఏదో ఎప్పుడూ అప్రత్యక్షంగా తన గుండెల్లో గుచ్చుకుంటోందనీ తెలుస్తోం దామెకు తను పదవ తరగతి పాసైన నాటినుండి.
ఇప్పుడు ఈ అతి జుగుప్సాకరమైన అవినీతి నిరోధక అధికారుల దాడి.. శిశిరకు తనపైబడి ఏకధాటిగా వందలకొద్దీ విషసర్పాలు కాటేస్తున్నట్టనిపిస్తోంది.
తండ్రి రామభద్రం మాత్రం నిశ్చింతగా, నిరామయంగా చూస్తున్నాడు. బహుశా ఈ స్థితినుండి తప్పించుకుని బయట పడేందుకు ఏ రాజకీయ నాయకునితో ఏ రకమైన పైరవీ చేయాలా అని ఆలోచిస్తున్నట్టనిపిస్తోంది. అతను ఒకసారి తనతోనే ‘ ఈ పవిత్ర భారతదేశంలో డబ్బుతో దేన్నైనా కొనొచ్చు అన్న పరమ సత్యాన్ని గ్రహించు ’ అన్న సార్వజనీన సిద్ధాంతాన్ని చెప్పినట్టు గుర్తు.
సృష్టిలో ఒక చిత్రమైన ‘ బిహేవియరల్‌ కాంట్రవర్సీ ’ ఉండడం జ్ఞాపకమొచ్చింది శిశిరకు.
అయస్కాంతం భౌతికంగా ఒక యూనిట్‌. ఒకే శరీరం. దానికి రెండు ధృవాలుంటై రెండు కొసలకు. రెండు ధృవాల లక్షణాలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటై. తనూ.. తన తండ్రిలా. ఒకటే కుటుంబం.. భిన్న వ్యక్తిత్వాలు.. తత్వాలు.. తమవి. ఒకే అయస్కాంతం.. భిన్న ధృవధర్మాలవలెనే.
‘ఇప్పుడు తనేమి చేయాలి’ అన్న ప్రశ్న తొలుస్తోంది కుమ్మరిపురుగులా శిశిరను.
సాయంత్రానికి తన ఇంట్లోనుండీ.. మిగతా నాలుగు చోట్లనుండీ అందిన సమాచారాన్ని క్రోడీకరించి ఆఫీసర్స్‌ ఒక పట్టిక తయారుచేసి సంతకం తీసుకున్నారు రామభద్రంనుండి. మొత్తం లిస్ట్‌ ను వినిపించారు కూడా.
నగదు మొత్తం: పద్దెనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల పద్నాలుగు వేల ఇరవై ఐదు రూపాయలు. మొత్తం బంగారం: రెండు కిలోల రెండువందల గ్రాములు. వజ్రాలు వగైరా కలిగిన నగలు: ఐదువందల గ్రాములు. మొత్తం స్థలాలు. వరంగల్‌, హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ , గుంటూర్‌ లలో మొత్తం పన్నెండు ప్లాట్లు. వాటి విలువ ఎనిమిది కోట్ల అరవై లక్షలు. హైదరాబాద్‌ చుట్టు ప్రక్కల మొత్తం యాభై ఎకరాల వ్యవసాయ భూములు. ముఖ్యమైన పట్టణాల్లోని వివిధ బ్యాంకుల్లో మొత్తం ఎనిమిది లాకర్లు. వాటి వివరాలు క్రింద పొందుపర్చబడ్డాయి …. ‘‘ ఇట్లా కొనసాగింది అక్రమ ఆస్తుల వర్ణన. ఆ చిట్టాను చదువుతున్నప్పుడు తండ్రి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ కూర్చుంది శిశిర.
చిత్రంగా రామభద్రం ముఖంలో కించిత్తు పశ్చాత్తాపంగానీ, సిగ్గుగానీ, అపరాధభావన తాలూకు చింతగానీ, లజ్జగానీ అస్సలే లేవు. ఒక బండరాయిలా కూర్చున్నాడు నిశ్చింతగా.
తనను కూడా సంతకం చేయమంటే శిశిర అంది ‘‘ నాకూ ఈయనకూ ఏ సంబంధమూ లేదు. యాస్‌ ఆన్‌ ఔట్‌ సైడర్‌ ఐ కెనాట్‌ సైన్‌ ‘‘ అంది. ’’ ఒక అత్యంత అవినీతిపరుడైన వ్యక్తికి కూతురుగా ఉండడం నాకిష్టం లేదు. నా తరపున ఈయనకు ఏ మద్ధతూ ఉండదు. మీరు చెప్పిన ఆ ఆస్తులన్నింటినీ మీరు నిరభ్యంతరంగా జప్తు చేసుకోవచ్చు’’ అని అక్కడినుండి లేచి శిశిర చరచరా వెళ్లిపోయింది బయటకు శాశ్వతంగా.
అక్కడున్న అందరూ విస్తుపోయారు.
తర్వాత ఆమె విన్నది.. ‘రామభద్రాన్ని అరెస్ట్‌ చేశారు.. ఉద్యోగం నుండి సస్పెండ్‌ చేశారు. తర్వాత తీసుకున్న లంచాల ఉదంతాలు ఋజువై పన్నెండేండ్లు జైలు శిక్ష పడింది. చంచల్‌ గూడ జైళ్ళో ఆయన శిక్షను పూర్తి చేస్తూ తొమ్మిదవ ఏట కృషించి చనిపోయాడు.’ అని. ఆ తొమ్మిదేండ్లలో ఏ ఒక్కనాడూ శిశిర రామభద్రాన్ని సందర్శించలేదు. కనీసం ఆయన గురించి ఆలోచించలేదు.
రామభద్రం కూతురును కోల్పోయినందుకు చింతించాడా.. తర్వాత్తర్వాత పశ్చాత్తాప పడ్డాడా. అతను తను చేసిన తప్పులకు ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడా. అసలేంజరిగింది.
వ్చ్‌.. తెలియదు శిశిరకు.
రామభద్రానికి భార్య ఐనందుకు తన తల్లి మృదుల పడిన కష్టాలనూ, పొందిన క్షోభనూ తలుచుకుని కుమిలిపోయింది శిశిర అప్పుడప్పుడు.
రామభద్రానికి కూతురై జన్మించినందుకు తను మాత్రం ప్రాయశ్చిత్తం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది.
ఈ తొమ్మిదేండ్లలో శిశిర తన మార్గాన్ని సుష్పష్టంగా నిర్వచించుకుని తను చేయవలసిన జీవిత ప్రయాణాన్ని నిర్ధారించు కుంది.
చదువువల్ల మనిషికి జ్ఞానమబ్బుతుంది. జ్ఞానం ద్వారా వివేకం, వివేకంద్వారా ఆత్మశోధన.. అంతిమంగా మనిషి ప్రకృతిలో ఒక భాగమనీ, మనిషి ఎప్పుడైనా అందరికోసం ఒక్కడనీ.. ఒక్కనికోసం అందరనే స్పృహా, హృదయాతీతమైన ‘ ఎరుక ’ కలుగుతుందనీ గ్రహించిందామె. ఆ గ్రహింపులోనుండి.. ఎవరైనా ఏదైనా సాధించాలంటే అందుకు తగిన ఆర్థిక పరిపుష్టతా, శుభ్రమైన వ్యక్తిత్వమూ అత్యవశ్యకమనీ తెలుసుకుందామె.
అందుకే తనను తాను ఒంటరి అని నిర్వచించుకున్న మరుక్షణం తన సకల శక్తులనూ క్రోడీకరించుకుని శిశిర ఒక సాఫ్ట్‌ వేర్‌ కంపెనీని ‘సామాజిక బాధ్యతతో’ ప్రారంభించింది. ఎం బి ఎ లో ఆమె నేర్చుకున్నదేమిటంటే.. ‘ ఒక కంపెనీని స్థాపించాలంటే కావలసింది అందరూ అనుకుంటున్నట్టు డబ్బు కాదు. స్థైర్యం.. ప్రణాళికాబద్ధమైన , నిజాయితీతో కూడిన , లక్ష్యశుద్ధి గల ప్రణాళిక. గమ్యం వైపు స్థిరమైన అడుగులు వేయగల చేవ. రిస్క్‌ టేకింగ్‌ కెపాసిటీ. ’
ఆ ధైర్యంతో రూపుదిద్దుకున్నదే ‘ఫ్యూచర్‌ మేకర్స్‌’ సంస్థ.
‘ఎప్పుడు కూడా విజయాలు సంఘటితమైన మానవ సమూహాలతోనే సాధ్యమౌతాయి. వ్యక్తులతో కాదు.’
‘ఉత్పత్తి ఏదైనా అత్యున్నత ప్రమాణాలూ, నాణ్యతా. అతి తక్కువ ధరా ఉన్నపుడే తప్పక వినియోగదారుల మన్నన పొంది నాలుగు కాలాలపాటు వర్థిల్లుతుంది ’
గాంధీజీ సిద్ధాంతం ప్రకారం ‘ఈ దేశమంతటా లక్షల సంఖ్యలో ఉన్న గ్రామాలతోనే నిర్మితమై ఉంది. కాబట్టి గ్రామాభివృద్ధీ, గ్రామ ప్రజల అభ్యున్నతీ, గ్రామ స్వరాజ్యమే ఈ దేశప్రగతికీ, వికాసానికీ హేతువూ.. మూలం. దేనికదే గ్రామం కనుక అభివృద్ధి చెందితే ఈ దేశం అభివృద్ధి చెందినట్టేగదా ’ అని ప్రవచించారాయన.
మెమరీ మేనేజ్‌మెంట్‌ లో కూడా అంతే కదా.. ఒక్కొక్క మెదడులోని జ్ఞాపకాల అర గనుక సరియైన మూలకంతో నిండితే ఇక ‘ తేనెటీగల గూడు’ వలె వ్యవస్థ మొత్తం సంభరితమౌతుంది.
కాబట్టి శిశిర ఒక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో ఐతే తను నివసిస్తున్న ఒక వార్డ్‌.. లేదా ఒక డివిజన్‌.. ఒక ప్రాంతం ఒక యూనిటైతే.. ఆ యూనిట్‌ ను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలి. అటువంటి అనేక ఆరోగ్యభరిత యూనిట్లు.. ఒక నియోజకవర్గాన్ని.. ఆ నియోజకవర్గం ఒక జిల్లాను.. కొన్ని జిల్లాలు ఒక రాష్ట్రాన్ని.. కొన్ని రాష్ట్రాలు ఒక దేశాన్ని పునర్నిర్మిస్తాయి.
‘ఒక దీపం మరొక దీపాన్ని… ఆ దీపం ఇంకొక దీపాన్ని… కొన్ని దీపాలు అనేక దీపాలను… అంతిమంగా ఆ అనేక దీపాలు సమస్త పరిసరాలను కాంతిమయం చేస్తూ దేశాన్ని ప్రజ్వలింపజేయడం.’ అదీ సిద్ధాంతం.
శిశిర అందుకు ప్రణాళికాబద్ధంగా నైతిక విలువల్ని ప్రతిష్టిస్తూ తన కంపనీ ‘ఫ్యూచర్‌ మేకర్స్‌’ లో దాదాపు ఐదు వందల మంది సామాజిక స్పృహ ఉన్న యువతీ యువకుల్ని తన సైన్యంలా తయారు చేసుకుంది.
ఇక ఇంతవరకు ఈ దేశంలో అందరూ విస్మరిస్తున్న అతి ప్రధాన మానవ వనరు ‘వరిష్ట పౌరుల వినియోగం’ . సీనియర్‌ సిటిజన్‌ అంటే.. నిజానికి ఎంతో జీవితానుభవమున్న ఒక మానవ వనరు. యాభై ఎనిమిదేళ్ళకో, అరవై ఏళ్ళకో మనుషులు పూర్తిగా నిరుపయోగమైపోరు. వాళ్ళని రిటైర్‌ చేసి.. ఒక వ్యర్థ వస్తువువలె ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోవడమే లేదు ఈ దేశంలో. కాని వాస్తవానికి వాళ్ళు తమతమ వృత్తుల్లో దశాబ్దాల పర్యంతం అనేక సమస్యలను ఎదుర్కొని వాటికి తగు పరిష్కారాలను కనుక్కుని అమలు చేసినవాళ్ళు. రిటైర్‌ ఐన ఒక డాక్టర్‌, ఒక ఇంజనీర్‌, ఒక లాయర్‌.. ఒక టెక్నీషియన్‌.. వీళ్ళందరూ సమాజంలో పనికిరాని వస్తువులను ‘ వేస్ట్‌ పేపర్‌ ఇన్‌ ద డస్ట్‌ బిన్‌ ’ వలె పారేయబడ్తున్న వాళ్ళే. ఈ అద్భుతమైన మానవ ఉజ్వల శక్తిని పునరుపయోగంలోకి తేవాలి. అదే శిశిర అనే తను ఎప్పటినుండో స్వప్నిస్తున్నది. కాగా .. అరవై ఏండ్ల వరిష్ట తరం ఈ దేశ స్వాతంత్య్ర సిద్ధికోసం జరిపిన జాతీయోద్యమం గురించి పూర్తిగా తెలిసినవాళ్ళు. నీతినియమాలూ, నైతిక విలువలూ పరిఢవిల్లిన సమాజంలోనుండి వచ్చినవాళ్ళు. మాటంటే ప్రాణమని భావించినవాళ్లు. ఇప్పుడు నశించిపోతున్న మానవీయ విలువలు, నైతికత, ‘ సోషియల్‌ రెస్పాన్సిబిలిటీ ’ అస్సలే లేని ‘ సెల్ఫ్‌ సెంటర్డ్‌ ’ యువతరం కానివారు. వీళ్ళని రేపటి ఉత్తమ తరం నిర్మాణానికి ప్రేరకులుగా ఉపయోగించాలె . దీర్ఘంగా అలోచించి.. తను తయారు చేసుకున్న యువ సైన్యంలోని అనుచరులను సమీకరించుకుని ఆచరణాత్మక రంగంలోకి దిగిందామె.
‘‘సర్‌! మన ప్రాచీన సంస్కృతిలో కూడా.. కార్యశీలురైన అనేకమంది రాజులూ, నాయకులూ, చక్రవర్తులూ.. ఎప్పుడూ రాజగురువుల పేరుతో మీవంటి వ్యూహకర్తలూ, మానవ సమాజంపట్ల ఎంతో అవగాహనా, జ్ఞానమూ ఉన్న ఋషితుల్యుల ఆశీస్సులనూ, మార్గదర్శకత్వాన్నీ ఉపయోగించుకుని ప్రజలను సంపన్నులుగా మార్చి రాజ్యాలను సుభిక్షంగా వర్థిల్లజేశారుగదా. ఆ క్రమంలో ఎంతో పరిణతీ, అపారమైన ప్రజ్ఞా ఉన్న మీరు.. సామాజిక శాస్త్రంలో ముప్పయ్యెనిమిదేండ్లు యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్‌ గా సేవలందించి రిటైర్‌ ఐన మీరు.. ఈ మన ‘ఫ్యూచర్‌ మేకింగ్‌’ కు సిద్ధాంతకర్తగా ఉండాలె సర్‌.’’ అని వినమ్రంగా ప్రతిపాదించింది శిశిర ప్రకాశరావుతో.
అప్పుడామె ఆఫీస్‌లో వాళ్లిద్దరే ఉన్నారు.
ప్రకాశరావు ఆమెవైపు సాలోచనగా, ఆశీఃపూర్వకంగా చూచి ‘‘ ఊఁ ’’ అన్నాడు.
‘‘సర్‌! నావి రెండు ప్రతిపాదనలున్నై సర్‌. ఒకటి – మీకు ఇదివరకే ఎన్నోసార్లు చెప్పినట్టు.. అద్భుతమైన రిటైర్డ్‌ ఉద్యోగుల అపారమైన జ్ఞానశక్తిని మనం మన సమాజ వృద్ధికోసం రీ- సైక్లింగ్‌ పద్ధతిలో నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవాలె. వాళ్ళ వాళ్ళ ఇండ్లలోకూడా ఎంతో ప్రతిభాశీలురైన సీనియర్‌ సిటిజన్స్‌ వాళ్ళ కుటుంబ సభ్యులతోకూడా సరిగా గౌరవించబడ్డంలేదు. ఏదో పనికిరాని ‘సామాను’ వలెనే పరిగణించబడ్తున్నారు వాళ్ళు. నేను మన కాలనీ.. అంటే ఇరవైనాల్గవ బ్లాక్‌.. ఇల్లిళ్ళు తిరిగి సమాచార సేకరణ చేసిన స్టాటిస్టికల్‌ గా. మన కాలనీ జనాభా మూడువేల ఎనిమిది వందలు. పురుషులు రెండువేల రెండువందల మంది. మిగతావాళ్ళు స్త్రీలు. వీళ్ళలో ఉద్యోగాల్లోనుండి రిటైర్‌ అయిన వాళ్ళు స్త్రీలూ పురుషులూ కలిపి.. మొత్తం నాలుగువందల పదహారు మంది. దీంట్లో ఇరవై ఐదుగురు సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్స్‌.. పద్దెనిమిదిమంది లేడీ గైనకాలిస్ట్‌ లతో కలిపి. పద్దెనిమిదిమంది రిటైర్డ్‌ ప్రొఫెసర్స్‌. యూనివర్సిటీ, ఇంజనీరింగ్‌ కాలేజ్‌లు, మెడికల్‌ కాలేజ్‌ల నుండి. పదిమందిదాకా రిటైర్డ్‌ చీఫ్‌, ఎగ్జిక్యూటివ్‌, డిప్యుటీ ఇంజనీర్లు. పదహారుమంది రిటైర్డ్‌ అడ్వకేట్స్‌.. జడ్జెస్‌. తెలుగు పండితులు పన్నెండుమంది . రచయితలు, సామాజిక ఉద్యమకారులు పన్నెండుమంది. వీళ్ళుగాక ఉద్యోగవిరమణ లేని డెబ్భై ఏళ్ళు నిండిన వ్యాపారవేత్తలు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, టెక్నీషియన్స్‌, అధ్యాత్మికవేత్తలు.. చాలా మందే ఉన్నారు. వీళ్ళందరూ జీవితమంటే దేవుడిచ్చిన వరమని భావిస్తూనే తమ తమ పిల్లలచేత తగిన గౌరవాన్ని పొందలేక.. ఏ ఆర్థిక ఆదాయం ఆశించకుండానే తమ ఆత్మతృప్తికోసం కమ్యూనిటీ డెవలప్‌ మెంట్‌ కోసం రోజూ నాల్గయిదు గంటలు మనం రూపొందిస్తున్న ‘ అందరికోసం అందరం ’ ప్రణాళికలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిగో వాళ్ళ అంగీకారపత్రాలు. కొందరు కాలేజ్‌ పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతారు. కొందరు మన బ్లాక్‌ లో అవసరమైన వాళ్ళకు ఉచితంగా వైద్యం అందజేస్తారు. కొందరు న్యాయ సలహాలను అందిస్తారు. ఇట్లా ఊహించండి ఇది మనం సాధ్యపర్చినపుడు మన బ్లాక్‌ ఎంత ఉజ్జ్వలమౌతుందో. విశేషమేమిటంటే.. దాదాపు వీళ్ళందరూ తమను తమ ఇల్లు అనబడే ఆ నాల్గు గోడల జైలు నుండి తప్పించి ప్రజోపయోగ కార్యానికిఉపయోగిస్తున్నందుకు సంతోషంతో పొంగిపోయి కృతజ్ఞతలు చెపుతూండడం. వీళ్ళందరికోసం.. నాల్గు అంతస్తుల్తో ప్రతిరోజూ ఎవరెవరికి ఏమి సేవలు కావాలో వాటిని ఉచితంగా అందించేందుకు వీలుగా ఒక పూర్తి ఏర్‌ కండిషన్డ్‌ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నాను పుల్లీ ఎక్విప్డ్‌ అండ్‌ ఫర్నిష్డ్‌. రెండవది: మన బ్లాక్‌ నుండి అవినీతిని అరవై మైళ్ళ అవతలకు పారద్రోలడం. చూడండి సర్‌.. మన బ్లాక్‌ లో గత వానాకాలం ముందే మూడు కిలోమీటర్ల తార్‌ రోడ్‌ వేశారు. కాని మొన్నటి రెండు వానలకే రోడ్‌ కొట్టుకుపోయింది. మళ్ళీ అన్నీ బొందలే. అది మొత్తం రెండు కోట్ల ప్రాజెక్ట్‌. రాజకీయ నాయకులే కాంట్రాక్టర్లు. వీళ్ళు చేసే అకృత్యాలను ప్రశ్నించే నాధుడే లేడు. క్వాలిటీ చెకింగ్‌ అస్సలే లేదు. వాడు వేసిందే రోడ్‌.. వాడు చెప్పిందే వేదం. అంతా బహిరంగ పర్సెంటేజ్‌ లతో.. ఆర్‌ అండ్‌ బి, మున్సిపల్‌, పట్టణాభివృద్ధి సంస్థలు ..మొత్తం కుమ్మక్కు. కోట్లకొద్ది ప్రజాధనం అప్పనంగా బుక్కుడు. ఇక ఈ పద్ధతి నడవదు. నా కంపనీకి చెందిన, మన బ్లాక్‌ లోనే తయారైన యువ సైన్యం పైన చెప్పినటువంటి పబ్లిక్‌ వర్క్స్‌ను ఇకముందు ప్రశ్నిస్తారు. పనులు జరిగే ప్రతిచోటా ప్రతి దినం ఒక బ్యాచ్‌ వైజ్‌ టీంస్‌ నిలబడి మన రిటైర్ద్‌ ఇంజనీర్ల నోహౌ తో క్వాలిటీ చెక్‌ చేస్తారు. నక్రా చేస్తే కలెక్టర్‌, ఎస్‌ పి, జడ్జ్‌ , మెజిస్ట్రేట్‌ వంటి అధికారులను ఋజువుల్తో సహా కలిసి తగు చర్యకై అర్థిస్తారు. అవసరమైతే మన న్యాయవాదుల సహకారంతో కోర్ట్‌ లో కేస్‌ లను ఫైల్‌ చేస్తాం. మన ఇరవై నాల్గవ బ్లాక్‌ లో పని చేయాలంటే.. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచ్చ పడాలొక్కొక్కనికి. క్వాలిటీ, క్రమశిక్షణ. రూల్స్‌.. నియమాలు. ఉల్లంఘనలు జరుగొద్దు ఎక్కడా. మన బ్లాక్‌ మన అభివ ృద్ధి. మన క్రమశిక్షణ మన వికాసం. ఐక్యత.. అండదండలు.. కలిసి నడిచే పాదాలు.. కలిసి చేరే గమ్యాలు. దీపంతో మరో దీపాన్ని వెలిగించినట్టే.. మనను చూచి మన పొరుగుదే మరో బ్లాక్‌.. మరో వార్డ్‌.. ఇంకో ప్రాంతం. ఊహించండి మీరు చెప్పిన ఒక స్వప్న సాకార దశ ఎట్లా విస్తరిస్తుందో చెబుతూ పోతోంది శిశిర ట్రాన్స్‌లో. జరుగబోతున్న రేపటి సాధ్యతను దృశ్యిస్తూ.
సిద్ధాంతకర్త ప్రకాశరావు ఆమె ముఖంలోని మగ్నతకు ఉప్పొంగిపోతూ.. చప్పట్లు కొట్టాడు సంబరంతో.
‘‘సమాజం ఇట్లా కుళ్ళిపోడానికి కారణం ఒక్కటే శిశిరా! పౌరులు ఎవనికివాడు ప్రతిదాన్నీ మనకెందుకులే అనే ఉదాసీనతతో నిర్లక్షించడం.. ఈ రోడ్‌ ఎవనిదో.. ఈ సామాజికమైన పని ఎవరిదో అన్న నిర్లక్ష్య భావన.. లక్షలూ కోట్లూ పెట్టి ప్రభుత్వాలు వెచ్చిస్తున్న ధనం మనదే అన్న స్పృహ లేకపోవడం.. ఇప్పుడు నీ చైతన్యంతో వందల చేతులు కలుస్తున్నప్పుడు.. నువ్వన్నట్టు వరిష్ట పౌరుల.. ‘సీనియర్‌ సిటిజన్స్‌’ యొక్క పునరుపయోగం.. ఒక గొప్ప సామాజిక విప్లవం. ఇది ఫలిస్తుంది తప్పక. మున్ముందు అందరూ ఈ అద్భుత మానవ వనరును ఉపయోగించుకుంటారు. ’’
‘‘బండి పట్టాలు తప్పుతున్నపుడు ఎవరో ఒకరు కల్పించుకుని దాన్ని తిరిగి గాడిలో పెట్టాలె సర్‌. లేకుంటే వ్యవస్థ కుప్పకూలిపోతుందికదా. చూడండి.. ప్రస్తుతం దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. జెట్‌ ఏర్‌ వేస్‌ మూతబడిరది. చారిత్రాత్మక ఏర్‌ ఇండియా అమ్మకానికుంది. బి ఎస్‌ ఎన్‌ ఇల్‌ లో 54 వేల మంది ఉద్యోగాలు ఊడిపోబోతున్నాయి. హెచ్‌ ఎ ఎల్‌ వంటి జాతీయ సంస్థల్లో ఉద్యోగులకు జీతాల్లేవు. పోస్టల్‌ డిపార్ట్‌ మెంట్‌ 1500 కోట్ల నష్టంలో..వీడియోకాన్‌. టాటా డొకొమాలు కుళ్ళిపోతున్నై, ఏర్‌ సెల్‌ కూడా అంతే. ఒ ఎన్‌ జి సి సంక్షోభంలో ఉంది.. 36 మంది ఋణ గ్రహీతలైన దొంగలు వందలు వేల కోట్ల బాకీలతో పరార్‌, ఎన్నో నేషనలైజ్డ్‌ బ్యాంక్‌లు వేలకోట్ల నష్టాల్లో కూరుకుపోవడాలు, భారతదేశం మీద 131100 డాలర్ల బాకీ. ఆదానీలకు ఐదు ఎయిర్‌పోర్ట్‌ల అమ్మకం, పెద్ద పెద్ద ఆటోమొబైల్‌ కంపనీల్లో అమ్మకాలు నిలిచిపోయి కార్ల స్తబ్దత, కట్టిన ఫ్లాట్స్‌ అమ్మక నిర్మాణ రంగం కుదేల్‌, రాజకీయ అరాచకత్వం.. విచ్చలవిడి పార్టీల మార్పిడి. కప్ప దాట్లు.. అధికారంకోసం నీతిహీన అనైతిక బహిరంగ రాజకీయ వ్యభిచారాలు.. ఇదంతా ఏమిటి సర్‌. అసలు ప్రజాధనంతో ఈ ఐ ఐ టి లు, ఐ ఐ ఎం లలో చదువుకున్న క్రీం అంతా విదేశాలకు వ్యక్తిగత వృద్ధికోసం , సౌఖ్యాలకోసం చెక్కేయకుండా.. ఇక్కడే ఉండి ఈ కుళ్ళిపోయిన రాజకీయాలనూ, వ్యవస్థల్నీ సరిదిద్దే బాధ్యతను చేపట్టకుండా.. ఏమిటి సార్‌ ఈ ఉదాసీనత. కళ్లముందే అంతా కుప్పకూలుతోందిగదా., ’’
శిశిర కళ్ళలో భాషకందని మౌన దుఃఖమేదో ధ్వనిస్తోంది.
‘ఏమిటిది… ఎందుకిలా… ఎట్లా… ఇప్పుడు తనవంటి యువ భారతదేశీయులు ఏమి చేయాలి. మౌనం యుద్ధనేరం కాదా ’
‘‘ శిశిరా! పరమ దుర్మార్గుడూ.. పూర్తి అవినీతిపరుడూ.. వ్యభిచారీ.. లంచగొండీ.. ఈ దేశాన్ని దోచుకుంటున్న ద్రోహీ ఐన మీ నాన్నను ఎదిరించే ధైర్యం.. సత్తువా లేనిదాన్ని నేను. నీతివంతుడైన ఒక మామూలు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన మా నాన్న నన్ను హృదయమున్న మనిషిగా పెంచాడు. కాని ఈ రాక్షసుణ్ణి గుర్తించలేక వీని చేతిలో పెట్టాడు. ప్రతి నిత్యమూ వీనితో సర్ప పరిష్వంగమే. ఎదిరించలేను.. ఈ ఆత్మక్షోభతో జీవించనూ లేను. అందుకే నిన్ను పుట్టిన నాటినుండీ హాస్టల్లలోనే ఉంచి వీని నీడ పడకుండా కాపాడుతూ వస్తున్నా. కాని అలసిపోయిన శిశిరా నేను.. నాకు విముక్తి కావాలి. ఐతే ఇది ఒక్క మన కుటుంబం సమస్య కాదు. ఇది దేశ సమస్య. మీ నాన్నవంటి వాళ్ళు ఈ దేశాన్ని పీక్కుతింటున్నారు. రక్షించాలి ఈ నీ మాతృభూమిని. నా కోసం నువ్వీ పని చేయాలి.. సార్థకత అదే నీకు. ’’
అమ్మ ఆత్మహత్య చేసుకునే ముందు తనను ఉద్దేశించి రాసిన ఉత్తరం ఒకటి మొన్న దొరికింది.
అమ్మ.. దేశం.. ఉదాసీనతలో కూరుకుపోయి నిద్రాణమై ఉన్న వర్తమాన పథభ్రష్ట యువత.
‘సూర్యుడు ఉదయించనే ఉదయించడనుకోవడం నిరాశ
ఉదయించిన సూర్యుడు అస్తమించడనుకోవడం దురాశ ’- కాళోజీ
వెనుక సిద్ధాంతకర్త ప్రకాశరావు ఉన్నాడన్న స్థైర్యం , వెంట ఐదువందలకు పైగా తన ‘ ఫూచర్‌ మేకర్స్‌ ’ సైన్యం ఉందన్న ధైర్యం శిశిరను ప్రజ్వలింపజేస్తున్నాయి.
ఆమె ఎదురుగా ఎర్రని సూర్యుడు.,

***

1 thought on “లోపలి ఖాళీ – ధృవధర్మాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *